బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఇచ్చింది టీడీపీనే

సామాజిక మార్పు తెచ్చిన పార్టీ టిడిపి అని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది టీడీపీ సిద్ధాంతమని చంద్రబాబు అన్నారు. విద్యాధికులను రాజకీయాల్లోకి తెచ్చిన పార్టీ టీడీపీ అని... బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది కూడా టీడీపీనే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ పార్టీల మధ్య, ఆయా ప్రభుత్వాల మధ్య ‘‘తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత’’ అనే సరికొత్త యుగాన్ని ఆరంభించింది టీడీపీ అని అన్నారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు కార్యకర్తలకు గుర్తు చేశారు.. అంత స్పష్టమైన పనితీరును కనబర్చడమే కాకుండా... 38ఏళ్లుగా అదే పనితీరుతో ముందుకు పోతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని.... మనదేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా బెడద రోజురోజుకూ తీవ్రం అవుతోందని చంద్రబాబు అన్నారు. పార్టీ సిద్దాంతాలకు పునరంకితం కావాలని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.

తెలుగుదేశం పార్టీ 38 ఏళ్ల ప్రస్థానంలో...

తెలుగు దేశం పార్టీ ఆదివారం 39వ ఏట అడుగుపెట్టింది. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా, ప్రజల హర్షద్వానాల మధ్య తన పార్టీ పేరు 'తెలుగుదేశం' అని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత 9 నెలలకే టీడీపీ అధికారంలోకి రాగా.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైన టీడీపీ.. ఆవిర్భావం నాటి నుంచి ఎన్నికల్లో వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగుతోంది. 1983 మొదలు ప్రతి ఎన్నికలోనూ టీడీపీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 38 ఏళ్ల ప్రస్థానంలో... టీడీపీ తొలిసారి పోటీ చేసిన 1983 ఎన్నికల్లో మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్‌తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌కి ఎన్టీఆర్ ఐదు స్థానాలను కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 201 స్థానాలను గెలుచుకుంది. ఇందిరాగాంధీ హత్య తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తమైంది. కానీ ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు దక్కితే.. అందులో హన్మకొండ ఒకటి కావడం గమనార్హం. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 1989 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. 1994లో టీడీపీ వామపక్షాలతో మాత్రమే కలిసి పోటీ చేసింది. 216 స్థానాల్లో గెలిచిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. 1995లో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బాబు నాయకత్వంలోని టీడీపీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటైంది. 1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004లో మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ గెలుపొందింది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ దూరమైంది. 2009లో టీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమిగా టీడీపీ పోటీ చేసింది. కానీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగకున్నా.. టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి గెలుపొందింది. చంద్రబాబు సీఎం అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలతో క‌లిసి పోటీ చేసింది.

చైనాలో తొలి కరోనా బాధితురాలి ఆచూకీ కనుగొన్న అంతర్జాతీయ మీడియా

చైనాలో గత ఏడాది చివర్లో వెలుగుచూసిన అత్యంత ప్రమాదకర వైరస్ కరోనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలను హడలెత్తిస్తోంది. చైనాలోని వన్యప్రాణుల ద్వారా ఈ వైరస్ మానవులకు సంక్రమించినట్టు గుర్తించారు. కాగా, చైనాలో మొట్టమొదటి కరోనా బాధిత వ్యక్తి ఓ మహిళ. ఆమె ఆచూకీని వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా సంస్థ గుర్తించింది. ఆమె పేరు వుయ్ జుషాన్. వుహాన్ నగరంలోని సీ ఫుడ్ మార్కెట్లో జుషాన్ రొయ్యలు విక్రయిస్తుంటుంది. అయితే డిసెంబరు 10న జలుబు, జ్వరం, దగ్గుతో ఆమె ఆసుపత్రికి వెళ్లగా, సాధారణ జ్వరంగా భావించిన వైద్యులు కొద్దిపాటి ట్రీట్ మెంట్ తో ఇంటికి పంపించారు. అయితే, క్రమేణా ఆమె పరిస్థితి క్షీణించడంతో వుహాన్ లోని ఓ మోస్తరు ఆసుపత్రికి తరలించారు. అక్కడా ఫలితం కనిపించలేదు. దాంతో జుషాన్ ను వుహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికీ దాన్ని కరోనా వైరస్ గా గుర్తించలేదు. ఆ తర్వాత అదే మార్కెట్ కు చెందిన మరికొందరు సీ ఫుడ్ విక్రేతలు అవే లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారు. చూస్తుండగానే ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య వందలు, వేలకు చేరింది. దాంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న వుహాన్ యంత్రాంగం జుషాన్ తదితరులను క్వారంటైన్ చేసి ఇతర చర్యలకు ఉపక్రమించింది. వైద్యపరీక్షల్లో అదో ప్రాణాంతక వైరస్ గా గుర్తించి కరోనా అని పేర్కొన్నారు. అటు, వుహాన్ లోని సీ ఫుడ్ మార్కెట్ ను మూసివేయించారు. తాను మార్కెట్ లోని ఓ టాయిలెట్ ను ఉపయోగించిన సందర్భంగా వైరస్ బారినపడినట్టు భావిస్తున్నానని జుషాన్ చెబుతోంది. కాగా, జుషాన్ నెలరోజుల చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయింది. విషాదం ఏంటంటే, ఆ తర్వాత వైరస్ బారినపడినవారు వేల సంఖ్యలో మరణించారు. ఈ వైరస్ భూతం చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇప్పుడు ప్రపంచదేశాలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, ఈ వైరస్ వ్యాప్తిపై జుషాన్ స్పందిస్తూ, చైనా ప్రభుత్వం మొదట్లోనే స్పందించి ఉంటే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కావని అభిప్రాయపడింది. ఈ వైరస్ అలుగు (పంగోలిన్) వంటి చిన్న వన్యప్రాణి ద్వారా వ్యాపిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

వీధుల్లో హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే..

మంత్రి హరీశ్ రావు  ఆధ్వ‌ర్యంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందు నీళ్లలో కలిపి స్ప్రే చేశారు.   జహీరాబాద్ బస్టాండ్ సర్కిల్,  రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై ఆదివారం ఉదయం మంత్రి సూచనల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించింది. కాగా ఇప్పటి వరకు జిల్లాలోని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది పై చిలుకు లీటర్ల సోడియం హైపోక్లోరైట్ మందును కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు పంపి ట్రాక్టర్ల సహాయంతో స్ప్రే చేస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి.   పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని ఉదయం మాత్రమే అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ‌ ఉంచుకోవాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు.  ఈ మేరకు   సోడియం హైపోక్లోరైట్ మందును నీళ్లలో కలిపి అగ్నిమాపక వాహనం, సిబ్బంది సాయంతో స్ప్రే చేస్తున్న తీరును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ .రాజేష్ షా , జడ్పీ ఛైర్మన్.మంజు శ్రీ  అగ్నిమాపక జిల్లా అధికారి , మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ , వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. జహీరాబాద్ మున్సిపల్ ‌కార్యాలయంలో కరోనా వ్యాప్తి నిరోధంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష చేశారు.

ఇంట్లోనే వుండండి! ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంది!

లాక్‌డౌన్ సంద‌ర్భంగా పేద ప్ర‌జ‌ల్ని ఆదుకోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి వ్యక్తికి ఐదుకిలోలు బియ్యం, ప్రతి కార్డుకు కేజి కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తోంది. 58 లక్షలమంది పెన్షన్ దారులకు 1 వతేదీన పెన్సన్ ఇవ్వనున్నార‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ, ఏపి ఐఐసి ఛైర్మన్ ఆర్ కే రోజా తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు రోజూ బయటకు వెళ్లి పనిచేసుకోలేక సంపాదన లేక కూర్చుని ఉండమంటే వారి కుటుంబపోషణకు కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా ఇస్తున్నార‌ని ఆమె చెప్పారు. ఈ రోజు మొదటి విడత, ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29 వతేదీన మూడోవిడతగా రేషన్ ఇస్తార‌ని ఆమె తెలిపారు. 1 కోటి 40 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదీన వేయి రూపాయలు ఇవ్వాలని సి.ఎం. ఆదేశాలు ఇచ్చారని ఆమె చెప్పారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసులకు మనమందరం అండగా ఉండాలి. ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగిన సంఘటనలు వీడియోలు పోస్టు చేసి పోలీసుల పరువు తీసి 24 గంటలు మన కోసం పనిచేసే పోలీసులను అవమానించవద్దని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా ను పారదోలడంలో ఐకమత్యంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పాటిస్తూ బయటకు వెళ్లివచ్చే సందర్భంలో పరిశుభ్రత పాటిస్తూ కాళ్లు, చేతులు కడుగుకుని దుస్తులను సైతం హాట్ వాటర్ లో పెట్టాలని ఆమె సూచించారు.

స్పెయిన్ యువరాణి మరియా థెరిసా మృతి

కరోనా కాటుకు స్పెయిన్ యువరాణి మరియా థెరిసా (86) మృతి చెందారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో యువరాణి మారియా థెరిసా మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక ఇప్పటికే స్పెయిన్‌లో కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని కబలించేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదలడం లేదు.  ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటలీలో ఇప్పటికే కరోనా మరణాలు 10వేల దాటిపోగా, స్పెయిన్‌లోనూ మృతుల సంఖ్య దాదాపు 6వేలకు చేరింది. యూరప్ లో ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో ఎక్కువ కరోనా మరణాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశల్లో ఉన్న వృద్ధులే అంటున్నారు. అప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు కరోనా సోకడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు.

చికిత్స‌ అందక బాలుడి మృతి

ఉపాధి కోసం వలసొచ్చిన  పేద‌ కుటుంబాన్నికి లాక్‌డౌన్ శాపంగా మారింది. స‌రైన స‌మ‌యంలో చికిత్స చేయించుకోలేక క‌న్న కొడుకును కాటికి మోసుకెళ్లాల్సిన దుస్థితి ఆ పేద తండ్రికి క‌ల్గింది.  కదిరికి చెందిన మనోహర్‌ ఐదేళ్లుగా అనంత‌పూరం జిల్లా గోరంట్లలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుడారంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. మనోహర్ తుక్కు కొనుగోలు షాపులో హమాలీగా పనిచేస్తున్నాడు. అనారోగ్యం బారిన పడిన కుమారుడికి సరైన వైద్యం చేయించలేని నిస్సహాయ పరిస్థితి ఎదురైంది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయాడు.  కొద్దిరోజులుగా మనోహర్ పెద్ద కొడుకు దేవాకు దగ్గు, జ్వరంతోపాటు గొంతు కింద గడ్డలు వచ్చాయి. ముందు స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స అందించారు. తర్వాత నయం కాకపోవడంతో గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత హిందూపురం తీసుకెళ్లగా బాలుడి నోరు, ముక్కునుంచి రక్తం వస్తుండటంతో అనంతపురం పెద్దాసుపత్రి, కర్నూలు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. లాక్‌డౌన్‌తో పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. అందుకే హిందూపురంలోనే వైద్యం చేయించాడు.. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన పసివాడి అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేవు. గత్యంతరం లేక కుమారుడి శవాన్ని చేతులపై ఎత్తుకుని సమీపంలోని చిత్రావతి ఒడ్డున ఖననం చేశాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

కరోనానూ రాజకీయాలకు వాడుకోవడం నీచం: అంబటి రాంబాబు

* వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కామెంట్స్..   గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన విందుకు నేను, ఆర్కే, శ్రీ దేవి వెళ్ళాము అని అసత్య ప్రచారం చేస్తున్నారు.అసలు విందే జరగలేదు... జరగని విందుకు మేము ఎలా వెళతామనీ అంబటి రాంబాబు ప్రశ్నించారు.మా పై రాజకీయ ప్రత్యర్థులు  దుష్ప్రచారం  చేస్తున్నారు.మేము అంతా క్వారంటైన్ కి వెళ్ళాలి అని ట్రోల్ చేస్తున్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇలాంటి క్లిష్ట సమయంలో మా పై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు అంబటి రాంబాబు. రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయాలు ఉంటే.. తరువాత మాట్లాడదాం. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు.నిజంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే సామాజిక బాధ్యతగా మేమంతా వెళతా మన్నా రు ఆయన.

లాక్‌డౌన్ వేళ‌ స్ఫూర్తిగా నిలిచిన క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యే!

మారుమూల గ్రామా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులందించ‌డానికి జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు ప‌డుతున్న ఆరాటానికి ఈ ఫొటో సాక్ష్యం. రోడు మార్గం లేక‌పోయిన‌ప్ప‌ట్టికీ నదిని సైతం లెక్క‌చేయ‌కుండా భుజాన సంచి వేసుకొని రోడ్డు బాట ప‌ట్టిన వీరు దేశంలోని ఇత‌ర  అధికారుల‌కు,   నేత‌ల‌కు స్ఫూర్తిగా నిలిచారు. రైస్ బ్యాగ్ భుజాన వేసుకున్న వ్యక్తి కలెక్టర్, పిబి.నోవా ఐఎఎస్‌.  పతనమిట్ట జిల్లా క‌లెక్ట‌ర్. కేరళ  రాష్ట్రం. ఈ ఐఎఎస్ అధికారితో పాటు బ్యాగ్ పట్టుకున్న మరొక వ్యక్తి పతనమిట్ట ఎమ్మెల్యే, జనీష్ కుమార్, ఇద్దరూ ఇతర అధికారులతో పాటు ఒక మారుమూల గ్రామానికి బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకువెళుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రిస్తూ ఆద‌ర్శంగా నిలిచారు. వీరిని చూస్తుంటే మ‌న ద‌గ్గ‌ర శాస‌న‌స‌భ్యులు, ఐఎఎస్ అధికారులు ఎలా వుంటారో ఒక సారి త‌ల‌చుకుందాం! ఒక్కసారి MLA అయితే, ఆయన లేక ఆమె, దేవుడి కంటే ఎక్కువ, ఇంకా మాట్లాడితే ట్రంప్ కంటే ఎక్కువ అని ఫీల్ అయిపోతారు. భూమి మీద నడవడం మానేస్తారు.  మిగతగా రాష్ట్రాల కలెక్టర్ల గురించి నేను చెప్పలేను గానీ, మన రాష్ట్రంలో, శంకరన్ లాంటి వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు...ఈ కన్ఫర్డ్ ఐఏయెస్ వచ్చి, కలెక్టర్లు అయ్యే వారు ఇంకా ఘోరం. అప్పటి దాకా ఆర్డీవో గా ఉండి నమస్కారాలు పెట్టి, ఒక్క సారి ఐఏయెస్, వచ్చి కలెక్టర్ కాగానే ఇక ఆ హంగు, దర్జా, ఆ హంగామా చూడాల్సిందే... ఇక రాజకీయాల ఎమ్మెల్యే లు. అసలు వీళ్ళు డెమీ గాడ్స్. చంద్ర బాబులు, జగన్, కేసీఆర్లు గౌరవంగా మాట్లాడుతారు, కొంచమైనా భూమి మీద వుంటారు. ఈ ఎమ్మెల్యేలు మాత్రం, ఈ ఐదేళ్లలో ఏ పని చేసినా నెక్స్ట్ ఎన్నికలకు నాకు పనికి వస్తుందా? పనికొస్తేనే చేస్తా..లేకపోతే చెయ్య...అంతే...ఏ పార్టీ అయినా సరే... ఎమ్మెల్యే సారు బయటకు వస్తే, నాలుగు కార్లు, గన్ మెన్లు, ఎస్కార్ట్ పోలీస్ వ్యాను, లోకల్ ఎస్సై, కానిస్టేబుళ్లు, బౌన్సర్లు, అనుచరులు, అర్జీదారులు, అధికారులు, వందిమాంగదులు,... అబ్బో, ఎందుకులే, చూసి తీరాలి... మరీ చిన్న టవున్స్ లో మరీ ఎక్కువ...ఎమ్మెల్యే గారి ఆర్ధిక పరిస్థితి, రాజకీయాల్లో సీనియారిటీని బట్టి కొంచం హెచ్చు తగ్గులు....అంతే...సారు బజార్లోకి వస్తే ఒక పది కార్ల కాన్వాయ్ వుండాలంతే... ఇక ఎమ్మెల్యే ఓ యాభై ఏళ్ళ వారైతే, ఒకప్పట్లో, కొడుకు, ఇప్పుడు కొడుకు, కూతురైనా సరే, ఒక యువజన విభాగం వుంటుంది. చిన్న చిన్న పంచాయితీలు, వసూళ్లు, ధర్నాలు అన్నీ, నాన్నకి శ్రమ తగ్గించేందుకు వీళ్ళు చేస్తుంటారు....మరి బాబు...లేక అమ్మాయి గారు, ఎమ్మేల్యే గారి వారసత్వం తీసుకోవద్దేటి? ఏటి సెప్తావు నువ్వు? ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ..ఇక అంతే...ఆ ఊరికి ఆయనే రాజు, పాలేగారు, చక్రవర్తి. పైన చెప్పిన వారందరితో పాటు, ఎమ్మార్వో, ఎండీవో, వ్యవసాయ ఆఫీసరు, పశువుల డాక్టరు, మొదలుకొని, ఆయన వున్న మండల అధికారులు మొత్తం హాజరు...ఇక చిన్న టవున్ అయితే మునిసిపల్ సిబ్బంది... మరి వీళ్ళందరి ఖర్చు? తన అనుచరుల ఖర్చు, సారే భరిస్తారు. మధ్యాహ్నము భోజనం, వెహికళ్ళు, డీజల్, డ్రైవర్ ఖర్చులు, ...ఎమ్మెల్యే సారు గ్రామాలకు వెళ్లి, అలనాటి కృష్ణదేవరాయలు లాగా చేసే దానాలు, పెళ్ళిలకు చదివింపులు, అన్నీ ఈయనే భరిస్తారు... ఓ మాదిరి టవున్స్ లో ఎమ్మెల్ల్యేలకు రోజుకు మినిమం ఖర్చు పాతిక వేల అవుతుందట...ఆంధ్రాలో...  మరీ ఈ డబ్బంతా వచ్చేదెలా సారుకు.....  ఇంజనీరింగ్ ఏఈ లు, డీఈ లు, ఎప్పుడూ సారుకు ఫోన్ లో అందుబాటులో వుండాలి....ఎప్పుడు ఫోన్ చేసినా టకీమని ఆన్సర్ చెయ్యాలి...లేకపోతే బూతులు తిట్టే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నేనే... చూసాను. ఇక పోలీస్ స్టేషన్ లో కేసులు అన్నీ ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే జరుగుతాయి. పంచాయితీలు అన్నీ సారే చేస్తారు...తన దగ్గర ఓ పడేళ్ళు నమ్మకంగా ఉంటే వారికి మార్కెట్ యార్డ్ చెర్మన్లు, డైరెక్టర్లు, ప్యాక్స్ చెర్మన్లు లాంటి పదవులు ఇప్పిస్తారు....సరే ఇక వాటి వసూళ్లు, అవి మామూలే... ఏ ప్రాజెక్టు వచ్చినా సార్ కు తెలియకుండా రాదు...సార్ కు వాటా ఇవ్వకుండా పోలేదు. జరిగే ప్రతి పనిలో, సార్ కు వాటా ఇవ్వాల్సిందే... అదేమీ లేదు అని వాదిస్తారు కానీ, జరిగే సత్యం అంతే.. బాగా సంపాదించటం, దానిలో కొంత రోజు వారీ మెయింటెనెన్స్ కు, ఆనుచరుల కోసం కొంత, ఎన్నికలప్పుడు ఖర్చు, డబ్బు పంపకం కోసం...వీటనన్నింటికి పోగా సారుకు ఒక టర్మ్ కు , అంటే ఐదేళ్లకు ఒక పది పదిహేను కోటలైనా మిగిలితే , మరుసటి సారి ఎమ్మెల్యే గా కొనసాగచ్చు... అంటే, ఒక ఎమ్మెల్యే, ఇష్టం వున్నా లేకపోయినా, దర్బార్ మెయింటెయిన్ చెయ్యాలి, సంపాదించాలి...తప్పదు....పులి స్వారీ...అంతే. ఇష్టమయ్యే చేస్తారు కాబట్టి, పులి స్వారీ లాగా ఫీల్ కారు.. నాకున్న పది పన్నెండేళ్ల రాజకీయ అనుభవంలో, దేశ రాజకీయ స్థితి మారాలంటే, ఈ ఎమ్మెల్యే వ్యవస్థ మారాలి.... వీళ్ళు చెప్పినట్టే రాష్ట్ర పార్టీ అధినేత కూడా వినాల్సిన స్థాయికి వచ్చేసారు....కాదంటే, పార్టీ మారిపోతారు మరి. అప్పటికే అధికారంతో వెళ్ళొనుకు పోయివుంటారు కాబట్టి, వాళ్ళు చెప్పిందే వేదం...ఓట్లు కూడా వాళ్ళవే.... వారి మాట వినాల్సిందే ...తప్పదు. ఇక్కడ ఎమ్మెల్యేలను కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే అలా చేయకపోతే, వేస్ట్.. ఈ ఎమ్మెల్యే అనేస్తారు.... ప్రత్యర్థి ఎప్పుడూ ఉంటాడు కదా...అతని దగ్గర చేరిపోతారు...అందుకని, ఇష్టం వున్నా లేకపోయినా, అందరూ ఈ చట్రంలో భాగం అయిపోతారు... అధికారం మొత్తం ఒకరి చేతిలో కేంద్రీకృతం అయ్యే ఈ ఎమ్మెల్యేల వ్యవస్థ ఇలాగే కొనసాగితే, మనం గొప్పగా చెప్పుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థ అసెంబ్లీ బోర్డులో మాత్రమే మిగులుతుంది.... మా పార్టీ ఎమ్మెల్యేలు సూపర్ అంటూ రాకండి....అందరూ ఒకే తాను లో ముక్కలే...!

పోలీసు కాలర్‌ పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌ సస్పెండ్

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మరో కానిస్టేబుల్ గొడవకు దిగడం.. కాలర్ పట్టుకున్న ఘటన జిల్లాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 'ఏరా.. నా కొడుకునే కొడతావా...' అంటూ దుర్భాషలాడటంతో పాటు కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం చేసిన విచిత్ర ఘటన నెల్లూరు నగరంలోని ఇరుకళలమ్మ ఆలయం పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎస్ఐ, సీఐలకి ఛార్జి మెమోలు ఎస్పీ జారీ చేశారు. అసలేం జరిగింది..? నగరంలోని ఇరుకళలమ్మ ఆలయం దాటిన తరువాత పోలీసులు రోడ్డుపై ఉండగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో వచ్చాడు. పోలీసులు ఆ యువకుడిపై లాఠీ ఝుళిపించి బైక్‌ తాళాలు లాక్కున్నారు. వెంటనే ఆ యువకుడు తండ్రికి ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. తండ్రిని చూసిన ఆ యువకుడు తాను పెట్రోల్‌ కొట్టించుకునేందుకు వచ్చానని, తనకు ఆపరేషన్‌ చేసి రాడ్లు వేశారని ఇలా కొడుతారా అంటూ వాదనకు దిగాడు. ఆ క్రమంలో పోలీసులు ఏరా ఎవరితో వాదిస్తున్నావంటూ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తండ్రి అక్కడకువచ్చి కర్ర పట్టుకొన్న కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడు. పక్కనే ఉన్న పోలీసులు, స్థానికులు, కుమారుడు అందరూ కలిసి వారిద్దరిని విడదీశారు. వీడియో వైరల్ అవ్వడంతో..! ఆ వ్యక్తి.. 'ఎస్పీ దగ్గరకు వెళుదాం రారా... 144 సెక్షన్‌ ఉంటే కొడతారా.. నా బిడ్డకు రాడ్లు వేసి ఉన్నాయ్. ఏదైనా జరిగి ఉంటే...' అంటూ హడావడిగా ద్విచక్ర వాహనంపై కుమారుడిని ఎక్కించుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనను మొత్తాన్ని పోలీసులతో పాటు అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం హల్‌చల్‌ చేసింది. ఈ వ్యవహారం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో 24 గంటలలోపే ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యమాలకు లొంగలేదు.. ప్రకృతికి లొంగక తప్పలేదు... అమరావతిపై నోరెత్తని వైసీపీ ప్రభుత్వం

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్నా ఉల్లంఘనులు ఎక్కువైపోతున్నారు. తమకేం కాదులే అనే వాదనతో వారు చెలరేగిపోతున్నారు. ప్రజలు ఒకేసారి గుమికూడటం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో తొలుత ఉదయం 6 గంటల నుంచి 9 గంటలుగా ఉన్న సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పెంచారు. కానీ ప్రజలు గుమికూడటం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచలో పడాల్సిన పరిస్దితి.  పలు జిల్లాల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితిని గమనిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులకు ప్రజల తీరును చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. దీంతో షాపింగ్ సమయాలను తగ్గించాలని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సోమవారం నుంచి నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలను మళ్లీ కుదించారు. తాజా మార్పుల ప్రకారం పట్టణ, నగర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపింగ్ కు అనుమతించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 6 గంటల నుంచి 1 గంట వరకూ షాపింగ్ చేసుకోవచ్చు, ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రభుత్వం తాజా సమయాలను విడుదల చేసింది.  కరోనా వైరస్ ప్రభావం ఏపీలో నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో ప్రజల తీరుతో తిరిగి పరిస్దితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రైతు బజార్లు, ఇతర దుకాణాల వద్ద గళ్లు గీసి ఉంచినా ప్రజలు మాత్రం వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో కరోనా అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల వినతి మేరకు ప్రభుత్వం షాపింగ్ సమయాలను తగ్గించేయాలని నిర్ణయించింది. అప్పటికైనా పరిస్ధితిలో మార్పు రాకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనపై సర్కారు సీరియస్- ఉదయం షాపింగ్ సమయాల తగ్గింపు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్నా ఉల్లంఘనులు ఎక్కువైపోతున్నారు. తమకేం కాదులే అనే వాదనతో వారు చెలరేగిపోతున్నారు. ప్రజలు ఒకేసారి గుమికూడటం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో తొలుత ఉదయం 6 గంటల నుంచి 9 గంటలుగా ఉన్న సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పెంచారు. కానీ ప్రజలు గుమికూడటం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచలో పడాల్సిన పరిస్దితి.  పలు జిల్లాల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితిని గమనిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులకు ప్రజల తీరును చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. దీంతో షాపింగ్ సమయాలను తగ్గించాలని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సోమవారం నుంచి నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలను ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు ఈ విషయాన్న నిర్ధారించగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా అధికారిక ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది.  కరోనా వైరస్ ప్రభావం ఏపీలో నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో ప్రజల తీరుతో తిరిగి పరిస్దితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రైతు బజార్లు, ఇతర దుకాణాల వద్ద గళ్లు గీసి ఉంచినా ప్రజలు మాత్రం వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో కరోనా అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల వినతి మేరకు ప్రభుత్వం షాపింగ్ సమయాలను తగ్గించేయాలని నిర్ణయించింది. అప్పటికైనా పరిస్ధితిలో మార్పు రాకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అన్న క్యాంటీన్లే ఉండుంటే.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ..

ఏపీలో గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఐదు రూపాయలకే అన్నార్తులకు కడుపు నింపే అన్న క్యాంటీన్ల మూసివేతపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాటిని రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చుకుని వాడుకోవచ్చుగా అంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్దితి ప్రభుత్వానిది. ఏదో రకంగా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని కొనసాగిస్తే అంతిమంగా వారికే మంచిపేరు వస్తుందన్న ఆక్రోశమే ఇందులో కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ ప్రభావం పెరుగుతుందని తెలియగానే, తెలంగాణ సర్కారు వెంటనే లాక్ డౌన్ కారణంగా మూతపడిన అన్నపూర్ణ క్యాంటీన్లను తెరవడమే కాకుండా ఐదు రూపాయలకు కూడా తీసుకోకుండా ఉచితంగా భోజనం అందించేందుకు సిద్దపడింది. కానీ అదే సమయంలో ఏపీలో లాక్ డౌన్ కారణంగా వేలాది మంది యాచకులు, పేదలు ఆకలి కేకలు వేస్తుంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్న పరిస్దితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే అనే చర్చ సాగుతోంది.      రాజకీయ కారణాలతో మూసేసిన అన్న క్యాంటీన్లను సంక్షోభ సమయంలో తెరిచేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోయినా ఇప్పుడు రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్ధలు ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాయి. లాక్ డౌన్ అమలవుతున్నా సరే.. అందిన కాడికి విరాళాలు సేకరించి మరీ అన్నార్తుల కడుపు నింపుతున్నాయి. వీరే లేకుంటే ఏపీలో కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉండేవన్న వాదన వినిపిస్తోంది. స్వచ్ఛంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు పేదల కడుపు నింపడాన్ని చూసిన వారంతా ప్రభుత్వం చేయాల్సిన పనిని నెరవేస్తున్న వీరిన్ అభినందించకుండా ఉండలేని పరిస్దితి. పలుచోట్ల వీరికి అవసరమైన విరాళాలు ఇచ్చేందుకు సైతం ప్రజలు ముందుకొస్తున్నారు. 

విదేశీయుల లెక్క తేల్చడంలో వైఫల్యం- ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలైన వెంటనే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల జాబితాను తీసుకునే విషయంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు కొంప మంచుతోంది. కేవలం కేంద్రం ఇచ్చిన డేటాపైనే ఆధారపడి ప్రయాణికులను క్వారంటైన్ కు పంపిన ఏపీ సర్కార్.. ఆ తర్వాత పెరుగుతున్న కేసులతో కలవరపడటం ప్రారంభించింది. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వం కళ్లు తెరిచే సరికే వందల సంఖ్యలో విదేశీ ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించిన నాడే అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపేసింది. కానీ ఇవాళ్టికీ విదేశీ ప్రయాణికుల సంఖ్యను రోజుకు వెయ్యి చొప్పున పెంచుకుంటూ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేస్తోంది. అదేంటని అడిగితే కేంద్రం ఇచ్చిన లెక్కలు సమగ్రంగా లేవని, అందుకే తాము ప్రతి రోజూ వాలంటీర్ల సాయంతో విదేశీ ప్రయాణికులను లెక్కిస్తున్నట్లు చెబుతోంది. అయితే ఇప్పటికే పరిస్ధితి చేయి దాటిపోయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. ఇంకా ఇలాంటివారు ఎందరున్నారో తెలియదు. వీరి లెక్క తేలితేనే కానీ ఏపీలో కరోనా వైరస్ ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో తెలియని పరిస్దితి ఇప్పుడు నెలకొంది.

గుడివాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత...

గుడివాడ వలివర్తుపాడు గ్రామంలో పేకాటరాయుళ్ల పై పోలీసుల దాడులు చేసి పేకాట ఆడుతున్న వ్యక్తులను చితకబాదారు. ఈ దాడుల్లో రత్న కుమార్ అనే వ్య‌క్తిని ఎస్ఐ మరియు సిబ్బంది కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసు లాఠీల‌కు గాయ‌ప‌డిన ర‌త్న‌కుమార్‌ను ఘటనా స్థలం నుండి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అత‌ను దారిలోనే మృతిచెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున మృతుడు బంధువులు చేరుకోవ‌డంతో గుడివాడ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మృతుడి బంధువులు ఆరోపించారు. మ‌రి దారుణంగా పోలీసులు కొట్టి చంపేశారనే వార్త గుడివాడ‌ల సంచ‌ల‌నం రేపింది.

ఇదేం లాక్‌డౌన్.. వీరికి అనుమతి ఎలా ఇచ్చారు?

అసలు ఈ దేశానికి విమానాల్లో కరోనా వైరస్ రావటంలో పేదల, చిరుద్యోగుల పాత్ర ఎంత? అయితే ప్ర‌స్తుత‌ వీరే బాధితులు! ఇది ఢిల్లీ బస్ స్టేషన్ దగ్గర సన్నివేశం. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వీళ్లందరూ. రెండు నెలల పాటు కాదు కదా 15 రోజులు కూడా వాళ్ళు పని లేకుండా, ఆదాయం లేకుండా బతకలేరు. స్వగ్రామంలో ఎలాగైనా బతికేస్తారు. 20వ తేదీ వరకు చప్పుడు చేయకుండా ఒక్కసారిగా మూడు వారాలు బైటకి రావద్దంటే వాళ్ళకెలా? రేషన్ కార్డులు, ఓటు హక్కులు, డ్వాక్ర సభ్యత్వం అన్నీ గ్రామాల్లోనే ఉంటాయి. లాక్‌డౌన్ కారణంగా చేసేందుకు పని లేకపోవడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయని.. దీంతో అద్దెలు కట్టలేక.. నిత్యావసరాలు కోనుగోలు చేయలేకపోతున్నామని.. అందుకే తాము సొంతూరుకు వెళ్తున్నామని బదౌనీ జిల్లా బదౌన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తెలిపాడు. నోయిడా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన తమ వాళ్లను సొంతూళ్లకు తీసుకెళ్లడం కోసం 1000 బస్సులను పంపుతున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. డీటీసీ కూడా 200 బస్సులను ఏర్పాటు చేసింది. అందుకే ఈ స్థాయిలో జనం బస్ టెర్మినల్‌కు చేరుకున్నారు. వీరిలో చాలా మంది ముఖాలకు మాస్కులు, కర్చీఫ్‌‌లు కట్టుకున్నారు. కానీ వాటి వల్ల ఎంత మేరకు కరోనా నుంచి కాపాడుకోగలరనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ.. ఈ బస్ టెర్మినల్ దగ్గర మాత్రం జనం ఒకరినొకరు తోసుకునేంతలా ఉండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వీళ్లందరూ. ఆప్, బీజేపి ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నిరాశ్రయులైన వీరందరికీ నివాసం కల్పించలేని ఆప్ ప్రభుత్వం కేంద్రానికి ముందుచూపు లేదని బీజేపి మీదకి తోసేస్తే, వీళ్లని నిర్దాక్షిణ్యంగా ఆప్ తరిమేస్తున్నదని బీజేపి అంటుంది. రెండూ నిజమే కావొచ్చునేమో. ఫిబ్రవరి మొదటి వారం నుండే మెల్లగా, క్రమంగా చర్యలు చేపట్టి ఉండాల్సింది పాలకులు. ఫిబ్రవరి 24న లక్షలాదిమందితో కలిసి దేశాధినేతలు చెట్టపట్టాల్ వేసుకున్నారు. ఏదీ ముందు చూపు ఉండదు. ప్రజల బాధలు ప్రజలవి. పాలకుల పరిహాసాలు పాలకులవి. ఈ దేశ స్వరూప స్వభావాలు, ప్రజల జీవన విధానాలు, కదలికలు, ఆర్ధిక స్థితిగతుల మీద పాలకులకు క‌నీస అవగాహన ఉండదా? ప్రజల్ని కేవలం చట్టాల ద్వారా అదుపు చేయటమేనా పాలన అంటే? పోలీసుల ద్వారా భయభ్రాంతుల్ని చేయటమేనా?

క‌రోనాపై సంపన్నదేశాల భీక‌ర‌పోరు, పేదదేశాలు బిక్కుబిక్కు!

కరోనా మహమ్మారిపై సంపన్న దేశాలు భీక‌ర పోరు చేస్తుంటే  ఆకలి దప్పులతో తల్లడిల్లే నిరుపేద దేశాలు క్షణక్షణం భయంతో అల్లాడిపోతున్నాయి. ఓ వైపు ధనిక దేశాలు కొవిడ్‌-19 తో ప్రాణాలొడ్డి పోరాడుతుంటే.. అత్యంత నిరుపేద దేశాల్లో భయోత్పాతం రగిలింది. నిత్యరక్తపాతంలో బిక్కుబిక్కుమంటూ ఆకలిదప్పులతో అల్లాడే శరణార్థ దేశాల్లోనే అత్యంత హాని తప్పదని అంతర్జాతీయ సంస్థలు ఆక్రోశిస్తున్నాయి. సిరియా, యెమెన్‌, సొమాలియా తదితర దేశాలను కరోనా వైరస్‌ కబళిస్తే…పరిస్థితి మరింత దైన్యమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరోపా, అమెరికా దేశాలు కరోనావైరస్‌పై దూకుడు పెంచి.. యుద్ధం చేస్తుంటే…సిరియా, యెమెన్‌ తదితర యుద్ధ క్షేత్ర బరిలోనూ లక్షలాది మంది చనిపోతారని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్ర భయంకరంగా మారాయి.  క‌రోనా వైరస్‌ వ్యాపించి  వేలాది మందిని కబళించింది.  ఆఫ్రికా ఖండంలో…ఇంకా కరోనా వైరస్‌ విజృంభణ ఊపందుకోలేదు. ఇప్పటికి కేవలం 3,200 మంది కరోనా వైరస్‌ కౌగిట్లో చిక్కుకోగా… 83 మంది ఊపిరి ఆగిపోయింది, ధనిక దేశాలతో పోల్చితే తమ ఖండంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉందని ఆఫ్రికన్‌ యూనియన్‌ తెలిపింది.  ఇక్కడ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో పరిశుభ్రత పరిస్థితులు చాలా తక్కువ. నిరాశ్రయులై..సంక్షోభంలో అలమటించే శరణార్థులు కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోతారు” అని అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.    ప్రపంచంలోని అత్యంత హానికర ప్రాంతాల్లోని పేదలను ఆదుకునేందుకు 200 డాలర్ల ఆర్థిక సాయాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ మంజూరు చేసి.. ఒక మానవతా సహాయక ప్రణాళికను ప్రకటించారు. ”అయితే ఈ సాయం సరిపోదని మాకు ఇప్పటికే తెలుసు” అని ఉగాండా డైరెక్టర్‌ డెల్ఫిన్‌ పినాల్ట్‌ అన్నారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి పేద దేశాలను మరో సమస్య వేధించనుంది. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలు లేకపోవటమే ప్రధాన కారణం.

స్పెయిన్‌లో క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేస్తున్నారు!

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 73,000 వేలకు చేరింది. క‌రోనా మరణాల్లో స్పెయిన్ సైతం చైనాను అధిగమించి, ప్రపంచంలోనే రెండో స్థానంలోనే నిలిచింది. ఇప్ప‌ట్టి వ‌ర‌కు అక్కడ మరో 800 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,938కి చేరింది. కొత్తగా మరో 8వేల మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 73,000 వేలకు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాల్లో దాదాపుగా లాక్ డౌన్ అమ‌లులో వుంది. అయితే రోజు రోజుకే ప‌రిస్థితి చెయ్యిదాటిపోవ‌డంతో లాక్ డౌన్ చేయబడిన స్పెయిన్ లో పోలీస్‌లు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైద‌రాబాద్‌లో బ‌ల్దియా అధికారులు కుక్క‌ల్ని ప‌ట్టుకుని వాహ‌నాల్లో త‌ర‌లించిన‌ట్లు స్పెయిన్‌లో లాక్‌డౌన్ సంద‌ర్భంగా రోడ్ల మీద క‌నిపిస్తే మ‌నుషుల్ని అలా త‌ర‌లిస్తున్నారు. స్పెయిన్ రోడ్డు మీద క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లుగా పోలీసులు త‌రిమివేస్తున్నారు. మేక‌ల్ని ప‌ట్టుకొని వాహ‌నాల్లో వేసిన‌ట్లు పోలీసు వాహ‌నాల్లో వేసి రోడ్ల మీద నుంచి త‌ర‌లించారు. మీడియా సాక్షిగా పోలీసులు రెచ్చిపోతున్నారు. కుటుంబ‌స‌మేతంగా రోడ్ల మీద‌కి వ‌చ్చిన వారి ప‌రిస్థితి దారుణంగా క‌నిపించింది. మ‌హిళ‌లు అరుస్తున్న పోలీసులు క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు స్పెయిన్ పోలీసులు. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.