తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం! 

నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. రబీ లో పండించిన పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ధాన్యం కొనుగోలుకు ఏ రకంగా అడ్డు కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. అయితే అదే సమయంలో రైతులు సంయమనం పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి రైతాంగానికి విజ్ణప్తి చేశారు. యాసంగి లో పండించిన పంట కొనుగోలు విషయంలో అనుసరించాల్సిన విధానం పై శనివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,శాసనసభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య తదితరులు హాజరైన సమీక్షలో పలు అంశాల పై చర్చించారు. కరోనా మహమ్మారి తో చేతికొచ్చిన పంట కొనుగోలు పై రైతుల్లో వెల్లువెత్తుతున్న పలు అనుమానాలకు బ్రేక్ చేస్తూ ప్రతి గింజనుకొనుగోలు చేసే విదంగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలోని 844 గ్రామ పంచాయతీలలో రేవిన్యూ గ్రామలుగా గుర్తించిన 563 లలో 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకున్న ప్రభుత్వం కరోనా వైరస్ నేపధ్యంలో ఆ సంఖ్యను 340 కి పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.కొత్తగా పెంచిన 104 కొనుగోలు కేంద్రాలతో పాటు,రవాణా సౌకర్యం ఉండి రైతులు సమిష్టిగా ఒక్క దగ్గరకు చేర గలిగితే కల్లాల వద్ద సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఆయన చెప్పారు.ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పద్దతిలో ఆదేశాలు ఇచ్చి ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముందెన్నడూ లేని రీతిలో పంట దిగుబడి పెరిగిందని అయితే కరోనా వైరస్ కొంత గందరగోళం లో పడేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రైతును ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో వరి పంట వేసిన మొత్తం లక్షా 26 వేల 450 హెక్టార్లలో ఐదు లక్షల 96 వేల 960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందన్న అధికారుల అంచనాలను ఏకీభవిస్తూనే పంట దిగుబడిని పట్టి కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సూచనకు అనుగుణంగా అధికారులు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను నాలుగు తరగతులు గా విభజించారు.అధిక పంట దిగుబడి అయ్యే వాటిల్లో అంటే 20 వేల మెట్రిక్ టన్నుల పై బడి ధాన్యం వచ్చే విగా భావిస్తున్న 14 మండలాలూ,మధ్యస్తంగా  దిగుబడి వచ్చే(10 వేల మెట్రిక్ టన్నుల పైబడి) వాటిల్లో 7 మండలాలు గా గుర్తించిన అధికారులు ఐదువేల మెట్రిక్ టన్నుల పై బడి దిగుబడివచ్చే వాటిల్లోఉన్న రెండు మండలాలు పోను మిగితా ఎనిమిది మండలాలను ఐదు వేల లోపుగా గుర్తించారు.అయితే అదే సమయంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.అందులో భాగంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలతో పాటు, ఎలక్ట్రానిక్  కాం టా లు ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం సేకరణ కొరకు గిన్ని బ్యాగులు సిద్దం చేయాలన్నారుట్రాక్టర్ వెళ్ళే గ్రామాల్లో రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకుంటే కొనుగోలు కు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ కొలిచే యంత్రాలతో పాటు టార్ఫాలిన్లు, గిన్ని బ్యాగులను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు లో దళారులు రైతులను మోసం చేస్తే కటినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రతి కేంద్రానికి ఒక ట్యాబ్ ద్వారా ఐ‌డి పాస్ వర్డ్ అందజేసి మిల్లర్స్, రైతులకు అనుసందానం చేస్తామని అన్నారు. ధాన్యన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్దంగా ఉంచినట్లు  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ లలో కట్టుదిట్టమైన  భద్రత ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లులు పని చేసే విదంగా చూడాలని అదికారులకు సూచించారు. జిల్లాలో ఎఫ్‌సి‌ఐ గొదామ్ లు పూర్తి నిల్వ సామర్థ్యం లేనందున ఇతర ప్రాంతాలకు ధాన్యం నిలువలు చేయడం జరుగుతుందని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకరాగ ఆయన అందుకు సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్‌పి ఏ.వి.రంగ నాథ్,   జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,  డి‌ఎం సివిల్ సప్లయ్ నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో  సి. సి. సి. మ‌న‌కోసం

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఇందుకోసం చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. మ‌న‌కోసం (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ ఏర్పాటైంది. ఈ  సి. సి. సి. మ‌న‌కోసం సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ,  దర్శకుడు, దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్ వెల్లడించారు.  మొదటగా  ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. " క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టిస్తున్న క‌ల‌క‌లం మ‌నంద‌రం ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం. ఈ స‌మ‌యంలో మ‌న సోద‌ర కార్మికుల‌కి మ‌నం ఏం చేయ‌గ‌లం అని చిరంజీవి  త‌న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు , నేను, ఎన్‌.శంక‌ర్ , క‌ల్యాణ్ , దాము క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌య్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం.," అని వివరించారు. దీనికి నాందిగా మొద‌ట చిరంజీవి కోటి రూపాయ‌లను ప్ర‌క‌టించారు. నాగార్జున  కోటి రూపాయ‌లు, ఎన్టీఆర్ 25ల‌క్ష‌లు ఇలా విరాళాలు ప్ర‌క‌టించారు. వీరే కాకుండా ఎవ‌రైనా సినిమా ప‌రిశ్ర‌మ కార్మికుల‌ను ఆదుకోవ‌చ్చు.. క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతున్న సినీ కార్మికుల సంక్షేమ‌మే ఈ సంస్థ ముఖ్య ఆశ‌యమని భరద్వాజ పేర్కొన్నారు.

తప్పుడు వార్తాకథనంపై మండిపడ్డ కమలహాసన్ 

సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీధి మ‌య్య‌మ్ అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ గృహ నిర్భంధంలో ఉన్న‌ట్టు కొద్ది రోజులుగా  పుకార్లు షికారు చేస్తున్నాయి. త‌న ఆరోగ్యం గురించి క‌నుక్కునేందుకు నాన్‌స్టాప్‌గా కాల్స్ వ‌స్తుండ‌డంతో క‌మ‌ల్ కొద్ది సేప‌టి క్రితం అధికారిక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వివ‌రాల‌లోకి వెళితే చెన్నై నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న కమల్‌ హాసన్ ఇంటికి చెన్నై కార్పొరేషన్ అధికారులు కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే 'ఐసొలేషన్' (గృహ నిర్బంధం) స్టిక్కర్ అంటించారు. అయితే, పొరపాటున దీనిని అతికించామని తెలుసుకున్న అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు. క‌మ‌ల్ ఇంటికి స్టిక్ట‌ర్ అంటించిన వార్త కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్ కాగా, క‌మ‌ల్‌కి క‌రోనా సోకింద‌ని, ఆయ‌న ఐసోలేష‌న్‌లో ఉన్నాడ‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన క‌మ‌ల్‌..నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న ప్రేమ‌కి ధ‌న్యుడిని. ఆళ్వారుపేటలోని  ఇంట్లో గత కొన్నేళ్లుగా  నివసించట్లేదు. కేవ‌లం పార్టీ సమావేశాలు నిర్వహించేందుకుగాను పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం. అంతేకాక  గృహ నిర్బంధానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు. ముందు జాగ్రత్తగా ప్రజలంతా ఇతరులకు దూరంగా (సోషల్ డిస్టెన్సింగ్) ఉండాలని నేను కోరాను, అదేవిధంగా నా అంతట నేనుగా ఇతరులకు దూరం పాటిస్తున్నాను. న్యూస్ ఎజెన్సీస్ వార్త‌ని ప్ర‌చురించే ముందు నిజ‌నిజ‌లాంటే తెలుసోవాల‌ని '' అని కమల్ హాసన్ స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండగా, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ రెండు వారాల కిందట ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముంబైలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షర చెన్నైలోనే మరొక ఇంట్లో నివ‌సిస్తున్నారు. కమల్ హాసన్ వేరొక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.

గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా తో సహా 15 మంది కుటుంబ సభ్యులు, ఐసోలేషన్ వార్డుకు తరలింపు

 గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు 15 మంది కుటుంబ సభ్యులను కాటూరి మెడికల్ కాలేజీ ఐసోలేషన్  వార్డ్ కి అధికారులు తరలించారు . గుంటూరు-1 ఎం ఎల్ ఏ ముస్తఫా  బావకి కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద రంగం లోకి దిగింది. ఇతను ఢిల్లీ లో జరిగిన మూడురోజుల కార్యక్రమానికి వెళ్ళి మార్చ్  18 వచ్చాడు. జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22 ఆదివారం రోజున గుంటూరులో సుమారు 500 మందికి విందు ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ రోజు నుండి గుంటూరు లో కఠినంగా కర్ఫ్యూ జరుగుతుందని పోలీసు అధికారులు నిర్ణయించారు.

ప్ర‌కృతి విసిరే ఛాలెంజ్‌ల‌కు మ‌న దేశం సిద్ధ‌మా?

సృష్టిలో క‌రోనా మొదటిది కాదు!  చివరిది కూడా కాదు! మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. శాస్త్రవిజ్ఞానం పెరుగు తున్నకొద్దీ అంటువ్యాధులు ఒక మహమ్మారిలాగా విజృంభిస్తూనే ఉన్నాయి.   కలరా, ప్లేగు, మశూచి, ఫ్లూ (ఇన్‌ఫ్లూయంజా) వంటి వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని బలితీసుకున్నాయి. కరోనా కన్నా ముందు తలెత్తిన ఎబోలా వైరస్‌ వేలాదిమంది ప్రాణాలను బలిగొన్నది. అది ప్రస్తుతం దక్షిణాఫ్రికాకే పరిమితమై ఉంది. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి కారణంగా (2005-2012) 36 మిలియన్ల మంది మరణించగా, ఫ్లూ వల్ల (1968లో) 1 మిలియన్‌, ఆసియా ఫ్లూ (1956-1958) వల్ల 2 మిలియన్లు మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 27,350 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది.   ఇంకా గుర్తించని వేలాది బ్యాక్టీరియాలు, వైరస్‌లు మానవ మనుగడకు ఛాలెంజ్ చేస్తున్నాయి! గతంలో వీటి ప్ర‌భావంతో  ప్రజలతో పాటు పెద్దపెద్ద జంతువులు కూడా బలైనాయి, బలవుతూనే ఉంటున్నాయి. ఇదో ప్రకృతి నియంత్రణ. ఓ జీవి (చిన్నదా, పెద్దదా అనేది కాకుండా) మరో జీవిని అనుభవించడం, ఆశ్రయం పొందడం, మనుగడ సాగించడం సృష్టికార్యాలే! ఇవన్నీ అనివార్యమైన చర్యలు.  ఇలా జరగడానికి వీలులేదని భావిస్తే మానవుడు తినే ఆహారం అసలు జీర్ణమేకాదు. అందుకే ఉపయోగకర బ్యాక్టీరియాగా, అపకారి బ్యాక్టీరియాగా గుర్తించడం జరిగింది. నిజానికి అపకారి అనేది మానవుడు పెట్టుకున్న పేరు. ఏ జీవి అయినా, ఏదో రూపంలో, ఏదో విధంగా ప్రకృతికి దోహదపడుతూనే వుంటుంది. మనిషికి ఇబ్బంది కల్గించే వాటన్నింటిని నష్టజాతకులుగా, క్రూర మృగాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ దృష్టితో చూసినప్పుడు మాత్రమే కరోనా ఉనికిని అర్థం చేసుకోగలం. ఈ సృష్టిలో ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాదు.  నేడు దీనికి నివారణనో, టీకానో, గుర్తించినా, కొంత ఉపశమనమే గానీ, శాశ్వత పరిష్కారం కాదు…కానరాదు. మశూచి, పొంగు, కోరింత దగ్గు, పోలియో, టెటనస్‌, టిబి తదితర వ్యాధులు ఒకప్పుడు కరోనాలా ప్రపంచాన్ని భయపెట్టినవే!  ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. ఏదో విధంగా దీన్ని నియంత్రిస్తారు. అంతమాత్రాన ప్రపంచ ప్రజలంతా చీకుచింతా లేకుండా, రోగాలు నొప్పులు లేకుండా వుంటారనుకోవడం ఓ భ్రమనే! మరో కొత్త విపత్తు, సమస్య ముందుకు వస్తుంది.   వీటిని గుర్తించడం  శాస్త్రీయంగానే జరుగుతుంది. ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలి. మ‌న దేశంలో రీస‌ర్చ్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్య‌త ఇస్తున్నారా?  విద్యాల‌యాల్లో సైన్స్ ప్ర‌యోగాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి. ప్ర‌త్యేక బ‌డ్జెట్ కేటాయించాలి. విద్య రంగంలో, సైంటిఫిక్ రంగంలో ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై గుండె మీద చెయ్యి పెట్టుకొని స‌మీక్షించుకోక‌పోతే రాబోయే త‌రాల‌కు భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మే!

తమిళనాడు లో దారుణం

తమిళనాడులో 34 ఏళ్ల ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఇటీవల అతడు విదేశాల నుంచి రావడంతో అతడిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, అతడు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించి ఓ వృద్ధురాలి (90) మరణానికి కారణమయ్యాడు. శ్రీలంక నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు అతడు వచ్చాడు. గత రాత్రి హోం క్వారంటైన్‌ను ఉల్లంఘించి బయటకు వచ్చాడు. ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె కేకలు వేసింది.. దీంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. ఆ ప్రాంత వాసులు  భయాందోళనలకు గురవుతున్నారు.  

లాక్‌డౌన్‌నైనా పాటించాలి.. లాకప్‌లోనైనా ఉండాలి: ఐజీ ప్రభాకర్‌రావు

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది పని తీరును నేడు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు పరిశీలించారు. శంకర్ విలాస్ సెంటర్‌లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటికి 1300 కేసులు నమోదు చేశామన్నారు. గుంటూరులో రెండు పాజిటివ్ కేసులు వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామన్నారు.రెండు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను అయినా పాటించాలి.. లేదంటే లాకప్‌లో నైనా ఉండాలని ఐజీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. తప్పని సరిగా లాక్‌డౌన్ అందరూ పాటించాలన్నారు. అలాగే  ఆంధ్ర - తెలంగాణ బోర్డర్‌లో బందోబస్తు పెంచామని ఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు.

విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి

*వైద్యులను ధన్వంతరి రూపంగా భావించండి: స్వామి స్వరూపానంద  * పోలీసులను దేశ సైనికులుగా భావించి , గౌరవించండి: స్వామి స్వరూపానంద  విశాఖ శ్రీ శారదాపీఠం లో 11 రోజులపాటు సాగిన అమృత పాశుపత సహిత విషజ్వర పీడా హర యాగం. యాగాన్ని పర్యవేక్షించిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర. సర్వ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలనే యాగం చచేసినట్టు వెల్లడించిన స్వామి స్వరూపానందేంద్ర. పూర్ణాహుతి సందర్భంగా అనుగ్రహ భాషణం చేసిన స్వామి స్వరూపానందేంద్ర -" ప్రపంచానికి భారత దేశం గురుస్థానంలో ఉంది. వేదాల్లో ఉన్న అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టాం. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసాం, " అని విచారించారు. " ఈ యాగం విజయవంతంగా ముగిసింది. ప్రధాని మోడీ, సీఎంలు కేసీఆర్‌, జగన్ ల ఆదేశాలను తుచ తప్పక పాటించండి. ధన్వంతరి రూపంగా భావించి వైద్యులను ఆరాధించండి. పోలీసులను దేశ సైనికులుగా భావించి గౌరవించండి," అని ప్రజలకు విజ్ఞప్తి చేసిన స్వామి స్వరూపానందేంద్ర, ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ, దేవాదాయ శాఖ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలనీ, విశాఖ శారదాపీఠం భక్తులంతా అన్నార్తులను ఆదుకోవడానికి ముందుకు రావాలనీ కూడా పిలుపునిచ్చారు.

జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే ఉదయభానును సైతం లెక్కచేయని వైద్యులు

జ్వరంతో బాధపడుతున్న తన కొడుకును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చిన ధర్మవరం తండా మహిళ. సాధారణ రోగాలకు వైద్యం చేయమంటూ మహిళను తిప్పి పంపిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. కరోనా మాస్క్‌లు పంపిణీ చేస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రోడ్డుపైనే కలిసి తన గోడు వెళ్ళబోసుకున్న ఆ తల్లి. తన బిడ్డకు వైద్యం చేయించాలని ఎమ్మెల్యే ఉదయభానుకు విజ్ఞప్తి. స్పందించిన ఎమ్మెల్యే ఉదయభాను వెంటనే ఆసుపత్రికి తరలింపు. ఎమ్మెల్యే ఉదయభాను చెప్పినా వైద్యం చేసేందుకు తిరస్కరించిన ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ విజయభాస్కర్‌. సాధారణ జ్వరాలకు వైద్యం చేయవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పిన తాము వైద్యం చేయమని అడ్డం తిరిగిన వైద్యులు. వైద్యుల మాటలతో కంగుతిన్న ఎమ్మెల్యే ఉదయభాను.అధికార పార్టీ ఎమ్మెల్యే మాటలనే లెక్క చేయని వైద్యులు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉదయభాను.

సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేయవద్దు, నమ్మవద్దు!

ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  కొన్ని తప్పుడు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ, J D లక్ష్మీనారాయణ గారి వాయిస్,.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు,. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి, .డాక్టర్ దంపతుల మరణం,. రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం, కరోనా వైరస్ కు dr గుప్త మందు, రోడ్ల పైన పడిఉన్న దేహాలు, dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన, .COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు,.ఆవుకు పుట్టిన మనిషి, మోడీ గారి 1000 GB  ఫ్రీ, .బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు లాంటి తప్పుడు వార్తలతో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయవద్దు. ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు.... ఇలాంటివి మన ఫోనులో మరెన్నో..ఇలాంటి తప్పుడు వార్తల మధ్య "వాస్తవాలు" నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం.....మిత్రులారా మేల్కొనండి.. వదంతులు తప్పుడు సమాచారాలు నమ్మకండి.. ప్రచారం చేయకండి.. వివేకంతో ,బాధ్యతగా మెలుగుదాము.

కరోనాపై  ఏ పీ మంత్రుల కమిటీ భేటీ

కరోనా నియంత్రణ చర్యలపై చర్చించడానికి విజయవాడ ఆర్‌అండ్‌బి కార్యాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఐదుగురు మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సభ్యులుగా.. మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి బొత్స, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోం శాఖ మంత్రి సుచరిత సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా వివిధ దశల్లో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై సమీక్షిస్తుంది.    కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీని సర్కార్‌ నియమించింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ వ్యాప్తి నిరోధం, క్వారంటైన్‌లో ఉన్నవారి పర్యవేక్షణ, లాక్‌డౌన్‌ అమలు వంటివి పటిష్టంగా అమలు చేయడానికి ఈ కమిటీని వేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎస్‌ నీలం సాహ్ని చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కో చైర్మన్‌గానూ, కన్వీనర్‌గానూ ఉంటారు. సభ్యులుగా పీవీ రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సమాచార పౌరసంబంధాల ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సెక్రటరీలు ఉంటారు.

మీరు ఎంత సేఫ్‌గా ఉన్నారు? ఎంత రిస్క్‌లో ఉన్నారు?

రోజంతా ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు, కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈ రోజు కి ఏదో సాధించా అన్న ఫీలింగ్ తో ఇంటికి వెళుతున్నారా?..... మీకు తెలియని విషయం ఏంటంటే మీరు సాధించింది.... క, రో, నా, ని!?...  మీరు  ఒకేసారి 21 రోజులకీ కావలసినవి తెచ్చుకోవాలి.  ఆ తర్వాత బయట నుండి ఏమీ ఇంట్లో కి తేవొద్దు.  లాక్ ద డోర్. తాళం మళ్ళీ 21 రోజులు తర్వాత తీయాలి. అది లెక్క‌..... ఇప్ప‌ట్టికైనా అర్థం అయి స‌చ్చిందా?..... తాళం వేసిన 4 వ రోజు వరకు మీ కుటుంబం లో ఎవరికీ దగ్గు, జలుబు,  జ్వరం లేకపోతే మీ కుటుంబం 50% సేఫ్.  14వ రోజు వరకు రాకపోతే మీ కుటుంబం 90% సేఫ్.  21వ రోజు వరకు ఏ లక్షణాలు కనపడకపోతే మీరు మీ కుటుంబం 100% సేఫ్. శ‌భాష్ ఇప్పుడు మీరు క‌రోనా కాటు నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు.  మధ్యలో ఒక్క రోజు బయటకు వెళ్ళినా,.... బయట వస్తువు ఇంట్లో కి తెచ్చినా.... అప్పటి నుండి మళ్ళీ 21 రోజుల లాక్ డౌన్ కొనసాగాల్సిందే. స్వీయ‌నింత్ర‌ణ చేయాల్సిందే. అది విష‌యం.  కరోనా చివరి పేషెంట్ ఐసొలేట్ అయిన తర్వాత 21 రోజుల వరకు  లాక్ డౌన్ కొనసాగుతుంది. అందరూ సహకరిస్తే నే తొందరగా దేశంలో నార్మల్ లైఫ్ వస్తుంది.   సగటున కరోనా ఎటాక్ అయిన 4వ రోజు  జ్వరం,  7వ రోజు ఊపిరితిత్తుల ఫెయిల్ తో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది,  వెంటనే వెంటిలేటర్స్ పెట్టకపోతే రక్తం లో ఆక్సిజన్ అందక యాంటీబాడీస్ పెరిగి 10వ రోజుకల్లా కిడ్నీ లు ఫెయిల్ అవుతాయి,  అలా మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ తో దారుణ‌మైన చావు త‌ప్ప‌దు. నీటిలోని చేప‌ను రోడ్డుపై వేస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకొని ద‌య‌నీయమైన చావు చావాల్సిందే. CDDEP వారి  అంచనా ప్రకారం 25 కోట్ల మంది కి ఏప్రిల్ నెల మధ్య నాటికి కరోనా సోకుతుంద‌ట‌.  అందులో మీరు ఉంటారా?  లేక ఇంట్లోనే ఉంటారా?  తేల్చుకోవాల్సింది మీరే.

ఏపీ పోలీసుల హౌస్ క్వారంటైన్ యాప్ 

సరికొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక్కరోజులోనే హౌస్  క్వారంటైన్ అప్లికేషన్ లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను ఆంధ్ర ప్రదేశ్ పొందుపరిచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను నమోదు చేయనున్న పోలీసులు. అప్లికేషన్ లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేసి, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టనున్నట్టు డీ జీ పీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ కు ఆటో మ్యాటిక్ గా సమాచారం అందుతుంది.  నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారికి లక్ష్మణరేఖ గా భావించవచ్చునాని సవాంగ్ అన్నారు.

ఆ మాంసం తిన్నందుకే మ‌నిషికి క‌రోనా!

పంది, కుక్క‌, పిల్లి, పాము, గుర్రం, గాడిద‌, గ‌బ్బిలం, అలుగు మాంసంలో క‌రోనావైర‌స్ ఉంటుంద‌ట‌. వీటి మాంసం తినడం ద్వారా వాటిలో వున్న‌ వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పంది, కుక్క‌, పిల్లి, పాము, గుర్రం, గాడిద‌, గ‌బ్బిలం, అలుగు మాంసం ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో ఇలాంటి మాంసానికి డిమాండ్ ఎక్కువ‌ట‌. గబ్బిలాల్లో ఉండే Corona Virus​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని మ‌రికొంత మంది సైంటిస్టులు చెబుతున్నారు. విషపూరిత పాములు China Snakes తమ ఆహారంగా అడవుల్లో Bats గబ్బిలాలను వేటాడి తిని జీవిస్తుంటాయి. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్.. పాములు వాటిని తినడం ద్వారా సంక్రమించి.. ఆ పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి కూడా వైరస్ పాకింద‌ని మ‌రికొన్ని అధ్య‌య‌నాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ డెడ్లీ కరోనా వైరస్.. గాలి ద్వారా కూడా వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ ప్ర‌పంచ‌మంతా పాకింది.

కడపలో కరోనా పాజిటివ్ కేసు.. 75 మంది పరేషాన్!

కడప జిల్లాలో కరోనా కలకలం రేపింది. రెండు రోజుల పాటు జమ్మలమడుగులో మకాం వేసిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల రాజస్థాన్ నుంచి రైలులో కడప జిల్లా ఎర్రగుంట్లలో దిగిన అతను.. జ్వరం రావడంతో ఈ నెల 23 న కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాడు. అయితే అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతని శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, సదరు పాజిటివ్ వ్యక్తితో దాదాపు 75 మంది సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 20 మందిని గుర్తించి ప్రొద్దుటూరు ఐసోలేషన్‌ హోంకు తరలించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రార్ధనా విశ్వాసాలు పక్కన పెట్టి, ప్రాక్టికల్ గా ఆలోచించండి

యద్ధం కొన‌సాగుతోంది. మౌనంగా.. ఐక్యంగా, కలిసి పనిచేయాల్సిన తరుణం ఇది.  ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడగా.. 27వేల మంది మరణించారు. కాబ‌ట్టి... ముక్కువాసన కోల్పోవడం, నాలుక రుచి తెలియకపోవడం, గొంతుమంట, దగ్గు, జలుబు, జ్వరం మరియు గుండె దడ లాంటి లక్షణాలు కనబడగానే SELF ISOLATION పాటించి ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి వెళ్ళాలి. కార్ఫోరేట్ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ప్రభుత్వ వ్యవస్థే నడుస్తుంది. 3వ దశకు చేరితే నియంత్రించుట కష్టం. కావున సూచనలు పాటించి జీవించడమే. యజ్ఞాలు,యాగాలు చెసే వాళ్ళు ప్రస్తుత స్థితి నుండి కాపాడలేరు. మృత్యుంజయ హోమం, ఏసుపాదాలు తాకడం, అల్లా ప్రార్థన చేయడం, యజ్ఞాలు, యాగాలు చేయడం అవివేకం. మానవుడు తన బలహీనతను దైవం అనే అనుగ్రహం మీద పెట్టి మనశాంతి పొందడం అనాదిగా ఆనవాయితి.  కాబట్టి సామాజిక దూరం పాటించడం,చేతులు కడగటం,నీళ్ళు త్రాగడం, సి.ఎం. కేసీఆర్ చెప్పిన‌ట్లు ప్రోటీన్ ఆహారం తినడం, బాహ్య సంచారం మానడం, ఉమ్మడం, దగ్గటం, చీదటం మానటం లేదా గుడ్డ అడ్డు పెట్టుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మాత్రమే కరోనా నుండి కాపాడుతుంది. మనకు ఇమ్యునిటి ఉంటే వ్యాధి సోకినా ఇబ్బందులు పడి కోలుకుంటాం. ధైర్యంగా క‌రోనాను ఎదుర్కొందాం.

టెస్ట్, ట్రేస్, ఐసొలేట్ , ఎండ్ ట్రీట్ : కరోనా నివారణకు వెంకయ్య కొత్త మంత్రం

నిత్యావసర వస్తు సరఫరానే కీలకం - ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరించందన్ కరోనా నేపధ్యంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్ కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ అన్నారు, ఇటీవల విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి హస్తిన నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి,  గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్ల తో మాట్లాడుతూ సామాజిక దూరం మాత్రమే వ్యాధి వ్యాప్తిని నిరోధించే అవకాశం కలిగి ఉన్నందున తదనుగుణంగా వ్యవహరించాలనిసలహా ఇచ్చారు, కరోనావ్యాప్తికి వ్యతిరేకంగా దేశం మొత్తం తగిన సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని, మరోవైపు ఒంటరిగా, సామాజిక దూరాన్ని కొనసాగించ వలసిన అవశ్యకత కీలకమైనదని స్పష్టం చేసారు.  గవర్నర్లు,  లెఫ్టినెంట్ గవర్నర్లు తమ కున్న అనుభవ సారంతో అక్కడి ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రార్థనల పేరిట సమావేశాలు వద్దని  మత పెద్దలు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ' టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ అండ్ ట్రీట్’ అనే మంత్రాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకునే క్రమంలో  ప్రజా జీవితంలో విస్తారమైన అనుభవంతో పరిపాలనకు మార్గనిర్దేశం చేయగలవారి సేవలను ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సలహా ఇచ్చారు.ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, ఆశ్రయం, వలస కూలీలకు ఆహారం ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు, జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. వైరస్ గురించి అవగాహన కల్పించి, ఇతర రాష్ట్రాల విద్యార్థులను జాగ్రత్తగా చూసుకునేలా చిత్ర పరిశ్రమ, సాహిత్య సంస్థలు, ప్రైవేటు రంగ సేవలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించారు.

భారతీయులూ అప్రమత్తంగా ఉండండి.

భారత దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకూ దేశం మొత్తం లాక్ డౌన్. ప్రజలకు భయపడకండి మేమున్నాం అని ప్రభుత్వాలు ధైర్యం చెప్తున్నాయి. ప్యాకేజీలు కూడా ప్రకటించాయి. ఇదిలా ఉండగానే..కరోనా విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇండియాలో వచ్చే మే నెల నాటికి 10 నుంచి 13 లక్షల మందికి కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ వ్యాధి వ్యాపిస్తున్న విధానాన్ని పరిశీలించి, దాని ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. కోవిండ్-19(COV-IND-19) అనే అధ్యయన బృందం ఈ నివేదికను రూపొందించింది. వైరస్ తొలిదశ వ్యాప్తిలో అమెరికా, ఇటలీ వంటి దేశాలతో పోలిస్తే, భారతదేశం మెరుగ్గానే కరోనా కేసులని నియంత్రించగలిగిన మాట వాస్తవమేనని, కానీ విస్తృతంగా నిర్థారణ పరీక్షలు చేయలేకపోవడం ఇండియా ప్రధాన లోపంగా కనిపిస్తోందని ఈ పరిశోధకులు అంటున్నారు.  పరీక్షా కేంద్రాలు చాలా తక్కువగా ఉండటం, ఫలితాల ఖచ్చితత్వం, ఎంతమంది వైరస్ బారిన పడిన వారు పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు వంటి అంశాలు కరోనా విస్తృతిని అర్థం చేసుకోడానికి ముఖ్య అంశాలని, ఇండియాలో ఈ సమాచారం సమగ్రంగా లేదని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటి శాస్త్రవేత్త దేబశ్రీ రాయ్ అన్నారు. ఇప్పటిదాకా, ఇండియాలో టెస్టులు చేసిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల, ఎంతమందికి వాస్తవంగా ఈ వైరస్ సోకిందో చెప్పలేని పరిస్థితి ఇండియాలో నెలకొని ఉందని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా రిపోర్టు అవుతున్నాయని, అందుచేత ప్రస్తుత లెక్కలని నమ్మలేమని అంటున్నారు. మార్చి 16 వరకూ రిపోర్టయిన కేసుల ఆధారంగా వేసిన లెక్కల ప్రకారంగా మే నెల నాటికి కరోనా కేసుల సంఖ్య దేశంలో పది లక్షలు దాటొచ్చనేది అంచనా. అయితే, ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలను బట్టి ఈ సంఖ్య తగ్గొచ్చు అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో ఢిల్లీ స్కూలు ఆఫ్ ఎకనామిక్స్, అలాగే అమెరికాలోని జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటికి చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. సాధారణ పరిస్థితుల్లోనే పేషెంట్ల తాకిడిని తట్టుకోలేని వైద్యఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో ఉన్నదని, అలాంటిది ఒక్కసారిగా ఒత్తిడి ఎక్కువైతే వైద్యరంగం కుప్పకూలే అవకాశం ఉందని రిపోర్టులో అన్నారు. ఇండియాలో పదివేల మందికి 7 బెడ్లు ఉన్నాయి. అదే ఫ్రాన్సులో 65, దక్షిణ కొరియాలో 115, చైనాలో 42, ఇటలీలో 34, అమెరికాలో 28 బెడ్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, ముందుముందు పెరిగే కరోనా కేసులను ట్రీట్ చేయగల సామర్థ్యం మన ఆస్పత్రులకు లేదని అర్థం అవుతుంది. ఇండియాలో మరో సమస్య ఏంటంటే, దేశంలో 110 కోట్ల మందికి, అంటే మెజారిటి ప్రజలకి ఎటువంటి ఇన్సూరెన్సు పాలసీ లేదు. దీనికి తోడు, దాదాపు 30 కోట్ల మందికి బీపీ ఉంది. కరోనా వైరస్ సోకిన వాళ్లు చనిపోవడానికి దోహదం చేసే అంశాల్లో బీపీ ప్రధానమైనది. కఠిన మైన చర్యలు తీసుకోకపోతే, ఇండియాలోని వైద్యఆరోగ్య వ్యవస్థ, ఇక్కడున్న ఆస్పత్రులు పెరగనున్న కరోనా పేషెంట్ల సంఖ్యతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి. మనందరం స్వయం నిర్భందంలో ఉండడమే మనకు శ్రీ రామ రక్ష.