వేడితో పాటు క‌రోనా సెగ కూడా పెరుగుతుంది!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోవిడ్‌పై ప్రభావం చూప‌డం లేదు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా రూపాంతరం చెంది మ‌రింత బ‌ల‌ప‌డుతోందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కోవిడ్‌కు.. ఉష్ణోగ్రతలకు అసలు సంబంధమే లేదు. మ్యూటేటెడ్‌ వైరస్‌ అయిన కరోనా ఎలాంటి కాలంలోనైనా తట్టుకుని బతికే అవకాశాలున్నాయని కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎండలు తీవ్రమైన కొద్దీ వైరస్‌ తన శక్తిని కోల్పోతుందనే విశ్లేష‌ణ స‌రైన‌ది కాద‌ని, రానున్న కొద్దిరోజులు ప్రజలు మరింత అప్రమత్తంగాఉండాలని ఆయన హెచ్చ‌రించారు. రాష్ట్రంలో మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించ‌డం చాలా అవ‌స‌ర‌మేని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణలో వైరస్‌ థర్డ్‌స్టేజీకి చేరలేదన్నారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్ లింక్‌ను విజయవంతంగా విడగొట్టామన్నారు.

కణాల్లోకి చొర‌బ‌డిన‌ కరోనా విధ్వంసం సృష్టిస్తుంద‌ట‌!

కనబడని సూక్ష్మ జీవి, కనిపిస్తున్న ప్రతి దానిపైనా దాడి చేస్తోంది. ఎప్పటికప్పుడు బలం పెంచుకొని కలవరపెడుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి మరింత అప్రమత్తత అవసరం అని హెచ్చ‌రిస్తోంది. ఈ ప్రపంచాన్ని ఊపిరితీసుకోనివ్వకుండా చేస్తున్న వైరస్‌..! ఆ వైరస్ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసుగానీ.. అది మన కణాల్లోకి ఎలా చొరబడుతుంది.. చొరబడిన తర్వాత ఏం చేస్తుంది..? మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది? దీనిపై బ్రెజిల్‌కు చెందిన పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్‌ ఫౌండేషన్‌ కు చెందిన నిపుణులు దీనిపై పరిశోధనలు జరిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా అత్యధిక తీక్షణత కలిగన ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ సాయంతో కరోనా వైరస్ మహమ్మారి ఫొటోలు తీశారు. ఈ మైక్రోస్కోప్‌ సాయంతో ఏదైనా కణాన్ని ఉన్న పరిమాణం కన్నా దాదాపు 20 లక్షల రెట్లు పెద్దగా చూడొచ్చునట. శరీరంలోకి వెళ్లిన వైరస్‌ కణాలు మొట్టమొదటగా.. మన దేహంలోని సెల్స్‌ను (క‌ణాల‌ను) టార్గెట్‌గా చేసుకుని కదులుతాయి. ఆ తర్వాత క‌ణాల్లోకి ప్రవేశిస్తుంది. కణంలోకి ఇలా ప్రవేశించగానే.. కణంలోని కేంద్రక పొర‌ల‌ వద్దకు వేగంగా చేరుకుంటుంది. అంటే ఈ సమయంలోనే మనం ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడతాం. ఆ తర్వాత కణంలో ఉన్న పొర‌లో ద్రవ్యం వైరస్‌ వృద్ధి చెందడం మొదలవుతుంది. ఈ కణ ద్రవ్యంలోనే వైరస్‌ తన జన్యువులను అభివృద్ధి చేసుకుంటూ.. వేరే కణాలకు సోకుతూ వెళ్తోంది. ఇలా రోజులు గడిచే కొద్దీ ఈ వైరస్ ప్రభావం పెరుగుతూ ఉంటుందని ప‌రిశోధ‌కులు విశ్లేషించారు.

లాక్‌డౌన్‌పై నేడే ప్ర‌ధాని మోడీ కీలక ప్రకటన..?

కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారా.. లేదా అన్న సస్పెన్స్‌ కు నేటితో తెరపడనుంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చిస్తారు. అనంతరం అనంత‌రం ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ను కనుక పొడిగిస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతమేర సవరించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో కొన్ని రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తారని సమాచారం. అయితే వాటిపై పలు ఆంక్షలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మరోపక్క అన్ని లాక్‌డౌన్ ను పొడిగించాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరారు.

ఇదే స్ఫూర్తితో ప‌నిచేయండి! సీఎం చర్యలు బాగున్నాయన్న ఉప రాష్ట్రపతి!

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలిన తదనంతర పరిస్థితులపై భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫోన్ చేసిన ఉప రాష్ట్రపతి రాష్ట్రంలోని రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పేద ప్రజలు, వలస కార్మికులకు ప్రభుత్వపరంగా, దాతలను ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్న విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి వినోద్ కుమార్ తీసుకొచ్చారు. కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ ఉప రాష్ట్రపతి కి వివరించారు. లాక్ డౌన్ ను కూడా పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వినోద్ కుమార్ కు తెలిపారు. కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు.

తెలంగాణాలో ఘోరం! రోడ్డుపైనే క‌రోనా ల‌క్ష‌ణాల‌తో నేపాలీ వృద్ధుడి మరణం!

త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ఆ వృద్ధుడు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూనే క‌నీస వైద్యం అంద‌కుండా రోడ్డు పైనే దారుణంగా త‌నువు చాలించాడు. ఇట‌లీని త‌ల‌పించేలా జ‌రిగిన ఈ ఘోరం ప్ర‌భుత్వానికి స‌వాల్ విసురుతోంది. లాలాపేట ఆసుప‌త్రి, గాంధీ ఆసుప‌త్రి, కింగ్ కోఠి ఆసుప‌త్రి ఎవ‌రూ అడ్మిట్ చేసుకోలేదు. అంద‌రూ క‌రోనా లక్ష‌ణాలు వున్నాయ‌ని నిర్ధారించారు కానీ పేషంట్‌ను జాగ్ర‌త్త‌గా డీల్ చేయ‌లేదు. కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు వ‌దిలాడు. హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తూ నారాయణగూడ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద పడిపోయి ప్రాణాలు వ‌దిలాడు. నేపాల్‌కు చెందిన ఈ 70 ఏళ్ల బహదూర్ లాలాపేటలోని ఓ బార్‌లో పని చేస్తాడు. జలుబు, దగ్గు కారణంగా లాలాపేట హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా అనే అనుమానంతో గాంధీ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు. జలుబు, దగ్గుతో బాధపడుతూనే బహదూర్ గాంధీ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ అతడ్ని కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లమని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి కింగ్ కోఠీకి వెళ్ళాడు. కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పిటల్‌లో చేర్చుకోలేమని అక్క‌డి వైద్యులు స్పష్టం చేశారు. అంబులెన్స్ సమకూరుస్తామని చెప్పడంతో చాలా సేపటి వరకు ఆయన అక్కడే నిరీక్షించాడు. ఎంతకీ అంబులెన్స్ రాలేదు. మళ్లీ నడుచుకుంటూ గాంధీ హాస్పిటల్‌కు తిరిగి బయల్దేరాడు. గాంధీకి తిరిగొస్తూ మార్గం మధ్యలో నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద కుప్పకూలి పోయాడు. అక్క‌డే రోడ్డుపైన ప్రాణాలు వ‌దిలాడు. గురువారం రాత్రంతా మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. శుక్ర‌వారం తెల్ల‌వారుఝామున రోడ్డుపై అటుగా వెళ్తున్న వారు రోడ్డుపై ఓ వ్యక్తి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం దగ్గర కింగ్ కోఠీ హాస్పిటల్ పత్రాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. మృతదేహం నుంచి శాంపిళ్లను సేకరించిన వైద్య సిబ్బంది పరీక్షలకు పంపారు. ఈ వృధ్ధుడి మృతికి ఎవ‌రిది నిర్ల‌క్ష్యం. ఇత‌ని ద్వారా ఎంత మందికి క‌రోనా వ్యాపించి వుండ‌వ‌చ్చు. తెలంగాణా ప్ర‌భుత్వం దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంటుందా?

ఆయన 'సెంట్రల్' పవర్ చూపించారు మరి...

* చెప్పా పెట్టకుండా, ఏ. పి . సరిహద్దులు దాటిన సిపిడిసిఎల్  సి.ఎం.డి. పద్మా జనార్దన్ రెడ్డి  * విస్మయం వ్యక్తం చేసిన సచివాలయం వర్గాలు  అందరికీ ఒక రూలు...అయ్యవారికో రూలు అన్నట్టుంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( సి పి డి సి ఎల్ ) చైర్మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి ఎం డి) జె పద్మా జనార్దన్ రెడ్డి చెప్పా పెట్టకుండా, రాష్ట్ర సరిహద్దులు దాటేశారని ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సంఘాలు చెవులు కోరుకుంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార వాహనంలో నిన్న ( గురువారం) మధ్యాహ్నం 3నుండి4గంటల మద్యలో గరికపాడు దగ్గర, ఆంద్రప్రదేశ్ బోర్డర్ దాటి తెలంగాణ కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం లాక్ డౌన్లో విధులు నిర్వహించవలసిన సి. యమ్. డి విధులకు గైరు హాజరవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  ఒక పక్క ఐ ఏ ఎస్ లు, ఐ పి ఎస్ లు, ఇంకా గ్రూప్ వన్ అధికారులందరూ ఎక్కడిక్కడ కరోనా అత్యవసర విధుల్లో ఉంటె, ఎవరి అండ చూసుకుని సి ఎం డి పద్మా జనార్దన్ రెడ్డి ఇలా రాష్ట్ర సరిహద్దులు దాటారని సచివాలయం అధికారులు కూడా అనుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పద్మా జనార్దన్ రెడ్డి ,  స్థానిక విద్యుత్ శాఖ ఉద్యోగుల సహకారం తో లోకల్ పోలీసులను మేనేజ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కొందరు సి పి డి సి ఎల్ అధికారులు ఈ విషయం తీసుకెళ్లారని కూడా విద్యుత్ సంఘాల నాయకులు అంటున్నారు.

ఏపీలో ఒక్కరోజే 16 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ కోవిడ్-19 నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 381 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 7 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 5 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో 2 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా వల్ల ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 365 మందికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం 15, చిత్తూరు 20, తూ.గో. 17, గుంటూరు 58, కడప 29, కృష్ణా 35, కర్నూలు 77, నెల్లూరు 48, ప్రకాశం 40, విశాఖ 20, ప.గో. జిల్లాలో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

గవర్నర్ కు నాయుడు ఈ-మెయిల్ 

* ఏమిటీ ఆర్డినెన్స్, తక్షణం ఆపేయండి  ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ని తొలగించడం సరికాదని పేర్కొంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు, ఈ సమయంలో ఆడ్డదారిన ఎస్‌ఈసీని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అర్ధాంతరంగా కమిషనర్‌ను మార్చడం అనైతికం, చట్టవిరుద్ధమన్నారు. ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిసిన తర్వాతే అమలు చేయాలి. తాజా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఈ-మెయిల్‌ ద్వారా గవర్నర్‌కు పంపిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

సిద్దప్పా.... అన్నీ మనకు తెలియాలని లేదు....

* మనకు తెలిసిందల్లా జ్ఞానమూ కాదు ....  * అప్పుడప్పుడూ ఎనస్తీష్టుల మాటలూ వినాలి మరి! ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదని ఒక సామెత అచ్చు గుద్దినట్టు సరిపోతుంది ఆ జర్నలిస్టుకు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనమిది. మనకు తెలీని సబ్జెక్టు లో వేలుపెడితే, దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందనే విషయం ఇప్పుడు ఆయనకు బోధపడింది. వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం పేరు మోసిన ఒక టీ వీ ప్రెజెంటర్ తన డిబేట్ లో -ఎనస్తీష్ట్ ల గురించి, తనకున్న విజ్ఞానాన్ని ఆడియెన్స్ కు పంచడం, వైద్య, ఆరోగ్య రంగ ప్రముఖులకు కావలసినంత వినోదం పంచింది.  ఆ జర్నలిస్ట్  ఒక అనస్థీసియా డాక్టరుతో మాట్లాడుతూ,  ఆపరేషన్ థియేటర్లలో మత్తు మందు ఇచ్చే మీకు మాస్కుల అవసరం ఎందుకని అడగటం వారిని విస్మయపరిచింది. అంతకుమించి ఏ పని చేయని మీకు మాస్కులు అవసరమే లేదు అనే తీరుగా మాట్లాడుతున్నాడు. పైగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు ?. అని అడగటం కూడా మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరికీ జన్మవైరం ఏదైనా ఉంటే ఉండనీ గానీ‌, అనెస్థీషియా ఇచ్చే డాక్టరుకు ఏమీ పనే ఉండదు అనేలా మాట్లాడిన ఆయనకు అనెస్థీషియా అంటే ఏమిటో ఆ డాక్టర్లు ఏమి చేస్తారో అణువంత కూడా అవగాహన లేదని స్పష్టమైందని డాక్టర్లు అన్నారు.  ఏదో మత్తుమందు ఒక సూదిలో ఇచ్చి పక్కన కూర్చోవడం కాదు అనెస్థీషియా అంటే. ఒక పేషంట్ కి ఆపరేషన్ చేయాలి అని సర్జన్ డిసైడ్ చేసిన మరుక్షణమే అనెస్థెటిస్ట్ పని మొదలౌతుంది. అసలు ప్రతీ ఆపరేషన్ చేయబోయే పేషంట్ నీ అనెస్థీటిస్ట్ చెక్ చేయడం ఉంటుంది. దాన్ని PAC అంటారు. Pre anesthetic consultation. అంటే అసలు ఆ పేషంట్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్య పరంగా అర్హుడేనా అనేది చూస్తారు. శరీరంలోని గుండే ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అన్ని రకాల వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అవసరం అనుకుంటే, సంబంధిత వైద్యుని ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అంతా బాగుందనుకుంటేనే సర్జరీ చేసుకోవచ్చని fit for surgery అని రాస్తాడు అనెస్థెటిస్ట్. అంటే సర్జరీ జరగాలంటే ముందు అనెస్థీషియా డాక్టరు ఒప్పుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ పేషంట్ కి ఎలాంటి మత్తు మందు ఇవ్వాలి ఏ విధానంలో ఇవ్వాలి ఎంత డోసులో ఇవ్వాలి ఇత్యాదివన్నీ చూసేది అనెస్థెటిస్ట్. ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ బీపీ పల్స్ ఆక్సిజన్ శాతం అన్నీ కూడా మానిటర్ చేసేది అనెస్థెటిస్ట్. ప్రతీ నిముష నిముషం బీపీని చెక్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేస్తున్నపుడు పేషంట్ బీపీ పడిపోతున్నా, పల్స్ పడిపోతున్నా ఎప్పటికప్పుడు అలర్ట్ అయి వాటిని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ సకల ఎమర్జెన్సీ మందులతో రెడీగా ఉంటూ సర్జరీ సక్సెస్ కావడానికి దోహదపడతాడు. సర్జన్ నిరంతరాయంగా సర్జరీ చేయాలంటే అనెస్థెటిస్ట్ పక్కన ప్రతీ విషయాన్నీ సక్రమంగా మానిటర్ చేస్తూ నడపాల్సి ఉంటుంది. సర్జరీ చేసేటపుడు పేషంట్ కార్డియాక్ అరెస్ట్ ఐతే...సెకన్లలో అతడి ప్రాణాలను కాపాడగలిగేవాడే అనెస్థెటిస్ట్. అంతే కాకుండా ఏ పేషంట్ కి సీరియస్ గా ఉన్నా మొదట చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ABCs అంటారు. Airway , Breathing, circulation. అంటే ఇపుడు అకస్మాత్తుగా ఒక పేషంట్ నిలబడుకున్నవాడు నిలబడుకున్నట్లే కుప్పకూలాడనుకుందాం. అతడిని బతికించాలంటే మన ఊపిరితిత్తుల లోకి గాలి పోవాలి‌, అతడి రక్త సరఫరా ఆగకూడదు. ఈ రెంటినీ సెకన్లలో అమర్చగలిగే వాడు అనెస్థెటిస్ట్. ఊపిరితిత్తుల లోకి డైరెక్ట్ గా గాలి పోవాలంటే గొంతు ద్వారా గొట్టం వేయాల్సి ఉంటుంది..endotracheal tube అంటారు. మామూలుగా డాక్టర్లు ఈ ట్యూబ్ వేయడంలో కష్ట పడవలసి ఉంటుంది. గొంతు చిన్నగా లావుగా ఉన్న వ్యక్తులలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టమైతే అంత లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతే అంత బతికే అవకాశాలు తగ్గిపోతాయి. అటువంటి సమయాల్లో ప్రతీ ఒక్క క్షణమూ విలువైనదే. మామూలుగా డాక్టర్లు ముప్పై సెకన్లనుంచి ఒక నిమిషం లోపల గొట్టం వేయగలిగితే ఒక అనెస్థెటిస్ట్ పది సెకన్ల లోపలే వేయగలడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ తరువాత దానిని వెంటిలేటర్ కి అనుసంధానం చేసి ఏయే పేషంట్ కి ఏ రకమైన వెంటిలేటర్ సెట్టింగులు పెట్టాలి అనేది కూడా అనెస్థెటిస్టే నిర్ణయించి ఆ సెట్టింగులను అమరుస్తాడు. అనెస్థెటిస్ట్ లు కొంత కోపంగా దురుసుగా ఉన్నట్టు అరుస్తూ ఉన్నట్టు కనబడతారు. కానీ వాళ్ళు పర్ఫెక్షనిస్టులు. ముఖ్యంగా పేషంట్ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళ దురుసుతనమే వాళ్ళ వేగాన్ని పర్ఫెక్షన్ ని తెలుపుతుంది. ఆసుపత్రులలో ఎవరైనా ఒక పేషంట్ సడన్ గా కొలాప్స్ ఐతే ఒక టీం ఆఫ్ డాక్టర్లు పరిగెత్తుతూ వస్తుంటారు. ఒక అనెస్థెటిస్ట్ ఒక పల్మోనాలజిస్టు‌, ఒక కార్డియాలజిస్టు, ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరూ, ఓ ఇద్దరు ముగ్గురు సిస్టర్లూ మొదలైనవారు. ఆ సమయంలో పేషంట్ ని కాపాడటానికి అవసరమైన అన్ని మందులూ‌ వెంటిలేటర్లూ మానిటర్లూ డీఫిబ్రిలేటర్లూ అన్నీ క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాయి. కానీ ఇంత టీంని లీడ్ చేసేది మాత్రం అనెస్థెటిస్ట్. ఎవరి పనులను వాళ్ళకు పురమాయిస్తూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. గొంతులోకీ గొట్టం వేయడం ద్వారా AIRWAY ని, గొంతు రక్తనాళాల్లోకి పైపు వేయడం ద్వారా BLOOD CIRCULATION ని డాక్టర్ల గ్రిప్ లోకి తెచ్చుకోవడం మొదటి మెట్టు. దానిని మొట్టమొదట సెకన్ల వ్యవధిలో సాధించగలిగేవాడే అనెస్థెటిస్ట్. ఇంత ప్రాసెస్ లో ఒక టీం లీడర్ గా అప్పటికప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం గ్రిప్ లో పెట్టుకుంటాడు. ఇదంతా స్పాంటేనియస్ గా సహజంగా చేయగలగటమే అతడి ప్రతిభ. అతడు అలర్ట్గా పర్ఫెక్ట్ గా ఉండటమే కాక చుట్టూ ఉన్నవారిలో కూడా అంతే అలర్ట్ నీ పర్ఫెక్షన్ నీ డిమాండ్ చేస్తాడు. బయటివాళ్ళకు అది అరోగాన్సీ లాగా కనిపిస్తుంది. కానీ తోటి డాక్టర్లకు అది పర్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ చుట్టు ఉన్న స్టాఫ్ లో ఈ పర్ఫెక్షన్ కనపడకపోతే తిట్టడం కోపగించుకోవడమూ ఉంటుంది. ఐతే అది వ్యక్తి మీద కోపం కాదు...పేషంట్ ని బతికించుకోవడంలోని ఆత్రుత. ఆ సమయంలో అనెస్థెటిస్ట్ అక్కడ ఉండటం ఆ పేషంట్ చేసుకున్న అదృష్టంగా కూడా మారుతుంటుంది ఒక్కోసారి. కోవిడ్ వంటి జబ్బు తీవ్ర దశకు చేరేకొద్దీ వెంటిలేటర్స్ మీద పేషంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతి ఎక్కువగా వైరస్ లు ఒక వ్యక్తినుంచి మరొక వ్యక్తికి పాకేది ఇలా గొంతులోకి గొట్టం వేస్తున్నపుడే. పేషంట్ oral cavity లోకి డైరెక్ట్ గా ముఖం పెట్టాల్సి ఉంటుంది అనెస్థెటిస్ట్. కాబట్టి హాస్పిటల్ లో అడ్మిట్ ఐన పేషంట్లనుంచి డాక్టర్లకు వైరస్ పాకేది ఉంటే అతి ఎక్కువ రిస్క్ ఉన్నది అనెస్థెటిస్ట్ లకే. ఏ హాస్పిటల్ పర్ఫెక్ట్ గా నడవాలన్నా ఇరవైనాలుగు గంటలు అనెస్థెటిస్ట్ సర్వీసులు అవసరం. అనెస్థెటిస్ట్ లేని హాస్పిటల్ లలో ఎమర్జెన్సీ కేసులు తీసుకునే అవకాశమే ఉండదు. అలా వైద్య రంగానికి పిల్లర్ వంటి ఒక అనెస్థెటిస్ట్ ని అవమానిస్తూ...నీకేమి పని ఉండదు అనే అర్థం వచ్చేలా ఒక జర్నలిస్ట్ మాట్లాడటం అంటే అది ఆ ఒక వ్యక్తినే కాదు అనెస్థీషియా అనే గొప్ప వైద్య విధానాన్నే అవమానించినట్టు. దానికి క్షమాపణ చెప్పాలని మనం కోరుకోవడంలో అర్థం కూడా ఉండదు...!. కానీ ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో అనెస్థెటిస్ట్ లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరెందరి జీవితాల్నో బాగు చెస్తున్నారు. వాళ్ళందరి సేవలూ ఆ జర్నలిస్ట్ కు తెలియకపోయినా పెద్ద నష్టమేమీ లేదనీ,  కానీ సామాన్యులకు ఇవన్నీ తెలియాలనీ  డాక్టర్ విరించి విరివింటి తన సోషల్ మీడియా లో చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు దీనికిరాష్ట్ర న్యాయ శాఖా కూడా ఆమోదం తెల్పింది. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం  మూడేళ్లు గడచి పోయిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖా ఆదేశాలు ఇచ్చింది.  జీఓ 31 న్యాయ శాఖా 617, 618 పంచాయతీరాజ్ శాఖా ఇచ్చాయి. ఇక్కడ తొలగింపు అనడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.  అయితే, ఆర్టికిల్ 243K ప్రకారం ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ అపాయింట్ చేస్తారు. మన రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు జడ్జి స్థాయి కల్పించారు. ఒకసారి నియమించిన తరువాత సుప్రీం కోర్ట్ స్థాయి జడ్జి అనుమతి లేనిదే అతని పదవీకాలం కుదించడం గానీ, అర్హతలను మార్చడం గానీ చేయరాదు. ఇప్పుడు ఏ పీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ నిబంధనలన్నింటినీ అతిక్రమించే రీతిలో కథ నడిపించారని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఏ చట్టం ద్వారా అయితే ఎన్నికల కమిషనర్ నియమించబడ్డారో, ఆ చట్టాన్ని మారిస్తే గనుక ఇది సాధ్యం అయ్యే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం. చట్టం తీసుకురావాలంటే సభ కొలువుదీరాలి, మండలి ఆమోదించాలి, ఇవన్నీ జరగవు కాబట్టి ప్రభుత్వం ఆర్డినెన్సు విడుదల చేసింది. అయితే, ఈ ఆర్డినెన్సు కోర్టులో చెల్లుతుందా అనేది వేచి చూడాలి.

లాక్ డౌన్ పొడగింపు మీద బోస్టన్ నివేదిక..

లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు అనే విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జూన్ వరకు లాక్ డౌన్‌ పొడిగించే ఉద్దేశంతో ఉందా.. ప్రపంచ ప్రసిద్ధ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తాజా నివేదిక ప్రకారం ఈవిషయం నిజమేననిపిస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు అని బీసీజీ నివేదికలో తెలుపడం సంచలనం కలిగిస్తోంది.  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే కేంద్రం కొన్ని సంకేతాలు ఇస్తోంది. మరో వైపు కేంద్రం నిర్ణయంతో సంభందం లేకుండా ఒడిశా, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పోదిగించాయి.  అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు, మరోవైపు కోవిడ్‌ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది.  ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా.. అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్‌, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రిపోర్టు భారత్‌ను మరింత వణికిస్తోంది. ఈ అత్యంత తాజా రిపోర్టులో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏమని చెప్పిందంటే.. ‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీజీ నివేదికపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిస్తారని కొందరు అభిప్రాయపడుతుండా... ప్రాంతాలు, వైరస్‌ ప్రభావాన్ని బట్టి దీనిపై కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.  కాగా దేశంలో వైరస్‌ తొలిదశలో ఉన్న సమయంలోనే మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6412కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 199 మంది మృతి చెందారు. ఇతరదేశాలతో పోలిస్తే భారత్‌లో కోవిడ్ 19 వైరస్ ముసలివారికి కాకుండా యువతకు సోకుతుండటం మరింత భీతి కలిగిస్తోంది.

అవి కరోనా కిట్లా.. టీబీ కిట్లా...

విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి రాపిడ్ కరోనా నిర్ధారణ కిట్స్ తయారు అయ్యాయి అని ప్రస్తుతానికి 1000 కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు. ఈ కిట్స్ తో కేవలం 55 నిమిషాల్లోనే వ్యాధినిర్ధారణ జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఈ కిట్స్ ను ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆవిష్కరింప చేశారు. మొత్తం వ్యవహారంలో దాగున్న అసలు విషయమేంటి? అసలు విశాఖలో ఉన్న మెడ్ టెక్ జోన్లో కరోనా నిర్ధారణ కిట్స్ తయారు చేసే సామర్ధ్యమున్న కంపెనీలు ఉన్నాయా? అందుబాటులోకి తెచ్చాము అని చెప్తున్న ఈ కిట్స్ ఇక్కడ తయారు అయినవేనా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నాధుడు లేడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మాల్ బయో సంస్థ బెంగుళూరు నుంచి కిట్స్ తయారీకి అవసరమైన విడి భాగాలను దిగుమతి చేసుకుని మెడ్ టెక్ జోన్ లోని త్రీడీ ప్రింటింగ్ లాబొరేటరీలో పాక్షికంగా మార్పులు చేసి తిరిగి బెంగుళూరు పంపించి, అక్కడ కొన్ని అవసరమైన మార్పులు చేర్పులు చేసి మరలా గోవా చేర్చి అక్కడ పూర్తిస్థాయిలో కిట్స్ గా మార్చిన తర్వాత, మరోసారి బెంగుళూరులో టెస్టింగ్ జరిగిన తదుపరి చివరిగా మెడ్ టెక్ జోన్ కు చేరుకొని ఇక్కడే తయారు అవుతున్నట్టుగా చూపబడుతున్నాయి. ఈ మొత్తం కిట్స్ తయారీ వ్యవహారంలో మెడ్ టెక్ జోన్ పాత్ర కేవలం 15 శాతం మాత్రమె. ఈ పనిని కూడా మెడ్ టెక్ జోన్ లోని అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది చేయడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం మాల్ బయో సంస్థ తయారు చేసిన కరోనా నిర్ధారణ కిట్స్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ తిరస్కరించింది. అందుకోసం బెంగుళూరు మెడికల్ కాలేజీలోని విక్టోరియా హాస్పటల్ ద్వారా ఈ కిట్స్ కరోనా నిర్ధారణకు పనికొస్తాయని సర్టిఫికేట్ ఇప్పించుకున్నారు. కానీ విక్టోరియా మెడికల్ కాలేజీ ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.  మెడ్ టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ గతంలో ఈ మాల్ బయో సంస్థకు ఆంధ్రప్రదేశ్ లో టీబీ నిర్ధారణ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. వాటినే కొంచం అభివృద్ధి చేసి కరోనా నిర్ధారణ కిట్స్ గా వాడుతున్నారు. ఈ విషయాన్ని మొన్న ముఖ్యమంత్రి ఆవిష్కరించిన కిట్లమీద 2019లో తయారు చేసినట్టుగా ముద్రించి ఉండడం స్పష్టం చేసింది కూడా. మాల్ బయో సంస్థకు మెడ్ టెక్ జోన్లో ఎటువంటి తయారీ యూనిట్ లేకపోవడం విశేషం. పూర్తిగా గోవా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడే తయారు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎవరైనా మెడ్ టెక్ జోన్ ను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తే కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. ఏపీ మెడ్ టెక్ జోన్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకూ ఒక్క కంపెనీ కూడా పూర్తి సామర్ధ్యంతో వైద్య పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పలేదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా మెడ్ టెక్ జోన్లో ఇంతవరకూ ఉనికి కూడా లేని మాల్ బయో సంస్థ ఇక్కడ కరోనా నిర్ధారణ కిట్స్ తయారు చేస్తోందని చెప్పడం దేనికి సంకేతం.  ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న మెడ్ టెక్ జోన్ మరియు ప్రస్తుత సిఈఓ & ఎండీ, పూర్వపు ఏపీ ఆరోగ్య సలహాదారు జితేంద్ర శర్మ ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో కూడా మరో కుంబకోణానికి తెరలేపారని ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యం అత్యంత ప్రమాదంలో ఉన్న ఇలాంటి సమయంలోనూ వీరు అవకాశాలను వెతుక్కోవడం మంచిది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ ద్వారా మాల్ బయో అనే సంస్థకు కరోనా నిర్ధారణ కిట్స్ తయారు చేసె బాధ్యత అప్పగించింది. వాళ్ళు కిట్స్ అందించడం మొదలుపెట్టారు.  ఈ కిట్స్ ద్వారా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంపిల్స్ ను మరలా ఎపీలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన 4 ల్యాబ్స్ కు కానీ, పూణే లోని ల్యాబుకు కానీ పంపించి మరోసారి పరీక్ష జరిపించినట్లయితే ఈ మాల్ బయో సంస్థ అనిదించిన కిట్స్ పనితీరు తెలుసుకునే ఆస్కారం ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తీరిక స‌మ‌యంలో మాస్కులు తయారు చేస్తున్నార‌ట‌!

ముఖ్యంగా మహిళలు వంటలు, కుట్లు , అల్లికల్లో బిజీగా ఉంటారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆసక్తికర విషయం వెల్లడించారు. ప్రస్తుతం కరోనాని అరికట్టే మార్గాల్లో ఒకటి ముఖానికి మాస్క్ పెట్టుకోవడం. చేతులు శుభ్రంగా కడగడం.. శానిటైజర్లు వాడటం అని తెలిసిందే. అయితే మంత్రి గారి సతీమణి కావ్య ఇంట్లో తీరిక సమయాల్లో కరోనా మాస్కులు తయారుచేస్తున్నార‌ట‌. ఈ విష‌యం మంత్రి గారే తెలిపారు. అందరికీ మాస్కులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆమె మాస్కుల తయారీ చేపట్టిందని వివరించారు. ఇంట్లో మాస్కులు తయారు చేసి అవసరం ఉన్నవారికి అందజేస్తున్నామని.. ఇది ఎంతో మందికి మేలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన కరోనా వ్యాప్తిని చాలా వరకు కట్టడి అయ్యేలా చేశారని.. భారత ప్రధాని నిర్వహిస్తున్న పనులు.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అంతే కాదు ఆయనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి కుటుంబం ముందకొచ్చి మాస్కుల తయారీలో పాలుపంచుకోవాలని సూచించారు. అంతేకాదు, తన భార్య కావ్య మాస్కులు తయారు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ఖజానా ఖాళీ

ఒకవైపు కరోనా నివారణ చర్యలు.. తెల్ల రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయల పంపిణీతో ఏపీ ప్రభుత్వ ఖజానా వెలవెలబోతోంది. నగదు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయింది. గత ఏడాదిలో రూ.77వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కరోనా దెబ్బ గట్టిగా పడింది. దీంతో రాబడి లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్.. తదితర రంగాల నుంచి పైసా పుట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి.  అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాల హామీల్లో భాగంగా అందిస్తున్న పింఛన్లు, ఆసరా సహా పలు కీలక పథకాలకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. దీంతో.. కేంద్ర పన్నుల వాటా, రుణాలు సహా ఇతర మార్గాల ద్వారా నిధులను సమీకరించుకోవడంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. అటు.. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణాన్ని సమీకరించింది. సెక్యూరిటీల వేలం కోసం ప్రయత్నించగా రిజర్వు బ్యాంకు నుంచి 11 ఏళ్ల కాలానికి 7.98 శాతం వడ్డీ కింద రూ.1000 కోట్ల అప్పు చేసింది. కరోనా కారణంగా ఆదాయం సమకూరే రంగాల నుంచి ఆదాయం రావడం లేదు. అన్ని రంగాలూ కుదేలయ్యాయి. ప్రభుత్వ ఖజానా నుంచి వివిధ పద్దులకు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన వివిధ బకాయిలు ఇప్పుడే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రుణాల కోసం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలీసు అత్యుత్సాహం తో పోయిన ప్రాణం

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం లో కానిస్టేబుల్ అత్యుత్సాహం వల్ల రాయపూడి లో ఓ వ్యక్తి మృతి చెందాడు. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పొలీసులను చూసి, గ్రామస్తులు పొలాల్లో కి పరుగు తీశారు. గ్రామస్తులు. పొలాల్లో గ్రామస్తుల వెంట పడ్డ  రామయ్య అనే కానిస్టేబుల్. పోలీసులు వస్తున్నారన్న భయంతో పొలాల్లోకి పరుగు తీస్తూ ,క్రిందపడి చనిపోయిన షేక్.జాఫర్ (55). జాఫర్ గత కొంత కాలంగా గుండె జబ్బుతో ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ భయపడటం వాలే వల్లే జాఫర్ చనిపోయాడని తెలిపిన తోటి సహచరులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  తుళ్ళూరు సీఐ శరత్ బాబు చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయండి! వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈటెల

తెలంగాణలో 8500 మందికి పరీక్షిస్తే 471 మందికి పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ BRKR భవన్ నుండి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని, అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలను కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని ఈ సంద‌ర్భంగా ఈటెల‌ కోరారు.  వెంటిలేటర్ లు, ఇతర వైద్య పరికరాలు ECIL, DRDO లాంటి సంస్థల్లో తయారుచేసి ప్రభుత్వాలకు అందజేయాలని కోరిన మంత్రి ఈటల రాజేందర్. N-95 మాస్కులు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.  వైద్య పరికరాలు మరియు కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలని మంత్రి ఈటల కోరారు.  ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు అని, ఇక్కడ వచ్చిన పాజిటివ్ కేసుల్లో 85% మర్కజ్ నుండి వచ్చినవే, ఇవి తగ్గితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని కేంద్ర మంత్రి కి తెలిపిన ఈటల రాజేందర్.  తెలంగాణ లో ఇప్పటికీ 8500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలింది. 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా , 12 మంది చనిపోయినట్లు తెలిపారు. లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.

కీల‌క‌పాత్ర పోషిస్తున్న ముగ్గురు మహిళాధికారులు!

క‌రోనాపై జ‌రుగుతున్న పోరాటంలో మ‌న‌దేశంలో ముగ్గురు మ‌హిళ‌లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఐఎఎస్ అధికారిణి ప్రీతి సుడాన్. ప్రీతి సుడాన్ ఢిల్లీలో హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడ‌ర్‌కు చెందిన ఈ ఐఎఎస్‌ ఆఫీసర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ తో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు.  ప్రీతి సుడాన్ నూజివీడు స‌బ్ క‌లెక్ట‌ర్ గా మొద‌టి పోస్టింగ్ లో ప‌నిచేశారు. ఆమె భర్త రణదీప్ సుడాన్, ఆయ‌న కూడా ఐఎఎస్ అధికారి. అదే సమయంలో విజయవాడ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. రెండూ ప్రక్కనే ఉన్న రెవెన్యూ డివిజన్లకు సబ్ క‌లెక్ట‌ర్‌లుగా పనిచేశారు. ఆ తరువాత ఆయన అప్ప‌ట్టి సిఎం చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా పనిచేశారు. అతను ఐటి నిపుణుడు మరియు చంద్రబాబు నాయుడుతో పాటు ఎపిలో ఐటి అభివృద్ధికి కీల‌క‌పాత్ర పోషించారు. ప్రీతి సుడాన్ తో పాటు డాక్టర్‌ నివేదిత గుప్త, సైంటిస్ట్ రేణు స్వరూప్ ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.  డాక్టర్ నివేదిత గుప్త స్వయంగా MBBS అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.  ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు.  డాక్టర్ రేణు స్వరూప్  జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన  ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు  ఎన్నో ప్రశంసలు పొందాయి.

ఏపీలో ఉద్యోగులు నోరు కుట్టుకుని పని చేయాలి..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో అన్ని దేశాల్లో ముందు వరుసలో పనిచేస్తున్న సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నారా? మీకు మాస్కులు లేకపోయినా, గ్లౌజులు ఇవ్వకపోయినా, పీపీఈ లు ఇవ్వకపోయినా బయటకు చెప్పొద్దు. పోలీసులు, మునిసిపాలిటీ సిబ్బంది, డాక్టర్లూ ఎవరైనా సరే. నోరు మూసుకుని పని చేయాల్సిందే. అలా కాకుండా బయటకు చెప్పారా? మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు. మాస్కులు లేవని, ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేవని చెప్పిన నర్సీపట్నం సీనియర్ వైద్యుడు డాక్టర్  సుధాకర్‌రావు ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు నగరి మున్సిపల్ కనిషనర్‍పై సస్పెన్షన్ వేటు వేసింది. నగరి మునిసిపల్ కమిషనర్ చేసిన తప్పల్లా ఒక్కటే తమకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా తాము ప్రజలకు సేవ చేస్తున్నామని. అదీ కూడా వేరే సందర్భంలో చెప్పారు. నగరిలో మాంసం దుకాణాలు మూసేయమని ఇచ్చిన తాకీదుపై కొందరు విమర్శలు చేస్తుంటే దానికి సమాధానంగా ఆయన మాట్లాడారు. కరోనా అంటే భయం లేకుండా తమ సిబ్బంది పని చేస్తున్నారని, తామే కాకుండా పోలీసులు కూడా అలానే పని చేస్తున్నారని, చేతికి గ్లౌజెస్ కూడా ఉండటం లేదని ఆయన అన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం నిందించలేదు. తాము చేస్తున్న సేవను మాత్రమే చెప్పారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం హర్ట్ అయింది. సస్పెండ్ చేసింది. నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్ సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారని భావించింది. వెంటనే సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని చెప్పింది. నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావును నియమించింది.