కరోనా ఎఫెక్ట్.. ఏపీ ఖజానా ఖాళీ
posted on Apr 10, 2020 @ 6:06PM
ఒకవైపు కరోనా నివారణ చర్యలు.. తెల్ల రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయల పంపిణీతో ఏపీ ప్రభుత్వ ఖజానా వెలవెలబోతోంది. నగదు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయింది. గత ఏడాదిలో రూ.77వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కరోనా దెబ్బ గట్టిగా పడింది. దీంతో రాబడి లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్.. తదితర రంగాల నుంచి పైసా పుట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి.
అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాల హామీల్లో భాగంగా అందిస్తున్న పింఛన్లు, ఆసరా సహా పలు కీలక పథకాలకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. దీంతో.. కేంద్ర పన్నుల వాటా, రుణాలు సహా ఇతర మార్గాల ద్వారా నిధులను సమీకరించుకోవడంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. అటు.. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణాన్ని సమీకరించింది. సెక్యూరిటీల వేలం కోసం ప్రయత్నించగా రిజర్వు బ్యాంకు నుంచి 11 ఏళ్ల కాలానికి 7.98 శాతం వడ్డీ కింద రూ.1000 కోట్ల అప్పు చేసింది.
కరోనా కారణంగా ఆదాయం సమకూరే రంగాల నుంచి ఆదాయం రావడం లేదు. అన్ని రంగాలూ కుదేలయ్యాయి. ప్రభుత్వ ఖజానా నుంచి వివిధ పద్దులకు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన వివిధ బకాయిలు ఇప్పుడే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రుణాల కోసం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.