నిమ్మగడ్డ కేసులో రిట్ పిటీషన్ దాఖలుకు రంగంలోకి దిగిన మాజీ అడ్వకేట్ జనరల్

తన పదవీ కాలం ఇంకా ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ డి.వి. సీతారామ్మూర్తి రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలిసింది. నేడు, రేపు కోర్టుకు సెలువులు రోజులు కావడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.  సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీ కాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించిన విషయం తెలిసిందే.

అమెరికాలో తెలుగువారు క్షేమం

అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వున్నారని తానా ఎక్జిక్యూటివ్ వై స్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి తెలిపారు. అమెరికాలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ క్షేమంగా ఉన్నారని, వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే తెలుగు వారందరినీ కోవిడ్-19 విషయంలో పూర్తిగా అలెర్ట్ చేశామని, కరోన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని భారత కాన్సులేట్లతో కలిసి వివరించి చెప్పామని అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 4 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు వున్నా కోవిడ్ -19 తీవ్రత న్యూ  జెర్సీ,న్యూ యార్క్ లలోనే అధికంగా ఉందని  పేర్కొన్నారు.  కరోనా విషయంలో తెలుగు వారు ఎవరికి వారు స్వీయ నిర్భందంలో ఉన్నారని అన్నారు. తెలుగు వారందరూ బయటకి రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని అమెరికన్ ప్రభుత్వం సూచించిన ప్రతీ నిబంధనను తెలుగు వారు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నేరుగా లాక్డౌన్ప్రకటించనప్పటికీ.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయిందని పేర్కొన్నారు. అమెరికాలో కోవిడ్ 19   వైద్య సేవలు అందిస్తున్న వారిలో తెలుగు వైద్యులు ఎక్కువమంది వున్నారని ..తానా వీరితో నిరంతరం టచ్లో ఉండటంతో మిగిలిన తెలుగు వారికి ఎప్పటికప్పుడు కరోనా తీవ్రత పై అవగాహన కల్పించడం సులభమవుతుందన్నారు.అమెరికన్ యూనివర్సిటీలలో హాస్టల్స్ మూసివేయడంతో అక్కడ  చదువుకొంటున్నతెలుగు  విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో వున్నా తెలుగు వారి ఇళ్లల్లో  వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. విజిటర్ పేరెంట్స్ ఈ కోవిడ్-19 వళ్ళ తిరిగి వెళ్ళలేనివాళ్ళకి మెడిసన్ పరంగా కావల్సిన సహాయం చేస్తున్నాము అని తెలిపారు. ఇళ్లలోనే ఉండిపోతున్న తెలుగు వారికి ఆధ్యాత్మిక ,సామాజిక అంశాలపై అవగహన కల్పించడానికి ,మనో వికాసానికి ,మానసిక స్థైర్యం కోసం వివిధ రంగాల ప్రముఖులతో వెబ్ నైర్ ద్వారా వర్చువల్ గా  ప్రసంగాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదే సమయంలో హెచ్ వన్ బి జాబ్స్ విషయంలో భవిష్యత్ ఎలా వుంటుందనే దానిపై తెలుగు వారిలో ఆందోళన నెలకొందని చెప్పారు.అందుకే బఫర్ పీరియడ్ ని పస్తుతం వున్న 60 రోజుల నుండి 180 రోజుల వరకు పొడిగించాలని అమెరికన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.  గతంలో (1982,2008) వచ్చిన ఆర్థిక మాంద్యం  కన్నా తీవ్రతరమైన  ఆర్థిక సంక్షోభం మరోసారి  వస్తుందన్నఆందోళన నెలకొందన్నారు.కోవిడ్ నుంచి కోలుకొన్నా ఆర్థిక సంక్షోభం దాటడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికన్ ప్రభుత్వం ప్రకటించిన రెండు ట్రిలియన్ డాల్లర్ల ప్యాకేజ్ ఇక్కడి తెలుగు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ వివరిస్తున్నామన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా సహాయక చర్యలు కు తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలు ప్రాంతాలలో మాస్క్లు లు ,శానిటైజెర్స్,పీ ఈ పీ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న డాక్టరు,హెల్త్ సిబ్బంది,పోలీస్,పారిశుధ్య సిబ్బందికి సహాయం చేసేందుకు తానా ఆధ్వర్యంలో  విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రభుత్వాలు సూచించిన నిభందనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దూరంగా ఈ మహమ్మారి వుంటుందనే విషయం గమనించాలని కోరారు.

ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలు తీసుకోండి: హైకోర్టు

కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. సంబంధిత వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం వివిధ అంశాలపై ఇటీవల విచారణ జరిపి ఉత్తర్వులిచ్చింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్‌ ఏర్పాటు చేసే అంశంపై వారంలో వివరాలు సమర్పించాలంది.బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో వ్యర్థాల్ని నిర్వీర్యం చేయాలని స్పష్టం చేసింది.  బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లవద్ద ప్రజలు సామాజిక దూరం పాటించే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఒకవేళ నిర్వహిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టంచేసింది.

గుంటూరు లో రేపు పూర్తి కర్ఫ్యూ

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేడు గుంటూరులో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి అని, గుంటూరులో మొత్తం 71 కేసులు నమోదు కాగా, గుంటూరులో 12 రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించామాన్నారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయం ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు మాత్రమేనన్నారు. బయటకు వచ్చే సమయంలో మాస్క్ లేకుంటే 1000 ఫైన్. పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేపు ఫుల్ కర్ఫ్యూ. మెడికల్ తప్ప... ఏ షాప్ మార్కెట్స్ వుండవన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజు మార్చి రోజు మాత్రమే ప్రజలు బయటకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రజలు హోం డెల్వరీ సద్వినియోగం చేసుకోవాలి. వారానికి సరి పడ సరుకులు కొనుక్కోవాలన్నరు. లాక్ డౌన్ వలన మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమాన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే 104 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలన్నారు. 350 కేసులు శాంపిల్ ఉన్నాయి.క్వారెంటైన్ లో ఉన్న వారికి 500 రూపాయలు ఇస్తున్నామన్నారు. ఢిల్లీ కాంటాక్ట్స్ వలనే కేసులు నమోదు.యువకుల్లో వారి శక్తి కొలది ఆలస్యంగా వైరస్ బయట పడుతుంది. ఇంట్లో ఉన్న పెద్ద వారు కోసం అయిన మాస్క్ ధరించాలి, దూరం పాటించాలన్నారు. ఏ ప్రార్థనలు మీటింగ్స్ అనుమతి లేదు నిర్వహించిన పక్షంలో అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్బన్ ఎస్సీ రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ చాలా వేగంగా పెరుగుతుంది. రెడ్ జోన్ ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు. రెడ్ జోన్ ప్రజల కోసం నిత్యావసర సరుకులను అందుబాటులోకి తెచ్చాము... వాకింగ్ కోసం కొంత మంది బయటకు వస్తున్నారు.వారికి బయటకు రాకుండా సూచనలు చేస్తున్నామ న్నారు. రూరల్ ఎస్పీ విజయ రావు మాట్లాడుతూ నరసరావుపేటలో  కేబుల్ కలెక్షన్ అతనికి కరోనా పాజిటివ్ అని తెలింది.ప్రజలు అందరు కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.

కల్లు కి వెసులుబాటు క‌ల్పించండి! ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కరోనా విషయంలో మనం మిగితా దేశాలతో పోలిస్తే మన దేశం మన రాష్ట్ర బెటర్ అండ్ సేఫ్ గా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతున్నారు. గ్రామీణా ప్రాంతాలు దేవునిదయ వల్ల అంత బనే ఉంది. పట్టణాల్లోనే అక్కడ అక్కడ కరోనా సంఘటనలు కనిపిస్తున్నాయ‌ట‌.  అయితే లాక్‌డౌన్ దెబ్బ‌తో వేరే జ‌బ్బుతో తెలంగాణా గ్రామీణ ప్ర‌జ‌లు కొంత మంది బాధ‌ప‌డుతున్న‌ర‌ని జ‌గ్గారెడ్డి అంటున్నారు. అదే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు కల్లు  తాగడం అలవాటు. కల్లు  ప్రస్తుతానికి లేకపోవడం వల్ల ఒక సెక్షన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారట‌. అంతే కాదు హాస్పిటల్ చేరుతున్నారు. ఈ జ‌బ్బుకు మెడిసిన్ లేదు. ఇలాంటి వారికీ  కల్లే  మెడిసిన్ అని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఓ డాక్ట‌ర్‌లా అలాంటి రోగుల‌కు మెడిసిన్‌గా క‌ల్లు ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.  కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో  కల్లు కి వెసులుబాటు ఇచ్చే అంశం పై ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా అని ప్ర‌భుత్వానికి ప్ర‌శ్నిస్తున్నారు?

ఏపీ లో 402 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా యాచకులు, నిరాశ్రయుల కోసం గాలింపు  ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు  402 కి చేరుకున్న దృష్ట్యా, ప్రభుత్వం నిబంధనలు తీవ్రతరం చేసింది.  యాచకులు, నిరాశ్రయులపై అధికారులు, పోలీసులు అన్ని చోట్ల ఫోకస్ మొదలెట్టారు.  బెజవాడలో  యాచకులు,  నిరాశ్రయుల కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు రోడ్లపై  జల్లెడ పడుతున్నారు. ఐదు బస్సుల ద్వారా 250  మందికి పైగా యాచకులను షెల్టర్ లకు తరలించిన పోలీసులు, విఎంసి అధికారులు. బస్సులు దూకి పారిపోతున్న యాచకులను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కిస్తున్న పోలీసులు. యాచకులు, నిరాశ్రయులకు  స్వచ్చంధ సంస్ధలు రోడ్లపైకి వస్తూ ఆహారం పంపిణీ చేస్తుండడంపై కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో బెజవాడ రోడ్లపై యాచకులను నిషేదించిన విఎమ్ సి. విజయవాడ పరిధిలో పది షెల్టర్ల లో యాచకులు, నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోజన వసతి తో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన విఎంసి అధికారులు. నగరంలో యాచకులు  కనబడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్న విఎమ్ సి అధికారులు.

ప్రపంచ పోలీస్ ప్యాంటు తడిపేసుకున్నాడు... చైనా చిన్నాన్న విషం చిమ్మాడు

అవును ఇది నిజం... అమెరికా నేడు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం కాదు. అలాగే, ప్రపంచ సంక్షేమం గురించి చైనా ఎప్పుడూ ఆలోచించదు. యూరోపియన్లు ప్రపంచంలో అంతా అనుకునేంత విద్యావంతులు కారు. యూరప్ లేదా అమెరికా వెళ్ళకుండా కూడా ప్రపంచంలోని ప్రజలు తమ సెలవులను ఎంతో ఆనందంగా గడపగలరు. భారతీయుల రోగ నిరోధక శక్తి ప్రపంచంలో చాలా దేశాల ప్రజల కంటే ఎంతో శక్తివంతమైనది. ఏ స్వామీజీ, పీఠాధిపతి, మతాధికారి, సిద్ధాంతి, జ్యోతిష్కుడు, పూజారి, రచయిత లాంటి వాళ్ళెవరూ ఒక్క రోగిని కూడా రక్షించలేరని తేలిపోయింది. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మాత్రమే నిజమైన హీరోలు... క్రికెటర్లు, సినీ తారలు మరియు ఫుట్‌బాల్ ఆటగాళ్ళు కేవలం సాధారణ వ్యక్తులు. ప్రపంచంలో వినియోగం లేకపోతే బంగారం, వజ్రాలకు కూడా ప్రాముఖ్యత తగ్గిపోతుందని తెలిసింది. ఈ ప్రపంచంలో తమకు కూడా మనుషుల్లాగానే బ్రతికే హక్కు ఉందని జంతువులు మరియు పక్షులు మొదటిసారి సంతోషించాయి. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ పనిని ఇంటి నుండే చేయవచ్చని నిరూపించారు. మనం, మన పిల్లలు 'జంక్ ఫుడ్' లేకుండా జీవించగలం అనే నమ్మకం కలిగింది.పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం ఏ మాత్రం కష్టమైన పని కాదు అనేది అందరికీ బుర్రకెక్కింది. అన్నం, కూర వండటం మహిళలు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా నేర్చుకుంటే  బాగుంటుందన్న భావన అందరికీ కలిగింది. మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించే చెత్తా చెదారం ప్రసారం చేయకుండా, పనికొచ్చే విషయాలను కూడా ప్రసారం చేయగలదని ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. భారతీయ మహిళల కారణంగా ఇంటిని ఆలయంగా ఎలా ఉంచుకోవాలో పరాయి దేశం నేర్చుకునేటట్టు చేసింది. డబ్బుకు విలువ లేదు, ఎందుకంటే ఈరోజు మీరు పులుసుతో అన్నం తిని కూడా బతకొచ్చు అనేది తెలుసుకున్నారు. భారతీయులు కుల, మత, ధనిక, పేద భేదాలతో ఎక్కువగా కీచులాడుకుంటారన్న ఇతర దేశాల అపోహ పటాపంచలు అయ్యింది. భారతీయుడు మాత్రమే క్లిష్టమైన సమయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలడని ప్రపంచ దేశాలతో ఎలుగెత్తి చాటబడింది.

అచ్చెన్నాయుడి ఆవిష్కరణ... కనగరాజ్ వయసు 84 ఏళ్ళు!

అచ్చెన్నాయుడు గారూ..మీరు సూపర్ సార్. అందరూ, కరోనా కి భయపడి చస్తుంటే, మీరు మాత్రం కనగరాజ్ గారి వయసు 84 ఏళ్ళు అనే నిజాన్ని ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించి, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యచకితం చేశారు. " సీఎం గారూ, అత్యధిక కరోనా కేసులున్న తమిళనాడు నుంచి  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ ఏపీకి ఎలా వచ్చారు? తెలంగాణ బోర్డ‌ర్‌లో వేలాదిమంది ఏపీవాళ్ల‌ు క్వారంటైన్‌కి వెళ్తామంటేనే రానిస్తామ‌న్న మీరు దీనికేమి స‌మాధానం చెబుతారు?," అంటూ మీరు ట్విట్టర్ లో విరుచుకుపడిన తీరును చూస్తే ముచ్చటేస్తోంది.  " కరోనాకోరల్లో చిక్కి రాష్ట్రం విలవిల్లాడుతోంది. పనుల్లేక కూలీలు, పంటలు అమ్మలేక రైతులు, స‌క‌ల‌వ‌ర్గాలు త‌మ‌ను ఆదుకోవాలంటూ చేస్తున్న ఆక్రందనలు మీకు వినపడవు. కరోనా వ్యాప్తి జరగకుండా ఎన్నికలు వాయిదావేసిన కమిషనర్ ని తొలగించేందుకు అత్యవసర ఆర్డినెన్స్, సెలవురోజుల్లో రహస్యజీవోలిచ్చారు. క‌రోనా ప్ర‌భావం వృద్ధుల‌పై ఎక్కువ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నా 84 ఏ‌ళ్ల కనగ‌రాజ్‌ని తీసుకొచ్చారు. ఆయ‌నేమైనా క‌రోనా క‌ట్ట‌డి చేసే శాస్త్ర వేత్తా? వైద్యుడా? బాధ్య‌త‌లు స్వీక‌రించేట‌ప్పుడు మాస్క్ కూడా పెట్టుకోని ఆయన రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాల‌తోనూ చెల‌గాటమాడుతున్నారు. స్వార్థయోజ‌నాల కోసం లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న మీరు, మీ మంత్రులు క్వారంటైన్ పాటిస్తున్న చంద్ర‌బాబును ద‌మ్ముంటే హైద‌రాబాద్ నుంచి ర‌మ్మంటున్నారు. పాలన చేతకాదని భేషరతుగా ఒప్పుకోండి. చంద్రబాబు వచ్చి పాలనంటే ఏంటో చూపిస్తారు," అంటూ మీరు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెడుగుడాడిన వైనం అయితే చూసే వాళ్లకి భలే కిక్కిచ్చింది.  మొన్నొక రోజు మీకు మల్లె, మీ సీనియర్ సహచరుడు యనమల రామకృష్ణుడు చెరిగిన నిప్పులతో పాటు, ఈ రోజు మీరు ట్విట్టర్ ద్వారా చేసిన నూతన ఆవిష్కరణలు కూడా -(అదేనండీ కనగరాజ్ వయసు 84 ఏళ్ళనీ, అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాస్క్ కట్టుకోలేదనీ ట్వీటారు గదా.. అ వన్న మాట..) టీ డీ పీ కార్యకర్తలతో పాటు, కరోనా కారణంగా ఖాళీగా ఉన్న బోలెడంత మంది ఔత్సాహికుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. మరిన్ని కొత్త ఆవిష్కరణలతో మీరు రోజూ ఇలానే ట్వీటాలని కోరుకుంటున్నారు జనం. వాళ్ళ ముచ్చట తీర్చడం మానకండి అచ్చెన్నాయుడు గారూ.

నిర్బంధ కాలాన్ని నమోదు చేసిన పదమూడేళ్ళ అమ్మాయి కధ

దాదాపుగా అందరమూ ఒక గూటిలో ఉండగలుగుతున్నాం. తింటూ, కాసేపు కునుకు తీస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కరోన భయంలో మరింత దైవ చింతనలో ఉంటూ, రేపటి గురించిన చింతతో మొత్తానికి గడిపేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి, చవకగా డేటా కూడా దొరికింది కాబట్టి ఏదో ఆసక్తి కలిగించేదో చూసే/చేసే అవకాశం దొరికింది.  కానీ కాలం గడిచే కొద్దీ ఒక విసుగు... ఎప్పుడు బయటపడతామా అని ఆలోచనలు. కానీ ఒక అనివార్యమైన సుదీర్ఘ కాలం ఇప్పటిలా 6 గంటల నుంచి 9 గంటల వరకు మనకు కావలసినవి దొరికేల కాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని ఉహించండి. భయమేస్తోంది కదా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దాదాపుగా యూరోప్  అంతటా హిట్లర్ నాజీ సైన్యం యూదులపై జరిపిన జాతి హననము ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక విషాద ఘట్టం.  ఈ నేపద్యంలో ఒక పదమూడేళ్ల అమ్మాయి తన కుటుంబంతో సహా దాదాపుగా రెండేళ్ల పైబడి హిట్లర్ రహస్య సైనిక విభాగం గెస్తపో నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని నమోదు చేసుకున్న ఒక సాక్ష్యం "the diary of Anne frank".   రెండేళ్లపాటు కుటుంబమంతా ఒక చీకటి గుహ లాంటి ఆఫీస్ క్రింద భాగాన్ని మరో కుటుంబంతో కలిసి జీవించడాన్ని ఉహించండి. విభిన్న మనస్తత్వాలు కల్గిన వ్యక్తులు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందన్న స్పృహతో సేకరించి పెట్టుకున్న అతి తక్కువ ఆహార పదార్ధాలు తో చీమ చిటుక్కుమంటే భయం, లోగొంతుకతో తప్ప మాట్లాడుకోలేని పరిస్థితుల్లో అజ్ఞాతంలో గడపడాన్ని ఉహించండి. ఇంత దుర్భర పరిస్థితుల్లో తమకు తాము మంచే జరుగుతుందన్న ఆశను కోల్పోకుండా రోజులను గడపడాన్ని పదమూడేళ్ళ అమ్మాయి తన డైరీ "kitty" తో చెప్పుకుంటూ రాసుకుంది.  రెండేళ్ళ తర్వాత అందరూ పట్టుబడేంతవరకు అన్నే ఫ్రాంక్ రాసుకున్న డైరీ అప్పటి జాతి హనన పరిస్థితులకు సాక్ష్యంగా నిలిచింది.  దురదృష్టవశాత్తు అన్నే ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మినహా మరెవ్వరూ హిట్లర్ నుంచి తప్పించుకోలేక పోయారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్ళను నిర్బంధంలోకి తీసుకునేప్పుడు ఏదో పనికిమాలిన పేపర్లుగా భావించి అదొక సాక్ష్యమే కాదన్నట్లుగా వదిలేసిన డైరీ ఒక గొప్ప సాక్ష్యంగా చరిత్రలో మిగిలింది. అన్నే ఫ్రాంక్ తండ్రి విడుదలైన తర్వాత ఈ డైరీ ని ప్రచురించడం జరిగింది. తర్వాత అనేక ప్రచురణలు పొందడం, ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువాదం పొందడం, సినిమాలుగానూ, టెలిఫిల్మ్స్ గానూ రావడం జరిగింది.  ఈ స్వీయ నిర్బంధ కాలంలో ఈ పుస్తకాన్ని చదవడం ఒక ఓదార్పు మనకు. ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకోవడం లాంటిది. ముఖ్యంగా పడమూడేళ్ళ అమ్మాయి ఆలోచనల్లోంచి ఒక సంక్షోభ కాలాన్ని చూడడం, వాళ్ల కలలు, సమస్యలు, పరిణితి అర్ధం చేసుకోడం నిజంగా బాగుంటుంది.

ఇంకా మిల్లుకు చేరని పంటలు! ఆహార కొరత త‌ప్ప‌దా!

లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తే… ప్రస్తుతం వలస కూలీలే కాదు… మధ్య తరగతీ తిండి కోసం తిప్పలు తప్పని పరిస్థితి.  మూతబడిన మిల్లులు, కార్మికులు, కూలీలు విధులకు హాజరుకాలేకపోవడం, పంటలు ఇంకా వ్యవసాయ క్షేత్రాల్లోనే నిలిచిపోవటంతో ధాన్యం, పప్పులు ఇంకా మిల్లులకు చేరని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 4000 రైస్‌ మిల్లులు మూతపడగా… కనీసం 4 లక్షల మంది కార్మికులు ఇళ్లల్లో మగ్గిపోతున్నారు. రబీ సీజన్‌ పంటలు ఈపాటికే మిల్లులకు చేరుకోవాల్సి ఉండగా లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ కూలీలు, కార్మికుల కొరత తీవ్రం కావడంతో 75 శాతం మిల్లులు పనిచేయడంలేదు. దేశవ్యాప్తంగా ఏడాదికి 22 మిలియన్‌ టన్నుల గోధుమపిండి, మైదాను మిల్లులు సప్లై చేస్తుంటాయని, కరోనా కారణంగా గోధు మలు, కార్మికుల లభ్యత క్షీణించి 40 నుంచి 50 శాతం పిండి మాత్రమే ఉత్పత్తి అవుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే వంట నూనెల తయారీ 40 శాతం తగ్గింది.   ఆంధ్రప్రదేశ్‌లో ఈ రబీ సీజన్‌లో 30 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరా శాఖకు సుమారు రూ. 25 వేలకోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1280 పీపీసీలను ప్రారంభించింది. పొలం నుంచి ధాన్యం గింజలను పీపీసీలకు తరలించే అవకాశమే లేదు. లాక్‌డౌన్‌ సందర్భంగా గ్రామాల్లో రైతులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వటం లేదు. కనీసం పొలంలో వరి కోతలకు కూలీలనూ బయటకు రానివ్వటం లేదు.  తెలంగాణాలో 37 లక్షల టన్నుల ధాన్యం చేతికి వస్తుందని అంచనా. ఎఫ్‌సీఐ ముతక రకం బియ్యాన్ని సేకరిస్తుంది. సామాన్య జనం సైతం వినియోగించే సోనా మసూరీ, సాంబ మసూరీ, తెల్లమసూరీ, గిద్ద మసూరీ, విజయ మసూరీ, బీపీటీ, జీలకర్ర సన్నాలు, మొలగొలుకులకే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని వినియోగించే పరిస్థితి లేదు. మిల్లుల్లో మర ఆడక పోవటంతో బియ్యం కొరత వేధించనుంది.  రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మిల్లులకు నేరుగా చేరుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఆహార కొరత ఏర్పడకుండా ఉండగలదన్న ఆశాభావాన్ని మిల్లర్లు, వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు.

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరత!  లాక్‌డౌన్‌తో వెళ్లలేకపోతున్న దాతలు!

లాక్‌ డౌన్‌కు ముందు రక్త దానం చేయడానికి ఒక్కో బ్ల‌డ్‌బ్యాంక్‌కు రోజుకు 50-60 మంది వచ్చేవారు. ఇప్పుడు ఎవరూ రావడంలేదు. రక్త దాతలతో మాట్లాడితే.. తమకు కూడా రావాలని వుందని, అనుమతి కావాలని కోరుతున్నారు. దాతలు ఎవరూ లేకపోవడం వల్ల సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. రక్తం అవసరాలు పెరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్‌ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి వాటిని అందిస్తుంటారు. రక్తం తీసుకునేవారు ప్రతిగా వారి కుటుంబ సభ్యుల ద్వారానో, మిత్రుల ద్వారానో రక్తం ఇస్తుంటారు. ఇది కాకుండా రక్తదాన శిబిరాల ద్వారా బ్లడ్‌ బ్యాంకులకు రక్తం సమకూరుతుంది. విద్యా సంస్థలు, నేవీ, కొన్ని ప్రైవేటు సంస్థలు తరచూ శిబిరాలు నిర్వహించి రక్తం ఇస్తుంటాయి. పేరొందిన ప్రజాప్రతినిధులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శిబిరాలు నిర్వహించి, రక్తం సేకరించి ఇస్తుంటారు.  ప్ర‌స్తుతం ఆపదలో వచ్చిన వారికి రక్తాన్ని అందజేయలేక పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడేవారికి ప్రతి నెలా తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ వ్యాధిగ్రస్థులు తమకు అందుబాటులో ఉన్న బ్లడ్‌బ్యాంకులో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రతి బ్యాంకులోనూ ఇలాంటి వారి సంఖ్య 50 నుంచి 100 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్థులకు, అత్యవసరమైన డెలివరీ కేసులకు మాత్రమే ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా రక్త సేకరణ శిబిరా లు జరగడంలేదు. దీంతో రక్తం అవసరమయ్యే రోగుల కోసం రక్తదాతలు ముందుకు రావాలని ఐపిఎం(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటి న్ మెడిసిన్) ప్రకటించింది. రక్తం ఇవ్వాలనుకునే దాతలు నేరుగా ఐపిఎంకి రావాలని డైరెక్ట ర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నారాయణగూడలో ఉన్న ఈ కేంద్రంలో ప్రతి రోజు సగటున 100 నుంచి 115యూనిట్లు సేకరిస్తున్నామని, వీటి ని మరింత విస్త‌రించి వేర్వేరు కాంపొనెంట్లగా కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే రక్తదాతలందరూ సులభంగా కేంద్రానికి చేరేందుకు ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ జిల్లా డిఎంహెచ్‌ఒ డా. వెంకటి 8497958597ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ప్రయివేట్ వైద్యుల లాక్ డౌన్ దేనికి సంకేతం? 

యుద్ధం వచ్చినప్పుడు సైనికుడు చనిపోవచ్చు. అది సహజం. యుద్ధ లక్ష్యం శత్రుసైన్య వినాశం, విచ్చిన్నం. అలాంటి సమయంలో మన సైనికులకు ప్రభుత్వం సరైన ఆయుధాలు ఇవ్వలేదు అని మాట్లాడం. అలా మాట్లాడితే దేశద్రోహం అవుతుంది. ఇప్పుడు కరోనా అలాంటి పరిస్థితినే తెచ్చింది. ఇది వైద్య యుద్ధం. ఈ యుద్ధంలో సైనికులకు (వైద్యులకు) ఎలాంటి ఆయుధాలు సమకూర్చాం అన్నది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదు. ఈ యుద్ధంలో ఎందరు సైనికులు చనిపోతున్నారు అన్నది కూడా మాట్లాడవలసిన అంశం కాదు. అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ విషయాలు యధేచ్చగా మాట్లాడేస్తున్నారు. ఇది ఊహించని యుద్ధం. అంచనా వేయలేని శతృవు (వైరస్) కళ్ళముందు కనిపిస్తుంటే శతృవును ఎదుర్కొనే ఆయుధాలు చేతిలో లేకుండానే యుద్ధం చేయాల్సి వస్తోంది. యుద్ధరంగంలో సైనికులు ఉన్నసమయంలో ఆయుధాల తయారీ మొదలైన సందర్భం ఇది. ఈ వాస్తవాలను వదిలేసి రాజకీయాలు మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చెల్లింది. ఇలాంటి రాజకీయాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ వినిపించడం లేదు. ఇక ఈ యుద్దాన్ని ప్రభుత్వ వైద్య బృందాలు మాత్రమే చేస్తుండడం, ప్రైవేటు వైద్యులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిత్యం వందలమంది పేషంట్లతో కళకళ్ళాడుతూ ఉండే ప్రవేటు ఆస్పత్రులు ఇప్పుడు మూతపడ్డాయి. ఒక్క ప్రైవేటు ఆస్పత్రి, ఒక్క ప్రవేటు వైద్యుడు ఈ యుద్ధంలో భాగస్వామి కాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు "ఐసోలేషన్" కేంద్రాలకోసం, "క్వారంటైన్" కేంద్రాలకోసం వెతుకులాడుతుంటే, ప్రవేటు ఆస్పత్రులు "లాక్ డౌన్" ప్రకటించి తలుపులేసుకున్నాయి. మాస్కులకోసం, గ్లవుజులకోసం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుంటే ప్రైవేటు వైద్యులు చోద్యం చూస్తున్నారు. మాస్కులు, గ్లవుజులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలానే ఉంటాయి. అవి మాత్రమే సరిపోతాయని కాదు. కానీ అవికూడా బయటకు తీస్తే మంచిది కదా! వేలు, లక్షలు, కోట్లు గడిస్తున్న ఈ ఆస్పత్రులు, వైద్యులు కనీస సామాజిక బాధ్యతగా ముందుకు రాకపోవడం, బాధ్యత మొత్తం ప్రభుత్వ వైద్యుల భుజస్కందాలపై వేసి చేతులు దులిపేసుకోవడం సామాజిక బాధ్యత అవుతుందా? ఏ ప్రజలనుండి అయితే ఇన్నేళ్ళుగా డబ్బులు పోగేసుకున్నారో ఆ ప్రజలు ఇప్పుడు కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నపుడు, ఆ ప్రజల ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ప్రైవేటు వైద్యులు కానీ, ప్రైవేటు ఆస్పత్రులు కానీ ముందుకు రాకపోవడం సామాజిక ద్రోహం అవుతుంది. యుద్ధం సైనికుడి బాధ్యత మాత్రమే కాదు. యావత్ ప్రజల భాగస్వామ్యం అవసరం. ఇప్పుడు కరోనపై యుద్ధం కూడా ప్రభుత్వ వైద్య బృందాల బాధ్యత మాత్రమే కాదు. దేశంలోని యావత్ వైద్య రంగం ప్రజలకోసం పనిచేయాల్సిన సమయం. ఈ క్లిష్ట సమయంలో ప్రైవేటు వైద్యరంగం లాక్ డౌన్ ప్రకటించడం ద్రోహం అవుతుందనేది సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్న జనాభిప్రాయం.

మాజీ సీఈసీ రమేశ్ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించే అవకాశం!

తన పదవీ కాలం ఇంకా ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. నేడు, రేపు కోర్టుకు సెలువులు రోజులు కావడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీ కాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించిన విషయం తెలిసిందే.

క‌రోనా మరణాల్లోనూ ఓటు బ్యాంక్ రాజకీయాలా?

హిందువుల మనోభావాలతో తెలంగాణా ప్ర‌భుత్వం చెలగాటం ఆడితే ప‌రిణామాలు తీవ్రంగా వుంటాయ‌ని బిజెపి హెచ్చ‌రించింది. క‌రోనా మృత‌దేహాల ప‌ట్ల ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ జీవో 169ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని బిజెపి డిమాండ్ చేస్తోంది. కోవిడ్19 వ్యాధితో చనిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 169లో మార్గదర్శకాలు, హిందువుల మనోభావాలను, సాంప్రదాయాలను పట్టించుకోలేధని, వాటికి పూర్తి విరుద్దంగా ఉన్నాయని , హిందువుల మనోభావలతో చెలగాటం ఆడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రపంచం అంతా కరోనా కట్టడికి కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ప్రజలకు సహకరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మతం పేరుతో జీవో లు విడుదల చేసి ప్రజల మధ్య వైషమ్యాలు స్పృష్టించడం తగదని, ఇది సీఎం కేసీఆర్ కు తెలిసి విడుదలయ్యిందా లేదా అనే విషయం ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ-169లో ఉన్న మార్గదర్శకాలు, కేవలం ఒక వర్గాన్నిసంతృప్తి పర్చటం కోసం రూపొందించినట్లుగా ఉన్నాయి, ఇది ఎంతవరకు సమంజసం అని బండి ప్ర‌శ్నించారు.   కోవిడ్19 వ్యాధి మరణాల విషయం లో కూడా మత పరంగా ఈ వివక్షత ఎందుకు? ఈ సమయంలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరమా అంటూ ఆయ‌న‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.  తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా విడుదల చేసిన జీవో 169లో ఖననం వేళ కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించటం, హిందూ మత, ఆచార వ్యవహారాలకు ఇబ్బందికరం అని సామాజిక దూరం పాటించేలా , సంప్రదాయలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిగేలా చూస్తూ పుణ్య కార్యక్రమాలకు కావాల్సిన వారిని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనుమాస్పద మృతులను, హిందూసంప్రదాయాల ప్రకారం ఖననం చేయడంపై ప్రభుత్వం పునరాలచోన చెయ్యాలని బండి సంజయ్ కోరారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ తో ఎక్కువగా ముస్లిం మతానికి చెందినవారు మరణించారు. వీరి ఖననంకు సంభందించిన ఆదేశాలను జీఓ-169లో పొందుపర్చకపోవటంలో ఆంతర్యం ఏమిటి? కోవిడ్19 వ్యాధితో చనిపోయిన ముస్లిం మతస్థులకు సంబంధించిన  మార్గదర్శకాలను వెంటనే జారీ చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు..  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ జీవో విడుదల జరిగితే వెంటనే రద్దు చేయాలని. లేదంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

అప్పట్లో శేషన్ ..... ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ !

1993లో సినిమా స్టార్ లను మించిన ప్రజాభిమానం పొందిన టి ఎన్ శేషన్ అనే ఎన్నికల అధికారికి అప్పటి ప్రభుత్వం తోక కత్తిరించింది. 2018లో ఎపిలో అప్పటి ప్రభుత్వం సిబిఐకి తలుపులు మూసేసింది. 2019లో ఎపి ప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసింది. 2020లో కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రే ఢిల్లీ న్యాయమూర్తిని బదిలీ చేసింది. 2020లో ఇప్పటి ఎపి ప్రభుత్వం రాష్టృ ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గించింది. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు కూడా విచక్షణాధికారం ఉంటుందనే అంశానికి సంబంధించి ఇవన్నీ ఉదాహరణాలన్న మాట. అసలు ఎలెక్షన్ కమిషన్ అనే వ్యవస్థకు ఇంత గ్లామర్, గ్రామర్ ఉంటుందని నిరూపించిన టి ఎన్ శేషన్ గురించి ఈ రోజు నిజంగా గుర్తు చేసుకోవలసిన సందర్భం... ప్రజాస్వామ్యం లో  ‘ఓటు’ను మించిన ఆయుధం మరొకటి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో గతంతో పోలిస్తే ఓటర్లలో చాలావరకు చైతన్యం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇందుకోసం కొందరు చేసిన కృషి ఎంతో అపూర్వం. అలాంటి వారిలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టి.ఎన్.శేషన్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన...దేశంలో ఎన్నికల నిర్వహణ అంశంలో ఎవరూ ఊహించని సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా చూసిన వారంతా అంగీకరిస్తారు.     1990-96 మధ్య కాలంలో కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు టి.ఎన్. శేషన్. ఈయన పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. 1955 తమిళనాడు కేడర్‌కు చెందిన శేషన్... రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 1989లో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం... కేంద్ర ఎన్నికల సంఘం 10వ చీఫ్ కమిషనర్‌గా శేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సారధిగా ఆయన తీసుకున్న పలు విప్లవాత్మకమైన చర్యలు... ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారులు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి కూడా శేషనే అని చెప్పకతప్పదు. ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా టి.ఎన్. శేషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలామంది... ఆయన కేంద్రఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘంచేందుకు సాహించలేకపోయారు.      కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా ఉన్న సమయంలో శేషన్ పలు కీలక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ అన్నది సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చెపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడీ కార్డు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి పరిధులను ఫిక్స్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరును మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను సాధ్యమైనంతవరకు వినియోగించుకున్నారు.     ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడంలో గణనీయమైన స్థాయిలో మంచి ఫలితాలు సాధించగలిచారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాలను అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దనే నియమాన్ని గట్టిగా అమలు చేశారు. అన్నిటికీ మించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే నాయకుల పాలిట సింహ స్వప్నమయ్యారు. ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఎంతో కొంత, శేషన్ స్థాయిలో తన విధులను నిర్వర్తించే క్రమంలో నికార్సైన రీతిలో నిలబడ్డారు. ఈ సంఘటనల నుంచి, ప్రజాస్వామ్య పిపాసులు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి.

క‌రోనాపై అవగాహన గీతాల సి.డి. ఆవిష్క‌ర‌ణ‌!

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కరోనా మహమ్మారి నియంత్రణ మరియు అవగాహన పై ప్ర‌త్యేక పాట‌ల‌తో సి.డి. రూపొందించారు. రాత్రి లేదు.. పగలు లేదు... కంటి మీద కునుకులేదు...మన కోసం.. అనే ప్రత్యేక అవగాహన గీతాల్ని ర‌చించి పాడారు. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. జాగో.. జాగోరే తెలంగాణ పాటను యశ్ పాల్ రచించగా సంతోష్ పాడారు. కరోనా మహమ్మారి పై అభినయ శ్రీనివాస్ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ పాడారు. కమ్ము కొచ్చే కరోనా అనే పాటను కోదాడ శ్రీనివాస్ రచించిన పాటకు వీణ పాడారు. అమ్మలారా అలకించండి అనే పాటను జలజ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ గారు పాడిన అవగాహన గీతాలను ఇప్పటికే విడుదల చేసారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు కష్టకాలంలో కరోనా మహమ్మారి నియంత్రణ కు అత్యవసర సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు అందిస్తున్న సేవలకు నీరాజనం గా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించిన‌ట్లు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి శ్రమిస్తున్నవైద్య‌సిబ్బందే నిజ‌మైన హీరోలు! రాహుల్‌గాంధీ!

ఇంతటి తీవ్రమైన సంక్షోభ సమయంలో ఈ దేశానికి సేవలు చేస్తున్న మా సమాజ కార్యకర్తలు నిజమైన దేశభక్తులు, ఈ సంక్షోభ పరిస్థితులలో సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి శ్రమిస్తున్న వారు మా హీరోలు. భారతదేశం అంతటా ప్రమాదకరంగా కోవిడ్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఆశా వర్కర్లు (ASHA ), సహాయక నర్సు మరియు ANM లు, అంగన్వాడీ కార్మికులు వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ అంకితభావంతో మరియు ధైర్యంతో పని చేస్తున్నారు. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వారంతా ముందు వరుసలో ఉండి పని చేస్తున్నారు. ఇంతటి తీవ్రమైన సంక్షోభ సమయంలో ఈ దేశానికి సేవలు చేస్తున్న మా సమాజ కార్యకర్తలు నిజమైన దేశభక్తులు, ఈ సంక్షోభ పరిస్థితులలో సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి శ్రమిస్తున్న వారు మా హీరోలు. పెద్ద ప్రమాదం కలిగించే ఈ వాతావరణంలో వైరస్ కంటే భయాంకరమైనది తప్పుడు సమాచారం. COVID-19 యొక్క ప్రమాదాల గురించి మరియు అది ప్రసారం చేసే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో కమ్యూనిటీ కార్మికులకు కీలక పాత్ర ఉంది. ఒక దేశంగా వారికి మరియు వారి కుటుంబాలకు వారు చేస్తున్న అపారమైన వ్యక్తి గత త్యాగాలకు కృతజ్ఞతలు. ఈ సంక్షోభం ముగిసినప్పుడు వారి ఆదర్శప్రాయమైన సేవ, వారి పని, మార్పుకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ దేశానికి సేవ చేసిన ప్రతి సమాజ కార్యకర్తకు నేను వందనం చేస్తున్నాను. వారు మరియు వారి కుటుంబాలు ఈ మహమ్మారి ద్వారా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనక రాజు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనకరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. కాగా.. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన్ను తొలగించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటిదాకా రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు అప్పగిస్తున్న ఆ పదవిలో.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలను నియమించేలా మరో మార్పు తీసుకొచ్చింది.  శుక్రవారం ఆన్‌లైన్‌లో రాష్ట్ర మంత్రులతో కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర పొందింది. ఆ వెంటనే దీనిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపింది. గవర్నర్‌ కూడా దీనిని ఆమోదించారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆమోద ముద్ర పడగానే.. చకచకా మూడు జీవోలు వెలువడ్డాయి. పంచాయతీరాజ్‌  శాఖ, న్యాయశాఖల్లో గ్రామీణ ఎన్నికలకు సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్డినెన్స్‌ను అమలులోకి తెస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ తర్వాత... ఆర్డినెన్స్‌కు అనుగుణంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ జీవో నెంబరు 617 జారీ చేయడం జరిగింది