జన్‌ధన్ ఖాతాల్లో రెండో విడత నగదు జమ
posted on May 3, 2020 @ 12:45PM
ఈ నెల 4 నుంచి ఉపసంహరణకు అవకాశం
న్యూదిల్లీ: రెండో విడతగా మహిళల జన్‌ధన్ ఖాతాల్లో మే నెలకు సంబంధించి రూ.500 చొప్పున ఆర్థిక సాయం జమ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుంచి నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ‘అకౌంట్ నంబర్ల చివరి అంకె ఆధారంగా ఖాతాదారులకు నిర్ణీత రోజు నగదు తీసుకునేందుకు అవకాశం ఇస్తాం. తద్వారా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గి.. భౌతిక దూరం పాటించేందుకు వీలు కలుగుతుంది. 11వ తేదీ అనంతరం ఏ రోజైనా తీసుకోవచ్చు’అని ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా శనివారం తెలిపారు.
వీలైనంత వరకు ఏటీఎం కార్డులు, బ్యాంకు మిత్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు మహిళల జన్‌ధన్ ఖాతాల్లో ఏప్రిల్ నుంచి మూడు నెలలపాటు రూ.500 చొప్పున జమ చేస్తామని కేంద్రం ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో 20.05 కోట్ల ఖాతాల్లో రూ.10,025 కోట్లు జమ చేసింది.