విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత
posted on May 7, 2020 9:00AM
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ కెమికల్ గ్యాస్ 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఎల్జీ పాలిమర్స్, ఆర్.ఆర్ వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలు.. కెమికల్ గ్యాస్ వాసనకు కళ్లు మండి కడుపులో వికారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ.. మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలువరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్యాస్ లీకేజీ ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ఎల్జీ పాలిమర్స్, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరు అత్యుత్సాహంతో ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.