టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి.. జేసీ సంచలన వ్యాఖ్యలు
posted on May 29, 2020 @ 5:51PM
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీకి జగన్ లాంటి సీఎం మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు ౧౧౦ మార్కులు వేస్తానని ఎద్దేవాచేశారు. జగన్ నిరంకుశ ధోరణి, పట్టుదల పరాకాష్ఠకు చేరాయని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే నైజాన్ని జగన్ వదులుకోవాలని సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని, అయినా మొండి వైఖరితో ముందుకు సాగుతోందని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు. టీటీడీ ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్ రాముడో, రావణుడో ప్రజలే తేల్చుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.