శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మృతి
posted on May 30, 2020 @ 10:07AM
లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రైల్వేశాఖ మే 1నుంచి 27వతేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి, దాదాపు 50 లక్షల మంది వలసకార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. అయితే ఈ రైళ్లలో ఇప్పటి వరకు 80 మంది మరణించారు. మే 9 నుంచి 27 వరకు నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైంది. ఎక్కువగా, దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలసకార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, రైళ్లలో భోజనం దొరక్క మాత్రం ఎవరూ మరణించలేదని తెలిపింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.