జగన్ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక వాదనలు, వివాదాలు

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, గతంలోనే అమరావతిలో కృష్ణా నది వద్ద 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు తలచారు. కానీ అది కార్యరూపం దాల్చకుండానే ఆయన సీఎం కుర్చీ దిగారు. ఇక ఇప్పుడు ప్రస్తుత సీఎం జగన్ కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, విగ్రహ ఏర్పాటుకు అమరావతి కాదని విజయవాడను ఎంచుకున్నారు. దీంతో విగ్రహ ఏర్పాటుపై కొన్ని పక్షాల నుంచి వివాదాలు మొదలయ్యాయి.  స్వరాజ్ మైదానం విజయవాడ లోని అతి పెద్ద మైదానం. రాజకీయ పార్టీల మీటింగులకైనా, ఎగ్జిబిషన్ల కైనా, విజయవాడ నగరానికి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించాలన్నా స్వరాజ్య మైదానంలోనే ఇప్పటి వరకు జరుగుతుండేవి. ఆ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేస్తే.. పెద్ద మైదానం పోతుందని దాని అవసరం వస్తే ఎక్కడికి వెళ్లాలని విజయవాడలో కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మేరకు మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు కూడా సీఎం జగన్ కి లేఖ రాశారు. ఈ విగ్రహ ఏర్పాటు అమరావతిలోనే చేయాలని, రాజధాని సంకల్పం బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను గతంలోనే ఈ స్వరాజ్ మైదాన్ (పిడబ్ల్యుడి గ్రౌండ్స్) విషయమై కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే పరోక్షంగా ఈ నిర్ణయంపై మళ్లీ తాను కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా సీఎంకు ఒక హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు, ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 200 కోట్లు నిధులు కేటాయించింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా 200 కోట్లు కేటాయించి విగ్రహం నెలకొల్పడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ అయితే తాము తలపెట్టినట్లు కృష్ణానది మధ్యలో ఇలా అంబేద్కర్ విగ్రహం పెద్దది నెలకొల్పితే ఆకర్షణీయంగా ఉంటుందని, రాజధాని అమరావతికి కూడా అద్భుతమైన కట్టడంగా నిలుస్తుందని చెబుతోంది. ఇలా జగన్ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక రకమైన వాదనలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కలేదు కానీ ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే మళ్లీ ఎప్పటిలాగానే వ్యతిరేక తీర్పు వస్తుందా లేక అనుకూల తీర్పు వస్తుందా అనేది చర్చగా మారుతుంది.

అరగంటలోనే ఫలితాలు..

యాంటీ జెన్ పరీక్షలు.. పిహెచ్ సిలోనూ అందుబాటులో.. ప్రసవానికి పదిరోజుల ముందు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలను వైద్యఆరోగ్య శాఖ చేస్తోంది. అరగంటలోనే ఫలితాలిచ్చే యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ రోగులను త్వరగా గుర్తించేందుకు సన్నద్దమైంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఒక్కోక్క సెంటర్ లో 25మందికి మాత్రమే పరీక్షలు చేస్తారు. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లోని జిహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. తర్వలోనే రాష్ట్రవ్యాప్తంగా యాంటీజన్ పరీక్షలు నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. అరగంటలోనే.. మామూలుగా కరోనా నిర్ధారణ కోసం రియల్టైం ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్) పరీక్ష చేస్తారు. అదే మాదిరిగా యాంటీ జెన్ పరీక్షల్లోనూ ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్ రీజియన్) నుంచి స్వాబ్లతో శాంపిళ్లను తీసుకుంటారు. సేకరించిన శాంపిళ్లను అక్కడిక్కడే పరీక్షించి అరగంటలోనే ఫలితం చెప్పారు. అయితే ఆర్టీపీసీఆర్‌లో వైరస్ జీన్ను గుర్తిస్తే.. ఈ యాంటీజెన్ టెస్టులో వైరస్ ప్రొటీన్ను గుర్తిస్తారు. ఈ పరీక్షలో పాజిటీవ్ వస్తే 84 నుంచి 99శాతం వారి శరీరంలో వైరస్ ఉన్నట్లే నిర్ధారిస్తారు. నెగిటివ్ వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉంటే అప్పుడు ఆర్టీపీసీఆర్ పద్దతిలో పరీక్షలు చేస్తారు. శరీరంలో 14 రోజులు యాంటీజెన్ ప్రోటీన్.. కోవిద్ వైరస్ సోకిన తర్వాత పది నుంచి 14 రోజుల పాటు యాంటీజెన్  ప్రొటీన్ ఆ వ్యక్తి శరీరంలో ఉంటుంది. లక్షణాల్లేని పేషెంట్లలో పది రోజుల వరకు, లక్షణాలు కనిపించే వారిలో 14 రోజుల వరకూ యాంటీజెన్ ప్రోటీన్ ఉంటుందని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వివరిస్తున్నాయి. అన్నీ హాస్సిటల్స్ లో.. కరోనా తీవ్రతను అరికట్టాలంటే పరీక్షలు ఎక్కువగా చేస్తూ పాటిజివ్ వ్యక్తులను గుర్తించి వారిని క్వారంటైన్ చేయాలి. వైరస్ వ్యాప్తిని ఈ విధంగా అరికట్టడం సాధ్యమవుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేటెడ్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) అన్నింటికీ ఈ టెస్టులు చేసే అవకాశం ఇవ్వాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రసవానికి పదిరోజుల ముందు.. కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ అవసరమే. అయితే ముందుగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీలకు ప్రసవానికి పదిరోజుల ముందు ఈ పరీక్ష తప్పనిసరిగా చేయాలి. ఈ పరీక్షతో పాజిటివ్ వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది.

ప్రత్యేక అజెండాతో ధర్మాన.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం పీఠంపై కూర్చున్న వైఎస్ జగన్ కి ఒక్క ఏడాదిలోనే తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ అధినేతగా, సీఎం గా రెండు కీలక బాధ్యతల్లో ఉన్న జగన్ కి సొంత పార్టీ నాయకుల ధిక్కార వ్యాఖ్యలు కొంత తలనొప్పిగా మారాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఇది ఇలా ఉండగానే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ధిక్కార స్వరం పెంచుతున్నారు. వీళ్ళను కట్టడి చేయడం జగన్ కి ఇప్పుడు కీలక పనిగా మారింది. వైసీపీలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడు. ఆయన రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పట్టున్న నేత. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనకు మంత్రి పదవి పక్కా అనుకున్నారు. కానీ ఆయన సోదరుడైన కృష్ణదాస్ కి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో, జిల్లాలో ప్రసాదరావు మాట సాగడం లేదు. చిన్న చిన్న పనుల నుంచి ఇసుక వ్యవహారం వరకు ఏ విషయంలో కూడా ఈయన మాట నెగ్గడం లేదు. అందుకే ఈ మధ్య ఆయన ధిక్కార స్వరం పెంచారు.  తాజాగా "రాష్ట్రంలో జిల్లాలు విభజించుకుంటే చేసుకోండి. శ్రీకాకుళం జిల్లాను మాత్రం విభజించవద్దు. ఇది మాది, మా ప్రజలు అంగీకరించరు. మా జిల్లా ఇలాగే ఉండాలి, సీఎం జగన్ కి మేము ఇదే చెప్తాము. మిగిలిన 12 జిల్లాలను ఏమైనా చేసుకోండి, కానీ మా జిల్లాని వదిలేయండి" అన్నారు. మా ప్రాంతం, మా ప్రజలు అనే భావన వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే, గత నెల కూడా ఆయన ప్రభుత్వంలో పాలన అనుకున్నంత సవ్యంగా లేదని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వని కారణంగానే ధర్మాన ఇలా మాట్లాడుతున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే, ధర్మాన ప్రసాదరావు భవిష్యత్తులో ఓ ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం లో ఉత్తరాంధ్ర సాధన సమితి సమావేశం జరిగింది. దీనిలో ధర్మాన అనుచరగణం అందరూ పాల్గొన్నారు. దీనికి ధర్మాన పరోక్షంగా పూర్తి మద్దతు పలికారు. దీంతో, ధర్మాన 'ప్రత్యేక ఉత్తరాంధ్ర' అనే ఉద్యమానికి ప్రణాళికలు వేశారని, వచ్చే ఎన్నికలకు ఆయన సొంతంగా ఇదే అజెండాతో వెళ్తారని శ్రీకాకుళంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ తనకి పార్టీలో అనుకున్న హోదా దక్కకపోతే, జగన్ నుండి ఇదే తరహా ట్రీట్మెంట్ ఎదురైతే మాత్రం.. వచ్చే ఎన్నికల నాటికి ధర్మాన వైసీపీ తరఫున పోటీ విషయంలో పునరాలోచనలో పడతారని, కొన్ని అజెండాల ఆధారంగా వెళ్తారని అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా మంచి వాగ్ధాటి, వ్యూహాలు ఉన్న ధర్మాన ఇప్పుడు అన్న కృష్ణదాస్ పెత్తనంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ మంత్రిగా గతంలో ఎన్నో ఏళ్ళు జిల్లాలో చక్రం తిప్పిన ఈయనకు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉండడం ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారని అంటున్నారు. మరి భవిష్యత్ లో ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రస్తుత సెక్రటేరియట్ భవనాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చివేత పనుల వల్ల అక్కడ ఉన్న దేవాలయం, మసీదులకు ఇబ్బంది కలిగింది. సెక్రటేరియట్ భవనాలను కూల్చేస్తున్న సందర్భంగా శిథిలాలు పక్కనున్న దేవాలయం, మసీదులపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రార్థనా స్థలాలను చెడగొట్టడం కాదని తెలిపారు. సచివాలయం ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో ఇంతకన్నా పెద్ద దేవాలయం, మసీదులను నిర్మిస్తామని చెప్పారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా సమావేశమవుతానని వెల్లడించారు. నిర్మాణాల విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. ఇదిలా ఉంటే, సచివాలయం కూల్చివేతకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ప్రొఫెసర్ విశ్వేశర్ రావు హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని, భవనాలు కూల్చివేయడం వలన వాతావరణం కాలుష్యం అవుతుంద‌ని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, సాలీడ్ వెస్ట్ మ్యానేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని ఆయన అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో సోమ‌వారం వ‌ర‌కు కూల్చివేత ప‌నులు నిలిపివేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతలను సోమవారం వరకు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కట్టడాన్ని కూల్చడం సరికాదంటూ హైకోర్డులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవానాల కూల్చివేత వల్ల వచ్చే కాలుష్యం ప్రజలకు ఇబ్బందికరంగా ఉందంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయవాది చిక్కడు ప్రభాకర్, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ స్థానం సోమ‌వారం వ‌ర‌కు భ‌వ‌నాల కూల్చివేత‌ను ఆపాలంటూ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. సోమవారం మరోసారి విచారణ జరగనుంది. అయితే సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు కూడా సోమవారం విచారణకు రానుంది.

ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలు

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు తొలగించారు. 2 సంవత్సరాల క్రితం సీతానగరం గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి పంచాయతీ తీర్మానంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని, జ్యోతుల నెహ్రూ పౌండేషన్ సౌజన్యంతో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తాజాగా సీతానగరం గ్రామ వైయస్సార్ సిపి నాయకులు కొందరు షెల్టర్ తొలగించి ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కనే ఉన్న కళ్యాణ మండపం దగ్గర వదిలివేసారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం తో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించడం పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఇప్పటికే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎందరో అభిమానించే, ఆరాధించే మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే రోజా గన్ మేన్ కు కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ నియోజకవర్గ ప్రజలు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది వైసిపి ఎమ్మెల్యేలకు కూడా వైరస్ సోకింది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ ఐన రోజా గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఐంది. దీంతో రోజాతో సహా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇపుడు అందరికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా టెస్టులు చేయనున్నారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే రోజా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గం అయిన నగరిలో ఆమె మాస్క్ లేకుండా పర్యటించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతులకు సంబంధించిన పలు కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ కార్యక్రమాలలో భాగంగా రోజా కూడా నగరిలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగరి నియోజకవర్గంలో ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనాతో కొంత మంది మృతి చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని పదేపదే చెబుతున్నాయి. ఐతే రోజా తన పర్యటనలలో భౌతిక దూరం పాటించక పోవడమే కాకుండా ఆమె స్వయంగా మాస్క్ కూడా ధరించకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు కూడా అమె కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో తనపై పూల వర్షం కూడా కురిసింది. ఈ విషయంలోనూ ఆమెపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కొద్దీ రోజుల క్రితం ఆమె 108 అంబులెన్స్ కూడా నడిపిన సంగతి తెలిసిందే. ఐతే అమె కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆమే నియమాలు పాటించపోతే ఎలా అని స్థానికులు నిలదీస్తున్నారు.

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్

అందరూ ఊహించిందే జరిగింది. యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆత్మ రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని శివ్లీకి తరలిస్తున్న క్రమంలో.. కాన్పూర్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా వికాస్ దుబే పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో వికాస్ దుబే మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. అతడి మృతదేహాన్ని కాన్పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక డిఎస్పీ తో సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబెను మధ్యప్రదేశ్ పోలీసులు నిన్న ఉదయం ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తరువాత మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఉజ్జయిని నుంచి శివ్లీ (యూపీ)కి రోడ్డుమార్గంలో తరలిస్తుండగా వికాస్ ను తీసుకువస్తున్నఎస్టీఎఫ్ వాహనం కాన్పూర్ సమీపంలో బోల్తాపడింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పటికే యూపీలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్ లో వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా గురువారం బహువా దుబే, ప్రభాత్ మిశ్రా లను ఎన్‌కౌంటర్ చేశారు.

ఇంటర్ గురుకుల కాలేజీలలో ప్రవేశ పరీక్ష దరఖాస్తు తేదీ పొడిగింపు 

తెలంగాణ రాష్ట్ర గురుకుల కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆగస్టు 5తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు దరఖాస్తు తేదీని ఆగస్టు 5 వరకు పొడిగించారు. రాష్ట్రంలో ఉన్న 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో  అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ 2020 ప్రవేశపరీక్ష ద్వారా 35కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. ఇందులో బాలుర జూనియర్ కాలేజీలు 15, బాలికల జూనియర్ కాలేజీలు 20 ఉన్నాయి. మొత్తం 35కాలేజీల్లో అన్ని గ్రూపులు కలిపి 3000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ గ్రూప్ లో 1300 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ఎంపికైన వారికి ఈ కాలేజీల్లో వారికి కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్ లభిస్తోంది. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు జరగలేదు. దాంతో పదోతరగతి చదువుతున్న విద్యార్థులంతా పాస్ అయ్యారు. జూనియర్ కాలేజీ అడ్మిషన్ల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.  మరిన్ని వివరాల కోసం తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చుhttp://tsrjdc.cgg.gov.in సంపద్రించాల్సిన నెంబర్లు 040 -24734899, 9490967222

ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం శాఖలు అన్నీ కత్తిరించేసారు

ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల్లో సమావేశాలు జరిపి తాను సీఎస్ గా పని చేసిన ప్రభుత్వంపైనే భారీ అవినీతి ఆరోపణలు చేసిన అజేయ కల్లాం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య సలహాదారు పదవి పొందారు. ఆయనకు జీఏడీ , హోమ్, ఆర్ధిక శాఖ, రెవెన్యూ, సీఎంవో వ్యవహారాలు వంటి అతి ముఖ్యమైన శాఖలన్నిటిని సీఎం జగన్ కట్టబెట్టారు. జగన్ సీఎం పదవి స్వీకరించే ఫైలు పై దగ్గరుండి మరీ అజేయ కల్లం సంతకం చేయించారు . దీంతో అజయ్‌రెడ్డి కల్లాం గుడ్‌లుక్స్‌లో పడేందుకు సీనియర్ అధికారులు కూడా పోటీ పడ్డారు. ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్న గ్రామసచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఆలోచన కూడా ఆయనదే అంతే కాకుండా పీపీఏల సమీక్ష, రివర్స్ టెండరింగ్ వరకు అన్ని నిర్ణయాల వెనుక ఉన్నది అజేయ కల్లం మాత్రమే. అంతే కాకుండా ఒకప్పుడు తాను వ్యతిరేకించిన వాటినే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయటం వంటి వాటి విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయటం ద్వారా అజయ్ కల్లాం వ్యక్తిగతంగా తనకు ఉన్న పేరును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఐతే ఇదంతా గతం ప్రస్తుతం ఆయన అధికారాలు, శాఖలు అన్నీ కత్తిరించేసారు. ఎం జరిగింది ఏమో కానీ ఒక సంవత్సరం తిరిగి వచ్చే సరికి ఆయనకు ఎటువంటి అధికారాలు, శాఖల బాధ్యతలు లేకుండా ఒట్టి సలహాదారుగా మాత్రమే మిగిల్చారు. దీంతో పేరుకు సలహాదారు అనే పదవి ఉంది కానీ ఏ విషయంలో సలహాలివ్వాలో పాపం ఆయనకి కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఆయనతో పాటు సంవత్సరం క్రితం కేంద్ర సర్వీసులో ఉన్న డాక్టర్ పివి రమేష్ ను కూడా సీఎం ఓ ముఖ్య కార్యదర్శి గా నియమించుకుని ఆరోగ్యం, విద్య, వైద్య, ఐటి, పరిశ్రమలు వంటి కీలక శాఖలయూ అప్పగించారు. ప్రస్తుతం పీవీని కూడా అన్ని బాధ్యతల నుండి తప్పించి కేవలం ఒక సలహాదారుగా కొనసాగిస్తున్నారు ఐతే ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం, పీవీ రమేష్ వంటి వారిని కూడా ఇలా సబ్జెక్ట్ లు లేకుండా చేయటం.. అది కూడా కనీసం ముందుగా పిలిచి ఆయనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక అనుభవజ్ఞుడైన అధికారికి ఇది చాలా అవమానకరం అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఐతే తాజా ఆదేశాల ప్రకారం.. గతంలో కేటాయించిన సబ్జెక్ట్ ల ఆదేశాలు అన్నింటిని రద్దు చేస్తూ కొత్తగా మళ్ళీ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాదారణ పరిపాలన శాఖతోపాటు హోం, రెవెన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ (వ్యయం మినహా), న్యాయ, లెజిస్లేటివ్ వ్యవహారాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి. ఇక సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా, రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ,ఐటి, గనులు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ లను కేటాయించారు. ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మిస్టేషన్, వ్యవసాయం, అనుబంధ విభాగాలు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ , ఫైనాన్స్ (వ్యయ విభాగం) కేటాయించారు.

89 యాప్ లపై ఆర్మీ నిషేధం.. జాబితాలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ 

భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 89 యాప్ లను వినియోగించకూడదని సైనికులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్ లు కూడా ఉన్నాయి. ఈనెల 15లోగా ఈ యాప్ లన్నింటినీ తొలగించాలంటూ జాబితాను విడుదల చేసింది. గడువులోగా నిర్దేశించిన యాప్ లను తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమాచార గోప్యత కారణంగా చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను ఇటీవల భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటికి మరో 30 యాప్ లను కలిపి మొత్తం 89 యాప్ లను మొబైళ్ల నుంచి తొలగించాల్సిందిగా సైనికులకు ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా చైనా కు సంబంధించిన యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. హనీట్రాప్, భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.

స్వామి ప్రబోధానంద కన్నుమూత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ప్రబోధానంద జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు తాడిపత్రిలో ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతూ ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథాలు రచించారు. అనంతరం ఆధ్యాత్మిక గురువుగా మారిపోయారు. తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. మానవులందరికీ దేవుడు ఒక్కడేనని.. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని చెప్పేవారు.

అచ్చెన్న కేసు లో దర్యాప్తు అధికారికి ముక్క చీవాట్లు పెట్టిన హైకోర్టు

ఎపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇఎస్ఐ అవినీతి కేసులో ఎసిబి అరెస్ట్ చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే. ఐతే అయన అరెస్ట్ కు ఒక రోజు ముందు ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరగడంతో 600 కిలోమీటర్ల రోడ్ ప్రయాణం లో తీవ్రంగా ఇబ్బంది పడినట్లుగా వార్తలు వచ్చాయి. నిన్న అచ్చెన్న కేసు విచారణ సందర్బంగా ప్రధాన దర్యాప్తు అధికారి పై ఇదే విషయమై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆ అధికారులను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఈ అరెస్ట్ కు ముందు రోజే ఆపరేషన్ జరిగిన ఆయనను ఆరు వందల కిలోమీటర్ల మేర కారులో తీసుకొచ్చారు. ఐతే దారి పొడవునా ఆయనకు రక్త స్రావం జరిగిందని ఎసిబి రిపోర్ట్ లో పేర్కొంది. దానితో అయన ప్యాడ్ లు కూడా మార్చుకుంటూ వచ్చారని ఆ రిమాండ్ రిపోర్టులో ఎసిబి పేర్కొంది. ఐతే ఏసీబీ అధికారులు మాత్రం అచ్చెన్నకు ఆపరేషన్ జరిగిన సంగతి తమకు తెలియదని అబద్దం ఆడే ప్రయత్నం చేసినా హైకోర్టు ముందు వారు దొరికిపోయారు. తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని అచ్చెన్న వేసిన పిటిషన్‌పై హై కోర్టులో విచారణ జరిగిన సమయంలో ఏసీబీ అధికారులు అచ్చెన్న పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. నేరం అనేది పాపంతో సమానమని, నిందితుడు పాపం చేసినవాడని, అతడికి ఏ ఇతర హక్కులూ ఉండవని భావించే స్థితి నుంచి సమాజం చాలా ముందుకెళ్లిందనే విషయాన్ని అర్ధం చేసుకోవడంలో ఆ దర్యాప్తు అధికారి విఫలమయ్యారని కోర్టు దుయ్యబట్టింది. ఎంత ఘోరమైన నేరం చేసిన నిందితుడికైనా రాజ్యాంగం కల్పించిన రక్షణను తొలగించలేరన్న విషయాన్ని ఆ అధికారి అర్థం చేసుకోవాలని చీవాట్లు పెట్టింది. ఈ కేసులో పిటిషనర్‌ భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పడంతో..అసలు చట్టపాలన, మానవహక్కులు, ధర్మాన్ని దాటేందుకు దర్యాప్తు సంస్థకు ఎటువంటి అధికారం లేదని తెగేసి చెప్పింది. అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని ఏసీబీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అచ్చెన్నాయుడికి మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి పంపించాలని విజయవాడ జైలు సూ పరింటెండెంట్‌ను ఆదేశించింది. ఆయన ఆరోగ్యంపై వారానికి రెండు సార్లు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని హాస్పిటల్ ని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది.

కేసీఆర్ కన్పించకపోతే వచ్చే నష్టమేంటి? పాలన ఆగిందా? పథకాలు ఆగాయా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? అంటూ కొద్దిరోజులుగా విపక్షాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడున్నారో చెప్పాలని, సీఎం ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయాలనీ కోరుతున్నారు. సామాన్యులు సైతం సీఎం ఎక్కడున్నారు? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఒక యువకుడు అయితే.. 'మా సీఎం ఎక్కడున్నాలరో చెప్పాలి?' అంటూ ప్లకార్డ్ ని పట్టుకొని ప్రగతిభవన్ ముందు ప్రదర్శించాడు. మొత్తానికి సీఎం ఎక్కడున్నారు అనే అంశం ప్రస్తుతం తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ అంశంపై మంత్రుల స్పందన మాత్రాన వెరైటీగా ఉంది. సీఎం ఎక్కడుంటే మీకెందుకు? పనులు ఆగాయా? పథకాలు ఏమన్నా ఆగాయా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి? సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు ఆగాయా? అని తలసాని ప్రశ్నించారు. ఇక, సచివాలయం కూల్చివేత, కరోనా కట్టడిలో విఫలమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా తలసాని విరుచుకుపడ్డారు. పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నాడు అంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి అన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ఎందుకని మేము ప్రశ్నించామా? అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలి అని తలసాని ప్రశ్నించారు.

పోస్ట్ మాన్ పై ప్రశంసల వర్షం.. ఆయన రియల్ హీరో

మనం చేసే పని చిన్నదా పెద్దదా?.. ఎంత సంపాదిస్తున్నాం?.. ఇవి కాదు ముఖ్యం. మనం చేసే పని ఇష్టంతో చేస్తున్నామా లేదా?.. మన పనిని ఎంత గౌరవిస్తున్నాం? ఎంత నిబద్దత, నిజాయితీతో చేస్తున్నాం?.. ఇవి ముఖ్యం. అప్పుడే మన జీవితానికి మనం రియల్ హీరోలమవుతాం. ఇప్పుడు అలాంటి రియల్ హీరో గురించే చెప్పుకోబోతున్నాం. ఆయన పేరు డి. శివన్. తమిళనాడులోని కూనూర్ పోస్టాఫీస్ లో పోస్టుమాన్. 66 ఏళ్ల శివన్.. గతవారంలో రిటైర్ అయ్యేంత వరకు 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు. దట్టమైన అడవిలో క్రూర మృగాలకు సైతం వెరవకుండా రోజుకు 15 కిలోమీటర్లు నడిచి, బాహ్య ప్రపంచం తొంగిచూడలేని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ఉత్తరాలు అందించి విధులు నిర్వహించారు. తన విధుల్లో భాగంగా నీలగిరి మౌంటైన్ రైల్వే ట్రాక్‌ మీదుగా వెళ్లేటప్పుడు పలుమార్లు ఏనుగులు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు వెంటపడ్డాయి. ఎన్నోసార్లు విష సర్పాలు ఆయనపై బుసకొట్టాయి. అయినా శివన్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. 2016లో వచ్చిన ఓ కథనం ప్రకారం ఆయన జీతం రూ.12 వేలు. దానినిబట్టే అర్థంచేసుకోవచ్చు.. ఆయనకు ప్రేమ, ఆయన సంపాదించే డబ్బుపై కాదు.. ఆయన చేసే పనిపై అని.  శివన్ పదవీ విరమణ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "డి. శివన్ ఉత్తరాలు చేరవేసేందుకు రోజుకు 15 కిలోమీటర్లు దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లారు. అడవి జంతువులు వెంటపడినా.. వెనుకంజ వేయలేదు. వాగులు వంకలు దాటుకుంటూ సేవలు అందించారు. 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు." అని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. రోజుకు 15 కిలోమీటర్లు నడిచి విధులు నిర్వహించిన పోస్టుమాన్‌ శివన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనను సూపర్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. కూనూర్ పోస్టు ఆఫీసుకు శివన్ పేరు పెట్టాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.