కేసీఆర్ కన్పించకపోతే వచ్చే నష్టమేంటి? పాలన ఆగిందా? పథకాలు ఆగాయా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? అంటూ కొద్దిరోజులుగా విపక్షాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం ఎక్కడున్నారో చెప్పాలని, సీఎం ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయాలనీ కోరుతున్నారు. సామాన్యులు సైతం సీఎం ఎక్కడున్నారు? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఒక యువకుడు అయితే.. 'మా సీఎం ఎక్కడున్నాలరో చెప్పాలి?' అంటూ ప్లకార్డ్ ని పట్టుకొని ప్రగతిభవన్ ముందు ప్రదర్శించాడు. మొత్తానికి సీఎం ఎక్కడున్నారు అనే అంశం ప్రస్తుతం తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ అంశంపై మంత్రుల స్పందన మాత్రాన వెరైటీగా ఉంది. సీఎం ఎక్కడుంటే మీకెందుకు? పనులు ఆగాయా? పథకాలు ఏమన్నా ఆగాయా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి? సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు ఆగాయా? అని తలసాని ప్రశ్నించారు. ఇక, సచివాలయం కూల్చివేత, కరోనా కట్టడిలో విఫలమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా తలసాని విరుచుకుపడ్డారు. పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నాడు అంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి అన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ఎందుకని మేము ప్రశ్నించామా? అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలి అని తలసాని ప్రశ్నించారు.

పోస్ట్ మాన్ పై ప్రశంసల వర్షం.. ఆయన రియల్ హీరో

మనం చేసే పని చిన్నదా పెద్దదా?.. ఎంత సంపాదిస్తున్నాం?.. ఇవి కాదు ముఖ్యం. మనం చేసే పని ఇష్టంతో చేస్తున్నామా లేదా?.. మన పనిని ఎంత గౌరవిస్తున్నాం? ఎంత నిబద్దత, నిజాయితీతో చేస్తున్నాం?.. ఇవి ముఖ్యం. అప్పుడే మన జీవితానికి మనం రియల్ హీరోలమవుతాం. ఇప్పుడు అలాంటి రియల్ హీరో గురించే చెప్పుకోబోతున్నాం. ఆయన పేరు డి. శివన్. తమిళనాడులోని కూనూర్ పోస్టాఫీస్ లో పోస్టుమాన్. 66 ఏళ్ల శివన్.. గతవారంలో రిటైర్ అయ్యేంత వరకు 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు. దట్టమైన అడవిలో క్రూర మృగాలకు సైతం వెరవకుండా రోజుకు 15 కిలోమీటర్లు నడిచి, బాహ్య ప్రపంచం తొంగిచూడలేని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ఉత్తరాలు అందించి విధులు నిర్వహించారు. తన విధుల్లో భాగంగా నీలగిరి మౌంటైన్ రైల్వే ట్రాక్‌ మీదుగా వెళ్లేటప్పుడు పలుమార్లు ఏనుగులు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు వెంటపడ్డాయి. ఎన్నోసార్లు విష సర్పాలు ఆయనపై బుసకొట్టాయి. అయినా శివన్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. 2016లో వచ్చిన ఓ కథనం ప్రకారం ఆయన జీతం రూ.12 వేలు. దానినిబట్టే అర్థంచేసుకోవచ్చు.. ఆయనకు ప్రేమ, ఆయన సంపాదించే డబ్బుపై కాదు.. ఆయన చేసే పనిపై అని.  శివన్ పదవీ విరమణ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "డి. శివన్ ఉత్తరాలు చేరవేసేందుకు రోజుకు 15 కిలోమీటర్లు దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లారు. అడవి జంతువులు వెంటపడినా.. వెనుకంజ వేయలేదు. వాగులు వంకలు దాటుకుంటూ సేవలు అందించారు. 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు." అని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. రోజుకు 15 కిలోమీటర్లు నడిచి విధులు నిర్వహించిన పోస్టుమాన్‌ శివన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనను సూపర్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. కూనూర్ పోస్టు ఆఫీసుకు శివన్ పేరు పెట్టాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

విజయసాయి రెడ్డిపై విరుచుకు పడిన బీజేపీ నేతలు 

వైసీపి ఎంపీ విజయ సాయి రెడ్డి సాధారణంగా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ ఘాటైన ట్వీట్ పెట్టడం దానికి టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం కామన్. ఐతే తాజాగా అయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా పై ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ల పై బీజేపీ నేతలందరూ మూకుమ్మడిగా దాడి చేసారు. ఇంతకూ విజయ్ సాయి రెడ్డి కామెంట్స్ ఏంటంటే "ఏపీలో బిజెపి లేకుండా చేయాలన్న కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని మిమ్మల్ని నేను అలెర్ట్ చేయడం తప్పా? " అని ఏపీ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను అయన ప్రశ్నించారు. అంతే కాకుండా "అన్ని పార్టీల వ్యవహారాల్లో తలదూర్చే కన్నా తమపార్టీ గురించి మాత్రం అలెర్ట్ చేసినా పట్టించుకోవడం లేదని కొంపదీసి ఆయన కూడా పసుపు మిడతల దండులో భాగస్వామేనా?. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. కానీ బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా మాత్రం సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి విజనరీ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది'' అని విజయసాయి తన తాజా ట్వీట్ లో కన్నాను నిలదీశారు. ఐతే దీని పై బీజేపీ నేత‌లు తీవ్రంగా స్పందించారు. విజ‌య‌సాయి ట్వీట్ పై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్ తో పాటు నేత‌లంతా మూకుమ్మ‌డిగా ఎంపీ విజయ్ సాయి రెడ్డి పై దాడి చేసారు. "రాజకీయ నాయకులు మీ పార్టీలో చేరితే ఆరిందాలు, మిగ‌తా పార్టీలో చేరితే మిడ‌త‌లా…? అయినా గురివింద గింజ త‌న న‌లుపెర‌గ‌దు " అంటూ బీజేపీ నేత స‌త్య‌కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. "కేవ‌లం ప‌సుపు రంగు మాత్ర‌మే కాదు అన్ని రంగులను కాషాయం చేయ‌గ‌ల స‌త్తా బీజేపీకి ఉంది. ముందు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్ల మాసిపోతున్నమీ పార్టీ రంగు సంగతి చూసుకోండంటూ" అంటూ ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్, ఎంపీ విజయ్ సాయి రెడ్డి కి రిప్లై ఇచ్చారు. మరో పక్క "మీరు బీజేపీ విష‌యాలు ప‌ట్టించుకోవ‌టం మాని మీ సొంత పార్టీ వ్య‌వ‌హ‌రాలు చేసుకోవాల‌ని" బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మి నారాయణ విజ‌య‌సాయి రెడ్డి కి చుర‌క‌లంటించారు. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎపి బీజేపీ లో నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఇప్పటి వరకు ఉండేది. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వాన్ని ఇలా విమర్శించగానే అటు ఢిల్లీ నుండి జివిఎల్ నరసింహారావు వైసిపి ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడే వారు. దాంతో కన్నా సైలెంట్ అయిపోవడం కామన్. ఇక సోము వీర్రాజు గారు సరే సరి. ఆయన ఇప్పటికి ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ పైన దాడి చేస్తూ వైసిపి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారు. ఐతే పార్టీలో ఎం జరిగిందో ఏమో కానీ తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ను టార్గెట్ చేస్తూ విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు అందరు మూకుమ్మడిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

వైసీపీలో ఏం జరుగుతోంది?.. ఎంపీపై ఎమ్మెల్యే ఫిర్యాదు

అధికార పార్టీ వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదిరింది. ఎంపీ రఘురామకృష్ణరాజుపై భీమవరం వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.  తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఆయన వ్యాఖ్యలు చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. కాగా, బుధవారం పోడూరు పోలీస్ స్టేషన్ లో ఇదే రీతిలో మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

డి విటమిన్ లోపించిన వారిలోనే ఎక్కువగా

హైదరాబాద్ లో 70-80శాతం మందిలో లోపం ఆధునిక జీవన శైలికి అలవాటు పడ్డ నగర జీవి ఎండ తగలకుండా నీడపట్టున పని చేస్తున్నాడు. రాత్రి పగలు తేడా తెలియకుండా, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలను గమనించకుండా యంత్రంలా తన పని తాను చేసుకు పోతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎండ తగలకుండా ఏసీలో పని చేసే వాళ్ళకే కరోనా ఎక్కువగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  డి విటమిన్ లోపం లేని వారు కరోనా బారిన పడినా త్వరగా కొరకు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మంది వరకు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీరంలో ఉండే సైటోక్వీన్స్ వాటిని తరిమికొడతాయి. అయితే విటమిన్ డి లోపం ఉన్న వారిలో ఇవి తమ పనిని సమర్థవంతంగా చేయలేవు. అంతేకాదు ఎదురు దాడి చేసి శరీరంలోని ఇతర మూలకాలను దెబ్బ తీస్తున్నట్లు పరిశోధనల్లో స్పష్టమైంది. దాంతో రోగి ఊపిరితిత్తులు గుండె కాలేయం కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు విఫలం అవుతున్నాయి. ప్రాణాపాయ పరిస్థితికి ఇదే కారణం అవుతుంది.  పోషకాలతో కూడిన ఆహారంతో పాటు తగినంత ఎండ శరీరానికి తగిలేలా దినచర్య ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

గాలి ద్వారా వ్యాప్తి.. ప్రాణాలకు భద్రత లేని వైనం

- ఎవరు పాజిటివ్,  ఎవరు నెగిటివ్ - అదనంగా మాస్కో ఒకటే - అంతా సేమ్ టు సేమ్ - నగరంలో గుంపులుగా తిరుగుతున్న ప్రజలు  - గాడి తప్పిన వైద్యం - చేతులెత్తేసిన ప్రభుత్వం  - ప్రాణాలకు భద్రత లేని వైనం  - గాలి ద్వారా వ్యాప్తిపై తాజాగా డబ్ల్యూహెచ్వో ప్రకటన  ఇప్పటివరకు కోవిద్ వైరస్ సోకిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు పడితేనే ఈ వైరస్ మరొకరికి సోకుతుంది అనుకునేవారు. అయితే తాజాగా డబ్ల్యూహెచ్వో గాలిలో ద్వారా వైరస్ వ్యాప్తి చెందవచ్చు అని స్పష్టం చేసింది. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో హైదరాబాదులో మాత్రం రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో ఉంది. పరీక్షలు నిర్వహిస్తే ఈ సంఖ్య లక్షల్లోకి చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో కరోనాతో బాధపడుతున్న దేశాల్లో మన దేశం మూడో స్థానానికి చేరింది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే పరీక్షలు నిర్వహిస్తే మన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కేసులు మన రాష్ట్రంలోనే ఉంటాయేమో. వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తే  పాజిటివ్ కేసులు వేల  సంఖ్యలోనే నమోదు అవుతున్నాయి. మరి పరీక్షలు లక్షల్లో నిర్వహిస్తే అన్న ప్రశ్న ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుంది. ఈ లెక్కలు చూస్తే ప్రస్తుత నగర జనాభాలో లక్షల్లో రోగుల సంఖ్య ఉండే ప్రమాదం ఉంది. మంచి ఆహారం తీసుకుంటూ పదిహేను రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే  కోలుకోవచ్చు. కానీ ఎవరూ పాజిటివ్, ఎవరూ నెగిటివ్ తెలియని పరిస్థితిలో ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. పరిస్థితి భయంకరంగా ఉన్న మాస్కులు ధరించకుండా ఇంటి నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. వారి మీద కేసులు నమోదు చేసినప్పటికీ ఫలితం మాత్రం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే అరెస్ట్

గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జయిని నగరంలోని మహంకాళీ దేవాలయంలో పూజలు చేసేందుకు వికాస్ దూబే రావడంతో అక్కడి గార్డు అతన్ని పట్టుకొని.. ఉజ్జయిని జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో‌ తనను పట్టుకునేందుకు వచ్చిన 8మంది పోలీసులను హతమార్చి వికాస్‌ దూబే పారిపోయిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా 40మంది ప్రత్యేక పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం గాలించినా అతడు దొరకలేదు. గత వారం రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వికాస్ దూబే.. ఎట్టకేలకు గురువారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పోలీసులకు పట్టుబడ్డాడు.

ఆయనకు మాస్క్ ఇస్తే జేబులో పెట్టుకున్నారు.. ఇప్పుడు కరోనా వచ్చింది: కేటీఆర్ 

తెలంగాణాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో అటు పోలీసులు, ఇటు వైద్య సిబ్బంది దీని బారిన పడుతున్నారు. వీరితో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, మరో ముగ్గురు టీఆరెస్ ఎమ్మెల్యేలు కు వైరస్ సోకింది. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఐతే ఇదే విషయమై మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో ఒక కార్యక్రమం లో పాల్గొంటూ ఒక ఆసక్తికర సంగతి చెప్పారు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో తాను ఉపసభాపతికి ఒక మాస్క్ ఇచ్చానని ఐతే అయన దానిని వాడకుండా జేబులో పెట్టుకున్నారని అన్నారు. అదేమని అడిగితె మేము హైదరాబాద్ వాళ్ళం గట్టిగా ఉంటాం అన్నారని తెలిపారు. ఇపుడు ఆయనకు కరోనా సోకిందని కేటీఆర్ చెప్పారు. మనం జాగ్రత్తలు పాటించడం మన కోసమే కాదు మన కుటుంబం కోసం కూడా అని ఈ సందర్భంగా అయన అన్నారు. కరోనా నుండి రక్షణ కోసం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ప్రజలకు సూచన చేసారు.

తెలంగాణలో లాక్ డౌన్ పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చినట్లేనా..!

తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో మ‌రోసారి లాక్ డౌన్ విధించండి అంటూ ఉద్యోగులు, ఆరోగ్య శాఖ వారు కోరుతున్నార‌ని స్వ‌యంగా సీఎం కేసీఆర్ కొద్దీ రోజుల క్రితం ప్ర‌క‌టించారు. త్వరలో లాక్ డౌన్ పై కేసీఆర్ ఒక ప్రకటన చేస్తార‌ని స్వ‌యంగా వైద్య శాఖా ‌మంత్రి ఈటెల కూడా ప్ర‌క‌టించారు. ఐతే అటు క్యాబినెట్ భేటీ జ‌ర‌గ‌లేదు.. ఇటు సీఎం కేసీఆర్ కూడా అధికారిక కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఐతే తెలంగాణ ప్ర‌భుత్వంలో కేసీఆర్ త‌ర్వాత అంత ప్రాముఖ్యత కేటీఆర్ కు ఉన్న ‌నేప‌థ్యంలో తాజాగా లాక్ డౌన్ విష‌యంలో అయన చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తున్నాయి. మనకు జీవితం మాత్ర‌మే కాదు జీవ‌నోపాధి కూడా ముఖ్య‌మేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తుంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఐతే జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు లాక్ డౌన్ విధించకుండా అటు టెస్టుల సంఖ్య పెంచకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

వ్యాక్సిన్ రాకపోతే అప్పటికి భారత్ లో రోజుకు 2.5 లక్షల కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచానికి ఈ ముప్పు ఇప్పటిలో తొలగి పోదని ఒక పక్క డబ్ల్యు హెచ్ఓ చెపుతోంది. ఈ మహమ్మారిని కనుక సమర్ధవంతంగా కంట్రోల్ చేయకపోతే 2021 మార్చ్ నాటికీ 25 కోట్ల మంది ప్రజలకు ఈ వైరస్ సోకడంతో పాటు 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో మనం చూస్తున్నది ప్రారంభ దశ మాత్రమే అని, ముందు ముందు కరోనా అసలైన తీవ్రతను చూడవలసి రావచ్చని ఆ పరిశోధకులు చెపుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరికి అంటే వచ్చే డిసెంబర్ కు కనుక వ్యాక్సిన్ రాకపోతే కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం వచ్చే మార్చ్ 2021 నాటికీ మన దేశం లో రోజుకు 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. అప్పటికి కరోనాతో అత్యంత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే దేశం భారతేనట. ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉన్నా 2021 ఫిబ్రవరి నాటికి ఇండియా టాప్‌కి వెళ్తుందని ఆ అధ్యయనం తెలియ చేస్తోంది.

జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా: కేశినేని నాని

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆయన నివాసంలో పరామర్శించారు. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వంగలపూడి అనిత, గద్దె అనురాధ, గొట్టిపాటి రామకృష్ణ తదితరులు ఉన్నారు. కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. సౌమ్యుడైన కొల్లు రవీంద్ర అక్రమ అరెస్ట్ రాక్షసమైన కుట్రపూరిత చర్య అని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. హిట్లర్ యూదులను అణచివేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని అన్నారు. అలాగే ఏ వర్గాన్ని కానీ, ఏ పార్టీని కానీ అక్రమ పద్ధతుల్లో అణచివేయడం మీ వల్ల కాదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను అన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాలను అక్రమ పద్ధతుల ద్వారా అణచివేయాలనుకోవడం అమానుషం. యావత్ తెలుగుదేశం పార్టీ వారందరికీ అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లు ప్రతి రోజు కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా జగ్గయ్యపేట నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. అధికారులు న్యాయానికి, ధర్మానికి విధేయులుగా ఉండాలి తప్ప, అధికార పక్షానికి కాదని గ్రహించాలని కేశినేని నాని హితవు పలికారు. రాష్ట్ర టీడీపీ మహిళ అధ్యక్షురాలు, వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఇలాంటి కుట్రపూరిత వ్యవహారశైలిని ఎప్పుడూ చూడలేదన్నారు. అన్యాయంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టుల ద్వారా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, మహిళల పట్ల మీ వైఖరి మార్చుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కొల్లు రవీంద్ర గారు చాలా మంచి వ్యక్తి. అన్ని విధాలా టీడీపీ, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని అనిత స్పష్టం చేశారు. 

రైతు దగా దినోత్సవం.. ఒక్కో రైతుకు రూ. 80 వేలు నష్టం

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వ్యవసాయ బడ్జెట్‌లో 35శాతం మాత్రమే ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదని విమర్శించారు. 65 శాతం బడ్జెట్ రైతులకు ఖర్చు చేయలేక పోవడం మీ చేతగానితనం కాదా.. ? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవమని విమర్శించారు. వ్యవసాయానికి 10 శాతం బడ్జెట్ పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. టీడీపీ హయంలో ఐదేళ్లలో వ్యవసాయానికి 90వేల కోట్ల నిధులు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ సర్కారు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తది కాదని, అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతు భరోసా పథకం తీసుకువచ్చారని అన్నారు.  రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది రూ37,500 మాత్రమే అని, అదే టీడీపీ ప్రభుత్వం వచ్చి వుంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవని తెలిపారు. ఒక్కో రైతుకు 5 ఏళ్లలో రూ. 80 వేలు నష్టం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా.. బడ్జెట్ లో చెప్పిన సంఖ్యలోనే 10 లక్షల మంది రైతులకు భరోసా ఎగ్గొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వేళ కానరాని మానవత్వం.. నడి రోడ్ పైనే యువకుడి మృతి

హైదరాబాద్ లోని ఈసీఐఎల్‌లో బుధవారం నాడు ఒక విషాదం చోటు చేసుకుంది. స్థానిక జవహర్ నగర్ కు చెందిన యువకుడు ఈసీఐఎల్‌ వద్ద ఉన్న ఆస్పత్రిలో కొద్దిరోజుల నుంచి చికిత్స పొందుతున్నా జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో అతడిని మరో పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆటోలో అతడిని వేరే హాస్పిటల్ కు తీసుకెళుతున్న సమయంలో హఠాత్తుగా అతడి పరిస్థితి విషమించింది. దీంతో ఈసీఐఎల్ దగ్గర అతడిని రోడ్డుపైనే దించారు. దీంతో సాయం కోసం అతడితో వచ్చిన ఇద్దరు మహిళలు చుట్టూ పక్కల ఉన్నవారిని వేడుకున్నారు. అదే సమయంలో 108 అంబులెన్స్ ‌కోసం కొందరు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపు అతడు చనిపోయాడు. అయితే అతడు కరోనా కారణంగానే చనిపోయాడా లేక ఇతర అనారోగ్యంతో కన్నుమూశాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుండటం తో పక్క వాడు చావు బతుకుల్లో ఉన్న పట్టించుకోని పరిస్థితి దాపురించింది.

నిమ్మగడ్డ కేసులో మరోసారి జగన్ సర్కార్‌కు చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కార్ పంతం నెగ్గేలా కనిపించడంలేదు. నిమ్మగడ్డ కేసులో మరోసారి జగన్ సర్కార్‌కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉండకూడదని, కాబట్టి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను పునర్నియమించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పినందున ఆ పదవి ఖాళీగా ఉన్నట్టు ఎలా అవుతుందని ప్రశ్నించింది. అంటే, పరోక్షంగా ఆ పదవిలో నిమ్మగడ్డ ఉన్నారు కదా అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరగా, దాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం.. రేపటి నుంచి పూర్తిగా మూసివేత

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ హైకోర్టు సిబ్బందికి, సెక్యూరిటీ బలగాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు హైకోర్టులో మొత్తం 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.  హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు.

రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని జగన్ సర్కార్ 'రైతు దినోత్సవం'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "ఈ రోజు వైఎస్ జగన్ 'రైతు దగా దినోత్సవం'. విత్తనాలు ఇవ్వలేని కొడుకు, 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం వృధా చెయ్యడం దారుణం." అని లోకేష్ వ్యాఖ్యానించారు. "వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కోత, భరోసా లో కోత, గిట్టుబాటు ధర అడ్రెస్స్ లేదు, ఏడాదికి లచ్చ రూపాయిల లబ్ది రత్నం గల్లంతు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న సున్నా వడ్డీకి పేరు మార్పు, ఉచిత విద్యుత్ పథకానికి పేరు మార్పు. రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప." అని విమర్శించారు లోకేష్. అన్నట్టు లోకేష్ వాడిన 'యుశ్రారైకాపా' పదం అర్థమైందో లేదో. 'యుశ్రారైకాపా' అంటే 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి షార్ట్ ఫామ్ అన్నమాట.

కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు?.. సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు

తెలంగాణ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కరోనా విలయతాండవం, పాత సచివాలయం కూల్చివేత వంటి అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నాయి. కరోనా కాలంలో ఉద్యోగులకు పూర్తీ జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ఇంత కంగారుగా పాత సచివాలయం కూల్చివేసి రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 2012-13లో పూర్తయిన భవనాలను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని, విభజన చట్టం ప్రకారం గవర్నర్ సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. విపక్షాల వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు? ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఆగిందా? అంటూ ప్రశ్నించారు. సచివాలయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విషాన్ని కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్రా నాయకులే కారణమని ఇన్నాళ్లూ భావించామని, కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడర్థమవుతోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డీ.. ముందు నీ కుర్చీ కాపాడుకో, తెలంగాణ ఉద్యమంలో నువ్వెకడున్నావ్ అంటూ ప్రశ్నించారు.  బిల్డింగ్‌లు అప్పగించి ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని గుర్తుచేసారు. ఆంధ్రా వాళ్లు మాట్లాడినట్టు మీరు కూడా సెక్షన్-8 అంటున్నారు. మరోసారి సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు. హైదరాబాద్ నగరం తెలంగాణ సొత్తు. ఇక్కడ ఇతరుల పెత్తనాన్ని సహించం అంటూ వ్యాఖ్యానించారు. పాత సచివాలయంలోకి కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి ఉంది. సచివాలయం రాష్ట్రానికి ఒక ఐకాన్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైనప్పటినుండి వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొద్ది రోజుల క్రితం అయన కార్యాలయం ఐన ప్రగతి భవన్ లో 30 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అయన అటు మీడియా సమావేశాల్లో కానీ లేదా అధికారుల తో సమీక్షలు కానీ నిర్వహించినట్లుగా పెద్దగా సమాచారం లేదు. దీనికి తోడు ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కి రావద్దన్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అక్కడి నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలన సాగించేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే ఇపుడు కేసీఆర్ ఆరోగ్యం పై స్పష్టత కోరుతూ హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలైంది. నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న ఈ పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ లో ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో లేదా అందుబాటులో లేరన్న సాకు తో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సక్రమంగా పనిచేయట్లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా ఉందో అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని పిటిషనర్ తెలిపారు. గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి రోజు కేసీఆర్ చివరిసారిగా మీడియా ముందుకు వచ్చారని ఆ పిటిషన్‌లో తెలిపారు. ఐతే ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.