రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు.. మరింత అప్రమత్తంగా ఉండాలి

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ దేశంలో వేలాది సంఖ్యలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులను కట్టిడి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కోవిడ్ -19 నియంత్రణ పై ఆయన చర్చించారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సామర్థ్యాలను పెంచడం, ట్రేసింగ్, టెస్టింగ్, ఇతర చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కరోనా రోగుల మరణాల సంఖ్య సాధ్యమైనంత తగ్గించడం పై దృష్టి పెట్టాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కు సూచించారు.  పీపీఈ సూట్స్, , N-95  మాస్క్ ల లభ్యత, క్లినికల్ మేనేజ్ మెంట్ , ఇతర మౌళిక సదుపాయాల సమస్యల పై ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర బృందం సందర్శన అనంతరం పరీక్షా సదుపాయాలను పెంచడం , కంటైన్ మెంట్ జోన్లలో కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డి.జి.పి. మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రవి గుప్త, వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గౌబా సూచించారు.

వద్దంటే టెన్త్ ఎగ్జామ్స్ పెట్టారు.. స్టూడెంట్స్ ను కరోనా చుట్టేసింది

భారత్ లో కరోనా తీవ్రత దృష్ట్యా మార్చ్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఐతే అదే సమయంలో పలు రాష్ట్రాలలో స్టార్ట్ కావాల్సిన టెన్త్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. ఐతే ఒకసారి లాక్ డౌన్ సడలింపులు వచ్చిన తరువాత పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరపకుండానే గ్రేడ్ లు ఇచ్చి రిజల్ట్స్ ప్రకటించాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఏమైనా సరే ఎగ్జామ్స్ జరిపి తీరాలని తీవ్రంగా ప్రయత్నించినా తెలంగాణాలో హైకోర్టు జోక్యం తో పరీక్షలు జరపకుండానే గ్రేడ్లు ఇచ్చి రిజల్ట్స్ ప్రకటించారు. ఐతే ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టె ది ఇంకో దారి అన్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం ప్రజలు ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా పరీక్షలు రాయాల్సిందే అని పట్టు బట్టి మరీ పరీక్షలు నిర్వహించారు. మొన్న జూన్ 25 నుండి జులై 3 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 7,61,506 మంది ఈ ఎగ్జామ్స్ రాసారు. ఇపుడు ఈ ఎగ్జామ్స్ రాసిన వారిలో 32 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐంది. దీంతో ఆ విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జులై 3 తో చివరి ఎగ్జామ్ పూర్తయింది కాబట్టి ఆ రోజు నుండి 14 రోజులు వరకు అంటే జులై 17 వరకూ విద్యార్థులకు ఎప్పుడైనా కరోనా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఐతే పరీక్షలు జరిగిన 9 రోజుల్లోనే 32 మందికి కరోనా సోకిందంటే, ఈ ఎగ్జామ్డ్ టైం లో ఇంకా ఎంతమందికి అది సోకిందో అని ప్రజలు ఆందోళన లో ఉన్నారు. ప్రస్తుతం ఈ 32 మందికి తోడు మరో 80 మంది విద్యార్థుల్ని ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద ప్రభుత్వం ఇళ్లలోనే క్వారంటైన్ చేసింది. అయినా ప్రపంచం మొత్తం కరోనా కు భయపడి తమ కార్యకలాపాలు తగ్గించుకుంటూ ఉంటె కర్ణాటక వంటి ప్రభుత్వాలు మాత్రం మొండిగా వ్యవహరించడం ఇటు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది.

చర్లపల్లి జైలును సందర్శించిన ఎంపీ సంతోష్

ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల పరిశీలన.. ఎంపికి తమ సమస్యలపై వినతిపత్రం అందించిన ఖైదీలు.. చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న వారి సమస్యలను, వారిలో సత్ ప్రవర్తన కలిగిన వారిని జాతీయ పండుగల సందర్భంగా విడుదల చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. జైలు శాఖాధిపతి రాజీవ్ త్రివేది, ఐ.పి.యస్ తో కలిసి ఆయన శనివారం చర్లపల్లిలోని కే౦ద్ర కారాగారం సందర్శించారు. జైలు ఆవరణలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన సంజీవని(హాస్పిటల్) సందర్శించి అక్కడ కల్పిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. ప్రొఫెసర్ సి. బీనా గారి ఆధ్వర్యంలో ఖైదీలకు కల్పించిన M.Sc. Psychology Lab ను సందర్శించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారం టెస్ట్ చేసి బాగున్నాయని మెచ్చుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్ లో ఖైదీలు  తమ క్షమాభిక్ష అంశాన్ని సిఎం గారి చెప్పాలని కోరుతూ వినతిపత్రం అందించారు. జైలులో ఉన్న ఖైదీల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన పరిశ్రమల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా నూతనంగా నిర్మించబడిన శానిటైజర్ పరిశ్రమను మెచ్చుకున్నారు. ఇతర ఉపాధి శిక్షణా అంశాలను పరిశీలించి ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు.

ముగ్గురు ఎమ్మెల్యే లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో అనేక మంది మొక్కలు నాటి ప్రకృతిపై తమ ప్రేమను చాటుతున్నారు.  ఆదిలాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన మాజీమంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మరో ముగ్గురు ఎమ్మెల్యే లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు  వారియర్ లను మొక్కలు క్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్న హరిత హారం కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తుందన్నారు.

ఏపీలో రాజకీయ పెనుమార్పులు.. వచ్చే ఏడాది కొత్త సీఎం!!

విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని తానేనని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానం మొదటి నెలలోనే అర్థమైందని, వైసీపీ విధానాలతో తెలుగు ప్రజల ఆశలు ఆవిరయ్యాయని విమర్శించారు. అమరావతిపై వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు గుండెల్లో గుబులు రేపేలా ఉన్నాయని మండిపడ్డారు. అమరావతి ఉద్యమంలో మహిళలు మాట్లాడే మాటలు అమోఘమని, వారి డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఉద్యమం ప్రజలమనసులను కలచివేసింది అని, ప్రభుత్వం చర్యలను ప్రజలంతా చీదరించుకుంటున్నారని అన్నారు. విశాఖ నుండి అమరావతి వరకు పాదయాత్రగా రావాలని తాను భావించానని, కానీ కరోనా కారణంగా వాయిదా పడిందని సబ్బంహరి తెలిపారు.  కౌన్సిల్ రద్దు చేస్తామని చెప్పి మరల వెనకడుగు వేసి కౌన్సిల్ నడుపుతున్నారని జగన్ సర్కార్ ని ఎద్దేవా చేశారు. రంగులు మార్చే పని చేస్తున్నారని విమర్శించారు. మరో నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు భరించవలసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి స్ధానంలో జగన్మోహన్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తి ఉండే అవకాశం ఉంటుందనే సమాచారం ఉందని సబ్బంహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  60 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఇటుక ఇటుక కట్టి అభివృద్ధి చేస్తే కట్టుబట్టలతో బయటకు పంపారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆశలకు రూపకల్పన చేసిందని కొనియాడారు. కానీ ప్రభుత్వం మారడం వలన ప్రజలు రోడ్లుపైకి వచ్చారని అన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వారు ప్రభుత్వం మారడంతో నిరాశకు గురయ్యారని తెలిపారు. అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యం అవుదామని.. గత ప్రభుత్వంలో ప్రజలు కన్న కలలు సాకారం అయ్యేందుకు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి  పోరాటం చేయాలని సబ్బంహరి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం రాక్షసక్రీడలు ఆడుతుంది అని మండిపడ్డారు. 2022 లో జమిలి ఎన్నికలు వస్తాయి.. ఇదే జరిగితే మనం కలలు కన్నఅమరావతి రాజధాని సాకారం అవుతుంది అని అన్నారు. అమరావతి మార్చే పరిస్థితి లేదు.. రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు జరుగుతాయని సబ్బంహరి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చినట్లేనా

తెలంగాణలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఐతే ప్రతి రోజు వందల నుండి ఏకంగా వేలలో కేసులు నమోదవుతున్నాయి. పటిష్టమైన భద్రత, కట్టుదిట్టమైన ప్రివెంటివ్ వాతావరణం లో ఉండే సాక్షాత్తు ప్రగతి భవన్ ను సైతం చుట్టుముట్టేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ప్రగతి భవన్ లో 30 మంది కి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారని కొద్దీ రోజులుగా మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. మరో పక్క లాక్ డౌన్ పక్కా అనే వార్తలు రావడం తో ఏపీకి చెందిన నగరవాసులు ఏపీ బాట పట్టడంతో హైవే టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఐతే తెలంగాణ కేబినెట్ సమావేశంలో దీని పై చర్చించి మళ్ళీ లాక్ డౌన్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు దీని పై ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అసలు కేబినెట్ సమావేశం ఎపుడు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ప్రజలు మాత్రం లాక్ డౌన్ డెసిషన్ తో సంబంధం లేకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఐతే తాజాగా ఈ విషయం పై హైదరాద్ కు చెందిన సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా కు లాక్ డౌన్ అనేది సమాధానం కాదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి పాటిస్తే కరోనా ను అదుపులో పెట్టవచ్చని అన్నారు. మరో పక్క ప్రయివేట్ హాస్పిటల్స్ కు కరోనా ట్రీట్ మెంట్ కు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శించారని ప్రస్తుతం ఈ హాస్పిటల్స్ దోపిడీ షురూ అయిందన్నారు. ఐతే ప్రస్తుతం ఈ హాస్పిటల్స్ వద్ద 10 గంటలు వేచి ఉన్నా కనీసం పేషంట్లను చేర్చుకునే పరిస్థితిలో కూడా అవి లేవని ఆయన అన్నారు. దీంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. దీన్ని బట్టి లాక్ డౌన్ ఆలోచన తెలంగాణ సర్కార్ చేయడం లేదని అర్ధమవుతోంది. లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వం కోణం మాత్రం వేరుగా ఉందంటున్నారు పరిశీలకులు. గత ఏప్రిల్, మే నెలల్లో విధించిన లాక్ డౌన్ తో ప్రభుత్వం ఆదాయం అడుగంటిందని దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలలో కూడా కోత విధించవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బహుశా లాక్ డౌన్ ఆలోచన చేయకపోవచ్చని, ఐతే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం స్ట్రిక్టుగా నిబంధనలు అమలు చేస్తారని మరో వాదన.

రైతులకు శుభవార్త.. 5 ఎకరాల లోపు భూమి ఉంటే ఉచిత బోరు

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ ఉచిత బోర్లు వేయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హత కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ లతో గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. ఒకవేళ అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతుతో కలిసి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, అప్పటికే బోర్లు ఉన్న పొలాలకు ఈ ఉచిత పథకం వర్తించదు.

భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధం పట్టి తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం పోరాడిన యోధుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు. పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీ కొన్న అతడు ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని నిరూపించాడు. తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలు అర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలాడు. ఆయన జయంతి సందర్భంగా మరో సారి అల్లూరి పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ అక్షర నివాళులు.. తూర్పు గోదావరి జిల్లాలోపాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకట రామరాజు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం సీతారామరాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సాహిత్యం బాగా చదివేవాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. 1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద కొంతకాలం ఉన్నాడు.  లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలు చూసి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. దేశంలో మారుతున్న పరిస్థితులు ఆయనను స్థిరంగా ఉండనియ్యలేదు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి ఇంటికి చేరాడు. ఆరోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కోసం అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ వచ్చాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. రాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలకు గురచేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని తన ప్రాణాలను 1924 మే 7న భారతమాత విముక్తి కోసం అర్పించాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్వతంత్య్రభారతావని చరిత్రపుటల్లో  ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. కృష్ణదేవిపేట(కే.డి పేట)లో ఆయన సమాధి యువతలో ధైర్యానికి నాంది పలుకుతోంది.

ఐదు కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి

అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకొని రాజధాని అమరావతి కోసం ఉద్యమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున అమరావతి ఉద్యమం 200 వ రోజుకి చేరుకోవడంతో.. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ తెలుగు వీర కిశోరం స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. "మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదు. స్వాతంత్య్ర సమర వీరులలో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది." అని చంద్రబాబు పేర్కొన్నారు.

నివురు కప్పిన నిప్పులా హైదరాబాద్

పదుల సంఖ్య దాటి వేలసంఖ్యలోకి చేరిన కరోనా కేసులు.. ప్రభుత్వం అన్ లాక్ అంటున్నా ప్రజలు స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.. వీధుల్లో పెరుగుతున్న టూలేట్ బోర్డులు.. పట్టణం కన్నా పల్లె పదిలం అంటూ సొంతఊర్లకు పయనమవుతున్న హైదరాబాద్ వాసులు.. మొన్న పదుల్లో, నిన్న వందల్లో, నేడు వేలల్లో.. మరి రేపు లక్షల్లో కరోనా కేసులు నమోదు కావచ్చు అన్న భయం హైదరాబాద్ వాసుల్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. కరోనా మన వద్దకు రాదు.. వచ్చినా పారాసిటమాల్ వేసుకుంటే సరి...పైసల కన్నా ప్రాణాలు ముఖ్యం అంటూ కోవిడ్ వైరస్ వ్యాప్తికి ముందు ప్రభుత్వం ఎన్నో చెప్పింది. సింగిల్ డిజిట్ లో ప్రారంభమైన కేసులు ఆ తర్వాత ఫోర్ డిజిట్లోకి మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. లాక్ డౌన్ ప్రారంభంలో కేసుల సంఖ్య చాలా తక్కువే ఉంది. అయితే మర్కజ్ సంఘటన తర్వాత కేసులు వేగంగా పెరిగాయి. సరైన టెస్టింగ్ టెక్నాలజీ, కిట్స్ లేకపోవడం వల్ల కేవలం లక్షణాలు ఉన్నవారిని మాత్రమే పరీక్షించారు. ఆ పరీక్ష ఫలితాలు రావడానికి కూడా ఎక్కువ సమయం పట్టడంతో వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇంతింతై.. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం కూడా ఒక కారణమే అని ప్రజలు అంటున్నారు. నానాటికీ పెరుగుతున్న కేసులతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజలు మాత్రం స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఉపాధి కోల్పోయి కొందరూ... వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తో మరికొందరు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అన్ని రంగాలపై.. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. మినీ ఇండియాగా భావించే హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ దేశం నలుమూలల నుంచి వచ్చే వారి సంఖ్య లక్షల్లోనే. వీరంతా చిన్నచిన్న పనులు, ఉద్యోగాలు చేసుకునేవారే. లాక్ డౌన్ మొదటి దశలోనే వీరిలో చాలామంది సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక ఐటీ రంగంలో పనిచేవారి సంఖ్య 15లక్షలకు మించి ఉండవచ్చని ఒక అంచనా. వీరిలో ఎక్కువ శాతమంది హైదరాబాద్ కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడంతో పట్టణం వదిలి ఇంటిదారి పట్టారు. ఐటి రంగంలో పనిచేసేవారిలో దాదాపు పది లక్షల మంది సొంత ఊర్లకు వెళ్లారని తెలుస్తోంది. ఖర్చులు భరించలేక.. మాల్స్, రెస్టారెంట్స్ ల్లో పనిచేసేవారు, పార్క్ ల ముందు, థియేటర్ల చుట్టూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందేవారు దాదాపు ఐదు లక్షల దాకా ఉంటారని అంచనా. వీరిలో 80 శాతం మంది ఉద్యోగాలు పోయాయి. దాంతో పెరుగుతున్న ఖర్చులు భరించలేక, ఇంటి అద్దెలు కట్టలేక చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లారు. చదువుల కోసం వచ్చిన వారు... రాష్ట్రరాజధానిలో విద్యా, ఉద్యోగావకాశాల కోసం కోచింగ్ కు వచ్చేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.  కోచింగ్ సెంటర్ల చుట్టూ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ నిర్వహిస్తూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. విద్యార్థులతో ఎప్పుడు సందడిగా ఉండే దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి తదితర ప్రాంతాలన్నీ బోసిపోయాయి. దాదాపు 3 లక్షల మంది హాస్టళ్లు ఖాళీ చేసి ఊరెళ్లి పోయారని అంచనా.. రియల్ ఎస్టేట్, మీడియా, సినిమా రంగంపై ఆధారపడిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. ఉపాధి కోల్పోయిన వారంతా పట్టణంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ భరించలేక సొంతూరి దారి పట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లో వ్యాపారాలు, ఆస్తులు, సొంత ఇండ్లు ఉన్నవారు తప్ప మిగతావారిలో చాలామంది సొంతప్రాంతాలకు పయనం కావాల్సిందే అనిపిస్తోంది.

అధికారికంగా ప్రకటించండి.. ప్రజలు సంతోషిస్తారు

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓ లేఖ పంపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని జగన్‌ కు ఎంపీ గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేయాలని సీఎం జగన్ ను ఆయన కోరారు. కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపీ క్యారాలయం ఈరోజు మీడియాకు విడుదల చేసింది.

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కరోనా టెస్ట్‌ లో తనకు పాజిటివ్‌గా తేలిందని.. సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన.. కరోనా వచ్చిందని భయపడవద్దని అన్నారు. అది రాకూడని రోగం కాదని, ప్రమాదకారి కాదని చెప్పారు. అయితే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా సోకకుండా అందరూ కనీస జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తోందన్నారు. ఇతరులతో కారులో ప్రయాణం చేయొద్దని  సూచించారు. భయపడి టెస్టులు చేయించుకోవడం మానొద్దని మాణిక్యాలరావు పేర్కొన్నారు.

మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది బలయ్యారు

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్నఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "200 రోజులుగా రైతులను, రైతు కూలీలను, మహిళలను ఏడిపించి, మీరు సాధించింది ఏంటి వైఎస్ జగన్ గారు?" అని లోకేష్ ప్రశ్నించారు. "వైఎస్ జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా... 29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది?" అని లోకేష్ మండిపడ్డారు. "మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా?" అని లోకేష్ ధ్వజమెత్తారు. "రాష్ట్రప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' అంటూ అమరావతి కోసం ఉద్యమించండి. జై అమరావతి!" అంటూ లోకేష్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి

మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన అల్లూరి తెగువ, దేశభక్తిలను స్మరించారు. నేటి యువత ఆయన ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. "భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో.. తెలుగు నాట ఆంగ్లేయులను గడగడలాడించిన మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ యోధుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. శత్రువు బలమైన వాడని తెలిసినా.. తనవద్ద పరిమితమైన వనరులే ఉన్నా.. అచంచల ఆత్మవిశ్వాసం, గుండెలనిండా దేశభక్తితో రవిఅస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమని చెప్పుకునే ఆంగ్లేయులకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి ధైర్యసాహసాలు.. మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచాలన్న ఉక్కుసంకల్పం స్ఫూర్తిదాయకం." అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

విద్యార్థులకు శుభవార్త

25శాతం తగ్గిన ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ సిలబస్‌ కరోనా కారణంగా మూతబడిన స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉంది. కొన్నిచోట్ల ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌(సీఐఎస్‌సీఈ).. ఇండియన్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌(ఐసీఎస్‌ఈ), ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌(ఐఎస్‌సీ) సిలబస్‌ ను 25 శాతం మేర తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో  సిలబస్‌ను 25 శాతం తగ్గించింది. సవరించిన సిలబస్‌ అధికారిక వెబ్‌సైట్‌ cisce.org లో లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌ నుండి 9 నుండి 12వ తరగతుల విద్యార్థులు తాజా సిలబస్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

చైనా దురాక్రమణ పై లడాఖ్ ప్రజలు అలా.. మోడీ ఇలా.. రాహుల్ ఫైర్

భారత్ చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగి రెండు వైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఐతే ఈ ఘర్షణ కు కారణం చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకు రావడం వల్లే జరిగిందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. మరో పక్క ప్రధాని మోడీ మాత్రం చైనా సైన్యం మన భూభాగం లోకి రాలేదని చెప్పడం జరిగింది. ఐతే తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా దురాక్రమణ విషయంలో మోడీ పై ఫైర్ అయ్యారు. ప్రధాని తన లేటెస్ట్ స్పీచ్ ల లో ఎక్కడ కూడా చైనా పేరెత్తకుండా మౌనం వహిస్తున్నారని అన్నారు. మోడీ ఎక్కడా చైనా అధ్యక్షుడు జింపింగ్ పై పల్లెత్తు మాట కూడా అనడం లేదని అసలు భారత పట్ల అయన నిబద్దత ను శంకించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. ఒకపక్క లడాఖ్ ప్రజలు తమ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని చెపుతుంటే.. మరో పక్క ప్రధాని మాత్రం మన భూభాగం లోకి ఎవ్వరు రాలేదని అంటున్నారని ఐతే ఈ ఇద్దరి లో ఎవరో ఒకరు అబద్దం ఆడుతున్నారని అర్ధమౌతోందన్నారు. ఇదే సమయంలో దేశభక్తులైన లడాఖ్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా నినదిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అయన లడాఖ్ ప్రజలు చైనా వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియోను షేర్ చేసారు. లడాఖ్ ప్రజల హెచ్చరికలు విస్మరిస్తే మన దేశానికీ తీవ్ర నష్టం జరుగుతుందని అయన తన ట్వీట్ లో హెచ్చరించారు. ఒక పక్క ప్రధాని మోడీ లడాఖ్ లోని సరిహద్దు ప్రాంతం లో ఉన్న సైనిక శిబిరాల వద్ద పర్యటన చేస్తున్న సమయంలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈనెల 31 వరకు రద్దు

ప్రత్యేక పరిస్థితుల్లో ఇరుదేశాల అంగీకారంతో సర్వీసులు దేశీయ, కార్గో సర్వీసులు అందుబాటులో ఉంటాయి అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈనెల 31వరకు రద్దు చేస్తున్నామని పౌర విమానయాస నియంత్రణ సంస్ధ(డిజిసిఎ) ప్రకటించింది. కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్లో భాగంగా విదేశీ విమాన ప్రయాణాలను మార్చి 23 నుంచి నిలిపివేశారు. ఈనెల 15తో రద్దు గడువు ముగిసిపోతుంది. అయితే ఈ గడువును జూలై 31వరకు పొడిగిస్తామని డిజిసిఎ ఛైర్మన్ అరవింగ్ సింగ్ చెప్పారు. వందే భారత్ మిషన్ లో భాగంగా మే ఆరో తేదీ నుంచి కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయని, అవి అవసరాన్ని బట్టి నడుస్తాయని ఆయన చెప్పారు. ఆయా దేశాల్లో చిక్కుపడిపోయిన భారతీయులను స్వదేశం తీసుకురావడానికి, మన దేశంలో ఉండిపోయిన విదేశీయులను వారి దేశాలకు పంపించడానికి ఇరు దేశాల మధ్య అంగీకారంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులు నడుస్తాయి. దేశీయ విమాన సర్వీసులు, కార్గో సర్వీసులు నడుస్తాయి.

కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు ఎంపిక చేసిన 12 హాస్పిటల్స్

హైదరాబాద్ లో నిమ్స్, విశాఖలో కేజీహెచ్ ఆగష్టు 15నాటికి అందుబాటులోకి రావాలన్న ఐసీఎంఆర్ కోవిడ్ 19 వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్ఖలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎవీ సత్పలితాలను ఇవ్వలేక పోయాయి. మన దేశంలోని భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్ లాబ్ లో సత్పలితాలను ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)  అనుమతి ఇచ్చింది. మనుషులపై చేసే ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్ట్‌ 15 నాటికి ఈ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం కోసం దేశ వ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లను ఎంపిక చేశారు.  ఇందులో హైదరాబాద్ లో నిమ్స్, విశాఖలో కేజీహెచ్ హాస్పిటల్స్ ఉన్నాయి. భూవనేశ్వర్ లోని IMS, SUM హాస్పిటల్ తో పాటు  న్యూ ఢిల్లీ, పాట్నా, బెల్గాం (కర్ణాటక), నాగ్పూర్, గోరఖ్పూర్, కట్టంకులతుర్ (తమిళనాడు), ఆర్య నగర్, కాన్పూర్ ( ఉత్తర ప్రదేశ్) గోవాలోని హాస్పిటల్స్ కు అనుమతి ఇచ్చారు.

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిన్నరాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద కృష్ణ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు, వైసిపి నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర హస్తం ఉందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపించారు. కొల్లు రవీంద్ర సపోర్ట్ తోనే ఈ హత్య జరిగిందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు రెండు సార్లు సోదా చేశారు. ఐతే అయన ఆచూకీ మాత్రం దొరకలేదు. ఐతే నిన్న రాత్రి అయన విశాఖ కు వెళుతుండగా అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అసలు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా రవీంద్రను అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ కక్ష సాధింపునకు దిగుతోందన్నారు. కావాలనే కక్షసాధింపుతో రవీంద్రను ఈ కేసులో ఇరికించారని బాబు ఆరోపించారు. ఎమర్జెన్సీ టైం లో కూడా ఇన్ని అరాచకాలు చూడలేదు. అప్పుడు కూడా ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదని అయన అన్నారు. బీసీల పైన వైసీపీ ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే దీనికి నిదర్శనం అన్నారు.