తాళి కట్టి.. ప్రాణం విడిచి.. అయ్యో పాపం..
posted on Feb 27, 2021 @ 10:18AM
పెళ్లి పారాణి ఎర్రగా పండింది. ఉదయం వివాహం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం కల్లా పెళ్లింట విషాదం. కాళ్ల పారాణి ఆరక ముందే వధువు.. విధవగా మారింది. కొత్త పెళ్లికొడుకు పెళ్లైన రోజే చనిపోయాడు. శుభకార్యం కాస్తా చావు కార్యంగా మారింది. వివాహం జరిగిన రోజే వరుడు మ్రుతి చెందడంతో ఆ ఇంట విషాదం నింపింది. జరిగింది తమిళనాడులోనైనా ఆ ఘటన విన్నవారంతా అయ్యో పాపం అంటున్నారు.
గురువారం ఉదయం శుభ ముహూర్తాన 27 ఏళ్ల విఘ్నేశ్వరన్ కు సాయల్కుడికి చెందిన యువతితో వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం.. ఏడు జన్మల పాటు ఉండాలంటూ.. ముచ్చటైన ఆ జంటను అతిథులంతా ఆశీర్వదించారు. పసందైన పెళ్లి భోజనాన్ని ఆరగించి అంతా వెళ్లిపోయారు. వివాహం అనంతరం వరుడు విఘ్నేశ్వరన్ ను పెళ్లికూతురు ఇంటికి తీసుకెళ్లారు.
అత్తారిల్లంతా సండదిగా ఉంది. నవ వరుడికి మర్యాదలు చేయడంలో బిజీగా ఉన్నారు బంధువులంతా. అంతలోనే విఘ్నేశ్వరన్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఏం జరుగుతోందో ఏమో అర్థమయ్యేలోగా వరుడు కుప్పకూలిపోయాడు. బంధువులంతా ఆందోళన చెందారు. విఘ్నేశ్వరన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విధి వక్రీకరించింది. నవ వరుడు విగతజీవిగా మారాడు. అగ్ని సాక్షిగా నడిచిన ఏడడుగులు.. ఏడు గంటలైనా నిలవలేదు. పెళ్లి రోజే వరుడు చనిపోవడం ఇరు కుటుంబాల్లో విషాధం నింపింది. స్థానికంగా అందరినీ కలిచి వేసింది.