స్కూల్లో 12 మందికి కరోనా! సంగారెడ్డి జిల్లాలో కలకలం
posted on Feb 28, 2021 @ 12:25PM
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం వరకు వంద, 120 వరకే రోజువారి కేసులు రాగా... ఇప్పుడు 180కి పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఝరాసంగం, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా 12 మంది బాలికలకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. తొలుత వారిలో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారయంత్రాంగం స్కూల్లో ఉన్న అందరికి పరీక్షలు చేయించింది.
మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. అందులో 132 మంది విద్యార్థులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగిటీవ్ రాగా.. 12 మంది బాలికలకు మాత్రమే పాజిటీవ్ వచ్చింది. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టిపీసీఆర్ ద్వారా అధికారులు శాంపిల్స్ తీశారు. ఇంకా ఎంతమందికి పాజిటీవ్ వస్తుందోనని సిబ్బంది, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.