భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టు
posted on Sep 3, 2025 @ 6:13PM
హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. గణేష్ నిమజ్జనాలకు ఇప్పటివరకు పోలీసులు ట్యాంక్ బండ్ పై ఎటువంటి ఏర్పాట్లు చేయ లేదని, క్రెయిన్లు కూడా చేయలేదని ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే గణేశుడి నిమజ్జనం చేయడం కష్టమేనంటున్నారు.
గత 45 ఏళ్ల నుండి ట్యాంకు బండ్ పై గణేష్ నిమజ్జనాలు చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్త పద్ధతులు పాటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే గణేష్ నిమజ్జనాలకు యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకోకుంటే.. మండపాల నుండి వినాయకులను కదిలించేది లేదని సమితి సభ్యులు హెచ్చరించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఉత్సవ సమితి నాయకులు హెచ్చరించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనదిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.