జగన్ సర్కార్ కు డబుల్ షాక్.. అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్

అంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఒకే రోజు జగన్ రెడ్డికి హైకోర్టులో రెండు షాకులు తగిలాయి. రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. వారికి నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకుంటూ ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ జీవోకు సంబంధించి తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చిందని, కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది వివరించారు. అయితే వారి వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వ తరఫు లాయర్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. అయినా ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ  తదుపరి చర్యలను నిలిపివేస్తూ రైతులకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక గూంటూరు జిల్లాలోని సంగం డెయిరీ అంశంలోనూ జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. ఈ అంశంపై దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంగం డెయిరీకి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెలువరించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... వైసీపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.  దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. డెయిరీ కేసులో హైకోర్టు తీర్పును టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైందని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడిరైతులు సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు. డెయిరీని తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన సర్కారుకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని ధూళిపాళ్ల అన్నారు.  

జ‌గ‌న్ గాలి తీసేసిన ప‌వ‌న్‌.. స్టాలిన్‌ను చూసి నేర్చుకో సీఎం!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. పార్ట్ టైమ్ పాలిటిక్స్‌తో ఫుల్ బిజీగా ఉంటున్న హీరో. ఈ మ‌ధ్య మ‌రీ అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయాలు మాట్లాడుతున్నారు. లేదంటే, త‌న సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. వ‌కీల్‌సాబ్ మాంచి హిట్ కొట్ట‌డంతో.. మరింత జోరు, హుషారు పెంచేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి మాగ్జిమ‌మ్ సినిమాల‌న్నీ తీసేసి.. ఆ డ‌బ్బును పార్టీ ప‌టిష్ట‌త కోసం ఖ‌ర్చు చేయాల‌నేది ఆయ‌న ప్ర‌ణాళిక‌. అయితే, అన్నాళ్లూ పొలిటిక‌ల్‌గా సైలెంట్‌గా ఉంటే ఎట్టా? ప్ర‌జ‌లు ఆయ‌న్ను మ‌ర్చిపోరూ? అందుకే, తాను రాజ‌కీయాల్లో ఇంకా యాక్టివ్‌గానే ఉన్నానని చాటేలా.. అడ‌పాద‌డ‌పా స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో మెరుపు తీగ‌లా ఇలా వ‌చ్చి అలా మాయ‌మైపోయారు. అంతే. మ‌ళ్లీ అప్ప‌టినుంచీ ప‌త్తా లేకుండా పోయారు. బ‌హుషా క‌రోనా కేసుల మూలంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారో.. లేక‌, సినిమాల‌తో బిజీగా ఉన్నారో.. ఏమో గానీ.. తాజాగా, ఏపీలో రోడ్ల దుస్థితిపై జ‌న‌సేన చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంతో మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. అడుగుకో గుంత‌.. గ‌జానికో గొయ్యి.. జ‌గ‌న‌న్న స్కీమ్ సూప‌ర్ అంటూ సినిమాటిక్ డైలాగ్స్‌తో సెటైర్లు వేశారు.  ఎలాగూ యాక్టివ్ అయ్యాం క‌దా.. ప‌నిలో ప‌నిగా దేశంలో కూడా ఏం జ‌రుగుతోందోన‌ని ఓ లుక్కేసిన‌ట్టున్నారు. ఆ పొలిటిక‌ల్ స‌ర్ఫింగ్‌లో జ‌న‌సేనాని కంటిని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తెగ అట్రాక్ట్ చేసినట్టున్నారు. ముఖ్య‌మంత్రిగా స్టాలిన్ పాల‌నా విధానాల‌కు ఫుల్ ఫిదా అయిపోయారు ప‌వ‌న్‌క‌ల్యాన్‌. ఏపీలో చంద్ర‌బాబు ముద్ర ఉండ‌కూడ‌ద‌నేలా అమ‌రావ‌తిని నాశ‌నం చేసే త‌ర‌హాలో కాకుండా.. త‌మిళ‌నాడు ఏలిన గ‌త అన్నాడీఎంకే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, జ‌య‌ల‌లిత బొమ్మ‌ల‌తో కూడిన వాట‌ర్ అమ్మ క్యాంటిన్‌, అమ్మ వాట‌ర్ బాటిల్స్‌, అమ్మ ఫోటోలు ఉన్న స్కూల్‌బ్యాగ్స్ పంప‌కాన్ని.. య‌ధాత‌థంగా కొన‌సాగించ‌డం.. చూసి ప‌వ‌న్‌కల్యాణ్ బాగా ఇంప్రెస్ అయిన‌ట్టున్నారు. ఏపీలో మాదిరి ప్ర‌తిప‌క్షాల‌పై కేసులు, అరెస్టుల‌తో రివేంజ్ పాలిటిక్స్ చేయ‌కుండా, విప‌క్ష నేత‌ల‌ను పిలిచి మాట్లాడ‌టం, వారికి ప్ర‌భుత్వ క‌మిటీల్లో ప్రాధాన్యం ఇవ్వ‌డం.. తెలుసుకొని జ‌న‌సేనాని అబ్బుర‌ప‌డ్డార‌ట‌. అందుకే, ఆ మాత్రం లేట్ చేయ‌కుండా.. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ.. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో ఓ చ‌క్క‌టి ట్వీట్ చేశారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.  ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు జ‌న‌సేనాని.  ఈ ట్వీట్ చూసి నెటిజ‌న్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ల‌క్ష‌ణ‌మైనా ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. తండ్రి డెడ్‌బాడీ సాక్షిగా రాజ‌కీయం చేసిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. ఒక్క ఛాన్స్ అంటూ పెద్ద రాజ‌కీయ‌మే చేశారంటున్నారు. అంద‌ల‌మెక్కాక కూడా అడ్డ‌గోలు రాజ‌కీయం మానుకోలేద‌ని మండిప‌డుతున్నారు. కేవ‌లం చంద్ర‌బాబు బొమ్మ ఉంద‌నే కార‌ణంగానే.. అన్న క్యాంటీన్ల‌కు అర్థాంత‌రంగా తాళాలు వేసేసి.. పేద‌ల నోటి కాడి కూడును ఎత్త‌కొట్టార‌ని.. అదే త‌మిళ‌నాడులో అమ్మ క్యాంటిన్ల‌ను య‌ధావిధిగా కొన‌సాగిస్తూ సీఎం స్టాలిన్ ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొంటున్నార‌ని.. వారిద్ద‌రినీ పోల్చి చూస్తున్నారు. అలాంటి చ‌ర్య‌ల వ‌ల్లే.. ఇండియా టుడే నిర్వ‌హించిన మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో సీఎం స్టాలిన్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సొంతం చేసుకుంటే.. అదే స‌ర్వేలో అడ్డ‌గోలు నిర్ణయాల‌తో అరాచ‌కంగా పాలిస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్ 11వ స్థానానికి ప‌త‌న‌మై.. కేవ‌లం 6శాతం ప్ర‌జ‌ల అభిమానం మాత్ర‌మే చూర‌గొన్నార‌ని గుర్తు చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్‌లో సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌తీ ఒక్క కామెంట్‌.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్‌ను త‌ప్పుబ‌ట్టేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్స్‌. అదే స‌మ‌యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ కూడా రైజ్ చేస్తున్నారు.. త‌మిళ‌నాట‌ అంత మంచి పాల‌న అందిస్తున్న డీఎంకే స‌ర్కారుకు వ్య‌తిరేఖంగా ప‌ని చేస్తున్న బీజేపీకి జ‌న‌సేన‌ ఎలా మ‌ద్ద‌తిస్తోంద‌ని ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిక‌రం.   

నాలుగు దిక్కులా ద‌ళిత బంధు.. కేసీఆర్ టార్గెట్ ఆ న‌లుగురేనా?

ద‌ళిత‌బంధు. పులి మీద స్వారీలాంటి ఆ ప‌థ‌కం కేసీఆర్‌ను గ‌ట్టు దాటిస్తుందో.. గుటుక్కున మింగేస్తుందో.. అనే డౌటు. ఖ‌జానా ఖాళీ అయి భూములు అమ్ముకుంటున్న దుస్థితిలో కూడా ల‌క్ష‌న్న‌ర కోట్ల‌తో నాలుగేళ్ల‌లో ఎస్సీలంద‌రికీ ద‌ళిత‌బంధు ఇచ్చి తీరుతానంటున్నారు. ఆయ‌న అంటున్నారే కానీ.. మాట మీద నిల‌బ‌డ‌తార‌నే న‌మ్మ‌కం ఎవ‌రికీ లేదు. కేసీఆర్ చ‌రిత్ర అలాంటిది మ‌రి. కేవ‌లం హుజురాబాద్‌లో గ‌ట్టెక్క‌డానికే.. ఈట‌ల రాజేంద‌ర్‌ను దెబ్బ‌కొట్ట‌డానికే.. ద‌ళిత‌బంధు తీసుకొచ్చార‌నేది అంద‌రి అనుమానం. అందుకే, ముందు త‌న ద‌త్త‌గ్రామం వాసాల‌మ‌ర్రిలో మ‌మ అనిపించి.. ఆ త‌ర్వాతే హుజురాబాద్‌లో అట్ట‌హాసంగా ప్రారంభించేశారు. పెద్ద రాగమే తీసి.. 15వంద‌ల‌ కోట్లు జ‌మ చేసి.. ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 25 మందికి మాత్ర‌మే ద‌ళిత‌బంధు ఇచ్చారు. ల‌బ్దిదారుల ఎంపిక పేరుతో కావాల‌నే ఆల‌స్యం చేస్తున్నార‌ని.. ఉప‌ ఎన్నిక‌లు అయ్యేవ‌ర‌కూ ఇలానే లాగుతార‌ని.. ఆ త‌ర్వాత అట‌కెక్కించేస్తారంటూ ప్ర‌తిప‌క్షం ప్ర‌చారం చేస్తోంది. దీంతో.. ఉలిక్కిప‌డిన సీఎం కేసీఆర్‌.. ద‌ళిత‌బంధు అమ‌లులో మ‌రో ఎత్తుగ‌డ‌కు వ్యూహ‌ర‌చ‌న చేశారు. వ‌న్‌షాట్‌.. ఫోర్ బ‌ర్డ్స్ అనేలా.. తెలంగాణ న‌లుదిక్కులా ద‌ళిత‌బంధు పేరు మారుమోగేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  ఇప్ప‌టికే హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధు మొద‌లైపోగా.. తాజాగా మ‌రో నాలుగు మండ‌లాల్లో ద‌ళిత బంధును స్టార్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. ఆ నాలుగు మండ‌లాల‌ను వ్యూహాత్మ‌కంగా ఎంపిక చేసుకున్నార‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర‌, ద‌క్షిణ దిశ‌ల్లో.. ఒక్కో దిక్కులో ఒక్కో మండ‌లాన్ని ఎంపిక చేసి.. రాష్ట్ర‌మంతా ద‌ళిత‌బంధుపై ఒకేసారి చ‌ర్చ జ‌రిగేలా పావులు క‌దిపార‌ని అంటున్నారు. ఇన్నాళ్లూ కేవ‌లం హుజురాబాద్‌లోనే పైలెట్ ప్రాజెక్టుగా ద‌ళిత‌బంధు అమ‌లు అని చెప్ప‌డంతా.. ఆ, అయితే మ‌న‌కు కాదులే.. మ‌న జిల్లా దాకా వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే..  అన్న‌ట్టు మిగ‌తా ప్రాంతాల వారు ఆ ప‌థ‌కాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాజ‌కీయ ర‌చ్చ త‌ప్ప‌.. ద‌ళిత‌బంధు బాగోగుల‌పై ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌ట్లేదు. ఈ విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్.. వెంట‌నే మ‌రో నాలుగు మండ‌లాల్లో ద‌ళిత‌బంధు అమ‌లు నిర్ణ‌యం తీసేసుకున్నారు. కీల‌క‌మైన నాలుగు ఉమ్మ‌డి జిల్లాలే టార్గెట్‌గా అమ‌లుకు శ్రీకారం చుట్టారు. ఇప్ప‌ట్లో త‌మ‌వ‌ర‌కూ రాద‌నుకున్న ప‌థ‌కం.. హ‌ఠాత్తుగా త‌మ ఉమ్మ‌డి జిల్లాలో అమ‌ల‌వుతోంద‌నే స‌రికి అంతా అల‌ర్ట్ అవుతార‌ని.. ద‌ళిత‌బంధుపై ఆరా తీస్తార‌ని.. మ‌రింత అస‌క్తి క‌న‌బ‌రుస్తార‌నేది కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌...అంటున్నారు. అయితే, ఇలాంటి మాస్ట‌ర్ ప్లాన్‌తో పాటు మ‌రో ఖ‌త‌ర్నాక్ పొలిటిక‌ల్ స్కెచ్ కూడా దాగుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఆ రాజ‌కీయ ఎత్తుగ‌డ మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా ఉందంటున్నారు.  హుజురాబాద్‌లో బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎదుర్కోడానికే ద‌ళిత‌బంధు తీసుకొచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంటి విమ‌ర్శ‌ల‌తో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్.. ద‌ళిత‌బంధు క్రెడిట్‌ కేసీఆర్‌కు ఏమాత్రం ద‌క్క‌కుండా చేసే ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేస్తున్నాయి. బీజేపీ కంటే హ‌స్తం నేత‌లే ద‌ళిత‌బంధుపై మ‌రింత దూకుడుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏకంగా ద‌ళిత‌, గిరిజ‌న దండోరాల‌తో, దీక్ష‌ల‌తో దుమ్మురేపుతున్నారు. అటు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ త‌మ త‌మ ఏరియాల్లో సొంతంగా ద‌ళిత దీక్ష‌లు చేస్తున్నారు. ద‌ళిత నేత భ‌ట్టి.. ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ కేసీఆర్‌ను మాట‌ల‌తో కుమ్మేస్తున్నారు. అందుకే, బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్న ఇలాంటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నోళ్లు మూయించేందుకే.. వ్యూహాత్మ‌కంగా ఆయా జిల్లాల్లోని మండ‌లాల‌ను ఎంచుకొని ద‌ళిత బంధును అమ‌లు చేసేలా సీఎం కేసీఆర్ పావులు క‌దిపార‌ని అంటున్నారు.  ఆ నాలుగు మండ‌లాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం ఒక‌టి. ఆ అచ్చంపేట‌లోని కొండారెడ్డిప‌ల్లినే రేవంత్‌రెడ్డి సొంతూరు. అందుకే, కావాల‌నే రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని మండ‌లాన్ని ఎంపిక చేశార‌ని చెబుతున్నారు. ఓవైపు రేవంత్‌రెడ్డి ద‌ళిత‌బంధు మోస‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే.. అదే స‌మ‌యంలో ఆయ‌న జిల్లాలోనే ద‌ళిత‌బంధు అమ‌లు చేసి చూపించి.. రేవంత్‌రెడ్డిని కార్న‌ర్ చేయాల‌నేది కేసీఆర్ ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోంది.  ఇక రేవంత్‌రెడ్డి త‌ర్వాత ద‌ళిత‌బంధుపై అంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్సే. మా నియోజ‌క‌వ‌ర్గంలోనూ ద‌ళిత‌బంధు ఇస్తే.. తాము వెంట‌నే తమ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కూడా. రాజ‌గోపాల్‌రెడ్డి,, వెంక‌ట్‌రెడ్డిలు ద‌ళిత‌ల‌కు మ‌ద్ద‌తుగా దీక్ష‌లు కూడా చేశారు. వాళ్లు ఇంత స్ట్రాంగ్‌గా పోరాడుతుంటే ప్ర‌జ‌లు నిజ‌మే అనుకునే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి.. వారి దూకుడుకు చెక్ పెట్టేలా.. వారి అడ్డా అయిన ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని తిర్మ‌ల‌గిరి మండ‌లంలో ద‌ళిత‌బంధుకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్‌. కోమ‌టిరెడ్డి ఇలాఖాలోనే ద‌ళిత‌బంధు అమలు చేసి చూపించి.. వారి నోటికి క‌ళ్లెం వేయాల‌నేది కేసీఆర్ స్కెచ్ అంటున్నారు. ఇక‌, ద‌ళితుల కోసం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కేసీఆర్‌ నిర్వ‌హించిన‌ స‌మావేశానికి హాజ‌రై.. సీఎంతో కాస్త స‌ఖ్య‌త‌గా ఉంటూ.. సొంత‌పార్టీలోనే విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్న భ‌ట్టి విక్ర‌మార్క మ‌ద్ద‌తుకు కృత‌జ్ఞ‌త‌గానా అన్న‌ట్టు.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ధిర‌లోని చింత‌కాని మండ‌లాన్ని సైతం ద‌ళిత‌బంధు అమ‌లుకు ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.  ఇక‌, హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధుతో ఇటు ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడైన బండి సంజ‌య్ సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్‌లోనూ ద‌ళితుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. కొత్త‌గా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంను ద‌ళిత‌బంధు కోసం ఎంపిక చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న బీజేపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌, ఎంపీ అర్వింద్‌తో పాటు.. అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుతం రేవంత్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న మ‌ధుయాష్కీగౌడ్‌కూ చెక్ పెట్టేలా.. ఆ మండ‌లాన్ని ఎంచుకున్నార‌ని అంటున్నారు.  ఇలా.. ఒకేసారి నాలుగు దిక్కుల్లోని నాలుగు మండ‌లాల్లో ద‌ళిత‌బంధును అమలు చేసి.. తెలంగాణ వ్యాప్తంగా ద‌ళిత‌బంధుపై చ‌ర్చ జ‌రిగేలా చేయ‌డంతో పాటు... న‌లుగురు కీల‌క నేత‌ల నోటికి చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి, కేసీఆర్ వ్యూహాలు ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి మ‌రి...

అడుగుకో గుంత, గజానికో గొయ్యి! జగనన్న స్కీమ్ సూపర్ అన్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని సమస్యలే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో పాలనంతా అస్తవ్యస్థంగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు కనీస అవసరాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఏపీలో రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓ వైపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్న జనాలు.. నరకకూపంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ మరిన్ని కష్టాలు తెచ్చుకుంటున్నారు, ఏపీలో రోడ్లు ఎక్కడచూసినా గుంతలమయమే, అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయి. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు. రోడ్ల దుస్తితిపై విపక్షాలు ఎంతగా మొత్తుకున్నా , నిరసనలు తెలిపినా ప్రభుత్వంలో చలనం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రోడ్ల వ్యవస్థ దారుణంగా తయారయిందని.. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా పరిస్థితి ఉందని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని... ఈ రోడ్లు దెబ్బతిన్నా బాగు చేయడం లేదని దుయ్యబట్టారు. రోడ్లను బాగు చేయమని అడిగితే పోలీసులతో లాఠీఛార్జీలు చేయించే పరిస్థితులు ఏపీలో  ఉన్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.రోడ్డు బాగోలేదు, ఏదైనా చేయండి అని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగినందుకు గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.  నివర్ తుపాను సమయంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఛిద్రమైందని అన్నారు. నిలువెత్తు గోతులతో ఉన్న ఆ దారిలో ఒక ట్రాక్టర్ తిరగబడిపోయిందని చెప్పారు. గర్భిణి స్త్రీతో వెళ్తున్న ఆటో కూడా తిరగబడిపోయిందని తెలిపారు. రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధికి చెప్పినా మార్పు రాలేదని చెప్పారు. కరోనా పరిస్థితులు ఉన్నాయనో, ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనో ఇంత కాలం ఆగామని... కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోందని... నోరు తెరిచి అడిగిన వారిపై పోలీసుల సాయంతో కేసులు పెట్టించే పరిస్థితి వచ్చిందని పవన్ మండిపడ్డారు.  రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే... అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామని చెప్పారు

తెలుగుజాతి త‌ల‌రాత మార్చిన సీఎం @ 25 ఏళ్లు..

1995, సెప్టెంబ‌ర్ 1. చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు. మారిన‌ తెలుగుజాతి త‌ల‌రాత‌కు తొలి అడుగు ప‌డిన రోజు. తెలుగోడి కీర్తిప‌తాకం ప్ర‌పంచ య‌వ‌నిక‌పై రెప‌రెప‌లాడేందుకు అంకురం ప‌డిన రోజు. మ‌న పిల్ల‌లను సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తీర్చిదిద్ది అమెరికాకు వంతెన వేసిన రోజు. స‌రికొత్త హైద‌రాబాద్ నిర్మాణానికి బీజం ప‌డిన రోజు. ప్ర‌భుత్వ ప‌నితీరు మారిన రోజు. పేద‌ల చెంత‌కే ప్ర‌భుత్వం వ‌చ్చిన రోజు. అస‌లైన ప్ర‌జారంజ‌క‌ పాల‌నకు శ్రీకారం ప‌డిన రోజు. ఆ రోజు ఈ రోజు. సెప్టెంబ‌ర్ 1.  1995లో నారా చంద్ర‌బాబు నాయుడు తొలిసారి ముఖ్య‌మంత్రిగా పద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన సుభ‌దినం. ఆ రోజు జ‌రిగిన ఆ కీల‌క‌ఘ‌ట్టం తెలుగుజాతి చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని ఆ స‌మ‌యానికి ఎవ‌రూ ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, కాల‌చ‌క్రం అందుకు సాక్షిగా నిలిచి.. చంద్ర‌బాబు పాల‌నా చ‌రిత్ర‌ను సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకుంది. ఇప్ప‌టికీ రెండు తెలుగురాష్ట్రాల్లో చంద్ర‌బాబు అంటే పీక కోసుకునేంత అభిమానులు కోకొల్ల‌లు ఉన్నారంటే అతిశ‌యోక్తి కానే కాదు. ప్ర‌స్తుత‌ ఏపీ, తెలంగాణ‌లోని ఏ మారుమూల తాండాల‌కో, గిరిజ‌న గూడేల‌కో వెళ్లినా.. అక్క‌డ మీకో సీబీఎన్ ఫ్యాన్ త‌ప్ప‌క క‌నిపిస్తాడు. చంద్ర‌బాబు వ‌ల్లే మా బిడ్డ అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడ‌ని చెప్పే తండ్రులు, చంద్ర‌బాబు హ‌యాంలోనే మా అబ్బాయికి టీచ‌ర్ జాబ్ వ‌చ్చింద‌ని సంతోషించే త‌ల్లులు తెలుగురాష్ట్రాల్లో ల‌క్ష‌ల్లో ఉంటారు. చంద్ర‌బాబు జ‌మానాలోనే తాము తొలిసారి గ్యాస్ సిలిండెర్‌తో వంట చేసుకున్నామ‌ని చెప్పే పేద‌లు..  చంద్ర‌బాబు వ‌ల్లే తాము డ్వాక్రా గ్రూపుల‌తో డ‌బ్బులు పోగేసుకొని త‌మ కుటుంబాల‌ను బాగుప‌రుచుకున్నామంటూ ఆనంద‌భాష్పాలు కార్చే మ‌హిళ‌లు తెలుగునేల‌పై ఏ మూల‌కు వెళ్లినా తార‌స‌ప‌డ‌తారు. ఈ రోడ్ 'జ‌న్మ‌భూమి'లో భాగంగా వేసింద‌ని.. ఆ స్కూల్ చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టించింద‌ని.. ఇలా తెలుగురాష్ట్రాల్లో చంద్ర‌బాబు ఆన‌వాళ్ల‌ను ఎవ‌రూ తుడిపేయ‌లేరు. ఇలాంటి రాష్ట్ర గ‌తిని మార్చిన చంద్ర‌బాబు పాల‌న‌కు ఇవాళే అంకురార్ప‌ణ జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 1.. చంద్ర‌బాబు తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన రోజు. ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించార‌నే అప‌వాదుతోనే అంద‌ల‌మెక్కారు చంద్ర‌బాబు. అది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కాద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను, టీడీపీని ఓ మ‌హిళ క‌బంధ హ‌స్తాల నుంచి విడుద‌ల చేసిన రోజంటారు తెలుగు త‌మ్ముళ్లు. ఎన్టీఆర్‌లా ఛ‌ర్మిష్మా లేదు. ఆయ‌న అన‌ర్గ‌ళ వాగ్దాటీ లేదు. అయినా, చిర‌కాలంలోనే ఎన్టీఆర్‌ను మ‌రిపించారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే అంత‌కుమించి.. ప‌ని చేసి చూపించారు.  ఆ బ‌క్క ప‌ల‌చ‌ని మ‌నిషి.. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు ప‌ట్టిన ద‌శాబ్దాల బూజును, దుమ్మును ఒక్క‌సారిగా దులిపేశారు. అస‌లైన వ‌ర్క్ క‌ల్చ‌ర్‌ను తీసుకొచ్చారు. ప‌ని అంటే ఎలా చేయాలో.. ప‌నితీరు ఎలా ఉంటుంందో రుచి చూపించారు. మేం ప్ర‌భుత్వ ఉద్యోగులం.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరంటూ తోలుమందం ఉద్యోగుల‌ కొవ్వు క‌రిగించేశారు. ఫైళ్ల వారోత్సవాల‌తో.. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల్లో గుట్ట‌లుగా పేరుకుపోయిన ఫైళ్లను ప‌రుగులు పెట్టించారు. ఆక‌స్మిక త‌నిఖీల‌తో అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు. సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు, ఏ ఆఫీసుకు చెకింగ్‌కు వ‌స్తారో తెలీక‌.. నిత్యం అల‌ర్ట్‌గా ఉండేవారు ఆఫీస‌ర్లు. అంత‌కుముందు ఆఫీసులోనే నిద్ర‌పోయే క‌ల్చ‌ర్ ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. ఆ త‌ర్వాత మిల‌ట‌రీ ఆఫీసుల్లా ఎనీటైమ్‌ అల‌ర్ట్‌గా ఉండేలా చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే. బ‌ద్ద‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్‌ను.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేలా చేయ‌గ‌లిగారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వాన్ని మ‌రింత ద‌గ్గ‌ర చేశారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఉద్యోగుల మైండ్ సెట్ మార్చిన.. మాస్ట‌ర్ మైండ్ సీబీఎన్‌. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ‘పని చేసే ముఖ్యమంత్రి’ గా పేరుగాంచారు చంద్ర‌బాబు. తుఫాన్లు, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో 24 గంటల్లోనే చేరుకొని.. ద‌గ్గ‌రుండి స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించి.. సంక్షోభ స‌మ‌యాల్లో సమర్థత చాటుకొన్నారు. సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన‌ ‘శ్రమదానం’ కార్యక్రమం.. ఆ తర్వాత ‘జన్మభూమి’గా మారి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌నే మార్చేసింది. అంద‌రికీ శ్ర‌మ విలువ తెలిసేలా చేసింది. అభివృద్ధిలో అంద‌రినీ భాగ‌స్వామ్యం చేసింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో పనులు.. ప్రజలు క‌లిసిక‌ట్టుగా శ్రమదానంతో సాధించుకొని.. చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు చెప్పుకునేవారు. ఎన్నారైల‌నూ జ‌న్మ‌భూమిలో భాగ‌స్వామ్యం చేసి.. మాతృభూమి బాగుకోసం మేముసైత‌మంటూ త‌ర‌లివ‌చ్చేలా చేశారు. పచ్చదనం-పరిశుభ్రత.. చంద్ర‌బాబు మ‌దిలో మొలిచిన ఆలోచ‌నే.  చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు, అప్పటికి నామమాత్రంగా ఉన్న ‘డ్వాక్రా’ పథకాన్ని ఉద్యమంలా నడిపించిన తీరు అప్పట్లో ఓ సంచలనం. ‘డ్వాక్రా పథకం’ తో గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్యం వెల్లివిరిసింది. సామాజిక నాయకత్వం వెలుగు చూసింది. డ్వాక్రా సంఘాల విజయగాథలను తెలుసుకోవడానికి ఆనాడు దేశ, విదేశీ ప్రముఖులు ఏపీని సందర్శించేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగసిన మహిళా ఆర్థిక స్వావలంబన చైతన్యంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చంద్ర‌బాబు డ్వాక్రా గ్రూపుల‌తో ఎంత‌టి ఘ‌న చ‌రిత్ర సృష్టించారో తెలుస్తోంది.  తెలుగువారికి ఐటీని ప‌రిచ‌యం చేసి.. మ‌న జాతి త‌ల‌రాత మార్చేసిన ఘ‌నుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు. హైదరాబాద్‌ను పెట్టుబడుల కేంద్రంగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హబ్‌గా చేసింది చంద్ర‌బాబే. కంప్యూట‌ర్‌ను వాడిన తొలి ముఖ్య‌మంత్రీ చంద్ర‌బాబే. ఆనాటి హైటెక్‌సిటీతోనే ఈనాడు ఇంటింటికో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారు. వేలాది ఇంజినీరింగ్ కాలేజీల‌తో ల‌క్ష‌లాది ఐటీ నిపుణుల‌ను త‌యారు చేశారు. అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్‌నే హైద‌రాబాద్ ర‌ప్పించారు. అందుకే చంద్ర‌బాబును అప్ప‌ట్లో దేశ ప్ర‌ముఖులంతా 'సీఎం' అని కాకుండా 'సీఈవో' అని పిలిచేవారు.  సంస్క‌ర‌ణ‌ల‌తో ఏపీని ప‌రుగులు పెట్టించారు సీఎం చంద్ర‌బాబు. పోఖ్రాన్‌ అణుపరీక్షలతో భారత్‌కు రుణాలివ్వరాదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టినా, ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు రుణం తేగలిగారు. అయితే, విద్యుత్‌ రంగంలో సంస్క‌ర‌ణ‌లు స‌త్ఫ‌లితాల‌నిచ్చినా.. ఛార్జీల పెంపు విమర్శ‌లపాలైంది. దళిత వ‌ర్గానికి చెందిన బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, శ్రీమతి ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేసి.. దళితులకు స‌ముచిత గౌరవాన్ని క‌ల్పించింది అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే.  ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, వైఎస్సార్‌, కేసీఆర్‌, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. ఇలా తెలుగు నేల‌ను ఎంత‌మంది ముఖ్య‌మంత్రులు పాలించినా.. వారందిలోకెళ్లా చంద్ర‌బాబు పాల‌నే తెలుగుజాతి త‌ల‌రాత‌ని బాగా మార్చేసింద‌ని అంద‌రూ ఒప్పుకోవాల్సిందే. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రెండుసార్లు సీఎంగా, న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా.. చంద్ర‌బాబు పేరు తెలుగునేల‌పై సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించబ‌డి ఉంటుంది.. తెలుగు హృద‌యాల్లో చిర‌ర‌కాలం నిలిచి ఉంటుంది. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా.. అమ‌రావ‌తిని క‌నుమ‌రుగు చేసేలాంటి కుతంత్రాలు న‌డిపినా.. చంద్ర‌బాబు ఆన‌వాళ్ల‌ను అంత ఈజీగా మాయం చేయ‌లేరు. ఎవ‌రు హైద‌రాబాద్ వెళ్లినా.. హైటెక్ సిటీని చూసినా.. ఏ ఫ్లైఓవ‌ర్ల‌పై ప్ర‌యాణించినా.. రైతు బ‌జారుకెళ్లినా.. ఎవ‌రు కొవాగ్జిన్ టీకా తీసుకున్నా.. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దివినా.. ఏ 'మీ సేవ' కార్యాల‌యానికి వెళ్లినా.. ఎక్క‌డ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా.. అవ‌న్నీ చంద్ర‌బాబు పాల‌న‌ అనే మ‌హావృక్షానికి కాసిన తియ్య‌ని ఫ‌లాలే. అందుకే, తెలుగుజాతి ఉన్నంత కాలం చంద్ర‌బాబు పేరు, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పాల‌న‌ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే, 1995, సెప్టెంబ‌ర్ 1.. ఓ చారిత్ర‌క‌దినం. గ్ర‌హ‌ణం చాయ‌లు వీడ‌గానే మ‌ళ్లీ చంద్రోద‌యం ఖాయం.

జైలులో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష!

చంచల్ గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమరణ దీక్షకు దిగారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో చిలుకలగూడ పోలీసులు శుక్రవారం అర్దరాత్రి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. తీన్మార్ మల్లన్నకు  కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. తీన్మార్ మల్లన్న 7 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ ను మంగళవారం కోర్టు కొట్టేసింది. పిటిషన్  విచారణ సందర్భంగా తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర తన వాదనలు విన్పించారు. ఇప్పటికే ఈ కేసులో తీన్మార్ మల్లన్నతో పాటు.. 19 మంది సాక్షులను విచారించారని..ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. మల్లన్నను కస్టడీకి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తెలెత్తే అవకాశం ఉందని.. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలతో  ఏకీభవించిన కోర్టు.. కష్టడీ  పిటిషన్ ను తిరస్కరించింది.దీంతో మల్లన్న తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు.  మలన్నకు బుధవారం బెయిల్ వస్తుందని అంతా భావిస్తుండగా పోలీసులు మరో ఎత్తు వేశారని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు బనాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసుల తీరుపై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. తీన్మార్ మ‌ల్లన్నను జైలులో ఉంచేందుకే పోలీసులు ఇలా చేస్తున్నార‌నే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై మేధావులు, వివిధ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తి అయ్యేంతవరకు తీన్మార్ మల్లన్నను జైల్లో ఉంచాలనే కుట్ర పన్నుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్ర‌భుత్వం వ్య‌హ‌రిస్తున్న తీరుపై తీన్మార్ మల్లన్న అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై కుట్రలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

తమిళనాడులో జగనన్న పరువు పాయే! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పు లేనిదే ప్రభుత్వానికి గడవని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలకు వేతనాలు ఇవ్వాలన్న రుణం తీసుకోవాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎడాపెడా అడ్డగోలుగా ఖర్చులు చేస్తున్న జగన్ సర్కార్.. ఖజానా నింపుకోవడానికి ఆస్తి పన్నును భారీగా పెంచింది. దీనిపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.   ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలతో వినియోగదారులు భగ్గుమంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై అధిక పన్ను వేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. దక్షిణాదిలో ఏపీలో పెట్రోల్, డిజిల్ రేట్లు ఎక్కువ. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లలో లీటర్ కు నాలుగు నుంచి 8 రూపాయల వరకు వ్యత్యాసం ఉంది. కేంద్ర సర్కార్ తో పాటు జగన్ రెడ్డి సర్కార్ భారీగా ట్సాక్స్ పెంచడంతో ఏపీలో వాహనదారులపై అధిక భారం పడుతోంది. వాహనదారులకు కొంత ఊరట కల్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులను తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ లీటర్ కు మూడు రూపాయలు తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చింది. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పెంచుకుంటూనే పోతోంది.  జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఏపీలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా.. పక్క రాష్ట్రాల్లోనూ ఏపీ పరువు పోయే పరిస్థితిలు ఏర్పడ్డాయి. తమిళనాడులో ఏపీ కంటే లీటర్ పెట్రోల్ రేటు ధర ఏకంగా 8 రూపాయలు తక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ ను రోడ్డున పడేస్తోంది. తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర ఏపీ పరువు పోయేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఏపీతో పోల్చుతూ ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయంటూ పెట్రోల్ బంకుల దగ్గర బోర్టులు పెట్టారు. ఏపీలో లీటర్ పెట్రోల్ రేటు 108 రూపాయల 78 పైసలు కాగా ఇక్కడ 100 రూపాయల 89 పైసలేనంటూ కొన్ని బంకుల దగ్గర బోర్డులు కనిపిస్తున్నాయి.  తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్న బోర్డులను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్ సర్కార్ తీరుకు ఈ బోర్టులు నిదర్శనంటూ పోస్టులు పెట్టారు. జగనన్న క్రేజీ తమిళనాడులో పెరిగిపోయిందంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఏపీతో పోల్చితే తమ దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువంటూ తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర పెట్టిన బోర్డులు జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయానే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

రూట్ మార్చిన కేసీఆర్.. మరో నాలుగు నియోజకవర్గాల్లో దళిత బంధు

దళిత బంధు పథకంపై వ్యూహం మార్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధును ప్రతిష్టాత్మకంగా చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా వాళ్లు ఎంచుకున్న యూనిట్లను అందించారు. మిగితా వారికి అందించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా దళిత వాడల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే ఉప ఎన్నిక ఉన్నందు వల్లే హుజురాబాద్ లో దళిత బంధును అమలు చేస్తున్నారని, ఉప ఎన్నిక తర్వాత ఆపేస్తారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణి కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవడంతో.. జనాల నుంచి ఇవే అనుమానాలు వస్తున్నాయి.  దళిత బంధుపై జనాల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఉప ఎన్నిక కోసమే తెచ్చారనే ప్రచారంతో తమకు నష్టం కల్గుతుందనే భావించారట గులాబీ బాస్. అందుకే వ్యూహం మార్చారు. దళితబంధు  పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ  భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని నిర్ణయించారు.  ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని  మండలం....సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని  తిర్మలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.

ఎమ్మెల్యేలతో జగన్ ఫేస్ టు ఫేస్.. అందుకోసమేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 27 నెలలు పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నా.. పార్టీపై ఆయన ఫోకస్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ ను కలవలేకపోతున్నారు. కొందరు మంత్రులకు కూడా సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కటం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అడిగిన నిధులను మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని తెలుస్తోంది. కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయలను పార్టీ సమన్వయకర్తలు సీఎంకు వివరించారుట. దీంతో  పార్టీపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన జగన్.. త్వరలో సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. పార్టీలో ప్రక్షాళనతో పాటు కేబినెట్ విస్తరణకు జగన్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. జగన్ తో సమావేశానికి రావాలటూ ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయని చెబుతున్నారు, ఎమ్మెల్యేలతో  ఫేస్ టు ఫేస్ మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారట జగన్. ఇందు కోసం సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే  ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.   ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరు వంటి వాటి పైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారు. వాటి నివేదికలను సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో జరిగే సమావేశాల్లో.. నియోజకవర్గానికి సంంబధించిన సర్వే వివరాలను వాళ్ల ముందు ఉంచనున్నారట. సర్వేల ఆధారంగానే  ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ ఉంటుందని అంటున్నారు. ఎమ్మెల్యేలు అందరితో కాకుండా.. వన్ టు వన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం.  ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటుగా వారి బలాలు- బలహీనతల పై సీఎం నేరుగా చర్చించనున్నారని తెలుస్తోంది.  ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు చేయడంతో పాటు పని తీరు బాగున్న వారికి  ప్రమోషన్ దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.  సీఎం-ఎమ్మెల్యేల ఫేస్ టు ఫేస్ సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు, మంత్రులకు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారని చెబుతున్నారు.  ఎమ్మెల్యేలతో జరిగే భేటీల్లోనే కేబినెట్ అవకాశాలపైన మనసులో మాట చెప్పనున్నారట ముఖ్యమంత్రి. కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం తన అభిప్రాయాలను ఆశావాహ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.   ప్రభుత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చేస్తున్న కసరత్తు ఇప్పటికే దాదాపుగా  పూర్తయిందని తెలుస్తోంది. ఈ సమీక్షల్లో ఆశావాహులకు సీఎం నేరుగా తన అభిప్రాయం చెప్పటంతో పాటుగా.. అవకాశం ఇవ్వలేని వారికి భవిష్యత్ పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.  పార్టీ బాధ్యతల విషయంలో సీఎం మరింత స్పష్టంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం. అక్టోబర్ 2 నుంచి రచ్చబండ ద్వారా సాధ్యమైనంత కాలం ప్రజల్లో ఉండాలనేది జగన్ భావిస్తున్నారట. ఈ లోగానే ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం తమతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించటం పైన ఎమ్మెల్యేల్లో జోష్ కనిపిస్తోంది.  దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు..ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది.  ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90 శాతం మందిని తప్పిస్తారా..లేక మొత్తం కేబినెట్ నే మర్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది. దీంతో  ఆశావాహులు సైతం సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారని చెబుతున్నారు. 

తెరమీదకు మళ్ళీ  ఫెడరల్ టెంట్? అందుకేనా కేసీఆర్ హస్తిన యాత్ర?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతోంది, ప్రధానంగా దేశ రాజధానిలో తెరాస పార్టీ కార్యాలయ భూమి పూజ, శంకుస్థాపన కోసమే అయినా, అంతదూరం వెళుతోంది ఆ ఒక్కపని కోసం మాత్రం కాదు. అదీ గాక, ఇలా వెళ్లి అలా రావడం లేదు. మూడు రోజులు అక్కడే మకాం చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసేఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు, వ్యూహాగానాలకు కావలసినంత అవకాశం కలిపిస్తోంది.రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.  అధికరికంగా ప్రభుత్వం విడుదల చేసిన సమాచరం ప్రకారం,ముఖ్యమంత్రి కేసిఆర్ సెప్టెంబర్ 2 న  ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన తెరాస పార్టీ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన  1300 గజాల స్థలంలో  పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడవ తేదీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు,  కేంద్ర మంత్రులతోనూ, కేసీఆర్ సమావేశ మావుతారని సమాచారం. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అగ్ని పుట్టిస్తున జల వివాదానికి సంబంధించి, సంబధిత శాఖల  మంత్రులతో సమావేసమయ్యే అవకాశం లేక పోలేదని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే, కృష్ణా కృష్ణానది జలాల పంపిణి విషయంలో  కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం  ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో కేంద్ర జల శక్తి  శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్’ను కలిసి నీటి వాటాల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర వాదనను ముఖ్యమంత్రే స్వయంగా వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.  అయితే, ఈ అన్నిటికీ మించి, కేసీఆర్ ఢిల్లీ యాత్రకు రాజకీయ లక్ష్యం కూడా ఉందని అంటున్నారు. గత మూడు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా,  2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎలా, ప్రధాని  మోడీని గద్దె దించడం ఎలా? అనే విషయంలో విపక్ష పార్టీలు, బహుముఖ  విన్యాసాలు సాగిస్తున్నాయి. అలాగే, జాతీయ, ప్రాంతీయ, కుటుంబ పార్టీలు అన్నీ కలిస్తేనే గానీ, మోడీని ఓడించండం అయ్యే పని కాదని, ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలియంది కాదు. ఈ నేపధ్యంలో విపకః పార్టీలు, అన్ని పార్టీల ఐక్యత కోసం, సోనియా గాంధీ, రాహుల గాంధీ, శరద్ పవార్, మమత బెనర్జీ, కపిల్ సిబల్ ఇలా అనేక మంది మహా నాయకులు ఎవరి గోల వారిది అనంట్లుగా ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. అయితే, ఎదుకనో గానీ ఒకప్పుదు థర్డ్ ఫ్రంట్,ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కొంత విఫల ప్రయత్నం చేసిన, కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే కపిల్ సిబల్ విందుకు మాత్రం తెరాస పార్లమెంట్ సభ్యులు ఒకరిద్దరు హాజరైనట్లు వార్త లొచ్చాయి. కానీ ఎందుకనో పార్టీ ఆ కలయికను రహస్యంగానే దాచిపెట్టినది.   ప్రస్తుత ఢిల్లీ యాత్రలో థర్డ్ /ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చలు కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో, ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ మరోమారు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కొంత ప్రయత్నం జరుగవచ్చని, ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ జీ 23 నాయకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజరీ వాల్ వంటి కాంగ్రెస్ సారధ్య కూటమిలో చేరేందుకు సుముఖంగా లేని కీలక నేతలు కొందరిని కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

పులివెందులలోనూ రాజ‌ధాని, సెక్ర‌టేరియెట్‌.. వైదిస్ నాన్‌సెన్స్‌?

నోటికొచ్చిన‌ట్టూ కూస్తున్నారు. నోటికొచ్చినంత వాగుతున్నారు. ఎంత అన్యాయం చేయాలో అంత‌కంటే ఎక్కువే చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధానిని కుప్ప‌కూల్చేశారు. స‌న్‌రైజ్ స్టేట్‌ని స‌ర్వ‌నాశ‌నం చేశారు. ఏమి సాధించిన‌ట్టు? ఎవ‌రు బాగుప‌డిన‌ట్టు? ఏపీకి రాజ‌ధాని ఏదంటే.. ఇది అని ట‌క్కున చెప్ప‌లేని దుస్థితి. అమ‌రావ‌తిని స్మ‌శానంతో పోల్చారు. అమ‌రావ‌తి ముంపు ప్రాంతం అన్నారు. ఆకాశ హ‌ర్మాల‌ను అర్థాంత‌రంగా వ‌దిలేశారు. రోడ్ల‌ను త‌వ్వుకుపోతున్నారు. అమ‌రావ‌తిని ఎంత‌గా ఆగం చేయాలో అంత‌కంటే ఎక్కువే చేశారు. స్వ‌యంగా ప్ర‌ధాని మోదీనే త‌ర‌లివ‌చ్చి శంకుస్థాప‌న చేసిన రాజ‌ధానిపై ఆ కేంద్ర‌మే క్లారిటీ లేకుండా కుప్పిగంతులు వేస్తోంది. ప‌లుమార్లు ఏపీ కేపిట‌ల్‌గా విశాఖ‌ను పేర్కొంటూ.. వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌గానే.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పులు స‌రిచేసుకుంటూ లెంప‌లేసుకుంటోంది. ఏపీ హైకోర్టు సుస్ప‌ష్టంగా చెప్పింది. ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అని. కేపిట‌ల్‌ను ఎక్క‌డికీ త‌ర‌లించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా, ఈ వైసీపీ మంత్రులు ఉన్నారే... రాజ‌ధాని త‌ర‌లింపును ఎవ‌రూ ఆప‌లేరంటూ ర‌చ్చ రాజేస్తున్నారు. తాజాగా, మ‌రో మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి మ‌రింత సిల్లీ కామెంట్లు చేసి క‌ల‌క‌లం రేపారు. అస‌లు వీరు మంత్రులేనా? అనే అనుమానం..ఆగ్ర‌హం వ‌చ్చేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ‌టంపై అమ‌రావ‌తి ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.  మంత్రి మేక‌పాటి అంటారూ... సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాల‌ట‌. అబ్బ ఛా.. అలానా.. అయితే, సీఎం జ‌గ‌న్‌రెడ్డి తాడేప‌ల్లిలో పే..ద్ద ప్యాలెస్ క‌ట్టుకుని ఉంటున్నారుగా. మ‌రి, అమ‌రావ‌తినే వ‌న్ అండ్ ఓన్లీ ప‌ర్మినెంట్ కేపిట‌ల్‌గా ఫిక్స్ చేయొచ్చుగా.. అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు.  మంత్రి మేక‌పాటి మ‌రింత కామెడీ డైలాగ్స్ కూడా పేల్చారు. సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు.. విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు.. వైజాగ్ కూడా అవొచ్చు.. అంటూ అదో టైపు సుద్దులు చెప్పారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అంటూ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి రాజ‌ధాని విష‌యంలో గ‌బ్బు గ‌బ్బు రేపారు.  కామెడీ కాక‌పోతే మ‌రేంటి? సీఎం పులివెందుల‌లో ఉంటే.. అదే రాజ‌ధాని కావ‌చ్చ‌ట‌. ఇడుపాయ‌లో ఒక‌టి, బెంగ‌ళూరులో ఇంకోటి, లోట‌స్‌పాండ్‌లో మ‌రొక‌టి.. మీ జ‌గ‌న్‌రెడ్డి గారికి మ‌రో మూడు ప్యాలెస్‌లు ఉన్నాయిగా.. మ‌రి, అవ‌న్నీ కూడా ఏపీ రాజ‌ధానులేనా? భ‌విష్య‌త్‌లో జ‌గ‌న్ బెంగ‌ళూరు ప్యాలెస్‌లో ఉంటే.. ఏపీ రాజ‌ధాని క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు అయిపోతుందా? జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌కు షిఫ్ట్ అయితే.. ఏపీ కేపిట‌ల్ హైద‌రాబాద్ అవుతుందా? అలానే ఇడుపుల‌పాయ కూడా రాజ‌ధానేనా? అంటూ నిల‌దీస్తున్నారు ప్ర‌జ‌లు. ఇక మంత్రిగారి నోటి నుంచి మ‌రో అద్భుత‌మైన చ‌రిత్ర‌పురాణం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఆయ‌న చిన్న‌ప్పుడు స్కూల్‌కు వెళ్లారో లేదో.. వెళ్లినా సోష‌ల్ స‌బ్జెక్ట్‌లో పాస్ అయ్యారో లేదో అనే డౌట్ వ‌స్తోంది జ‌నాల‌కు. మంత్రి మేక‌పాటి ఏమ‌న్నారంటే.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారట‌. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆయ‌న మాట‌లు విన్న‌వారంతా మంత్రి గౌతంరెడ్డికి అస‌లు శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏంటో తెలీద‌ని తెలిసిపోయిందంటూ న‌వ్వుకుంటున్నారు. అయ్యా.. మంత్రివ‌ర్యా.. 1937లో జ‌రిగిన శ్రీబాగ్ ఒప్పందంలో అస‌లు మూడు రాజ‌ధానుల‌నే ప్ర‌స్తావ‌నే లేదు. అప్పుడెప్పుడో జ‌రిగిన దాన్ని సాకుగా చూపించి.. ఇప్పుడు ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే రాజ‌కీయ డ్రామానే కానీ మ‌రొక‌టి కాద‌ని చ‌రిత్ర‌కారులే మండిప‌డుతున్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర‌లో.. రాజ‌ధాని, హైకోర్టు చెరోచోట ఉండాల‌ని మాత్ర‌మే అన్నారు. అంతే కానీ ఎక్క‌డా మూడు రాజ‌ధానులు అనే అర్థం వ‌చ్చేలా చెప్ప‌లేదు. రాజ‌ధాని ఒక్క‌టే.. అది ఆంధ్రాలో ఉంటే, సీమ‌లో హైకోర్టు.. ఒక‌వేళ రాజ‌ధాని సీమ‌లో ఉంటే ఆంధ్రాలో హైకోర్టు.. ఉండాల‌నేది శ్రీబాగ్ ఒప్పందం సారాంశం. దాన్ని.. ఇలా త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు అన్వ‌హించుకోవ‌డం వైసీపీ మంత్రికే చెల్లింది. అయినా, శ్రీబాగ్ ఒప్పందం అనేది జ‌స్ట్ కొంత మంది పెద్ద‌మ‌నుషులు కూర్చొని చేసుకున్న అగ్రిమెంట్ మాత్ర‌మే. అప్ప‌టికింకా మ‌న దేశానికి స్వాతంత్య్ర‌మే రాలేదు. ఆ ఒప్పందంకు ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ద‌తా లేదు. అప్పుడెప్పుడో పాచి పోయిన ఆ ల‌డ్డూను ఇప్పుడు ప్ర‌స్తావించ‌డం సిగ్గుచేటు..అంటున్నారు సీమాంధ్ర ప్ర‌జ‌లు.  అయినా, ఈ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు ఏమైంది? ఏంటి ఈ అర్థంప‌ర్థం లేని మాట‌లు? స్కూల్ పిల్ల‌ల మాదిరి చేష్ట‌లు? మంత్రులే ఇలా మాట్లాడితే ఎలా? ఏపీ రాజ‌ధాని అంటే అంత కామెడీ పీసా? ఈ వెట‌కారం.. ఈ సెటైర్లు.. రాష్ట్రాన్ని, రాష్ట్ర భ‌విష్య‌త్తును మ‌రింత అంథ‌కారం చేస్తాయే కానీ మ‌రేమీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇలాంటి త‌లాతోక లేని డైలాగులు ఏపీకి అస‌లేమాత్రం మంచివి కావ‌ని అమ‌రావ‌తి ప్ర‌జ‌లు వైసీపీ మంత్రుల‌పై మండిప‌డుతున్నారు. ఏపీకి హైకోర్టు ఉన్నంత కాలం.. న్యాయం అనేది బ‌తికున్నంత కాలం.. రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కాదు క‌దా.. ఆ జేజ‌మ్మ వ‌ల్ల కూడా కాదంటూ అమ‌రావ‌తి రైతులు ఆవేశంతో హెచ్చ‌రిస్తున్నారు.   

బిగ్ బ్రేకింగ్.. వైసీపీకి విజయమ్మ రాజీనామా? 

వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయా? వైఎస్సార్ వర్ధంతి రోజున సంచలనం జరగబోతోందా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగలబోతున్నారా? అంటే.. వైఎస్ ఫ్యామిలీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నిజమే అనిపిస్తోంది. వైఎస్సార్ కుటుంబంలో ఏదో జరగబోతుందనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జూలైలో  వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయకు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్లి నివాళులు అర్పించడం చర్చనీయాంశమైంది. గతంలో కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి నివాళి అర్పించేవారు.అందుకు భిన్నంగా ఉదయం విజయమ్మ, షర్మిల వెళ్లగా.. ఎప్పుడు లేనట్టుగా సాయంత్రం వెళ్లి నివాళి అర్పించారు జగన్.  తాజాగా సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి రోజున కూడా ఇడుపుల పాయలో అలాంటే సీనే కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇడుపులపాయకు కుటుంబ సభ్యులందరితో  కాకుండా సీఎం జగన్ ప్రత్యేకంగా వెళుతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ సీఎం జగన్ తల్లి అయిన విజయమ్మ హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం పెడుతుండటం మరింత ఆసక్తి రేపుతోంది. గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన నేతలు, ఆయన సన్నిహితులు, అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలను సమావేశానికి ఆహ్వానించారట విజయమ్మ. అయితే ఆ సమావేశానికి జగన్ కు మాత్రం ఆహ్వానం లేదట. దీంతో కొడుకు జగన్ తో సంబంధం లేకుండా వైఎస్సార్ వర్థంతి రోజున విజయమ్మ సమావేశం నిర్వహిస్తుండటంతో .. ఆ రోజున ఏదో జరగబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో వైఎస్ విజయమ్మ ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన కూతురు షర్మిలకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారు విజయమ్మ. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన రోజు, ఖమ్మంలో జరిగిన తొలి సభలోనూ, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన సభలోనూ  షర్మిల పక్కనే ఉన్నారు విజయమ్మ. కూతరు షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె  వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా  సమావేశం పెట్టారని.. అక్కడే విజయమ్మ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైసీపీకి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. వైస్సాఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నానని విజయమ్మ ప్రకటించవచ్చని అంటున్నారు.  నిజానికి వైఎస్ షర్మిల పార్టీ సభకు విజయమ్మ హాజరైనప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ.. మరో పార్టీ సభలో ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు.. విజయమ్మ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఎంపీ రఘురామ రాజు కూడా తీవ్రంగానే స్పందించారు. వైసీపీలో రెండు రకాల సిద్ధాంతాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో  వివాదానికి తెర దించాలంటే ఏదో ఒక పార్టీలో కొనసాగాలని విజయమ్మ భావించారట. సీఎం జగన్ తో విభేదాలు ఉండటంతో ఆమె కూతురు వైపే ఉండాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.   వైఎస్ విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తే అది ఏపీ రాజకీయాల్లో సంచనంగా మారడం ఖాయం. విజయమ్మ నిర్ణయం సీఎం జగన్ కు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ నిరంకుశ పాలన చేస్తున్నారని, ఎవరిని లెక్క చేయకుండా మోనార్క్ లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తే.. కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోవడం లేదని, జగన్ పై జరుగుతున్న ప్రచారం నిజమేనని జనాలు నమ్మే అవకాశం ఉంటుంది. విపక్షాలకు కూడా బ్రహ్మండమైన అస్త్రం దొరికినట్లే. చూడాలి మరీ ఏం జరగబోతుందో.. 

ఏపీ సర్కార్ మత వివక్ష నిజమేనా? టీటీడీని అభాసుపాలు చేస్తున్నది అందుకేనా? 

ఒక్క తెలుగు వారు మాత్రమే కాదు, ఒక్క హిందువులు మాత్రమే కాదు.. ఒక్క భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కోట్ల మంది భక్తులు తిరుమల దేవుడు, వెంకటేశ్వర స్వామిని కుల వేలుపుగా కొలుస్తారు. పరమ పవిత్రంగా ఆరాధిస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు గోవిందనామ స్మరణతో వెంకన్నను చేరుకుంటారు. దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. వడ్డి కాసుల వాడికి, కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల కొండలను ఆ దేవదేవుని ప్రతిరూపంగా, పవిత్రంగా భావిస్తారు. భక్తీ భావంతో వెనుతిరుగుతారు.    కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి మాత్రం, వడ్డీ కాసుల వాడిని , వట్టి కాసుల వాడిగానే చూస్తున్నాయని, అనుకోవలసి వస్తోంది. ఇంకా చెప్పాలంటే, ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం తిరుమల కొండను బంగారు బాతుగా, వెంకన్న దేవుని, భక్తుల భక్తి బావాన్ని, ఒక వ్యాపర వస్తువుగా చూస్తోందనే సందేహాలకు తవిచ్చేలా, ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ నిర్ణయాలు, ప్రవర్తన ఉన్నాయి, అంటే కాదనే పరిస్థితి లేదు. ఓ వంక వెంకన్నా దేవుని ఆస్తులను అమ్మి సోమ్ముచేసుకునే కుట్రలు సాగిస్తూనే మరో వంక పవిత్ర పుణ్య క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి, వివాదాలకు నిలయంగా మార్చింది.  ఇప్పుడే కాదు, జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి టీటీడీ వివాదాలకు నిలయంగామారి పోయింది. పరోక్షంగానే కావచ్చును అన్యమత ప్రచారాన్నిప్రోత్సహిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. టీటీడీలో కొలువు తీరిన అన్యమతస్తుల ఏరివేతకు ప్రయత్నించడమే పాపమన్నట్లుగా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుభ్రమణ్యంను జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. నిజానికి, ఈ రెండున్నర సంవత్సరాలలో జగన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో హిదువుల మనోభావాలు దెబ్బతినే సంఘటలు, టీటీడీలోనే కాదు రాష్ట్రం అంతటా సాగుతూనే ఉన్నాయి. విగ్రహాల ద్వంస రచన మొదలు, అన్యమత ప్రచారానికి, అండదండలు అందించడం వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం  మత వివక్ష, విద్వేషాలకు తావిచ్చేల పరిపాలన సాగిస్తోందనే విధంగానే ప్రభుత్వ పాలనా సాగుతోంది.   టీటీడీవిషయంలోనూ ముఖ్యమంత్రి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ నియమించిండం మొదలు, ప్రతి విషయంలోనూ భక్తుల మనోభావాలను దెబ్బతీసీ విధంగానే, వ్యవహారం నడుస్తోందనే విమర్శలున్నాయి. ఒక దశలో టీటీడీఆస్తుల విక్రయానికి జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. అయితే, భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో వెన కడుగు వేసింది.అయితే, అప్పుడు ప్రభుత్వం భక్తులు తిరగబడతారనే భయంతో వెనకడుగు వేసినా, ప్రభుత్వం దృక్పధంలో మాత్రం మార్పులేదు. అందుకే, ఇప్పడు మళ్ళీ, సంప్రదాయ భోజనం పేరిట కొండమీద మరో దుకాణాన్ని తెరిచింది. రసాయన ఎరువులు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో 14 రకాల వంటలు భక్తులకు విక్రయించే దుకాణం దుకాణం తెరిచారు.అయితే, కొండ మీద అన్నం అమ్మడమా, అది కూడా టీటీడీ.. అంటూ భక్తుల నుంచి విమర్శలు రావడంతో మళ్ళీ మరోమారు వెనకడుగు అయితే వేసింది, కానీ, వెనకటి గుణం మాత్రం మారలేదు. సంప్రదాయ భోజన విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ  సుబ్బా రెడ్డి ప్రకటించారు. పాలకమండలి పదవీ కాలం ముగిసిన సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని, అయితే దానిపై తాను చర్చించి నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల కొండపై భక్తులకు స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని, అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని అధికారులకు సూచించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ తెలివిగా నేరాన్ని, అధికారులపైకి నెట్టేశారు, కానీ, యథారాజా తథా ప్రజా అన్నట్లుగా, జగన్ రెడ్డి అడుగుజదాల్లోనే అధికారులు నడుస్తున్నారు అనేది వైవీ కూడా కాదనలేని నిజం.  అందుకు ఉదాహరణ, సంప్రదాయ భోజనం వివాదం ముగియక ముందే, అదే టీటీడీ పలక మండలి, ఉభయ తెలుగ  రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఇందులో ఇంకేదో మతలబు ఉందని, దేవాలయాలలోనే ప్రభుత్వ పెద్దల సహకారంతో అన్యమతస్తులు అధికారం చెలాయిస్తున్నప్పుడు,కళ్యాణ మండపాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం అంటే, దొడ్డిదారిన అన్యమతస్తులకు అవకాశం కలిపించడం కాదా, అన్న అనుమానాలు  విన వస్తున్నాయి. అయితే, చరిత్ర చెపుతునండి ఏమంటే, వెంకన్న జోలికి వచ్చిన వారెవ్వరూ బాగుపడింది లేదు, బావుకున్నదీ లేదు.

హుజూరాబాద్ లో కారుకు కొత్త కష్టాలు! హరీష్ రావును బుక్ చేస్తున్నారా?

కొంచెం ఆలస్యంగానే అయినా మంత్రి కేటీఆర్ అన్నట్లుగా హుజూరాబాద్ ఉపఎన్నికను అది ఇంకొక  ఉపఎన్నిక అని వదిలేసి ఉంటే, ఎలా ఉండేదో ఏమో కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ‘ఇజ్జత్ కా సవాల్ ‘గా తీసుకున్నారు. అంతే కాదు వరాల ఊబిలోకి కూరుకు పోయారు. అందుకే అధికార పార్టీకి ముందు నుయ్యి వెంక గొయ్యి కనిపిస్తోంది. ఉపఎన్నిక గెలుపు ఓటమలను పక్కన పెడితే, అసలుకే మోసం తెచ్చే   కొత్త  సమస్యలు, వచ్చిపడుతున్నయి. కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా హుజూరాబాద్ విజయం కోసం ముఖ్యమంత్రి బ్రహ్మాస్త్రంగా బావించి ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం అసలుకే మోసం తెచ్చేలా ఉందని, అధికార పార్టీలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దళిత బందు తరహాలో తమకూ ఫ్యామిలీకి పది లక్షల రూపాయల వంతున ఆర్ధిక సహాయం చేయాలని బీసీల మొదలు అన్ని కులాలు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వంక, ఉప ఎన్నిక వస్తేనే  నిధులోస్తయై, పనులవుతాయి, ప్రజలకు మేళ్ళు జరుగుతాయి అన్న భ్రమలు ఏర్పడ్డాయి. దీంతో  ప్రజలు ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యెల మీద వత్తిడి పెరుగుతోంది.  అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, గల్ఫ్ బాధితులు గళం విప్పారు. జస్ట్ గళం విప్పడమే కాదు, ఏకంగా రాజకీయ జెండానే ఎగరేశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి, హుజూరాబాద్ బరిలో దిగుతామని, గల్ఫ్ బాధిత కుటుంబాల ప్రతినిధులు, గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కుటుంబాల ప్రతినిధులు చెపుతున్నారు. “ఎన్నో దశాబ్దాలుగా, ఏ ప్రభుత్వాలు వచ్చినా.. రాష్ట్రమే విడిపోయి, తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడినా, మా ఓటు బలం తక్కువ కాబట్టి మా  సమస్యలు ఎవరూ పట్టించుకోలేదు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మా అభ్యర్ధిని పోటికి దించి మా సత్తా ఏమిటో చూపించాలని అనుకుంటున్నాం”  అని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ కన్వీనర్ గుగ్గిలాల రవి గౌడ్ స్పష్టం చేశారు.  గల్ఫ్ వర్కర్స్ జేఏసీ చాలాకాలంగా చాలా డిమాండ్లను ప్రభుత్వాల ముందుంచింది. అవేవీ నెరేరలేదు. ఇక ఇప్పడు ఆఖరి అస్త్రంగా ఇతర  డిమాండ్లతో పాటుగా, అన్నిటి కంటే ముఖ్యంగా ఫ్యామిలీకి పదిలక్షలు ఇచ్చే గల్ఫ్ బంధు కావాలని గల్ఫ్ వర్కర్స్ జేఏసీ పట్టుపడుతోంది.  గడచిన రెండు దశాబ్దాల కాలంలో 25 లక్షల మంది వరకు గుల్గ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. ప్రస్తుతం మరో 15 లక్షల గుల్ద్ దేశాల్లో ఉన్నారు. ఈ 40 లక్షల కుటుంబాలు, వారి బాధలు తెలిసిన బందువులు ఇతరులు అంటా కలుపుకుంటే రాష్ట్రం మొత్తంలో ఒక కోటీ ఓట్లు తమ చేతులలో ఉన్నాయని జేఏసీ నేతలు లెక్కలు చెపుతున్నారు. అంతే కాదు, ఏ నియోజక వర్గంలోనూ తమ అభ్యర్ధులు గెలవక పోయినా, ఓ 30 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్ సభ స్థానాల్లో అభ్యర్ధులు, పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో తమకు బలముందని అంటున్నారు.  ఇక హుజూరాబాద్ విషయానికి వస్తే, ఇప్పటికీ పోటీకి సిద్దమవుతున గల్ఫ్ వర్కర్స్ జేఏసీ నియోజకవర్గం పరిధిలో ఐదు వేల వరకు గల్ఫ్ నుంచి త్తిరిగోచ్చిన బాధిత కుటుంబాలను గుర్తించిందని, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశి పరికపండల తెలిపారు. నియోజక వర్గంలో మరో పది వేల కుటుంబాల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితుల నుంచే తమ అబ్యర్ది ఉంటారని, సెప్టెంబర్ 2న జమ్మికుంటలో ఎన్నికల సభ నిర్వవహిస్తున్నామని ఆయన చెప్పారు. సరే, ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక చివరాఖరుకు ఏమి జరుగుతుంది అనేది ఎలా ఉన్నా, కేసీఆర్ లెక్క మాత్రం తప్పినట్లే కనిపిస్తోంది.  కొత్త చిక్కులు తప్పేలా లేవు. చివరకు, తమ పరిస్థితి  కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.  

"OYO"లో క‌లుద్దామా.. నేను అలాంటిదాన్ని కాదు సార్‌...

సాఫ్ట్‌వేర్ జాబులు చాలా సాఫ్ట్‌గా ఉంటాయ‌నేది ఓ భ్ర‌మే. అక్క‌డా కంటికి క‌నిపించ‌ని రాజ‌కీయాలు ఫుల్లుగా ఉంటాయి. అక్క‌డా కుల‌, మ‌త తేడాలుంటాయి. అక్కడా బాసుల రూపంలో దాగున్న తోడేళ్లు ఉంటాయి. త‌మ టీమ్‌లో అంద‌మైన అమ్మాయి ఉంటే చాలు.. కామా*ధులు క‌ళ్ల‌తోనే కుళ్ల‌బొడుస్తుంటారు. కొలీగ్స్ కొంత‌వ‌ర‌కు ఓకే అయినా.. టీమ్ లీడ్స్, మేనేజ‌ర్స్‌తోనే అస‌లైన ప్రాబ్ల‌మ్‌. అంద‌రూ అలా అని కాదు.. చాలామందే అలా ఉంటార‌ని చెబుతున్నారు పోలీసులు. జ‌స్ట్ చెప్ప‌డ‌మే కాదు.. ఇటీవ‌ల సైబ‌రాబాద్ షీ టీమ్స్ డీల్ చేసిన ఓ కేసును అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. ఆ కేస్ తాలూకా ఓ వాట్సాప్ చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి బాస్‌ల రూపంలో ఉండే శాడిస్టుల‌కు అస్స‌లు భ‌య‌ప‌డ‌కుండా ఉండ‌మంటూ.. ఎలాంటి ఎక్స్‌ట్రాలు చేసినా తోక క‌ట్ చేసేందుకు మేమున్నామంటూ అభ‌య‌మిస్తోంది షీ టీమ్‌. ఇంత‌కీ ఆ వాట్సాప్ చాట్‌లో ఏముందంటే....  బాస్ నుంచి అమెకు మెసేజ్ వ‌చ్చింది. నీ ప్రాజెక్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ బాగా లేద‌ని మొద‌ట భ‌య‌పెట్టాడు. అయినా, ఓకే నేను చూసుకుంటా.. శాల‌రీ హైక్ వ‌చ్చేలా చేస్తా.. కానీ...... అంటూ మెసేజ్ పెట్టాడు. కానీ.. ఏంటి సార్ అని ఆమె అడిగితే.. ఓయో రూమ్స్‌లో క‌లుద్దామా అంటూ అస‌లు మేట‌ర్ రివీల్ చేశాడు. తాను అలాంటి దాన్ని కాదంటే.. బ్లాక్ మెయిల్‌కు దిగాడు. హైక్ ఉండ‌దు.. ఉద్యోగం ఉండ‌దు.. కెరీర్ ఉండ‌దు.. అంటూ బెదిరించాడు. ఆ యువ‌తి ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే షీ టీమ్స్‌కు కంప్లైంట్ చేసింది. వెంట‌నే కాప్స్ ఆ కంత్రీ బాస్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బాస్ ఉద్యోగ‌మే ఊడింది. ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింప‌డానికి.. ఆ వాట్సాప్ చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పేరుతో ఏర్పాటైన ప్రత్యేక విభాగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది. మహిళలు, టీనేజ్ యువతులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆటకట్టించేందుకు షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే సోషల్ మీడియా పెరిగిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వేధింపులపై ఎలా స్పందించాలి?.. ఆ విషయంపై పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి? అనే దానిపై ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ సరికొత్తగా అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా ఈ వాట్సాప్ చాటింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇంత‌కీ ఆ లేడీ ఎంప్లాయ్ త‌న బాస్ ఫోన్ నెంబ‌ర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా... డైనో"సార్‌"...

వాతావరణ శాఖ జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టుల గురించి తెలుసా? 

వర్షాకాలంలో వాతావరణ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. వర్షాలు, వరదలపై ముందుస్తు జాగ్రత్తలు చెబుతూ అవసరమైతే అలర్టులు జారీ చేసింది భారత వాతవరణ శాఖ(ఐఎండీ). అలర్టుల్లో ముఖ్యమైనవి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్టులు. దేశంలో వర్ష సూచన, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్, రెడ్‌ అలర్ట్‌లను జారీ చేస్తారు. వచ్చే 24 గంటల్లో పడే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితిని.. వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని బట్టి ఈ హెచ్చరికలు ఉంటాయి. అయితే చాలా మందికి వాతావరణ శాఖ జారీ చేస్తే హెచ్చరికలపై అవగాహన ఉండదు. అందుకే అలర్టులు ఎన్ని రకాలు, వాటిని ఎప్పుడు జారీ చేస్తోరా తెలుసుకుందాం... ఐఎండీ  గ్రీన్‌ అలర్ట్‌  ఇస్తే  ఎలాంటి ప్రమాదం లేదని అర్థం.  ఎల్లో అలర్ట్‌ అంటే ఆరు నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు.  ఆరెంజ్‌ అలర్ట్‌-  పది నుంచి 20 సెంమీటర్ల వర్షపాతం, 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని.. ఇబ్బందులేమైనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ సూచిస్తుంది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తే లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందే.. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. రెడ్‌ అలర్ట్‌ - ఇది అత్యంత కీలకం. ఒక రకంగా చెప్పాలంటే కుండపోత వానలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తును సూచించడానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని అర్థం. రెడ్‌ అలర్ట్‌ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.  రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. 

టీటీడీ క‌ల్యాణమండ‌పాల్లో సువార్త స‌భ‌లు! ముగ్గురు రెడ్లపై ర‌ఘురామ మండిపాటు

టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ చేతకాకపోతే సుబ్బా‌రెడ్డి, ధర్మా‌రెడ్డి, జవహర్‌రెడ్డిలు టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. కల్యాణ మండపాలు అద్దెకిస్తే, అక్కడ సువార్త సభలు పెడితే సుబ్బారెడ్డి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారని, వాటిని ఎవరికో అద్దె కిస్తే పరిస్ఠితి ఏంటని ర‌ఘురామ‌ నిలదీశారు.  జెరూసలేం వెళ్లే వారికి సబ్సిడీ ఇస్తూ టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని ర‌ఘురామ‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెరూసలేంకి ఇచ్చే సబ్సిడీకి తిరుమలలో దోపిడీ ఏంటని ప్రశ్నించారు. టీటీడీ ఆదాయం కోసం రూమ్‌రెంట్లు కూడా పెంచుతున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని మండిప‌డ్డారు. టీటీడీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్య‌బ‌ట్టారు. డబ్బుల కోసం చేసే పనులు మానేయండి.. చేతకాకపోతే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి జవహర్‌రెడ్డిలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ఆగమ మండలి ఏర్పాటు మీద దృష్టి పెట్టాలని ర‌ఘురామ కోరారు. నిష్ణాతులైన వారిని ఆగమ మండలిలో నియమించాలన్నారు. ధ‌ర్మ పరిషత్‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీటీడీ అధికారుల‌ను ప్రశ్నించారు.   

అఫ్గ‌న్‌ను వీడిన అమెరికా.. లాస్ట్‌లో తాలిబ‌న్ల‌కి ట్విస్ట్ ఇచ్చిన ఆర్మీ..

20 ఏళ్లు. రెండు ద‌శాబ్దాల పాటు అఫ్గ‌నిస్తాన్‌ను కాపాడిన అమెరికా.. ఇక సెల‌వంటూ.. మ‌ళ్లీ తిరిగిరామంటూ కాబుల్‌కు అల్విదా చెప్పేసి వెళ్లిపోయింది. ఆ దేశాన్ని తాలిబ‌న్ల‌కు వ‌దిలేసి.. తన దారి తాను చూసుకుంది. సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సీ-17 కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరడంతో అఫ్గన్ భూభాగం నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తయ్యింది. ముందే నిర్దేశించుకున్న ఆగస్టు 31 గడువుకు ఒక రోజు ముందే త‌న‌ బలగాలను పూర్తిగా తరలించేసింది. తాలిబ‌న్లు అఫ్గ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు ల‌క్ష‌న్న‌ర మంది పౌరుల‌ను సుర‌క్షితంగా ఆ దేశం నుంచి షిఫ్ట్ చేసింది. ఇంకా చాలామందినే త‌ర‌లించాల్సి ఉన్నా.. తాలిబ‌న్లు విధించిన గ‌డువు ముగియ‌డం.. ఐసిస్ ఉగ్ర‌దాడుల భ‌యంతో ఒక్క రోజు ముందే అమెరికా సైన్యం ఆ దేశాన్ని వీడి వెళ్లిపోయింది. అఫ్గ‌న్‌లో 20 ఏళ్ల అమెరికా అధ్యాయం ముగిసింది.  వెళ్తూ వెళ్తూ అమెరికా ఆర్మీ అఫ్గ‌న్‌లో ఉన్న త‌మ దేశ యుద్ధ విమానాలు, అత్యాధునికి క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌, సైనిక ప‌రిక‌రాల‌ను నిర్వీర్యం చేసి వెళ్లారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న 73 యూఎస్‌ యుద్ధ విమానాలను నిరుపయోగంగా మార్చేసి.. తుక్క‌గా చేశారు.  ‘తాలిబన్ అధీనంలోకి అఫ్గన్ వెళ్లడంతో అక్కడ నుంచి రావడానికి ముందే అమెరికా సైన్యాలు వీటిని నిర్వీర్యం చేశారు.. ఆ యుద్ధ విమానాలు ఎప్పటికీ ఎగరలేవు.. వాటి ఏ ఒక్కరూ నడపలేరు.. వాటిలో చాలా వరకూ యుద్ధం మొదలుపెట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎగరలేవు’ అని అమెరిక‌న్ ఆర్మీ అధికారి తెలిపారు.  కాబుల్ విమానాశ్రయంలో 6,000 మంది సైనికులతో అమెరికా రెండు వారాలుగా తరలింపు ప్రక్రియ చేప‌ట్టింది. అక్క‌డ‌ మిలియన్ డాలర్ల విలువైన 70 ఎంఆర్ఏపీ యుద్ధ వాహనాలను వదిలిపెట్టింది. రాకెట్, మోర్టార్, ఆయుధాల దాడులను సమర్థంగా ఎదుర్కొనే సీ-రామ్ వ్యవస్థను కూడా అక్కడే వదిలేసింది. ఆ వ్యవస్థలను చివరి నిమిషం వరకూ ఉప‌యోగించిన అమెరికా.. చివ‌రి విమానం టేకాఫ్ అయ్యే స‌మ‌యానికి వాటిని కూడా ప‌నికిరాకుండా చేసి వెళ్లిపోయింది.  తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గన్‌ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని అమెరికా సైనికాధికారి తెలిపారు. ఇక‌, 20 ఏళ్ల త‌ర్వాత‌ అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీంతో.. 20 ఏళ్ల రాజ‌కీయ ఉత్కంఠ ముగిసిన‌ట్టైంది. అయితే, 20 ఏళ్ల క్రితం తాలిబ‌న్ల ఏరివేత‌తో మొద‌లైన శాంతిప్ర‌క్రియ.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ తాలిబ‌న్లే అఫ్గ‌నిస్తాన్‌ను చేజిక్కించుకోవ‌డంతో ముగియ‌డం.. ఊహించ‌ని ప‌రిణామం. అమెరికా-అఫ్గ‌న్‌ల‌ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం.   

తిరుమల వెంకన్నకే రూ. 3 కోట్ల వెన్నుపోటు.. హవ్వ

ఆంధ్రాలో జగనన్న హయాంలో ఇష్టారీతి పాలన నడుస్తోంది అనడానికి తాజా నిదర్శనం. ప్రభుత్వంలో తమవాళ్లు ఉన్నారనో లేక తామే ప్రభుత్వం అనుకుంటున్నారో తెలీదు కానీ.. కొందరు అధికారుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం మాత్రం వడ్డీకాసులవాడినే విస్తుపోయేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి రాత్రనకా పగలనకా గర్భగుడిలో నిలబడి భక్తుల నుండి నిలువు దోపిడీల ద్వారా సంపాదిస్తుంటే... భక్తుల కానుకలనే జీతాలుగా తీసుకుంటూ.. ఆయన కొలువులో పనిచేస్తున్న టీటీడీ అధికారులు మాత్రం వెంకన్నకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై అవినీతి పంకిలంలో కూరుకుపోతున్నారు. టీటీడీకి చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన తిరుమలలోని ఓ హోటల్ నిర్వాహకుడికి పరోక్షంగా సహకరించి... ఎవరి కంటా పడకుండా వారిని రాత్రికి రాత్రే తిరుమల నుండి దాటించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  తిరుమలలో పెద్ద షాపులు, చిన్న దుకాణాలు, చిల్లర వర్తకులు... ఇలా పలు వ్యాపార సంస్థల నుంచి అద్దెల చెల్లింపులో టీటీడీ నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఒక్క నెల అద్దె బకాయి ఉన్నా కూడా అధికారులు అంగీకరించరు. స్థానిక ప్రజలని కూడా చూడకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. కరోనా కష్ట సమయంలో కూడా స్థానిక వ్యాపారులకు అద్దెల చెల్లింపులో ఒక్క రూపాయి కూడా మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. అందుకు విరుద్ధంగా టీటీడీ పెద్దలు ఓ హోటల్ నిర్వాహకుడికి ఏకంగా మూడు కోట్ల రూపాయల బకాయిలను వదిలేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ హోటల్ సంస్థ రూ. 3 కోట్ల అద్దె బకాయిలు ఎగవేసినా టీటీడీ యాజమాన్యం నోరు మెదపలేదంటే తెరవెనుక ఏం జరిగి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం వారి వద్ద నుండి బకాయిలు రాబట్టుకునే చర్యలు కూడా తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ఖాళీ చేయించి రాత్రికి రాత్రే చెన్నైకి పంపించారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ హోటల్ యాజమాన్యం ద్వారా నెలకు రూ. 23.90 లక్షల అద్దె టీటీడీకి జమ అవుతోంది. ఆ హోటల్ ను కాదనుకుని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఉచితంగా ఇవ్వడానికే చెన్నై హోటల్ ను ఖాళీ చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  టీటీడీ భక్తులెవరూ అడగకపోయినా.. ఇటీవల సంప్రదాయ భోజనం అనే నిర్ణయాన్ని తీసుకుంది. అయితే దేవాలయంలో అన్న వ్యాపారం అంటూ ఆ నిర్ణయం మీద విమర్శలు రావడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. అది వేరే విషయం. అయితే భోజన పథకాన్ని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఇవ్వడానికే చెన్నై హోటల్ మేనేజ్ మెంట్ ను భారీ నష్టానికైనా సరే.. అర్ధరాత్రి ఖాళీ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సంప్రదాయ భోజనం కాస్తా బెడిసికొట్టడంతో తిరుమలలోని పలు పెద్ద  హోటల్స్ ని కూడా బెంగళూరు సంస్థకు ఉచితంగా కట్టబెట్టే  యోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  ఆ రూ. 3 కోట్లు ఎగ్గొట్టిన విధంబెట్టిదనిన... తిరుమలలో హోటల్స్ నడపాలంటే దాదాపు 5 కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంది. తిరుమల పాలకమండలి సభ్యుల బోర్డు సమావేశం నిర్వహించే అన్నమయ్య భవన్ కింది భాగంలోనే ఉన్న అన్నమయ్య హోటల్ ను టీటీడీ టెండర్ విధానం ద్వారా లీజుకు కట్టబెడుతుంది. చెన్నైకి చెందిన ఓ యాజమాన్యం ఈ హోటల్ ను నెలకు రూ. 23 లక్షల అద్దె చెల్లించే విధంగా టెండర్ల ద్వారా దక్కించుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆరు మాసాల అద్దెను డిపాజిట్ గా చెల్లించాలి. ఒకవేళ ఈ అద్దె సొమ్మును సక్రమంగా చెల్లించకపోతే మూడు మాసాల వరకు మాత్రమే గడువు ఇచ్చి డిపాజిట్ సొమ్మును టీటీడీ పూర్తిగా స్వాధీనం చేసుకుని హోటల్ ను వెంటనే ఖాళీ చేయించి నిర్వాహకుల వద్దనుండి హోటల్ ను స్వాధీనం చేసుకునే నిబంధనలు ఉన్నాయి. అయితే హోటల్ యాజమాన్యం అద్దె చెల్లించడంలో విఫలమైంది. హోటల్ యాజమాన్యం దాదాపు ఏడాదిన్నరపాటు అద్దెలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో టీటీడీకి నెలకు ఇరవై మూడు లక్షల చొప్పున ఏడాదిన్నర కాలానికి నాలుగున్నర కోట్ల రూపాయల అద్దె బకాయిలు నిలిచిపోయాయి. అయినా టీటీడీ గానీ, పంచాయతీ గానీ, రెవెన్యూ అధికారులు గానీ హోటల్ యాజమాన్యం నుంచి బకాయిలు వసూళ్లు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బకాయిల వసూళ్లకు వెళ్ళినప్పుడల్లా పంచాయతీ, రెవెన్యూ అధికారులను హోటల్ యాజమాన్యం మామూళ్ల మత్తులోకి దింపి మేనేజ్ చేసినట్లు  సమాచారం. ఈ క్రమంలోనే నాలుగున్నర కోట్ల బకాయిల వసూళ్లకు హోటల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాగా హోటల్ యాజమాన్యం కరోనా కారణంగా తాము బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు వివిధ సాకులు కారణాలుగా చూపించి, తమ కు మినహాయింపు ఇవ్వాలని నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానాల్లో నాలుగు దఫాలుగా పిటిషన్లు వేసి ఈ పిటిషన్లు సాకుగా చూపించి టీటీడీకి అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేశారు.  న్యాయస్థానం మాత్రం హోటల్ యాజమాన్యం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పూర్తి బకాయిలు టీటీడీకి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్ళిన హోటల్ యాజమాన్యం గతంలో రెండు హోటళ్లకు ఇదేవిధంగా టీటీడీ అద్దెల చెల్లింపులో మినహాయింపు ఇచ్చిందని విజ్ఞప్తి చేసింది. అయితే న్యాయస్థానం కూడా టీటీడీ వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషనర్ వాదనను కొట్టేసింది. అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ టీటీడీ అధికారులు మాత్రం ఈ హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కపెట్టారు. నిబంధనల మేరకు ఏ హోటల్ నిర్వాహకుడైనా మూడు మాసాలపాటు అద్దెలు చెల్లించకపోతే వెంటనే చర్యలు తీసుకుని అద్దెలు రికవరీ చేసి హోటల్ ను స్వాధీనం చేసుకుని మళ్లీ టెండరు నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. అయితే ఈ సంఘటనలో ఏడాదిన్నర కాలంగా బాడుగలు చెల్లించకపోయినా ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కోర్టు తీర్పు, బకాయిల వ్యవహారం ఇలా నడుస్తుండగానే టీటీడీలో ఓ ఉన్నతాధికారి హోటల్ నిర్వాహకులతో అనధికారిక సంప్రదింపులు జరిపారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.  నాలుగున్నర కోట్ల బకాయిలకు గాను డిపాజిట్ సొమ్ము మినహాయించుకొని మరో మూడు కోట్ల రూపాయల బకాయిలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వారి వద్ద నుండి వసూలు చేయకుండా దయా హృదయం చూపించడంలో ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా చెన్నై హోటల్స్ యాజమాన్యం మాత్రం టీటీడీ వైఖరి కారణంగా తంతే బూరెల గంపలో పడ్డట్టయ్యింది. మూడు కోట్లు మిగిలించుకున్న ఆనందంలో హోటల్ ను ఆగమేఘాలపై ఖాళీ చేసి అర్ధరాత్రే చెన్నైకి చెక్కేశారు. మెజారిటీ ప్రజల ఇష్టదైవమైన ఓ ప్రముఖ ధార్మిక సంస్థలో ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు ఇలా అధర్మ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నప్పడు సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే  కన్నెర్ర చేస్తాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.