వాతావరణ శాఖ జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టుల గురించి తెలుసా?
posted on Aug 31, 2021 @ 4:17PM
వర్షాకాలంలో వాతావరణ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. వర్షాలు, వరదలపై ముందుస్తు జాగ్రత్తలు చెబుతూ అవసరమైతే అలర్టులు జారీ చేసింది భారత వాతవరణ శాఖ(ఐఎండీ). అలర్టుల్లో ముఖ్యమైనవి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్టులు. దేశంలో వర్ష సూచన, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను జారీ చేస్తారు. వచ్చే 24 గంటల్లో పడే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితిని.. వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని బట్టి ఈ హెచ్చరికలు ఉంటాయి. అయితే చాలా మందికి వాతావరణ శాఖ జారీ చేస్తే హెచ్చరికలపై అవగాహన ఉండదు. అందుకే అలర్టులు ఎన్ని రకాలు, వాటిని ఎప్పుడు జారీ చేస్తోరా తెలుసుకుందాం...
ఐఎండీ గ్రీన్ అలర్ట్ ఇస్తే ఎలాంటి ప్రమాదం లేదని అర్థం.
ఎల్లో అలర్ట్ అంటే ఆరు నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు.
ఆరెంజ్ అలర్ట్- పది నుంచి 20 సెంమీటర్ల వర్షపాతం, 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని.. ఇబ్బందులేమైనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్ సూచిస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందే.. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
రెడ్ అలర్ట్ - ఇది అత్యంత కీలకం. ఒక రకంగా చెప్పాలంటే కుండపోత వానలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తును సూచించడానికి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని అర్థం. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.