హుజూరాబాద్ ఓటర్లు డిసైడై పోయారా? ఎవరేం చేసినా ఫలితం అదేనా?
హుజూరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క తప్పుతోందా? అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్నట్లుగా, ఏదో ఆశించి తీసుకుంటున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అవుతున్నాయా? అందుకేనా, ఏమి చేయాలో పాలుపోకనే ముఖ్యమంత్రి రోజుకో సమీక్ష నిర్వహిస్తున్నారా? నియోజక వర్గం నాయకులను పిలిపించుకుని, అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? ఆళ్ళే మంటున్నరు, వీళ్ళేమంటున్నరు? అని ఆరాతీస్తోంది అందుకేనా, చివరకు అధికారులు వండి వడ్డించిన ‘వంటింటి’ సర్వేలు కూడా ఆయన ఆశలు మీద నీళ్ళు చల్లుతున్నారా? అందుకేనా, ముఖ్యమంత్రి ఏమి చేద్దాం, ఎలా బయట పడదాం,అని మేథోమథనం సాగిస్తోంది అందుకేనా? అంటే,అంతర్గత వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
నిజానికి ఒక్క దళిత బంధుతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించవచ్చని, ముఖ్యమంత్రి లెక్కలేశారు. ఆ ఉద్దేశంతోనే పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ నియోజక వర్గాన్ని ఎంపిక చేశారు. నియోజక వర్గం పరిధిలోని దళిత కుటుంబాల లెక్కలు తీశారు. నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలున్నాయి. (హుజూరాబాద్ మండలంలో 5,323, కమలాపూర్ మండలంలో 4346, వీణవంక మండలంలో 3678, జమ్మికుంట మండలంలో 4996,ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలు). నియోజక వర్గంలోని అన్ని దలిత కుతుబాలకు ఒకేసారి పథకాన్ని వర్తింప చేయాలని, తద్వారా దళిత ఓట్లను గంపగుట్టగా తమ వైపుకు తిప్పుకుంటే, ఈటలను ఇట్టే సునాయాసంగా ఇంటికి పంపించవచ్చని ఆశించారు.
ఇందుకోసంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్’ లో పథకం అమలుకు కేటాయించిన, రూ. 1200 కోట్లకు అదనంగా మరో రూ.2000 కోట్లు కేటాయించేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. అంటే, ఈ పథకం మీద ముఖ్యమంత్రి ఎంతగా ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చును. నిజానికి, ఆ నిజాన్ని అయన దాచుకోలేదు. హుజూరాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు పథకం, అని బహిరంగంగా ప్రకటించారు.
కానీ, దళిత బంధు పథకం నుంచి ఆశించిన ఫలితాలు రాకపోగా వ్యతిరేక ఫలితాలు స్పష్టమవుతున్నాయని, కొంచెం ఆలస్యంగా అర్థమైందని సన్నిహత వర్గాల తాజా సమాచారం. అందుకే మళ్ళీ ఓల్డ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అంటున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కథ వినిపించడంతో పాటుగా ఈటల వెంట ఉన్న నాయకులను తమ వైపుకు తిప్పుకోవడంపై మరో మారు దృష్టిపెట్టాలని శుక్రవారం అర్థరాత్రి వరకు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు, తెలుస్తోంది.
ఇందులో భాగంగానే, ఇప్పటకే సమాదానదండోపాయాలను ప్రయోగించి ఈటల అనుచరులు చాలా వరకు తమవైపుకు తిప్పుకున్న అధికార పార్టీ, ఇప్పుడు మరో మారు, ఆయన అనుచరులకు వల విసురుతోంది. అందులోనూ ముఖ్యంగా ఇంతవరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగని ఈటల సన్నిహిత అనుచరులను కారెక్కిచేందుకు,గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే, ఈటలకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న పింగిలి రమేష్, చుక్కా రంజిత్’లు తాజాగా కారెక్కి గులాబీ గూటికి చేరారు.
అయితే, గుర్రాన్ని బలవంతంగా రేవు వరకు తీసుకు పోవచ్చును, కానీ, నీళ్ళు తాగించడం సాధ్యం కాదు. అలాగే, అదిరించో బెదిరించో, ఈటల అనుచరులను తమ వైపుకు తిప్పుకోవచ్చును కానీ, మనసులను మార్చడం అయ్యే పని కాదని, అటు వెళ్ళిన వారే అంటున్నారు. నిజానికి, ఇప్పటికే, హుజూరాబాద్ ఓటర్లు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటు ఈటల అటు కేసీఆర్ ఏ ఒడ్డున నిలవాలో జనం డిసైడై పోయారని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.