జైలులో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష!
posted on Sep 1, 2021 @ 12:37PM
చంచల్ గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమరణ దీక్షకు దిగారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో చిలుకలగూడ పోలీసులు శుక్రవారం అర్దరాత్రి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. తీన్మార్ మల్లన్నకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
తీన్మార్ మల్లన్న 7 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ ను మంగళవారం కోర్టు కొట్టేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర తన వాదనలు విన్పించారు. ఇప్పటికే ఈ కేసులో తీన్మార్ మల్లన్నతో పాటు.. 19 మంది సాక్షులను విచారించారని..ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. మల్లన్నను కస్టడీకి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తెలెత్తే అవకాశం ఉందని.. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కష్టడీ పిటిషన్ ను తిరస్కరించింది.దీంతో మల్లన్న తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు.
మలన్నకు బుధవారం బెయిల్ వస్తుందని అంతా భావిస్తుండగా పోలీసులు మరో ఎత్తు వేశారని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు బనాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీన్మార్ మల్లన్నను జైలులో ఉంచేందుకే పోలీసులు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై మేధావులు, వివిధ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తి అయ్యేంతవరకు తీన్మార్ మల్లన్నను జైల్లో ఉంచాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై తీన్మార్ మల్లన్న అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై కుట్రలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.