చిరు అన్నయ్య అడుగుజాడల్లో తమ్ముడు పవన్?
చరిత్ర తిరగబడుతోందా, 2009 కథ పునరావృతం అవుతోందా? చిరు అన్నయ్య అడుగుజాడల్లోనే తమ్ముడు పవన్ అడుగులు వేస్తున్నారా, అంటే, అవునని అనలేము కానీ, కాదనీ గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. ఇంచుమించిగా గత వారం పదిరోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, “పంచలు ఊడతీసి కొడతాం” అన్న పాత డైలాగు ఎవరికైనా గుర్తుకొస్తే, రావచ్చును. అది వాళ్ళ తప్పు కాదు, “తాట తీసి నార తీస్తా” వంటి ఫ్రెష్ డైలాగులు చెవిన పడినప్పుడు, రీలు గిరిగిరా ... వెనక్కి తిరిగి పవన్ కళ్యాణ్ పాత డైలాగు గుర్తుకు రావచ్చును.
ప్రస్తుతం వైసీపీ, జనసేన పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం మాములుగా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే, వైసీపీ మీద యుద్దమే ప్రకటించారు. సినిమాటిక్’గా పంచ్’లు పేల్చారు. కానీ, నిజంగా ఆయన యుద్ధానికి సిద్దంగా ఉన్నారా? అన్నదే అనుమానం. నిజంగా వైసీపీ అరాచక పాలనను, ఎదుర్కోవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అయితే, బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలలో, తటస్థంగా ఉండాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంతేకాదు, పవన్ కళ్యాణ్ తమ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు సెంటిమెంట్ కార్డ్’ ను జత చేశారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్ ఇచ్చింది కాబట్టి, ఆమెను గెలిపించడమే న్యాయం ధర్మం అన్నట్లుగా మాట్లాడారు. అందుకే జనసేన పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. అంటే, జనసేన కార్యకర్తలు, అభిమానులు వైసీపీ అభ్యర్ధి పట్ల సానుభూతి చూపించి, ఆమెకు ఓటేసి గెలిపించాలని చెప్పకనే చెప్పారు. అలాగే, ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి ఉచిత సలహాకూడా ఇచ్చారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, పవన్ కళ్యాణ్ అన్నచిరంజీవి అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు.
అలాగే సినిమా టికెట్ల గోలను, రాజకీయ రచ్చగా మలుపు తిప్పడం మొదలు అనంతపురంలో బద్వేల్ ఎన్నికల బరిలో దిగడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించే వరకు సాగిన వీధి భాగోతం కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఆటలు, అరుపులు అన్నీ, ‘మగళగిరి’ ప్రొడక్ట్స్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో, తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేదు. కానీ కొన్ని జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో స్థానికంగా కొన్ని కొన్ని చోట్ల రెండు పార్టీల స్థానిక నాయకులు లోపాయికారీ ఒప్పదం కుదురుచుకున్నారు. అలా ఎక్కడైతే, తెలుగుదేశం, జనసేన దగ్గరయ్యాయో అక్కడల్లా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపధ్యంలో వైసీపీ వ్యూహకర్తలు పవన్ కళ్యాణ్’తో డీల్ కుదుర్చుకున్నారని, రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కుదిరిందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, పాత కాపులు, 2009 ఎన్నికలకు ముందు, మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పేరిట సాగించిన రాజకీయం గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి, ప్రజారాజ్యమే అన్నట్లుగా దూకుడు ప్రదర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ప్రజారాజ్యం పార్టీని , చిరంజీవిని టార్గెట్ చేసింది. ఇప్పుడు వైసీపే, తాడు బొంగరం లేని జనసేన, పవన కళ్యాణ్’కు ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.అయితే ప్రజారాజ్యం పార్టీ వైఎస్సార్ సృష్టి అనే విషయం ఆయన పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపినా తర్వాత కానీ తేలలేదు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి 36 శాతం తెలుగు దేశం పార్టీకి, ఇంచుమించుగా 29-30 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం ఐదారు శాతం మాత్రమే, కానీ, తెలుగు దేశం పార్టీ సారధ్యం లోని గ్రాండ్ అలయన్స్’కు 106 సీట్లు వచ్చాయి, అందులో 91సీట్లు టీడీపీకి వస్తే మిగిలిన స్థానాల్లో తెరాస (10), సిపిఐ, సిపిఎం (5) సీట్లు గెలుచుకున్నాయి.అయితే, ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్ష కూటమి ఓటమికి చిరంజీవి ప్రజారాజ్యం కారణం. ప్రజారాజ్యం పార్టీ 16.32 శాతం ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. కానీ, చివరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నారు. అందుకే ఇప్పుడు కొందరిలో చరిత్ర్ర పునరావృతం అవుతోందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్న మెగాస్టార్ అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నారా ?అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి.