ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? పవన్ కు ఢిల్లీ సిగ్నల్ వచ్చిందా?
posted on Oct 3, 2021 @ 8:08PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? జనసేన చీఫ్ దూకుడు పెంచిందా అందుకేనా? ఈ ప్రశ్నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా తీవ్రంగా పతనమైన వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది. సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందని.. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనలు వినిపించాయి. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంతో పాటు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు పవన్ కల్యాణ్. రెండు సభల్లోనూ ఉద్వేగ ప్రసంగం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించిన పవన్ కల్యాణ్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే తన ప్రసంగంలో పదే పదే రానున్న ఎన్నికలు, రానున్న ఎన్నికలు అంటూ ప్రసంగించారు పవన్ కల్యాణ్. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. రానున్న ఎన్నికలు అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. కేంద్రం పెద్దలతో పవన్ కల్యాణ్ కు మంచి సంబంధాలున్నాయి. గత నెలలో ఢిల్లీకి వెళ్లారు జన సేన చీఫ్. ఆ సమయంలో బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తేవడంతో.. ఆ దిశగా కేంద్ర నుంచి ఆయనకు ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జగన్ ప్రభుత్వ కాలం ఇంకా రెండున్నర ఏళ్ళకు పైగా ఉంది. అయితే ప్రధాని నరేంద్రమోడీ గతం నుండి పేర్కొంటున్నట్లు జమిలి ఎన్నికలకు ఏమైనా ఆర్డినెన్స్ ఇస్తారా? లేక మరే కారణముతో ముందుగానే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది.
చాలా కాలంగా రాజకీయంగా సైలెంటుగా ఉన్న పవన కల్యాణ్.. ఇటీవల కాలంలో ఒక్కసారిగా దూకుడు పెంచారు. పవన్ పిలుపుతో జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. నరకప్రాయంగా మారిన రోడ్లపై జనసేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. పవన్ కల్యాణ్ శ్రమదానం చేస్తూ రోడ్లు బాగుచేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీపై గతంలో ఎప్పుడు లేనంతగా రెచ్చిపోతున్నారు పవన్ కల్యాణ్. ఇంతేకాదు రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లోనే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు బూతు పురాణం అందుకోవడంతో రచ్చ రచ్చైంది.
వైసీపీని పవన్ ఇంతగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దల నుంచి సంతేకాలు రావడం వల్లే పవన్ కల్యాణ్ ఒక్కసారిగా స్పీడ్ పెంచారని అంటున్నారు. ఏపీలో కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలు, బీజేపీ-జనసేన నేతల దూకుడుతో ఏదో జరగబోతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.