TOP NEWS @ 7pm
posted on Oct 3, 2021 @ 6:55PM
1. బద్వేలు ఉప ఎన్నిక కీలక మలుపులు తిరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో ఆయన సతీమణినే అధికారపార్టీ రంగలోకి దింపడంతో ఆ స్థానంలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. బద్వేల్ బరి నుంచి ప్రధాన ప్రతిపక్షం వైదొలిగింది. ఇప్పటికే జనసేన సైతం పోటీ చేయబోమని ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం బద్వేల్‌లో వైసీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. బీజేపీకి మద్దతుగానే వ్యూహాత్మకంగా జనసేన, టీడీపీలు పోటీ నుంచి తప్పుకున్నాయని ప్రచారం జరుగుతోంది.
2. బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తామని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. 40 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదనే ఆగ్రహంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. తమ ఊరికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులనూ గ్రామంలోకి అనుమతించమని హెచ్చరిక బోర్డు పెట్టారు.
3. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బెదిరింపులకు జగన్ ప్రభుత్వం భయపడదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. పవన్ జీవితంలో జగన్‌ను ఓడించలేరని అన్నారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని కొందరు పెద్ద నిర్మాతలు.. విచ్చలవిడిగా బెనిఫిట్ షోలు వేసి ప్రజల డబ్బు దోచుకున్నారని విమర్శించారు. చిన్న సినిమాలు బతకాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని కొడాలి నాని చెప్పారు.
4. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నానన్నారు. త్వరలోనే రిపబ్లిక్ సినిమా చూస్తానని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
5. కాంగ్రెస్ దళితుల పార్టీ అని, ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరో వేలుగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితున్ని రాష్ట్రపతిని చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. పంజాబ్‌లో పేద దళితున్ని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. తెలంగాణలో శాసనసభా పక్ష నేతగా దళిత నాయకుడు భట్టికి అవకాశం ఇచ్చిందని.. ఏపీలో దళిత బిడ్డ శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నియమించిందని అన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు.
6. తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఈటల గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీలో త్రిబుల్ ఆర్.. రాజాసింగ్, రఘునందన్‌రావు, రాజేందర్‌లు ప్రజల పక్షాన బలమైన వాయిస్‌ను వినిపిస్తారని బండి తెలిపారు.
7. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి విచారణకు హాజరుకావాలని సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారి రమేష్‌కు నోటీసులు జారీ చేశారు. హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ కార్యాలయంలో ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని పోలీసులు ఆదేశించారు. మస్తాన్ వలి, రాజ్‌కుమార్‌తో అధికారుల సంబంధాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రఫీతో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిపించారని ప్రశ్నించే అవకాశం ఉంది.
8. ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీ కస్టడీలో ఆశించిన స్థాయిలో సమాచారం లభించలేదని చెబుతున్నారు. సెక్షన్‌లో సిబ్బంది అందరికీ సిస్టం యాక్సెస్ ఉండటంతో నకిలీ బిల్లులపై ఆధారాలు లభించలేదు. చెల్లింపులు నిర్ధారించే యూజర్ ఐడీల గోప్యతలో లోపం ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. సాంకేతిక సాక్ష్యాల కోసం ఏసీబీ ప్రయత్నిస్తోంది.
9. ఏపీలో ఊరూ-పేరూ లేని మద్యం అమ్ముతుండటంతో.. బ్రాండెడ్ లిక్కర్ స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా ఏపీలో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్ర మద్యాన్ని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ మీదుగా గుంటూరు జిల్లా రేపల్లె తరలిస్తున్న రూ.7 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న బస్సును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
10. ‘‘నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పింది’’ అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విక్టరీ మెసేజ్ ఇచ్చారు. బెంగాల్‌లో జరిగిన తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా చతికిల పడింది. బైపోల్ జరిగిన చోట్ల బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.92 శాతం ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. తాజా ఉప ఎన్నికల్లో 18 శాతానికి పైగా ఓట్లు సంపాదించడం ఆసక్తికర పరిణామం.