గులాబీ గూటికి మల్లన్న టీం.. కేసీఆర్ తీన్మార్ సక్సెస్సేనా?
posted on Oct 3, 2021 @ 7:38PM
తీన్మార్ మల్లన్న.. క్యూ న్యూస్ అధినేతగానే అందరికీ తెలుసు. చాపకింద నీరులా ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఓ వ్యవస్థను సెట్ చేసుకున్నారు. మల్లన్న పేరు మీదుగా దాదాపు ప్రతీ జిల్లాల్లో ప్రత్యేక టీమ్‌లు ఉన్నాయి. ఊరూరా మల్లన్న నెట్‌వర్క్ ఉంది. మల్లన్న టీమ్‌లో వేలాది మంది సభ్యులు ఉన్నారు. ఆయన కోసం అనేక మంది పని చేస్తున్నారు. అందుకే, తెలంగాణలో ఏ మారుమూలన ఎలాంటి న్యూస్ వచ్చినా.. అది క్షణాల్లో మల్లన్నకు చేరిపోతుంది. విషయం పెద్దదైతే.. వెంటనే క్యూ న్యూస్ బృందం రంగంలోకి దిగుతుంది. ఇక మల్లన్న టీమ్ పేరు మీదుగా వందలాది సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు నడుస్తున్నాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి ఉన్నంత సీక్రెట్ నెట్‌వర్క్ తీన్మార్ మల్లన్నకు ఉందంటారు. చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు.. ఆ మల్లన్న గ్రూపుల సాయంతోనే ఆయన తన వాయిస్‌ను బలంగా వినిపించగలిగారు. ఎమ్మెల్సీగా గెలవకున్నా.. గెలిచినంత పని చేసి.. సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. అందుకే, కేసీఆర్ సర్కారులో అంతటి బెదురు అంటారు. ఆ భయంతోనే రకరకాల కేసులు పెట్టి మల్లన్నను జైల్లో పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన బయటికొస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి దెబ్బని.. బెయిల్ రాకుండా చేస్తూ.. వారాల తరబడి జైల్లోనే మగ్గేలా చేస్తున్నారని మల్లన్న అనుచరులు అంటున్నారు.
తెలంగాణలో పాదయాత్రకు ప్లాన్ చేసిన తీన్మార్ మల్లన్న రాజకీయంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆయన సతీమణి జాతీయ బీజేపీకి లేఖ రాశారు. జైలు నుంచి బయటకు రాగానే.. మల్లన్న బీజేపీలో చేరడం ఇక లాంఛనమే. అయితే రాజ్యం ఒత్తిడి తట్టుకోలేక.. రక్షణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు తీన్మార్ మల్లన్న సిద్ధమయ్యారనే చర్చ ఉంది. అయితే కాషాయ కండువా కప్పుకోవాలనే మల్లన్న నిర్ణయాన్ని.. ఆయన అనుచరులందరూ ఆమోదించలేకపోతున్నారు. మల్లన్న నిర్ణయంపై తీవ్రంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మల్లన్న టీమ్ గ్రూపుల నుంచి చాలామంది సభ్యులు వైదొలుగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నకు రైట్‌హ్యాండ్ లాంటి ఆయన ప్రధాన అనుచరుడు, రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య సైతం మల్లన్న టీమ్‌ను వదిలేయడం సంచలనంగా మారింది.
దాసరి భూమయ్య. మల్లన్న గురించి తెలిసిన వారందరికీ ఈయన సుపరిచితమే. మాజీ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అయిన భూమయ్య.. మల్లన్న తరఫున బలంగా వాయిస్ వినిపించేవారు. ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. యూట్యూబ్ వీడియోస్‌తో దడదడలాడించేవారు. మల్లన్నకు రైట్‌హ్యాండ్ లీడర్‌గా ఉండేవారు. అలాంటి దాసరి భూమయ్యకు సైతం మల్లన్న బీజేపీలో చేరడం నచ్చలేదు. దీంతో.. ఆయన మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరడం మరింత ఆసక్తికరం. ఇన్నాళ్లూ ఏ టీఆర్ఎస్ సర్కారునైతే కుమ్మేసేవారో.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనే దానికి నిదర్శనం. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మల్లన్న టీమ్ లో కీలకంగా పనిచేసిన వ్యక్తులు కూడా మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే మరికొందరు మల్లన్న అనుచరులు ఆయనకు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది.
తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు. బడుగులకు రాజ్యాధికారమే తన లక్ష్యమంటారు. ఏ పార్టీలో చేరకుండా, ఏ పార్టీని స్థాపించకుండా.. ఇన్నాళ్లూ ఓ వ్యక్తిగా వ్యవస్థపై పోరాడారు. కేసీఆర్ వ్యతిరేక వాయిస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయనకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నదంతా.. దళితులు, మైనార్టీలే. తాజాగా, మల్లన్న బీజేపీలో చేరుతానని ప్రకటించడంతో.. ఆ వర్గమంతా మల్లన్నను వీడుతున్నారు. ఆ జాబితాలో మల్లన్న టీమ్‌లో కీలక నేతగా ఉన్న దాసరి భూమయ్య సైతం ఉండటం కలకలం రేపుతోంది. మల్లన్న జైలు పాలవడం.. బీజేపీలో చేరుతుండటంతో.. ఇకపై మల్లన్న నెట్‌వర్క్ అంతా కకావికలం కానుందా? అనే అనుమానం. ఏ పార్టీలో లేరు కాబట్టి ఇన్నాళ్లూ అన్నివర్గాల ప్రజలు మల్లన్నకు సపోర్ట్‌గా నిలిచారు. ఆయన కాషాయరంగు పులుముకుంటే.. ఆయన అనుచరులు సైతం ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉంది.