టీఆర్ఎస్ కు గుత్తా రాజీనామా చేస్తారా?
posted on Oct 4, 2021 @ 11:31AM
టీఆర్ఎస్ లో సంచలనాలు జరగబోతున్నాయా? కీలక నేతలు కారు దిగిపోనున్నారా? ఇదే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. కీలక పదవులు అనుభవించిన నేతలు కొందరు గులాబీ గూటికి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం సాగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు,శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం ముగిసి చాలా రోజులైన మళ్లీ అపాయింట్ చేయలేదు కేసీఆర్. అంతేకాదు రెండు దశాబ్దాలుగా గుత్తా కుటుంబం చేతుల్లో ఉన్న నార్మాక్స్ డైయిరీకి కొత్త చైర్మెన్ ను నియమించారు. ఈ పరిణామాలతో కలత చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు గుత్తాతో చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది.
అయితే తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని అన్నారు. నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన గుత్తా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలెవరు తనతో చర్చలు జరపలేదన్నారు. రైతులు చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీజేపీ చేస్తున్న దమనకాండకు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు.
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. బీజేపీకి భారీ ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా ఆపాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.