బీఆర్‌ఎస్‌ పాలనలో చేయని సమ్మె...ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు : మంత్రి దామోదర

  ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ను తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వంలో నెలకు రూ.50 కోట్లు కూడా రిలీజ్‌ అవ్వలేదు.  మేం నెలకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాం. ఈ మేరకు ఇటీవలే రూ.100 కోట్లు విడుదల చేశాం. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకపోవడంతో మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలకు ఆరోగ్య సేవలో ఎలాంటి అంతరాయం కలగదు’’ అని దామోదర రాజనర్సింహ తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తం ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ సర్కార్  నుంచి రావలసిన రూ.1,400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా, ఉన్నపళంగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేటు ఆస్పత్రులు నిలిపివేయటంతో..రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తమ బకాయిలను సర్కార్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.  

హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే మా నినాదం : సీఎం చంద్రబాబు

  విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైజాగ్‌లో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. విశాఖలో అద్బుతమైన వాతవరణం ఉంది.  శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళలు భద్రతలో అగ్రస్థానంలో ఉంది అని తెలిపారు. విశాఖ ప్రజల స్ఫూర్తిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు..హుద్‌హుద్ తుఫాను సమయంలో వైజాగ్‌ వాసులు చూపిన చొరవ, సేవాభావాన్ని ఎప్పటికీ మరువలేను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమం ప్రధాని బర్త్‌డే రోజు జరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో 11 ఏళ్లలోనే భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఏపీనీ నిర్మించడమే కు ప్రభుత్వ ధ్యేయం" అని అన్నారు.  ప్రజల హెల్త్‌కి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.  ప్రతి సంవత్సరం ఆరోగ్య రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్లు ఖర్చు చేస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో, పేదలకు అండగా నిలిచేందుకు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకొచ్చాం" అని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత హెల్త్ బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల కోసం ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.  టాటా, గేట్స్ ఫౌండేషన్‌ సహకారంతో 'ప్రాజెక్ట్ సంజీవని' ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. హైబీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు" అని ఆయన వివరించారు. గైనకాలజీ, ఈఎన్‌టీ, కళ్లు, డెర్మటాలజీ, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ఈ క్యాంపుల్లో అందుబాటులో ఉంటాయని చంద్రబాబు తెలిపారు.  

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు అసెంబ్లీ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. శాసన సభ సమావేశాల నిర్వహణపై సభాపతి అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది.ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నారు.  

మిథున్ రెడ్డి కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురికి బెయిలు వచ్చినా.. కీలకమైన వారు ఇప్పటికీ బెయిలు లభించక రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులు అయిన రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు.  తనకు సన్నిహితులైనప్పటికీ జగన్ ఇప్పటి వరకూ వీరిని జైలుకు వెళ్లి పరామర్శించలేదు. అది పక్కన పెడితే.. ఈ కేసులో ఏ4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు బెయిలుపై వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ తరుణంలో సిట్ మిథున్ రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   సిట్ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. 

మోదీ పుట్టినరోజు సందర్భంగా లండన్‌లో లోకేశ్ ప్రార్థనలు

  ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ మంత్రి నారా లోకేశ్ లండన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు.  ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ  నాయకత్వం మరిన్ని ఏళ్లపాటు అందాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందన్నారు. ప్రస్తుతం తన లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేశ్, ప్రధాని పుట్టినరోజున ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆసియా కప్ నుంచి పాక్ వైదొలగుతుందా?

ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యచ్ లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఓటమి ఉక్రోషంతో పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ లేనిపోని వివాదాన్ని సృష్టించి ఐసీపీ ముందు ఓ డిమాండ్ పెట్టింది. టీమ్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రిఫరీని తొలగించాలన్నదే ఆ డిమాండ్. అయితే ఐసీసీ ఆ డిమాండ్ ను తోసిపుచ్చింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకోవాలన్ననిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. దీంతో పాక్ కు ఓటమిని మించిన పరాభవం ఎదురైంది. పుండుమీద కారం చల్లిన చందంగా ఐసీసీ తమ డిమాండ్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఒక ఎత్తైతే.. ఆసియాకప్ లో ఆడుతున్న జట్లేవీ కూడా పాకిస్థాన్ డిమాండ్ కు మద్దతు ఇవ్వలేదు. అంతేనా పాక్ మాజీ క్రికెటర్లు కూడా తన దేశ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంటా బయటా విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి అర్థంతరంగా వైదొలగడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ ఒంటరి అయిపోయింది. ఐసీసీ ఛీ కొట్టినా దులిపేసుకుని టోర్నీలో కొనసాగడమంటే ఉన్న కాస్త పరువునూ మంటగలుపుకోవడమే అవుతుందని భావిస్తున్న పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుందని అంటున్నారు.   యూఏఈ తో పాకిస్తాన్ బుధవారం (సెప్టెంబర్ 17) తలపడాల్సి ఉంది. అయితే పాక్ ఆటగాళ్లు ప్రీ మ్యాచ్ మీడియా సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో పాక్ టోర్నీ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లుగానే అర్ధం చేసుకోవాలని క్రీడాపండితులు అంటున్నారు. అయితే పాక్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడంతో  పాక్ ఆసియా కప్ టోర్నీలో కొనసాగుతుందా? వైదొలగుతుందా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.  

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు మృతి

  నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామ సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాద  ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడు మంది కారులోనే  మృతి చెందారు. నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఒక పాప మొత్తం 7 మంది చనిపోయినట్లు తెలుస్తుంది.  ఈ కారును అనంతసాగరం మండలం పరమటి కంభంపాడు ఇసుకరీచ్ నుండి ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. చనిపోయిన వారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రం వారి వీధి కి చెందినవారుగా తెలిసింది..  చనిపోయిన వారి సమాచారం మేరకు మృతులు టి రాధా, శేషం సారమ్మ, నల్లగొండ లక్ష్మి, శేషం తేజ, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. మరొకరి పేరు తెలియవలసి ఉంది.. ఆత్మకూరులో ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.  

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు?.. జగన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పేశారా?

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని ఇప్పటికే పలు మార్లు వైసీపీ అధినత జగన్ చెప్పారు. అయితే మాట అదే అయినా, ఇప్పుడు చేత మారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  ఇటీవల కూడా జగన్ స్వయంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోవడం లేదని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడమే ఖరారైతే.. ఆయన హడావుడిగా తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావలసిన అవసరం లేదు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల రోజునే అంటే గురువారం (సెప్టెంబర్ 18)న తన తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.  దీనిపై జగన్ సొంత మీడియా కూడా క్లారిటీ ఇచ్చింది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారని పేర్కొంది.   దీనిని బట్టి ప్రతిపక్ష హోదా  విషయాన్ని వదిలేసి జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి హాజరౌతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ జగన్ తాను డుమ్మా కొట్టి, తన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలనూ సభకు పంపుతారా? అన్న అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక వేళ జగన్ అసెంబ్లీ బహిష్కరణకే కట్టుబడి ఉంటే.. ఆయన ఆదేశాలను ధిక్కరించి అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో జగన్ వ్రతం చెడ్డా ఫలమైనా దక్కితే చాలన్నట్లుగా అసెంబ్లీ హాజరుకు, ప్రతిపక్ష హోదాకూ ముడిపెట్టవద్దన్న నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం   తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తన స్నేహితుడు అయిన కేసీఆర్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినప్పటికీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరౌతున్నారు. జగన్ కూడా అదే విధంగా తాను అసెంబ్లీకి గైర్హాజరైనా పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించుకున్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీలో ఆయన ఎమ్మెల్యేలకు సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీని వల్ల జగన్ కు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని కూడా అంటున్నారు. జగన్ హాజరు కాకుండా ఎమ్మెల్యేలను సభకు పంపినా జగన్ పారిపోయారన్న విమర్శలు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.  

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన

    తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హొటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, బీసీల వాటా అనే నినాదాలు పార్టీ జెండాలో కనిపించాయి.తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17న పార్టీని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, "తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు.  బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోంది" అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ పార్టీ బీసీలను ఎలా వంచించిందో లెక్కలతో వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. కొందరు ఈ రోజును విమోచన దినమని, మరికొందరు విద్రోహ దినమని అంటున్నారని, కానీ వాస్తవానికి ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజని ఆయన గుర్తుచేశారు. అందుకే ఈ చారిత్రక రోజున తమ పార్టీని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.   

తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవం

తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరారామావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టిన సెప్టెంబర్ 17ను కొందరు విమోచనమని, మరి కొందరు విలీనం అని అంటున్నారని, అయితే ఎవరెలా అన్నా వేలాది మంది రాజరిక వ్యవస్థపై పోరాడి ప్రాణాలర్పించారన్నది వాస్తవమన్నారు.  నాటి పోరాట యోధులందరికీ బీఆర్ఎస్ తరఫున శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. పోరుగడ్డ తెలంగాణ.. నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి,  1969 తెలంగాణ ఉద్యమం,ఆ తర్వాత జరిగిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాలను చూసిందన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. గ్రూప్-1 విద్యార్థులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసిందన్నారు. రైతన్నలు యూరియా కోసం రోడ్లపైకి వస్తుంటే వారి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టడం మానేసి ఈ ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందన్నారు.  ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. 

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం అంటే ఇదేగా ట్రంపూ!

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించడం అంటే ఏమిటో ఇప్పటికి అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే ఒక్క సారిగా విదేశీ వర్కర్ల విషయంలో  యూటర్న్ తీసుకున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. అమెరికా ఫస్ట్ అంటూ దేశంలోకి విదేశీయుల ప్రవేశంపై ఇష్టారీతిగా ఆంక్షలు విధించి.. బయటవారిని రానివ్వం అంటూ గప్పాలు పలికిన ట్రంప్ అదే నోటితో విదేశీ వర్కర్లకు స్వాగతం పలకాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆయన స్వయంగా విదేశీ వర్కర్లకు స్వాగతం పలుకుతామని  ప్రకటించడంతోనే  ట్రంప్ బేలతనం అందరికీ అవగతమైంది. అనుభవం అయితే తప్ప  ట్రంప్ కు తత్వం బోదపడలేదన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  ఇంతకీ అసలేమైందంటే.. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ కంపెనీ అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తోంది. అక్కడ పని చేయడానికి అమెరికాలో అమెరికాలో వర్కర్లు లేకపోవడంతో.. ఆ కంపెనీ వర్కర్లను దక్షిణ కొరియా నుంచే తీసుకువెళ్లింది. అయితే అలా దక్షిణ కొరియా నుంచి వచ్చిన వర్కర్లను అమెరికా యంత్రాంగం నిబంధనల పేరుతో అడ్డుకుంది. బంధించింది. దీంతో దక్షిణ కొరియా షార్ప్ గా రియాక్టైంది. తమ దేశానికి చెందిన వర్కర్లను స్వదేశానికి తీసుకువెళ్లిపోయింది.  అంతే కాదు.. హ్యుండయ్ కంపెనీ... అమెరికాలో పెట్టుబడుల విషయంలో పునరాలోచనలో పడింది. ఇదే విషయాన్ని బాహాటంగా ప్రకటించింది. దీంతో ట్రంప్ ఉలిక్కిపడ్డారు. హ్యుండయ్ కనుక అమెరికాలో పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయడం అంటూ జరిగితే..  ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచీ కూడా పెట్టుబడి దారులు అదే దారిలో నడుస్తాయన్న భయం ట్రంప్ ను వణికించేసింది. ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టేందుకు ముందువెనుకలాడుతున్నాయి.  దీంతో వెంటనే ట్రంప్ దేశం లోకి విదేశీ వర్కర్లను అనుమతిస్తామంటూ ప్రకటన చేసేశారు.    

మోడీత్వ @ 75

సీఎం అయ్యే వ‌ర‌కూ అసెంబ్లీలో, పీఎం అయ్యే వ‌ర‌కూ పార్ల‌మెంటులో అడుగు పెట్ట‌లేదు. ఆపై రామాల‌య నిర్మాణం అయ్యే వ‌ర‌కూ అయోధ్యలోనూ అడుగు పెట్ట‌లేదు. అంతే కాదు ఇటు పాక్ గుండెలో వణుకు, అటు చైనాకు బెరుకు పుట్టించ‌గ‌ల ఒన్ అండ్ ఓన్లీ  నేమ్. ప్రెజంట్ యూఎస్ సిట్యువేష‌న్ కూడా సేమ్ టు సేమ్ సీన్. ద‌టీజ్ న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.   మోడీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా  ప్ర‌త్యేక క‌థ‌నం.   మోడీ..  1950 సెప్టంబ‌ర్ 17న గుజ‌రాత్ లోని వాద్ న‌గ‌ర్ లో జ‌న్మించారు. త‌న ఎనిమిద‌వ ఏట‌నే ఆర్ఎస్ఎస్ లో చేరి అక్క‌డ 15 ఏళ్ల‌పాటు అంచ‌లంచెలుగా ఎదిగారు. ఆపై 1987లో గుజ‌రాత్ బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా.. క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2001లో శంక‌ర్ సింగ్ వాగేలా, కేశూభాయ్ ప‌టేల్ వంటి వారి మ‌ధ్య వివాదాలు చెల‌రేగ‌డంతో అనూహ్యంగా గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. ఆ త‌ర్వాత మూడు ప‌ర్యాయాల ముఖ్య‌మంత్రిగా ప‌ని చేయ‌డం మాత్ర‌మే కాకుండా.. 2014, 2019, 2024 ఎన్నిక‌ల్లో మూడు మార్లు ప్ర‌ధానిగానూ ఎన్నిక‌య్యారు. ఇవీ క్లుప్తంగా మోడీకి సంబంధించిన గ‌ణాంకాలు. ఇక మోడీ ప్ర‌భావం, ఆయ‌న ప‌నిత‌నం, ఆయ‌న ఘ‌న‌త.. వంటి అంశాల విష‌యానికి వ‌స్తే ఏదైతే ఆర్ఎస్ఎస్ ద్వారా ఎదిగారో అదే ఆర్ఎస్ఎస్ ని ఈనాడు శాసించే వ‌ర‌కూ వ‌చ్చేశారు. గ‌తంలో బీజేపీ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి నాగ్ పూర్ కేంద్రంగా ఉండేది. అదే నేడు.. గుజ‌రాత్ కేంద్రంగా మారిపోయింది. అంత‌గా మోడీ త‌న ప్ర‌భావాన్ని చూపించ‌డం మొద‌లు పెట్టారు. కావాలంటే చూడండి.. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ 75 ఏళ్ల రిటైర్మెంట్ కి స‌బంధించి ఇలా కామెంట్ చేశారో లేదో.. ఆ వెంట‌నే ఆయ‌న‌.. అలాంటి నియ‌మం సంఘ్ లో లేనే లేదు. నేను కూడా 80 ఏళ్ల వ‌య‌సులో.. సంఘ్ ఏ ప‌ని చెప్పినా చేస్తాన‌నే వ‌ర‌కూ వ‌చ్చారు. ద‌టీజ్ ది ప‌వ‌రాఫ్ మోడీ. అంటే ఒక‌ప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పిన‌ట్ట‌ల్లా వినే క‌మ‌ల‌నాథుల నుంచి ఒక క‌మ‌ల‌నాథుడు చెప్పిన‌ట్ట‌ల్లా వినే ఆర్ఎస్ఎస్ వ‌ర‌కూ వ‌చ్చేసింది వ్య‌వ‌హారం. అంటే, క‌మ‌లం పువ్వుకు కాడ ఆధార‌మా.. కాడ‌కు క‌మ‌లం పువ్వు ఆధార‌మా.. అంటే ప్ర‌స్తుతానికైతే పువ్వే కాడ‌కు ఆధారం అన్న‌ట్టుగా మారిపోయింది సీన్. ఇక మోడీ పాల‌న‌ ద్వారా దేశ వ్యాప్తంగా వ‌చ్చిన మార్పు చేర్పులేంట‌ని చూస్తే..  అవి నోట్ల ర‌ద్దు నుంచి మొద‌లు పెట్టాల్సి వ‌స్తుంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్, జీఎస్టీ వంటివి కీల‌కం. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం జ‌రిగింది కూడా మోడీ హ‌యాంలోనే. ఈ విష‌యంలో మోడీకి బీజేపీ దాసోహం అంటుందంటే సందేహించాల్సిన అవసరం లేదు. కార‌ణం.. అస‌లు బీజేపీ ఇంత‌గా విశ్వ వ్యాప్తం అయ్యిందే రాముడి వ‌ల్ల‌. ఆనాడు అద్వానీ అయోధ్య ర‌థ‌యాత్ర‌లో ఒక సహాయ‌కుడిగా ఉన్న మోడీ.. ఇప్పుడు తన నేతృత్వంలో అయోధ్య రామ‌మందిరం సాకారం చేయడం అన్నది ఒక చరిత్ర  ఇక పాల‌నాప‌ర‌మైన అంశాల్లోకి వ‌స్తే..  జీఎస్టీ ద్వారా పెద్ద మొత్తంలో  ధ‌నం ఖ‌జానాకు చేరుతూ వ‌చ్చింది. అయితే మోడీ పాల‌న‌లో రోడ్ల విస్త‌ర‌ణ‌, న‌దుల అనుసంధానం, సైనిక శ‌క్తి ప‌టిష్ట‌త‌ వంటి ఎన్నో అంశాలు భార‌త్ కి క‌లిసి  వ‌స్తున్నాయ్. ప్ర‌స్తుతం కూడా మోడీ మిజోరాం, సిక్కిం వంటి ట్రైన్ ట్రాక్ లేని రాష్ట్రాల‌కు ఆ రైల్వే నెట్ వ‌ర్క్ అనుసంధానం చేస్తూ ఘ‌న‌త సాధిస్తున్నారు. ఇక మోడీ అంటే 2001 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అప్ర‌తిహ‌తంగా 24 ఏళ్ల పాటు సాగిన ఒకానొక అధికార‌పు జైత్ర యాత్ర. ఇప్ప‌టి వ‌ర‌కూ నెహ్రూ, ఇందిర వ‌యా పీవీ, వాజ్ పేయి వంటి వారెవ‌రికీ సాధ్యం కాని మూడు మార్లు ముఖ్య‌మంత్రి- మూడు మార్లు వ‌రుస ప్ర‌ధాన మంత్రిత్వం అనే ట్రాక్ రికార్డు బ‌హుశా మోడీకి త‌ప్ప మ‌రే నాయ‌కుడి  పేరిట లేద‌ని ఘంటా ప‌థంగా చెప్పొచ్చు. అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ ర్యాలీ మోడీ ట్రాక్ రికార్డుల‌కు మాత్ర‌మే సొంతం. అలాగ‌ని మోడీ కేవ‌లం పాజిటివ్ వైబ్స్ తోనే న‌డుస్తున్నార‌న‌డానికి వీల్లేదు. ఆయ‌న పాల‌నా కాలంలో ఇంటింటికీ ఉద్యోగం, ప్ర‌తి ఒక్క‌రి  ఖాతాలో 15 ల‌క్ష‌ల బ్లాక్ ని వైట్ గా మార్చిన మ‌నీ.. ఇలాంటి  నెర‌వేర‌ని హామీలు చాలానే ఉన్నాయి.. అయితే మోడీ పాల‌నా కాలంలో అంత‌ర్జాతీయ విష‌యాలు ఎలాంటివ‌ని చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న యోగాను ప‌రిచ‌యం చేసిన పేరు సాధించారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో పాక్ పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక స‌ర్జిక‌ల్ స్ట్రైక్, మ‌రో ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా ఆధిప‌త్యం చెలాయించారు. ఇవాళ పాక్, యూఎస్ ద్వారా థ‌ర్డ్ పార్టీ మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి అంగ‌లార్చుతుంటే.. మోడీ స‌సేమిరా అంటున్నారు. ఇక యూఎస్ తో సంబంధాల విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు త‌న ఫ్రెండ్ ట్రంప్ గెల‌వాల‌ని ప్ర‌చారం చేసిన మోడీ.. ఇవాళ అదే ట్రంప్ ఆగ‌ర్భ శ‌తృవా అన్న‌ట్టుగా మారిన ప‌రిస్థితి. ఇప్ప‌టికే ట్రంప్ భార‌త్ పై 50 శాతం సుంకాలు విధించ‌గా.. నాటో దేశాల‌కు 100 శాతం సుంకాలు భార‌త్ పై విధించ‌మ‌ని సూచిస్తున్నారు. దీంతో మోడీ  కూడా యూఎస్ కి చెక్ పెట్టే దిశ‌గా.. చైనా, ర‌ష్యా తో చెలిమి  చేస్తూ.. ట్రంప్ గుండెల్లో మంట‌లు రేపుతున్నారు. అంత‌గా అంత‌ర్జాతీయ సంబంధాల్లో కొత్త ఒర‌వ‌డి సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ్లోబ‌ల్ సౌత్ కి  నాయ‌క‌త్వం వ‌హించేందుకు య‌త్నిస్తున్నారు మోడీ.మోడీ విద్యార్హత వంటి అంశాలు వివాదాస్పదంగా ఉంటే..  గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసు ఆయన పొలిటికల్ కెరీల్ లో  మాయ‌ని మ‌చ్చ‌ అని చెప్పవచ్చు.   అదలా ఉంటే.. ఒక టైంలో త‌న అభిమానుల చేత నోస్ట‌ర్ డామ‌స్ చెప్పిన‌ భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌పంచ ధృవ‌తార మోడీ అన్న పేరు సాధించిన మోడీ.. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.  ఇప్ప‌డు ఆయనకు 75 ఏళ్లు. పార్టీ ప‌రంగా అయితే.. ఈ నియ‌మానుసారం ప‌ద‌వి దిగిపోవాల్సి ఉంది. అయితే నియ‌మాల‌న్న‌వి మ‌న‌కు కాదు ఇత‌రుల‌ను నియంత్రించ‌డానిక‌ని ఇంకా ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్తానం కొన‌సాగిస్తారా? లేదా అన్నిది చూడాలి.  హ్యాపీ బ‌ర్త్ డే మోడీ.

ఆయన ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే!

ఆయన ఏ పని చేపట్టినా ముడుపులు తీసుకోవలసిందే. ముడుపులు అందని పనులను ఆయన ఏ పనీ చేయరు. చివరికి తనతో పాటు అదే ఆఫీసులో పని చేసే తోటి ఉద్యోగులైనా సరే తమ పని కావాలంటే ఆయనకు ముడుపులు చెల్లించాల్సిందే. ఫైల్ ముందుకు కదలాలంటే ఆయన ఎవరైనా సరే ఆయన చేతులు తడపాల్సిందే. ఆయనే విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్.పైన చెప్పింది అవినీతిలో ఆయన ట్రాక్ రికార్డ్ గురించి. ఇప్పటి వరకూ పలు కీలక పోస్టులలో పన చేసిన అంబేడ్కర్‌ ముడుపుల బాగోతం ఎట్టకేలకు పండింది. గచ్చిబౌలి, నార్సింగి మణికొండ ప్రాంతాల్లో  విద్యుత్ శాఖలో  దాదాపు 12 ఏళ్లుగా  కొనసాగుతున్న విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ను ఏసీబీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.   అంబేడ్కర్ మార్కెట్ విలువ ప్రకారం 300  నుంచి 500 వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ను అరెస్టు చేసిన పోలీసులు అంతకు ముందు అంటే మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో   తని ఖీలు నిర్వహిం చారు. అంబేడ్కర్‌ బినామీ నివాసంలో 2.18కోట్ల రూపాయల నగదును గుర్తించారు.  ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పని చేస్తున్న అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. శేరిలింగపంల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరా బాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికా రులు గుర్తించారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఆరంతస్తుల బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తర్ కెమికల్స్ పేరిట కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్లాట్స్, 1 ఫామ్ ల్యాండ్ అలాగే 2 ఫోర్ వీలర్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పటాన్ చెరువు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి  బినామీ సతీష్‌ ఇంట్లో  2.18 కోట్ల రూపాయలను ఏసిబి స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆస్తుల విలువ 300 నుంచి 500 వందల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 

భూమనపై కేసు

అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వైసీపీ సీనియర్  నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై మంగళవారం (సెప్టెంబర్ 16) కేసు నమోదైంది.  తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యేటీ ఈవో గోవిందరాజులు ఫిర్యాదుపై  అలిపిరి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.  అలిపిరి సమీపంలో ఉన్న   శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని అలక్ష్యం చేస్తున్నారంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా అయిన  భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలు విమర్శలు చేశారు.   టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భూమన ఆరోపించారు.  వాస్తవానికి తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరికి సమీపంలోని  పాత చెక్ పోస్టు వద్ద శిల్పాలు చెక్కేవారు.  23 సంవత్సరాల కిందట సీఎం నారా చంద్రబాబుపై బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇక్కడి శిల్పాలు చెక్కే వారిని ఖాళీ చేయించారు.  ఆ సందర్భంగా అప్పట్లో స్థపతులు శనేశ్వరుడి తొమ్మిది అడుగుల విగ్రహం అక్కడే వదిలేశారు. దీంతో అప్పటి నుంచీ ఆ విగ్రహం అక్కడే ఉందని టీటీడీ వివరించింది. అయినా.. భూమన తన ఆరోపణలను కొనసాగించడంతో.. టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజులు భూమనపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.  

ఒకే సందర్భం.. పలు పేర్లు.. ఇంతకీ సెప్టెంబర్ 17న ఏంజరిగింది?

భార‌త్ లో ఒక స్వాతంత్ర దినం, మ‌రో రిప‌బ్లిక్ దినోత్స‌వం.. ఇలాంటి జాతీయ‌ పండ‌గ‌ల‌ను భారత జాతి మొత్తం ఒకే దృక్ప‌థంలో, ఒకే కోణంలో జ‌రుపుకుంటూ రావ‌డం ఆన‌వాయితీ. అయితే..  తెలంగాణ‌లో మాత్రం ఒక దినోత్సవాన్ని  మూడు పార్టీలు మూడు ర‌కాలుగా జ‌రుపుకుంటారు. అదే తెలంగాణ విమోచ‌న దినం. దీనిని బీజేపీ హైద‌రాబాద్ విమోచ‌న దినోత్స‌వంగా, కాంగ్రెస్ తెలంగాణ ప్ర‌జా పాల‌నా దినోత్స‌వంగా, బీఆర్ఎస్ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంగా పిలుస్తూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. చ‌రిత్ర‌లో ఒక ముఖ్య ఘట్టం జ‌రిగిన రోజుకు.. భిన్న పార్శ్వాలు క‌లిగి ఉండే సందర్భం  బ‌హుశా ఇదేనేమో.  అంత‌గా ఈ దినోత్స‌వం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంత‌కీ    సెప్టెంబర్ 17కి ఉన్న చారిత్ర‌క దినం ప్రాముఖ్య‌త ఏంటంటే.. 1948 సెప్టెంబర్ 17న  నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో విలీనమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏడా సెప్టెంబర్ 17ను  ప్రతి పార్టీ తమ సొంత దృక్పథంతో  ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి.   తెలంగాణ అంటేనే ఉద్య‌మాల ఖిల్లా. భార‌త్ మొత్తం స్వాతంత్ర పోరాటం చేస్తే ఇక్క‌డ మాత్రం నిజాం పాల‌కుల‌తో స‌మాంత‌రంగా సాయుధ పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అందుకే భార‌త్ మొత్తం 1947 ఆగ‌స్ట్ 15న స్వాతంత్రం పొందినా.. హైద‌రాబాద్ సంస్థానం మాత్రం నిజామ్ ఉస్మాన్ అలీ ఖాన్ పాల‌న‌లో మ‌రో 13 నెల‌ల పాటు బానిస‌త్వంలో మ‌గ్గింది.  దీనంత‌టికీ కార‌ణం ర‌జాకార్లు.. అంటే మిల‌ట‌రీ వింగ్ ఆఫ్ మ‌జ్లిస్- ఏ- ఇత్తిహాద్ అనే పేరిట వీరు ఆనాడు హైద‌రాబాద్ రాష్ట్ర ప్ర‌జ‌లపై అనేక అత్యాచారాలు, హింస వంటి దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పాలిస్తూ.. స్వ‌తంత్ర రాజ్యం కోసం పోరాడారు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నాయ‌క‌త్వంలోని భార‌త ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ పోలో పేరిట పోలీస్ యాక్ష‌న్ ప్ర‌క‌టించింది.  1948 సెప్టెంబర్ 13న, భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నాలుగు రోజుల్లోనే నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, అధికారికంగా లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. ఈ పోరాటంలో వేల మంది తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేశారు. రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, చండ్రరాజేశ్వరరావు, షోయాబుల్లా ఖాన్ వంటి నాయకులు ఈ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఈ చారిత్ర‌క రోజును ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్లో ర‌క‌రకాలుగా జ‌రుపుకోవ‌డం మొద‌లైంది. అయితే జనానికి మాత్రం ఇది రెండో స్వాతంత్ర పోరాట విజ‌యం. ర‌జాకార్ల పై సాధించిన ఘ‌న విజ‌యం. బ్రిటిష‌ర్లతో ఎలాంటి పోరాటం చేశారో తెలీదు కానీ.. ఆనాటి ర‌జాకార్ల దాష్టీకాల‌కు హింసాకాండ‌కు బ‌లైన అమ‌రుల‌ను త‌లుచుకుంటూ నివాళి అర్పించే సంద‌ర్భం.

హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం

హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. బంగారం దుకాణాలే లక్ష్యంగా ఐటీ అధికారులు  హైదరాబాద్ లో సోదాలు   నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం నుంచి ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఏకకాలంటలో 15 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.  సికింద్రాబాద్ లోని బంగారం వ్యాపారి జగదీష్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు, లెక్కకు మించిన ఆస్తులు, నగలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. మరోవైపు వరంగల్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇక బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. ఈ సోదాలలో  క్యాప్స్ గోల్డ్ కంపెనీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసి రిటైల్ షాపులకు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే  పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారని చెబుతున్నారు.  అంతే కాకుండా పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఆచార్య ఎస్.వి.రామారావు కన్నుమూత

ప్రముఖ సాహితీ విమర్శకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ ప్రొఫెసర్ ఆచార్యులు, ఆర్ట్స్ మాజీ  డీన్ ఆచార్య ఎస్.వి.రామారావు ఇక లేరు. తీవ్ర  అస్వస్థతతో బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు.  1941 జూన్ 5న వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లో జన్మించిన ఆచార్య ఎస్వీ రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యాపకుడిగా 1966  చేరారు.  ఆచార్యుడిగా, శాఖ అధ్యక్షుడిగా పాఠ్యాంశ నిర్ణాయక మండలి అధ్యక్షుడిగా,ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ గా సేవలందించి 2001లో పదవీ విరమణ చేశారు.  డాక్టర్ సి నారాయణ రెడ్డి పర్యవేక్షణలో తెలుగులో సాహిత్య విమర్శ-అవతరణ వికాసాలు అనే అంశంపై పరిశోధన చేసి 1973లో డాక్టరేట్ పొందారు. 23 గ్రంథాలు వెలువరించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య విమర్శ పురస్కారాన్ని, శ్రీకృష్ణదేవరాయ భాషనిలయం నుంచి దాశరథి పురస్కారాన్ని, జీవీఎస్ సాహిత్య పీఠం నుంచి విమర్శ పురస్కారాన్ని ,బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారాన్ని, బి.ఎన్.శాస్త్రి పురస్కారం,సారస్వత పరిషత్తు పురస్కారం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం వంటి అనేక గౌరవాలు అందుకున్నారు.  ఆయన పర్యవేక్షణలో 19  మంది పిహెచ్డీ పరిశోధన, 15 మంది ఎంఫిల్ పరిశోధన పూర్తి చేశారు.  తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యునిగా, ట్రస్టు సభ్యునిగా, కేంద్ర సాహిత్యకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎస్.వి.రామారావు సేవలందించారు.  ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికా నుంచి గురువారం (సెప్టెంబర్ 18) రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ఎస్వీ రామారావు అంత్యక్రియలు శుక్రవారం (సెప్టెంబర్ 19) న జరుగుతాయి.  ఆచార్య ఎస్వీరామారావు మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి, డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, ట్రస్టు సభ్యుడు చింతపల్లి వసుంధరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సారస్వత పరిషత్కు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.