ఎంసీడీ ఎన్నికలలో ఆప్ స్వీప్..!
posted on Dec 7, 2022 @ 4:49PM
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ దుమ్ము రేపింది. గత15 సంవత్సరాల బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టి ఘన విజయం సాధించి తొలిసారిగా ఢిల్లీ మున్సిపాలిటీని చేజిక్కించుకుంది. దీంతో 15 ఏళ్లు బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది.
మొత్తం 250 సీట్లున్న ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ ఇప్పటికే సాధికార విజయం సాధించింది. ఎమ్ సీడీలో అధికారం చేపట్టాలంటే 126 స్థానాలలో గెలవాల్సి ఉండగా ఆప్ ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. కడపటి వార్తలందే సరికి 134 స్థానాలలో విజయం సాధించి దూసుకుపోతోంది. బీజేపీ 104 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది.
ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనా వేశాయో అంతకు మించి ఆప్ విజయం సాధించింది. బుధవారం (బిసెంబర్ 8) ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభమై తొలి ఫలితాలు వెలువడటం మొదలవ్వడానే మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలలో ఆప్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగిందా అనిపించింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయన్నట్లుగా టీవీ టాక్ షోలలో చర్చలు నడిచాయి. అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆప్ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ ఆధిపత్యానికి కేజ్రీవాల్ చెక్ పెడితే, తాజాగా ఎంసీడీలో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి కూడా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చెక్ పెట్టింది.