.హవ్వా..ఇంత అవమానమా..?   ఏపీలో ఆ మంత్రి చాంబర్ కు తాళం..!

 ఏపీలో ఓ మంత్రి కి ఘోర పరాభవం ఎదురైంది. జీతాలు చెల్లించడం లేదంటూ ఏకంగా మంత్రి ఛాంబర్ కు సిబ్బంది తాళాలు వేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు కారణమైంది. విషయం తెలిసి అధికార వైసీపీలోని కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. బిల్లులు చెల్లించలేదంటూ గ్రామాల్లోని సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి, సిబ్బంది తమ నిరసన తెలపడం అప్పుడప్పుడు జరిగే విషయం. కానీ,  జీతాలు చెల్లించ లేదంటూ ఏకంగా ఒక మంత్రి కార్యాలయానికి అక్కడ పనిచేసే సిబ్బంది తాళాలు వేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ లో చోటు చేసుకోగా, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పిఆర్ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఈ పరాభవం ఎదురయింది. ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీకి సిబ్బంది తాళం వేసి మూసి వేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ పని చేయడం గమనార్హం. ఈ శాఖ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేసి తమ నిరసనను తెలియజేశారు. సాధారణంగా మంత్రి పేషీ రోజూ తెరిచేవారు. అధికారులు సిబ్బంది వచ్చి తమ విధులను నిర్వర్తించేవారు. అయితే, ఎనిమిది నెలలుగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి చాంబర్ కు తాళం వేశారు. జీతాలు విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్థాపానికి గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ ఉద్యోగులు బావురుమంటున్నారు.జీతాలు చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తాము మరో దారి లేక విధులకు హాజరు కావడం మానేశారు సదరు ఉద్యోగులు. డ్యూటీకి రాని సంగతి తెలిసినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మంత్రి చాంబర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో పని చేయడానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వహించే పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతపడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ వ్యవహారంపై మంత్రితోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..జీవీఎల్ బోల్తాపడ్డాడు!

ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందన్నది సామెత.  బీజేపీ ఎంపీ జీవీఎల్ పరిస్థితి సరిగ్గా ఆ సామెతకు తగినట్టు సరిపోతుంది. ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా ఎందుకు మారిపోతోందో.. బీజేపీ నాయకత్వానికి జేవీఎల్ కారణంగానే  స్పష్టంగా అర్థమైపోయింది.  ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు గురించి బీజేపీ అధిష్ఠానానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కానీ తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న సమయం నుంచీ.. రాష్ట్ర పరిస్థితుల గురించి తనదైన శైలిలో రిపోర్టులు ఇస్తూ హైకమాండ్ కు దగ్గరైన జీవీఎల్. ఆ ఫిర్యాదులన్నిటినీ పూర్వ పక్షం చేసేలా పార్టీ హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం, వైసీపీ విజయంతో జీవీఎల్ సమాచారంపై అధిష్టానం నమ్మకం పెంచుకుంది. అందుకే పలుకుబడి ఉన్న కన్నాను తప్పించి మరీ సోము వీర్రాజుకు జీవీఎల్ సిఫారసుపై పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తరువాత పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏపీలో ఏకంగా అధికార పార్టీ నేతలు బీజేపీ సీనియర్ నేతలపైనే దాడులకు పాల్పడటం వంటి సంఘటనలతో అధిష్ఠానం బీజేపీపై దృష్టి సారించింది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడవాడలా చార్జ్ షీట్లు వేయాలంటూ సాక్షాత్తూ మోడీ ఇచ్చిన ఆదేశాలే అమలుకు నోచుకోకపోవడంతో  బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. స్వయంగా రంగంలోకి దిగడంతో అనివార్యంగా చార్జ్ షీట్ల కార్యక్రమం చేపట్టింది. కానీ అది తూతూ మంత్రంగానే సాగుతోంది.  సరిగ్గా ఈ సమయంలోనే మోడీ 9 ఏళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే అమిత్ షా ఏపీలో పర్యటించారు. నడ్డా శ్రీకాళహస్తిలో, అమిత్ షా విశాఖలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారం కంటే తమతమ ప్రసంగాల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పించారు. నడ్డా ప్రసంగంపై వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. అది పక్కన పెడితే విశాఖలో అమిత్ షా ప్రసంగాన్ని అనువదించిన జీవీఎల్ కు   అ సభావేదికపైనే ఘోర పరాభవం జరిగింది. తన ప్రసంగ అనువాదంలో జీవీఎల్ సొంత పైత్యం జోడిస్తున్నారని అర్థమైన అమిత్ షా వేదికపైనే నేనేం మాట్లాడుతున్నా మీరేం చెప్తున్నారంటూ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న జేవీఎల్ అవమానంతో తలదించుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే అమిత్ షా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల వాడిని తగ్గించి.. అమిత్ షా ప్రసంగ సారాన్ని నిర్వీర్యం చేసేలా జీవీఎల్ అనువాదం ఉంది. ఆ విషయాన్ని అమిత్ షా గుర్తించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో జీవీఎల్గత్యంతరం లేక అమిత్ షా ప్రసంగ పాఠాన్ని ఉన్నదున్నట్లుగా అనువాదం చేసి చెప్పాల్సి వచ్చింది. అయితే అప్పటికే జగన్ పై అమిత్ షా చేసిన ఎన్నో విమర్శలను జీవీఎల్ సభలో చెప్పలేదు. వాటిని  స్కిప్ చేశారు. షా నిలదీసిన తరువాతే.. ఒక ప్యాడ్ తీసుకుని ఆయన మాటలు రాసుకుని అనువాదం చేశారు. ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం వద్ద కానీ, పార్టీ రాష్ట్ర శాఖలో కానీ జీవీఎల్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జీవీఎల్ కు ఇప్పుడు లోక్ సభ స్థానం కాదు కదా.. కనీసం త్వరలో ముగియనున్న ఆయన రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరించే అవకాశం కూడా లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిథి హోదా కోల్పోయిన జేవీఎల్ కు ముందు ముందు బీజేపీలో మరిన్ని పరాభవాలు తప్పవని పార్టీ నేతలు చేబుతున్నారు.  

బీజేపీని లెక్క చేసేదేమిటంటున్న జగన్?

ఒక్క రెండు సభలు.. బీజేపీ- వైసీపీ బంధాన్ని తెంచేశాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయమని తాజా పర్యటనలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చేసిన విమర్శలు.. ఆ పార్టీతో వైసీపీకి ఉన్న నాలుగేళ్ల బంధాన్ని పుటుక్కున తెంచాశాయి. అయితే ఈ తెగదెంపులు వ్యూహాత్మకమా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కలిసి ఉంటే కలిసి మునిగిపోవడం కంటే.. వేరువేరుగా ఉంటే కనీసం ఒకరైనా మిగులుతామన్న ఉద్దేశంతోనూ అమిత్ షా నడ్డాలు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారని విశ్లేషిస్తున్నారు. నడ్డాపై వైసీపీ మంత్రులు బూతులతో విరుచుకుపడటం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బీజేపీ లేక్కేమిటన్నట్లు మాట్లడడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ నేతలూ, మంత్రులు, సలహాదారుల చేత మాట్లాడించి తాను మౌనం పాటించే జగన్  సోమవారం (జూన్ 12) పిల్లలకు స్కూలు బ్యాగులూ, పుస్తకాలు పంచేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్క సారిగా బీజేపీపై తన వాగ్ధాటిని మరీ అంత పదునుగా కాకున్నా ప్రదర్శించారు. రాష్ట్రంలో తమకు బీజేపీ అండ అవసరం లేదన్నారు. ఆ పార్టీ సహకారం లేకున్నా గెలుస్తామంటూ ధీమాను ప్రదర్శించారు. జగన్ నోటీ వెంట బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట రావడం దాదాపుగా ఇదే తొలిసారి. రాష్ట్రం ఏ గంగలో మునిగినా ఫరవాలేదు.. కేంద్రం అండతో కేసుల నుంచి గట్టెక్కితే చాలన్నట్లుగా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లూ వ్యవహరించిన జగన్ చివరికి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన ఈ సమయంలో బీజేపీ లేక్కేమిటి అన్నట్లు మాట్లాడటం మామూలు విషయం కాదంటున్నారు.  అయితే బీజేపీ అంటే లెక్క చేయడం, చేయకపోవడం జగన్ ఇష్టం. కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన ఎంచుకున్న వేదికే అభ్యంతరకరం. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులూ పంచే ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటమేమిటన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తుతున్నాయి. అయితే అటువంటి విమర్శలను సీఎం పెద్దగా పట్టించుకోరన్నది ఇప్పటికే పలు సార్లు రుజువైంది. ప్రభుత్వ కార్యక్రమంలో తప్ప  జగన్ మాట్లాడేందుకు మరో వేదికే లేని పరిస్థితి గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో నెలకొని ఉంది. జగన్ తన రాజకీయ విమర్శలకు ప్రభుత్వ కార్యక్రమాలనే వేదిక చేసుకుంటున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు అదే సరైన వేదికగా ఆయన ఫిక్సైపోయారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఫిక్సైపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బెదిరించో, బామాలో, ప్రలోభపెట్టో తీసుకు వచ్చిన జనాలే ఆయన ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లి పోతున్న పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే గడపగడపకూలో జరిగిన మర్యాదే తనకూ జరుగుతుందన్న విషయాన్ని ఆయన ఆకలింపు చేసుకోవడంతో తన వెర్షన్ చెప్పుకోవడానికి ఆయన బటన్ నొక్కుడు సభలనూ, ఇలా పందేరాల సభలనే వేదిక చేసుకుంటున్నారు. బీజేపీని తాను లెక్క చేయనని గంభీరంగా చెప్పిన జగన్ అదే సమయంలో తన ప్రభుత్వంపై బీజేపీ అగ్ర నేతలు చేసిన ఆరోపణలు, విమర్శల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి విమర్శలను కనీసం ఖండించే ధైర్యం కూడా చేయలేదు. షా, నడ్డాలు తన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు.  చంద్రబాబుపై విమర్శలతో సరిపెట్టకుండా దూషణల పర్వానికీ దిగారు.  బీజేపీ అండగా లేకపోవచ్చు..మీడియా సహకారం అందక పోవచ్చు..దత్తపుత్రుడు అండ దండలు లేకపోవచ్చు…కానీ తన ధైర్యం ప్రజలేనని చెప్పుకున్నారు. మరి ఆ ప్రజల ముంగిటకు వెళ్లకుండా పరదాలెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అంతే కాదు చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని చెప్పుకొచ్చారు. తాను పేద ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని… అది కూడదంటూ విపక్షాలు పోరాటం చేస్తున్నాయనీ ఆరోపించారు.   జగన్ ఇటీవలి ప్రసంగాలు విపక్షాల సంగతేమో కానీ సొంత పార్టీ వైసీపీ శ్రేణులనే తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఇంకా ఎన్నికల సమరం మొదలు కాకముందే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్న నాయకుడిని జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీ అండ అవసరంలేదన్న మాటతో తన నెత్తిన తానే చేయిపెట్టుకున్నట్లైందని, మునక ఖాయమని అంగీకరించేసినట్లేనని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది. 

బ్యూరోక్రాట్లకు రాజకీయాలు అందని ద్రాక్షపండేనా?

భారత రాజ్యాంగం పరిపాలనను రెండు రకాలుగా వర్గీకరించింది. అందులో ఒకటి ఎన్నికకాబడ్డ(ఎలక్టెడ్) రెండవది ఎంపిక (సెలెక్టెడ్). ప్రజల ఓటుతో ఎన్నికలలో విజయం సాధించిన రాజకీయ నాయకులు మొదటిరకం కాగా, అత్యున్నత చదువులు చదివి సివిల్ సర్వెంట్లుగా పని చేసే వారు రెండవ రకం పాలనా బాధ్యులు. రాజకీయాలలో ముగిని తేలే మన రాజకీయ నాయకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్ సర్వెంట్ల అవతారం ఎత్తలేరు. కానీ కనీసం 30 సంవత్సరాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు రాజకీయాల రుచి మరుగుతున్నారు. రాజకీయరంగంలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. అయితే వారిలో అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది కాలం మాత్రమే రాజకీయాలలో మనగలుగుతున్నారు.   బ్యూరోక్రాట్ల రాజకీయ రంగ ప్రవేశానికి తెలుగురాష్ట్రాలలో ఆద్యుడు ఎవీఎస్ రెడ్డి. డిఫెన్స్ లో పని చేస్తూ, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ రెడ్డి భారతదేశం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  సర్వీసులో ఉండగానే రాజకీయ పార్టీ  ప్రకటన అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉద్యోగానికి  రాజీనామా  చేసి పార్టీని  ప్రకటించిన ఏవీఎస్ రెడ్డి రాజకీయాలు తనకు సరికావని గ్రహించి కొంత కాలం ఉద్యోగానికి దూరంగా ఉన్నారు. తిరిగి ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సర్వీసు ముగించారు. ఆయన బాటలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్,  వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి బ్యూరోక్రాట్లు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీలో కాలు పెట్టగా, వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు నియోజవర్గం నుండి, ప్రస్తుతం గూడూరు అసెంబ్లీ నుండి చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించారు. గతంలో రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేయగా, ఆదిమూలం సురేష్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ 2019లో విశాఖ నుండి ఓడిపోగా, తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  బ్యూరోక్రాట్ లుగా సమర్థవంతంగా పని చేసిన వారు రాజకీయాలలో ఎందుకు మనలేకపోతున్నారన్న అంశంపై చర్చ సాగుతోంది.  రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవంతో, ఈ వ్యవస్థను మార్చాలన్న ఆవేశం బ్యూరోక్రాట్ లను రాజకీయాలవైపు మరలిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.  తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ తదననంతరం ఫక్తు రాజకీయ పార్టీగా మారడమే రాజకీయమని విశ్లేషకుల వాదన. తీరా రాజకీయాలోకి వచ్చిన తరువాత ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకుని నోరెళ్లబెడుతున్నారని, నిజాలు నిలకడగా తెలిశాక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బ్యూరోక్రాట్ లు ఉన్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.  రాజకీయాలలో మనుగడ సాగించాలంటే కావలసిన వనరులు సేకరించడంలో బ్యూరోక్రాట్లు విఫలం అవుతున్నారు. రాజకీయ నాయకులకు ఏండే జనాకర్షణ, ప్రజలలో మమేకమయ్యే అలవాటు ఐఏఎస్ లకు ఉండక పోవడం మరో కారణంగా చెప్పాలి. ఇలా ఉంటే ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తూ ఆప్ అనే రాజకీయపార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ దేశంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగారు. ఇందుకు కారణాలను అన్వేషిస్తే కేజ్రీవాల్ ఉద్యోగ జీవితమే ఒక ఉద్యమంలా సాగింది. రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలనే ఆలోచన కేజ్రీవాల్ కు మొదటి నుండీ ఉంది. అన్నాహజారే లోక్ పాల్ బిల్లు ఆందోళన కేజ్రీవాల్ కు కలసి వచ్చింది. బీజేపీ లోపాయకారి మద్దతుతో ఆప్ స్థాపన, గెలుపు కేజ్రీవాల్ కు సాధ్యమైంది. కానీ తెలుగు రాష్ట్రాలలో బ్యూరోక్రాట్ ల పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కేవలం రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రాజకీయాలను చూడడంతో మన బాబులకు భవిష్యత్ ఉండటం లేదు. 

డాక్టర్ గారంటేనే ముద్దు.. కోడెల శివరాం మాకొద్దు!

కోడెల శివరామ్.. ఇప్పుడు తెలుగుదేశం రెబల్ గా తన తండ్రి సేవలను పార్టీ గుర్తించడం లేదంటూ రోడ్డెక్కారు. అయితే ఆయన తండ్రి సెంటిమెంట్ సత్తెనపల్లిలో వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఇసుమంతైనా లేవని ఆ నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. కోడెల శివప్రసాద్ పట్ల నియోజకవర్గ ప్రజలలో అపార గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన ప్రజా సేవానిరతి, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటారు. అయితే అదే సమయంలో ఆయన కుమారుడి పట్ల మాత్రం నియోజకవర్గ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన దౌర్జన్యాలను ఇప్పటికీ జనం నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణను నియమించిన నేపథ్యంలో శివరాం పార్టీపై తిరుగుబాటు చేసినా ఆయనకు జనం నుంచి మద్దతు కరవవ్వడానికి ఆయన తీరే కారణమని అంటున్నారు. అంతే కాకుండా తండ్రి పేరు చెప్పుకుని సెంటిమెంట్ పంపడించి సానుభూతిని సంపాదించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన ప్రయత్నాలకు విరుగుడుగానా అన్నట్లు.. గుంటూరు జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో ఆయనపై ఉన్న కేసుల గురించి జనం చర్చించుకుంటున్నారు. అలాగే ఆయన బాధితులంతా ఒకే వేదికమీదకు వచ్చి శివరాంకు వ్యతిరేకంగా నిరసనగళం ఎత్తేందుకు సమాయత్తమౌతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించడాన్ని తప్పుపడుతూ రోడ్డుకెక్కిన కోడెల శివరామ్ ను నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ విస్మరిస్తోంది. ఆయనకు అండగా కదిలేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాకుండా నియోజకవర్గంలోని ఆయన సామాజిక వర్గీయుల మద్దతు కూడా శివరాంకు దక్కడం లేదు.   ఇప్పుడు శివరాంకు నియోజకవర్గంలో అండగా నిలబడుతున్న వారెవరైనా ఉన్నారా అంటే గత ఎన్నికల సమయంలో కోడెలపై చేయి చేసుకున్న వైసీపీ వర్గీయులేనని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. కోడెల తలపెట్టిన ర్యాలీలో కనిపించిన వారంతా వైసీపీవారేనని చెబుతున్నారు.   అదీ కాక కోడెల శివప్రసాద్ జీవించి ఉన్న సమయంలో పలు సందర్భాలలో తన వారసులెవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన సంగతిని ఈ సందర్భంగా జనం గుర్తు చేసుకుంటున్నారు.  

బండికి ఉద్వాసన.. ఈటలకు పగ్గాలు?

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బీజేపీలో ఇదే హాట్  టాపిక్. అయితే ఇది నిజమా అంటే అవుననో కాదనో చెప్పే పరిస్థితి లేదు. నిజం ఒకప్పుడు బీజేపీలో కేవలం బీజేపీ గోత్రీకులే ఉన్నప్పుడు ఇలాంటి లీకుల సంస్కృతీ  ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు పూర్తిగా మారిపోయింది. బీజేపీలో కాషాయ గోత్రీకులే కాదు, నానావర్ణ గోత్రీకులు వచ్చి చేరారు. అందులో కొందరిలో పూర్వాశ్రమ వాసనలు  పూర్తిగా పోలేదు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ .. అంతే కాదు ఏడడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా  బయటి వాసనలు లోపలికి చేరుతున్నాయి. బీజేపీలో పుట్టి పెరిగిన నేతలకు కూడా ఆ వాసనలు అంటుతున్నాయి. అందుకే ముందెన్నడూ లేని లీకులు  చిట్ – చాట్  చప్పుళ్ళు ఇప్పుడు బీజేపీలోనూ వినిపిస్తున్నాయి.  అలాగని బీజేపీలో ఏమీ జరగడం లేదని కాదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో,  ముఖ్యంగా అధికారం ఆశించి కమల గూటికి చేరిన నాయకులలో పునరాలోచనలు మొదలయ్యాయి. అలాగే కర్ణాటక ఫలితాలను సమీక్షించుకున్న బీజేపీ  జాతీయ నాయకత్వం  దక్షిణాదిలో కథ అడ్డం తిరిగిందనే వాస్తవాన్ని గుర్తించింది. ఒక అంచనాకు వచ్చింది. అందుకే  దక్షిణాదిలోనే కాదు, ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లతో పాటుగా తెలంగాణపైనా ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. మార్పులు చేర్పుల గురించి పునరాలోచన చేస్తోంది. ఏమి చేస్తే ఎన్నిక గండం గట్టెక్కగలం అనే ఆలోచనలకు పదును పెడుతోంది.  అందులో భాగంగా, కర్ణాటక ప్రభావం కొంచెం  ఎక్కువగా ఉండే తెలంగాణలో నాయకత్వం మార్పుతో సహా  ప్రజలను ఆకట్టుకునేందుకు  వివిధ ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో, విభిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒకటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్  ని ఆ పదవి నుంచి తప్పించి హుజూరాబాద్  ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనపై  బీజేపీ అగ్రనాయకత్వంలో చర్చ జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే బండికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని అంటున్నారు. అలాగే ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదివి ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అలాగే మరో ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, ఈటలకు ప్రచార కమిటీ,బాధ్యతలు అప్పగించడం ద్వారా బండి, ఈటల, అరుణ త్రిముఖ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ పైవేవీ కాదు ..యథాతథ స్థితి కొనసాగుతుందనే కోణంలోనూ   చర్చ జరుగుతోంది. ఒక విధంగా చూస్తే 2014ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో పార్టీలో చాలా  తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, మరో కొందరు ముఖ్య నాయకులు మోడీని పీఎం అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో అభ్యతరం వ్యక్తం చేశారు. అయితే , చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.  ఒక సారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నాయకులం దరూ ఒకే తాటిపై నడిచారు. బీజేపీ 30 ఎల్లా చరిత్రను తిరగరాసింది. సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలం ( 283) సీట్లు గెలుచుకుంది.    అదలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి పార్టీ కూడా పరిస్థితిని సమీక్షించు కుంటుంది . అవసరమైన మేరకు వ్యూహాలను మార్చు కుంటుంది. అదే  పని బీజేపే చేస్తోంది. అవసరం అయితే, నాయకత్వాన్ని మార్చుకుంటుంది. అనేక రాష్టాలలో ముఖ్యమంత్రులనే మార్చిన సందర్భాలున్నాయి. ఇది అన్ని పార్టీలలో ఉన్నదే. ఇప్పుడు తెలంగాణలో   అదే పని కాంగ్రెస్ చేస్తోంది. అదే పని బీఆర్ఎస్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద ఒంటి కాలు మీద లేచిన బీఆర్ఎస్ నాయకత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్  పార్టీ అయితే ఏకంగా పార్టీ హై కమాండ్ ను ఢిల్లీనుంచి బెంగుళూరుకు మార్చుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్న పొంగులేటి , జూపల్లి వంటి నాయకులు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  తో చర్చలు జరుతున్నారు. సో .. మీడియా ఫోకస్ బీజేపీ మీద ఉన్నా, తెలంగాణ రాజకీయాలలో పార్టీలతో ప్రమేయం, లేకుండా అంతర్మథనం సాగుతోంది. చివరకు, ఏమి జరుగుతుంది? బీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? కాంగ్రెస్ కథేంటి? బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి? అనేది ఇప్పుడే తేలేది కాదు.

జగన్ సర్కార్ కు ఆగస్ట్ డెడ్ ఎండ్?

జగన్ అధికారానికి కేంద్రం చరమగీతం పాడబోతోందా? అంటే వైసీపీ రెబల్ ఎంపీ  రఘురామకృష్ణం రాజు ఔననే అంటున్నారు. జగన్ ముందస్తుకు వెనకడుగు వేసినా ఆయన ప్రభుత్వం ఆగస్టు తరువాత అధికారంలో కొనసాగేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయని రఘురామకృష్ణం రాజు విశ్లేషిస్తున్నారు.  ఆయన మాటల ప్రకారం ఆగస్టు నాటికి  ఏపీలో జగన్ సర్కార్ ను రద్దు అవుతుంది. జగనే తనంతట తాను అందుకు ముందుకు వస్తారు.   ఏపీలో  తాజాగా పర్యటించిన నడ్డా మాటలను తార్కానంగా చూపుతున్నారు. నడ్డా మాటలను బట్టి చూస్తే జగన్ సర్కార్ కు ఇక ఏ వైపు నుంచీ అప్పుపుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు.  అలా అప్పు పుట్టక పోతే జగన్ సర్కార్ ఒక్క పూట కూడా నడిచే అవకాశం లేదు. ఈ కారణాన్ని చూపుతూనే రఘురామకృష్ణం రాజు అగస్టు తరువాత జగన్ సర్కార్ కొనసాగే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే ఆగస్టులో జగన్ సర్కార్ ను రద్దు చేసి తెలంగాణ ఎన్నికలతో పాటుగానే ముందస్తుకు సమాయత్తమౌతారని ఆయన గట్టిగా చెబుతున్నారు.  ముందస్తుకు వెళ్లడం జగన్ కు సుతరామూ ఇష్టం లేకపోయినా.. చివరి క్షణం వరకూ అధికారాన్ని అంటిపెట్టుకునే ఉండాలన్నది జగన్ అభిమతమే అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు ఏ మాత్రం సహకరించడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే  రఘురామకృష్ణం రాజు తన రచ్చబండ కార్యక్రమంలో  వైసీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించడానికి శ్రీకారం చుట్టిందని, ఆర్థిక వెసులు బాటు కేంద్రం నుంచి అందకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమని జగన్ కు స్పష్టంగా తెలుసును కనుకనే ఒక వైపు ముందస్తు లేదని అంటూనే మరో వైపు అందుకు అవసరమైన సన్నాహాలను చేసుకుంటున్నారని చెప్పారు.  ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విశాఖ తూర్పులో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, వైసీపీకి చెందిన వారి కుటుంబాలలో లేని వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్పించడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. ముందస్తు ముచ్చట ఎత్తిందీ వైసీపీయే, ఇప్పుడా ముచ్చట లేదంటున్నదీ ఆ పార్టీయే అన్నది ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నారు. విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఎన్నికలలో లబ్థి పొందాలన్నదే జగన్ వ్యూహంగా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ముందస్తు లేదన్న భావనతో విపక్షాలు ప్రమత్తంగా ఉండడాన్ని జగన్ అవకాశంగా మలచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.   ఇంకా ఆయన ఏమన్నారంటే జేపీ నడ్డా, అమిత్ షాల విమర్శలు జగన్ సర్కార్ పై, జగన్ పాలనపై క్షిపణి దాడుల్లా ఉన్నాయన్నారు. ఆ విమర్శలపై వైపీసీ నేతలు తమ సహజసిద్ధమైన బూతుల పంచాగంతో విరుచుకుపడుతుండటం చూస్తుంటే.. కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు ఇంకెంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలు లేవని అవగతమౌతోందన్నారు.  

బాబు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ షురూ..?

మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపీ    రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బీజేపీ పార్టీ పెద్దల ఆలోచనలో మార్పులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. అంతా ల్యాండ్, లిక్కర్ స్కాంలు నడుస్తున్నాయి అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేవన్నీ స్కామ్ లే.రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాయలసీమ అభివృద్ధిని వైసీపీ విస్మరించింది అంటూ జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇది ఇలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఏపీ సీఎం జగన్ పాలనపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మోడీ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి సంబంధించి విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.రైతుల ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ తన బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు.రాష్ట్రానికి మోదీ బియ్యం ఇస్తుంటే జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో కేంద్రం ఇస్తున్న నిధులు ఏమయ్యాయో జగన్ చెప్పాలని అమిత్ షా ప్రశ్నల వర్షం కురిపించారు. విశాఖను విద్రోహశక్తులుగా మార్చారని, అధికార పార్టీ వైసిపి నేతలకు రాష్ట్రవ్యాప్తంగా భూమాఫియా మైనింగ్ మాఫియాలతో  కోట్లకు పడగలెత్తారని షా  తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కేంద్రం గమనిస్తూనే ఉంది. రాష్ట్రంలో జగన్ పాలనలో నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు తప్ప మరేం చేయలేదు. ఇలా ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారుపై బీజేపీ విమర్శల దాడి పెంచడం చర్చనీయాంశమవుతోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న పెద్దగా వర్కవుట్ కాలేదు. కేంద్ర పెద్దలతో జగన్ సాన్నిహిత్యం, పరస్పర రాజకీయ సహకారం, ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతున్న ఏపీ సర్కారును నియంత్రించకపోవడం వంటి వాటితో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అయితే దానిని అధిగమించేందుకు ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏపీకి క్యూకట్టడమే కాకుండా జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇక ముందు ఇదే దూకుడును కొనసాగించనున్నారు. ఇదంతా ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ అని.. ఇక బీజేపీ ..జగన్ సర్కార్ పై దాడి మరింత ముమ్మరం చేయనున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక పోటీ?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ కు ఈ ఏడాది చివరిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం తదితర జిల్లాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనర్హత వేటు కారణంగా ఆ ఉప ఎన్నికలో రాహుల్ గాంధీ పోటీకి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే   ప్రియాంకా వాద్రా  పేరు తెరమీదకు వచ్చింది. అయితే గతంలో  ఇదే నియోజక వర్గం నుంచి గెలిచిన, కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎంఐ షనవాస్ కే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తారన్న చర్చ కూడా జరగుతోంది.  అసలు వాయనాడ్ ఉప ఎన్నిక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతుందని అంతా భావించినా,  ఎన్నికల కమిషన్  ఆ ఎన్నికలతో పాటు వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక కు నోటిఫికేషన్ ఇవ్వలేదు.  ఫిబ్రవరి వరకూ ఉన్న వేకెన్సీలను మాత్రమే క్లియర్ చేశామని అప్పట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  అప్పట్లో  తెలిపారు. వాయనాడ్ వేకెన్సీని మార్చిలో నోటిఫై చేశామని, రాహుల్ గాంధీ తనకు రెండేళ్ళ జైలు శిక్షపై  అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఉన్నందున తాము తొందరపడటం లేదని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఏ సీటైనా ఖాళీ అయితే ఆరు నెలల్లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

వారాహిని అడ్డుకోవడానికేనా?

ఏపీలో జగన్ సర్కార్ విపక్షాల గొంతు నొక్కడమే పాలన అనుకుంటోందా? విపక్షాల గొంతు వినబడకుండా చేస్తేనే తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సమసిపోతుందని భావిస్తోందా?  రాష్ట్రంలో  ఆల్ ఈజ్ వెల్ అని జనం అనుకోవాలంటే.. విపక్షాలను అణచివేస్తే సరిపోతోందని భావిస్తోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచి మాత్రమే ఔనన్న సమాధానం వస్తోంది. అయితే విమర్శకులు మాత్రం విపక్ష నేతలెవరైనా జనంలోకి వెళుతున్నారంటేనే  అధికార వైసీపీ వణికిపోతోందనీ, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి  రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పోలీసులను ప్రయోగిస్తోందనీ అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలను అడ్డుకోవడానికీ, అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అవరోధాలు, ఆటంకాలు కల్పించడానికి జీవో నంబర్ 1 ను తీసుకువచ్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అవరోధాలు కల్పించేందుకు ఉపక్రమించింది. ఇంకా యాత్ర ప్రారంభం కాకముందే.. దానికి అడ్డంకులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెలలో ఆయన యాత్ర జరగనుంది. ఆ యాత్రకు ముందే కోనసీమ జిల్లాలో  పోలీస్ యాక్ట్ అమలులోకి వచ్చేసింది. ప్రభుత్వ తీరు పరిశీలకులు, రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ, చివరాఖరికి వైసీపీ శ్రేణుల్లోనూ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  కానీ గత నాలుగేళ్లుగా వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే విపక్షాలు బయటకు రాకుండా చేయడం కోసం ఎంతకైనా తెగించేందుకు జగన్ సర్కార్ ఇసుమంతైనా వెనుకాడదని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.   గతంలో  కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రతిపాదన సందర్భంగా అమలాపురంలో జరిగిన అల్లర్లను నెపంగా చూపి ఏకంగా ఆరు నెలల పాటు పోలీసు యాక్ట్ ను అమలు చేశారు. ఆ పోలీస్ యాక్ట్ ను ఎత్తివేసి రెండు నెలలైందో లేదో..ఇప్పుడు మళ్లీ జనసేనాని వారాహి యాత్ర నెపంతో మళ్లీ అమలులోకి తీసుకువచ్చారు. గతంలో పోలీసు యాక్ట్ అమలు చేయడానికి అల్లర్లు సాకుగా చూపారు. ఇప్పుడు యాక్ట్ ను మళ్లీ విధించేందుకు వారాహి యాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లి అల్లర్లు జరుగుతాయోమేనన్న అనుమానాన్ని నెపంగా చూపుతున్నారు.   పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులపై నిషేధం ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతారు. నెల 14 నుంచి   ప్రారంభమయ్యే  పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్‌ డివిజన్‌ ల ప‌రిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుతుంది. ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ తెరమీదకు తీసుకువచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో  భాగంగానే పోలీస్ యాక్ట్ తీసుకువచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధాజ్ణలు ఉన్నా వారాహి యాత్ర కొనసాగుతుందని జనసేన వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో  కోనసీమ జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఏపీలో బీఆర్ఎస్ అసలు ఉందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏపీలో అసలు ఉందా? ఆ పార్టీ రాష్ట్ర శాఖను ఘనంగా  ఏర్పాటు చేసిన తరువాత ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ  ఘనంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణలో కంటే ముందుగా ఏపీలోనే బీఆర్ఎస్ రాష్ట్ర శాఖను ప్రారంభించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. ఇక ఆ పార్టీలో చేరికలకు ఏపీకి హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ నాయకులను రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. ఇంకే ముందు ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు. దీంతో బీఆర్ఎస్ ఏపీలో ప్రవేశం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న విశ్లేషణలూ అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనాని చేసిన ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ పాత్ర ఏపీలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు దోహదపడుతుందంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఇంతా చేసి ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు వేళ్లతో లెక్కపెట్టగలిగేంత మంది నాయకులు మాత్రమే. వారిలో ఇప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్నది ఎవరా అని గాలిస్తే కనిపించేది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే. ఆయన కూడా ఏపీని వదిలేసి తెలంగాణలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆయన వ్యాపారాలూ, భూములూ అక్కడే ఉన్నాయి మరి.  ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగినా  ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు.  కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ లో ప్రముఖంగా ఉండేవారెవవరూ కూడా ఏపీవైపు చూడలేదు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి, ఏపీకి చెందిన ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారు. తొలుత సొంత భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభిస్తామని ఘనంగా చెప్పుకున్నా చివరకు అద్దెభవనంలో తూతూ మంత్రంగా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ముగించేసి మమ అనిపించేశారు తోట చంద్రశేఖర్.  ఇక పేరుకు ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఉన్నా ఇంత కాలంగా ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరిగిన దాఖలాలు లేవు. సాటి తెలుగు రాష్ట్రంలోనే అడుగుపెట్టడానికి జంకుతున్న బీఆర్ఎస్ ఇక జాతీయ స్థాయిలో ఏం ఒరగబెడుతుందన్న విమర్శలు వినవస్తున్నాయి. మహారాష్ట్రలో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ప్రకటించుకున్నప్పటికీ అక్కడా ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మొత్తంమీద బీఆర్ఎస్ పేరుకే జాతీయ పార్టీ కానీ ఉనికి మాత్రం తెలంగాణకే పరిమితమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మంత్రి రోజాకు ఏమైంది?

మంత్రి ఆర్కే రోజాకు ఏమైందన్నఆందోళన రాజకీయవర్గాల్లోనే కాకుండా సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. కారణం ఏమిటన్నది తెలియదు కానీ ఆమె ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఆమె ఎందుకు ఆస్పత్రిలో చేరారు అన్న విషయం తెలియరాలేదు. ఆస్పత్రి వర్గాలు కూడా ఆమె ఆరోగ్యం గురించి  ఎటువంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. అయితే పార్టీ వర్గాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆమె ఆరోగ్యం బాలేదనీ, ఇప్పటికే  గతంలో ఆమెకు రెండు సార్లు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ రెండు సార్లూ కూడా ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. గతంలో ఆపరేషన్ తరువాత ఆమె ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమెకు ఆపరేషన్ జరిగిన సమయంలో ఆమె మంత్రి కారు. ఎమ్మెల్యే మాత్రమే. అప్పట్లో  జబర్ద్ షోకు జడ్జిగా వ్యవహరించేవారు. ఆపరేషన్ కారణంగా అప్పట్లో ఆమె జబర్దస్త్ షోకు చాలా కాలం దూరంగా ఉన్నారు.  ప్రస్తుతం   రోజాకు  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు   ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందనీ, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని అంటున్నాయి.  

తెలంగాణలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

కర్నాటకలో కాంగ్రెస్ విజయం.. ఇప్పుడు అన్ని పార్టీలకూ ఒక దారి చూపింది. ముఖ్యంగా ఆ పార్టీ ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత హామీ పథకం ఎన్నికల విజయానికి ఒక రూట్ మ్యాప్ అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పుడు అదే దారిలో ప్రయాణించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం  అన్న హామీయేనని పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలతో అన్ని పార్టీలూ ఆ హామీపై కసరత్తు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆ హామీ ఇవ్వడమే కాదు.. దాని అమలు కూడా ప్రారంభించేసింది. ఇందుకు ఏడాదికి ఆ రాష్ట్రప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని నాలుగు కోట్ల రూపాయలుగా అంచనా కూడా వేసింది. ఇక  రాజమహేంద్రవరంలో తెలుగుదేశం మహానాడు వేదికగా  ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీమహానాడులో కూడా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ ఉంది.  ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎలాగూ ఆ హామీనే ప్రధానంగా తన ఎన్నికల హామీగా ప్రకటించి తీరుతుంది. అందులో సందేహం లేదు. ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా  ఆ దిశగానే యోచిస్తోంది. అయితే ఎన్నికల హామీగా ప్రకటించడం కాకుండా.. ఇప్పుడే అంటే అధికారంలో ఉండగానే.. ఎన్నికలకు ముందుగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని యోచించడమే కాదు.. అందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించేసిందని అంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత తదితర అంశాలపై కేసీఆర్ ఇప్పటికే అధికారులను నివేదిక కోరారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉచిత ప్రయాణం పథకాన్ని ముందుగా పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నాయి.ఏది ఏమైనా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తెలంగాణలో రానున్న ఒకటి రెండు నెలలలోనే ప్రారంభయమ్యే అవకాశం ఉందని అంటున్నారు.  

ఏపీపై బీజేపీ మాట మారింది సరే.. మరి తీరు?

మాట మామిడల్లం.. మనసు పటికబెల్లం.. జగన్ ప్రభుత్వం విషయంలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంది. జగన్ పాలన అంతా అవినీతి, కుంభకోణాల మయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించే బీజేపీ అగ్రనేతలు.. చేతల్లో మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. ఈ నాలుగేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ , కుంభకోణాల, అవినీతి జగన్ పాలనకు వత్తాసు పలికింది. ఈ మాటలు వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాలు జగన్ పాలనపై చేసిన విమర్శలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఇష్టారీతిన అప్పులకు అనుమతులు ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారే. ఆ అప్పుల చలవతోనే జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అరకొరగానైనా కొనసాగించగలిగింది. ఇప్పుడు అదే బీజేపీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని విమర్శలు గుప్పించారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారని దుయ్యబట్టారు. రైతులకు మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.  మైనింగ్, గంజాయి , మద్యం మాఫియాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. నాలుగేళ్లో కేంద్రం… ఏపీకి రూ. ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బులకు తగ్గట్లుగా ఏపీలో అభివృద్ధి అభివృద్ధి కనిపించలేదని అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు.  కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తన పేరు .. బొమ్మలు పెట్టుకుంటున్నారని.. చివరికి ఉచితంగా ఇచ్చిన బియ్యానికి కూడా జగన్ తన ఫోటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.   తొమ్మిదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభలే అయినప్పటికీ నడ్డా, అమిత్ షాలు ఇద్దరూ కూడా  ఆ విషయం కంటే ఏపీలో వైఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, కుంభకోణాలపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు.  ఆయా సభల్లో  మాట్లాడిన ఇతర బీజేపీ నేతలు కూడా జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం విశాఖ వేదికగా అమిత్ షా తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలను పట్టించుకోవడం లేదు. వాటిని అసలు గమనించనట్లుగా గుంభనంగా ఉన్నారు. అయితే తిరుపతి వేదికగా నడ్డా చేసిన విమర్శలపై బూతులతో విరుచుకుపడ్డారు.   అసలు ఇప్పుడు మనం చెప్పుకోవలసింది బీజేపీ అగ్రనేతలపై జగన్ మంత్రులు, ఎమ్మెల్యేల స్పందన గురించి కాదు.. బీజేపీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని.  ఏపీలో నడ్డా, అమిత్ షాల సభల ఉద్దేశం నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రజలకు వివరించడానికి .. అయితే వారిరువురూ కూడా  జగన్ సర్కార్ పై విమర్శలకే అధిక సమయం కేటాయించారు.   ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక తమ ఆబోరు కాపాడుకోవాలంటే.. తమ స్టాండ్ ఏమిటో తెలియచేయాలనుకున్నారు. వైసీపీ  ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. మొదటి   నడ్డా  ఘాటు విమర్శలు చేస్తే.. ఒక రోజు వ్యవధిలో ఏపీకి వచ్చిన అమిత్ షా దాదాపు వాటినే  మళ్లీ చెప్పారు. ఇదంతా వైసీపీ విషయంలో తాము క్లియర్ గానే ఉన్నామనీ, వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నామనీ ఏపీ ప్రజలకు చెప్పడానికే అన్నట్లుగా ఉంది. వారి ఈ వైఖరే.. ఇటీవల చంద్రబాబును హస్తిన పిలిపించుకుని మరీ చర్చించిన అంశాలేమిటన్నది చెప్పకనే చెప్పినట్లైంది.  అయితే నాలుగేళ్ల పాటు ఏపీలో జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, కుంభకోణాలకు వంత పాడి.. లేకపోతే చూసీ చూడనట్లు వదిలేసి.. ఆ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచి ఇప్పడు ఎన్నికలు దగ్గరపడేసరికి మాట మార్చి.. విమర్శలు ఎక్కుపెడితే ఏపీ జనం నమ్ముతారా?  మాటలు ఓకే…. మరి చేతల మాటేమిటని నిలదీయరా? అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ సహకారం ఆగుతుందా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి.  జగన్ సర్కార్ కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ  అప్పులో.. నిధులో విడుదల చేసి ఆదుకున్న మోడీ సర్కార్.. ఇప్పుడు ఆ నిధులకు లెక్కలు చెప్పమని అడగి.. మేం జగన్ సర్కార్ ను కడిగేశాం అని చెప్పుకుంటే సరిపోతుందా అని అంటున్నారు.    ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఘాటు విమర్శలు చేసి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఆ వ్యతిరేకతను చేతల్లోనూ, చర్యల్లోనూ చూపితేనే ఏపీ జనం విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బాబు ఇంటి నిర్మాణానికి అనుమతులివ్వని సర్కార్

ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణం అనుమతి కోసం పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొంటే.. వారం.. పది రోజులు.. మహా అయితే నెల రోజులు పడుతోంది. అంతేకానీ.. అనుమతులు మంజూరు చేయడానికి నెలలకు నెలలు అయితే పట్టదు కదా. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా.. అధికారుల నుంచి నేటికి  స్పందన లేకపోవడం గమనార్హం.  చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. సదరు నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన దరఖాస్తు చేసుకొని ఆరు నెలలు గడిచినా.. నేటికి మున్సిపల్ అధికారులు అనుమతులు మంజూరు చేయకపోవడంతో... అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయిన ఆయన.. న్యాయవాదుల ద్వారా సదరు అధికారులకు నోటీసులు పంపినట్లు సమాచారం.  కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె వద్ద జాతీయ రహదారిని అనుకొని ఉన్న 99.77 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం.. ఆయన భూమి పూజ సైతం నిర్వహించారు. ఎన్నికల లోపు.. ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు. కానీ ఇంటి నిర్మాణానికి  అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే తమ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణంపై అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక టీడీపీ శ్రేణులు మండిపడుతోన్నాయి.  ఈ జగన్ పాలనలో ఉమ్మడి రాష్ట్రానికే కాదు.. నవ్యంధ్రకు సైతం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటని సదరు పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరికైనా సమస్యలు ఉంటే.. ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుందని.. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇస్తే.. సదరు సమస్య.. వెంటనే పరిష్కారమవుతోందంటూ.. ఈ ఫ్యాన్ పార్టీ సర్కార్ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ ఊదరగొడుతోందని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి.  అదీకాక.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్.. తాడేపల్లిలో నివాసం నిర్మించుకొన్నారని.. వారు గుర్తు చేస్తున్నారు. నేడు జగన్ చేసినట్లు.. నాడు తమ పార్టీ అధినేత చంద్రబాబు చేసి ఉంటే.. తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణం సజావుగా సాగేదా అని పార్టీ శ్రేణులు సూటిగా అధికార పార్టీని నిలదీస్తున్నాయి.

సైకిలు జోరు.. కారు బేజారు!

అవును, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ, గత వైభవాన్ని కోల్పోయింది. అది నిజం. తెలుగుదేశం అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది. ముఖ్యంగా, తెలంగాణ సెంటిమెంట్ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కేసేఆర్ అదే సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని, రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట  ప్రత్యర్ధి పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను నిర్వీర్యం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను, తెలంగాణను ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని కూడా 14.7 శాతం ఓట్లతో  15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత అతికొద్ది కాలానికే, టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు.గులాబీ గూటికి చేరారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు. ఇక ఆ తర్వాత ఏంజరిగిందనేది చరిత్ర. 2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకుంది. అలాగే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా సీనియర్ నాయకులు చాలామంది అధికార పార్టీలోకి దూకేశారు. మరి కొందరు బీజేపీలోకి జంపయ్యారు.  ఇది చరిత్ర..ఎవరూ కాదనలేని నిజం. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎదురు లేదు, తిరుగు లేదనుకున్న పార్టీ నాయకులు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం, లేకుంటే అహంకారం, అదీ కాదంటే అమాయకత్వం అనిపించుకుంటుంది. పడి లేచిన కెరటంలా, రాజకీయాల్లోనూ పనైపోయింది అనుకున్న పార్టీలు రెట్టింపు బలంతో అధికారంలోకి వచ్చిన సందర్భాలు చరిత్రలోనే కాదు, నడుస్తున్న చరిత్రలోనూ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రెండంటే రెండు లోక్ సభ స్థానాలున్న బీజేపీ ఈరోజు 303 స్థానాలకు చేరుకుంది.  సరే, అదలా ఉంచి  అసలు విషయంలోకి వస్తే, తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్  అదినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టడమే కాకుండా. ఆయనలో ఓటమి భయం పుట్టించింది. ఉద్దేశం ఏదైనా కావచ్చు తెలంగాణ సెంటిమెంట్  అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను స్వహస్తాలతో తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు. నిజానికి కేసీఆర్  2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల  వ్యవధిలోనే, తెరాస ఇక ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు.ఆ దిశగానే ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఉద్యమ ఆనవాళ్ళను తుడిచేశారు. రాజకీయ పునరేకీకరణ అనే ముద్దు పేరుతొ  తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్  సహా ముఖ్యనేతలు అందరిని ‘సగౌరవం’గా పార్టీ నుంచి సాగనంపారు. అదే  సమయంలో ఆ ముందు రోజు వరకు ఉద్యమ  ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా తామే నిందించిన తలసాని మొదలు సబితా ఇందర రెడ్డి వంటి వారిని  మంత్రిపదవులతో అందలం ఎక్కించారు. అలాగే, తెరాసను కుటుంబ పార్టీగా, తెలంగాణను కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు.  అయితే తానొకటి తలిస్తే దేవుడి ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, కేసీఆర్  ఉద్దేశం ఏదైనా జాతీయ రాజకీయాలు అసలుకే మోసం తెచ్చాయి. ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇక  అక్కడి నుంచి బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా, ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాగే, మొదటి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మరింతగా పుంజుకుంది. .బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరిది పైచేయి అనేది అటూ ఇటూ ఉగుతున్నా, చివరకు రాష్ట్రంలో ముక్కోణపు పోటీ అనివార్యంగా మారింది.  ఈ నేపద్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరేడు మాసాల క్రితం ఖమ్మం సభతో పూరించి శంఖారవం ఇప్పడు తెలంగాణ అన్ని జిల్లాలలో మారు మోగుతోంది. చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి పెట్టడంతో, బీఆర్ఎస్ లో  భయం పట్టుకుంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు, కేసీఆర్ గుడ్నేల్లో రైళ్ళు పరిగెతిస్తున్నాయి. నిజానికి, టీడీపీ రేసులో నిలిస్తే, కాంగ్రెస్ బీజేపీలకంటే తెలుగు దేశం పార్టీనే  బీఆర్ఎస్ ను బలగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే సైకిల్ జోరు పెరుగుతుంటే కారు బేజారౌతోందని అంటున్నారు.  అందుకే కేసీఆర్, ఏపీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు.