బాబు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ షురూ..?
posted on Jun 12, 2023 @ 12:51PM
మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బీజేపీ పార్టీ పెద్దల ఆలోచనలో మార్పులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. అంతా ల్యాండ్, లిక్కర్ స్కాంలు నడుస్తున్నాయి అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేవన్నీ స్కామ్ లే.రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాయలసీమ అభివృద్ధిని వైసీపీ విస్మరించింది అంటూ జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇది ఇలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఏపీ సీఎం జగన్ పాలనపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
మోడీ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి సంబంధించి విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.రైతుల ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ తన బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు.రాష్ట్రానికి మోదీ బియ్యం ఇస్తుంటే జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో కేంద్రం ఇస్తున్న నిధులు ఏమయ్యాయో జగన్ చెప్పాలని అమిత్ షా ప్రశ్నల వర్షం కురిపించారు. విశాఖను విద్రోహశక్తులుగా మార్చారని, అధికార పార్టీ వైసిపి నేతలకు రాష్ట్రవ్యాప్తంగా భూమాఫియా మైనింగ్ మాఫియాలతో కోట్లకు పడగలెత్తారని షా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కేంద్రం గమనిస్తూనే ఉంది. రాష్ట్రంలో జగన్ పాలనలో నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు తప్ప మరేం చేయలేదు. ఇలా ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారుపై బీజేపీ విమర్శల దాడి పెంచడం చర్చనీయాంశమవుతోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న పెద్దగా వర్కవుట్ కాలేదు. కేంద్ర పెద్దలతో జగన్ సాన్నిహిత్యం, పరస్పర రాజకీయ సహకారం, ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతున్న ఏపీ సర్కారును నియంత్రించకపోవడం వంటి వాటితో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అయితే దానిని అధిగమించేందుకు ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏపీకి క్యూకట్టడమే కాకుండా జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇక ముందు ఇదే దూకుడును కొనసాగించనున్నారు. ఇదంతా ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ అని.. ఇక బీజేపీ ..జగన్ సర్కార్ పై దాడి మరింత ముమ్మరం చేయనున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.