వాయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక పోటీ?
posted on Jun 12, 2023 @ 12:21PM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ కు ఈ ఏడాది చివరిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం తదితర జిల్లాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనర్హత వేటు కారణంగా ఆ ఉప ఎన్నికలో రాహుల్ గాంధీ పోటీకి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకా వాద్రా పేరు తెరమీదకు వచ్చింది. అయితే గతంలో ఇదే నియోజక వర్గం నుంచి గెలిచిన, కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షనవాస్ కే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తారన్న చర్చ కూడా జరగుతోంది.
అసలు వాయనాడ్ ఉప ఎన్నిక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతుందని అంతా భావించినా, ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికలతో పాటు వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక కు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి వరకూ ఉన్న వేకెన్సీలను మాత్రమే క్లియర్ చేశామని అప్పట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అప్పట్లో తెలిపారు.
వాయనాడ్ వేకెన్సీని మార్చిలో నోటిఫై చేశామని, రాహుల్ గాంధీ తనకు రెండేళ్ళ జైలు శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఉన్నందున తాము తొందరపడటం లేదని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఏ సీటైనా ఖాళీ అయితే ఆరు నెలల్లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.