బ్యూరోక్రాట్లకు రాజకీయాలు అందని ద్రాక్షపండేనా?
posted on Jun 12, 2023 @ 4:51PM
భారత రాజ్యాంగం పరిపాలనను రెండు రకాలుగా వర్గీకరించింది. అందులో ఒకటి ఎన్నికకాబడ్డ(ఎలక్టెడ్) రెండవది ఎంపిక (సెలెక్టెడ్). ప్రజల ఓటుతో ఎన్నికలలో విజయం సాధించిన రాజకీయ నాయకులు మొదటిరకం కాగా, అత్యున్నత చదువులు చదివి సివిల్ సర్వెంట్లుగా పని చేసే వారు రెండవ రకం పాలనా బాధ్యులు. రాజకీయాలలో ముగిని తేలే మన రాజకీయ నాయకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్ సర్వెంట్ల అవతారం ఎత్తలేరు. కానీ కనీసం 30 సంవత్సరాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు రాజకీయాల రుచి మరుగుతున్నారు. రాజకీయరంగంలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. అయితే వారిలో అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది కాలం మాత్రమే రాజకీయాలలో మనగలుగుతున్నారు.
బ్యూరోక్రాట్ల రాజకీయ రంగ ప్రవేశానికి తెలుగురాష్ట్రాలలో ఆద్యుడు ఎవీఎస్ రెడ్డి. డిఫెన్స్ లో పని చేస్తూ, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ రెడ్డి భారతదేశం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. సర్వీసులో ఉండగానే రాజకీయ పార్టీ ప్రకటన అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీని ప్రకటించిన ఏవీఎస్ రెడ్డి రాజకీయాలు తనకు సరికావని గ్రహించి కొంత కాలం ఉద్యోగానికి దూరంగా ఉన్నారు. తిరిగి ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సర్వీసు ముగించారు. ఆయన బాటలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి బ్యూరోక్రాట్లు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీలో కాలు పెట్టగా, వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు నియోజవర్గం నుండి, ప్రస్తుతం గూడూరు అసెంబ్లీ నుండి చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించారు. గతంలో రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేయగా, ఆదిమూలం సురేష్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ 2019లో విశాఖ నుండి ఓడిపోగా, తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బ్యూరోక్రాట్ లుగా సమర్థవంతంగా పని చేసిన వారు రాజకీయాలలో ఎందుకు మనలేకపోతున్నారన్న అంశంపై చర్చ సాగుతోంది.
రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవంతో, ఈ వ్యవస్థను మార్చాలన్న ఆవేశం బ్యూరోక్రాట్ లను రాజకీయాలవైపు మరలిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ తదననంతరం ఫక్తు రాజకీయ పార్టీగా మారడమే రాజకీయమని విశ్లేషకుల వాదన. తీరా రాజకీయాలోకి వచ్చిన తరువాత ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకుని నోరెళ్లబెడుతున్నారని, నిజాలు నిలకడగా తెలిశాక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బ్యూరోక్రాట్ లు ఉన్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాజకీయాలలో మనుగడ సాగించాలంటే కావలసిన వనరులు సేకరించడంలో బ్యూరోక్రాట్లు విఫలం అవుతున్నారు. రాజకీయ నాయకులకు ఏండే జనాకర్షణ, ప్రజలలో మమేకమయ్యే అలవాటు ఐఏఎస్ లకు ఉండక పోవడం మరో కారణంగా చెప్పాలి. ఇలా ఉంటే ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తూ ఆప్ అనే రాజకీయపార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ దేశంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగారు.
ఇందుకు కారణాలను అన్వేషిస్తే కేజ్రీవాల్ ఉద్యోగ జీవితమే ఒక ఉద్యమంలా సాగింది. రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలనే ఆలోచన కేజ్రీవాల్ కు మొదటి నుండీ ఉంది. అన్నాహజారే లోక్ పాల్ బిల్లు ఆందోళన కేజ్రీవాల్ కు కలసి వచ్చింది. బీజేపీ లోపాయకారి మద్దతుతో ఆప్ స్థాపన, గెలుపు కేజ్రీవాల్ కు సాధ్యమైంది. కానీ తెలుగు రాష్ట్రాలలో బ్యూరోక్రాట్ ల పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కేవలం రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రాజకీయాలను చూడడంతో మన బాబులకు భవిష్యత్ ఉండటం లేదు.