కలిసొస్తే పవన్ తో.. లేకుంటే ఒంటరిగా!

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అడుగులు ఎటుగా పడుతున్నాయో, ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. కలిసొస్తే పవన్ కళ్యాణ్ తో కాదంటే ఒంటరిగా... ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవంక పవన్ కల్యాణ్ వందకు రెండొందల శాతం తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. సో  అటు బీజేపీ, ఇటు జనసేన అలాగే, టీడీపీ ఆలోచనలు ఇదే విధంగా కొనసాగితే, ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవంక బీజేపీ అడ్డు తొలిగి పోవడంతో తెలుగు దేశం, జనసేన కూటమి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని  వామపక్షాలు ఇతర పార్టీలు టీడీపీ కూటమితో చేతులు కలిపితే ఇక టీడీపీ, జేనసేన కూటమి గెలుపునకు తిరుగుండదని పరిశీలకులు భావిస్తున్నారు.    అదలా ఉంటే బీజేపీ ఒంటరిగా మిగిలినా  వైసీపీతో సీక్రెట్ సంసారం సాగించినా  రాష్ట్రంలో బీజేపీకి ఉన్నదీ లేదు, పోయేదీ లేదనీ, ఆపార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితిలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా ఒక శాతం లోపు ఓట్లు తెచ్చుకున్న కమలం పార్టీ  ఈసారి ఒంటరిగా వెళితే ఆ మాత్రం ఓట్లు కూడా రావని పరిశీలకులే కాదు బీజేపీ నాయకులు సైతం అంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రత్యేక హోదాను బీజేపీ నాయకత్వం ముగిసిన అధ్యాయం అని తేల్చేసినప్పుడే, రాష్ట్రంలో బీజేపీ చరిత్ర ముగిసిపోయిందననీ బీజేపీ అభిమానులు, కార్యకర్తలు సహా  అందరూ అంగీకరిస్తున్నారు.  అదలా ఉంటే,ఇప్పటికే ఒకసారి  హస్తం పార్టీ మాజీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించి అభాసు పాలైన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అదే విఫల ప్రయోగానికి తెర  తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన కమలదళం చేస్తోందని అంటున్నారు. అయితే ఎనిమిది సంవత్సరాలకు పైగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పై బీజేపీ ఆశలు పెంచుకోవడం ఆత్మహత్యా సదృశ్యమనే విచారం సంఘ్ పరివార్ వర్గాల్లో వినవస్తోంది.  మరోవంక  కాలం చెల్లిన రాజకీయ నాయకుడిగా తనకు తానుగా ముద్రవేసుకుని ఒక విధంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి అన్ని రకాల రుగ్మతలతో చతికిల పడిన పార్టీని పరుగులు తీయించగలరా? అది అయ్యే పనేనా? అంటే  ఇటు పార్టీ వర్గాలు,అటు రాజకీయ పరిశీలకుల నుంచి కాదనే సమాధానమే వస్తోంది. అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి కొందరు విశ్లేషకులు మాత్రం మోడీషా జోడీ నాయకత్వంలోని  బీజేపీకి తివిరి ఇసుమున తైలంబు తీసే సామర్ధ్యం ఉందని అంటున్నారు.  నిజానికి, పార్టీ పరిస్థితి ఏపీ కంటే అద్వాన్నంగా అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ నేరుగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని, అదే విధంగా 33 ఏళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ పాలించిన పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రాకున్నా,లెఫ్ట్, కాంగ్రెస్ కూటమిని జీరో కు నెట్టేసి, 70కి పైగా అసెంబ్లీ  స్థానాలతో బీజేపీ అధికార తృణమూల్  కు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.  అయితే  ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల విద్యలు దక్షిణాదిన పనిచేయవని  కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగులేని విజయం నిరూపించిన నేపధ్యంలో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు,కేరళ రాష్ట్రాలలో కమలం పార్టీ కాషాయ రాజకీయాలు సాగవనే వాదన కూడా లేక పోలేదు.  అదెలా ఉనా  కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం విషయంలో బీజేపీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కిరణ్ కుమార్  రెడ్డి అవుట్ డేటెడ్ పొలిటీషియన్, కాలం చెల్లిన రాజకీయ నాయకుడు. అదెలా ఉన్నా వంటి నిండా నరనరాన కాంగ్రెస్ రక్తం నింపుకున్న నాయకుడు. అనేక సందర్భాలలో అసెంబ్లీ లోపలా బయటా కూడా బీజేపీను తూలనాడిన నాయకుడు.   అలాంటి కిరణ్ కుమార్  రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని అనుకోవడం లేద ని పార్టీ పాత తరం నేత ఒకరు  చిన్నగా నవ్వేశారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారేకానీ, ఆయనకు రాష్ట్రంలో కాదు, కనీసం ఆయన సొంత జిల్లా చిత్తూరులో కూడా  పెద్దగా పట్టున్న నాయకుడు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి  సరైన సమయంలో సరైన  నిర్ణయం తీసుకోక, ఆఖరి బంతి అదీ ఇదని చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుని కూర్చున్నారు. అందుకే రాష్ట్ర విభజన క్రతువు మొత్తం శాస్త్రోత్రంగా అయ్యే వరకు ఆగి అప్పుడు రాజీనామా చేసిన ఆయన పెట్టిన సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సొంతంగా సమైక్యాంధ్ర (చెప్పుల) పార్టీ పెట్టి 2014లో పోటీ చేసిన ఆయనకు 175 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కలేదు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినా  ఇంచు మించుగా దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  సో .. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించినా రాష్ట్రంలో కమల దళం వికసించే అవకాశం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, ఆయనకు  ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ... అది తెలంగాణలో బీఆర్ఎస్  కు మరో అస్త్రం ఇచ్చినట్లవుతుందని అంటున్నారు.

ఓటమి భయం.. బాబాయ్ హత్య కేసు.. జగన్ ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయంగానే కాకుండా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పేరు ప్రస్తావించడం, అలాగే సొంత సోదరి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టేందుకు, కాలు పెట్టేందుకు సమాయత్తమౌతుండటం, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలతో ఆమె ఆస్తుల విషయంలో కూడా జగన్ కు పక్కలో బల్లెంగా మారడం ఇవన్నీ ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నారన్న విచక్షణ మరచి ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అన్న తేడా కూడా లేకుండా విపక్ష నేతపై విమర్శలు గుప్పించడమే ఏకైక కార్యక్రమంగా, సింగిల్ పాయింట్ అజెండాగా మాట్లాడుతున్నారనీ అంటున్నారు. ఆయన ప్రసంగాలే ఆయనలోని ఫ్రస్ట్రేషన్ ను ఎత్తి చూపుతున్నాయంటున్నారు. ఒక వైపు వచ్చే ఎన్నికలలో ఓటమి భయం, మరో వైపు వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొనవలసి ఉంటుందన్న ఆందోళనతో ఆయన సంయమనం కోల్పోతున్నారని చెబుతున్నారు.   ఇక పార్టీ పరంగా చూస్తే వైసీపీలో అసమ్మతి సెగలు, అసంతృప్తి జ్వాలలూ నెల్లూరులో మొదలైనా అవి రాష్ట్రం మొత్తం వ్యాపించడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరాఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా అసమ్మతిని, అసంతృప్తిని బహిరంగంగా వెల్లగక్కడంతో పార్టీలో లుకలుకలు రోడ్డున పడ్డాయి.  దీంతో వైనాట్ 175 ధీమా కోల్పోయి.. కనీసం విజయం సాధిస్తే చాలన్న పరిస్థితికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులో అంటున్నాయి.  ఇదిలా ఉంటే ఇంత కాలం  ఆర్థిక అరాచకత్వం సహా  జగన్ సర్కార్ చేసే ప్రతి పనికీ, తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతు ఇస్తూ వస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ జగన్ ను అత్యంత ముక్తసరిగా పలకరించడంతో కేంద్రం నుంచి జగన్ కు ఇక సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే గురువారం (జూన్1) ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదలీ చేసిన జగన్ ఆ సందర్బంగా చేసిన ప్రసంగం యావత్తూ విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును దుమ్మెత్తి పోయడానికే సరిపోయిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయనలో ఓటమి భయం, విపక్షం పుంజుకుంటోందన్న ఆక్రోషం ప్రస్ఫుటంగా బయటపడ్డాయని సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. తన సభల నుంచి జనం గుంపులు గుంపులుగా వెళ్లిపోతుండటం.. అదే సమయంలో చంద్రబాబు సభలకు, లోకేష్ పాదయాత్రకు జనం అసంఖ్యాకంగా హాజరౌతుండటం జగన్ లో  గుబులు పెంచాయనడానికి నిదర్శనమే..పత్తికొండ సభలో మహానాడును తెలుగుదేశం డ్రామా కంపెనీతో పోల్చడం అని విశ్లేషిస్తున్నారు.ఇక చంద్రబాబును  సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట మీద నిలబడడు, విలువలు.. విశ్వసనీయత అనేవి లేని వ్యక్తిగా అభివర్ణించడాన్ని ఎత్తి చూపుతూ జగన్ తన లక్షణాలన్నీ చంద్రబాబుకు ఆపాదించారని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.  ఓ ప్రభుత్వ కార్యక్రమంలో  ప్రభుత్వాధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనగారిలోని ప్రెస్ట్రేషన్  ఫీక్స్‌కు చేరిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అలాగే చివరిలో తన ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మకండి ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకోవడం చూస్తుంటే..  వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేందుకు ప్రజలు పక్కాగా ఫిక్స్ అయిపోయారని జగన్ కు అర్ధమైపోయినట్లుందని అంటున్నారు. 

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి.. జగన్ స్కెచ్చేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కుపోయారు. అలా ఇరుక్కుపోయారనడానికి ప్రత్యక్ష నిదర్శనమే వైసీపీఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో వారసుడు  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోవడమే. శతర్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక ఏపీ సీఎం జగన్ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అప్రూవర్ గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. అంతే కాదు.. ఆయనకు భద్రత కల్పించేందుకు వై కేటగరి సెక్యూరిటీని కూడా కల్పించింది. ఈ పరిణామాలన్నీ ఏపీ సీఎం   జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన  అనంతరం చోటు చేసుకున్నాయి.   శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో   కవిత  పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయినట్లేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. అందరూ కలిసి స్కాం చేసినందున.. అసలు స్కాం ఎలా జరిగింది.. నగదు వ్యవహారాలు ఎలా జరిగాయో వీరు బయటపెడారు. వీరు అప్రూవర్ గా మారినందున వీరికి పరిమిత శిక్షలు అమలు చేస్తారు. కానీ అసలు కేజ్రీవాల్, కవిత మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు.    లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌, సమీర్ మహేంద్రుతో కలిసి రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్‌‌‌‌ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్ మహేంద్రు కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన   చార్జిషీట్లలో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఈడీ  ఈ చార్జిషీట్ లో పాటుగా కోర్టుకు సమర్పించింది.   ఇప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో   పొందు పరిచిన అంశాల మేరకు.. కవిత కు సంబంధించిన అంశాలే ప్రముఖంగా ఉన్నాయని అంటున్నారు. కవిత హైదరాబాద్ లో కొన్న బూములు.. ఏవి, ఎక్కడ కొన్నారు.. యిందుకు సొమ్ములు ఏ విధంగా చెల్లించారు వంటి వివరాలను పొందుపరిచారు.  వీటిని కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో  ఉన్న సమాచారం ఆధారంగానే కాకుండా, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఆమె బినామీగా చెబుతున్న పిళ్లై లు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు. అలాగే కవిత బినామీగా చెబుతున్న రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారుతున్నట్లు ప్రకటించి మళ్లీ ఉపసంహరించుకున్నారు. ఇక బుచ్చిబాబు అయితే కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం  ఈడీ అధికారుల ముందు వెల్లడించినట్లుగా అ చార్జిషీట్ లో తేటతెల్లం అయ్యిందని అంటున్నారు.  ఒక ఆడిటర్ తన క్లయింట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చెప్పారంటే.. ఆషామాషీగా ఉండదని, తాను చెప్పిన విషయాలను సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఆయన చెబుతారని అటున్నారు.  ఇక కవిత  బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై  యిప్పటికే అప్రూవర్ గా మారారు. తరువాత కోర్టులో కాదని పేర్కొన్నప్పటికీ అప్పటికే ఆయన వివరాలన్నీ వెల్లడించేశారనీ, ఆయన చెప్పిన అంశాల ఆధారంగానే ఈడీ  కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ కవిత చుట్టూ ఉచ్చు బిగించిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాలు ఫ్రాక్చర్ అయ్యిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  గత ఇరవై రోజులుగా  ఎక్కడా కనిపించడంలేదు. ఈ మధ్యలో  ఒక సారి మాత్రం సుప్రీంకోర్టులో తాన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని  మెన్షన్ చేయించారు.  అవన్నీ పక్కన పెడితే  ఇప్పుడు  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక అరబిందో కుటుంబంతో దగ్గర బంధుత్వం ఉన్నావిజయసాయిరెడ్డి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడికి స్వయానా సోదరుడు. దీంతో శరత్ చంద్రరెడ్డి అప్రూవర్ గా మారడంతో  జగన్.. తాను ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కుమార్తెను చిక్కుల్లో పడేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కాగా ఈ పరిణామం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ కొత్త పార్టీకి నూకలు చెల్లినట్టేనా? 

ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు పెద్దలు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన  బీఆర్ఎస్ అనే రాజకీయపార్టీ  చివరకు తెలంగాణ అనే పేరును తొలగించడం పట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పొంగులేటి, జూపల్లి పెట్టబోయే కొత్త పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రిజిస్టర్ కూడా జరిగినట్లు సమాచారం.  తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అంకురార్పణ జరగనుందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. కేసీఆర్ తో విభేధించిన వ్యక్తులను, పార్టీలను బతికి బట్ట కట్టనిచ్చే పరిస్థితి లేదని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. బిఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన టైగర్ నరేంద్రను, తల్లి తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు విజయశాంతిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టిన కేసీఆర్ పొంగులేటి, జూపల్లి పెట్టే కొత్త రాజకీయ పార్టీని మొగ్గలోనే తెంపివేయాలని  ప్లాన్ చేస్తున్నారు  . కొత్తగా పెట్టబోయే జనం తెలంగాణను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నే నిలుపుదల చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిఆర్ఎస్ తో విభేధించి భారతీయ జనతాపార్టీలో చేరిన ఈటెలను కేసీఆర్ మూడు చెరువుల నీరు తాగించారు. ఈటెలపై, ఆయన భార్యపై క్రిమినల్ కేసులను పెట్టించారు. జాతీయ పార్టీలో చేరి అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరిన ఈటెలనే  కేసీఆర్ వదల లేదు. అమిత్ షా అండదండలున్న ఈటెలపై బిఆర్ఎస్ వెనక్కి తగ్గింది. కానీ  కొత్తగా వచ్చే జనం తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నేతలు జనం తెలంగాణలో చేరే అవకాశం లేదు. పసి కూన పార్టీలో చేరి నాయకులు ఇబ్బందులకు గురి కారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించే నేతలు కొత్త ప్రాంతీయ పార్టీలో చేరే అవకాశం లేదు. బీఆర్ఎస్ నుంచి విభేధించి బయటకొచ్చిన పొంగులేటి , జూపల్లిలు సైతం కొత్త రాజకీయ పార్టీ అంశాన్ని విరమించుకోనున్నారు. ఎందుకంటే వారికి కాంగ్రెస్, బిజెపి అధినాయకత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఖమ్మంజిల్లాలో తిరుగులేని నాయకుడు పొంగులేటి. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి ఖమ్మంలో బలహీనంగా ఉంది. ఓడిపోయే పార్టీలో ఏ నేత చేరే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జూపల్లి తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి.  చేరికల కమిటీ  చైర్మన్ అయిన ఈటెలను జనం తెలంగాణ పార్టీలో చేరాలని కోరిన పొంగులేటి, జూపల్లిల కొత్త పార్టీకి మనుగడలేదని ఈటెల వారికి నచ్చ జెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొత్త పార్టీకి  నూకలు చెల్లినట్టు కనబడుతోంది. 

నల్లారికి ఏపీ బీజేపీ పగ్గాలు.. కమలనాథుల వ్యూహమేంటి?

ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజనకు ముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన అధిష్ఠానాన్ని ధిక్కరించి కాంగ్రెస్ ను వీడి  సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపారు. సీన్ కట్ చేస్తే సమైక్యాంధ్ర పార్టీ 2014 ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి సహా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎవరికీ కనీసం డిపాజిట్ కూడా రాలేదు. దీంతో  అప్పటి నుంచి ఆయన   నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  అయితే కాంగ్రెస్ పిలుపుతో ఆయన మళ్లీ సొంత గూటికి చేరారు. అయినా కూడా మౌనం వీడలేదు. ఇక అయన రాజకీయాలకు దూరమైనట్లేనని అంతా అనుకుంటున్న సమయంలో  ఆయన మరోసారి కాంగ్రెస్ కు రాజీనామా చేసి కమలం గూటికి చేరారు.  ఆయన బీజేపీ తరఫున కర్నాటకలో ప్రచారం కూడా చేశారు. అయితే కర్నాటక ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. మళ్లీ షరామూములే. కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మౌనముద్ర వహించి అమెరికా పర్యటనకు వెళ్లారు.  అది వ్యక్తిగత పర్యటన అంటూ ఆయన త్వరలోనూ తిరిగి వచ్చి బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచే ఓ ప్రకటన విడుదల చేశారు. అంతే తప్ప రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి కానీ, ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీరుపై కానీ, విపక్ష తెలుగుదేశం కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నాయకుడైన కిరణ్ కుమార్ రెడ్డి నుంచి సూచనలూ, సలహాలూ స్వీకరించేందుకే కలిసినట్లు సోము వీర్రాజు చెప్పుకున్నారు. అదలా ఉంచితే.. ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ గత కొంత కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు రాష్ట్ర పార్టీ పగ్గాలను తొలుత కన్నా లక్ష్మీనారాయణకు, ఆయన తరువాత సోము వీర్రాజుకు అప్పగించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో సోము స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకులే కాకుండా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా జగన్ సర్కార్ పై విమర్శల దాడి పెంచడం, ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ లు విడుదల చేయడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నల్లారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో వైసీసీకి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందన్నది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక తెలంగాణలో ప్రియాంకం?

హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ  ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా  తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేద్రీకరించిన కాంగ్రెస్  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు  తెలుస్తోంది.  నిజానికి ప్రియాంకా వాద్రా  చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఒక దశలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి, పతాక స్థాయికి చేరిన సమయంలో ప్రియాంక జోక్యంతోనే ఆ వివాదం సర్దు మణిగిందని అంటారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు, ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన తూటాల నేపధ్యంలో తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు.  అయితే, ఆ సమయంలో ప్రియాంక జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్ళారని అంటారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే  కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతనే తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. అందుకే కావచ్చు కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక చూపిన చొరవే కారణమని అంటారు. అలాగే రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రేకు బాధ్యతలు అప్పగించడం వెనక ప్రియాంక పాత్ర కీలకమని అంటారు. అదలా ఉంటే ప్రియాంక వాద్రాకు ఎన్నికల బరిలో దిగి, పార్లమెంట్ లో పాదం మోపాలనే కోరిక చాలా బలంగా వుంది. అందులో సందేహం లేదు. 2019 ఎన్నికల్లోనే ఆమె యూపీలో వారాణాసి నుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సై అన్నారు. అయితే, ఎందుకనో ఏమో కానీ రాహుల్ గాంధీ అడ్డుపుల్ల వేశారు. ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  చిత్తుగా ఓడిపోయినా నేపధ్యంలో ప్రియాంక యూపీ మీద ఆశలు వదులుకున్నారనీ, అప్పటి నుంచే ఆమె పార్లమెంట్ ఎంట్రీకి తెలంగాణను వేదికగా ఎంచుకున్నారని  అంటారు. అందుకే స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా  ఉభయ తారకంగా ప్రియాంక తెలంగాణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్ లేదా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నల్గొండ జిల్లా నుంచి లోక్ సభకు ప్రియాంక పోటీ చేస్తారని అంటున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఈసారి తాను నల్గొండ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రటించిన నేపధ్యంలో  ప్రియాంక  ప్రస్తుతం కోమటి రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న భువనగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయచ్చని అంటున్నారు.  అందుకే కొద్ది రోజుల క్రితమే రాష్ట్రానికి  వచ్చిన ప్రియాంక. మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారని తెలుస్తోంది. మే నెల 9వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా  హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కాగా ఇప్పుడు  ప్రియాంక  మరోసారి రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. జూన్ చివరి వారం లేదా జులై మొదటివారంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు షెడ్యూల్ ఖారు అయిందని అంటున్నారు. మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది.ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారని సమాచారం. ఈ సభలో పాల్గొనేందుకు ప్రియాంకగాంధీ రానున్నారని తెలుస్తోంది. సో.. తెలంగాణలో కాంగ్రెస్ లో ఇక ప్రియాంక  ముద్ర కనిపిచడం  ఖాయమని అంటున్నారు. ప్రియాంకం మొదలు కానుందని అంటున్నారు.

తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలా? 

2 జూన్ 2014 తెలంగాణలో చారిత్రాత్మక రోజు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ఆవిర్భావం జరిగి నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. ఇది పచ్చి నిజం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్బావోత్సవాలను దశాబ్ది ఉత్సవాలు అని ప్రచారం చేసుకుంటుంది. 9 ఏళ్లు పూర్తి అయి పదో వసంతంలోకి అడుగుపెట్టినంత మాత్రాన దశాబ్ది ఉత్సవాలు ఎలా అవుతాయని తెలంగాణా వాదులు ప్రశ్నిస్తున్నారు. బిఆర్ఎస్ అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పదేళ్లు అని ప్రచారం చేసుకుంటుంది. బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ, బిజెపీలు కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమెరికాలో కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. బిజెపి కూడా తానేం తక్కువ కాదు అని గోల్కొండలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణాను తెచ్చింది మేమే అని ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకునే బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు అని నామకరణం చేసి అన్ని పార్టీలను మిస్ గైడ్ చేసింది. తెలంగాణలో మక్కీ మక్కీ అనే నానుడిని బిఆర్ఎస్ యేతర పార్టీలు సార్థకం చేసాయి. అందరికంటే తెలివైన విద్యార్థి అనుకుని మిగతా విద్యార్థులు పరీక్షాకేంద్రంలో కాపీ కొట్టిన చందంలా తయారైంది రాజకీయ పార్టీల పరిస్థితి. 

అవినాష్ రెడ్డి కొంప ముంచిన పెదనాన్న ప్రతాప్ రెడ్డి

రోజుకో మలుపు తిరుగుతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా అజ్ణాత సాక్ష్యులు కీలక సమాచారాన్ని అందిస్తున్నారు. అజ్ణాత సాక్షుల సమాచారంతో సీబీఐ ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని జోడించి నివేదికలు తయారు చేస్తోంది. 2019 మార్చి 15వ తేదీన జరిగిన వివేకా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీబీఐని తప్పించుకు తిరుగుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు నుండి ఉ;శమనం పొందుతున్నారు. పులివెందులలో  పార్టీ కార్యక్రమాలున్నాయంటూ ఒక సారి, తల్లిగారికి ఆరోగ్యం బాలేదంటూ మరోసారి, తన తల్లికి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానంటూ ఇంకో సారి, హైదరాబాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోందని మరోసారని సీబీఐకు అవినాష్ ముఖం చాటేస్తూ వస్తున్నారు. అసలు అవినాష్ తల్లిగారి ఆరోగ్యం విషయంలో అవినాష్ వర్గం అసత్యాలు చెబుతోందని కూడా సీబీఐ అభిప్రాయపడిందని వార్తలు వెలువడ్డాయి. వృత్తిరిత్యా వైద్యురాలైన వివేకా కుమార్తె సునీత కూడా అవినాష్ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడం గమనార్హం. ఆ విషయం పక్కన పెడితే అవినాష్ వాయిదాలు వేసిన సమయాన్ని సీబీఐ చక్కగా వినియోగించుకుంది.  కొంత మంది అజ్ణాత వ్యక్తులను, అంటే కేసుతో సంబంధం లేదని అందరూ అనుకుంటున్న వ్యక్తులను సీబీఐ ప్రశ్నించి కీలక వివరాలు సేకరించింది. వీరిలో మొదటి వ్యక్తి ఐఏఎస్ అధికారి కల్లం అజయ్ రెడ్డి. జగన్ కుటుంబానికి దగ్గరగా మసలే అజయ్ కల్లంను సీబీఐ ప్రశ్నించింది.  2019 మార్చి 15ం తేదీ లెల్లవారు జామున సుమారు 4.15 గంటలకు వివేకా చనిపోయారన్న విషయం తనతో జగన్ చెప్పారని అజయ్ కల్లం వెల్లడించారు.  2019 ఎన్నికల మేనిఫెస్టో తయారీ పనుల్లో ఉన్న తనతో జగన్ ఈ విషయాన్ని పంచుకున్నారని, చిన్నాన్న నో మోర్ అనే క్లుప్త సమాచారాన్ని తనకు అందించారని కల్లాం చెప్పుకొచ్చారు.  వివేకా హత్య కేసు డైరీలో ఆయన హత్యకు సంబంధించిన మొదటి సమాచారం 6.30గంటలకు పీఏ కృష్ణారెడ్డి ద్వారా సీఐ శంకరయ్యకు తెలిసింది.  తరువాతే ప్రపంచానికి తెలుసు అనేది ఎఫ్ఐఆర్ వివరణ. కానీ అంతకు ముందే లోటస్ పాండ్ కు ఎలా సమాచారం అందింది అనేది సీబీఐ ప్రశ్న. దీనికి సంబంధించి లోటస్ పాండ్ లో ఉన్న వారిని విచారించాలన్నది సీబీఐ వాదన. ఇది మొదటి అజ్ణాత సాక్షి కథ. ఇక తాజా అజ్ణాత సాక్షి వివరణ ఇలా ఉంది. నేను వివేకా ఇంటికి వెళ్లినప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి అక్కడే ఉన్నారు. వివేకా శవం రక్తపుమడుగులో పడి ఉంది.  తండ్రీ కొడుకులు ఇద్దరూ రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నారు. తరువాత వివేకా మృతదేహాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి, కట్లు కట్టి పడుకోబెట్టారు. ఇది మరో అజ్ణాత సాక్షి వైఎస్ ప్రతాపరెడ్డి సాక్ష్యం. వైఎస్ ప్రతాపరెడ్డి స్వయానా అవినాష్ రెడ్డికి పెదనాన్న, భాస్కరరెడ్డికి సొంత అన్న. ఈ కేసులో ఇంకా ఎంత మంది సాక్షులు బయటకు వస్తారో తెలీదు. కానీ వివేకా కేసు ఒక కేస్ స్టడీ. అతీంద్రియ వ్యక్తులు, అదృశ్య శక్తులు, అజ్ణాత సాక్షులు ఈ కేసును ఇంకా ఎన్నిమలుపులు తిప్పుతారో వేచి చూడాల్సిందే.

వోట్ల బిచ్చగాళ్లు వచ్చేస్తున్నారు

రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎన్నికల వేళ వరాలు ప్రకటించడం షరా మామూలే. కానీ అవసరం లేకున్న వరాలు ప్రకటించి తీరా అధికారంలో వచ్చాక వాటిని మరుస్తున్న పార్టీ నేతలే ఎక్కువవుతున్నారు.  వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు గెహ్లాట్ . ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వోట్ల కోసం ఉచిత కరెంటు ప్రకటన చేసినట్లు ఆరోపిస్తున్నాయి.  ఎన్నికలకు ముందు,  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి భారతీయ పౌరుడి బ్యాంక్ ఖాతాకు 15 లక్షల రూపాయలు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవికత మరోలా  జరిగింది.  రూ.15 లక్షలు ఖాతాలోకి  పడలేదు.  ప్రజా సంక్షేమం కోసం చేసిన వాగ్దానాల అమలులో చిత్తశుద్ది కనిపించడం లేదు.  చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా జరుగుతోంది. కేవలం ఎన్నికల నేపథ్యంలో చేసిన వాగ్దానాలు చాలా సందర్భాల్లో వైఫల్యం చెందుతున్నాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని కెసీఆర్ వాగ్దానం చేశారు. వాస్తవికతలో అలాంటిది జరగలేదు.  పంటరుణాలను రూ లక్ష వరకు మాఫీ చేస్తానని కెసీఆర్ మరో వాగ్దానం చేశారు. ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు.  తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. ఈ వాగ్దానం కూడా అమలు  జరగలేదు.  కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కీం క్రింద కెజీ నుంచి పీజీ ఉచిత విద్యనందిస్తానని కెసీఆర్ హామి ఇచ్చారు. కానీ ఆచరణలో అది కూడా సాధ్యం కాలేదు.  గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కెసీఆర్  వాగ్దానం చేసి తూట్లు పొడిచారు.  ఒక్క తెలంగాణ రాష్ట్రంతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసే హామీలు, వాగ్దానాలు అమలు కావడం లేదు.  వోట్ల కోసం ఆయా పార్టీలు వేసే బిస్కట్స్ అని ప్రజలు గ్రహించాలి.   

తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేర రాజకీయ రేస్!

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ పొలిటిల్ మైలేజీ కోసం పోటీ పడుతున్నాయి. తెలంగాణ సాధించింది మేమేనంటూ బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనంటూ కాంగ్రెస్, అన్ని విధాలుగా సహకరించింది మేమేనంటూ బీజేపీ పోటాపోటీగా ఉత్సవాల నిర్వహణకు సమాయత్తమౌతున్నాయి. తెరాసగా ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అంతా ఆ పార్టీ క్రెడిట్ లో వేసుకుంది. అయితే ఎప్పుడైతే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చేశారో.. అప్పటి నుంచీ తెలంగాణ కార్డ్ ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో మాదే కీలక పాత్ర అని గత ఎనిమిదేళ్లుగా ఎంతగా చెప్పుకున్నా బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేకపోయింది.  అయితే ఎప్పడైతే టీఆర్ఎస్ తన పార్టీ పోరులోని తెలంగాణను తీసేసి భారత్ చేర్చిందో అప్పటి నుంచి బీజేపీ తెలంగాణ సాధనలో తమ పాత్ర విస్మరించడం సాధ్యం కాదంటూ గట్టిగా గళమెత్తింది. అందుకు ప్రజల నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ సోనియమ్మే తెలంగాణ ఇచ్చిందని గతంలో ఎంతగా చెప్పుకున్నా విశ్వసించని తెలంగానం ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత కాంగ్రెస్ మాటలకు ఔను కదా అంటూ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణలో మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ ఈ వేడుకలు మూడు వారాలు నిర్వహించాలని నిర్ణయిస్తే.. కేంద్ర  ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తామనీ, ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు.  ఇక కాంగ్రెస్ సోనియాగాంధీ చలవ వల్లే తెలంగాణ ఆవిర్భవించిందన్న ప్రచారంతో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 

రెజ్లర్ల ఆందోళన.. మసకబారుతున్న మోడీ ప్రతిష్ట

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్  భూషణ్ పై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపైనే దాష్ఠీకాలు జరుగుతున్న తీరు మోడీ ప్రతిష్టను నిలువునా ముంచేస్తున్నది. గత 41 రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై కేంద్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనకు మద్దతూ పెరుగుతోంది. ఈ మద్దతు కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వస్తుండటం.. మోడీ ప్రతిష్టను విదేశాలలో కూడా మసకబారుస్తోంది. తాజాగా భారత మహిళా రెజ్లర్ల ఆందోళనపై  యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్  స్పందించింది. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో మార్చ్ చేపట్టిన రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును నిర్ద్వంద్వంగా ఖండించింది. అలాగే భాతర మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలనీ, అలాగే నెలన్నర రోజులలో ఎన్నికలు నిర్వహించకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేస్తామనీ హెచ్చరించింది.   అదలా ఉంటే.. 41 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా   ఏప్రిల్ నుంచి తాము ఉద్యమిస్తున్నా.. బ్రిజ్ భూషణ్ పై చర్యల విషయంలో   పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమైన  రెజ్లర్లు  చివరి క్షణంలో ఖాప్ రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేంద్ర ప్రభుత్వానికి మరో ఐదు రోజుల గడువు ఇచ్చారు. భారత రెజ్లర్ల ఆందోళనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. దేశ వ్యాప్తంగా వారి ఆందోళనకు మద్దతుగా మహిళాలోకం గళమెత్తుతోంది. అలా గళమెత్తుతున్న వారిలో కేంద్రంలోని మహిళా మంత్రులు లేకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు యూనియన్ కేబినెట్ లోని మహిళా మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఒలింపిక్స్ లో రాణించి దేశానికి పతకాలు సాధించిన మహిళా రెజ్లర్ల పట్ల మీరు ప్రవర్తించాల్సిన తీరిదేనా అని నిలదీస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను వదిలేసి రెజ్లర్లపై కేంద్రం దమనకాండ ప్రదర్శించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా.. రెజ్లర్ల ఆందోళనకు దేశ, విదేశాల నుంచి మద్దతు పెరుగుతుంటే.. కేంద్రం, పోలీసులూ మాత్రం బ్రిజ్ భూషణ్ ను వెనకేసుకురావడంలో పోటీ పడుతున్నారు. తాజాగా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవంటూ ట్వీట్ చేశారు. అలా ట్వీట్ చేసిన వెంటనే దానిని డిలీట్ చేశారు. ప్రజా వ్యతిరేకత, ఆగ్రహానికి దడిసి ఢిల్లీ పోలీసులు ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో పోలీసుల తీరును ఆ ట్వీట్ తేటతెల్లం చేసింది. రెజ్లర్ల ఆరోపణలను బలపరిచే సాక్ష్యాలేవీ లేకపోవడం వల్లే బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయలేదంటున్న పోలీసులు.. ఆయనపై నమోదైన కేసులో ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉందని మాత్రం అంగీకరిస్తున్నారు.   

తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు.. మోడీయే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల విషయమై గత ఏడాదిగా  ఏదో ఒక రూపంలో చర్చ సాగుతూనే ఉంది. కూటములు, సమీకరణాల విషయంలో విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికో, లేక సొంత క్యాడర్ ను అలర్ట్ గా ఉంచడానికో అధికార వైసీపీ అగ్రనాయకత్వమే ఈ చర్చను సజీవంగా ఉంచింది. ముందస్తు చర్చ వెనక్కు వెళ్లకుండా వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని తాజాగా ఉంచుతూ వచ్చారు. ఇప్పుడిక ఏపీ అసెంబ్లీ గడువు ముగియడానికి ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పుడు ముందస్తు ముచ్చట మళ్లీ బలంగా తెరమీదకు వచ్చింది. అయితే ఈ సారి ఇందులో ఎలాంటి వ్యూహం లేదు. మొత్తం ములిగిపోవడమో.. ముందస్తుతో అదృష్టాన్ని పరిశీలించకోవడమో తప్ప మరో దారి లేని పరిస్థితికి జగన్ సర్కార్ చేరిపోయింది. దీంతో ఈ సారి స్వయంగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికల విషయంలో సీనియస్ గా ఆలోచిస్తున్నారు. అందులో భాగమే ఈ నెల 7 కేబినెట్ భేటీ అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉండటమో, సంక్షేమ పథకాలు కొనసాగించలేని నిస్సహాయతో.. పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తో, జనంలో వ్యక్తమౌతున్న ఆగ్రహమో జగన్ సర్కార్ ముందస్తుకు తహతహలాడేందుకు కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి జగన్ సర్కార్ ముందస్తుకు వెళ్లడానికి తెరమీదకు వచ్చిన కారణం ప్రధాని మోడీ.   అవును ప్రధాని మోడీయే జగన్ ముందస్తుకు తొందరపడటానికి కారణమని అంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలన్న పట్టుదలతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ చేయగలిగినంతా చేసింది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోజుల తరబడి రాష్ట్రంలో క్యాంపు చేసి ప్రచారం చేశారు. ఎప్పడూ ఫ్రీబీస్ (ఉచితాలు) దేశానికి మంచివి కావు అంటూ  ప్రతి వేదికమీదా ఉద్ఘాటించే  మోడీ, కర్నాటక బీజేపీ ఎన్నికలలో గెలిస్తే ఇవి ఉచితం.. అవి ఉచితం అంటూ ఏకంగా మేనిఫెస్టోలోనే పొందుపరిచినా కిమ్మనలేదు. పైగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనతో విస్తృతంగా ప్రచారం చేసిన మోడీ స్వయంగా తన ప్రసంగాలలో వాటినే ప్రముఖంగా చెప్పారు. అవి చాలవనుకున్నారో ఏమో.. హిందుత్వ ఎజెండాను కూడా అన్ని భేషజాలూ వదిలేసి మరీ భుజానికెత్తుకున్నారు. ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేశారు. బజరంగ్ భళి నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీకి ఓటెసి బజరంగ్ నినాదం చేయడంని పిలుపు  నివ్వడానికి కూడా మోడీ వెనుకాడలేదు. అ యినా కర్నాటకలో బీజేపీకి పరాభవం తప్పలేదు. అంతే కాకుండా కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై యాంటీ ఇన్ కంబెన్సీ ప్రభావం తీవ్రంగా ఉందని పరిశీలకులు  సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభావం తగ్గుతోందనడానికి కర్నాటక ఫలితాలను చూపుతున్నారు. ఇక అన్నిటికీ మించి ఏపీలో బీజేపీ పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం ఏపీలో వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండగా ఉందన్న సంగతి ఏపీ ప్రజలలో బలంగా నాటుకుందంటున్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే.. అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే..ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న ఆగ్రహానికి మోడీ వ్యతిరేకత కూడా తోడై జమిలిగా మునిగిపోవడం ఖాయమని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి హస్తిన పర్యటన జగన్ ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి ఓకే చేయించుకున్నారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.   దీంతో మోడీ వ్యతిరేకత తన సర్కార్ పై పడకుండా ఉండాలంటూ సార్వత్రిక ఎన్నికల వరకూ వేచి చూడకుండా ముందస్తు ఎన్నికలకు వెడితేనే ఏదో ఒక మేరకు ప్రయోజనం ఉంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఈ నెలాఖరుకే కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచాయి. తెలంగాణలోనూ అధికారంలోకి  రాగలమనే విశ్వాసాన్ని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త, సునీల్ కనుగోలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తోండటంతో.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ కాంగ్రెస్ లో ఆశలు నెలకొన్నాయి. అంతే కాదు, అక్కడ పాటించిన పద్ధతిలోనే, అదే పంధాలో తెలంగాణలో అడుగులు వేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.  అందులో భాగంగా, ఎన్నికల వ్యూహ హకర్త సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్ధులను ముందుగానే ఖరారు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అభ్యర్దుల ఎంపికకు చివరి క్షణం వరకు వేచి చూసే పద్దతికి  స్వస్తి చెప్పిన హస్తం పార్టీ, తెలంగాణలోనూ  అదే పద్దతిని ఫాలో అవుతోందని అంటున్నారు. కనీసం సగం నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులోగా  దాదాపు 50 శాతం నియోజక వర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం, ఇప్పడు తాజాగా మరో సర్వే నిర్వహిస్తోందని, ఈ సర్వే ఫలితాలు వచ్చిన వెంటనే సర్వే రిపోర్టులను విశ్లేషించి 60 మంది అభ్యర్ధులతో తొలి జాబితా సిద్దమవుతుందని అంటున్నారు.  అయితే, అభ్యర్ధుల పేర్లను వెంటనే ప్రకటించకుండా, ఏంపికైన అభ్యర్ధులకు పచ్చ కార్డు  పంపుతారని అంటున్నారు. సర్వేలలో వచ్చిన ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల్లో గ్రాఫ్ తక్కువగా ఉన్న నేతలను వేరే నియోజకవర్గాలకు మార్చుతారు. కర్ణాటకలో ఇదే ప్లాన్‌ను అమలు చేసి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తోంది. సునీల్ కనుగోలు టీమ్‌తో పాటు ఇతర ఇండిపెండెంట్ ఏజెన్సీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను మార్చే అవకాశముందని అంటున్నారు.  ఓ వంక అభ్యర్ధుల ఎంపిక కసరత్తు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మరో వంక కర్ణాటక తరహాలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సిద్ద చేస్తునట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా,  తెలంగాణ ఇచ్చిన అమ్మ  సోనియమ్మ  అనే నినాదంతో ప్రచారాన్ని పాజిటివ్ నోట్  తో ప్రారంభించేందుకు ప్రచార సామాగ్రిని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్ణాటక ఎన్నికల్లో పెద్దగా ప్రచారంలో పాల్గొనని సోనియా గాంధీ తెలంగాణలో కొంత విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ,  ప్రియాంకా వాద్రా తెలంగాణలో మరింత విస్తృతంగా పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలలో ఒకరైనా ప్రతీనెలా రాష్ట్ర పర్యటనకు వచ్చేలా ప్లాన్ చేస్తోన్నారని అంటున్నారు.. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నాయకులు రాష్టంలో విస్తృతంగా పర్యటించేందుకు  ప్రణాళికలు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, టీ కాంగ్రెస్  ను రేసులోకి తీసుకు వచ్చింది. అంతే కాదు, బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి కమలం కాదు, కాంగ్రెస్  పార్టీనే అని , బీజేపీ నాయకులే బహిరంగంగా ఒప్పు కుంటున్నారంటే... ఒక్క గెలుపుతో హస్త రేఖలు ఎలా మరిపొయాయో ..అర్థం చేసుకోవచ్చు.

పొగరాయుళ్లకు శిక్షలు కాగితాలకేనా? 

ఇకపై ఓటీటీలో ప్రసారమయ్యే వాటికి పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కంపల్సరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది కానీ అమలు చేయించడంలో మాత్రం పాలకులు చిత్తశుద్ది ప్రదర్శించాల్సి ఉంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం సినిమా థియేటర్ స్లైడ్స్ లో ప్రచారం చేస్తుంది. తాజాగా పాలకులు ఇటువంటి ప్రచారాలను ఒటీటీ ప్రసారాల్లో కూడా చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడంలో తప్పు లేదు. కానీ పాలకులు గతంలో చేసిన ఉత్తర్వులను అమలు చేయిస్తున్నారా? లేదా అనేది శేష ప్రశ్నగానే మిగులుతుంది. థియేటర్ స్లైడ్స్ లో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెలపై ఉన్న మాదిరిగానే ఒటీటీ ప్రసారాల్లో ఉంటుంది తప్పితే అమలు చేయించే బాధ్యత పాలకులపై ఉండటం లేదు. అదే థియేటర్  ప్రాంగణంలోనే ఇంటర్వెల్ లో పొగలు కక్కే సిగరెట్లను ఊదేసేవారు ఎక్కువగా  ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగుట నిషేధం అని మన చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయించే బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. జైలు శిక్ష విధించే అధికారం చట్టాల్లో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ది లోపించినట్లయ్యింది. ఇవ్వాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని తద్దినం మాదిరిగా జరుపుకునే వారే సమాజంలో ఎక్కువయ్యారు. 

అవినాష్ కు బెయిలు.. జగన్ కు నోటీసులా?

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ బుధవారం ( మే 31) తుది తీర్పు ఇచ్చేసింది. అయితే బెయిలు వచ్చినంత మాత్రాన సంతోషించడానికి అవినాష్ రెడ్డికి పెద్దగా మిగిలిందేమీ లేదు. ప్రతి వారం విచారణకు హాజరు కావాల్సిందే. సీబీఐ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే. అయితే ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణకు స్వీకరించడానికి ముందు జరిగిన హైడ్రామా కారణంగా బెయిలు లభిస్తే చాలు  అవినాష్ రెడ్డి గెలిచేసినట్లే  అన్న వాతావరణం క్రియేట్ అయ్యింది. అయితే అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ  హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో అవినాష్ నే కాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విచారించాల్సి ఉంటుందని విస్పష్టంగా పేర్కొంది. పకడ్బందీగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల పేర్లను ప్రస్తావించి.. అవినాష్ కు తప్పించుకునే అవకాశం లేకుండా చక్రబంధంలో ఇరికించింది. ప్రభావ వంతమైన వ్యక్తి అనీ, రాజకీయ కోణంలో జరిగిన వివేకా హత్య లో అవినాష్ ప్రమేయం ఉందని విస్పష్టంగా చెప్పింది. అలాగే వివేకా హత్య విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలుసునని పేర్కొంది. ఆ సమాచారాన్నిఆయనకు అవినాష్ రెడ్డే చేరవేశారని కూడా సీబీఐ అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   అంతే కాకుండా వివేకా హత్య వెనుక కుట్ర ఉందనీ, తమ దర్యాప్తులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హత్య విషయం ప్రపంచానికి ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించడానికి ముందే తెలుసుననీ సీబీఐ పేర్కొంది.  హత్య విషయాన్ని ఎంవీ కృష్ణారెడ్డి 2019 మార్చి 15 ఉదయం 6.15 గంటలకు వెల్లడిస్తే జగన్ మోహన్ రెడ్డికి మాత్రం హత్య విషయం అంతకంటే ముందే తెలిసిందనీ సీబీఐ పేర్కొంది. అలాగే హత్యకు ముందు, తరువాత కూడా అవినాష్ రెడ్డి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నట్లు తేలిందనీ, ఆయనే జగన్ మోహన్ రెడ్డికి వివేకా హత్య విషయం చెప్పి ఉంటారనీ, ఆవిషయాన్ని ఆయనను విచారించి తేల్చుకోవాలని, ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డిని కూడా విచారించాల్సి ఉంటుందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుంటే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు రావడమన్నది చాలా చిన్న విషయమనీ, వివేకా హత్య కేసులో లాజికల్ ఎండ్ కు చేరే దిశగా సీబీఐ దర్యాప్తు చాలా పకడ్బందీగా ఉందనీ నిపుణులు అంటున్నారు. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను బట్టి ఇక నుంచి ప్రతి శనివారం అవినాష్ సీబీఐ విచారణలో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, ఎక్కువ కాలం విచారణకు సహకరించకుండా ఉండే  అవకాశం ఉండదనీ అంటున్నారు. ఒక వేళ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించకుంటే సీబీఐ ఆయన బెయిలు రద్దు కోసం కోర్టును ఆశ్రయించి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. 

మరో ‘మహా ’ సంక్షోభం ?

మహారాష్ట్రలో రాజకీయం మరో మారు వేడెక్కింది. గతేడాది ఇదే జూన్ నెలలో  అప్పటి అధికార కూటమి మహా వికాస్ అఘాడి లో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మూడు పార్టీల కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేన నిట్టనిలువునా చీలి పోవడంతో ఏర్పడిన సంక్షోభం చివరకు కూటమి సర్కార్  కూలి బీజేపీ, శివసేన చీలిక వర్గం ( షిండే వర్గం) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీసింది. శివసేన చీలిక వర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫన్డవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నెల రోజులకు పైగా సాగిన మహా సంక్షోభం గత సంవత్సరం జూన్ 30 న ముగిసింది.   అయితే సంక్షోభం మూగిసి సంవత్సరం దాటినా మహా రాజకీయాల్లో వేడి మాత్రం తరచూ తెరపైకి వస్తూనే వుంది. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్  పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి  ఉప సంహరించుకున్న ఎపిసోడ్ ముగిసిన కొద్ది రోజులకే, మరో మహా రాజకీయం తెరపై కొచ్చింది. శివసేన చీలిక వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారంతా మాతృ సంస్థకు తిరిగోస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ వినాయక్ రౌత్ పేర్కొన్నారు. అలాగే, 13 మంది ఎంపీల్లో 9 మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన బాంబు పేల్చారు.  షిండే సేనలోని ఎంపీలు కూడా తమ పనులు జరగడం లేదని,  తమను ధిక్కరిస్తున్నారని కలత చెందారని రౌత్ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ తమ పట్ల బీజేపీ సవతి తల్లిగా వ్యవహరిస్తోందని షిండే గ్రూపు ఎంపీ గజానన్ కీర్తికర్ అసమ్మతి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర మంత్రి శంభురాజే దేశాయ్ 15 రోజుల కిందట ఉద్ధవ్ ఠాక్రేకు ఒక సందేశం పంపారని, వారు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే దాని గురించి మాట్లాడారని రౌత్ చెప్పారు. కేవలం దేశాయ్ మాత్రమే కాదు తానాజీ సావంత్, గజానన్ కీర్తికర్ తమ అసంతృప్తి వెళ్లగక్కారని గుర్తు చేశారు. షిండే సేన తన మిత్రపక్షమైన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలపై కలవరపడుతోందని వ్యాఖ్యానించారు. అయితే  దీనిపై స్పందించిన దేశాయ్.. తాను ఉద్ధవ్‌కు ఎటువంటి మెసేజ్ పెట్టలేదన్నారు. రౌత్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు.  వినాయక్ రౌత్ వ్యాఖ్యలపై రెండు రోజుల సమయం ఇస్తున్నా.. రౌత్ తన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.. పరువు నష్టం నోటీసులు పంపుతాను  అని మంత్రి స్పష్టం చేశారు. అయితే, మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు  దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

కేసినేని నానికి వైసీపీ గాలం..?

క్రికెట్ లో ఎవరు విజేతలు అవుతారో..  రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో  చెప్పడం జూదంలాంటిదేనని అంటారు.  అంచనాలు ఒక్కొక్కసారి నిజమవుతాయి..మరోసారి ఫెయిల్ అవు తాయి. మరీ ముఖ్యంగా రాజకీయాలలో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. అంటే రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని అర్ధం. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీని వైసీపీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని అధికార పార్టీ రాజ్యసభ  సభ్యుడు అయోధ్య రామిరెడ్డి  వ్యాఖ్యలతో తెలుగుదేశం వైసీపీ పార్టీల్లో కలకలం రేగింది.   అసలు కేశినేని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారన్న చర్చ కూడా ఎక్కడా జరగడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పట్ల కించింత్ అసంతృప్తితో ఉన్నారన్నది తెలిసిందే. ఆ ఈసంతృప్తితో కేశినేని నాని ఒక వేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినా  వైసీపీ లో చేరుతారని ఎవరూ కూడా ఊహామాత్రంగానే  భావించలేదు. దీంతో  అయోధ్య రామిరెడ్డి కేశినేని నానిని వైసీపీలోకి ఆహ్వానిస్తాం అనడం కేవలం తెలుగుదేశం, వైసీపీలలోనే కాదు అందరిలోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.   2019-20 ల కాలంలో... కేశినేని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరుతారనే ప్రచారం జరిగింది. దాన్ని ఆయన ఖండించారు కూడా. అప్పటి నుంచి పార్టీ మారే విషయంలో ఎంపీ పై ఎలాంటి వార్తలు లేవు. అయితే  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తో ఎంపీ కి మంచి సంబంధాలు లేవన్నది వాస్తవం. ఎందుకంటే ఎంపీ ఏ రోజు ఎలా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఎంపీని బలంగా వ్యాతిరేకిస్తున్న బోండా ఉమ,  బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, జలీల్ ఖాన్ లాంటి నేతలను చంద్రబాబు కట్టడి చేయటం లేదు. ఇదే సమయంలో ఎంపీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అంటే ఈ  రెండువర్గాల్లోని  నేతలు ఎవరికి  వ్యతిరేకంగా ఎవరు ఫిర్యాదు  చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. ఎందుకంటే విజయవాడ లో ఈ రెండు వర్గాల నేతలూ పార్టీకి అవసరమే. వీళ్ళ మధ్య పంచాయితీల పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంతో చంద్రబాబు కూడా వీళ్ళని అలా వదిలేశారని భావించాలి. అయితే రాజకీయ పరిణామాల్లో ముందు జాగ్రత్తగా కేశినేని తమ్ముడు కేశినేని శివధర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారనే  ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే అది  కేవలం ప్రచారమే అని కేశినాని నాని పట్టించుకోకుండా వదిలేయడానికి వీల్లేకుండా, నిదర్శనాలు కూడా కనిపిస్తున్నాయి.   ఈ పరిణామాల నేపథ్యంలోనూ  కేశినేని నాని అధికార పార్టీ కి చెందిన వారితో సఖ్యతగా ఉంటున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే  మొండితోక జగన్మోహన్ రావుతో  సన్నిహితంగా మెలుగుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పిలిస్తే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని పార్టీలో కి వస్తే ఆహ్వానిస్తామని అయోధ్య రామిరెడ్డి  చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.   గత రెండు ఎన్నికలలోనూ విజయవాడ పార్లమెంటు స్థానంలో వైసీపీ పరాజయం పాలైంది. కాబట్టి సహజంగానే  బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ గాలిస్తోంది. ఆ బలమైన అభ్యర్థి ఆ పార్టీకి కేశినేని నాని రూపంలో లభించాడని అయోధ్యరామిరెడ్డి వ్యాఖ్యలు చెబుతున్నాయి. దీనిని బట్టి   కేశినేని తొందరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.