వరద నీటిలో కొట్టుకుపోయిన వంతెన

తెలుగు రాష్ట్రాలు వర్షాభావంతో అతలాకుతలమౌతుంటే.. ఉత్తరాది వర్ష బీభత్సంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు బ్రిడ్జిలు ధ్వంసం  అయ్యాయి.  హిమాచల్ ప్రదేశ్ లోని  బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన అమాంతం  కొట్టుకుపోయింది. అలా వంతెన కొట్టుకుపోతున్న సంఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ సామాజిక మాధ్యమంలో  వైరల్ అయ్యింది.  బియాస్ నదీ తీరం  కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మనాలిలో మెరుపు వరదల కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మినీ జమిలి.. లోక్ సభతో పాటే 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీ పరస్పెక్టివ్ ను పూర్తిగా మార్చేసిందా? అంతకు ముందు వరకూ  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయంపై ఉన్న ధీమా ఒకింత తగ్గినట్టుగా కనిపిస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులకు స్థాన భ్రంశం కల్పించింది. త్వరలో మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకర చేయనున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా సన్నగిల్లడం వల్లనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలు కొలిక్కి వచ్చేలోగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందని అంటున్నారు. అందుకే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు కూడా నగారా మోగిస్తే ఎన్నికలలో లబ్ధి పొందే అవకాశాలు ఒకింత మెరుగ్గా ఉంటాయని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో మాటు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తుగానే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న యోచన చేస్తున్నదంటున్నారు. ఏపీ వంటి రాష్ట్రాలు ముందస్తుకు రెఢీగా ఉన్నాయనీ, అలా రెడీగా లేని రాష్ట్రాలను కూడా ఒప్పించి ఏదో విధంగా ఈ ఏడాది చివరికే పలు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరిపించేస్తే.. విపక్షాలు ఐక్యతాయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, ఎన్నికలకు అవి ఇంకా పూర్తిగా సంసిద్ధంగా లేకపోవడంతో  అధికారంలో ఉన్న బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయన్నది మోడీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే  నరేంద్రమోడీ మినీ జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని అంటున్నారు.  గతంలో నరేంద్రమోడీ జమిలి ఎన్నికల నిర్వహణ పై  ఆసక్తి కనబరిచినా, అయితే అది అనుకున్నంత ఈజీ కాదని తేలిపోవడంతో అప్పటికి మిన్న కున్నారనీ,ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మినీ జనరల్ ఎలక్షన్ కు వెళితే.. అంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలనూ కలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు వెడితే రాజకీయంగా తమ విజయానికి తిరుగుండదన్న భావన మోడీలో బంలంగా ఉందని చెబుతున్నారు.      డిసెంబర్ నెల లో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగాల్సుంది. అలాగే  వచ్చే ఏడాది మే-జూన్ నెల లో మరో ఆరు  రాష్ట్రాల కు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు పెండింగు జరగాల్సి ఉంది.  మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో జరగాల్సి ఉంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే జరగాల్సి ఉంది.  దీనిని దృష్టిలో  ఉంచుకునే ఈ డిసెంబర్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ను ఓ మూడునెలలు వాయిదా వేయడమో లేదా వచ్చే ఏడాది మే, జూన్ లలో జరగాల్సిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరపడమో చేస్తే  శ్రమ, వ్యయం, సమయం అన్నీ కలిసి వస్తాయన్నది మోడీ ఆలోచనగా చెబుతున్నారు.  అయితే ఈ ఏడాది చివరిలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటే.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ కావాలి. అలా కాకుండా వచ్చే ఏడాది  మే, జూన్ లో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరపడం అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. దీంతో మోడీ రెండో ఆప్షన్ కే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సమృద్ధిగా వర్షాలు.. భవిష్యవాణి

ఎల్ నినో.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దాదాపుగా ముఖం చాటేసిన పరిస్థితి. జూలై రెండో వారంలోకి అడుగుపెట్టినా ఇప్పటి వరకూ మంచి వర్షాలు కురిసిన జాడ లేదు. ఈ తరుణంలో భవిష్యవాణి తెలంగాణ వాసులకు శుభవార్త  తెలిపింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పింది. ఏపీలో ఫరవాలేదనిపించినా తెలంగాణలో వర్షాలు ఇప్పటికీ మబ్బుల చాటునే దాగున్నాయి. అయితే ఆషాఢం బోనాల సందర్భంగా జోగిని స్వర్ణ లత మాత్రం ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భవిష్యవాణి చెప్పింది. లోపాలు  లేకుండా తనకు పూజలు నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన భవిష్యవాణి.. గత ఏడాది ఇచ్చిన వాగ్దానం మరిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలలో భాగంగా స్వర్ణలత సోమవారం (జూలై 10) పచ్చిమట్టికుండపై నిలుచుని వినిపించిన భవిష్యవాణిలో ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తాయన్ని చెప్పారు. ఎల్లవేళలా వెన్నంటి భక్తులను కాపాడుకుంటాననీ చెప్పిన భవిష్యవాణి, అగ్నిప్రమాదాల గురించి భయం వద్దన్నారు.  స్వర్ణలత భవిష్యవాణి వినేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 

రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీ.. వైసీపీ యూటర్న్!

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నది సామెత. జగన్ సర్కార్ కు చాలా విషయాలలో ఈ సామెత అస్సలు వర్తించది. ఇక తప్పదనుకున్నప్పుడో, మరో గత్యంతరం లేని సందర్బంలో మాత్రమే తాను చేసిన తప్పును దిద్దుకుంటున్నట్లుగా కలర్ ఇస్తుంది. జగన్ సర్కార్. జగన్ సర్కార్ అంటే అదేదో కేబినెట్ సమష్టిగా చేసే పాలన అనుకుంటే ఎవరైనా సరే తప్పులో కాలేసినట్లే అవుతుంది. జగన్ సర్కార్ లో మంత్రులంతా తమ అధినేత, ముఖ్యమంత్రి ఏం అనుకుంటే అదే చేస్తారు. ఆయన మనసు గ్రహించి మసులు కుంటారు. ఇక ప్రభుత్వాధికారుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. జగన్ చెప్పిందే వారికి వేదం. అందుకే రుషి కొండకు గుండు కొట్టేసినా, హోటల్ పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించమన్నా.. నిబంధనలు అంగీకరించవనీ, పర్యావరణ సమస్యలు వస్తాయనీ అన్న విషయాన్ని కనీసం జగన్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యమైనా చేయరు.   రుషికొండ పనైపోయింది. ఇప్పుడిక    ఆ రుషికొండ బీచ్ ను కూడా పూర్తిగా ఒక ప్రైవేటు బీచ్ గా మార్చేసుకుంటున్నారు.  బీచ్ లోకి ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. మంగళవారం నుంచి  ఆ ఫీజులు వసూలు చేయాలని కూడా నిర్ణయించేశారు.   విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో  ప్రవేశానికి టిక్కెట్లు పెట్టిన దాఖలాలు లేవు. ఆ పుణ్యం కట్టుకోవాలని జగన్ సర్కార్ గట్టిగా నిర్ణయించేసుకుంది.  రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. వాటికి ఖర్చులు అవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి కేంద్రమే  భ్లూ ఫాగ్ బీచ్‌లకు నిధులు ఇస్తోంది. అయినా  రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీజు నిర్ణయించి దోపిడీకి తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా  రుషికొండ పై కట్టిన నివాసం నుంచి బీచ్ లోకి వెళ్లి సేదదీరేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేుకుంటున్నారని గతంలో అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం తారస్థాయికి చేరిందన్న సంగతిని గ్రహించిన ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలకు తెరలేపింది.  తూచ్ రిషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజ్ అంతా ఉత్తిదేనని మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పారు.   నిజానికి మంగళవారం (జూలై 11) నుంచి రుషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజు అమలు చేయడానికి సర్వ సిద్ధమైపోయింది. ఎవరికీ తెలియకుండా అమలు చేసేద్దామని భావించారు.  కానీ అసలు విషయం ముందుగానే వెల్లడి అయిపోయిన నేపథ్యంలో  మంత్రి అమర్నాథ్ స్పందించి బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.  

అడ్డంగా బుక్కయ్యారు!

తాజాగా విశాఖపట్నంలో ఆర్మీడ్ రిజర్వ్ సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరు వ్యక్తులను బెదిరించి నగదు గుంజుకొన్న కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉల్కిపడింది. అయితే తాజాగా సీఐ స్వర్ణలత వ్యవహారం, గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి సీఐ, ప్రస్తుతం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఒకేలా ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఊపందుకొంది.  స్వర్ణలత.. సీఐగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారని.. ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవి కాస్తా వివాదాస్పదం కావడంపై ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.    అలాగే సీఐ స్వర్ణలత సినిమాల్లోకి వేళ్లాలని భావిస్తున్నారని... ఆ క్రమంలో ఆమె.. తన ఆటపాటలతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు.. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయని.. అలాంటి వేళ సీఐ స్వర్ణలత వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోందని అంటున్నారు. పోలీస్ అధికారి అయి ఉండి.. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటనే ఓ వాదన అయితే గతంలో గట్టిగానే నడిచిందనే టాక్ పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అదీకాక నోట్ల మార్పిడి వ్యవహరంలో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షలాది రూపాయిలు కొట్టేశారంటూ అభియోగాల నేపథ్యంలో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయ్యారు.  మరోవైపు 2019 ఎన్నికలకు ముందు దాదాపుగా ఇదే తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాదవ్ విధులు నిర్వహిస్తున్నారని.. ఆ సమయంలో తాడిపత్రిలో స్థానికంగా చోటు చేసుకొన్న ఓ వివాదం.. చినికి చినికి గాలీ వానగా మారడం.. ఆ సమయంలో అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వ్యాఖ్యలు చేయడం.. ఈ నేపథ్యంలో కదిరి సీఐ ప్లస్ పోలీస్ ఉద్యోగు సంఘం నాయకుడు గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మీసం మెలేస్తూ.. జేసీకి వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని... ఈ అంశం నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ తర్వాత గోరంట్ల మాధవ్‌.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి..  జగన్ పార్టీలో చేరి హిందూపురం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ గతేడాది గోరంట్ల మాధవ్‌ది అంటూ చెబుతున్నో ఓ నగ్న వీడియో అయితే.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.  అటు గోరంట్ల మాధవ్, ఇటు స్వర్ణలత.. ఈ ఇద్దరు పోలీస్ శాఖలో సీఐలుగా ఉన్నారని.. ఈ ఇద్దరు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘంలో కీలక పదవుల్లో ఉన్నారని... అలాగే ఈ ఇద్దరు సీఐలుగా ఉండి.. స్వయంగా ప్రెస్‌మీట్లు పెట్టి.. టీడీపీ సీనియర్ నేతలపై విమర్శలు గుప్పించారనే అంటున్నారు.    దీంతో గోరంట్ల మాధవ్ తరహాలోనే సీఐ స్వర్ణలత సైతం తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. పోలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రానున్న ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

దటీజ్ సీఐ స్వర్ణలత!

కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని నాలుగో సింహం పోలీస్‌. మరి కనిపించని ఆ నాలుగో సింహం పోలీసుల్లో కూడా కనిపించని అసలు సిసలు కోణాలు సైతం.. విశాఖ మహిళ ఆర్మీ రిజర్వుడ్ సీఐ స్వర్ణలత విషయంలో తాజా తాజాగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.  పలువురికి ఆదర్శంగా ఉంటూ.. బాధ్యత గల పోలీస్ శాఖలో ఉన్న సీఐ స్వర్ణలత.. 2 వేల రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో.. వ్యక్తులను బెదిరించి.. లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఇలా అడ్డంగా దొరికిపోవడం.. ఆమెపై ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు కావడం.. రాష్ట్రంలోనే కాదు.. పోలీస్ శాఖలో సైతం స్వర్ణలత వ్యవహారం సంచలనంగా  మారింది. అయితే ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆమె.. అధికార జగన్ పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధిని ఆశ్రయించి.. వారి ద్వారా ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు  తీసుకు వచ్చినా.. అప్పటికే జరగాల్సిన తతంగం అంతా జరిగిపోయిందని.. ఈ నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధి సైతం.. హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తిసినట్లు ఓ ప్రచారం  వాడి వేడిగా ఉక్కు నగరంలో సాగుతోంది. మరోవైపు స్వర్ణలత ఇలా అడ్డంగా బుక్ అయిపోవడంతో.. ఆమె గారి ముచ్చట్లు, మక్కువలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సీఐ స్వర్ణలతకి ఖాకీవనంలో విధులు నిర్వహించడం కంటే.. టాలీవుడ్‌లో నటించడంలోనే కిక్కు ఎక్కువని భావించి.. ఆ క్రమంలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు టాలీవుడ్‌తో మంచి సంబంధాలున్నాయని తెలుసుకొని.. సదరు ప్రజాప్రతినిధులతో పరిచయాలు పెంచుకున్నారు..  వారిని కలిసి తన మనస్సులోని మాట చెప్పగా..  త్వరలో   తీయబోయే చిత్రంలో చాన్స్ ఇస్తానని.. కానీ ఆ పాత్రకు న్యాటం మాత్రం కంపల్సరీగా వచ్చి ఉండాలని కండిషన్ పెట్టడంతో.. సీఐ స్వర్ణలత ఓ కోరియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకొని మరీ డెడికేషన్‌తో స్పెషల్ కోచింగ్ సైతం తీసుకొని మరీ నృత్యం నేర్చుకున్నారు. అందులోభాగంగా కొన్ని సినిమా పాటలకు సీఐ స్వర్ణలత చేసిన డ్యాన్సులకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. వటిలో జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బనీ తీయ్యనీ దెబ్బ.. పాటకు చేసిన డ్యాన్స్  వీడియోను చిరు ప్రయత్నం అంటూ సీఐ స్వర్ణలత సోషల్ మీడియాలోకి వదలడంతో...  ఆ వీడియో  సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తున్నది. అంతేకాకుండా ఆమె నృత్య రీతులకు  నెటిజనులు   ఫిదా అయిపోయారనే   చర్చ సైతం వాల్తేరులో వైరల్ అవుతోంది.   ప్రస్తుతం సీఐ స్వర్ణలత ఏపీ 31 అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నది. సదరు సినిమా నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలో కూడా స్వర్ణలత భాగస్వామిగా ఉన్నారు. ఆ సినిమా కోసమే  నోట్ల మార్పిడి వ్యవహారంలో పోలీస్ మార్క్ వ్యవహారం ఆమె నడిపించారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అదీకాక ఆమె ఎప్పుడు ఎక్కడ.. విధులు నిర్వహించినా అక్కడ తనదైన శైలిలో స్వర్ణలత మార్క్ చూపించేవారనే ఓ చర్చ సైతం కొనసాగుతోంది. మరోవైపు సీఐ స్వర్ణలత నటిస్తున్న ఏపీ 31 పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా పాపం పండాలన్నా.. మనలోని టాలెంట్ బయటకు రావాలన్నా.. దానికి ఓ టైమ్‌ రావాలి. అలా అయితేనే.. మనమేమిటో.. మన సత్తా ఏమిటో.. మన ప్రతిభా పాటవాలు ఏమిటో పది మందికి తెలుస్తాయి. అయినా పోలీస్ శాఖలో సీఐగా విధులు నిర్వహించినా.. నృత్య రీతులు నేర్చుకొని డ్యాన్సులు చేసినా.. రాని పేరు ప్రఖ్యాతలు.. ఒక్కసారిగా ఇలా నోట్లు మార్పిడి వ్యవహారంలో ఖాకీ పవర్‌తోపాటు లాఠీ పవర్ చూపించి మరీ పోలీస్ మార్క్ దందాలు చేస్తే.. పేరు ప్రఖ్యాతలు ఇలా తన్నుకు వస్తాయని  సీఐ స్వర్ణలత   ఊహించి ఉండరని అంటున్నారు. ఈ అలోచన ఉంటే 2016లో నోట్ల రద్దు అప్పుడే ఈ వ్యవహారం నడిపి ఉండేవారనే   చర్చ సైతం రేపో మాపో కార్యనిర్వహాక రాజధానిగా కాబోతున్న విశాఖ నగరంలో వీర విహారం చేస్తోంది.

వందే భారత్ రైలు అసలు రంగులోకి..

వందేభారత్ ఎల్స్ ప్రెస్ రైళ్లంటూ..పేదోళ్ళకి అందనంత ఎత్తులో..జెండా ఊపుతూ.. అదే పనిగా ప్రారంభత్సవాలు చేస్తూ.. జనాలకు  విదూషకుడిగా  కనిపించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి హాస్యాన్ని పండించారు.   తాజాగా వందేమాతరం ఎక్స్ ప్రెస్ ల రంగు మార్చి.. తమ అసలు రంగును చాటుకున్నారు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. చైన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కషాయ రంగుతో ఉన్న వందేభారత్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వందే భారత్ రైలు తెలుపు రంగులో ఉండడం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా అంటుకోవడంతో, దీంతో రంగు మార్చాలని అధికారులు నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు.  ఈ నిర్ణయంతో వందే భారత్ రైలు ఇక కషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి. జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు ఇప్పటి వరకు 25రైళ్లలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని, జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించుకున్నామని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. త్వరలో పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ 'టీ ట్రైన్' లను ప్రవేశపెట్టాలే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత.. దక్షిణాదిలో మరెన్నో వందేభాదర్ రైళ్లను ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. చైన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటివరకూ 70వేల బోగీలు తయారయ్యాయి. ఫీడ్ బ్యార్ ఆధారంగా రైళ్లకు అనేక మార్పులు చేస్తున్నారు. భద్రతా ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా దృష్టి సారించారు.2023-24లో ఈ కార్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజాభివృద్ధే తమ సర్కార్ అభిమతమని చెప్పుకుంటూ.. పురాతన కూడళ్లు..రోడ్లకు పేర్లు మార్చి.. తమ నైజాన్ని చాటుకున్న కేంద్రం.. ఇప్పుడు రైళ్లకు సైతం.. రంగులు మార్చడం.. కాషాయమే తమ అసలు అభిమతం..ఉద్దేశమని తెలపకనే తెలిపింది కదా అని పరిశీలకులు అంటున్నారు. ఇదే మరి..మోడీ మార్క్ రాజకీయాలంటే..!

వైసీపీలో వైఎస్సార్ బ్రాండ్ మాయం!

దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అసలైన వారసులు ఎవరంటే కుమారుడు వైఎస్ జగన్ తో పాటు కుమార్తె షర్మిల కూడా నేనున్నా అని చెప్పుకుంటున్నారు. అయితే, అసలైన వారసుడిగా జగన్ కు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆయన చేసిన కొన్ని సంక్షేమ పనులే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు తెచ్చి పెట్టాయి. వైఎస్ఆర్ పాలనపై నమ్మకం కుదిరిన వారే జగన్ కోరిన ఒక్క ఛాన్స్ నినాదానికి పడిపోయారు. ఏది ఏదైతేనేం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే అది వైఎస్ఆర్ కుమారుడిగానే. అందుకే వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి, కట్టే ప్రతి నిర్మాణానికి ఆయన పేరు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడెప్పుడో కట్టిన వాటికి సైతం పేర్లు మార్చి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ నాలుగేళ్ళలో ఎప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పల్లె స్థాయి కార్యకర్త నుండి సాక్షాత్తు సీఎం వరకు ఈ వేడుకలను ప్రత్యేకంగా భావించేవారు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఈ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించేవారు. ఇడుపులపాయను సుందరంగా అలంకరించి తమ నేతకు ఘన నివాళి అర్పించేవారు. కానీ, తాజాగా జులై 8న వచ్చిన వైఎస్ఆర్ జయంతిలో ఎక్కడా గతంలో స్థాయిలో జోష్ కనిపించలేదు. సాక్షాత్తూ ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్ రెడ్డే త‌న తండ్రి ఘాట్‌కు వెళ్లి పూలుచల్లి నివాళి అర్పించి అటు నుండి అటు పులివెందుల‌ ప‌ర్య‌టనకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 150 మంది ఎమ్మెల్యేలలో పట్టుమని పది మంది కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించలేదు. రాయలసీమలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చిన్నా చితకా సేవా కార్యక్రమాలు నిర్వహించగా   రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎక్కడా ఆ స్థాయి కార్యక్రమాలు కూడా లేవు. గ్రామాలలో అంతకు ముందు మూడేళ్లు కేక్ కటింగ్, స్వీట్లు పంచడం, అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించగా ఈసారి దాదాపుగా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీలో వైఎస్ఆర్ మ్యానియా ఏమైందని సహజంగానే అనుమానాలు మొదలవుతున్నాయి. వైసీపీ నేతలు, పెద్దలు కావాలనే ఈసారి వైఎస్ఆర్ జయంతిని పక్కన పెట్టారా? లేక అధిష్టానం చెప్పినా ఆ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ ఆ పార్టీ శ్రేణులలోనే మొదలైంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడం లేదు. అంతకు ముందు ప్రతి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకున్న సీఎం ఇప్పుడు తెచ్చే పథకాలకు జగనన్న పేరు వచ్చేలా చూసుకుంటున్నారు., పట్టాల పంపిణీ నుండి పలు సంక్షేమ పథకాల వరకూ ఇప్పుడు జగన్ పేరే కనిపిస్తుంది.. వినిపిస్తున్నది. బహుశా తండ్రి లెగసీతో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు తన సొంత ఇమేజ్ ప్రజలపై ఉండేలా చూడాలనే ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడూ అదే క్రమంలోనే వైఎస్ఆర్ కి సంబంధించిన కార్యక్రమాలను కూడా సోసోగానే చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. అయినా ఈసారి వైసిపీ ఆ పని చేయలేదు.  ఒకవైపు అధిష్టానం ఈ వేడుకలపై ఫోకస్ పెట్టకపోగా.. ఆ పార్టీలో ఇతర సమస్యల కారణంగా నేతలు కూడా మొహం చాటేసినట్లు కనిపిస్తుంది. వైసీపీలో అంతర్గత కుమ్ములాట‌లు, ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేక లైట్ తీసుకున్న వాళ్ళు కొందరు, తనకు ఈసారి టికెట్ వస్తుందనే ఆశలేని నేతలు కొందరు.. ఇలా ఎవ‌రికివారే మౌనంగా ఉండిపోయారు. దీనికి తోడు మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న నెల్లూరు లాంటి జిల్లాలలో ఇప్పుడు ఆ కోటలు బద్దలైపోవడం.. ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా అసంతృప్తితో ఉండడం లాంటి కారణాలు కూడా  వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మమ అనిపించేయడానికి కారణంగా చెబుతున్నారు.  అయితే, అసలే ఎన్నికల సమయం కనుక కనీసం అధిష్టానం అయినా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉన్నా లైట్ తీసుకోవడం చూస్తుంటే దీని వెనక వాళ్ళ ఆలోచన మరేదైనా ఉందేమో అనుకోవాల్సి వస్తుంది.

మా నిధులు మీరెలా వాడేశారు.. జగన్‌పై కేంద్రం సీరియస్

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా ఆర్ధిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా తెచ్చిన అప్పులు పెరిగి ఇప్పుడు పెద్ద అనకొండలా మారిపోయాయి. రాష్ట్రంలో దెబ్బతిన్న అభివృద్ధి, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టకపోవడం, వైసీపీ నేతల తీరు కారణంగా పెట్టుబడులు పెట్టేవారు రాష్ట్రం వైపు చూడడమే మానేశారు. ఉన్న వాళ్ళలో కొందరు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేక పప్పు బెల్లం మాదిరి తలకి ఇంత చొప్పున చేసే పంపకాలు పెరిగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. మరో వైపు కరోనాతో దెబ్బతిన్న సామాన్య ప్రజల ఆర్ధిక స్థితిపై భారీగా ధరల పెంపు పిడుగు పడడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉన్న ఆదాయం కూడా దిగజారిపోయింది. దీంతో ఏపీ పరిస్థితి ఆర్ధికంగా అగమ్యగోచరంగా మారిపోయింది.  ఏపీలో గత ఏడాది కాలం నుండి నెలా నెలా జీతాలకు, పెన్షన్లకు కూడా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. అప్పులు చేయాల్సిన దుస్థితి. గత రెండేళ్లుగా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఒకటో తేదీన జీతం అందలేదు. కొందరైతే ఏ నెలకి ఆ నెల జీతం చూడడంపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు, బాండ్లు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని, పలు దేవాలయాల ఆదాయాన్ని కూడా తనఖా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా పరిమితికి మించి అప్పులు చేసింది. ఇవి చాలవని వివిధ కార్పొరేషన్ల నిధులు, కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా తన ప్రభుత్వాన్ని నడిపేందుకు వాడుకున్నారు. అలాగా ఇప్పుడు కేంద్రం ఒక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వగా.. జగన్ ప్రభుత్వం దాన్ని సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల‌ను తక్షణమే సంబంధిత ఖాతాలో జ‌మ చేసి ర‌సీదుల‌ను పంపించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యం ప్ర‌భుత్వంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.  కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించాల‌నే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఈ మధ్యనే అందుకోసం కేంద్రం నిధులకు కేటాయిస్తుంది. ఈ క్ర‌మంలో భాగంగా 90 శాతం నిధుల‌ను కేంద్రం ఇవ్వనుండగా 10 శాతం నిధుల‌ను రాష్ట్రాలు భ‌రించాలి. ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి, ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇస్తుండగా.. ఈ మధ్యనే పలు రాష్ట్రాలకు నిధులను జమ చేసింది. ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు మళ్లించింది. దీంతో కేంద్రం ఆగ్రహించింది.  కేంద్ర పథకానికి, పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన‌ నిధులపై సమాచారం లేకుండా మల్లింపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.  కనీసం జీవో కూడా లేకుండా రూ.639 కోట్ల‌ను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఆ నిధులను సింగిల్‌ నోడల్‌ ఖాతాకు జ‌మ చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారును ఆదేశించింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో ఒకసారి విడుదల చేసిన రూ.1879 కోట్లలో నుంచి రూ.639 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. నిజానికి ఈ పథకంలో భాగంగా రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా జమ చేయకపోవడం వలనే ఈ నిధులు అలా పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఇవ్వాల్సినని ఇవ్వకపోగా.. సమాచారం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా నిధులను మళ్లించడం కేంద్రానికి కోపం తెప్పించింది.

పొత్తులపై జనసేన నేతల నోటికి పవన్ తాళం

ఏపీ రాజకీయాలలో అత్యంత హైటెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం రానున్న ఎన్నికల్లో పొత్తులు. ఈ ఎన్నికలలో వైసీపీ ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా సింగల్ గానే పోటీ చేస్తుంది. రహస్య పొత్తులు ఏమైనా ఉంటే ఉండే అవకాశం ఉంటుంది కానీ అధికారంగా 175 మంది వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీజేపీ పయనం ఎటువైపు అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ, జనసేన మాత్రం టీడీపీతోనే అని తేల్చి చెప్పేసింది. ఏడాదిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ఓ మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో వారాహీ విజయయాత్రలో పవన్ ప్రసంగాలను బట్టి పొత్తు అంశంపై కొన్ని అపోహలు మొదలవగా.. దీనికి ముగింపు పలికేలా జనసేన నేతలకు  పవన్ స్పష్టత ఇచ్చారు. పవన్ వారాహీ యాత్రలో తనను సీఎంను చేయాలని కోరడం.. అభిమానులు సీఎం నినాదాలు, మీరు తలచుకుంటే సీఎం అవుతానని, మీరు తనని సీఎం చేయాలని మాట్లాడడం, పలుచోట్ల అభ్యర్థులకు టికెట్ల హామీ ఇవ్వడంతో పవన్ టీడీపీతో పొత్తుకు వెనక్కు తగ్గినట్లుగా ప్రచారం మొదలైంది. దీనికి తోడు కొందరు జనసేన నేతలు పలు టీవీ చానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో తమకు పొత్తు అవసరం లేదని.. ఈసారి ఎలాగైనా జనసేన అభ్యర్థులు గెలుస్తారని మాట్లాడంతో పొత్తు అంశం వెనక్కు వెళ్లినట్లుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా జనసేన ఈ తరహా పోస్టులు పెడుతుండడంతో టీడీపీ సానుభూతిపరులు వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రచారం మరింత ముదిరి టీడీపీ-జనసేనల మధ్య దూరం పెరగకముందే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే  పవన్ కళ్యాణ్ తొలిదశ వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా.. ఈ యాత్రకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మైలేజీ వచ్చింది. జనసేన నేతలు, పవన్ అభిమానులలో ఈ యాత్ర జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ వేడిలోనే పవన్ రెండో దశ వారాహి యాత్రకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే తాజాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పొత్తులపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇకపై మీడియా ముందు కానీ.. సోషల్ మీడియాలో కానీ జనసేన నేతలు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని పవన్ తేల్చి చెప్పారట. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దని కోరారట. అంతే కాదు,  పార్టీ నేతలు టీవీ చర్చల్లో కానీ, పార్టీ సమావేశాలలో కానీ ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడవద్దని.. ఒకవేళ అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు కూడా వెనకాడబోమని చెప్పారట. పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు తీసుకుంటానని, అదే పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటానో, ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరిన పవన్.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని.. లోతుగా అధ్యయనం చేశాకనే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ సంయమనం పాటించాలని చెప్పారట. అయితే, టీడీపీతో పొత్తు ఖరారు అయిన అంశమే కావడంతో దీనిపై స్పందించి అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా పవన్ ఈ హెచ్చరికలు జారీచేసినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీజేపీ అంశం తేలే వరకూ టీడీపీ, జనసేన పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఈ లోగా టీడీపీ-జనసేన మధ్య దూరం పెరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అందుకోసమే పవన్ పార్టీ నేతల నోళ్ళకి తాళం వేసినట్లు భావించాల్సి వస్తుంది.

రణరంగం తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి vs కేతిరెడ్డి

తాడిపత్రిలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు బజారుకెక్కి బూతులతో విరుచుకుపడే స్థాయికి చేరింది. ఏడాది క్రితం వేసిన చీనీ తోట మూడేళ్ళకు కాపుకు రావాల్సి ఉండగా   ఏడాదికే కాపు రాక నష్టపోయినట్లుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ. 13.89 లక్షల పంట బీమా కొట్టేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు చీనీ తోటలను పరిశీలించేందుకు కేతిరెడ్డి తోటకు వెళ్తానంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో జేసీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.  ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ వచ్చిందని.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని.. కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాదు పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టి చూడాలని సవాల్ విసిరారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష.. ఆ పదవే ఇప్పుడు లేకపోతే జేసీని ఇంటిలో నుంచి బయటకి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పేవాడినని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వాడిని ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు. కాగా, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మొదలైన ఆరోపణల పర్వం తాడిపత్రి పట్టణమంతా వ్యాపించింది. టీడీపీ, వైసీపీ వర్గాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో నియోజకవర్గంలోని మిగతా టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు చినీ తోటకి కాపలా ఉన్నారు. దీంతో ఏ నిముషానికి ఏం జరుగుతుందో అనేలా వాతావరణం మారిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఏది ఏమైనా జేసీ వర్గం చీనీ తోటకి వెళ్లి సందర్శించి అసలు వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలని చూస్తుంటే ఎమ్మెల్యే వర్గం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. అయితే, నిజానికి జేసీ ఆరోపించిన దానిలో నిజం లేకపోతే ఎమ్మెల్యే కేతిరెడ్డి భయపడాల్సిన పనిలేదు. మీడియాతో సహా ఓ హార్టికల్చర్ అధికారిని తీసుకుని చీనీ తోటకి వెళ్లి చూసుకుంటే అసలు నిజం తేలిపోతుంది. నిజంగానే పంట పెట్టి మూడేళ్లయినా కాపు లేక నష్టపోయి ఉంటే ఆరోపణలు చేసిన జేసీని ఎండగట్టే అవకాశం ఉంటుంది. కానీ, అదేమీ లేకుండా అసలు తోటకి వెళ్లే వారిని అడ్డుకోవడం.. ఇలా వాడు వీడు అంటూ చెప్పుతో కొడతా అంటూ బూతులు లంకించుకోవడం చూస్తుంటే జేసీ ఆరోపణలే నిజమా అన్న భావన కలుగుతున్నది. ఓ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడంతో మరోసారి వైసీపీ నైజం ఇదేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మంత్రుల దగ్గర నుండి మహిళా ఎమ్మల్యేల వరకూ ఈ బూతు పురాణంలో చెడ్డపేరు తెచ్చుకోగా కేతిరెడ్డి వారి జాబితాలోనే చేరి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నారు. ఇక  తాడిపత్రిలో ఈ హీటెక్కిన రాజకీయం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

పవన్ కోరిన రూట్ మ్యాప్ పురందేశ్వరి ఇస్తారా?

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు అధికార పార్టీ మరోసారి అధికారం దక్కిచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే..  ప్రజలలో  పెరిగిన జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా  మార్చుకునేందుకు  ప్రతిపక్షాలు ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పాదయాత్ర, బస్సు యాత్ర మొదలు పెట్టగా.. బీజేపీ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీంతో ఎన్నికల రోహిణీకార్తె వేడిని మించిపోయింది.  అయితే, ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే అంశం ఏదైనా ఉందంటే అది పొత్తులే. ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకూ రాజకీయం ఒకలా ఉంటే ఒక్కసారి పొత్తులపై స్పష్టత వస్తే  ఆ తర్వాత ఉండే మజానే వేరు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా.. సింగల్ గానే పోటీకి దిగుతారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే  బీజేపీ-జనసేన అధికారికంగానే పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో ఉన్నా ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలూ కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదు. దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇప్పటంలో జనసేన సమావేశం.. ఆ తర్వాత ప్రభుత్వం కక్షసాధింపుతో ప్రజల ఇళ్లను ధ్వంసం చేయడం.. మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడే ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేపట్టడం అందరూ చూసిందే. కాగా  అప్పుడు అక్కడ జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తుందని ఎదురుచూస్తున్నానని.. అది తనకు ఇస్తే ఏపీలో వైసీపీని గద్దె దించుతామని  స్పష్టం చేశారు. దానికి ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు బీజేపీ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అని అది ఎపుడో పవన్ కి ఇచ్చేశామని కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా సోము వీర్రాజు కౌంటర్ అయితే ఇచ్చారు కానీ పవన్ అడిగిన రోడ్ మ్యాప్ మాత్రం  ఇవ్వలేదు.  ఇవ్వకుండానే ఆయన బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇ  మాజీ అయిపోయారు. ఇప్పుడు తాజాగా పురంధేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను బీజేపీ అధిష్ఠానం అప్పగించింది.  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, రానున్న ఎన్నికలలో పొత్తులపై కూడా చర్చించారని అంటున్నారు. ఇక  ఆమె ఢిల్లీ నుంచి విజయవాడ  వచ్చి ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్ కనుక ఎలాగూ ఆ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు ఆమెకి ఘనస్వాగతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అధ్యక్షురాలిగా ఆమె తన వర్గాన్ని కూడా సిద్ధం చేసుకోవడం కామనే. ఎలాగూ అధిష్టానం చెప్పే పంపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె కార్యకలాపాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే  ఇప్పుడు పవన్ కి పురందేశ్వరి రోడ్ మ్యాప్ ఇస్తారా? ఈ రోడ్ మ్యాప్ బీజేపీకి నచ్చినట్లుగా ఉంటుందా లేక పవన్ కోరుకుంటున్నట్లుగా ఉంటుందా?  అన్నదే ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మొదలైన దగ్గర నుండి ఎటు చూసినా దారులు వేరుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు టీడీపీ పేరు లేకుండా ఇదే మాట   ప్రకటించేశారు.  బీజేపీ మాత్రం ఆ విషయంలో  ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించిన చందంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇంతకుముందున్న అధ్యక్షుడైతే   టీడీపీని ప్రధాన శత్రువుగా చూసే వారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారు? సోము వీర్రాజు టైంలో జనసేనతో ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు తొలగిపోతుందా?.. జనసేన బీజేపీ కలసి తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయా అన్నది చూడాలి.

కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థల దృష్టి .. ప్రధాని

నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం అందరూ ఊహించినట్లుగానే సాగింది. బీఆర్ఎస్ తో రహస్య మైత్రి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోడీ తన ప్రసంగంలో బీఆర్ఎస్ అవినీతిపై విమర్శల వర్షం కురిపించారు. తద్వారా ఆ విమర్శలన్నీ అవాస్తవాలని చెప్పడానికి ప్రయత్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని దనుమాడారు. ఆయన కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని చెప్పారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లను బీజేపీ తుడిచిపెట్టేయడం ఖాయమని జోస్యం చెప్పారు. జనసంఘ్ కాలం నుంచే వరంగల్ బీజేపీకి కంచుకోట అని చెప్పిన మోడీ.. దేశ వ్యాప్తంగా బీజేపీకి రెండు సీట్లు ఉన్న సమయంలో వాటిలో ఒకటి గెలిచింది హన్మకొండ నుంచే అని గుర్తు చేశారు. కేంద్రంలోని తన సర్కార్ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నామని చెప్పిన ప్రధాని.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని స్పస్టం చేశారు. గతంత కేంద్రం తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోందనీ, అయితే రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు నాలుగే నలుగన్న ఆయన వాటిలో ఒకటి పొద్దున్న  నుంచి సాయంత్రం వరకూ మోడీని తిట్టడం, మరోటి కుటుంబం పార్టీని పెంచి పోషించడమేనని మోడీ అన్నారు. ఇక మూడోది తెలంగాణ ఆర్ధిక సుస్థిరతను నాశనం చేయడం చివరిగా నాలుగోది రాష్ట్రాన్ని అవినీతి ఊబిలో కూరుకుపోయేలా చేయడమని వివరించారు. కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ అని విమర్శించిన మోడీ..  తెలంగాణలో అవినీతి  ఆరోపణలు ఒక్క ప్రాజెక్టైనా ఉందా అని ప్రశ్నించారు. సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరుగుతాయనీ, అయితే  ఇప్పుడు  తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు అవినీతి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.    ఏ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏర్పడిందో.. ఆ ప్రయోజనాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధించకుండా చేసిందని మోడీ విమర్శించారు.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.   

టీడీపీ-బీజేపీ పొత్తు పొడిచేనా?

ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని చూస్తున్నది. నిన్న మొన్నటి వరకూ కేంద్రంలో మూడో సారి అధికారంపై బీజేపీలో ఉన్న ధీమా  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తుగా ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా అవునని చెప్పలేదు.. లేదని చెప్పలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది. అదలా ఉండగానే  మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని చేశారు. దీంతో ఈ పొత్తు కుదురుతుందా లేదా అని అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పురందేశ్వరికి టీడీపీతో కానీ.. ఆ పార్టీ అధ్యక్షుడితో కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవన్నది తెలిసిందే. అందుకే ఆమె తెలుగుదేశం ను వీడి కాంగ్రెస ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో టీడీపీతో పొత్తు ఆశలు ఉన్నట్లయితే ఆమెని పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యేవారా  అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు అనే అంశాన్ని పక్కన పెట్టేందుకే పురందేశ్వరిని ఫోకస్ లోకి తీసుకొచ్చారని.. ఇటు జనసేనకు సైతం టీడీపీతో పొత్తు లేదనే సంకేతాలను ఇచ్చేందుకే పురందేశ్వరిని ఎంపిక చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే నిజమై టీడీపీ-బీజేపీ పొత్తు లేకపోతే ఎన్టీఆర్ వారసురాలు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఢీ కొనాల్సి వస్తుంది. అందుకు పురందేశ్వరి సిద్ధమయ్యే పార్టీ పగ్గాలు అందుకుంటే రాష్ట్రంలో ఫ్యామిలీ పొలిటికల్ వార్ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ పొత్తుకి సిద్ధమైతే పురందేశ్వరి, చంద్రబాబు పలు చోట్ల వేదికలు  పంచుకోవాలి.. కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కనుక ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా అనిపిస్తున్నది. అయితే  దగ్గుబాటి ,నారా కుటుంబాల మధ్య అప్పుడు ఉన్నంత వైరం ఇప్పుడు లేదు. కాలంతో పాటు ఈ కుటుంబాల మధ్య దూరం కూడా తగ్గింది. ఆ మధ్య ఓ కుటుంబ వేడుకలో రెండు కుటుంబాలు కలిసి మెలిసి మెలిగిన ఫోటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కనుక రాజకీయం రాజకీయమే.. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కనుక ఏమైనా జరగవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది.  మరోవైపు బీజేపీ పెద్దలు జగన్ మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలను వదులుకోవడం లేదు. నిజంగా టీడీపీతో పొత్తు ఆశలు ఉంటే బీజేపీ ఇప్పటికే వైసీపీతో రహస్య బంధాన్ని తెగదెంపులు చేసుకునేది. కానీ, ఇప్పటికీ అదే సీక్రెట్ లైన్ మైంటైన్ చేసింది. ఈ మధ్యనే సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ ఏమో తనకి సహకరిస్తే రాబోయే తన ప్రభుత్వంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం కల్పిస్తానని ఆఫర్లు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏపీలో పొత్తు ఆలోచన చేస్తోందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే బీజేపీ నేతృత్వంలో ఈ నెల 18న  ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది.  ఈ సమావేశానికి బీజేపీ తన పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నది. అందులో భాగంగానే టీడీపీకి సైతం ఆహ్వానం పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ ఆహ్వానం అందిన విషయాన్ని టీడీపీ ఇంకా ధృవీకరించలేదు. ఏది ఏమైనా ఈ సమావేశం తర్వాత కానీ ఏపీలో బీజేపీ-టీడీపీల అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలియదు.

జగనన్న సురక్ష.. ఎందుకీ శిక్ష

ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా ఆదరాబాదరా కార్యక్రమాలు, పథకాలను ప్రకటించేయడం.. క్షేత్ర స్థాయిలో వాటి అమలును పట్టించుకోకపోవడం జగన్ సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. రాబోయే ఎన్నికలే తమ ప్రభుత్వానికి రక్షణ కవచాలుగా  ఉపయోగపడతాయన్న భావనతో ఏపీ సర్కార్ తీసుకువచ్చిన  జగనన్న సురక్ష కార్యక్రమం కూడా అదే కోవలోకి చేరిపోయింది. ఆ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన సచివాలయ ఉద్యోగులే ఏమిటీ శిక్ష అని విసుగు చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగ వ్యవస్థ జగన్ మానస పుత్రిక అన్న సంగతి విదితమే. ఆ  గ్రామ, వార్డు సచివాలయ  ఉద్యోగులే  జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల అనాసక్తిగా ఉన్నారు. అది తమకొక శిక్షగా భావిస్తున్నారు.   ఈ కార్యక్రమం కింద అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తామన్న ప్రభుత్వం అయితే ఆర్భాటంగా ప్రకటించేసింది. అయితే  క్షేత్రస్థాయిలో  మాత్రం ఈ పథకం పేరుతో  స్టేషనరీ దుర్వినియోగం తప్ప మరేం జరగడం లేదని జనం విమర్శిస్తున్నారు.  ఎవరికి ఏ సర్టిఫికెట్ అవసరమో అది మాత్రమే.. ఆ అవసరం అయిన వారికి ఉచితంగా అందజేయాలి. అయితే క్షేత్ర స్థాయిలో  ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏమిటి? అన్నది ఎవరికీ అర్ధం కాకుండా జరుగుతోంది. వాలంటీర్లు  ఇష్టారీతిగా దరఖాస్తులను తెచ్చి సచివాలయ ఉద్యోగులకు అందజేయడం.. క్షేత్ర స్థాయి పరిశీలనలో అవన్నీ నకిలీవనో, అవసరం లేకపోయినా ఏదో పని చేస్తున్నామని అనిపించుకోవడానికి తెచ్చిన దరఖాస్తులుగా తేలడం.. పై అధికారులు మాత్రం సచివాలయ ఉద్యోగులపై ఇదేంటి? అదేంటి? ఇంకా దరఖాస్తుల మేరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదా అంటూ ఒత్తిడి తేవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో జగనన్న సురక్ష కార్యక్రమం కాదు కానీ ఇదే మాకో శిక్షగా మారిపోయిందని సచివాలయ సిబ్బంది తలలు కొట్టుకుంటున్నారు.   వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిద్దామన్నా వారు వినే పరిస్థితిలో లేకుండా ఎంత సేపూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావడమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  జగనన్న సురక్ష పథకం పేర క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తంతును పరిశీలింది.. అవసరమైన వారి నుంచే వాలంటీర్లు దరఖాస్తులను స్వీకరించి తమకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. 

పురంధేశ్వరి కాపాడే రాష్ట్ర ప్రయోజనాలేమిటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆ  తరువాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను  కాపాడతానంటూ దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్ చేశారు. ఆ ట్వీట్ పై ఏపీలో విస్తృత చర్చ మొదలైంది. అటు సామాజిక మాధ్యమంలోనూ.. ఇటు ప్రింట్, ఎలక్ట్రినిక్ మీడియాలోనూ కూడా పురందేశ్వరి కాపాడే రాష్ట్ర ప్రయోజనాలేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కానీ.. ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కానీ...  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు  ఏం చేశారు? ఏం సాధించారన్నది అందరికీ తెలిసిందే. వారి వల్ల రాష్ట్రానికి వీసమెత్తు ప్రయోజనం చేకూరలేదన్నది ఆంధ్రుల భావన. అలాంటి వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి చేపట్టనుండడం... రాష్ట్రప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తాననడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014లోనే అటు రాష్ట్ర విభజన, ఇటు ఎన్నికలు కాస్తా అటు ఇటుగా జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టింది. నవ్యంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పాటు కోసం అన్వేషణ.. ఆ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తూళ్లురు ప్రాంతాన్ని ఎంపిక చేసి.. అక్కడి 29 గ్రామాల రైతులను ఒప్పించడం.. భూమిని సమీకరించడం.. మరోవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకోవడం చకచకా జరిగి పోయాయి.  అంతలోనే విభజన బిల్లులో ముందుగా స్పష్టం చేసిన అంశాల్లో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అలాగే పలు అంశాల్లో మోదీ ప్రభుత్వం తిరకాసు పెట్టింది. వాటికి సైతం చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకొని.. ముందుకు సాగుతోన్నారు. అలాంటి తరుణంలో 2019 ఎన్నికలు  వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు.. వైసీపీ అధినేత  జగన్‌కు పట్టం కట్టారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొన్ని రోజులకే.. అధికార వీకేంద్రీకరణ కోసమంటూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకీ తీసుకొచ్చారు.  దీంతో రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన అలజడి మొదలైంది. ఆ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కి.. ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం.. తన పట్టు వీడలేదు. అలా జగనన్న నాలుగేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని అడిగినా.. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అని అడిగినా.. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్లుగా మూడు రాజధానులు  సమాధానంతో పరిపుచ్చారు. సరే.. కార్యనిర్వాహక రాజధాని విశాఖ ,  న్యాయ రాజధాని కర్నూలులో ఎప్పటి నుంచి పనులు ప్రారంభమవుతాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.   మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షరాలిగా  పురందేశ్వరి బాధ్యతలు చేపట్టనున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని అంటున్నారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడటమంటే..  నవ్యంధ్రకు ఏకైక రాజధాని అమరావతి  సాధిస్తారా? అలాగే విభజన బిల్లులో స్పష్టం చేసిన అన్ని అంశాలు అమలు అయ్యే విధంగా.. అవసరమైతే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై ఒత్తిడి తీసుకు వస్తారా? అలా రాష్ట్రాభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. పురందేశ్వరీ తన వంతు ప్రయత్నాలు చేసి నవ్యంధ్ర రాష్ట్రాభివృద్ధిలో తనదైన శైలిలో బలమైన  ముద్రలు వేస్తారా? అనే ప్రశ్నలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

స్పీడ్ న్యూస్ 1

1.టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అల్లూరులో లోకేశ్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 2.ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీయేతర రాష్ట్రాలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. శుక్రవారం ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ లలో పర్యటించిన ప్రధాని.. శనివారం ఉదయం తెలంగాణలోని వరంగల్ కు చేరుకున్నారు. ప్రముఖ భధ్రకాళీ దేవాలయంలో ప్రధాని ప్రార్థనలు చేశారు.  3.రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రోజు నుంచి సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.  4.స్టార్ కపుల్ నయన తార - విఘ్నేశ్ శివన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్   స్వంత  బాబాయిలు నయనతార పేరును కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 7.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మిపై కొందరు మహిళలు తాజాగా దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో అయిదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి ఆమెపై దాడికి దిగారు. 8.సామాన్యుల కష్టాలను తెలుసుకునేందుకు జనంలోకి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి రైతులను కలుసుకున్నారు. పొలంలో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. 9.పంచాయతీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్‌లో మరోమారు హింస చెలరేగింది. నలుగురు టీఎంసీ కార్యకర్తలు నిన్న దారుణ హత్యకు గురయ్యారు. 10.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం.. బాబు ట్వీట్

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?  రోజుకో ఘోరం, పూటకో దారుణం జరుగుతోంది. వాటి వెనుక అధికార పార్టీ లేదా ప్రభుత్వం  ఉంటోంది.  అంటే  రాష్ట్రంలో ప్రభుత్వమే టెర్రర్ సృష్టిస్తోంది. రోడ్డు కావాలని అడిగిన కానిస్టుబుల్ సస్పెండ్ అవుతాడు. పెన్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన మహిళపై కేసు పెడతారు. బకాయిలు చెల్లించమని అడిగిన వ్యాపారులపై వైసీపీ మూకలు దాడులు చేస్తారు. ఈ పరిస్థితుల్లో జనం ఏం చేయాలి? ఏం కావలి. రాష్ట్రం నుంచి పారిపోతేనే బెటర్ అనుకునే పరిస్థితులలోకి జనాన్ని నెట్టేసింది జగన్ సైకో పాలనకు చరమగీతం పాడాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పురనరుద్ధరణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి. ఇదీ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాదులు, సామాన్య ప్రజానీకం ముక్త కంఠంతో చెబుతున్న మాట. అవే మాటలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు.   బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడి..బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు.   రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి కేసు పెట్టారు.  సస్పెండ్ చేశారు.  అంతా నా ఇష్టం అడిగేదెవడురా అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోందని చంద్రబాబు ఆ ట్వీట్ లో మండిపడ్డారు. అయితే ఈ జగన్ అరాచక పాలన మరెంతో కాలం సాగదనీ, శిశుపాలుడి వంద తప్పులులా జగన్ పాపాలు కూడా పండాయనీ, వచ్చే ఎన్నికలలో జనం గట్టి గుణపాఠం చెప్పడం తథ్యమనీ చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసులో స్వయంగా జగన్  సంబధీకులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, అవినాష్ రెడ్డిని కాపాడేందుకు స్వయంగా సీఎం తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో ఆయనకు సంబంధమ వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? వంటి వాటినన్నిటినీ పక్కన పెడితే అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా?  అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇందుకు వైసీపీ గూండాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   రాష్ట్రంలో ఎక్కడ ఏ దారుణం జరగినా, దళితులపై మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వాటి వెనుక ఉంటున్నది మాత్రం వైసీపీ వారేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ టెర్రరిజానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ చంద్రబాబు తాజాగా చేసిన ట్వీట్ లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మోడీ తెలంగాణ పర్యటన.. బీజేపీలో కనిపించని జోష్!

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీలో ఎలాంటి హడావుడీ కనిపించడం లేదు. నిన్న మొన్నటి దాకా ఎన్నికలు జరగడమే తరువాయి.. అధికారంలోకి వచ్చేది మేమో అన్న స్థాయిలో హంగామా చేసిన తెలంగాణ బీజేపీ నేతలలో ఒక్క సారిగా నిశ్శబ్దం ఆవరించింది. కొత్తగా పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమితులైన ఈటల, మాజీ అధ్యక్షుడు బండి ఏదో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మోడీ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నారే కానీ పార్టీ క్యాడర్ లో మాత్రం ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదు. కర్నాటక ఎన్నికల ఫలితానికి తోడు.. తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన పేరుతో హైకమాండ్ ఇటీవల చేసిన మార్పులు తోడు కావడంతో బీజేపీ క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. మొదటి నుంచీ పార్టీలోనే కొనసాగుతూ.. రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు, ఉత్సాహం తీసుకువచ్చేలా వరుస కార్యక్రమాలతో బీఆర్ఎస్ ను బెంబేలెత్తించిన బండికి అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికి.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన ఈటలకు ప్రమోషన్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అలాగే గతంలో రెండు సార్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసినా పార్టీ ఎదుగుదల విషయంలో పెద్దగా ప్రభావం చూపని కిషన్ రెడ్డికి మళ్లీ పార్టీ పగ్గాలు ఇవ్వడంపై కార్యకర్తలలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.   అన్నిటికీ మించి బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందనడానికి ఈ మార్పులు దోహదం చేశాయన్న భావన పార్టీలో అత్యధికుల్లో ఏర్పడిందని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనూ, ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తరచూ విమర్శలతో విరుచుకుపడి.. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు దోహదపడిన బండి సంజయ్ ను అర్ధంతరంగా తప్పించడం పట్ల మెజారిటీ కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది. అలాగే లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె కవితకు ఆయాచితంగా దక్కుతున్న ఊరటపైనా బీజేపీ శ్రేణుల్లో పై స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయంటున్నారు. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం కేసులో  కవిత వినా అందరూ అరెస్టయ్యారు. కవితను ఈడీ, సీబీఐలు విచారించాయి. ఈడీ అయితే ఏకంగా ఆమె ఫోన్లనూ స్వాధీనం చేసుకుంది. చార్జిషీట్లలో ఆమె పేరూ ప్రస్తావించింది. అంతే అక్కడితో కవిత విషయంలో ఈడీ, సీబీఐలు  సైలెంట్ అయిపోయాయి. మరో వైపు ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లో మగ్గుతున్నారు.  ఆ కారణంగానే బీఆర్ఎస్, బీజేపీల మధ్య లాలూచీ ఉందా అన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చి వరంగల్ లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సందర్భంగా ఆయన వరంగల్ సభలో బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగే అవకాశాలున్నాయి. ఆయన ఎంత ఘాటుగా బీఆర్ఎస్ పైనా, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలు గుప్పించినా ప్రజలు మాత్రం విశ్వసించే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.