కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థల దృష్టి .. ప్రధాని
posted on Jul 8, 2023 @ 2:38PM
నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం అందరూ ఊహించినట్లుగానే సాగింది. బీఆర్ఎస్ తో రహస్య మైత్రి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోడీ తన ప్రసంగంలో బీఆర్ఎస్ అవినీతిపై విమర్శల వర్షం కురిపించారు. తద్వారా ఆ విమర్శలన్నీ అవాస్తవాలని చెప్పడానికి ప్రయత్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని దనుమాడారు. ఆయన కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని చెప్పారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లను బీజేపీ తుడిచిపెట్టేయడం ఖాయమని జోస్యం చెప్పారు. జనసంఘ్ కాలం నుంచే వరంగల్ బీజేపీకి కంచుకోట అని చెప్పిన మోడీ.. దేశ వ్యాప్తంగా బీజేపీకి రెండు సీట్లు ఉన్న సమయంలో వాటిలో ఒకటి గెలిచింది హన్మకొండ నుంచే అని గుర్తు చేశారు. కేంద్రంలోని తన సర్కార్ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నామని చెప్పిన ప్రధాని.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని స్పస్టం చేశారు. గతంత కేంద్రం తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోందనీ, అయితే రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు నాలుగే నలుగన్న ఆయన వాటిలో ఒకటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకూ మోడీని తిట్టడం, మరోటి కుటుంబం పార్టీని పెంచి పోషించడమేనని మోడీ అన్నారు.
ఇక మూడోది తెలంగాణ ఆర్ధిక సుస్థిరతను నాశనం చేయడం చివరిగా నాలుగోది రాష్ట్రాన్ని అవినీతి ఊబిలో కూరుకుపోయేలా చేయడమని వివరించారు. కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ అని విమర్శించిన మోడీ.. తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఒక్క ప్రాజెక్టైనా ఉందా అని ప్రశ్నించారు. సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరుగుతాయనీ, అయితే ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు అవినీతి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
ఏ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏర్పడిందో.. ఆ ప్రయోజనాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధించకుండా చేసిందని మోడీ విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.