మంత్రి రోజా.. తిట్ల పురాణంలో కొత్త పుంతలు

రోజా..  తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.  గతంలో వెండితెర మీద హీరోయిన్‌గా వెలుగు వెలిగినా.. నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద  జబర్దస్త్ వంటి  కామెడీ షోల్లో న్యాయ నిర్ణేతగా కమేడియన్లకు మార్కులేసినా..   రియాల్టీ షోల్లో   లేడీ పెదరాయుడిలా తీర్పులు చెప్పినా.. మంత్రి పదవి వచ్చిన తరువాత  వాటన్నింటికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేశారు.   జగన్ తన తొలి కేబినెట్ లో రోజాకు హ్యాండిచ్చి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా మంత్రి రోజాకు జగన్ తొలి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదు. దానికి రోజా అలిగినా గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనంగానే ఉన్నారు. ఆ తరువాత ఎన్నాళ్లో వేచిన ఉదయం ఎదురైన చందంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచీ ఆమె కామెడీ షోలకు స్వస్తి చెప్పారు. అయితే పారే ఏరు.. పాడే నోరు ఊరుకోవన్నట్లుగా.. కామెడీ షోలలోనూ, రియాల్టీ షోలలోనూ ప్రసంగాల్లాంటి మాటలకు అలవాటుపడిన  రోజా తన వాగ్ధాటిని విపక్షాలపై ప్రయోగించడం ప్రారంభించారు.  జగన్ పై విపక్షాలకు చెందిన నేతలు చిన్న పాటి విమర్శ చేసినా రెచ్చిపోతారు. నోటికి హద్దూపద్దూ లేదన్నట్లుగా విమర్శలు గుప్పించేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె పలుమార్లు పరిధి మీరారు. మాట తూలారు కూడా. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశంసించడాన్ని రోజా తప్పుపడుతూ రజనీకాంత్ పై చేసిన విమర్శలు సంచలనం సృష్టించడమే కాకుండా, ఏపీ, తెలంగాణలలో ఆమెపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆమె నోటి దురుసు, దుందుడుకు వైఖరి కారణంగా సొంత జిల్లాలోనే, సొంత పార్టీలోనే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురౌతున్నది. సంయమనంతో సొంత పార్టీలోని వ్యతిరేకతను తగ్గిచుకునే ప్రయత్నం చేయడానికి బదులు.. జగన్ కు మద్దతుగా ఆయనపై ఈగకూడా వాలనీయని విధంగా విపక్షాలపైనా, జగన్ విమర్శకులపైనా నోరెట్టుకు పడిపోతే తన పదవికి, వచ్చే ఎన్నికలలో టికెట్టుకు ఢోకా ఉండదన్న భావనతో రోజా ముందుకు సాగుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.   తాజాగా ఆమె జనసేనాని పవన్ కల్యాణ్ పై తనదైన ప్రత్యేక శైలిలో విమర్శలు చేశారు.  పవన్ కల్యాణ్  సీఎం జగన్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడమే రోజా విమర్శలకు కారణం.   వాలంటీర్ల వ్యవస్థపైనా, జగన్ పైనా పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయ విమర్శలకు రాజకీయంగా సమాధానాలు దొరకక వైసీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో వారు దూషణలు, బూతుల పర్వానికి తెరలేపుతున్నారు. మంత్రి రోజా కూడా అదే రీతిలో పవన్ పై విరుచుకుపడ్డారు. విషయం లేకుండా పవన్ ఎదురుగా వస్తే లాగిపెట్టి కొట్టాలనుందనీ, వాలంటీర్లపై విమర్శలు చేస్తున్న పవన్ క కల్యాణ్  కు గతంలో జన్మభూమి కమిటీలపై నోరెత్తలేదెందుకు అని ప్రశ్నిస్తూ అప్పుడేమైనా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా అంటూ, జగన్ సంస్కారం గురించి పవన్ వ్యాఖ్యానిస్తుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుందంటూ మంత్రి స్థాయికి తగని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె తాను కూడా  ఒకప్పుడు నటినేనన్న సంగతి  మరిచి వ్యాఖ్యలు చేశారు. పవన్ పై వ్యాఖ్యలనే కాకుండా మరో నటి సన్నిలియోన్ ను చులకన, పలుచన చేసేలా రోజా చేసిన వ్యాఖ్యలపై కూడా సర్వత్రా విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అయినా రోజా మంత్రిగా కలెక్షన్ క్వీన్ అనే బిరుదును సంపాదించుకున్నారే తప్ప.. రాష్ట్రానికి, రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి ఆమె చేసిందేమిటన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.  ఇంతకీ మంత్రి రోజాగారు పవన్ పై ఈ విమర్శలు ఏదో పార్టీ కార్యక్రమంలోనో సభలోనో చేసినవి కాదు. తన శాఖకు సంబంధించిన ఓ సమీక్షా సమావేశంలో. సమీక్షా సమావేశంలో అధికారులతో తన శాఖకు సంబంధించిన విషయాలను చర్చించాలి కానీ.. ఈ రాజకీయ విమర్శలేమిటన్న ప్రశ్నకు సమాధానం సులువుగానే దొరికేస్తున్నది. మంత్రి హోదాలో రోజా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే అధికారులెవరూ హాజరు కాలేదు. దీంతో ఈ సమావేశం వేదికగానే మీడియా  ముందు రోజా పవన్ కల్యాణ్ వేదికగా విమర్శలు గుప్పించేశారు. అధికారులు సమావేశానికి గైర్హాజర్ కావడాన్ని లైట్ గా తీసుకుని నామ్ కే వాస్తేగా సమీక్షకు డుమ్మా కొట్టిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సిఫారసు చేసి చేతులు దులిపేసుకున్నారు. మంత్రిగా సమీక్షలు చేయడం కంటే   ఫైర్ బ్రాండ్ ముద్ర కాపాడుకోవడం వల్లనే తన రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉందన్నది రోజాకు బాగానే తెలుసునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

వాలంటీర్లకు మద్దతు కూడగడుతున్న జగన్ సర్కార్

ఏపీలో ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర రెండవ విడతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలపై తూర్పార పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుండి కూడా రివర్స్ కౌంటర్లు వస్తున్నాయి. రెండవ విడత తొలిరోజు యాత్రలో భాగంగా ఏలూరులో గత ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా రేపాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు రాష్ట్రంలో మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపారు. వాలంటీర్లు ఘాటుగా స్పందించినా మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గని పవన్.. కోడిపిల్లలను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నట్లు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని, కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్తుందని మరో కొత్త ఆరోపణను తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని, ఇక్కడ 700 మంది ఉద్యోగులున్నట్లు పవన్ చెప్పారు. నానక్ రామ్ గూడలోని సంస్థలో ఏపీ డేటా ఎందుకు పెట్టారని.. ఏపీ ప్రజల డేటాను ఆ సంస్థలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్‌ క్రాస్‌ సంస్థకు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ అధిపతిగా ఉన్నారని.. మరి సీఎం జగన్‌ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. జగనన్నే నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చారు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో కొందరు వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు.  అయితే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వలంటీర్లకు మద్దతు కూడగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను దైవాంశ సంభూతులుగా పేర్కొంటూ కొందరు వైసీపీ నేతలు వారికి సన్మానాలు చేయగా.. ఒక వైసీపీ ఎమ్మెల్యే అయితే వాలంటీర్ కాళ్ళు కడిగి పవన్ కళ్యాణ్ తరపున క్షమాపణలు కోరారు. కాగా, ఇప్పుడు వాలంటీర్లకు ప్రజల మద్దతు కోరుతూ వివిధ పథకాలలో లబ్ది పొందిన వారికి వాయిస్ కాల్స్ చేస్తున్నారు. రకరకాల నంబర్ల నుండి ఐవీఆర్ కాల్స్ చేస్తూ ప్రజలందరూ పవన్ వ్యాఖ్యలను తీవ్రం ఖండిస్తూ వాలంటీర్లకు అండగా నిలబడాలని కోరుతున్నారు. వాలంటీర్లు అవ్వా తాతలను ఉదయాన్నే నిద్రలేపి పెన్షన్ ఇస్తున్నారని, ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనే వరకు అండగా నిలబడదామని, వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పేవరకు వారి పోరాటానికి మద్దతుగా ఉందామని కాల్స్ ద్వారా కోరుతున్నారు. మరి ఈ కాల్స్ కు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

బాబాయికి శఠగోపం

టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఇకపై ఉత్తరాంద్ర జిల్లాల పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలకు మాత్రమే పరిమితం చేయాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వైసీపీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి బాబాయిని తప్పించాలని అబ్బాయి వైయస్ జగన్  భావిస్తున్నారని చెబుతున్నారు.  అదీకాక ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవిని.. ఒకసారి పొడిగించారని.. ఈ సారి ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.  కాగా వచ్చే నెల   12వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్  పదవీకాలం ముగియనుంది. మరో వైపు అసెంబ్లీ,సార్వత్రిక ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుందని... అంతే కాకుండా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారని.. దీంతో  వైసీపీ అధికారంలో ఉన్నా.. పార్టీ  ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి  వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లో ఈ ఎన్నికలు జరిగినా కూడా.. ఫలితం మాత్రం ప్రతిపక్షానికి అనుకూలంగా రావడంతో..   సీఎం జగన్ అండ్ కో  తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.   ఇక విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు.. తాజాగా తన పదవికే కాదు.. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి.. ఫ్యాన్ పార్టీపై తనలో రగులుతోన్న అసంతృప్తిని ప్రెస్‌మీట్ పెట్టీ మరి వెళ్లగక్కారు. ఉత్తరాంధ్రలో  ఇటువంటి అసంతృప్తి జీవులు చాలా మందే ఉన్నారని.. వారందరినీ ముందుగానే కట్టడి చేసే బాధ్యత బాబాయి వైవీ సుబ్బారెడ్డి భుజస్కందాలపై సీఎం జగన్ ఉంచనున్నట్లు తెలుస్తోంది.    మరో వైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిగిలిన రాజకీయ పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడుతో పాటు కిమిడి నాగార్జున సైతం ఉత్తరాంధ్రలో సైకిల్ పార్టీని సూపర్ స్పీడ్‌తో సవారీ చేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  ఇంకో వైపు బీజేపీ, జనసేన   సైతం ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృషి సారించాయి. అటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని విజయ పథంలో నడిపించేందుకు వైవీ సుబ్బారెడ్డిని సీఎం జగన్ సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే గత ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని.. ఆ క్రమంలో పార్టీ గెలుపులో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తూ.. పక్కా ప్రణాళిక బద్దంగా పావులు కదిపారనే ఓ టాక్ అయితే  వైవసీపీలో  నేటికి హల్‌చల్ చేస్తోందని... అయితే జగన్  అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని వైయస్ జగన్ నియమించారు.  అయితే విజయసాయిరెడ్డిలాగే వైవీ సుబ్బారెడ్డి కూడా చాలా పకడ్బందీ ప్రణాళికలతో.. ముందుకు సాగి రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్యాన్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తారా? లేకుంటే పార్టీని  ముంచుతారా? అనే ఓ సందేహం సైతం  పార్టీలోని సదరు వర్గంలో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.  ఇక వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవిలో కొత్త వారిని నియమించేందుకు వైయస్ జగన్ ఇప్పటికే పలువురు పేర్లను   పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వైసీపీ ఆవిర్భావం నుంచి  పార్టీ విజయం కోసం శ్రమిస్తున్న వారి జాబితాను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.అలాగే చైర్మన్ గిరి పదవి కట్టబేట్టేందుకు సామాజిక సమీకరణాలను సైతం సీఎం జగన్ పరిగణలోకి తీసుకొని మరీ పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

స్పీడ్ న్యూస్ 1

1. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా  అడుగులు వేస్తున్న   టీపీసీసీ ప్రచార కమిటీలను ప్రకటించింది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీని, కోఛైర్మన్ గా పొంగులేటిని నియమించింది.    2.  ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై ఇనుపరాడ్లతో దాడి జరిగింది.  సిడ్నీ నగరంలోని మేర్రీల్యాండ్స్‌లో  ఖలిస్థానీవాదులు ఆ యువకుడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. 3.   వేస్టిండీస్‌తో  రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  అరంగేట్రం మ్యాచ్ లోనే భారీ సెంచరీతో  ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.  రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది. 4. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల  పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంచయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం   విచారణ జరిపింది.  5.   దేశ రాజధాని నగరం మూడు రోజులుగా  జలదిగ్బంధంలో ఉంది.  సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీని కలిపే వికాస్ మార్గ్ మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మెట్రో ద్వారా మాత్రమే సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వెళ్లే సౌకర్యం ఉంది. 6. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు.  కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ తో కల‌సి మొక్కలు ఆయన మొక్కలు నాటారు,  కీసర గుట్ట వలె కొండగట్టులో ఎనిమిది వందల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 7.  బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో  ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.   బంగాళాఖాతంలో  17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ రాష్ట్రంలో  నెలాఖరు వరకు  వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  8. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌కి  ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్   నోటీసులు జారీ చేసింది.  ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తను కొట్టిన సంఘటనపై సీఐ అంజూయాదవ్‌తో సహా స్టేషన్‌ ఆఫీసర్‌, తిరుపతి డిఎస్పి, తిరుపతి ఎస్పీ, అనంతపురం డిఐజి, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.   9. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహషన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్‌ స్వాములు జనసేన గూటికి చేరనున్నారు. మంగళగిరిలోని  పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆమంచి శ్రీనివాసరావు జనసేన కండువా కప్పుకోనున్నారు.   10. కోనసీమ జిల్లా  శివకోడులో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. పవన్ అటాక్.. వైసీపీ బెంబేలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన పోకిరి సినిమాలో మాఫియా డాన్ ప్ర‌కాశ్ రాజ్‌ను ఉద్దేశిస్తూ షియాజీ షిండే ఓ డైలాగ్ చెబుతాడు.. క‌రెక్ట్ ఆఫీస‌ర్ త‌గ‌ల్లేదు నీకు.. అప్పుడు తెలుస్తుంది.. అంటాడు. అచ్చం ఇదే  డైలాగ్ అధికార వైసీపీ నేత‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంద‌నే వాద‌న ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతుంది. ఈ నాలుగేళ్ల‌లో ఆ పార్టీ నేత‌ల అరాచ‌కాలు చాలానే వెలుగులోకి వ‌చ్చాయి. టీడీపీ నేత‌ల‌నైతే ఓ ఆటాడుకున్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును సైతం వ‌దిలిపెట్ట‌లేదు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌నుసైతం అస‌భ్య‌క‌రంగా అవ‌మానించిన ప‌రిస్థితి. చంద్ర‌బాబుపై మాట‌ల దాడికి ఒక‌రిద్ద‌రు మంత్రుల‌తోపాటు, ప‌లువురు ఎమ్మెల్యేల‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా కేటాయించార‌న్న ప్ర‌చారం కూడా గ‌తంలో జ‌రిగింది. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి వ‌ర‌కు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబుపై దూష‌ణ‌లు చేయ‌డ‌మే  ప‌ని అన్న‌ట్లుగా కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్తించారు.  అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బ‌య‌టా చంద్ర‌బాబును, టీడీపీ ముఖ్య‌నేత‌ల‌ను టార్గెట్‌ చేసి వైసీపీ నేత‌లు మాట‌ల దాడి చేసిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ఒకానొక ద‌శ‌లో మా అధినేత చంద్ర‌బాబును తిట్ట‌కండి అని టీడీపీ నేత‌లు మొర‌పెట్టుకునే స్థాయికి వైసీపీలోని కొంద‌రు ఎమ్మెల్యేలు ప్ర‌వ‌ర్తించారు. అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఇదే ఫార్ములాను అమ‌లు చేసుకుంటూ వ‌చ్చారు. మొదట్లో జ‌గ‌న్ ఫార్ములా మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే ఫార్ములా జ‌గ‌న్‌ మెడ‌కు చుట్టుకుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై మండిప‌డుతున్నాడు. అయితే, టీడీపీపై ప్ర‌యోగించిన ఫార్ములానే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైనా ప్ర‌యోగించారు. కానీ, అది బెడిసికొట్ట‌డంతో వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌ చెందుతున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంట‌ర్ విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఆ విమ‌ర్శ‌లన్నీ బూతుల స్థాయిలోనే ఉన్నాయి. అయితే  ప‌వ‌న్ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి కౌంట‌ర్ ఇస్తూ వ‌చ్చాడు. ఇటీవ‌ల వారాహి విజ‌య యాత్ర ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం జ‌గ‌న్ టార్గెట్‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. వారం రోజుల క్రితం వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ప‌వ‌న్‌ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద దుమారం రేపాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వ‌స్తున్నారు. అయితే, ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డం త‌మ‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌న్న భావ‌న‌లో వారు ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్  నేరుగా జ‌గ‌న్‌ను టార్గెట్‌చేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా జ‌గ్గుభాయ్ అంటూ ర్యాగింగ్ సైతం చేస్తున్నాడు. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ప‌వ‌న్‌తో గొడ‌వ వ‌ద్దని జ‌గ‌న్‌కు కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు న‌చ్చ‌జెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్‌తో పెట్టుకోవ‌టం వ‌ల్ల ముఖ్యంగా గోదారి జిల్లాల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లూ తాము చేసిందే విమర్శ అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు  ప‌వ‌న్ దూకుడు చెక్ పెట్టిందనే చెప్పాలి.  అటు అధినేత‌కు న‌చ్చ‌జెప్ప‌లేక‌, మ‌రోవైపు ప‌వ‌న్ పై ఎదురుదాడి చేయ‌లేక ఇబ్బంది నానా ఇబ్బందులూ పడుతున్నారు.  పవన్ విమర్శల దాడి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు  పొరుగు రాష్ట్రంతో అనవసర వివాదానికి సైతం సిద్ధ పడుతున్నారు. పవన్ చేత తిట్టించుకునే కంటే పొరుగు రాష్ట్రం మంత్రుల చేత తిట్టించుకోవడం మేలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.  రెండురోజుల క్రితం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నమ‌ని  చెబుతున్నారు. అలాగే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇస్తూ  బొత్స   పొద్దుపొద్దున్నే మాకు ఇదేక‌ర్మ అంటూ వ్యాఖ్యానిచ‌టం వారిలో అసహనం, ఆందోళన పీక్స్ కు చేరిందనడానికి నిదర్శనంగా  చూపుతున్నారు.  

టీడీపీ, జనసేన తొడకొడుతున్నా వైసీపీలో చలనం లేదేంటి?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రం ఎన్నికల ఏడాదిలో కి అడుగుపెట్టేసింది. సమయం దగ్గర పడే కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై దండయాత్ర మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా చెప్తున్నాయి. బీజేపీ కూడా సమరానికి సిద్దమవుతున్నది. బీజేపీ జాతీయ నేతలు వచ్చిన ప్రతిసారి వైసీపీ ఫెయిల్యూర్ అని గంట కొట్టి  మరీ చెప్పి వెళ్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈసారి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి నారా లోకేష్ యువగళం పేరుతో  పాదయాత్ర చేస్తూ రెండు వేల కిమీ చుట్టేయగా రాయలసీమలో సైతం ఊహించని స్థాయిలో లోకేష్ పాదయాత్రకి ఆదరణ వచ్చింది. లోకేష్ రోజులు గడిచే కొద్దీ మాటలలో వేడి పెంచుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయయాత్రతో కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ఒక విడత వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా ఈ మధ్యనే రెండో విడత కూడా యాత్ర మొదలైంది. పవన్ అధికార పార్టీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే కట్టలు తెంచుకొనే ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ తొలి విడత యాత్రలో ఆ నైజం పక్కన పెట్టగా.. రెండో విడత యాత్రలో ఆ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. సూటిగా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సంస్కార హీనులని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తెచ్చిన వాలంటీర్లు దేశద్రోహులకు సహకరిస్తున్నారంటూ భారీ ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా.. వార్నింగులు ఇచ్చినా వెనక్కు తగ్గక మరికాస్త డోస్ పెంచి వైసీపీని దుయ్యబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. పవన్, లోకేష్ భాషలలో చెప్పాలంటే.. జగన్ ఒక క్రిమినల్ అనీ, వైసీపీ అంటే జగ్గూభాయ్ గ్యాంగ్ అని, అసమర్ధ సీఎం జగన్, మరో హిట్లర్ జగన్, జగన్ అనే రౌడీ చేతులు రక్తంతో తడిసిపోయాయని పెద్ద పెద్ద బాంబుల లాంటి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే జగన్ అనే వ్యక్తి మిత్రుడిగా కాదు శత్రువుగా కూడా పనికిరాడని తీసి పడేశారు. మరి ఇంతలా భీకరమైన మాటల దాడి జరుగుతూంటే వైసీపీ మాత్రం సైలెన్స్ మైంటైన్ చేస్తుంది. ఒకప్పుడు జగన్ ను ఒక్క మాట అంటే ఆ అన్న వారిని వైసీపీ నేతలు, శ్రేణులు ఎదురుదాడి చేసి చీల్చి చెండాడే వారు. వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని సైతం బజారుకీడ్చి నోటికి పనిచెప్పే వారు. కానీ ఇప్పుడు అవేవీ వైసీపీ నేతలలో కనిపించడం లేదు. దీంతో వైసీపీ ఎందుకు ఇలా మౌనంగా ఉంటుందన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నది. పోయిన వాళ్ళు పోయినా.. వెళ్లగొట్టిన వాళ్ళను తీసేసినా ఇంకా వైసీపీలో 130కి పైగా ఎమ్మెల్యేలు యాక్టివ్ ఉన్నారు. వాళ్ళలో 30 నుండి 40 మంది సీనియర్లు కూడా ఉన్నారు. పాత మంత్రులు, కొత్త మంత్రులు ఓ 20 మంది వరకూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంపీలు, మాజీలు, సలహాదారులు, చైర్మన్లు, డైరక్టర్లు ఇలా భారీ సైన్యమే ఉంది. ఇంత మంది ఉండి కూడా వాళ్ల అధినేతని పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నా ఒక్కరూ కదలడం లేదు.. మెదలడం లేదు. విజయసాయి, సజ్జల లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకురావడం లేదు. జగన్ ను ఒక్క మాట అంటే వంద వడ్డించే రోజా.. జగన్ కోసం ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా అనే కొడాలి నానీ, జీవితమంతా జగన్ కోసమే అని చెప్పిన ఒకరిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతున్నది? ఎందుకిలా అంతా కట్టకట్టుకుని మౌనవ్రతం పాటిస్తున్నారు అన్నది ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీస్తున్నది.

పాపం.. వైసీపీ విశాఖ ఆశలు ఆవిరి?!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి మంచి బలం ఉన్న సంగతి తెలిసిందే. అది జగన్మోహన్ రెడ్డి బలం అనే కన్నా వైఎస్ కుటుంబానికి ఉన్న బలం అని చెప్పుకోవాలి. ఆ బలం కూడా ఈసారి ఎన్నికలలో ఉంటుందా ఉండదా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇక కడప తర్వాత వైసీపీకి బలమైన జిల్లా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాను ఎంచుకున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. రాయలసీమలో ఉమ్మడి కడప జిల్లా తర్వాత విశాఖ జిల్లాను తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావించారు. అందుకే పరిపాలన అక్కడ నుండే చేస్తానని.. మూడు ముక్కల రాజధానిలో ఒక ముక్క మీకే ఇస్తానని విశాఖ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ, అవి రెండూ జరగలేదు. అక్కడి వైసీపీ నేతలు కూడా జగన్ మాటలను నమ్మినట్లు లేదు. అందుకే వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.  ఈ పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రజారాజ్యం అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవగా.. అందులోనే ఉంటూ వచ్చారు. రాష్ట్రవిభజన అనంతరం కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడంతో 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో  వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. రమేష్ బాబు పార్టీల జంపింగ్ ఎలా ఉన్నా స్థానికంగా ఆయనకు వివాదరహితుడు, అవినీతి మరక లేని మనిషిగా పేరుంది. ఆయనది కాపు సామాజిక వర్గం కావడంతో  వైసీపీ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించింది. మరి ఇప్పుడు అలాంటి సౌమ్యుడే వైసీపీలో ఉండలేక బయటకి వచ్చేయడం ఈ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. నిజానికి వైసీపీ ఎలాగైనా విశాఖను కంచుకోట చేసుకోవాలని చూస్తున్నది. కానీ మొదట నుండి ఇక్కడి ప్రజలు వైసీపీకి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. విశాఖ నుంచి తొలిసారి జగన్ తల్లి విజయమ్మను ఎంపీగా పోటీ చేయిస్తే ఆమెను ఓడించి ఇంటికి పంపారు. 2019లో అంత పెద్ద జగన్ గాలిలో కూడా విశాఖ సిటీలో నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో కూడా ఇక్కడి ప్రజలు వైసీపీని కాదని టీడీపీ వైపే నిలిచారు. ఈసారి ఎన్నికలలో అయినా ఇక్కడ టీడీపీని దెబ్బతీసి  పుంజుకోవాలని వైసీపీ కలలు కంటోంది. ఆ కల నెరవేర్చుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ లోగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక నా వల్ల కాదని కాడి కింద పడేసి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు తీర్చలేనపుడు, జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యత నన్ను చేయనివ్వనపుడు ఈ పదవి నాకెందుకు అంటూ ఆయన తనదైన స్టైల్ లో గట్టిగానే ఇచ్చి వెళ్లారు. దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఏడాదిలోకి వచ్చేశాం. విశాఖ జిల్లా వైసీపీకి  జిల్లా అధ్యక్షుడు లేడు. ఏం చేయాలన్నది ఆ జిల్లా పార్టీని పీడిస్తున్న ప్రశ్న. ఇటు సామజిక వర్గాల లెక్కలు కావాలి.. అటు సమర్ధుడైన నాయకుడు కూడా కావాలి. ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆయనకు జిల్లా పార్టీని నడిపించే సత్తా లేదని వైసీపీ నేతలకీ తెలుసు. ఒక వైపు సీఎం చెప్పినట్లుగా విశాఖకి రాజధాని రాలేదు.. విశాఖలో శాంతిభద్రతలపై ఎన్నో అనుమానాలు, నగరంలో పెరిగిన క్రైమ్, అసలే తొలి నుండి వైసీపీని నమ్మని విశాఖ జనం, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి నాయకత్వ లోపం.. నేతల మధ్య అంతర్గత పోరు. దీంతో ఈసారి కూడా వైసీపీ విశాఖ ఆశలు గల్లంతైనట్లే భావించాల్సి వస్తుంది.

బాబు దార్శనికతకు దర్పణం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువునా చీలిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్యంధ్రప్రదేశ్ అపప్రదను మూటకట్టుకొంది. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు.. తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అంతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో ఓ వైపు రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు కోసం ఆన్వేషణ సాగిస్తూనే.. మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమల స్థాపన  కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటి పడినా.. కియా సంస్థ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.  అలా 2017లో ఆ పరిశ్రమ కార్ల తయారీని ప్రారంభించిన కియా.. తాజాగా  శుక్రవారం (జూన్ 14) మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకొంది. ఈ సందర్భంగా కియా సంస్థకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సైతం ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.  అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకొవడం ఆనందంగా ఉందని... సదరు యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పమన్న ఆయన.. ఈ సమర్థ విధానం ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రపంచ వేదికపై కియా ఓ ప్రత్యేకతను చాటుకొందని స్పష్టం చేశారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగినందుకు తాను సంతోషిస్తున్నానన్నారు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.  మరోవైపు కియా పరిశ్రమ.. మిలియాన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంపై   అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తుతోన్నాయి.  వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పరిశ్రమ రావడానికి ప్రధాన కారణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని  వారు స్పష్టం చేస్తున్నారు. నాడు రాయలసీమలో ఈ పరిశ్రమ ఏర్పాటు అయిందంటే.... నేడు అదే పరిశ్రమ ఉత్పత్తి రంగంలో తన ఘనతను చాటుకొందంటే.. అది చంద్రబాబు విజన్‌కి నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరిగిందంటే.. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడం,  నవ్యంధ్రకు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక ,  అందుకోసం రైతులను ఒప్పించి.. వారి నుంచి స్వచ్ఛందంగా వ్యవసాయ భూముల సమీకరణ.. ఆ రాజధాని ప్రాంతానికి అమరావతి అని నామకరణం... అలాగే  ఉత్తరాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఏర్పాటుకు నడుం కట్టినా... అటు రాయలసీమలో సైతం దాదాపుగా ఇదే తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా.. అదంతా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల, మొక్కవోని దీక్షే  కారణమని  నెటిజన్లు ఈ సందర్బంగా తమ అబిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.   అయితే 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన ఫ్యాన్ పార్టీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్..   కియా పరిశ్రమ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేశారంటూ అప్పట్లో ఆరోపించారని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ పరిశ్రమ కారణంగా భూములు కోల్పోయిన రైతులను సైతం ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ పరామర్శించారని... అలాగే వారిని అన్ని విధాల రెచ్చగొట్టి..  కియా పరిశ్రమ ఏర్పాటు చంద్రబాబు తప్పుడు నిర్ణయమంటూ ఆయన వ్యాఖ్యానించారని నెటిజన్లు పేర్కొన్నారు.   తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ కియా కార్ల పరిశ్రమను తరిమేస్తామంటూ వైయస్ జగన్  చెప్పారని గుర్తు చేశారు.  వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిందని... ఇంతవరకు ఆ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులను బాధ్యత గల ముఖ్యమంత్రిగా పరామర్శించిందే లేదని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాదు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో అనంతపురం నుంచి కియా కార్ల పరిశ్రమ.. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలి పోతున్నదంటూ.. స్థానిక మీడియాలోనే కాదు.. అంతర్జాతీయ మీఢియాలో సైతం వార్త కథనాలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. అందుకు.. కొత్త ప్రభుత్వం తీసుకు వచ్చిన విధి విధానాలతోనే  కియా ఈ నిర్ణయం తీసుకో వలసి వచ్చిందంటూ.. కథనాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు   వెల్లువెత్తాయి. అలాగే కియా కంపెనీ యాజమాన్యాన్ని అధికార ఫ్యాన్ పార్టీకి చెందిన ఎంపీ   తుపాకీతో బెదిరించారనే ఓ చర్చ సైతం నాడు వాడి వేడిగా నడిచిన విషయం విధితమే. అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు హయాంలో వచ్చిన కియా పరిశ్రమ.. తాజాగా మైలురాయి చేరుకోవడం పట్ల.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సదరు పరిశ్రమ యజమాన్యాన్నికి అభినందనలు తెలపడం కొసమెరుపని నెటిజన్లు పేర్కొంటున్నారు.  ఇది చంద్రబాబు నాయుడి విజన్‌కి ఓ ఉదాహరణగా వారు చూపుతున్నారు.  చంద్రబాబు నాయుడికి, వైయస్ జగన్‌కి మధ్య ఉన్న ఈ తేడాను గమనిస్తే.. ఆంధ్రులు.. భవిష్యత్తులో అయినా తప్పటడుగులు వేయకుండా ఉంటారని నెటిజన్లు ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం కన్ఫర్మ్?

మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య  భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారనీ ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఈ మధ్యనే జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడే వారు విజయమ్మ, షర్మిలతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. కాగా, ఇప్పుడు  సోనియాతో షర్మిల భేటీ కావడం ఖాయం అయ్యిందని చెబుతున్నారు. అదెప్పుడంటే..  ఈనెల 17,18 తేదీల్లో బీజేపీకి వ్యతిరేకంగా బెంగుళూరులో ప్రతిపక్షాలు సమావేశమవబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల సమావేశంలో 24 పార్టీలు పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే  ఖరారు కాగా  రానున్న రోజులలో ఈ సమావేశంలో పాల్గొనే  పార్టీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   కాగా, మొన్నటి పాట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొనగా.. రాబోయే సమావేశానికి మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి గట్టి టీం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు సమావేశాలకు దక్షణాదిన ప్రతిపక్షాలకు కాంగ్రెస్ తరపున ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ సమావేశం కోసం సోనియా, రాహుల్ బెంగళూరు వస్తుండగా.. ఈ సమావేశాలకు షర్మిలను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. సమావేశాలతో పాటు 17 రాత్రి ప్రతిపక్షాల విందులో కూడా షర్మిల పాల్గొనబోతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్య వైఎస్సార్ జన్మదినం నాడు పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన ట్వీట్ల ద్వారా వైఎస్సార్ కు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇవ్వగా.. దానికి షర్మిల సానుకూలంగా స్పందించడం చూస్తుంటే  ఇప్పటికే వైఎస్సీర్టీపీ కాంగ్రెస్ లో విలీనం విషయంలో ఒక నిర్ణయం జరిగిపోయినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తరపున కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు కర్ణాటక నుండి డీకే శివకుమార్ మాట్లాడుతుండగా.. బెంగళూరు భేటీతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తున్నది. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం చేసేయాలని.. అందుకు ప్రతిఫలంగా ఆమెని రాజ్యసభకి పంపించడం.. కావాలంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఆమెకి అప్పగించాలన్నది కాంగ్రెస్ ప్రతిపాదన కాగా.. కాంగ్రెస్ తో పొత్తుకి వస్తామని.. అది కూడా కేవలం తెలంగాణలోనే తన రాజకీయాలు ఉంటాయని షర్మిల చెబుతున్నట్లుగా  ఆయా పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది.  మరిఈ రెండు ఆప్షన్లలో ఏది ఫైనలైజ్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల పార్టీ  విలీనానికి  అంగీకరిస్తారా? ఒకవేళ షర్మిల ఒకే అంటే ఆమె ఏపీకి వెళ్తారా.. తెలంగాణలోనే ఉంటారా అన్నది ఈ భేటీలో తేలిపోతుందని చెబుతున్నారు. అదలా ఉంచితే,  కాంగ్రెస్ లోనే కొందరు నేతలు షర్మిలను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రేణుకా చౌదరి ఆ మధ్య షర్మిల ఎవరో తెలియదని.. ఆ తర్వాత  వైఎస్ కూతురా అంటూ కామెంట్ చేశారు. మరో ఎంపీ చింతామోహన్ సైతం భిన్న స్వరం వినిపించారు. మరో సీనియర్ నేత వీ హనుమంతరావు అయితే.. షర్మిలా లేదు గిర్మిలా లేదు.. ఆమెని వెళ్లి ఏపీలో రాజకీయం చేసుకోమనండి.. తెలంగాణలో ఆమెకి ఏం పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు   చేసారు. ఈ నేపథ్యంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రా ఆసక్తి కూడా వ్యక్తమౌతోంది. 

స్పీడ్ న్యూస్- 2

21.తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు.దీనికి సంబంధించి ఆయన శుక్రవారం మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు.  22. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కార్ల ఫ్యాక్టరీ 1 మిలియన్ కార్లను తయారు చేసి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కియా యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.  23.తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది.  24. మచిలీపట్నంలో  మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్య పోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. 25.బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.  సీపీ ఆదేశాల ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు మూతపడనున్నాయి.   26.  విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో సస్పెండ్ అయిన రిజర్వు సీఐ స్వర్ణలతను పోలీసులు  కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంగార్డు, రిజర్వు కానిస్టేబుల్‌ను కూడా కస్టడీకి తీసుకుని విచారించారు.  27.మన ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం  మోదీ గురువారం పారిస్ చేరుకున్న సంగతి విదితమే.  28. ఏవీయిన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు సాధారణంగా పక్షులను టార్గెట్ చేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో క్షీరదాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి.  ఈ వైరస్‌లో మార్పులు జరిగి మనుషుల్లో వ్యాపించే సామర్థ్యం సంతరించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  29. ఆగ్నేయ ఐరోపా దేశమైన  కొసావో ప్రధాని అల్బిన్ కుర్తీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యుడు లేచొచ్చి వాటర్ బాటిల్‌తో ఆయన ముఖంపై నీళ్లు చల్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్తీ విధానాలు పాశ్చాత్య మిత్రులతో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.  30.వెస్టిండీస్‌తో రోసోలోని విండ్‌సోర్ పార్కులో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 215 బంతుల్లో సెంచరీ సాధించిన యశస్వి అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 31.ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3 లో హైదరాబాదీ కంపెనీలకు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ మిషన్ లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ లను జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తీసుకెళుతోంది.  32.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు తన కాన్వాయ్ లోని డాక్టర్ తో చికిత్స చేయించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు ప్రమాదానికి గురైన మహిళలను గమనించి  చికిత్స చేయించారు. 33.ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చింది. 34.హాలీవుడ్ సినీ కళాకారులు, ప్రముఖ నటులు సమ్మె బాట పట్టారు. దాదాపు 1.6 లక్షల మంది సినీ కళాకారులు సభ్యులుగా ఉన్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది. 35.నటిగా తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి అన్నారు. గతంలో ఓ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని, దీంతో తాను ఏడ్చేశానని చెప్పారు.  36.వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.  రాజారెడ్డిని సినిమాల్లో లాంచ్ చేసే పనుల్లో షర్మిల ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది. రాజారెడ్డి నటించబోయే చిత్రానికి పూరి జగన్నాథ్  చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.  37. మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూపీఐ సేవలను ఫ్రాన్స్‌ లో కూడా వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఇకపై భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్‌ ద్వారా ఫ్రాన్స్‌ లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. 38.జపాన్‌ పై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు.  రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో డైఫకు ఇంట్రా లాజిస్టిక్స్, నికోమక్ తైకిష కంపెనీలకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా జపాన్‌ సత్తా చాటిందన్నారు.  39.దోశలో సాంబర్ లేదని ఆరోపిస్తూ ఓ లాయర్ వినియోగదారుల కోర్టులో కేసు వేసి  మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది తనను రెస్టారెంట్ మోసం చేసిందని కేసు వేసి 3, 500 రూపాయల జరిమానా చెల్లించే విధంగా న్యాయపోరాటం చేశారు.  40. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 341 డిమాండ్లను పరిష్కరించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో  స్పష్టం చేశారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సహా వివిధ శాఖ అధికారులు భేటీ అయ్యారు. 41. పబ్ జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతనినే పెళ్లి చేసుకోవడానికి సరిహద్దు దాటి భారత్ వచ్చిన పాక్ జాతీయురాలు సీమా గులాం హైదర్ ను తిరిగి తమ దేశానికి పంపించాలని ముంబై పోలీసులకు  బెదిరింపు కాల్ వచ్చింది. ఇది ఫేక్ బెదిరింపుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  42.తన నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని  గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టత నిచ్చారు.  తాను బీజేపీలోనే ఉంటానని తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.  43.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.పవన్ కళ్యాణ్ ‘మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధితో " బాధపడుతున్నారని అన్నారు.  44. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం తెలిపారు.  తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులకు శ్రవణ్ ట్వీట్ చేశారు. . 45. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశానికి వేదికను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా ముట్లూరులో పర్యటించిన రాయుడు స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల సాయం అందించారు. 46.వైసీపీకి, ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల అనడం అబద్ధమని .రాజీనామా తొందరపాటు చర్య అని చెప్పారు. 47.తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణను కించపరిచేలా మాట్లాడారని, తక్షణమే తన వ్యాఖ్యలను  వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  48. భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది. 49. హైదరాబాద్ లోని  దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పైనుంచి చెరువులో దూకి పదిహేడేళ్ల బాలిక పాయల్ ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనే కారణంతోనే ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.పాయల్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు. 50.హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఓ మహిళా నిర్మాతకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె జాగింగ్ చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి ఫోన్ తో వీడియోలు తీస్తూ, అశ్లీల హావభావాలతో వేధించాడు. అతని వేధింపులను భరించలేని సదరు మహిళా నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ?

మగధీర సినిమాలో విలన్ డైలాగ్ ఒకటి ఉంటుంది. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని.. తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరి కూడా కొంచం ఇంచు మించు అలాగే ఉంది. రాష్ట్రంలో తాను గెలిచే పరిస్థితి ఎలాగూ లేదని అర్ధమైన మరుక్షణం నుంచీ తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా ఉంటే చాలన్న వైఖరి తీసుకుంది. ఇందు కోసం బీజేపీ అధిష్ఠానం రాష్ట్రం విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ కు అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చేదిగా ఉండేలా జాగ్రత్త పడుతోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడం, అధ్యక్ష పగ్గాలను కిషన్ రెడ్డికి అప్పగించడం మొదలు కాంగ్రెస్ లోకి బీజేపీ నేతలే కాకుండా, బీఆర్ఎస్ నేతలు కూడా చేరకుండా ఉండేలా వ్యూహాలు రచించడం దగ్గర నుంచీ బీజేపీ కాంగ్రెస్ దూకుడును కట్టడి చేయడం అన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ లో చేరికలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించింది.   బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరాలని భావిస్తున్న నాయకుల జాబితాను దగ్గరపెట్టుకుని.. వారిని తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అలా రావడం ఇష్టం లేని వారిని బీఆర్ఎస్ వీడొద్దంటూ కౌన్సెలింగ్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే చేరితో బీజేపీలో చేరండి లేదంటే బీఆర్ఎస్ లోనే కొనసాగండి అంటూ ఆయా నాయకులకు బీజేపీ రాష్ట్ర నేతలు నచ్చచెబుతున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.    కర్ణాటక ఫలితాల తరువాత  రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు పెరిగింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి, అసంతృప్తుల సంఖ్య పెరిగింది. ఇది కాంగ్రెస్‌కు మరింత కలిసొచ్చింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్న వాతావరణం ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర నాయకులలో కొందరు ఈ పరిస్థితి గురించి బాహాటంగానే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైనా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దీంతో బీజేపీ క్యాడర్ లో నిరుత్సాహం తారస్థాయికి చేరింది. బీజేపీ కార్యక్రమాలలో ఉత్సాహం కొరవడింది.  అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలా చూస్తున్న వారి జాబితాలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారన్న సమాచారం బీజేపీని కంగారు పెడుతోంది.   అందుకే తనకు ఎలాగూ చాన్స్ లేదు.. కాంగ్రెస్ కు మాత్రం గెలుపు అవకాశాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లుగా బీజేపీ హై కమాండ్ తీరు ఒక్కసారిగా మారిపోయింది.  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ తెరవెనుక యత్నాలు ప్రారంభించడం కచ్చితంగా బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అన్న విశ్లేషకుల మాటలు అక్షర సత్యాలన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తమౌతోంది. 

వైనాట్ 175 నినాదమెక్కడ? జగన్ కి బొమ్మ కనబడిందా?

రాజకీయాలలో ఒక్కో పార్టీకి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఏపీలో వైసీపీకి ఓ స్టైల్ ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం ఒక నినాదాన్ని ప్రకటించి.. ప్రజల చెవులలో మారుమ్రోగేలా కార్యకర్తల చేత ఆ నినాదాన్ని ఊదించడం వైసీపీ స్టైల్. గత ఎన్నికలలో టీడీపీ రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ అనడం నుండి ఒక్క ఛాన్స్ ప్లీజ్ వరకూ వైసీపీ చాలానే గిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేసింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసాక ఈ నాలుగేళ్ళలో కూడా వైసీపీ అలాంటి  కొన్ని నినాదాలను బలంగా ప్రజలలోకి పంపేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే ఆ మధ్య వైసీపీ నుండి వై నాట్ 175 అనే నినాదం  బయటకొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ అందరూ వై నాట్ 175 అంటూ మీడియా మైకుల ముందు ఊదరగొట్టేసే వారు.  అయితే, ఇప్పుడు ఆ నినాదం మరుగున పడింది. ఈ మధ్య కాలంలో వై నాట్ 175 నినాదం వైసీపీ నేతల నోటి నుండి రావడం లేదు.  దీంతో వైసీపీకి తత్వం బోధ పడిందా? అందుకే వై నాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టేశారా? అసలు ఈ నినాదం వైసీపీ ఎందుకు వదులుకుంది అనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది. నిజానికి వైసీపీ నినాదం అయితే వదిలింది కానీ అది సాధ్యమయ్యే పని కాదు. గత ఎన్నికలలో 151 రావడం వెనక సవాలక్ష కారణాలు ఉన్నాయి. వైసీపీ అందుకున్న ఒక్క ఛాన్స్ ప్లీజ్ నుండి అమరావతి మీద ఆరోపణలు చేయడం, మేధావులుగా పిలవబడే కొందరు నిత్యం మైకుల ముందు టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లడం, వివేకా హత్యకేసు, కోడికత్తి కేసు సానుభూతి, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం ప్రణాళికలు, జగన్ పాదయాత్ర ఇలా చాలా రకాలుగా కలిసి వస్తేనే వైసీపీకి 151 సీట్లు గెలుచుకున్నారు.  కానీ, ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే బలంగా వినిపిస్తుంది. సీఎం సొంత ప్రాంతం రాయలసీమలోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉండకడం కష్టమే అంటున్నారు. క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో సగానికి సగం మంది రెబల్స్ అయ్యారు. అటు వైపు చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా లాంటి వారికే ఎదురుగాలి వీస్తుంది. ఇటు గుంటూరు లాంటి జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట ప్రజలలో చులకన చేసింది. మరోవైపు ముక్కలైన వైఎస్ కుటుంబం, బాబాయ్ వివేకా హత్య కేసులో అబ్బాయిలే నేరస్తుల్ని సీబీఐ స్టేట్మెంట్లు ఇవ్వడం, కోడికత్తి శీను జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం ఇలా అన్నీ ప్రజలే చూస్తున్నారు. మరోవైపు వైసీపీ సృష్టించిన అరాచకాలు, నేతలు చేసిన దందాలు, కక్ష్యపూరిత రాజకీయాలు, ఇసుక కోసం పడిన పాట్లు, చెత్తకు కడుతున్న ట్యాక్సులు ఇలాంటివి కూడా ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు.  ఇవన్నీ కలిసే ప్రజలలో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత పెరిగింది. నాడు వైపీపీ విజయానికి ఏ అంశాలైతే దోహదపడ్డాయో అవి ఇప్పుడు వైసీపీకి గుదిబండలుగా మారి ఓటమి భయాన్ని కలిగిస్తున్నాయి. గడపగడపకి కార్యక్రమంలో ఈ వ్యతిరేకతే వైసీపీ నేతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా ప్రజలు మీరేం చేసారని పలు చోట్ల నిలదీశారు. దీంతో కొంత మంది గడపగడపకు కు డుమ్మా  కొట్టేశారు. ఆ వ్యతిరేకత చూసిన తర్వాత వైసీపీ వై నాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి నినాదాలు ఇచ్చి ఆ తర్వాత కొత్త ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఎందుక‌నే కొంద‌రు సీనియ‌ర్ల అభిప్రాయంతోనే ఈ నినాదం మాయమైనట్లు కనిపిస్తుంది. అందుకే నాలుగు నెలల ముందు ఇచ్చిన వై నాట్ 175 నినాదం ఇప్పుడు   సీఎం సహా వైసీపీ నాయకుల నోటి వెంట రావడం లేదు. సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. కొన్నాళ్ల కింద‌ట వైనాట్ 175 అనేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పాల్గొనే స‌భ‌ల్లో  ఆయన నోట  వైసీపీని గెలిపించండి అన్న అభ్యర్థన మాత్రమే వినిపిస్తోంది. వై నాట్ 175 మాట దేవుడెరుగు అత్తెసరుగానైనా సరే అధికారాన్ని నిలబెట్టుకుంటే అదే పదివేలన్న బేలతనం కనిపిస్తోంది. 

స్పీడ్ న్యూస్ 1

1. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి పురందేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.  2.యూకే వెళ్లాలనుకునే వారికి ఇకపై అక్కడి వీసా ఖర్చులు పెరగనున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్వయంగా ప్రకటించారు. వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్‌చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన  స్పష్టం చేశారు. 3.ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు శత్రువు కాదని, అతనికి అంత సీన్ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. గురువారం తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు.  4.ప్రాజెక్టుల విషయంలో కేంద్ర వైఖరిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం గురువారం కేంద్రానికి లేఖ రాశారు. 5.బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని ఆ పార్టీ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్నారు.  6.ఉమ్మడి పౌర స్మృతికి  తాము వ్యతిరేకమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అందరికీ ఒకే విధానమన్న విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ లా కమిషన్ కు లేఖ రాశారు. 7.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు, రేపు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.   మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.  8.. తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దమ్కీ ఇచ్చాయి.  బంగారం వచ్చేసి రూ.60 వేలకు చేరితే.. వెండి కిలోపై ఏకంగా రూ.2000 పెరిగింది. ఇంత భారీగా పెరగడం అనేది ఈ ఏడాదిలోనే జరగలేదని చెప్పాలి. 9.సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసిందని టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చారని వెల్లడించారు.  10.ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత పెదనాన్నను వాలంటీర్ ప్రవీణ్ దారుణంగా హత్య చేశాడు. పొలం తగాదా నేపథ్యంలో ఈ పెదనాన్నను హతమార్చాడు. 11.దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే బి.ప్రభాకర్ రెడ్డి అనే ఎస్సై 35 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఆయనను జీనోమ్ వ్యాలీ పీఎస్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 12.ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత విద్యార్థులకు ప్రాన్స్ శుభవార్త చెప్పింది. మాస్టర్స్ వంటి ఉన్నత చదువుల కోసం పారిస్ వచ్చే భారత విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక ఐదేళ్ల పాటు పనిచేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఐదేళ్ల వర్క్ వీసా ఇవ్వనున్నట్లు తెలిపింది.  13.స్నేహితుడిపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం  యూపీలోని సోన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో  జరిగిందీ ఘటన. బాధితుడు, నిందితుడు ఇద్దరూ మంచి స్నేహితులు. జవహర్ పటేల్ స్నేహితుడు గులాబ్ కోల్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత అతడిపై మూత్రవిసర్జన చేసినట్టు ఎస్పీ యస్వీర్ సింగ్ తెలిపారు.   14. జనసేనాని కార్యక్రమాలకు ఇచ్చే ఎంట్రీ పాసులకు నకిలీలు సృష్టిస్తున్నారు. ఈ బెడద తప్పించేందుకు జనసేన పార్టీ వినూత్నంగా ఆలోచించింది. రూపాయి నోటును పోలిన పాసులను తయారు చేసింది. అచ్చంగా రూపాయి నోటులానే ఉండే ఈ పాస్ పై జనసేన స్టాంప్ ను ముద్రించి పంచుతోంది. 15.రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. యమునా నది వరదల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై ఆరా తీసినట్లు వెల్లడించింది. ఈమేరకు రాత్రి పీఎంవో ఓ ట్వీట్ చేసింది. 16.తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక కడతేర్చిందో భార్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ ఘటన వెలుగు చూసింది.  భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ ఇటీవల ఓ రోజు అతడి తలపై చెంబుతో బలంగా కొట్టి చంపేసింది.  17.తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియలెస్టేట్ వ్యాపారి తిరుపతి రెడ్డి కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్ కు గురయినట్టు ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18.టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్‌కు చేరువవుతోంది. టైటాన్ విషాదంలో పాకిస్థాన్ బిలియనీర్, ఆయన కుమారుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  19.జాతుల మధ్య వివాదంలో క్రైస్తవ సమాజం పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్.వన్‌రామ్‌చువంగా రాజీనామా చేశారు. ఈ మేరకు మిజోరం బీజేపీ చీఫ్ వన్లాల్హ్ముకాకు లేఖ రాశారు. మణిపూర్‌లో క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలపై తాను తీవ్రంగా కలత చెందినట్టు అందులో పేర్కొన్నారు.  20. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు రాష్ట్రాలపై ఆశలకు బీజేపీ తిలోదకాలు?!

దక్షిణాదిపై మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తనకు ఉన్న చిన్న చూపును బీజేపీ హైకమాండ్ మరోసారి తేటతెల్లం చేసింది.  పేరుకు తెలుగు రాష్ట్రాలపై తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని చెప్పుకునే బీజేపీ అధిష్ఠానం ఆచరణలో మాత్రం ఆ రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత కూరలో కరివేపాకు చందమేనని మరో సారి చాటుకుంది.   జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను చూస్తే తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీకి ఉన్న చిన్న చూపు ఎంత అన్నది అర్ధమౌతుంది.  రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ శూన్య హస్తాన్నే చూపింది. రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి వరకూ  గుజరాత్‌ నుంచి బాబు బాయి జేసంగ్‌ బాయ్‌, కే శ్రీదేవన్స్‌ జాలా, బెంగాల్‌ నుంచి అనంత్‌ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గుజరాత్‌ నుంచి కేంద్రమంత్రి జైశంకర్‌ పేరును నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.   అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క బీజేపీ నేతకు కూడా అవకాశం ఇవ్వలేదు. ముందుగా అయితే   బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు పేరు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని బాగా ప్రచారం అయ్యింది.  అయితే బీజేపీ హై కమాండ్ మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ పరిశీలించలేదని తేలిపోయింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ అంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ తెలంగాణపై బీజేపీ భారీ ఆశలు పెంచుకుంది. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తరువాయి అన్నంతగా హడావుడి చేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రంమే తెలంగాణలో బీజేపీ వాపును చూసి బలుపు అనుకుందన్న విషయం బయటపడింది. దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆకాంక్షలు ఇప్పటిలో నెరవేరే అవకాశాలు లేవని రూఢీ అయిన తరువాత బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రాలలో నేతలకు   రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమౌతోంది. అలా ఇచ్చినా కూడా ఆయా రాష్ట్రాల పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ నింపే అవకాశాలు ఇసుమంతైనా లేవన్న నిర్ణయానికి బీజేపీ హై కమాండ్ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై ఇసుమంతైనా ఆశలు లేకపోవడం వల్లనే రాజ్యసభ విషయంలో ఆ రాష్ట్రాల నుంచి ఎవరినీ కనీసం పరిశీలించలేదన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వ్యక్తమౌతోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి లక్ష్మణ్, ఏపీ నుంచి జీవీఎల్ ను ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపిన సంగతి విదితమే. అయితే వారి వల్ల తెలుగు రాష్ట్రాలలో పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.    

స్వాహాయజ్ణంలో జగన్ సర్కార్ స్టైలే వేరు!

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఆర్థిక  నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పథకాన్ని చూసినా అవినీతే రాజ్యమేలుతోంది.  దోపిడీ కోసం ఏకంగా కార్పొరేషన్ ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు తీసుకోవడం గతంలో ఎన్నడూ చూడని కొత్త స్టైల్.   ప్రభుత్వ తాజాగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   కరువు నివారణ అంటూ కార్పొరేషన్ పేర అప్పులు తీసుకువచ్చి ఆ రుణాల సొమ్మును ప్రైవేటు ఖాతాలకు మళ్లించారంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఒక్క ఈ రూపేణా దాదాపు 900 కోట్ల రూపాయలు దారి మళ్లాయని కేశవ్ ఆరోపిస్తున్నారు. నిధుల దోపిడీ విషయంలో ఏపీ సర్కార్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. అప్పుల సొమ్ముతోనూ స్కామ్ చేయడం ఒక్క జగన్ సర్కార్ కే చెల్లిందని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అయిన పయ్యావుల కేశవ్ అన్నారు.  గురువారం (జూలై 13)  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పయ్యావుల కేశవ్  రుణాల సొమ్ముదారి మళ్లింపు స్కాంపై  సీబీఐ విచారణ కు డిమాండ్ చేశారు. రాయలసీమలో కరువు నివారణ కోసం అంటూ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పేరుతో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం అప్పు చేసింది. అసలా పనులు చేపట్టకుండానే.. పూర్తై పోయాయని చెబుతున్నారు.  తీసుకున్న రుణానికి చెల్లింపులూ జరిపేస్తున్నారు. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అ రుణం 900 కోట్ల రూపాయలూ నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లించారు. విషయమేమిటంటే.. ప్రభుత్వం ఈ యేడాది మార్చి 29న బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే మూడు రోజుల్లో రుణం మంజూరైపోయింది.  అయితే ఆ సొమ్ములు కార్పొరేషన్ ఖాతాలోకి రాకుండానే నేరుగా కాంట్రాక్టర్ కు బదలీ అయిపోయాయి. ఏ పనుల నిమిత్తం అయితే రుణం తీసుకున్నారో ఆ పనులు జరగనే లేదు. అయినా పనులు పూర్తైపోయాయంటూ సర్కార్ సర్టిఫై చేసేసింది. అప్పుల సొమ్మును కూడా స్వాహా చేసే భారీ కుంభకోణం జగన్ సర్కార్ లో జరుగుతోందనీ.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలనీ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.     ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కాకుండానే  నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లింపు అయిపోయింది. ఇప్పుడీ రుణాన్ని ప్రభుత్వ తన ఖాతాల నుంచి చెల్లిస్తున్నది.  పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నట్లు ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వ అప్పుల కుంభకోణాలన్నీ బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు.   అసలు జగన్ ప్రభుత్వాన్ని నడపడానికి పూర్తిగా అప్పులపైనే ఆదారపడుతున్నారు. దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రారంభించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని మరీ అప్పులు తీసుకువస్తున్నారు. భవిష్యత్ లో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువస్తున్నారు. తాజాగా మద్యం తాకట్టు ద్వారా మరో 8 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి రెడీ అయిపోయారు.  మొత్తంగా ఒక్క చాన్స్ అభ్యర్థనతో అధికారంలోకి వచ్చిన జగన్ మరో చాన్స్ దక్కదన్న నిర్ణయానికి వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  మొత్తం రుణాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ  రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి పంపేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. 

పవన్ దూకుడు.. బాబు వ్యూహమేనా?

ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి విజయ యాత్రతో ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాడు. అధికార పార్టీ నేతలపై.. ముఖ్యంగా సీఎం జగన్‌పై పోట్లగిత్తలా కాలుదువుతున్నాడు. ఈ క్రమంలో వైసీపీ నేతల మాట తీరుకు సరిఅయిన సమాధానం ఇస్తున్నాడు. ఇన్నాళ్లు మాజీ సీఎం, టీ-డీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీ-డీపీ నేతలను ఓ ఆట ఆడుకున్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఆ ఫోకస్‌ను పవన్‌ వైపుకు మళ్లించారు. ఇటీ-వల ఏలూరులో జరిగిన వారాహీ యాత్రలో వాలంటీ-ర్స్‌ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాక్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం వెనుక కొందరు వాలంటీర్స్‌ ఉన్నారని, వారు సేకరించిన డేటా తప్పుడు పనులకు ఉపయోగపడుతుందని పవన్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వాక్యలపై వాలంటీర్స్‌, వైసీపీ నేతలు భగ్గుమన్నారు. వాలంటీర్స్‌ పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మలు దహనం చేయగా, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి పవన్‌ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ వర్సెస్‌ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వాలంటీర్‌ ఫిర్యాదుతో పోలీసులు పవన్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారు. వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌పై దృష్టిసారించడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు కొంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. ఇన్నాళ్లు చంద్రబాబు, టీడీపీ నేతలపై ఒంటికాలుపై లేచిన వైసీపీ మంత్రులు ప్రస్తుతం వారి దృష్టిని పవన్‌ వైపు మళ్లించారు. మరోవైపు చంద్రబాబు అండ్‌ కో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రౌండ్‌ లెవల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది. పొత్తుతో వెళ్లాలా.. పొత్తు పెట్టుకుంటే జనసేనతో పాటు బీజేపీతోనూ చేతులు కలపాలా? అనే విషయాలపై సర్వేలు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. సర్వేల ఆధారంగా పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఎన్ని సీట్లు  ఇవ్వాలి. బీజేపీకి ఎన్నిస్థానాలు కేటాయించాలి..? వారికి ఏం నియోజకవర్గాలు కేటాయించాలనే విషయంపై చంద్రబాబు లెక్కలువేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కనీసం 120 నుంచి 130 స్థానాల్లో పాగా వేయాలని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ క్రమంలో దీంతో ఓ వ్యూహంతో వారు ముందుకెళ్తున్నారన్న ప్రచారమూ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది. అధికార పార్టీపై పవన్‌ కళ్యాణ్‌ దూకుడు వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఓ బలమైన సామాజిక వర్గం ఓటర్లను తమవైపుకు మళ్లించడమే చంద్రబాబు, పవన్‌ టార్గెట్‌ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యూహంలో భాగంగానే ఇన్నాళ్లు టీడీపీ నేతలే టార్గెట్‌ విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోకస్‌ను పవన్‌ కళ్యాణ్‌ తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గం వైఎస్‌ జగన్‌ వైపు ఎక్కువగా ఉంది. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువే. పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నేతలను టార్గెట్‌ చేయడంద్వారా ఆటోమేటిక్‌గా వైసీపీ నేతలు పవన్‌కు కౌంటర్‌ ఇస్తుంటారు. ఈ క్రమంలో కాపు ఓటర్లు పవన్‌ వైపు సానుభూతి చూపే అంశాలు లేకపోలేదు. దీనికితోడు వారాహి యాత్రల్లో మీరంతా కలిసిఉంటే తాను సీఎం అవుతానంటూ పవన్‌ పదేపదే చెబుతున్నాడు. కావు సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒకరు సీఎం అవ్వాలని ఆ సామాజిక వర్గం భావిస్తుండటం సహజమే. గతంలో చిరంజీవికి బలమైన మద్దతుగా ఆ సామాజిక వర్గం నిలిచింది. కానీ, చిరంజీవికి సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. కాపు సామాజిక వర్గం జగన్, పవన్ మధ్య చీలిపోయి ఉంది. కాపు సామాజిక వర్గంను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి దూరం చేయాలంటే పవన్‌ కళ్యాణ్‌ ఫ్రంట్‌లైన్లో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహంలో భాగమని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. వైసీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేయటానికి పెద్దగా ఏమీ ఉండవు. కేవలం బూతులు తిట్టడం మాత్రమే.  ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఫ్రంట్‌లైన్లో పెట్టడం ద్వారా కాపు సామాజిక వర్గంతో పాటు చంద్రబాబు అంటే గిట్టనివారు. ప్రస్తుతం వైసీపీకి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు పలుకుతున్న వారు ఆ పార్టీకి దూరమై పవన్‌ వైపు వస్తారన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అలా పవన్‌ కళ్యాణ్‌కు బలమైన ఓటు బ్యాంక్‌ చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పొత్తుతో వెళ్లాలని ఇప్పటికే పవన్‌, చంద్రబాబు నిర్ణయించుకున్న క్రమంలో ఆ ఓటు బ్యాంకు వైసీపీ ఓటమికి ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల వ్యూహంగా తెలుస్తోంది. దీంతో వారిద్దరు అనుకున్నట్లే సీఎం జగన్‌ వారి వ్యూహంలో చిక్కారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. 

ఖాకీవనంలో గంజాయి మొక్కలు

పోలీస్ శాఖకు పర్యాయపదం.. బాసిజం. ఆ శాఖలో ప్రతీ దశలో బాసిజమే రాజ్యమేలుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శాఖలో క్రమానుగత శ్రేణిని బట్టి పరిశీలిస్తే.. ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోవడం అనేది అనాదిగా ఉన్నదే.  అయితే అటువంటి శాఖలో మహిళా అధికారులు అతి కొద్దిమందే ఉన్నా.. వారిలో పలువురు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని.. వారి చర్యలతో ఖాకీ దుస్తుల ప్రతిష్ట మసకబారేలా ఉందన్న  చర్చ  ప్రస్తుతం ఊపందుకొంది.   పోలీసు అధికారుల్లో పురుషులు కరుకుగా, అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే అందులో అర్థం.. పరమార్థం ఉందనుకోవచ్చు. కానీ ఖాకీ దుస్తులు వేసుకొన్న ఆడవారు సైతం.. ఫురుషులతో పోటీ పడేలా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం, శాంతిభద్రతలు పరిరక్షణలో భాగంగా ప్రజలతో   రుబాబుగా , దురుసుగా వ్యవహిరిస్తున్న పలు సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకొంటున్నాయి. అలాంటి సంఘటనలపై ప్రజాస్వామిక వాదులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్... తన రెండు చేతులతో జనసేన పార్టీకి చెందిన వ్యక్తి చెంపలను వాయించారు. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు.. సీఐ వ్యవహార శైలిపై ఇప్పటికే స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే విశాఖపట్నంలో ఆర్మీ రిజర్వుడు సీఐ స్వర్ణలత సైతం నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి..  ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. మరోవైపు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారి సౌమ్య మిశ్రా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో నగరంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆమె బదిలీపై వెళ్లిపోతూ.. ప్రస్తుత టీడీపీ నాయకుడు వంగవీటి రాధా తల్లి వంగవీటి రత్నకుమారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి మరీ వెళ్లిపోయారు.  అలాగే సౌమ్య మిశ్రా విశాఖ డీజీపీగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టి.. తనపై అధికారి సౌమ్య మిశ్రాను కలిసేందుకు విశాఖలోని ఆమె కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడం.. తాను వచ్చిన విషయాన్ని పర్యటనలో ఉన్న ఆమెకు తెలియజేశారు. అయితే తాను పర్యటనకు వచ్చానని. తాను వచ్చే పరకు తన కార్యాలయంలో వేచి ఉండాలంటూ.. సూచించారు.  కానీ ఆమె తన కార్యాలయానికి రావడం ఆలస్యం కావడంతో.. శ్రీకాంత్.. తన నివాసం శ్రీకాకుళం వెళ్లిపోయారు. ఆ తర్వాత సౌమ్యా మిశ్ర.. శ్రీకాంత్‌పై కక్ష సాధింపు చర్యలకు సదరు డీఐజీ శ్రీకారం చుట్టారనే ఓ ప్రచారం సైతం నాడు ఊపందుకొంది. ఇలా పోలీస్ శాఖలోకి ప్రవేశించే స్త్రీ శక్తులు.. తమ శౌర్య ప్రతాపాలతో.. ప్రజా రక్షణ కోసం తహతహలాడాల్సింది పోయి.. అక్రమ నగదు కోసం ఒకరు.. ఖాకీ పవర్ చూపించడం కోసం మరొకరు.. ఈగోల సమస్యలతో ఇంకొకరు.. కనిపించని నాలుగో సింహం అయిన ఖాకీవనంలో గంజాయి మొక్కలుగా మిగిలిపోక తప్పదని ప్రజాస్వామిక వాదులు ఓ విధమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.