స్పీడ్ న్యూస్ 2

11. బెంగళూరులో నేడూ రేపు బీజేపీయేతర పక్షాల సమావేశం జగరనున్నది. అయితే తొలి రోజు  ఈ సమావేశాలకు విపక్ష కూటమి ప్రయత్నాలలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డుమ్మా కొట్టారు.  ............................................................................................................................................................... 12. తూర్పు ఫ్రాన్స్‌లోని ఆల్సేస్ ప్రాంతంలో తన ఇంటి టెర్రస్‌పై కూర్చుని స్నేహితురాలితో కలిసి కాఫీ తాగుతున్న మహిళపై ఓ ఉల్క పడింది.  ఉల్క తనను తాకగానే షాక్ కొట్టినట్లు అయ్యిందని ఆమె చెప్పింది.  ఆ ఉల్క సిమెంట్ రాయిలా వింత రంగులో  ఉంది. .......................................................................................................................................................... 13. విపక్షాల కూటమికి హాజరౌతున్న ఆప్. కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన సమావేశానికి హాజరైన ఆప్ కాంగ్రెస్ కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. ......................................................................................................................................................... 14.  తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా  మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడి ఇళ్లపై ఈ ఉదయం అధికారులు దాడులు చేశారు.  మంత్రి వి. సెంథిల్‌బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ........................................................................................................................................................ 15.వర్ధన్నపేట బస్టాండ్ లో ఆగివున్న ఆర్టీసి బస్సును డీసీఎం వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో   డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు గాయపడ్డారు. ............................................................................................................................................................... .16. ఈ నెల 20న నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదా పడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు.   ............................................................................................................................................................... 17.  గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందనప్పటికీ గవర్నర్ తమిళిసై  రాజ్ భవన్ ఆవరణలో  బోనాల పండుగ నిర్వహించి బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.   ............................................................................................................................................................ 18. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు.  సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆణివార ఆస్థానం తమిళులకు అత్యంత ప్రీతివంతమైన రోజు అని తెలిసిందే.   ............................................................................................................................................................ 19.  నరసరావుపేటలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య  ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. ఘర్షణలపై ఇంకా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ............................................................................................................................................................... 20. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కర్నూలులో  క్లీన్ ఆంధ్రప్రదేశ్‌ డ్రైవర్లు నిరసన దిగారు. సీఐటీయూ  ఆధ్వర్యంలో డ్రైవర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.   

వైసీపీలో ముసలం .. చంద్రబాబుకు జై కొడుతున్న నేతలు

ఏపీలో  అధికార వైసీపీతో స‌హా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఎన్నిక‌ల ర‌ణ‌రంగానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. గెలుపే ల‌క్ష్యంగా పార్టీల అధినేత‌లు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. వైసీపీ అధినేత‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. అయితే, ఆయ‌న వ్యూహాలు ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేద‌ని వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్త‌యింది. ఈ నాలుగేళ్ల కాలంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆశించిన స్థాయిలో మేలు జ‌ర‌గ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లే  చెబుతున్న ప‌రిస్థితి. నాలుగేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను అరెస్టులు చేయించ‌డం, జైళ్ల‌కు పంపించ‌డం త‌ప్ప పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల మేలుకోసం చేసింది పెద్ద‌గా ఏమీలేద‌ని జనం గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవ‌ల ఇంటింటికి వైసీపీ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. త‌మ‌కు ఏం చేస్తున్నార‌ని ఇంటింటికి వ‌స్తున్నార‌ని ప‌లు చోట్ల‌ ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను నిల‌దీసిన ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి.  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల కాలంలో ఏపీకి పెద్ద డ్యామేజ్ జ‌రిగింద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగంగా జ‌రిగాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు కూడా వేగంగా జ‌రిగాయి. ప్ర‌తీ సోమవారం చంద్ర‌బాబు పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష‌లు జ‌రిపి ప‌నులు వేగ‌వంతం అయ్యేలా ప్ర‌త్యేక దృష్టిసారించారు. ఇందు కోసం ఆయన సోమవారం ను పోలవారంగా మార్చుకున్నారు కూడా. అంతేకాక‌, ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీల‌ను సైతం ఒప్పించి రాష్ట్రానికి ర‌ప్పించారు. దీంతో ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధిపై దేశ‌ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏపీ దేశ‌ వ్యాప్తంగా న‌వ్వుల‌పాలవుతున్నద‌న్న చ‌ర్చ  విస్తృతంగా జ‌రుగుతున్నది. ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే త‌లదించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని, హైద‌రాబాద్‌, ఇత‌ర రాష్ట్రాల‌కు ఉద్యోగ రిత్యా వెళ్లిన వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నార‌ట‌. ప్ర‌జ‌ల్లో పార్టీపై వ్య‌తిరేక‌త చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగితే విజ‌యం సాధించ‌టం క‌ష్ట‌మ‌న్న భావ‌న‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని, చంద్ర‌బాబు వెంట ఉంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న భావ‌న‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తీరుతో విసుగుచెందిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు కీల‌క వైసీపీ నేత‌లు ఆ పార్టీ రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటి నేత‌లు చంద్ర‌బాబుకు జై కొట్టారు. ఈ ముగ్గురు నేత‌లు టీడీపీ యువనేత‌ లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొని జ‌గ‌న్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనేన‌ని, ప్ర‌జ‌లంతా టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.    నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలే కాకుండా రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ వైసీపీ ఎమ్మెల్యేలు అవ‌కాశం దొరికితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నుంచి బ‌రిలో నిలిస్తే ఎలాగూ విజ‌యం సాధించ‌లేమ‌న్న భావ‌న‌కు స‌ద‌రు ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్ర‌బోస్, ఆయన కుమారుడు సూర్య‌ప్ర‌కాశ్‌లు వైసీపీని వీడుతున్నార‌నీ, వారు త్వ‌ర‌లో టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నీ ప్ర‌చారం జ‌రుగుతుంది. చంద్ర‌బాబుకు జై కొడితే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న భావ‌న‌కు వారు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కాకినాడ జిల్లా జ‌గ్గంపేట వైసీపీలో ముస‌లం మొద‌లైంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మ‌ధ్య వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. వీరిలో ఒక‌రు చంద్ర‌బాబుకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీలో కొన‌సాగేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, వారంతా చంద్ర‌బాబుకు జై కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. జ‌గ‌న్ క‌క్షపూరిత రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు తెచ్చుకోవ‌టం కంటే చంద్ర‌బాబు వెంటఉంటేనే ప్ర‌జ‌ల మద్ద‌తు ల‌బిస్తుంద‌న్న భావ‌నలో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తే వారు టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

స్పీడ్ న్యూస్ 1

1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని 86 వేల 170 మంది దర్శించుకున్నారు. 31 వేల 128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ........................................................................................................................................................... 2. దొంగలు ఏటీఎంలో  ఏసీని దోచుకెళ్లినఇ సంఘటన పంజాబ్ లోని  బాఘ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఓ  ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం ఇద్దరు దొంగలు ఏటీఎంలో అమర్చిన ఏసీని దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వైరల్ అవుతున్నాయి. ............................................................................................................................................................   3.పాకిస్థాన్‌లోని  సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోరే ప్రాంతంలోగల ఓ హిందూ దేవాలయంపై కొందరు దోపిడీ దారులు రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో రాకెట్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.    ............................................................................................................................................................   4.  రంగారెడ్డి జిల్లా  బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో  ఆదివారం సంభవించిన పేలుడులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.  గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.   ............................................................................................................................................................ 5. విమానం గాల్లో ఉండగానే పైలట్ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో  ఓ ప్రయాణీకురాలే   విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు.   శనివారం అమెరికాలోని  విన్‌యార్డ్‌ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.   ............................................................................................................................................................ 6.  భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌‍ప్రెస్‌లో  సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి.  దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.   ............................................................................................................................................................   7.  మంత్రి కేటీ రామారావుకు బెర్లిన్‌ నగరంలో నిర్వహించే  ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీ అలయెన్స్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానం అందింది.   ప్రపంచ నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ............................................................................................................................................................ 8.  మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బహదూర్ పల్లి సమీపంలోని టెక్ మహీంద్ర వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యువరాజు, నాయుడుగా గుర్తించారు. ............................................................................................................................................................ 9. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతికి రానున్నారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఆయన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.  ............................................................................................................................................................ 10. ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పాక్ లో గోధుమ పిండి ధర రికార్డు స్థాయిలో 320 రూపాయలకు చేరిందని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం తెలంగాణ పార్టీల కొట్లాట!

తెలంగాణలో ఎన్నికల సమయం వచ్చేసింది. అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుండి సమాచారం కూడా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ప్రీ ఎలక్షన్ ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు కూడా  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్లి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు, పెండింగ్ హామీలను నెరవేర్చే పని చేస్తుంటే.. ప్రతి పక్షాలు నెరవేర్చని హామీలను ఎండగడుతూ కొత్త కొత్త హామీలను ఇస్తూ ఓటర్లను ఆకర్షించే పని చేస్తున్నాయి. అయితే, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను లోతుగా చూస్తే తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్   ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్ ని చూస్తే.. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని హామీ ఇచ్చారు. కానీ, తీరా రాష్ట్రం సిద్దించి, పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ ఎక్కారు. అలాగే దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి దాన్నీ వదిలేశారు. దీంతో దళితులలో ఈ అసంతృప్తి కనిపిస్తుంది. దాన్ని మాఫీ చేసి దళితులను ఆకట్టుకునేందుకు దళిత బంధు పేరుతో భారీ మొత్తంలో ఆర్ధిక సాయం అందించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ అధిక శాతం ఉన్న దళితులను తన వైపుకు తిప్పుకొనేందుకు మొదలు పెట్టిన ఈ దళిత బంధు అప్పటి నుండి విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వస్తున్నారు. దీంతో పాటు కొత్త తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతేకాదు 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రకాష్ అంబేద్కర్ తో ప్రారంభించారు. మరో వైపు ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ చెక్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. పోడు భూముల సమస్య తొలగిందంటే అది కేసీఆర్ ఒక్కడి వల్లనే సాధ్యమైందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్టీల చెవులలో రీ సౌండ్ వినిపించేలా ఊరూరా చాటారు. ఈ పోడు భూములలో దాదాపు 90 శాతంగా పైగా భూమి ఎస్టీలకు సంబంధించినదే అంటే కేసీఆర్ ఏ స్థాయిలో వ్యూహ రచన చేసారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్టీలకు సంబంధించి ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు ఉపాధి కలిగించేలా రకరకాల పేర్లతో యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చి అమలు చేయలేదో కాంగ్రెస్ వాటినే ఫోకస్ చేసి ప్రజలలోకి వెళ్లేలా చేస్తుంది. కేసీఆర్ చెప్పిన దళిత సీఎం ఛాన్స్ కాంగ్రెస్ లో మాత్రమే ఉందనేలా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. కాంగ్రెస్ లో దళిత నేత భట్టి విక్రమార్క, ఎస్టీ మహిళా నేత సీతక్కల పేర్లు ఇప్పటికే కాంగ్రెస్ దిగ్విజయంగా ఫోకస్ లోకి తెచ్చి పెట్టింది. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి కేటాయిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకు కూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని చెప్తున్నారు. ఇలా మొత్తంగా చూస్తే ఒక వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే కన్నేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. మరి తెలంగాణ ఎస్సీ, ఎస్టీలు ఈసారి ఎవరిని నమ్మి ఓట్లేస్తారో చూడాలి.

చిన్న‌మ్మ ఫైర్‌.. జ‌గ‌న‌న్న సైలెంట్‌.. వైసీపీలో వణుకు?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అధికార ద‌ర్పంతో పైకి దీమాను వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోలోప‌ల ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌పై ఇటీవ‌ల స‌ర్వేలు నిర్వ‌హించ‌గా ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ని తేలిందని చెబుతున్నారు‌. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు , రాజ‌ధాని విష‌యంలో , అలాగే   రాష్ట్రం నుంచి పెద్ద‌ పెద్ద కంపెనీలు త‌ర‌లిపోవ‌టంలోనూ జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని, ఈ క్ర‌మంలో ఏపీలోని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం ప‌నులు, పోల‌వ‌రం ప‌నుల‌తో పాటు ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క చాన్స్  అంటూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో సానుభూతి ఓట్లు, బీజేపీ కేంద్ర పెద్ద‌ల అండ‌దండ‌లు తోడ‌వ్వ‌డంతో భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.  అయితే ప్రజలు తనపై పెట్టుకున్న  న‌మ్మ‌కాన్ని జగన్ వ‌మ్ము చేశారనీ, , చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి సైతం నిర్వీర్య‌మైంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారని ఇటీవలి సర్వేలలో వెల్లడైందంటున్నారు. దీంతో చంద్ర‌బాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్య‌మ‌న్న భావ‌న‌కు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు వ‌చ్చారని చెబుతున్నారు.  వైసీపీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లో సైతం ఇదే విషయం వెల్లడైనట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   ఈ క్ర‌మంలో లోలోప‌ల వైసీపీ నేత‌లను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నా అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆ పార్టీలోని నేత‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇదిలాఉంటే జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి వైసీపీ నేత‌లు టీడీపీ, జ‌న‌సేన నేత‌లే టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎదురు ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌న్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయితే వైసీపీ సర్కార్ పై ఎంతగా విమర్శలు చేసినా బీజేపీ నేత‌లకు  కౌంట‌ర్ ఇచ్చేందుకు మాత్రం వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. జ‌గ‌న్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావ‌డానికి బీజేపీకూడా ఒక కార‌ణ‌మ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. దీంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌కు ట‌చ్‌లో ఉంటూ వ‌స్తున్నారు.  అయితే ఇటీవలి కాలంలో  బీజేపీ ఏపీలో త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీని మార్చేసింది. నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని బీజేపీ అంత‌ర్గ‌త స‌ర్వేల ద్వారా తేలడంతో  ఆ పార్టీ నేత‌లు వైసీపీపై ఎటాక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వ‌చ్చి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ అవినీతి ప‌రుడు అంటూ విమ‌ర్శించారు. దీనికితోడు బీజేపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబును ఢిల్లీకి పిలిపించుకొని భేటీ కావ‌టం ఏపీ రాజ‌కీయాల్లో అల‌జ‌డి రేపింది.  ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు దగ్గుబాటి పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురంధ‌రేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం వెనుక బీజేపీ పెద్ద వ్యూహాన్నే అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.  ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రి   ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన  అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధుల‌ను వైసీపీ త‌మ నిధులుగా ప్ర‌చారం చేసుకుంటున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. మామూలుగా, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తే.. మ‌రుస‌టిరోజే కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ నేత‌లు క్యూ క‌డ‌తారు. పురంధ‌రేశ్వ‌రి విష‌యంలో అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండించేందుకు, కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ నేత‌లు సాహ‌సం చేయ‌లేక‌పోయారు. దీని వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ దూకుడుతో బెంబేలెత్తిపోతున్న త‌రుణంలో బీజేపీ నేత‌ల‌కు కూడా కౌంటర్ ఇచ్చి ఇబ్బంది ప‌డ‌టం ఎందుకనే భావ‌న‌కు వైసీపీ అధిష్టానం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పురంధ‌రేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చి కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించే బ‌దులు సైలెంట్‌గా ఉండ‌ట‌మే మేల‌న్న భావ‌న‌కు జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో బీజేపీతో పెట్టుకొని ఇబ్బందులు ప‌డేకంటే సైలెంట్‌గా ఉండి వారి మెప్పును పొంద‌ట‌మే మేల‌న్న భావ‌న‌లో సీఎం జ‌గ‌న్  ఉన్నార‌ని, ఈ క్ర‌మంలోనే పురంధ‌రేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి మాత్రం ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రస్తావిస్తూ పురంధేశ్వరికి కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధినేత సహా ఎవరూ పురంధేశ్వరి విమర్శలకు స్పందించకుండా మౌనంగా ఉంటే.. ఇటీవల పార్టీలో ప్రాధాన్యత కరవైందని అంతా భావిస్తున్న విజయసాయి గళమెత్తడంపై పార్టీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. విజయసాయి కౌంటర్ పార్టీకి మేలు చేయడం అటుంచి మరింత నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. 

పోటీ ఎక్కడ నుంచి.. పొంగులేటి సందిగ్ధం

తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్  సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతలు  ఏకమయ్యారు. ఇదే క్ర‌మంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్  తరువాత   రాష్ట్రంలో  ఊహించని రీతిలో పుంజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు.  బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త‌ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మ‌రోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో పది నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని పొంగులేటి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా  వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. కొద్ది కాలానికి పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ గూటికి చేరారు. కేవ‌లం భ‌ట్టి విక్ర‌మార్క‌, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు. పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌క ముందు వ‌ర‌కు ఖ‌మ్మంలో భ‌ట్టి విక్ర‌మార్క‌, రేణుక చౌద‌రి వ‌ర్గాలు ఉన్నాయి. భ‌ట్టి విక్ర‌మార్క క‌నుస‌న్న‌ల్లోనే  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం  ఆ పార్టీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. అయితే, ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం ఐదు నుంచి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పొంగులేటి వ‌ర్గీయులే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం సైతం అందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ నేత‌లే చెప్పుకుంటున్నారు.  ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ప్ర‌త్యేకంగా పొంగులేటి అంటే అభిమానించేవారు దాదాపు అన్ని గ్రామాల్లో ఉన్నారు. వారిలో చాలామంది పొంగులేటి వెంట కాంగ్రెస్ వైపు  వ‌చ్చారు. ఇప్ప‌టికే భ‌ట్టి విక్ర‌మార్క‌, రేణుకాచౌద‌రి వంటి నేత‌ల‌తో పాటు పొంగులేటి చేరిక కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో తిరుగులేని విజ‌యాన్ని ఇస్తుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన   పొంగులేటి అప్ప‌టి టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావుపై విజయం సాధించారు. ఆ త‌రువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేర‌కు బీఆర్ఎస్ లో చేరారు. నామా సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవ‌టంతో  2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పొంగులేటికి కాకుండా ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి నామా నాగేశ్వ‌ర‌రావుకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో  పొంగులేటి ఆ ఎన్నిక‌ల్లో  పోటీ చేయ‌లేదు. ఈసారి  పొంగులేటి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.  ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌ర‌ల్ స్థానాలుగా ఉన్నాయి. పాలేరు, ఖ‌మ్మం, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో పొంగులేటి ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నార‌ట‌. పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి ష‌ర్మిల పోటీలో ఉంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ష‌ర్మిల‌ సైతం తాను పాలేరు నుంచే పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో పొంగులేటి ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని స‌మాచారం. మిగిలిన ఖ‌మ్మం, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొంగులేటి బ‌రిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నే విష‌యంపై పొంగులేటి సందిగ్దంలో ఉన్నారట‌. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌లు, కార్య‌క‌ర్త‌లుసైతం పొంగులేటి తమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని కోరుతున్నార‌ట‌. దీంతో పొంగులేటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే అంశం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చకు దారితీసింది.

నందులు గత వైభవ చిహ్నాలేనా?

తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి రాష్ట్రవిభజన తర్వాత  అగమ్యగోచరంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన మన తెలుగు సినీ పరిశ్రమలో  అంగట్లో అన్నీ ఉన్నా అన్న సామెతను గుర్తు చేసేలా ఉంది.  అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో కొరత కనిపిస్తున్నది. కోట్లకు కోట్లు కలెక్షన్లు తెచ్చే పెట్టే సినిమాలు వస్తున్నా.. తెలుగు సినీ పరిశ్రమ ఖండాలు దాటి ఖ్యాతి దక్కించుకుంటున్నా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి మాత్రం ఇసుమంతైనా ప్రోత్సాహం అందడం లేదు. కోట్లకు కోట్లు సినీ పరిశ్రమ  పన్నులు కడుతున్నా..  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు  మాత్రం పరిశ్రమపై ఎటువంటి శ్రద్ధా చూపడం లేదు.  త్రుణమో పణమో ఇచ్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడమే లేదు. సినిమా వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వడమే తప్ప.. ప్రభుత్వాలు మాత్రం సినిమా వాళ్లకి తిరిగి ఏదీ ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోయింది. షూటింగులు, ఎడిటింగులు, మీటింగులు అన్నీ ఇక్కడ నుండి నడుస్తున్నాయి. సినిమా వాళ్ళ నుండి ఆదాయం కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమని అరకొరగానే పట్టించుకుంటున్నది. సినిమా వాళ్ళు పిలిస్తే మంత్రులు తలసాని, కేటీఆర్ లాంటి వారు హాజరై ఆశీర్వదించడం, షూటింగులకు, కొత్త సినిమా విడుదల సమయంలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం తప్ప అభివృద్ధి, ప్రోత్సాహకాల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను పక్కన పెట్టేసిన తెలంగాణ ప్రభుత్వం ఉగాది ఉత్సవాలు లాంటి వేడుకలను సైతం జరిపించడం లేదు. కేవలం షూటింగుల వలన వచ్చే ఆదాయాన్ని, టికెట్ల పైసలను తన ఖజానాలో వేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తిరిగి సినిమా కోసం ఖర్చు పెట్టేందుకు ఇష్టపడడమే లేదు. ఇక ఏపీలో పరిస్థితే వేరు. సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉండగా చేయడానికి మా దగ్గర ఏముంది అన్నట్లు ఏపీ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖలో చాలా సినిమాలు షూటింగ్స్ చేసేవారు. కానీ, ఇప్పుడు విశాఖ వైపు దర్శక, నిర్మాతలు వెళ్లడమే మానేశారు. సినిమా విడుదల సమయంలో మాత్రం ఈవెంట్లు నిర్వహించి ప్రమోషన్లు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ఏపీకి రావాలని కోరుతున్నారు తప్ప.. వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు అనువైన అభివృద్ధి మాత్రం చేయడం లేదు. పైగా ఆ మధ్య సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే అమ్మాలని ఆలోచన చేయడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సమయంలో సినీ పెద్దలు కొందరు తాడేపల్లి గూడెం జగన్ నివాసానికి వచ్చి ఒంగి ఒంగి మరీ దండాలు పెట్టి సమస్యను చెప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి తెలంగాణ కొత్త రాష్ట్రం కనుక.. పాత రాష్ట్రమైన ఏపీనే యధావిధిగా నంది అవార్డులు ఇచ్చినా అభ్యంతరం లేదు. కానీ, ఏపీ ప్రభుత్వం అసలు రాష్ట్రంలోనే లేని పరిశ్రమకి అవార్డుల ఖర్చు కూడా దండగే అన్నట్లు ఉండిపోతుంది. అయితే, తెలుగు సినీ పరిశ్రమకి ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ అంతా తెలంగాణలోనే ఉన్నా అందులో ఆంధ్రా వాళ్లే ఎక్కువ. వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా వారిగానే చూస్తున్నట్లుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ యాస హిట్టు కొడుతోంది. తెలంగాణ నటులు, టెక్నీషియన్లు కూడా పెరుగుతున్నారు. దీంతో భోజ్ పురి సినీ పరిశ్రమ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ సినీ పరిశ్రమ ఎదగాలని భావిస్తోంది. అందుకే ఆంధ్రా వారి ఆధిపత్యం అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం పరిశ్రమను పట్టించుకోవడం లేదు. పరిశ్రమలో తెలంగాణ వారిని అభివృద్ధిలోకి తీసుకు రావాలని చూస్తుంది. దీంతో పరిశ్రమలో ఆంధ్రా నటులు, ఆంధ్రా టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు ఇప్పుడు అటు ఏపీలో చెల్లక.. తెలంగాణ పట్టించుకోక  ఎవరికీ పట్టని వారిలా మిగిలిపోయారు.   దీంతో ప్రతిభామంతులైన నటీనటులకు వారి ప్రతిభకు గుర్తుగా ఇచ్చే నంది పురస్కారాలు గత వైభవ చిహ్నాలుగానే మిగిలిపోయాయి. 

స్పీడ్ న్యూస్ 2

1. రాష్ట్రం గంజాయి సరఫరా వెనుక ముఖ్యమంత్రి వైయస్ జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అందుకే గంజాయిని ఆరికట్ట లేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో గంజాయిపై రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. భారతదేశానికి డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందంటూ వివరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. తన పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారని లోకేశ్ తెలిపారు.  ................................................................   2. పశ్చిమ గోదావరి జిల్లా అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల అక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని అందులో పేర్కొన్నారు. 1950 నుంచి దాదాపు 3,255 ఎకరాల భూమి అటవీ శాఖ అధీనంలో ఉందని.. కానీ, సంబంధిత శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కొంత భూమిని సాగుభూమిగా ప్రకటించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై కోర్టులో వివాదం నడుస్తోందన్నారు.  ...................................................   3. వాలంటీర్ల పోస్టులంటే యువతను నిర్వీర్యం చేయడమే కదా? అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై ఢిల్లీలో ఆయన మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని విజయసాయిరెడ్డి వంటి వాళ్లే చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు. కుటిల రాజకీయ నీతితో నిర్మించిందే వాలంటీర్ల వ్యవస్థ. సేవ చేసేందుకు వచ్చిన వాళ్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తారా? మీరు తెచ్చిన వ్యవస్థపై మీకే నమ్మకం లేక అంబటి రాయుడితో కితాబు ఇప్పించుకున్నారా? వాలంటీర్ల పేరుతో ఇంతమంది యువత భవష్యత్తును నాశనం చేస్తారా?అని రఘురామ నిలదీశారు.  ..................................................  4. కోనసీమ జిల్లాలోని శివకోటి ఆక్వా చెరువు వద్ద బోరుబావి నుంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడటానికి గ్యాస్ పైప్‌లైన్ కారణం కాదని, అక్కడ అసలు పైప్‌లైన్ లేదని ఓఎన్జీసీ సిబ్బంది తేల్చారు. భూమి పొరల్లో గ్యాస్, నీరు ద్వారానే మంటలొచ్చాయని చెప్పారు. బోరును మరింత లోతుగా తవ్వడం వల్లే అగ్నికీలలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు. నరసాపురం నుంచి ప్రత్యేక బృందం వస్తుందని, వారు వచ్చాకే మంటల్ని అదుపు చేయడం సాధ్యపడుతుందన్నారు.   ............................................. 5. రామతీర్ధం అనువంశక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు పూర్ణ కలశంతో స్వాగతం పలికిన అర్చకులు షోకాజ్ నోటీసులు అందుకొన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రలో భాగంగా రామతీర్ధం కూడలిలో అశోక్‌ గజపతిరాజును ఆరుగురు అర్చకులు ఆశీర్వదించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో కిషోర్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. అశోక్‌ గజపతి రాజును ఆశీర్వదించిన ఆరుగురు అర్చకులకు ఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తమకు తెలియకుండా టీడీపీ నేతలకు ఎలా స్వాగతం పలుకుతారంటూ ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.  అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  ..................................................... 6. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు.  అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించిన తర్వాత.. ఆ దంపతులకు అర్చకులు ఆశీస్సులు, ప్రసాదం, శేషవస్త్రం అందించారు. ........................................................... 7. రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. బీహార్‌లో గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మందికిపైగా మృతి చెందారు. రోహ్‌టాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరన్‌లో ముగ్గురు, ఔరంగాబాద్, తూర్పు చంపరాన్ జిలాల్లో చెరో ఇద్దరు, బంక, వైశాలి జిల్లాలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ..................................... 8. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద.. ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలే తమ అజెండా అని.. అలాగే ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్నారు. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ............................... 9. గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ గాంధీ భవన్‌కు రేవంత్ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. దీంతో వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు.  .........................................   10. విదేశాలకు వెళ్లి అక్కడ మరణించిన భారతీయుల మృతదేహాలు లేదా ఆస్థికలు స్వదేశానికి తీసుకురావడానికి ప్రామాణిక నిర్వహణ పద్దతులను విదేశీ వ్యవహారాల శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించాలని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 13న ఆదేశించింది. భారత్ నుంచి విమాన ప్రయాణాలను నిర్వహించే పౌర విమానయాన సంస్థలు కూడా తమ వెబ్‌సైట్లలో ఎస్‌ఓపీని ప్రచురించాలని తెలిపింది. భారతీయ పర్యాటకులు విదేశాల్లో మరణిస్తే, అక్కడి భారత రాయబార కార్యాలయం మృతుని కుటుంబంతో సంభాషణ సంప్రదింపులు జరపాలని, ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోతే మన దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసిన భారతీయ కమ్యూనిటీ సంక్షేమ నిధి నుంచి సముచిత చెల్లింపులు జరిపి ఆదుకోవాలని సూచించింది. ఇటీవల ఓ భారతీయ పర్యాటకుడు మాల్దీవులకు వెళ్లి మరణించారు. ఆయన అవశేషాలను స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో సమస్యలు తలెత్తడంతో వ్యవహారం హైకోర్టు దృష్టికి వచ్చింది. ఎస్ఓపీ, సంక్షేమ నిధి గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. 

మంత్రి రోజా.. తిట్ల పురాణంలో కొత్త పుంతలు

రోజా..  తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.  గతంలో వెండితెర మీద హీరోయిన్‌గా వెలుగు వెలిగినా.. నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద  జబర్దస్త్ వంటి  కామెడీ షోల్లో న్యాయ నిర్ణేతగా కమేడియన్లకు మార్కులేసినా..   రియాల్టీ షోల్లో   లేడీ పెదరాయుడిలా తీర్పులు చెప్పినా.. మంత్రి పదవి వచ్చిన తరువాత  వాటన్నింటికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేశారు.   జగన్ తన తొలి కేబినెట్ లో రోజాకు హ్యాండిచ్చి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా మంత్రి రోజాకు జగన్ తొలి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదు. దానికి రోజా అలిగినా గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనంగానే ఉన్నారు. ఆ తరువాత ఎన్నాళ్లో వేచిన ఉదయం ఎదురైన చందంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచీ ఆమె కామెడీ షోలకు స్వస్తి చెప్పారు. అయితే పారే ఏరు.. పాడే నోరు ఊరుకోవన్నట్లుగా.. కామెడీ షోలలోనూ, రియాల్టీ షోలలోనూ ప్రసంగాల్లాంటి మాటలకు అలవాటుపడిన  రోజా తన వాగ్ధాటిని విపక్షాలపై ప్రయోగించడం ప్రారంభించారు.  జగన్ పై విపక్షాలకు చెందిన నేతలు చిన్న పాటి విమర్శ చేసినా రెచ్చిపోతారు. నోటికి హద్దూపద్దూ లేదన్నట్లుగా విమర్శలు గుప్పించేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె పలుమార్లు పరిధి మీరారు. మాట తూలారు కూడా. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశంసించడాన్ని రోజా తప్పుపడుతూ రజనీకాంత్ పై చేసిన విమర్శలు సంచలనం సృష్టించడమే కాకుండా, ఏపీ, తెలంగాణలలో ఆమెపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆమె నోటి దురుసు, దుందుడుకు వైఖరి కారణంగా సొంత జిల్లాలోనే, సొంత పార్టీలోనే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురౌతున్నది. సంయమనంతో సొంత పార్టీలోని వ్యతిరేకతను తగ్గిచుకునే ప్రయత్నం చేయడానికి బదులు.. జగన్ కు మద్దతుగా ఆయనపై ఈగకూడా వాలనీయని విధంగా విపక్షాలపైనా, జగన్ విమర్శకులపైనా నోరెట్టుకు పడిపోతే తన పదవికి, వచ్చే ఎన్నికలలో టికెట్టుకు ఢోకా ఉండదన్న భావనతో రోజా ముందుకు సాగుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.   తాజాగా ఆమె జనసేనాని పవన్ కల్యాణ్ పై తనదైన ప్రత్యేక శైలిలో విమర్శలు చేశారు.  పవన్ కల్యాణ్  సీఎం జగన్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడమే రోజా విమర్శలకు కారణం.   వాలంటీర్ల వ్యవస్థపైనా, జగన్ పైనా పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయ విమర్శలకు రాజకీయంగా సమాధానాలు దొరకక వైసీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో వారు దూషణలు, బూతుల పర్వానికి తెరలేపుతున్నారు. మంత్రి రోజా కూడా అదే రీతిలో పవన్ పై విరుచుకుపడ్డారు. విషయం లేకుండా పవన్ ఎదురుగా వస్తే లాగిపెట్టి కొట్టాలనుందనీ, వాలంటీర్లపై విమర్శలు చేస్తున్న పవన్ క కల్యాణ్  కు గతంలో జన్మభూమి కమిటీలపై నోరెత్తలేదెందుకు అని ప్రశ్నిస్తూ అప్పుడేమైనా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా అంటూ, జగన్ సంస్కారం గురించి పవన్ వ్యాఖ్యానిస్తుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుందంటూ మంత్రి స్థాయికి తగని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె తాను కూడా  ఒకప్పుడు నటినేనన్న సంగతి  మరిచి వ్యాఖ్యలు చేశారు. పవన్ పై వ్యాఖ్యలనే కాకుండా మరో నటి సన్నిలియోన్ ను చులకన, పలుచన చేసేలా రోజా చేసిన వ్యాఖ్యలపై కూడా సర్వత్రా విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అయినా రోజా మంత్రిగా కలెక్షన్ క్వీన్ అనే బిరుదును సంపాదించుకున్నారే తప్ప.. రాష్ట్రానికి, రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి ఆమె చేసిందేమిటన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.  ఇంతకీ మంత్రి రోజాగారు పవన్ పై ఈ విమర్శలు ఏదో పార్టీ కార్యక్రమంలోనో సభలోనో చేసినవి కాదు. తన శాఖకు సంబంధించిన ఓ సమీక్షా సమావేశంలో. సమీక్షా సమావేశంలో అధికారులతో తన శాఖకు సంబంధించిన విషయాలను చర్చించాలి కానీ.. ఈ రాజకీయ విమర్శలేమిటన్న ప్రశ్నకు సమాధానం సులువుగానే దొరికేస్తున్నది. మంత్రి హోదాలో రోజా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే అధికారులెవరూ హాజరు కాలేదు. దీంతో ఈ సమావేశం వేదికగానే మీడియా  ముందు రోజా పవన్ కల్యాణ్ వేదికగా విమర్శలు గుప్పించేశారు. అధికారులు సమావేశానికి గైర్హాజర్ కావడాన్ని లైట్ గా తీసుకుని నామ్ కే వాస్తేగా సమీక్షకు డుమ్మా కొట్టిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సిఫారసు చేసి చేతులు దులిపేసుకున్నారు. మంత్రిగా సమీక్షలు చేయడం కంటే   ఫైర్ బ్రాండ్ ముద్ర కాపాడుకోవడం వల్లనే తన రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉందన్నది రోజాకు బాగానే తెలుసునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

వాలంటీర్లకు మద్దతు కూడగడుతున్న జగన్ సర్కార్

ఏపీలో ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర రెండవ విడతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలపై తూర్పార పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుండి కూడా రివర్స్ కౌంటర్లు వస్తున్నాయి. రెండవ విడత తొలిరోజు యాత్రలో భాగంగా ఏలూరులో గత ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా రేపాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు రాష్ట్రంలో మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపారు. వాలంటీర్లు ఘాటుగా స్పందించినా మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గని పవన్.. కోడిపిల్లలను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నట్లు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని, కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్తుందని మరో కొత్త ఆరోపణను తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని, ఇక్కడ 700 మంది ఉద్యోగులున్నట్లు పవన్ చెప్పారు. నానక్ రామ్ గూడలోని సంస్థలో ఏపీ డేటా ఎందుకు పెట్టారని.. ఏపీ ప్రజల డేటాను ఆ సంస్థలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్‌ క్రాస్‌ సంస్థకు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ అధిపతిగా ఉన్నారని.. మరి సీఎం జగన్‌ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. జగనన్నే నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చారు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో కొందరు వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు.  అయితే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వలంటీర్లకు మద్దతు కూడగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను దైవాంశ సంభూతులుగా పేర్కొంటూ కొందరు వైసీపీ నేతలు వారికి సన్మానాలు చేయగా.. ఒక వైసీపీ ఎమ్మెల్యే అయితే వాలంటీర్ కాళ్ళు కడిగి పవన్ కళ్యాణ్ తరపున క్షమాపణలు కోరారు. కాగా, ఇప్పుడు వాలంటీర్లకు ప్రజల మద్దతు కోరుతూ వివిధ పథకాలలో లబ్ది పొందిన వారికి వాయిస్ కాల్స్ చేస్తున్నారు. రకరకాల నంబర్ల నుండి ఐవీఆర్ కాల్స్ చేస్తూ ప్రజలందరూ పవన్ వ్యాఖ్యలను తీవ్రం ఖండిస్తూ వాలంటీర్లకు అండగా నిలబడాలని కోరుతున్నారు. వాలంటీర్లు అవ్వా తాతలను ఉదయాన్నే నిద్రలేపి పెన్షన్ ఇస్తున్నారని, ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనే వరకు అండగా నిలబడదామని, వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పేవరకు వారి పోరాటానికి మద్దతుగా ఉందామని కాల్స్ ద్వారా కోరుతున్నారు. మరి ఈ కాల్స్ కు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

బాబాయికి శఠగోపం

టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఇకపై ఉత్తరాంద్ర జిల్లాల పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలకు మాత్రమే పరిమితం చేయాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వైసీపీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి బాబాయిని తప్పించాలని అబ్బాయి వైయస్ జగన్  భావిస్తున్నారని చెబుతున్నారు.  అదీకాక ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవిని.. ఒకసారి పొడిగించారని.. ఈ సారి ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.  కాగా వచ్చే నెల   12వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్  పదవీకాలం ముగియనుంది. మరో వైపు అసెంబ్లీ,సార్వత్రిక ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుందని... అంతే కాకుండా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారని.. దీంతో  వైసీపీ అధికారంలో ఉన్నా.. పార్టీ  ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి  వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లో ఈ ఎన్నికలు జరిగినా కూడా.. ఫలితం మాత్రం ప్రతిపక్షానికి అనుకూలంగా రావడంతో..   సీఎం జగన్ అండ్ కో  తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.   ఇక విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు.. తాజాగా తన పదవికే కాదు.. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి.. ఫ్యాన్ పార్టీపై తనలో రగులుతోన్న అసంతృప్తిని ప్రెస్‌మీట్ పెట్టీ మరి వెళ్లగక్కారు. ఉత్తరాంధ్రలో  ఇటువంటి అసంతృప్తి జీవులు చాలా మందే ఉన్నారని.. వారందరినీ ముందుగానే కట్టడి చేసే బాధ్యత బాబాయి వైవీ సుబ్బారెడ్డి భుజస్కందాలపై సీఎం జగన్ ఉంచనున్నట్లు తెలుస్తోంది.    మరో వైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిగిలిన రాజకీయ పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడుతో పాటు కిమిడి నాగార్జున సైతం ఉత్తరాంధ్రలో సైకిల్ పార్టీని సూపర్ స్పీడ్‌తో సవారీ చేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  ఇంకో వైపు బీజేపీ, జనసేన   సైతం ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృషి సారించాయి. అటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని విజయ పథంలో నడిపించేందుకు వైవీ సుబ్బారెడ్డిని సీఎం జగన్ సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే గత ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని.. ఆ క్రమంలో పార్టీ గెలుపులో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తూ.. పక్కా ప్రణాళిక బద్దంగా పావులు కదిపారనే ఓ టాక్ అయితే  వైవసీపీలో  నేటికి హల్‌చల్ చేస్తోందని... అయితే జగన్  అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని వైయస్ జగన్ నియమించారు.  అయితే విజయసాయిరెడ్డిలాగే వైవీ సుబ్బారెడ్డి కూడా చాలా పకడ్బందీ ప్రణాళికలతో.. ముందుకు సాగి రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్యాన్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తారా? లేకుంటే పార్టీని  ముంచుతారా? అనే ఓ సందేహం సైతం  పార్టీలోని సదరు వర్గంలో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.  ఇక వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవిలో కొత్త వారిని నియమించేందుకు వైయస్ జగన్ ఇప్పటికే పలువురు పేర్లను   పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వైసీపీ ఆవిర్భావం నుంచి  పార్టీ విజయం కోసం శ్రమిస్తున్న వారి జాబితాను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.అలాగే చైర్మన్ గిరి పదవి కట్టబేట్టేందుకు సామాజిక సమీకరణాలను సైతం సీఎం జగన్ పరిగణలోకి తీసుకొని మరీ పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

స్పీడ్ న్యూస్ 1

1. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా  అడుగులు వేస్తున్న   టీపీసీసీ ప్రచార కమిటీలను ప్రకటించింది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీని, కోఛైర్మన్ గా పొంగులేటిని నియమించింది.    2.  ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై ఇనుపరాడ్లతో దాడి జరిగింది.  సిడ్నీ నగరంలోని మేర్రీల్యాండ్స్‌లో  ఖలిస్థానీవాదులు ఆ యువకుడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. 3.   వేస్టిండీస్‌తో  రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  అరంగేట్రం మ్యాచ్ లోనే భారీ సెంచరీతో  ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.  రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది. 4. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల  పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంచయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం   విచారణ జరిపింది.  5.   దేశ రాజధాని నగరం మూడు రోజులుగా  జలదిగ్బంధంలో ఉంది.  సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీని కలిపే వికాస్ మార్గ్ మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మెట్రో ద్వారా మాత్రమే సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వెళ్లే సౌకర్యం ఉంది. 6. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు.  కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ తో కల‌సి మొక్కలు ఆయన మొక్కలు నాటారు,  కీసర గుట్ట వలె కొండగట్టులో ఎనిమిది వందల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 7.  బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో  ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.   బంగాళాఖాతంలో  17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ రాష్ట్రంలో  నెలాఖరు వరకు  వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  8. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌కి  ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్   నోటీసులు జారీ చేసింది.  ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తను కొట్టిన సంఘటనపై సీఐ అంజూయాదవ్‌తో సహా స్టేషన్‌ ఆఫీసర్‌, తిరుపతి డిఎస్పి, తిరుపతి ఎస్పీ, అనంతపురం డిఐజి, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.   9. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహషన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్‌ స్వాములు జనసేన గూటికి చేరనున్నారు. మంగళగిరిలోని  పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆమంచి శ్రీనివాసరావు జనసేన కండువా కప్పుకోనున్నారు.   10. కోనసీమ జిల్లా  శివకోడులో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. పవన్ అటాక్.. వైసీపీ బెంబేలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన పోకిరి సినిమాలో మాఫియా డాన్ ప్ర‌కాశ్ రాజ్‌ను ఉద్దేశిస్తూ షియాజీ షిండే ఓ డైలాగ్ చెబుతాడు.. క‌రెక్ట్ ఆఫీస‌ర్ త‌గ‌ల్లేదు నీకు.. అప్పుడు తెలుస్తుంది.. అంటాడు. అచ్చం ఇదే  డైలాగ్ అధికార వైసీపీ నేత‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంద‌నే వాద‌న ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతుంది. ఈ నాలుగేళ్ల‌లో ఆ పార్టీ నేత‌ల అరాచ‌కాలు చాలానే వెలుగులోకి వ‌చ్చాయి. టీడీపీ నేత‌ల‌నైతే ఓ ఆటాడుకున్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును సైతం వ‌దిలిపెట్ట‌లేదు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌నుసైతం అస‌భ్య‌క‌రంగా అవ‌మానించిన ప‌రిస్థితి. చంద్ర‌బాబుపై మాట‌ల దాడికి ఒక‌రిద్ద‌రు మంత్రుల‌తోపాటు, ప‌లువురు ఎమ్మెల్యేల‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా కేటాయించార‌న్న ప్ర‌చారం కూడా గ‌తంలో జ‌రిగింది. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి వ‌ర‌కు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబుపై దూష‌ణ‌లు చేయ‌డ‌మే  ప‌ని అన్న‌ట్లుగా కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్తించారు.  అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బ‌య‌టా చంద్ర‌బాబును, టీడీపీ ముఖ్య‌నేత‌ల‌ను టార్గెట్‌ చేసి వైసీపీ నేత‌లు మాట‌ల దాడి చేసిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ఒకానొక ద‌శ‌లో మా అధినేత చంద్ర‌బాబును తిట్ట‌కండి అని టీడీపీ నేత‌లు మొర‌పెట్టుకునే స్థాయికి వైసీపీలోని కొంద‌రు ఎమ్మెల్యేలు ప్ర‌వ‌ర్తించారు. అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఇదే ఫార్ములాను అమ‌లు చేసుకుంటూ వ‌చ్చారు. మొదట్లో జ‌గ‌న్ ఫార్ములా మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే ఫార్ములా జ‌గ‌న్‌ మెడ‌కు చుట్టుకుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై మండిప‌డుతున్నాడు. అయితే, టీడీపీపై ప్ర‌యోగించిన ఫార్ములానే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైనా ప్ర‌యోగించారు. కానీ, అది బెడిసికొట్ట‌డంతో వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌ చెందుతున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంట‌ర్ విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఆ విమ‌ర్శ‌లన్నీ బూతుల స్థాయిలోనే ఉన్నాయి. అయితే  ప‌వ‌న్ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి కౌంట‌ర్ ఇస్తూ వ‌చ్చాడు. ఇటీవ‌ల వారాహి విజ‌య యాత్ర ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం జ‌గ‌న్ టార్గెట్‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. వారం రోజుల క్రితం వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ప‌వ‌న్‌ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద దుమారం రేపాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వ‌స్తున్నారు. అయితే, ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డం త‌మ‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌న్న భావ‌న‌లో వారు ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్  నేరుగా జ‌గ‌న్‌ను టార్గెట్‌చేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా జ‌గ్గుభాయ్ అంటూ ర్యాగింగ్ సైతం చేస్తున్నాడు. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ప‌వ‌న్‌తో గొడ‌వ వ‌ద్దని జ‌గ‌న్‌కు కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు న‌చ్చ‌జెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్‌తో పెట్టుకోవ‌టం వ‌ల్ల ముఖ్యంగా గోదారి జిల్లాల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లూ తాము చేసిందే విమర్శ అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు  ప‌వ‌న్ దూకుడు చెక్ పెట్టిందనే చెప్పాలి.  అటు అధినేత‌కు న‌చ్చ‌జెప్ప‌లేక‌, మ‌రోవైపు ప‌వ‌న్ పై ఎదురుదాడి చేయ‌లేక ఇబ్బంది నానా ఇబ్బందులూ పడుతున్నారు.  పవన్ విమర్శల దాడి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు  పొరుగు రాష్ట్రంతో అనవసర వివాదానికి సైతం సిద్ధ పడుతున్నారు. పవన్ చేత తిట్టించుకునే కంటే పొరుగు రాష్ట్రం మంత్రుల చేత తిట్టించుకోవడం మేలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.  రెండురోజుల క్రితం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నమ‌ని  చెబుతున్నారు. అలాగే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇస్తూ  బొత్స   పొద్దుపొద్దున్నే మాకు ఇదేక‌ర్మ అంటూ వ్యాఖ్యానిచ‌టం వారిలో అసహనం, ఆందోళన పీక్స్ కు చేరిందనడానికి నిదర్శనంగా  చూపుతున్నారు.  

టీడీపీ, జనసేన తొడకొడుతున్నా వైసీపీలో చలనం లేదేంటి?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రం ఎన్నికల ఏడాదిలో కి అడుగుపెట్టేసింది. సమయం దగ్గర పడే కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై దండయాత్ర మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా చెప్తున్నాయి. బీజేపీ కూడా సమరానికి సిద్దమవుతున్నది. బీజేపీ జాతీయ నేతలు వచ్చిన ప్రతిసారి వైసీపీ ఫెయిల్యూర్ అని గంట కొట్టి  మరీ చెప్పి వెళ్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈసారి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి నారా లోకేష్ యువగళం పేరుతో  పాదయాత్ర చేస్తూ రెండు వేల కిమీ చుట్టేయగా రాయలసీమలో సైతం ఊహించని స్థాయిలో లోకేష్ పాదయాత్రకి ఆదరణ వచ్చింది. లోకేష్ రోజులు గడిచే కొద్దీ మాటలలో వేడి పెంచుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయయాత్రతో కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ఒక విడత వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా ఈ మధ్యనే రెండో విడత కూడా యాత్ర మొదలైంది. పవన్ అధికార పార్టీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే కట్టలు తెంచుకొనే ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ తొలి విడత యాత్రలో ఆ నైజం పక్కన పెట్టగా.. రెండో విడత యాత్రలో ఆ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. సూటిగా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సంస్కార హీనులని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తెచ్చిన వాలంటీర్లు దేశద్రోహులకు సహకరిస్తున్నారంటూ భారీ ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా.. వార్నింగులు ఇచ్చినా వెనక్కు తగ్గక మరికాస్త డోస్ పెంచి వైసీపీని దుయ్యబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. పవన్, లోకేష్ భాషలలో చెప్పాలంటే.. జగన్ ఒక క్రిమినల్ అనీ, వైసీపీ అంటే జగ్గూభాయ్ గ్యాంగ్ అని, అసమర్ధ సీఎం జగన్, మరో హిట్లర్ జగన్, జగన్ అనే రౌడీ చేతులు రక్తంతో తడిసిపోయాయని పెద్ద పెద్ద బాంబుల లాంటి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే జగన్ అనే వ్యక్తి మిత్రుడిగా కాదు శత్రువుగా కూడా పనికిరాడని తీసి పడేశారు. మరి ఇంతలా భీకరమైన మాటల దాడి జరుగుతూంటే వైసీపీ మాత్రం సైలెన్స్ మైంటైన్ చేస్తుంది. ఒకప్పుడు జగన్ ను ఒక్క మాట అంటే ఆ అన్న వారిని వైసీపీ నేతలు, శ్రేణులు ఎదురుదాడి చేసి చీల్చి చెండాడే వారు. వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని సైతం బజారుకీడ్చి నోటికి పనిచెప్పే వారు. కానీ ఇప్పుడు అవేవీ వైసీపీ నేతలలో కనిపించడం లేదు. దీంతో వైసీపీ ఎందుకు ఇలా మౌనంగా ఉంటుందన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నది. పోయిన వాళ్ళు పోయినా.. వెళ్లగొట్టిన వాళ్ళను తీసేసినా ఇంకా వైసీపీలో 130కి పైగా ఎమ్మెల్యేలు యాక్టివ్ ఉన్నారు. వాళ్ళలో 30 నుండి 40 మంది సీనియర్లు కూడా ఉన్నారు. పాత మంత్రులు, కొత్త మంత్రులు ఓ 20 మంది వరకూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంపీలు, మాజీలు, సలహాదారులు, చైర్మన్లు, డైరక్టర్లు ఇలా భారీ సైన్యమే ఉంది. ఇంత మంది ఉండి కూడా వాళ్ల అధినేతని పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నా ఒక్కరూ కదలడం లేదు.. మెదలడం లేదు. విజయసాయి, సజ్జల లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకురావడం లేదు. జగన్ ను ఒక్క మాట అంటే వంద వడ్డించే రోజా.. జగన్ కోసం ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా అనే కొడాలి నానీ, జీవితమంతా జగన్ కోసమే అని చెప్పిన ఒకరిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతున్నది? ఎందుకిలా అంతా కట్టకట్టుకుని మౌనవ్రతం పాటిస్తున్నారు అన్నది ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీస్తున్నది.

పాపం.. వైసీపీ విశాఖ ఆశలు ఆవిరి?!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి మంచి బలం ఉన్న సంగతి తెలిసిందే. అది జగన్మోహన్ రెడ్డి బలం అనే కన్నా వైఎస్ కుటుంబానికి ఉన్న బలం అని చెప్పుకోవాలి. ఆ బలం కూడా ఈసారి ఎన్నికలలో ఉంటుందా ఉండదా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇక కడప తర్వాత వైసీపీకి బలమైన జిల్లా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాను ఎంచుకున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. రాయలసీమలో ఉమ్మడి కడప జిల్లా తర్వాత విశాఖ జిల్లాను తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావించారు. అందుకే పరిపాలన అక్కడ నుండే చేస్తానని.. మూడు ముక్కల రాజధానిలో ఒక ముక్క మీకే ఇస్తానని విశాఖ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ, అవి రెండూ జరగలేదు. అక్కడి వైసీపీ నేతలు కూడా జగన్ మాటలను నమ్మినట్లు లేదు. అందుకే వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.  ఈ పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రజారాజ్యం అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవగా.. అందులోనే ఉంటూ వచ్చారు. రాష్ట్రవిభజన అనంతరం కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడంతో 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో  వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. రమేష్ బాబు పార్టీల జంపింగ్ ఎలా ఉన్నా స్థానికంగా ఆయనకు వివాదరహితుడు, అవినీతి మరక లేని మనిషిగా పేరుంది. ఆయనది కాపు సామాజిక వర్గం కావడంతో  వైసీపీ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించింది. మరి ఇప్పుడు అలాంటి సౌమ్యుడే వైసీపీలో ఉండలేక బయటకి వచ్చేయడం ఈ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. నిజానికి వైసీపీ ఎలాగైనా విశాఖను కంచుకోట చేసుకోవాలని చూస్తున్నది. కానీ మొదట నుండి ఇక్కడి ప్రజలు వైసీపీకి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. విశాఖ నుంచి తొలిసారి జగన్ తల్లి విజయమ్మను ఎంపీగా పోటీ చేయిస్తే ఆమెను ఓడించి ఇంటికి పంపారు. 2019లో అంత పెద్ద జగన్ గాలిలో కూడా విశాఖ సిటీలో నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో కూడా ఇక్కడి ప్రజలు వైసీపీని కాదని టీడీపీ వైపే నిలిచారు. ఈసారి ఎన్నికలలో అయినా ఇక్కడ టీడీపీని దెబ్బతీసి  పుంజుకోవాలని వైసీపీ కలలు కంటోంది. ఆ కల నెరవేర్చుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ లోగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక నా వల్ల కాదని కాడి కింద పడేసి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు తీర్చలేనపుడు, జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యత నన్ను చేయనివ్వనపుడు ఈ పదవి నాకెందుకు అంటూ ఆయన తనదైన స్టైల్ లో గట్టిగానే ఇచ్చి వెళ్లారు. దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఏడాదిలోకి వచ్చేశాం. విశాఖ జిల్లా వైసీపీకి  జిల్లా అధ్యక్షుడు లేడు. ఏం చేయాలన్నది ఆ జిల్లా పార్టీని పీడిస్తున్న ప్రశ్న. ఇటు సామజిక వర్గాల లెక్కలు కావాలి.. అటు సమర్ధుడైన నాయకుడు కూడా కావాలి. ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆయనకు జిల్లా పార్టీని నడిపించే సత్తా లేదని వైసీపీ నేతలకీ తెలుసు. ఒక వైపు సీఎం చెప్పినట్లుగా విశాఖకి రాజధాని రాలేదు.. విశాఖలో శాంతిభద్రతలపై ఎన్నో అనుమానాలు, నగరంలో పెరిగిన క్రైమ్, అసలే తొలి నుండి వైసీపీని నమ్మని విశాఖ జనం, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి నాయకత్వ లోపం.. నేతల మధ్య అంతర్గత పోరు. దీంతో ఈసారి కూడా వైసీపీ విశాఖ ఆశలు గల్లంతైనట్లే భావించాల్సి వస్తుంది.

బాబు దార్శనికతకు దర్పణం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువునా చీలిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్యంధ్రప్రదేశ్ అపప్రదను మూటకట్టుకొంది. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు.. తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అంతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో ఓ వైపు రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు కోసం ఆన్వేషణ సాగిస్తూనే.. మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమల స్థాపన  కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటి పడినా.. కియా సంస్థ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.  అలా 2017లో ఆ పరిశ్రమ కార్ల తయారీని ప్రారంభించిన కియా.. తాజాగా  శుక్రవారం (జూన్ 14) మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకొంది. ఈ సందర్భంగా కియా సంస్థకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సైతం ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.  అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకొవడం ఆనందంగా ఉందని... సదరు యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పమన్న ఆయన.. ఈ సమర్థ విధానం ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రపంచ వేదికపై కియా ఓ ప్రత్యేకతను చాటుకొందని స్పష్టం చేశారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగినందుకు తాను సంతోషిస్తున్నానన్నారు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.  మరోవైపు కియా పరిశ్రమ.. మిలియాన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంపై   అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తుతోన్నాయి.  వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పరిశ్రమ రావడానికి ప్రధాన కారణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని  వారు స్పష్టం చేస్తున్నారు. నాడు రాయలసీమలో ఈ పరిశ్రమ ఏర్పాటు అయిందంటే.... నేడు అదే పరిశ్రమ ఉత్పత్తి రంగంలో తన ఘనతను చాటుకొందంటే.. అది చంద్రబాబు విజన్‌కి నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరిగిందంటే.. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడం,  నవ్యంధ్రకు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక ,  అందుకోసం రైతులను ఒప్పించి.. వారి నుంచి స్వచ్ఛందంగా వ్యవసాయ భూముల సమీకరణ.. ఆ రాజధాని ప్రాంతానికి అమరావతి అని నామకరణం... అలాగే  ఉత్తరాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఏర్పాటుకు నడుం కట్టినా... అటు రాయలసీమలో సైతం దాదాపుగా ఇదే తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా.. అదంతా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల, మొక్కవోని దీక్షే  కారణమని  నెటిజన్లు ఈ సందర్బంగా తమ అబిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.   అయితే 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన ఫ్యాన్ పార్టీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్..   కియా పరిశ్రమ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేశారంటూ అప్పట్లో ఆరోపించారని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ పరిశ్రమ కారణంగా భూములు కోల్పోయిన రైతులను సైతం ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ పరామర్శించారని... అలాగే వారిని అన్ని విధాల రెచ్చగొట్టి..  కియా పరిశ్రమ ఏర్పాటు చంద్రబాబు తప్పుడు నిర్ణయమంటూ ఆయన వ్యాఖ్యానించారని నెటిజన్లు పేర్కొన్నారు.   తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ కియా కార్ల పరిశ్రమను తరిమేస్తామంటూ వైయస్ జగన్  చెప్పారని గుర్తు చేశారు.  వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిందని... ఇంతవరకు ఆ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులను బాధ్యత గల ముఖ్యమంత్రిగా పరామర్శించిందే లేదని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాదు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో అనంతపురం నుంచి కియా కార్ల పరిశ్రమ.. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలి పోతున్నదంటూ.. స్థానిక మీడియాలోనే కాదు.. అంతర్జాతీయ మీఢియాలో సైతం వార్త కథనాలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. అందుకు.. కొత్త ప్రభుత్వం తీసుకు వచ్చిన విధి విధానాలతోనే  కియా ఈ నిర్ణయం తీసుకో వలసి వచ్చిందంటూ.. కథనాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు   వెల్లువెత్తాయి. అలాగే కియా కంపెనీ యాజమాన్యాన్ని అధికార ఫ్యాన్ పార్టీకి చెందిన ఎంపీ   తుపాకీతో బెదిరించారనే ఓ చర్చ సైతం నాడు వాడి వేడిగా నడిచిన విషయం విధితమే. అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు హయాంలో వచ్చిన కియా పరిశ్రమ.. తాజాగా మైలురాయి చేరుకోవడం పట్ల.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సదరు పరిశ్రమ యజమాన్యాన్నికి అభినందనలు తెలపడం కొసమెరుపని నెటిజన్లు పేర్కొంటున్నారు.  ఇది చంద్రబాబు నాయుడి విజన్‌కి ఓ ఉదాహరణగా వారు చూపుతున్నారు.  చంద్రబాబు నాయుడికి, వైయస్ జగన్‌కి మధ్య ఉన్న ఈ తేడాను గమనిస్తే.. ఆంధ్రులు.. భవిష్యత్తులో అయినా తప్పటడుగులు వేయకుండా ఉంటారని నెటిజన్లు ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.