అంతా అయ్యాక తీరిగ్గా సీఎం జగన్ ..!

ఈ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన ఈ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. ఏపీలో అన్ని జిల్లాలలో ఈ వర్షాలు, వరదల ప్రభావం లేకపోగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో మాత్రం ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలనువరదలు ముంచెత్తాయి. ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాలలో బిక్కుబిక్కు మంటూ గడిపారు. అధికారులే వారికి తోచిన సాయం అందించగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్న విమర్శలు  భారీగా వినిపించాయి. అందుకే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వరద ప్రాంతాలలో పర్యటించారు. సీఎం జగన్ సోమవారం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం ప్రాంతంలో ఉన్న కూన‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల వర్షాల కార‌ణంగా వ‌ర‌దతో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఇక్కడ జ‌గ‌న్ మాట్లాడుతూ.. బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా ముందుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అధికారులు క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌ర్య‌టిస్తున్నార‌ని.. అక్క‌డే ఉంటున్నార‌ని చెప్పారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. మొత్తం రెండు రోజులు సీఎం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నట్లు రెండు రోజుల క్రితమే సీఎంఓ ప్రకటించింది. అయితే, ప్రజలు ఇబ్బందులలో ఉండగా కనీసం అటు కన్నెత్తి కూడా చూడకుండా, ఇప్పుడు వరదలు తగ్గి అంతా అయిపోయాక సీఎం పర్యటనకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎం అనే సంగతి మర్చిపోయి ఒక ప్రతిపక్ష నేత మాదిరి వరద బాధితుల పరామర్శకు వెళ్లినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో వరదలు, తుఫాన్ల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ప్రజలకు అండగా నిలిచారో గుర్తు చేసుకుంటున్న ప్రజలు.. ఇప్పుడు వరదలు అయ్యాక వెళ్లి పరామర్శించి హామీలు ఇస్తున్న సీఎం జగన్  తీరును విమర్శిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రల ప్రభావం ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై కనిపిస్తున్నదని.. అందుకే సీఎంగా బాధితులకు అండగా ఉండాల్సిన జగన్.. ఇలా సర్వం కోల్పోయాక ఓదార్చి అండగా ఉంటానని హామీలు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, జగన్ ఈ పర్యటన విషయానికి వస్తే సోమ, మంగళవారం రెండు రోజుల పర్యటన అని సీఎంఓ పేర్కొంది. కానీ, ఇది కనీసం ఒక్క రోజు కూడా లేదు. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ పర్యటన మంగళవారం ఉదయం ముగుస్తుంది. మంగళవారం మధ్యాహ్నానికి సీఎం తిరిగి తాడేపల్లి ఇంటికి కూడా చేరుకోనున్నారు. దాదాపుగా సీఎంగా జగన్ పర్యటనలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఉదయం తాడేపల్లిలో బయలుదేరితే మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునేలా ఉంటుంది. లేదా రెండు రోజుల పర్యటన అంటే ఇలా ఒకరోజు మధ్యాహ్నం మొదలై మరుసటి రోజు ఉదయానికి ముగుస్తుంది. ఒక రాత్రి, ఒక పూట జరిగే ఈ పర్యటనను రెండు రోజుల పర్యటన అని చెప్పుకుంటారు.  కాగా, ఈ మూడు జిల్లాల పర్యటనను చూసిన బాధితులకు ముందే విషయం చెప్పి ప్రిపేర్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. బాధితులలో మన పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని వారికి ముందే సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ఓదార్పు పర్యటనలను సాగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. అందుకే అది బయటపడకుండా ఇలా తమ పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. నిజానికి జగన్ గతంలో దీక్షలు, ఓదార్పు యాత్ర, పాదయాత్రలలో కూడా ఇలాగే చేసేవారు. ప్రతిదీ ముందే ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ పెట్టుకొని ముందుకెళ్ళేవారు. ఇప్పుడు సీఎంగా కూడా ఆ పద్ధతి వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

బాబు చంద్ర నిప్పులు..ఇక సమరమే!

నిదానమే ప్రధానం అనే చంద్రబాబు దూకుడు పెంచారు. శాంతం శాంతం అనే  పెద్దాయన పులివెందుల నడిబొడ్డున నిలబడి.. ఏయ్ జగన్ ఇది నా అడ్డా అంటూ గర్జించారు. తన కుటుంబంపై, కార్యకర్తలపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా ఇది సంస్కారం కాదంటూ వైసీపీకి క్లాస్ పీకిన, న్యాయపోరాటం చేద్దాం అంటూ తెలుగుదేశం శ్రేణులను శాంత పరిచిన చంద్రబాబు ఇప్పుడు తెగించాల్సిన సమయం వచ్చింది  తమ్ముళ్లూ అంటూ హుంకరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు.. విలువలు కలిగిన రాజకీయం రావాలని చెబుతూ వచ్చిన చంద్రబాబు, రేపు మాదే అధికారం రాసి పెట్టుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు స్వరం మారింది. గళంలో తీవ్రత పెరిగింది. ఆయన భాషలో మునుపెన్నడూ లేని పదును కనిపిస్తున్నది.  పులివెందుల వెళ్లి మరీ వైసీపీ నేతలకు రీ సౌండ్ వినిపించేలా గద్దించి మాట్లాడారు. రాయలసీమ నడి బొడ్డున సభ పెట్టి వై నాట్ పులివెందుల అంటూ నినదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమలో మొదలైన చంద్రబాబు బిగ్ సౌండ్ ఇప్పుడు ఏపీ మొత్తం వినిపిస్తోంది. చంద్రబాబు దూకుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన నుండే మొదలైంది. పులివెందుల సభలో ఆయన మాట్లాడిన తీరు, పుంగనూరు ఘర్షణలతో ఆయన తెగింపు, నెల్లూరులో ఆయన హెచ్చరికలు.. ఎక్కడ చూసినా గత నాలుగేళ్ళలో  ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే అలిగిననాడు అన్నట్లుగా చంద్రబాబు ఆగ్రహం కనిపిస్తోంది. అది రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నేను మా నాన్న అంత మంచోడిని కాదంటూ నారా లోకేష్ మాట్లాడితే.. ఇప్పుడు ఆ లోకేష్ ను మించి చంద్రబాబు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతూ ప్రాజెక్టులకు మీరేం చేశారో చెప్పండి.. ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తానని బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ యుద్ధం డిక్లేర్ చేశారు. అయితే, చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ప్రజల నుండి వస్తున్న స్పందనే అని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భవం తరువాత ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర సమయంలో కనిపించిన జనచైతన్యం ఇప్పుడు చంద్రబాబు పర్యటనల్లో కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా చంద్రబాబు రోడ్ షోకు ఊహించని స్థాయిలో జనాలు పోటెత్తారు. దీంతో చంద్రబాబులో  కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందంటున్నారు.  అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకొని ఈ ప్రాజెక్టుల సందర్శనకు బ్రేకులు వేయాలని చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు తెగించి పోరాడడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా శాంత ప్రవచనాలు వల్లిస్తూ వారి ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని నియంత్రించడం సరికాదని  చంద్రబాబు భావిస్తున్నారనీ అందుకే ఆయన స్వరంలో మార్పు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రజలలో  తెలుగుదేశం వైపు మొగ్గు  స్పష్టంగా కనిపిస్తుండడంతో చంద్రబాబు తన వయసును మరచి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం చంద్రబాబు ఏలూరు జిల్లాలో ఉన్నారు. చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించారు. పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ఇచ్చారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలించారు.   

వనమాకు సుప్రీంలో ఊరట!

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంలో ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడాన్ని రద్దు చేస్తూ ఆయనపై ఆ ఎన్నికలలో ప్రత్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించింది. కాగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వనమా పిటిషన్ ను విచారణకు స్వీకరించి, 15 రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. 2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే వనమా సమర్పించిన  ఎన్నికల అఫిడవిట్ లో  తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ జలగం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇటీవల వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కాగా కాంగ్రస్ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి విజయం సాధించిన వనమా ఆ తరువాత కొద్ది రోజులకు బీఆర్ఎస్ (అప్పటికి ఇంకా తెరాసయే)లో చేరిపోయారు. దీంతో ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో చేరిపోయి పరస్పరం వ్యతిరేకించుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ కు అప్పటి నుంచీ ఒకింత ఇబ్బందికరంగానే మారింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగులందరికీ టికెట్లు.. అని ఒక సారి.. కాదు కాదు కొందరికే అని మరోసారి ఇలా తెరాస అధినాయకత్వమే అయోమయంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులిద్దరూ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువడగానే స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక విధమైన రిలీఫ్ కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వనమాకు పార్టీ టికెట్ లభిస్తే.. ఆయన విజయానికి ఆయన కుమారుడిపై ఉన్న తీవ్ర ఆరోపణలు అవరోధంగా మారతాయని కొత్తగూడెం బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పుతో వారు ఒక విధంగా రిలీఫ్ చెందారని చెప్పవచ్చు. ఇప్పుడు వనమాకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. 

జగన్ కు మరో ట్రబుల్ సెప్టెంబర్ 1 ముహూర్తం..!

ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం సహజం. అయితే, ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇది రాజకీయ సంకటంగా మారింది. గత నాలుగేళ్ళలో కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం కావడంతో ఇప్పుడు అన్ని వైపుల నుండి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన, కుంటుపడిన అభివృద్ధికి తోడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేరని హామీలు అన్నీ ప్రభుత్వానికి గుదిబండలా మారాయి. ఒకవైపేమో ముంచుకొస్తున్న ఎన్నికలు.. మరోవైపు సూటిగా ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలకు తోడు ఇప్పుడు నెరవేరని హామీల తాలూకు బాధితులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలన్నిటీనీ ప్రజల మధ్య చర్చకు పెట్టారు.  మరోవైపు  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని ప్రజల కళ్ళకు కనిపించేలా చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కక్ష్ పూరిత వైఖరి, అసమర్ధ పాలనను ఎండగడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు మరో ట్రబుల్ మొదలు కానుంది. అదే ఉద్యోగ సంఘాల సీపీఎస్ రద్దు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ స్కీం తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. వారం కాదు నాలుగేళ్లు అయినా ఆ హామీ నెరవేరనేలేదు. సీపీఎస్ బదులు జీపీఎస్ అని మరో పథకాన్ని తీసుకొచ్చి మసి పూసి మారేడు కాయ చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. కానీ, అందుకు ఉద్యోగులు అసలు ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా ఓల్డ్ పెన్షన్ స్కీం మాత్రమే అమలు చేయాలనీ, జగన్ మైకులలో ఊదరగొట్టిన హామీ అమలు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబట్టి ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి గళం విప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.  సెప్టెంబరు ఒకటిన చలో విజయవాడకు పిలుపునిస్తూ ఉద్యోగ సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. సీపీఎస్ రద్దుతో పాటు, సీపీఎస్ ఉద్యోగులపై గతంలో పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చని నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు.. జీపీఎస్ వద్దు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమరానికి సిద్ధమవుతున్నాయి. వైనాట్ ఓపీఎస్ అంటూ రోడ్డెక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలోనూ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎలాగైనా నిరోధించాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఉద్యోగుల ముందు ప్రభుత్వం పప్పులు ఉడకలేదు. గతంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా వేలాది మంది ఉద్యోగులు వివిధ మార్గాల్లో విజయవాడకు చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ నిరసన గళాన్ని మరింత బలంగా వినిపించారు. ప్రభుత్వం అడ్డుకున్నా బెజవాడ రోడ్లు ఉద్యోగులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన చేపట్టిన చలో విజయవాడ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ట్రబుల్ గా మారింది. మరోవైపు ఒక్కసారి ఉద్యోగ సంఘాలు బయటకి వస్తే.. గత ఎన్నికలలో ఇచ్చిన మిగతా హామీల బాధితులు కూడా బయటకి రావడం గ్యారంటీ. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లుల విషయంలో హాస్పటిల్స్, కాలేజీల యాజమాన్యాలు గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైతే.. అది అన్ని వర్గాలలో వ్యక్తమవడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితులను వైసీపీ సర్కార్   ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.

ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? తెరపై కొచ్చిన పాత పంచాయతీ!

తెలంగాణ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? అనే పాత పంచాయతీ మళ్ళీ మరో మారు తెరపై కొచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి జన్మదిన (డిసెంబర్ 9) కానుక ఇచ్చేందుకు. రేపటి న్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ నేతలు చేస్తున్న, ప్రచారానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసేఆర్  అసెంబ్లీ వేదిక నుంచి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వివరించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఏకరవు పెట్టారు. దీంతో మరో మారు, తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసేఆర్ కాంగ్రెస్ పార్టీ పాత పాపాలను ఏకరవు పెట్టారు. తెలంగాణ ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు అన్నది తర్వాత సంగతి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రతి సందర్భంలో తెలంగాణ  ప్రజలను వంచించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?  కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల ఫలితంగా సుమారు ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది. ఎన్నో కష్ట నష్టాలు చవిచూసింది.  భయంకరమైన పరిస్థితులు ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైన బాధలు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని ఇవ్వలేదు. 2014లో అన్నిచోట్లా ఎదుగాలి ఎదుర్కొంటున్న పార్టీని బలోపేతం చేసుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ, భారత తొలి ప్రధాని నెహ్రు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రాలో తెలంగాణ విలీనాన్ని గట్టిగా  వ్యతిరేకించినా నెహ్రూ పట్టుపట్టి తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని, అదే జరగకుంటే, తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చేదే కాదని అన్నారు  సో.. తెలంగాణ ప్రథమ ద్రోహి, కాంగ్రెస్ పార్టీ, భారత తొలి ప్రధాని నెహ్రూ ..అంటూ  కాంగ్రెస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకు పడ్డారు.  అలాగే  మంత్రి కేటీఆర్ తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాదనను తిప్పి కొడుతూ బ్రిటిష్ పాలకులు దేశానికి తామే స్వాతంతం ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ వాదన అట్లా ఉందని ఎద్దేవా చేశారు. నిజానికి  1969, 1971 ఉద్యమాలలో వందల వేల మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీ, 2014లో మరో గత్యంతరం లేకనే తెలంగాణ ఇచ్చిందని అన్నారు. అంతే కాదు 2004 ఎన్నికల ప్రణాళికలో యూపీఎ ఉమ్మడి కార్యక్రమంలో, రాష్ట్ర పతి ప్రసంగంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించి పుష్కర కాలం పైగా సాగదీయడం వల్లనే వందల సంఖ్యలో విద్యార్ధులు,  నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారని  ఇది కాంగ్రెస్ చేసిన పాపం కాదా అని ప్రశ్నించారు.దీంతో మరో మారు తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది.  

గల్లా అరుణ పొలిటికల్ రీ ఎంట్రీ?

మాజీ మంత్రి, సీనియర్ పాలిటి షియన్ గల్లా అరుణకుమారి పాలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీ యాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె, ఇప్పుడు మళ్లీ పాలిటికల్ గా యాక్టివేట్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను నిర్వర్తించిన గల్లా అరుణకుమారి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకు ముందు అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన అరుణకుమారి 2014లో తెలుగుదేశం పార్టీలో కుమారుడు గల్లా జయదేవ్ తో కలిసి చేరారు. గుంటూరు ఎంపీగా తనయుడు గల్లా జయదేవ్ కు టికెట్ ఇప్పించారు. గుంటూరు నుంచి ఎంపీగా గల్లా జయదేవ్ రెండుసార్లు విజయం సాధించారు. 2019  ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం లో కూడా కీలకమైన గుంటూరు నుంచి ఆయన విజయం సాధించి టీడీపీ జెండాను ఎగురవేశారు. అయితే గల్లా అరుణకుమారి మాత్రం 2014 ఓటమి అనంతరం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఏడాది జూన్ లో టీడీపీ పాలిటీబ్యూరో పదవికి కూడా రాజీనామా చేసినప్పటికీ పార్టీకి మద్దతు ప్రకటించారు. తన తనయుడు జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి నిశ్చయించుకున్నట్లు ఆనాడు చంద్రబాబుకు తెలిపారు. దీంతో టీడీపీ అధిష్టానం చంద్రగిరి బాధ్యతలను మరో సీనియర్ నేత పులివర్తి నానికి అప్పగించింది. 2019 ఎన్నికల్లో నానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ వైసీపీ నేత డెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గం పార్టీ బాధ్యుడిగా పులివర్తి నానినే కొనసాగుతున్నారు. అయితే ఆనాటి పరిణామాల నేపథ్యంలో ఒక దశలో అరుణకుమారి తన రాజకీయ శకం ముగిసిందని వ్యాపార బాధ్యతలు నిర్వ ర్తించేందుకు పాలిటిక్స్ కు దూరమవుతున్నట్లుగా ప్రకటన కూడా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ టీడీపీకి మద్దతుగానే ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధిష్టానం టికెట్ టికెట్ కేటాయిస్తే ఆమె చంద్రగిరి నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంతో కీలకమైన గల్లా కుటుంబం నుంచి చంద్ర గిరిలో పోటీచేసినట్లయితే విజయం నల్లేరు మీద నడకేనని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొందరు చెబుతున్నారు. ఇంకోవైపు గల్లా అరుణకుమారి సన్నిహితుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టా నం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

రాహుల్ తొలి విజయం.. లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించినట్టు లోక్‌సభ సోమవారం (ఆగస్టు 7) నోటిఫికేషన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష అమలుపై ఆగస్టు 4న సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామంతో 137 రోజుల అనంతరం  రాహుల్ ఎంపీగా  కొత్త పార్లమెంట్ భవనంలోకి తొలిసారి  అడుగుపెట్టబోతున్నారు. రాహుల్ గాంధీని తిరిగి ఎంపీగా గుర్తించడంతో ఢిల్లీలోని 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మిఠాయిలు తినిపించి హర్షం వ్యక్తం చేశారు. అసలింతకీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని డిస్ క్వాలిఫై చేసే విషయంలో లోక్ సభ సెక్రటేరియెట్ వాయువేగంతో నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటంటే,  ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన  కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో  రాహుల్ పై అనర్హత వేటు పడింది.  ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేమిటంటే..  దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో  చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా దాఖలైంది.  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలుఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు, 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ నిర్ణయం తీసుకుంది.  సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా అక్కడా చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది. రాహుల్ జైలు శిక్ష, జరిమానాపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. 

వెంకన్నదేవుడిపై ఎందుకింత కక్ష.. టీటీడీ చైర్మన్ గా నాస్తికుడికి మళ్లీ అవకాశమా?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో అయన స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.  నిజానికి గతంలో వైవీ నియామకం విషయంలో చెలరేగిన దుమారం  నేప్యంలో ఈసారి అయినా  హిందూ ధర్మం పట్ల పూర్ణ విశ్వాసం ఉన్న వారికి  టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   టీటీడీ చైర్మన్ పదవి ఆశించిన ముగ్గురిలోంచి భూమనను ఎంపిక చేశారు. భూమన గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. జగన్ రెడ్డి మరో మారు ఆయనకు ఆవకాశం కల్పించారు.  టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సిద్ధ రాఘవరావు పేర్లు కూడా వినిపించాయి. చివరకు దేవుని దయతో భూమనకు పదవి వరించింది. అయితే అదేమీ పాపమో, అదెక్కడి శాపమో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2006 నుంచి 2008 వరకు) టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్నప్పుడే, ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయి. నిజ నిజాలు ఏమో కానీ, ఏడుకొండల పవిత్రతను రెండు కొండలకు కుదించాలనే   సంకల్పం భూమన కరుణాకర రెడ్డిదే అంటారు. అలాగే, మిగిలిన్ ఐదు కొండలపై చర్చిలు నిర్మించాలనే   సంకల్పం విషయంలోనూ భూమన భూమిక ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే భూమన పై టీటీడీ నిధుల దుర్వినియోగం  వంటి ఇతరత్రా ఆరోపణలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి  ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి  బాబాయ్ టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కొండపై యధేచ్చగా సాగుతున్న అన్యమత ప్రచారం, ఆస్తులు విక్రయం, నిధుల కైంకర్యం, తిరుమలను ఆధ్యాత్మిక స్థాయిని దిగజార్చి, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రయత్నాల వంటి అనేక ఆకృత్యాలకు  భూమన కరుణాకర రెడ్డి ఆద్యుడనే అరోపణలున్నాయి. అందుకే ఇప్పడు కూడా ప్రతిపక్షాలతో పాటుగా,  హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు కరుణాకర రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  అన్నిటినీ మించి, భూమనపై అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రధాన ఆరోపణ  ఆయన నాస్తికుడు.    వెంకన్న స్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తి గా ముద్ర వేసుకున్నారని అంటారు.  కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు  భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ అదే తీరుగా అవహేళన చేసిన చరిత్ర భూమనకుందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్ప్సు సోషల్ మీడియాలో  పాత సంగతేలపే గుర్తుకు తెచ్చుకుంటున్నారు.  అలాగే సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణా రావు మొదలు అనేక మంది భూమన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు  భూమన నియామకం వెనక  రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేవా కార్యక్రమల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దారి మళ్ళించి పందేరం చేసిన విధంగా, రేపటి ఎన్నికలలో గెలిచేందుకు టీటీడీ నిధులను సేవ  పేరున పందేరం చేసే కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.మరో వంక   స్వామీ నీ కొద్దీ అన్యమత నాస్తిక చైర్మన్  యాష్ ట్యాగ్ తో భూమన నియామకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భక్తులు తమ మొర స్వామి వారికే వినిపించుకుంటున్నారు. అలాగే శాపనార్ధాలు పెడుతున్నారు.  

టీటీడీ చైర్మన్ భూమన.. జంగా అలక!

కలియుగ  దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఆ ఏడుకొండలపై కొలువైన శ్రీవారంటే  అందరికీ ప్రీతీ పాత్రుడైన దైవంగా పేరుంది. అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆయన దర్శనం కోసం తపిస్తుంటారు. ఈ కలియుగ వైకుంఠంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం  ఏపీ ప్రభుత్వ నియంత్రణలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీటీడీకి పాలక మండలి, ఆ మండలి చైర్మన్ ని ఎన్నుకోవడం కూడా తెలిసిందే. పేరుకే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎన్నుకున్నా.. చైర్మన్ ఎవరు అనేది ఏపీ ప్రభుత్వమే నిర్ణయిస్తూ వస్తున్నది. కాగా, ఇప్పుడు ఈ టీటీడీకి ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు.  గత నాలుగేళ్లుగా ఈ పదవిలో సీఎం జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి కొనసాగుతూ వచ్చారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కాగా.. ఈ నాలుగేళ్లూ ఆయనే చైర్మన్ గా ఉన్నారు. టీటీడీ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం చైర్మన్‌గా వ్యవహరించిన మరో నాయకుడు లేరు. మరో 8 నెలల్లో ఎన్నికలు ఉన్నందున ఈసారి టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని కొంత కాలంగా ఉత్కంఠ కొనసాగింది. చివరి ఏడాది వెనుకబడిన వర్గాల వారికి చైర్మన్ పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించేసుకున్నారనీ, అందుకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును ఖరారు చేసేశారనీ వైసీపీ శ్రేణులే గట్టిగా చెబుతూ వచ్చాయి. కానీ చివరికి మరోసారి కూడా రెడ్డి సామజిక వర్గానికే ఈ పదవిని కట్టబెట్టారు. అనూహ్యంగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. భూమన ఇప్పటికే ఒకసారి టీటీడీ చైర్మన్ పదవిని చేపట్టి ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం భూమనకు ఇది రెండోసారి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు. ఇలా రెండోసారి ఈ పదవిలో కొనసాగిన వారు ఇప్పుడున్న సుబ్బారెడ్డి, రేపు రాబోయే కరుణాకర్ రెడ్డి తప్ప మరెవరూ లేరు. అది కూడా ఇద్దరూ సీఎం జగన్ కు దగ్గరి బంధువులే కావడం విశేషం. గతంలో సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీ కాలం పూర్తయినపుడు కూడా భూమన పేరు వినిపించగా అప్పుడు వైసీపీ అధిష్టానం భూమనకు రెండోసారి ఈ పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ, సుబ్బారెడ్డి రెండుసార్లు అయ్యాక సీఎం జగన్ ఇప్పుడు భూమనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.   ఈ చైర్మన్ పదవి రేసులో  గత కొంత కాలంగా రకరకాల పేర్లు వినిపించాయి. వీరిలో జగన్‌కు సన్నిహితులైన భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు బీసీ కోటాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు వినిపించాయి. వీరిలో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి  తనకు మంత్రి పదవిని ఆశించి భంగపడటంతో టీటీడీ చైర్మన్ పదవిని నిరాకరించి నిరసన తెలిపారని అంటున్నారు. దాంతో జగన్  ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జంగా పేరు ఖరారు చేసేశారని వైసీపీ శ్రేణులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వచ్చారు.  ఇప్పటికే నాలుగేళ్లు రెడ్డి సామజిక వర్గమే ఈ పదవిలో ఉండడంతో ఈసారి బీసీలకు ఛాన్స్ ఇస్తారని, జంగా కృష్ణమూర్తికి ఈ అవకాశం దక్కడం ఖాయమనీ అంతా అనుకున్నారు. కానీ  అనూహ్యంగా టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి  అలకపాన్పు ఎక్కారు.  నిజానికి జంగా వైసీపీ ఆవిర్భావం నుంచీ  నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీసీ యాదవ వర్గానికి చెందిన నేత కావడంతో పార్టీలోని బీసీ నేతలతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేయగా.. అప్పటి నుండే చైర్మన్ గా శ్రీవారి సేవ చేయాలని ఆశపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని కీలక పదవులు సీఎం సొంత సామాజికవర్గానికి ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం, ఇప్పటికే రెండు సార్లు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉండడంతో ఈసారి జంగానే చైర్మన్  అని అందరూ భావించారు. జంగా కూడా అదే అనుకున్నారు.   ఈ మేరకు జంగాకు జగన్ హామీ కూడా ఇచ్చినట్లు చెప్పుకున్నారు.  తీరా చివరికొచ్చేసరికి తనకు రిక్తహస్తం చూపడంతో  జంగా  అలకబూనినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో ఎవరికీ టచ్ లో లేకుండా పోయినట్లు తెలుస్తుంది. ఆయన తన  ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అధిష్ఠానం ఆయన్ను బుజ్జగిస్తుందా.. లేక ఆయనే ఏమైనా షాకులు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.

సుబ్బారెడ్డి నోట రాజధాని విశాఖ మాట.. మళ్లీ మళ్లీ పాత పాట

విశాఖ రాజధాని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు.. అందులో ఒకటి పరిపాలన రాజధానిగా విశాఖ. సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండే పాలన సాగించనున్నారు. ఇలాంటి మాటలు  ఏడాది  కిందటి వరకూ ఏపీ ప్రజలను   ఉలికిపాటుకు గురి చేసేవి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి అవసరం ఉండే పరిపాలన రాజధానిని ఒక మూలన ఉండే విశాఖకు తరలించడం ఏంటన్నది ఎప్పటి నుండో సగటు ప్రజలతో పాటు మేధావుల వాదన. కానీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఏది ఏమైనా పరిపాలన విశాఖ నుండే అంటూ మూర్ఖంగా వాదిస్తూ వచ్చింది. అయితే మూడేళ్లుగా ఇదే మాట వినీ వినీ ప్రజలలో ఇప్పుడు దీనిపై చలనం కూడా ఉండడం లేదు. ప్రకటనలు తప్ప ఇది సాంకేతికంగా జరిగే పని కాదులే అని ఏపీ ప్రజలు డిసైడైపోయి ఆ మాటలను లైట్ తీసుకుంటున్నారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం ఇంకా విశాఖకు రాజధాని అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి వారు సమయం సందర్భం ఉన్నా, లేకుండా ఇప్పటికే ఎన్నోసార్లు ఈ మూడు రాజధానుల ముచ్చట, అందులో విశాఖకు రాజధాని తరలింపుపై ఎన్నో ప్రకటనలు చేశారు. అందులో చాలా మంది ఇప్పుడు ప్రజలకు, మీడియాకు కూడా మొహం చాటేస్తున్నారు. ఇంకా విశాఖ రాజధాని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోయి నవ్వే పరిస్థితి వచ్చిందని ఈ నేతలకు కూడా అర్ధమైపోయింది. కానీ, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు సీఎం జగన్ కు మరో బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం త్వరలోనే విశాఖకు రాజధాని అంటూ కామెడీ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా వైజాగ్-వన్ ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్నారు. లీగల్ ఇష్యూస్ కారణంగా రాజధానిగా విశాఖ ఆలస్యమవుతోందని.. మరో మూడు నెలల్లో రాజధాని విశాఖకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం  వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా, టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. మంగళవారం (ఆగస్టు 8)తో  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరీ గవుడు ముగుస్తుంది. దీంతో ఆయన ఆ రోజు నుంచీ పూర్తిగా ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే మరోసారి విశాఖే  రాజధాని అని.. మరో మూడు నెలల్లో జగన్ విశాఖకు తరలి రానున్నారని.. దసరా తర్వాత విశాఖ నుండే పాలన కొనసాగుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.  అయితే  వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అరిచి గీపెట్టినా రాజధాని విశాఖ తరలింపు అంశం అధికారికంగా జరిగే పనికాదు. ఒక పక్క ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని సుబ్బారెడ్డి అంటూనే విశాఖకు రాజధాని అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధాని చేస్తామని.. అక్కడ భూములను ప్రభుత్వానికి ఇస్తే అభివృద్ధి చేసి ఇస్తామని అక్కడి రైతులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే.. రాజధాని రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఈ పరిహారాన్ని కట్టాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మినా సరిపోదు. ఒకవేళ శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కదా అని వైసీపీ ప్రభుత్వం వాదించినా.. ఏకైక రాజధాని, అదీ అక్కడే ఉండేలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రకరకాలుగా అమరావతి రైతులకు అగ్రిమెంట్ చేసి ఉంది.  ఈ చట్టాల ప్రకారమే ఇప్పుడు వైసీపీ అడుగు ముందుకు వేయలేకపోతుంది. ఈ చట్టాల ఆధారంగానే కోర్టు తీర్పులు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు నిండా ఎనిమిది తొమ్మిది నెలల సమయం కూడా లేదు.  ఈ లోగా అనధికారికంగా విశాఖకు రాజధాని తరలింపు చేయాలని భావించినా.. అక్కడ పరిస్థితులు చక్కదిద్దుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే, ప్రజలు విశాఖకు రాజధాని తరలింపు అంశాన్ని పూర్తిగా మార్చిపోయారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం ఇదిగో ఇలా మళ్ళీ మళ్ళీ ప్రకటనలు చేసి ఇంకా ఇంకా చులకన అవుతున్నారు.

చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం తొలి నాలుగు రోజులు ప్రశాంతంగా సాగినా.. శుక్రవారం నుండి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అన్నమయ్య జిల్లాలో మొదలై చిత్తూరు జిల్లాలో రంగరంగంగా మారగా.. శనివారం శ్రీకాళహస్తిలోనూ అదే టెన్షన్ కొనసాగింది. శనివారం చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు శ్రీకాళహస్తిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అసలే టెన్షన్ వాతావరణం ఉండగా.. మున్సిపల్ సిబ్బంది చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.  ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా.. టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలని.. వారిని అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలతోనే తాము ఈ ఫ్లెక్సీల తొలగింపునకు వచ్చామని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముందే అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ.. తొలగించమని సిబ్బందికి ఆదేశాలివ్వడం ఏంటని పసుపు సైన్యం వాగ్వాదానికి దిగింది. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితోనే మున్సిపల్ కమిషనర్ ఈ ఆదేశాలిచ్చినట్లు కలకలం రేగగా.. ఫ్లెక్సీలను తొలగిస్తే తీవ్ర చర్యలు తప్పని టీడీపీ నేతలు హెచ్చరించడంతో చంద్రబాబు రాకకు ముందే ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక, చంద్రబాబు సభలో మాట్లాడుతూ.. అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజల సమస్యలపై తాను మాట్లాడితే తనపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైసీపీ చూస్తోందని.. ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారుల వల్ల మంచి పోలీసులకు చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులకు ప్రభుత్వం టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదనీ,  టీడీపీ కార్యకర్తల్ని కొట్టమని మాత్రం లాఠీలు ఇస్తున్నదని దుయ్యబట్టారు. ఇక, అక్కడ నుండి శనివారమే నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు.. సోమశిల ప్రాజెక్టును పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.  సోమశిల, కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారని.. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. శనివారం రాత్రి అక్కడే బస చేసిన చంద్రబాబు.. ఆదివారం ఉదయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. రైతుల సభలో ప్రసంగించారు. ఇక, నాలుగు గంటలకు అక్కడి నుంచి దెందులూరు వెళ్లారు. కాగా, గతేడాది ఆగస్టు 31న గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3వ గేటు పూర్తిగా కొట్టుకుపోగా.. 6, 7 గేట్లు పాక్షికంగా దెబ్బతినగా.. అప్పుడు ప్రాజెక్టులోని రెండు టీఎంసీల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా వర్షాలు ముందే కురిసి ఉంటే రైతులకు నీరందేది కాదు. ఇక ఇప్పటికీ నత్త నడకన సాగుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాది అయినా పూర్తవుతాయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు ఇదే విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి కడిగిపారేశారు. కాగా, చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన, ఆ సందర్భంగా చేస్తున్న విమర్శలు, సంధిస్తున్న ప్రశ్నలతో వైసీపీ నేతలు  ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అసలే ప్రజలలో వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఒక్కసారిగా సమాజానికి జీవనదుల లాంటి ప్రాజెక్టుల విధ్వంసం అంటూ చంద్రబాబు ప్రజలలో చైతన్యం తీసుకువస్తుండడంతో ఇక తమ పనైపోయినట్లేనని అర్ధమైన వైసీపీ   ఏదో ఒక విధంగా చంద్రబాబు పర్యటనను  అడ్డుకోవాలని చూస్తున్నది. అందులో భాగమే పుంగనూరులో వైసీపీ కార్యకర్తల విధ్వంసకర వీరంగం,  శ్రీకాళహస్తిలో మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపడం. అయితే, చంద్రబాబు అన్నటినీ అధిగమించి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను చుట్టేస్తున్నారు. ఈ పర్యటన పూర్తయ్యేలోపు వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల అంశంలో అధఃపాతాళానికి పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఉత్తరాంధ్ర, ఢిల్లీ ఇక సుబ్బారెడ్డిదే! విజయసాయి సర్ధేసుకున్నట్లేనా?!

టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే లోకేష్ పేరు సహజంగానే వినిపిస్తుంది. అదే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరిది అంటే ఠక్కున ఒక పేరు చెప్పడం ఇప్పుడు కష్టమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, పాదయాత్ర సమయంలోనూ, జైలుకెళ్లినప్పుడూ జగన్ వెంట ఉన్న తల్లీ, సోదరి ఇప్పుడు దూరమయ్యారు.ఇక జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకూ బయటకి వచ్చింది లేదు. ఇక కుటుంబం కాకుండా పార్టీలో జగన్ తర్వాత ప్రాముఖ్యత గల నేతలు ఎవరంటే మొన్నటి వరకూ విజయసాయి రెడ్డి పేరు గట్టిగా వినిపించేంది. ఆ మాటకొస్తే జగన్‌ పార్టీ స్థాపించక ముందు నుంచే విజయసాయి రెడ్డి ఆయనతో కలిసి ప్రయాణించారు. జగన్ కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి కూడా కొన్ని నెలలు జైలులో గడిపారు.  ఆ కేసులలో ఏ 1 జగన్ రెడ్డి అయితే ఏ 2 విజయసాయిరెడ్డే. అందుకే జగన్‌ దగ్గరికి వెళ్లలేనివారు విజయసాయిరెడ్డి వద్ద తమ సమస్యలు చెప్పుకునేవారని వైసీపీ వర్గాలే చెబుతాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ ఎలాగో జగన్ కు విజయసాయి అలాగ అని గతంలో గట్టిగా వినిపించేది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో   విజయసాయి రెడ్డి కీలక భూమిక పోషించారనే సంగతి తలిసిందే. ఐ ప్యాక్‌తో కోఆర్డినేషన్ విషయంలో కూడా అప్పట్లో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర అని చెబుతారు. ఈ క్రమంలోనే ఇటు జగన్ తో వ్యాపార సంబంధాలతో పాటు జాతీయ స్థాయిలో వైసీపీకి సంబంధించిన అన్ని అంశాలను విజయసాయి రెడ్డి దిగ్విజయంగా చూసుకొనే వారు. విజయసాయి రెడ్డి ఢిల్లీ వ్యవహారాలలో పర్ఫెమెన్స్ చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం తెర మీదకి తెచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర వ్యవహారాలను కూడా ఆయనకే అప్పగించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు జగన్ - విజయసాయి మధ్య సఖ్యత లేదనే ప్రచారం గట్టిగా జరుగుతున్నది. ఢిల్లీ వ్యవహారాలలో ఈ ఇద్దరి మధ్య ఎక్కడో తేడాలు వచ్చాయని, అందుకే విజయసాయిని జగన్ దూరంగా పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన జగన్.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో.. వైవీ సుబ్బారెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించారు. ఆ సమయంలో కనీసం ఓటింగ్‍కు కూడా విజయసాయి హాజరు కాలేదు. ఇక గడప గడపకూ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన వర్క్ షాపులో కూడా జగన్.. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇన్ చార్జి, అనుబంధ విభాగాల సమన్వయకర్త ఇలా అన్ని బాధ్యతలు పోయి.. ఒక్క రాజ్యసభ మాత్రమే విజయగాయి మిగిలారు.   కాగా, ఇప్పుడు అధికారికంగానే ఢిల్లీ వ్యవహారాలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు జగన్ సన్నిహిత వర్గాల సమాచారం. గతంలో విజయసాయి చూసిన ఢిల్లీ వ్యవహారాలన్నీ ఇకపై అధికారికంగా సుబ్బారెడ్డి చూడనున్నారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా ఉన్న సుబ్బారెడ్డికి మరికొన్ని అనుబంధ విభాగాలను కూడా అప్పగించనున్నారని చెబుతున్నారు. తిరుమల తిరుపతి చైర్మన్ పదవి గడువు ముగుస్తుండటంతో  ఇకపై జగన్ తన బాబాయ్ సుబ్బారెడ్డిని పూర్తిగా రాజకీయ కార్యకలాపాలలోకి దించే యోచనలో  ఉన్నారనీ,  అందుకు తగ్గట్లే ఇటు ఉత్తరాంధ్ర, అటు ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టే పనిని అప్పగించనున్నారనీ చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీలో ఇక విజయసాయి శకం ముగిసినట్లే భావించాల్సి వస్తుంది. పార్టీలో నంబర్ 2 అనే స్థాయిలో చక్రం తిప్పిన విజయసాయి ఇప్పుడు కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాగా.. రేపు ఆ పదవీ కాలం పూర్తయ్యాక అది కూడా కొనసాగిస్తారా లేక సాయన్నముసలోడైపోయారని పక్కన పెడతారో చేడాలి.

ఖమ్మంలో కేసీఆర్ కు కొత్త తలనొప్పులు!

తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లా రాజ‌కీయంగా పెద్ద త‌ల‌నొప్పిగా మారుతూ వ‌స్తోంది. గ‌త రెండు ద‌ఫాలుగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చినా  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మాత్రం చ‌తికిల‌బ‌డింది. ఎన్నిక‌ల త‌రువాత ఇత‌ర పార్టీల్లో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవ‌టం ఆ పార్టీకి ప‌రిపాటిగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ల‌గం వెంక‌టరావు, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పువ్వాడ అజ‌య్ కుమార్‌లు మాత్ర‌మే బీఆర్ఎస్ నుంచి విజ‌యం సాధించారు. అయితే, మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో స‌త్తాచాటాల‌ని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈసారి ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా  వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈసారి జిల్లాపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జిల్లాలో గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల అనుభ‌వంతో పాటు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని జిల్లాలో భారీ మార్పులు చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మ‌డి జిల్లాలో పొంగులేటికి మంచి ప‌ట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన నాటినుంచి పొంగులేటి సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంటామ‌ని, అధికార పార్టీకి ఒక్క స్థానాన్ని ద‌క్క‌నివ్వ‌మ‌ని స‌వాల్ చేశారు. ఈ మేర‌కు మ‌ధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ  సీనియ‌ర్‌నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క‌తో క‌లిసి పొంగులేటి ముందుకెళ్తున్నారు. పొంగులేటి వ్యూహాల‌కు చెక్‌ పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేద‌ని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ప‌లు ద‌ఫాలుగా నిర్వ‌హించిన స‌ర్వేల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్‌దే ఆధిప‌త్యం అని తేలిందని చెబుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకోబుతున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు జ‌న‌ర‌ల్ నియోజ‌క వ‌ర్గాలు ఉన్నాయి. వీటిల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది.  మూడు జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పువ్వాడ అజ‌య్ కుమార్ ఉన్నారు. ప్ర‌స్తుతం అజ‌య్ మంత్రిగా కొన‌సాగుతున్నారు. . మ‌రోసారి ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పువ్వాడ అజ‌య్ కుమార్ బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పాలేరు, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిసారించారట. పాలేరు నియోజ‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌రువాత కొద్దికాలానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజ‌యం సాధించిన కందాల ఉపేంద‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల మ‌రోసారి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. దీంతో కందాల‌, తుమ్మ‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది.  ఈసారి పాలేరు నుంచి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఆమె ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్యాల‌యాన్నిసైతం ప్రారంభించారు. ఈ క్రమంలో పాలేరులో ష‌ర్మిల బ‌రిలో నిలిస్తే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గం సీఎం కేసీఆర్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిందంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోదిగిన వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు బీఆర్‌ఎస్ అభ్య‌ర్థి జ‌ల‌గం వెంక‌ట్రావ్‌పై విజ‌యం సాధించారు. ఆ త‌రువాత ఆయ‌న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఎన్నికల సమయంలో వనమా  సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు హైకోర్టులో కేసు వేయడంతో విచారణ చేపట్టిన కోర్టు ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని తీర్పి ఇచ్చింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈసారి కొత్త‌గూడెం నుంచి ఇద్దరిలో ఎవరిని బరిలోకి దింపుతారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మ‌రోవైపు డీహెచ్ గ‌డ‌ల శ్రీ‌నివాస్‌రావు ఈసారి ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారంటున్నారు. కొత్త‌గూడెం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.  అయితే ఈ ముగ్గురిని కాద‌ని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్  యోచిస్గున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.    కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. పొంగులేటిని దీటుగా ఎదుర్కోవాలంటే తుమ్మ‌ల వ‌ల్లనే సాధ్య‌మ‌వుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.     తుమ్మ‌లను కొత్త‌గూడెం నుంచి బ‌రిలోకి దింప‌డం ద్వారా పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెక్ పెట్టొచ్చ‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, తుమ్మ‌ల మాత్రం పాలేరు నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి జిల్లాలో ఘోర ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హ‌వాను త‌ట్టుకొని ఏ మేర‌కు నిల‌బ‌డుతుందో వేచి చూడాల్సిందే.

పెద్దల సభలో విపక్ష ఐక్యతకు బిగ్ టెస్ట్ ?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్, స్థానంలో గత వారం పార్లమెంట్’లో ప్రవేశ పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ..  బిల్లు లోక్’సభ ఆమోదం పొందింది. ఐఎన్డీఐఎ (ఇండియా) కూటమి ఐక్యతకు పరీక్షగా నిలుస్తున్నఈ బిల్లు సోమవారం  రాజ్యసభ ముందుకు వస్తుంది. ఢిల్లీ బిల్లును సోమవారం (ఆగష్టు 7)  పెద్దల సభలో ప్రవేశ పెట్టి అదే రోజు ఆమోదం పొందేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకే, ఆగష్టు 7, సోమవారం బీజీపీ సభ్యులు అందరూ సభకు హాజరు కావాలని విప్ జారీచేసింది.  అయితే, లోక్ సభలో ఉన్న సంఖ్యా బలంతో  అక్కడ సునాయాసంగా బిల్లుకు ఆమోదం పొందిన ఎన్డీఎ సర్కార్’కు పెద్దల సభలో, బిల్లును నెగ్గించుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదనే అభిప్రాయాన్ని విపక్షాలు ముందు నుంచి వ్యక్త పరుస్తున్నాయి. పెద్దల సభలో తగినంత సంఖ్యాబలం లేని అధికార కూటమిని ఆత్మరక్షణలో పడేయడమే కాదు, బిల్లును ఓడించి చెక్ పెట్టే అవకాశం కూడా లేకపోలేదన్న విశ్లేణలు కూడా వినిపించాయి.అయితే, లోక్’సభలో అవసరం లేకున్నా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీ బిల్లును సమర్ధించడంతో,కాంగ్రెస్ సహా ఐఎన్డీఐఎ(ఇండియా) కూటమి భాగస్వామ్య పార్టీలు మరో దారి లేక ఓటింగ్ సమయానికి  వాకౌట్ చేసి ఆబోరు నిలుపుకున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ బిల్లు చుట్టూ అల్లుకున్న విపక్ష ఐఎన్డీఐఎ కూటమి ఐక్యతకు అదే బిల్లు ఇప్పడు పరీక్ష పెడుతోందనే అభిప్రాయం, ఆందోళన విపక్ష కూటమిలో,మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వినవస్తోంది.   నిజానికి, లోక్ సభలో బిల్లుపై చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభలో బిల్లు పాస్’అయిన తర్వాత, ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్’ కూటమి నుంచి తప్పుకుంటారని అన్నారు. అలాగే, కూటమి ఖాయంగా విచ్చిన్నం అవుతుందని జోస్యం చెప్పారు.  నిజానికి, గత నెలలో బెంగుళూరులో నిర్వహించిన విపక్ష కూటమి సమావేశానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు  అరవింద్ కేజ్రీవాల్’ ఆప్’  కూటమిలో కొనసాగాలంటే, కాంగ్రెస్ పార్టీ బేషరుతుగా ఢిల్లీ బిల్లును వ్యతిరెకించి తీరాలని లేదంటే తమ దారి తాము చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీకి షరతు విధించారు.కాంగ్రెస్ పార్టీ, జీ హుజూర్ ..ఆప్ ..జైసా బోలా ఐసాహీ కరేంగే ..( మీరు ఎలా అంటే అలా ..) అని ప్రకటించిన తర్వాతనే, కేజ్రీవాల్ బెంగుళూరు సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇప్పడు, వ్రతం చెడినా ఫలితం లేకుండా పోవడంతో, కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిందని అంటున్నారు.  ఇటు వైసీపీ, అటు బీజేడీ ఓపెన్’ గా బిల్లుకు మద్దతు ప్రకటించడంతో, ఢిల్లీ బిల్లు పెద్దల సభలోనూ పాస్, అయినట్లే అన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.ఈ విశ్వాసంతోనే, హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో’ విపక్షాలకు సవాలు విసిరారని అంటున్నారు. నిజానికి, పెద్దల సభలో అధికార ఎన్డీఎ కూటమికి మెజారిటీ లేదు అందులో అనుమానం లేదు. మొత్తం 245 మంది సభ్యుల రాజ్యసభలో బీజేపీ బలం 93. బీజేపీ సొంత బలం 93 మాత్రమే అయినా మిత్రపక్షాలు, నామినేటెడ్ సభ్యులతో కలుపుకుంటే అధికారపక్షం బలం 111కు చేరుకుంటుంది. బిల్లు పాస్ అవ్వాలంటే కావాల్సిన మొత్తం సభలో హాజరైనవారిలో సగం కంటే కనీసం ఒక్క ఓటైనా ఎక్కువ రావాలి.245లో 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.అంటే మిగిలింది 238 మంది. ఓటు వేసే సమయానికి మొత్తం అందరూ సభలోనే ఉన్నారనుకుంటే.119 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది.అంటే 120 ఓట్లు బిల్లుకు అనుకూలంగా ఉంటే పాసవుతుంది. అధికార కూటమి 111 మందితో 9 ఓట్ల దూరంలో ఆగిపోయింది. మరోవంక ఐఎన్డీఐఎ(ఇండియా) పేరుతో ఏర్పడ్డ కూటమి మొత్తం సంఖ్యాబలం రాజ్యసభలో 99. అందులో 33 మంది కాంగ్రెస్, 13 మంది తృణమూల్ కాంగ్రెస్, చెరో 10 మంది డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు 7, తెలుగుదేశం, జనతాదళ్ (సెక్యులర్), బహుజన్ సమాజ్ పార్టీలకు తలా ఒక సభ్యుడు సభలో ఉన్నారు. అయితే తటస్థ పార్టీల్లో బీజేడీ, వైఎస్సార్సీపీలు తమ వైఖరి ముందే ప్రకటించాయి. రెండు పార్టీలూ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తామని చెప్పాయి. అంటే బిల్లుకు సానుకూలంగా ఎన్డీఏ కూటమి 111 ఓట్లకు తోడు బీజేడీ (9), వైఎస్సార్సీపీ (9) ఓట్లను కలిపితే మొత్తం సంఖ్య 129కి చేరుకుంది. తెలుగుదేశం, జేడీ(ఎస్)లు కూడా సమర్థించే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన బిల్లు పాస్ చేసేందుకు తగినంత సంఖ్యాబలం అధికార కూటమి సంపాదించుకున్నట్టే. ఒకవేళ ఈ తటస్థ పార్టీలను ప్రతిపక్ష కూటమి తమ వైపు తిప్పుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. బిల్లు నెగ్గుతుందా, ఓడిపోతుందా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. అసలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మొత్తం ఓట్లు 99 ఒకటిగా  బిల్లుకు వ్యతిరేకంగా పడతాయా ... లేక అందులోనూ చ్చేలిక వస్తుందా ఆనందే ఇప్పుడు 26 పార్టీల కూటమి ముందున్న సవాలు.

తిరగబడిన తెలుగు బిడ్డ!

పుంగనూరులో వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య దాడులు ఏపీలో   అరాచక పాలనకు తాజా నిదర్శనం.  గత ఐదు రోజులుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులెన్ని, ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏంత?  ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టమెంత అన్నది ప్రజలకు వివరించడమే ఈ పర్యటన ఉద్దేశం. గత నాలుగు రోజులుగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకోలేక దిక్కులు చూస్తున్న వైసీపీ శ్రేణులు.. ముందుగా టాపిక్ డైవర్షన్ తతంగం మొదలు పెట్టారు. అయితే, చంద్రబాబు దాన్ని కూడా తిప్పికొట్టడంతో.. ఇక తమ పప్పులు ఉండకవని భావించిన వైసీపీ  దాడులతో ఉద్రిక్తతలకు తెర తీసింది. అందులో భాగమే చంద్రబాబు పుంగనూరు పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వందల సంఖ్యలో కార్యకర్తలను పురమాయించడం. అన్నమయ్య జిల్లా మీదగా చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్తున్న చంద్రబాబును అడ్డుకొనేందుకు అంగళ్ల నుండే వైసీపీ తన అరాచకత్వాన్ని తార స్థాయిలో ప్రదర్శించింది. పక్కా ప్రణాళికతో  వైసీపీ నేతలు, కార్యకరత్తుల టీడీపీ శ్రేణులపై దాడులకు దిగారు. దీనికి పోలీసుల అండదండలు తోడవడంతో పుంగనూరు శివారు బైపాస్ రోడ్డు రణరంగంగా మారింది. చంద్రబాబును పుంగనూరులో అడుగపెట్టనివ్వబోమని వైసీపీ శ్రేణులు సవాల్ విసరడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎలా అడ్డుకుంటారో చూస్తామని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ శ్రేణులు వందల సంఖ్యలో చేరినా.. పోలీసులు అడుగుగడుగునా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నా.. టీడీపీ కార్యకర్తలు దీటుగా సమాధానం చెప్పారు. పుంగనూరు ఘర్షణలను చూస్తే టీడీపీ తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నది. గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు అరాచకాలను భరించి భరించి ఉన్న టీడీపీ శ్రేణులు ఇక సమరమే అన్నట్లుగా తిరగబడ్డారు. టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా రాజకీయాలలో ఒక  ప్రత్యేక గుర్తింపు ఉంది.  కానీ  ప్రత్యర్థి కదలికలు తనను కబళిస్తుంటే చూస్తూ ఉండే చేతగానితనం ఇసుమంతైనా  ఉండకూడదని టీడీపీ నిర్ధారించుకున్నట్లు   పుంగనూరు ఘటన తేటతెల్లం చేస్తున్నది. చావో రేవో ఇక ఈ అరాచకానికి చరమగీతం తప్పదనేలా పసుపు సైన్యం సమరశంఖం పూరించినట్లే కనిపిస్తుంది. తన ఉనికినే ప్రశ్నించే శత్రువుకు యుద్ధ నీతితోనే జవాబు ఇవ్వాలనే సూత్రాన్ని టీడీపీ పుణికిపుచ్చుకున్నట్లు ఈ సంఘటన కళ్ళకు కడుతున్నది. ఇక ఎప్పుడూ శాంతం శాంతం అనే చంద్రబాబు కూడా ఒకదశలో ఇక తప్పదు సమరమే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారంటే ఇక్కడ వైసీపీ శ్రేణుల అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.  కట్టుబాట్లు మీరకుండా తన క్యాడర్ ను నడిపించాలని భావించే చంద్రబాబు.. పుంగనూరు గూండాలపై తిరగబడాల్సిందే తమ్ముళ్లూ అంటూ అవుట్ అయిపోయారంటే ప్రభుత్వంలో పెనవేసుకుపోయిన రౌడీల పాలనలో ఎంత విసిగిపోయారో స్పష్టం అవుతున్నది. వందల మందిని పోగేసుకొని పార్టీకి దేవాలయం లాంటి కార్యాలయంపై వీధి రౌడీల్లా దాడులు చేసినా, చట్టపరంగానే ముందుకు వెళ్దాం హింస మన సిద్ధాంతం కాదన్న చంద్రబాబు.. ఓ వైసీపీ గుండా పార్టీ అధికార ప్రతినిధి కారుపై కర్రలతో దాడికి దిగినా ప్రజలే బుద్ధి చెప్తారని సముదాయించిన చంద్రబాబు.. పార్టీకి దైవ సమానులైన కార్యకర్త రక్తం కళ్ళకి కనిపించడంతో యుద్ధ నినాదం అందుకోవాల్సి వచ్చారని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏకమై తమపై దాడికి దిగితే దెబ్బతిన్న సింహంలా జూలు విదిల్చి  టీడీపీ వేట మొదలు పెట్టింది. హింసావాదం సమాజానికి మంచిది కానే కాదు.. కానీ, శత్రువు సమరానికి దిగిన తర్వాత తప్పదు యుద్ధమే చేయాలన్నట్లు మారిపోయింది ఇప్పుడు ఏపీలో రాజకీయం.

నిన్న పులివెందుల..నేడు పుంగనూరు.. జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు దర్పణం!

చంద్రబాబు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అరాచకానికి దిగడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. ఫలితంగా  విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయి. ఇటు అన్నమయ్య జిల్లా అంగళ్లు.. అటు చిత్తూరు జిల్లా పుంగనూరు రెండు ప్రాంతాలూ రణరంగంగా మారాయి. పుంగనూరుకు చంద్రబాబు వెళ్తుండగా.. వైసీపీ శ్రేణులు మార్గమధ్యలోనే ఆందోళనకు దిగాయి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అన్నమయ్య జిల్లా మీదగా పుంగనూరు వెళ్తుండగా.. అంగళ్లులో చంద్రబాబు రాకముందే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులు మొదలుపెట్టారు. చంద్రబాబు అక్కడి నుంచి పుంగనూరు వెళ్లిన తర్వాత మరోసారి దాడులు జరిగాయి. అక్కడ నుండి పుంగనూరు శివార్లలో మళ్ళీ దాడులకు తెగబడ్డారు.   వారం క్రితం వినుకొండలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనుచరుల ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు శాంతియుతంగా  నిరసన తెలుపుతుండగా.. సాక్షాత్తు ఎమ్మెల్యే బొల్లా రంగంలోకి దిగి సవాళ్లు విసిరి హల్ చల్ సృష్టించారు. టీడీపీ శ్రేణులు ఎంతకూ రెచ్చిపోకపోవడంతో వైసీపీ శ్రేణులను రంగంలోకి దిగి దాడులకు ఉసిగొల్పారు. టీడీపీ శ్రేణులు తిరగబడడంతో పరస్పర దాడులు జరిగాయి. ఇప్పుడు కూడా  అంగళ్ళు, పుంగనూరు శివార్లలో అదే సీన్ రిపీట్ అయ్యింది. గత ఐదు రోజులుగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రోజెక్టుల సందర్శన మొదలు పెట్టారు. లెక్కలతో సహా జగన్ సర్కార్ ను ఎండగడుతున్నారు. సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా ఆయన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ప్రతిపక్షాల బాధ్యత. ఇంకా చెప్పాలంటే దీనికి ప్రతిపక్ష నాయకుడే అవసరం లేదు.. సామాన్య ప్రజలు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. వాటిని సరిచేసుకొని,  ప్రజలకు మేలు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే దాడులు.. విమర్శిస్తే కేసులు, తిరగబడితే విధ్వంసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. చంద్రబాబు యాత్రలో చేసే విమర్శలు, చూపెట్టిన లెక్కలలో తప్పులు ఉంటే ఆధారాలను బయటపెట్టి ప్రజలకు నిజనిర్ధారణ చేయొచ్చు. కానీ  చంద్రబాబు చేస్తున్న విమర్శలు, చూపుతున్న గణాంకాలూ వాస్తవాలే  కావడంతో జగన్ సర్కార్  గూండాయిజాన్ని ఆయుధంగా ఎంచుకున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతులను తొక్కి పెట్టేందుకు జగన్  ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తున్నదంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన వినుకొండ, పుంగనూరు మాత్రమే కాదు.. ఇదే ఆగష్టు నెల 2వ తేదీ గడపగడపకు వెళ్లిన సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబును ప్రశ్నించిన వారిపై వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ముందే దాడి చేయడం, మూడు వరాల కిందట పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఇంచార్జి చల్లా సుబ్బారావు ఇంటిపై దాడికి పాల్పడి ఆయనను  తీవ్రంగా గాయపరచడం లాంటి ఘటనలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది ప్రభుత్వమా గూండాయిజమా అని జనం విస్తుపోతున్నారని అంటున్నారు. గతంలో ఏపీలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తే  వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మంగళగిరి తెలుగుదేశం ప్రధాన  కార్యాలయంపై దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. అసెంబ్లీలోనే వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు  టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిపై దాడి ఘటన, గుంటూరు జిల్లా మాచర్లలో బజారు రౌడీల మాదిరిగా వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పలుచోట్ల దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టీడీపీ వర్గంపై దాడులు చేయడం సోషల్ మీడియా పుణ్యమా అని ఇంకా ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కేవలం ఈ దాడులు మాత్రమే కాదు.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ల నుండి మేధావుల వరకు.. మహిళల నుండి యువత వరకూ ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో.. రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేసి ఎక్కడకి తీసుకెళ్లారో కూడా తెలియకుండా ఆ కుటుంబాలను ఎంత మానసిక వేదనకు గురి చేశారో  ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు.  ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందనడానికి పులివెందులలో  చంద్రబాబుకు లభించిన ఘనస్వాగతం.. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో తెలుగుదేశం శ్రేణులు తెగించి మరీ గూండాలను అడ్డుకోవడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?

తెలంగాణలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?  అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. వాస్తవంగా డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాత్రం అక్టోబర్ మొదటి వారంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని పక్కాగా చెబుతున్నారు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఆయన ఇదే విషయాన్ని చెబుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుని పని మొదలు పెట్టేయాలని సూచిస్తున్నారు.  తెలంగాణలో బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్వయంగా కేటీఆర్ పలు సందర్భాలలో చెప్పారు.  ఆయన పార్టీ శ్రేణులు, నేతలే కాదు.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి పగ్గాలు అందుకునేది, అందుకోబోయేది కేటీఆర్ అనే అంటున్నారు. అదే విశ్వసిస్తున్నారు కూడా. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ రాజకీయం మొత్తం ఇప్పడు కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శన భాగ్యం ఇప్పుడు కీలక నేతలకు కూడా దుర్లభమే అన్నట్లుగా మారింది. పార్టీలో ఎవరైనా సరే కేటీఆర్ ను కలవాల్సిందే. ఆయన నిర్ణయమే ఫైనల్. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఎవరికి ఎవరికి ఇవ్వాలి. సిట్టింగులలో ఎవరిని పక్కన పెట్టాలి అన్న విషయాలు కూడా కేటీఆర్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో విస్పష్టంగా చెబుతున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ కేటీఆర్ నిర్ణయం మేరకే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులంతా ఆయననే కలుస్తున్నారు.  ఇప్పటికే పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన వారితో ఆయన వివరంగా మాట్లాడుతున్నారు. అలాంటి కన్ఫర్మేషన్ లేనివారిలో ఆయన ముభావంగా ముచ్చటిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక టికెట్ గ్యారెంటీ అన్న నేతలతో వేరుగా మాట్లాడుతూ ఎన్నికలు అక్టోబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, సమయం వృధా చేయకుండా  క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని చెబుతున్నారని అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీకి 2018లో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ మేరకు 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  తనకు ఉన్న సమాచారం ఎక్కడిదో, ఏమో తెలియదు కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మూడు నెలలు ముందుగానే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే జరుగుతాయని పార్టీ నేతలకు నమ్మకంగా చెబుతున్నారు.  ఎన్నికల సంఘానికి  షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది. అంతే కాకుండా తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో జరుగుతాయని భావించాల్సి ఉంటుంది. అదే జరిగితే  వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు కూడా ముందుకు జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంటే ఏపీ అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లేనని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఏపీ సహా ఏడేనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగాలి వాటిని కూడా రెండు మూడు నెలలు ముందు జరిగే అవకాశాలున్నాయనీ. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కూడా అలాగే ఉన్నాయనీ విశ్లేషిస్తున్నారు. 

ఓ వాణి బూతు పురాణం..!

అధికార ఫ్యాన్ పార్టీలో మరో ఆణిముత్యం మెరిసింది. సదరు ఆణిముత్యం  ఓ మహిళ కావడం.. అందునా ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతోండడంతో.. ఆమె గారి బూతుల పంచాంగం తాలుకు ఆడియో టేప్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఉత్తరాంధ్ర  వైసీపీలోని ఓ వర్గం   ఆమె గారి బూత పురాణం విని తల పట్టుకొంటున్నది.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భార్య టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణిని ఇటీవల నియోకవర్గ అధ్యక్షురాలిగా సీఎం జగన్ నియమించారు. అయితే ఆమె కారు మాజీ డ్రైవర్ నాగేంద్ర... వాణిపై తప్పుడు ప్రచారం చేసినట్లు భావించి.. అతడిపై ఫోన్‌లో ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డింది. అందుకు సంబంధించిన ఆడియో..  సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.    అయితే సదరు ఆడియో టేప్ వైరల్ కావడంతో.. ఉత్తరాంధ్ర వైసీపీలోని ఓ వర్గంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు... మలి కేబినెట్‌లో   బూతుల పలికే  అణిముత్యాలు చాలానే ఉండగా, వారి జాబితాలో  తాజాగా దువ్వాడ వాణి కూడా చక్కగా చేరిపోయారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు.. తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని ఆతడి ఇంటికే స్వయంగా డోర్ డెలివరి చేసిన కేసులో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించి ప్రస్తుతం బెయిల్‌‌పై విడుదలయ్యారు. అలాంటి వేళ  అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భార్య వాణీ మళ్లీ కారు మాజీ డ్రైవర్ నాగేంద్రపై బండ బూతులతో తిట్ల దండకం అందుకోవడం ఏమిటని వైసీపీ శ్రేణులు తలలుపట్టుకుంటున్నాయి. ఇంకోవైపు టెక్కలి తెలుగుదేశం అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఢీకొట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని.. ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడితోపాటు ఆయన అన్న కుమారుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ న్ నాయుడుకు మంచి ప్రాబల్యం ఉందని.. అలాంటి  అచ్చెన్నాయుడిపై రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న దువ్వాడ వాణి ఇలా బూతు పురాణం విప్పడం ఏంత మాత్రం బాగో లేదని ఓ అభిప్రాయం కూడా వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.  అచ్చెన్నాయుడుపై పోటీ చేసే క్రమంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులనే కాదు.. ప్రజల్లోకి సైతం ఏక తాటిపైకి తీసుకు రావాల్సి ఉంటుందని.. అటువంటి కార్యక్రమాలు ఏవీ.. ఇప్పటి వరకు ఈ వాణి చేపట్టినట్లు లేదని వారు గుర్తు చేస్తున్నారు.   ఇప్పటికే దువ్వాడ ఫ్యామిలీలో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో టెక్కలి  వైసీపీ  అభ్యర్థిగా దువ్వాడ శ్రీనును కాదని.. ఆయన భార్య దువ్వాడ వాణి పేరును సీఎం  జగన్ స్వయంగా ఖరారు చేశారని వారు వివరిస్తున్నారు. అయినా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి  వ్యవహారాలు, వ్యాఖ్యల వల్ల తమ పార్టీకే నష్టమని వారు పేర్కొంటున్నారు.   ఇంకోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల నేతలు, అధినేతలు.. తమ రాజకీయానికి పదును పెడుతూ.. రానున్న ఎన్నికలకు వెళ్తుంటే... తమ పార్టీలోని పార్టీ అధినేత దగ్గర నుంచి అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు.. ఇలా తమ బూతుల పంచాంగంతో మీడియా ముందుకు వచ్చి విరుచుకు పడిపోతున్నారని... ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఉత్తరాంధ్రలోని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం తీవ్ర ఆందోళనతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తోంది.