కామారెడ్డి బరిలో రాములమ్మ.. కేసీఆర్ కు చుక్కలేనా?

 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపక్షాలను డిఫెన్స్ లో పడేయాలన్న ఉద్దేశంతో సొంత పార్టీలో చెలరేగే అసమ్మతి జ్వాలల గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. మిగిలిన పార్టీల కంటే ముందుగా 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేసేశారు. తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లుగా కొన్ని నియోజవకర్గాలలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అసమ్మతి జ్వాలలను చల్లార్చుకునే బాధ్యతను కూడా తాను ప్రకటించిన అభ్యర్థుల భుజస్కంధాలపైనే పెట్టేశారు. టికెట్లు దక్కని అభ్యర్థులు ఇప్పటికే తమ దారి ఎటు అన్నది తేటతెల్లం చేసేశారు. రేఖా నాయక్ అయితే ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు కూడా చేసేశారు. మరి కొందరు పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. ఈ వ్యవహారమంతా పక్కన పెడితే కేసీఆర్ స్వయంగా గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించేశారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలెట్టి.. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఒక చోటు కాదు ఏకంగా రెండు చోట్ల నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకోవడంతోనే జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర నామమాత్రంగానే ఉండబోతున్నదని చెప్పకనే చెప్పేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు ఆయన పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డి నుంచీ కూడా పోటీలో దిగుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే గజ్వేల్ లో ఆయన ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, అందుకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తాననీ  మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ప్రకటించేశారు. అసలు కేసీఆర్ మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి గజ్వేల్ లో ఈటల పోటీ సవాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ కు గట్టిపట్టున్న కామారెడ్డిని ఆయన ఎంచుకోవడంలోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైపోయిందని చెబుతున్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడకేం కాదని బీజేపీ అంటున్నది. కామారెడ్డిలో కేసీఆర్ కు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపాలని నిర్ణయించింది.  ఆ బలమైన అభ్యర్థి మరెవరో కాదు రాములమ్మ విజయశాంతి అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా  మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు  షబ్బీర్ అలీ  ఎలాగూ నిలబడతారు. ఇక ఇక్కడ బీజేపీ  మాత్రం స్థానిక నేతలన కాదని విజయశాంతిని బరిలో నిలపాలని నిర్ణయించిందని చెబుతున్నారు.  గతంలో మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి గెలిచిన విజయశాంతి మరోసారి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా అదృష్ఠాన్ని పరీక్షించుకోవాలని బావిస్తున్నప్పటికీ.. పార్టీ  కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ కు ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగడం పై విజయశాంతి స్పందించారు. తాను ఎక్కడ నుంచి పోటీలోకి దిగాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ నుంచే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ నుంచి పోటీకి దించాలో అధినాయకత్వం నిర్ణయిస్తుంది, ఆ నిర్ణయాన్ని అంతా శిరసావహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.   ఆమె మాటలను బట్టి కామారెడ్డిలో కేసీఆర్ ను ఢీ కొనేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని చెప్పక తప్పదు.  

రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ.. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణకు తననూ ఆహ్వానించాలని వినతి

నందమూరి తారక రామా రావు...  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను  జీవించిన  పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.  రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.   రాముడు ఎలా ఉంటాడంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. అచ్చం ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, ఇటు రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అటువంటి శకపురుషుడి శత జయంతి జరుపుకున్నాం. ఆ సందర్భంగా కేంద్రం ఎన్టీఆర్ బోమ్మతో ముద్రించిన వందరూపాయల వెండి నాణేన్నా ఈ నెల 28న ఆవిష్కరించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి  ఎన్టీయార్ కుటుంబ సభ్యులు,  ఆయన సన్నిహితులు, ఆయనతో పరిచయం ఉన్నవారికి ఆహ్వానాలు అందాయి. అయితే ఎన్టీఆర్ మరణానంతరం ఎన్టీఆర్ కుటుంబానికి దూరంగా ఉంటున్న, రాజకీయంగా ఎన్టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీతో కలిసి పని చేస్తున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.   నేను లక్ష్మీ పార్వతిని.. దివంగత ఎన్టీఆర్ భార్యను.. అంటూ రాసిన ఆ లేఖలో ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన వందరూపాయల వెండి నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తననూ ఆహ్వానించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ తో   తనను కూడా ఆహ్వానించాలంటూ ఆమె లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ లేఖలో ఆమె రాజకీయ ప్రస్తావన చేశారు. 1994 ఎన్నికలలో ఎన్టీఆర్ తో కలిసి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతిని ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా ఒక మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఇలా వివాదాస్పదం చేయాలని చూడటం సమంజసం కాదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న వందరూపాయల వెండి నాణెం ఆవిష్కరణ కుటుంబ కార్యక్రమం కాదనీ, అదొక ప్రభుత్వ కార్యక్రమమనీ, ఎవరికి ఆహ్వానం అందించాలి అన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమనీ, ఈ విషయంలో రాజకీయాలు, కుటుంబ విభేదాలను తీసుకురావడం మంచిది కాదనీ అంటున్నారు. 

ఓట్ల తొలగింపుతో విజయం.. జగన్‌ను భ్రమల్లో ముంచేశారా?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. అధికార పార్టీ నేతలు ఎక్కడకి వెళ్లినా చెప్పిందేంటి? చేసిందేంటి? అంటూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన గడపగడప కార్యక్రమం పుణ్యమా అని ఈ అసంతృప్తిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చూశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఎక్కడ సభలు పెట్టినా తండోపతండాలుగా ప్రజలు పోగవుతున్నారు. ర్యాలీలు పెడితే పెద్దఎత్తున వెళ్లి మద్దతు తెలుపుతున్నారు.  ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుపడుతున్నారు. రాష్ట్రంలో నాశనమైన వ్యవస్థల నుండి నశించిపోయిన అభివృద్ధి వరకూ ఒక్కొకటి తూర్పార పడుతూ ప్రజలలోకి దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శిస్తున్నా వైసీపీ నేతల నుండి ఉలుకూ పలుకూ లేదు. విమర్శలను ఖండించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నేతలు తిరిగి ప్రతిపక్ష నేతలను మీరేం చేశారో చెప్పాలని అర్ధం పర్ధం లేని డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియోను చూస్తే అధికార వైసీపీ పార్టీ హ్యాండ్సప్ చెప్పినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అంతకు ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే వంద బూతులు మాట్లాడే నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. తత్వం బోధపడే ఇలా సైలెంట్ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే  సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ తనదే విజయమని నమ్ముతున్నారని, మరోసారి తానే సీఎం అవుతారని ధీమాగా ఉన్నారని కొందరు పరిశీలకులు బలంగా విశ్లేషిస్తున్నారు. తాను తెచ్చిన సంక్షేమ పథకాలే తనను మరోసారి అందలం ఎక్కిస్తాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ  వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, జగన్ చుట్టూ చేరిన కోటరీనే ఆయన్ను   భ్రమల్లో ఉంచుతున్నదనీ, ఆయనను ఓ దైవాంశ సంభూతుడిగా చూపిస్తూ.. తాను తలచుకుంటే కానిది లేదన్న ధోరణితో ఆయనను ఒక ట్రాప్ లో ఉంచేసినట్లు కనబడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని టక్కుటమార విద్యలతో గట్టెక్కే ప్రణాళికలు రచిస్తూ దాన్ని జగన్ ఛరిస్మాగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారనే అభియోగాలపై అనంతపురం జిల్లా జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిబంధనలు పాటించకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ గత కొంత కాలంగా టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో ఈసీకి చెందిన అధికారులు అనంతపురం జిల్లా ఉరవకొండలో నేరుగా క్షేత్ర స్థాయి పర్యటన సైతం నిర్వహించి అధికారిపై వేటు వేశారు. అనంతపురం అధికారి ఒక్కడే కాదు అక్రమంగా ఓట్లను తొలగించడంపై మరికొందరు అధికారులు కూడా బలి పశువులు కావడం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగిస్తుందని స్పష్టంగా ఈసీనే ఒక నిర్ణయానికి వచ్చి అధికారులపై వేటు వేస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. తనది కాకపోయినా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలపై మైకు ముందుకొచ్చే సలహాదారు సజ్జల రామకృష్ణ ఈ విషయంలో కూడా మీడియా ముందుకొచ్చారు. ఇంకేముంది యధావిధిగా ఇది కూడా చంద్రబాబు పనేనని.. చంద్రబాబు ఈసీని మ్యానేజ్ చేసి అధికారులపై చర్యలు తీసుకొనేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మేము తొలగించింది దొంగ ఓట్లు మాత్రమేనని.. చంద్రబాబే వ్యవస్థలను మ్యానేజ్ చేసి వైసీపీ వారి ఓట్లను తొలగించారని కూడా ఆరోపించారు. తాము అరవై లక్షల దొంగ ఓట్లు గుర్తించామని.. వాటిని తీసేస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని.. అదే అసలైన ఫలితమని కూడా సెలవిచ్చారు. మొత్తంగా ఈ ఓట్ల తొలగింపు, సజ్జల చెప్పిన థియరీ చూస్తే ఒక్కటి స్పష్టమవుతుంది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి తాము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డిని ఆయన నమ్మించినట్లు కనిపిస్తున్నది. అందుకే సజ్జల వాటిని తీసేస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని నిర్మొహమాటంగా చెప్తున్నారు. ఈ కుట్ర సిద్దాంతాన్ని అడ్డం పెట్టుకొనే ఎలాగైనా గెలుస్తామని ధీమాగా ఉన్నారని.. అదే భ్రమల్లో సీఎంను కూడా ఉంచేసి ఉంటారని రాజకీయ వర్గాలు అబ్బీప్రాయపడుతున్నాయి. అయితే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కనుక న్యాయం నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ వస్తుందనే సూత్రం మర్చిపోయినట్లున్నారు.

కరెంట్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి.. చేతులెత్తేసిన జగన్ సర్కార్

ముఖ్యమంత్రి అంటే కుటుంబం లాంటి రాష్ట్రానికి ఇంటి పెద్ద. కుటుంబ సభ్యుల అవసరాలేంటి? వారికి ఉపాధి ఎలా? ఆదాయాన్ని మదింపు చేసి అవసరానికి వాడుకోవడం ఎలా? అత్యవసరాల పరిస్థితి నుండి బయటపడడం ఎలా? ఇలాంటి అంశాలన్నీ ముందుగానే అలోచించి ఒక కంట కనిపెట్టి తీర్చాల్సిన బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుంది. సీఎం కూడా అంతే. రాష్ట్ర ప్రజల సంక్షేమం ఏంటి? వారికి కావలసిన కనీస సౌకర్యాల కల్పనకు తీసుకోవలసిన చర్యలు ఏంటి?  ప్రజలకు విద్యా, ఉపాధి ఎలా? రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడం ఎలా? విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా? ప్రకృతి వైపరీత్యాలను అధిగమించడం ఎలా? ఇలా ఎన్నో అంశాలలో సీఎం ముందు చూపుతో వ్యవహరించాలి. ఇందుకోసం సీఎం వెనక వందల మంది బలగం కూడా ఉంటుంది. వారందరి సహకారంతో సీఎం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కానీ  ఏపీలో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ పెద్దగా ఘోరంగా విఫలమయ్యారు.  నిలువెత్తు అనుభవరాహిత్యంతో  ఆరు కోట్ల ఆంధ్రుల సంరక్షణ బాధ్యతలను గాలికొదిలేశారు. పాలన విషయంలో జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. ప్రజల అవసరాలను అంచనా వేయడంలో అవగాహనా లేకపోవడంతో ప్రజలకు తీవ్ర కష్టాలను మిగిల్చారు. ఇందుకు ఉదాహరణే ఏపీలో విద్యుత్ కోతలు. అవును.. ఏపీలో ఇప్పుడు విద్యుత్ కోతలు ఘోరంగా ఉన్నాయి.  ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు దాటిదంటే ఎప్పుడు కరెంట్ పోతుందోనని భయాందోళన లతో జనం గడుపుతున్నారు.  ఒక్కసారి కరెంట్ పోయిందంటే మళ్ళీ ఏ అర్ధరాత్రి తర్వాతనో వస్తుంది. ప్రతి రోజూ గంట నుండి ఐదారు గంటలు కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రధాన నగరాలు మినహా పట్టణాలు, గ్రామాలలో ఇదే పరిస్థితి. గత నెల రోజులుగా ఇలా విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఏపీలో  ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతమే ఎక్కువ కనుక ఎప్పుడూ ఇక్కడ ఉక్కపోత సర్వసాధారణం. దీనికి తోడు దోమల బెడదతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. అనధికారకంగా భారీ స్థాయిలో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో  ప్రజలు తెగ తిట్టిపోస్తున్నారు. ఘోరంగా విద్యుత్ కోత విధిస్తున్నారని లైన్ మెన్ ను సంప్రదిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారు. ఇంజనీర్ స్థాయి అధికారిని సంప్రదిస్తే తమ వద్ద ఎలాంటి లోపాలు లేవని పై నుండే కోత ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇలా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేస్తే.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్తున్నారు తప్ప కనీసం ఫిర్యాదు కూడా నమోదు చేయడం లేదు. ఇక విద్యుత్ శాఖకి చెందిన అధికారిక టోల్ ఫ్రీ నంబర్ 1912కు చేస్తే ఎమెర్జనీ లోడ్ ఇష్యు ఉందని.. డిమాండ్ కు తగిన సప్లై లేదని.. ఈ కారణంగానే ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలకు తప్ప మిగతా ప్రాంతాలకు కోత విధించమని ఆదేశాలు ఉన్నాయని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులపై కూడా ఉన్నతాధికారులకు ఇప్పటికే పలుమార్లు చెప్పినా వాళ్ళేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్పేస్తున్నారు. నిజానికి ఏపీలో విద్యుత్ కోతలకు ప్రధాన కారణం ప్రభుత్వం ముందు చూపులేకపోవడం.. ఆర్ధిక పరిస్థితి కారణంగా చెప్పుకోవాలి. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన మార్గమైన బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గును కొని నిల్వ చేసుకోలేదు. ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకొని కనీసం రెండు వారాలకు సరిపడా బొగ్గును నిల్వ ఉంచుకోవడం విద్యుత్ సంస్థలు చేయాల్సిన పని. కానీ బొగ్గును మోసుకొచ్చే గూడ్స్ రైలు ఒక్కరోజు రాకపోతే ఇక కోతలే అన్నట్లుంది ఇప్పుడు ఏపీ పరిస్థితి. అదే సమయంలో విద్యుత్ సంస్థల పేరుతో వేలకోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించి వీటి సామర్థ్యాన్ని పెంచడానికి పెద్దగా ఖర్చుపెట్టలేదు. పోనీ ఇప్పుడు అవసరాన్ని బట్టి బహిరంగ మార్కెట్లో కొంటున్నదా అంటే అదీ లేదు. కొనేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. గతంలో విద్యుత్ కంపెనీలను వేధించిన కారణంగా వారెవరూ ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ అమ్మే పరిస్థితిలో లేరు. దీంతో ప్రజలకు నిత్య నరకం తప్పడం లేదు. ఇక వాన ముసురు పడితే ఇది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకొనేందుకు కూడా వణుకు పుడుతుంది.

జాబిల్లిపై మానవుడి అడుగుజాడను నాడే స్వప్నించిన శ్రీశ్రీ

రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది అన్నాడో సినీ కవి.. కానీ ప్రజా కవి, మహాకవి శ్రీశ్రీ మాత్రం నేడు నెరవేరిన కలని ఎప్పుడో ఆరు దశాబ్దాల కిందటే కని అక్షర బద్ధం చేశారు. జాబిల్లిపై భారత్ జయపతాక ఎగురవేసింది. చంద్రయాన్ 3 ద్వారా చందమామపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ యావత్ దేశం గర్వించదగ్గ మహోజ్వల ఘట్టం.  కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి యువతకు పిలుపునిచ్చారు. చంద్రుడిమీద కాలూనాలన్న కలను మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల కిందటే కన్నారు. కని ఊరుకోకుండా దానిని కవిత్వీకరించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గీతికగా మార్చారు.  నేడు ఇస్రో సాధించిన అద్భుత విజయాన్ని ఆయన ఎప్పుడో తన మానవుడి ప్రొగ్రెస్ రిపోర్ట్ కవితలో చూపించేశారు.  దాదాపు ఆరు దశాబ్దాల కిందటే మహాకవి శ్రీశ్రీ  తన  ఖడ్గ సృష్టి సంకలనంలో ని మానవుడి ప్రోగ్రస్ రిపోర్ట్ అన్న కవితలో మబ్బుతునక జేబురుమాలు  మాటు చేసుకున్న జాబిల్లీ ! ఏమో బహుశా త్వరలో  నీ ఇంటికి రావొచ్చు మేము  స్వాగతం ఇస్తావు కదూ ! ఆతిధ్యానికర్హులమే మేము ! చంద్ర మండలానికి ప్రయాణం  సాధించరాని స్వప్నం కాదు  గాలికన్నా బరువైన వస్తువుని  నేల మీద పడకుండా నిలబెట్ట లేదూ ? పరమాణువు గర్భంలోని  పరమ రహస్యాలు  మహాకాశ వాతావరణంలోని  మర్మాలు తెలుసుకున్నాక  సరాసరి నీదగ్గరకే  ఖరారుగా వస్తాంలే  అపుడు మా రాయబారుల్ని  ఆదరిస్తావు కదూ నువ్వు ?  అంటూ రాశారు.  ఆయన నాడు ఊహించి, ఆశించిన మహోజ్వల ఘట్టం నేడు ఇస్రో సాకారం చేసింది. 

విశాఖ ఎంపీ సీటు యమా హాటు గురూ!

ఏపీలో ఇటు రాజకీయంగా.. అటు పాలనా పరంగా హీటెక్కిస్తున్న నగరం విశాఖ. అధికారికంగానైనా.. అనధికారకంగానైనా విశాఖ నుండి పాలన సాగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండిగా ఉన్నారు. విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని చూస్తున్నా..  కోర్టులలో బ్రేకులు పడుతుండటంతో కనీసం తానైనా పరిపాలన అక్కడ నుండి సాగించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందుకోసం అక్రమార్గంలో ఇక్కడ భవనాల నిర్మాణం కూడా మొదలెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిగా విశాఖ అనే ప్రకటన అనంతరం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం,  కబ్జాలు, రౌడీయిజం, గుండాయిజం కూడా విజృంఖలంగా విస్తరించింది. సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి ఒక రోజంతా ముప్పతిప్పలు పెట్టి విడిచిపెట్టారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ఇట్టే అవగతమౌతుంది. మరోవైపు గంజాయి వాడకంలో కూడా విశాఖ వేగంగా తొలి స్థానానికి చేరుకుంటోంది.  విశాఖలో దిగజారుతున్న పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా విశాఖ హాట్ సీట్ గా మారిపోయింది రాజధాని తెస్తాం, ఇస్తామని అధికార పార్టీ విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటే.. విశాఖలో పెరిగిన కబ్జాలు, రౌడీయిజం, ధ్వంసమవుతున్న ప్రకృతిని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. దసరా నుండి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన చేయాలని ఆరాటపడుతుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ పర్యటనలు, యాత్రలు చేపడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. చంద్రబాబు తాజాగా విశాఖలో విజన్ 2047 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేయడమే కాకుండా.. విశాఖ వీధుల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. ఇండియా అభివృద్ధికి ఏం చేయాలో మేధావుల మాటగా చెప్పిన చంద్రబాబు పనిలో పనిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన నష్టాన్ని అక్కడి ప్రజలకు వివరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన మూడవ విడత వారాహీ యాత్రలో భాగంగా విశాఖ సహా ఉత్తరాంధ్రను చుట్టేశారు. టీడీపీ, జనసేన రుషికొండపై అక్రమ తవ్వకాలు, కట్టడాల నిర్మాణంపై తీవ్రంగా వైసీపీని టార్గెట్ చేసి ఏకిపారేశారు.  తన తల్లి విజయమ్మను ఓడించిన విశాఖలో ఎలాగైనా జెండా ఎగరేయాలని సీఎం జగన్ ఆశపడుతుంటే.. టీడీపీ తన సత్తా చాటుకొని విశాఖ రాజధాని సిద్దాంతం తప్పని నిరూపించాలని చూస్తున్నది. సామజికంగా  కలిసి వచ్చే అవకాశం ఉండడంతో జనసేన ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని చూస్తుండగా.. ఏపీ మొత్తం మీద బీజేపీకి ఎంతో కొంత కలిసి వచ్చే స్థానం ఇదే కావడంతో బీజేపీ కూడా  ఇక్కడ తిష్టవేసి వ్యవహారం నడిపించాలని చూస్తున్నది. ఇది కాకుండా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు చాప కింద నీరులా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీచేసి తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు.   ప్రస్తుతం విశాఖ సిట్టింగ్   ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ. వ్యాపార వ్యవహారాలలో ఈయన కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి ఒక రోజంతా కస్టడీలో ఉంచుకున్నారు. ఆ తర్వాత పెద్దగా రాజకీయాల జోలికి రాని ఎంపీ మకాం కూడా హైదరాబాద్ కు మార్చనున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు మరోసారి రేసులో ఉంటారా ఉండరా అన్నది తేలాల్సి ఉంది. ఎంవీపీ అలా డైలమాలో ఉండడంతో  విజయసాయి రెడ్డి తన అల్లుడిని నిలబెట్టాలన్న యోచనలో ఉన్నారు. వాస్తవానికి అల్లుడి కోసమే కొన్నేళ్లుగా విజయసాయి ఇక్కడ రాజకీయ పునాది వేశారని వైసీపీలో టాక్ మొదలైంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధిపతి భరత్ మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిన భరత్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారని టీడీపీ క్యాడర్ గట్టిగా భావిస్తుంది. జనసేన కూడా ఈ సీటు మీద మక్కువ చూపిస్తుంది. ఆ పార్టీ నుంచి విశాఖ సీనియర్ లీడర్ 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ బరిలోకి దిగుతారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు రాగా ఈసారి గట్టిగా ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుందని జనసేన నమ్ముతున్నది. మరోవైపు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా ఈ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచి  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె విశాఖ ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు.  జనసేన, బీజేపీ కలిసి టీడీపీతో పొత్తుకు వెళ్తే ఈ సీటు ఎవరు దక్కించుకుంటారన్నది మరింత ఆసక్తి కరం.  మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎంపీ సీటుపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. 

వల్లభనేని వంశి.. రెంటికి చెడ్డ రేవడేనా?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించి..  ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ పార్టీ పంచన చేరిన వంశీ నాటి నుంచి గన్నవరంలో తెలుగుదేశం కోటను పగలగొట్టడమే పనిగా  పని చేశారు. తెలుగుదేశం  పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత విమర్శలు, అసభ్య దూషణలకు తెగబడి నియోజకవర్గంలోని తన సామాజిక వర్గానికే కాకుండా.. నియోజకవర్గ ప్రజలకు కూడా దూరమయ్యారు. అయితే అధికార  పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయారు. పూర్తిగా వైసీపీని నమ్ముకుని వచ్చే  ఎన్నికలలో ఆ పార్టీ  అభ్యర్థిగా పోటీకి రెడీ అయిన వంశీ.. ఆ క్రమంలో తనకు అడ్డువస్తాడన్న భయంతో గత ఎన్నికలలో తనకు ప్రత్యర్థిగా నిలిచి పరాజయం పాలైన యార్లగడ్డకు చెక్ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా, వికటించాయా అన్న అనుమానాలు ఇప్పుడు ఆయనలోనే వ్యక్తం అవుతున్నాయి. యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. గన్నవరం నుంచే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా వంశీ, యార్లగడ్డల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వల్లభనేని వంశి పట్ల నియోజకవర్గంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించిన వైసీపీ అధిష్ఠానం పార్టీ టికెట్ పై ఆయనకు ఇచ్చిన హామీపై వెనక్కు తగ్గిన సంకేతాలను ఇస్తున్నది. అందుకు కారణంగా గన్నవరం పరిధిలోని నున్న  గ్రామంలో ఒక వార్డుకు జరిగగిన ఉప ఎన్నికలో వంశీ నిలబెట్టిన అభ్యర్థి పరాజయాన్ని చూపుతోంది.  నున్నవల్లభనేని వంశీ కొద్ది రోజులుగా ఏమీ మాట్లాడటం లేదు. హైకమాండ్ నుంచి సందేశం వస్తే చాలు బూతులతో విరుచుకుపడేందుకు ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. లోకేష్ గన్నవరం పర్యటనకు వస్తున్నారని.. బహిరంగసభ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లారు… పారిపోయారని అంటారని చెప్పి మళ్లీ .. సభ రోజు గన్నవరం వచ్చారు కానీ మీడియాతో మాట్లాడలేదు. లోకేష్ పై ఎలాంటి ఆరోపణలు చేలేదు. నోరు చేసుకోలేదు. ఎందుకా అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. నున్న గ్రామం వైసీపీకి చాలా బలమైన స్థావరం.. అక్కడ రెడ్డి సామాజికవర్గం సంఖ్య ఎక్కువ. అటువంటి చోట కూడా ఒక వార్డు ఉప ఎన్నికలో వైసీపీకి చావుదెబ్బ తగిలింది. వంశీపై వ్యతిరేకతే అందుకు కారణమని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. నియోజవర్గ వ్యాప్తంగా వంశీ పట్ల ఇదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా పార్టీ నిర్వహించుకున్న సర్వేలో కూడా ఇదే తేలడంతో వంశీకి గన్నవరం టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యార్లగడ్డ పార్టీని వీడేందుకు వంశీ తీరే కారణమనీ, యార్లగడ్డకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఒకింత గౌరవం, మర్యాద వంశీ ఇచ్చి ఉంటే ఆయన తెలుగుదేశం వైపు వెళ్లే వారు కాదనీ జగన్ ఇప్పుడు భావిస్తున్నారని అంటున్నారు.  దీంతో వంశీకి వ్రతమూ చెడి, ఫలమూ దక్కక రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే సమయం సందర్భం లేకున్నా  విమర్శలతో, తిట్లతో విరుచుకుపడే వంశీ తన గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రభంజనంలా సాగుతున్న సమయంలో కూడా నోరు మెదరపకుండా మౌనంగా ఉండిపోయారనీ, అసలు లోకేష్ పాదయాత్రకు ముందు ఆయన గన్నవరం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారనీ, అయితే చివరి నిముషంలో మనసు మార్చుకుని గన్నవరం వచ్చారనీ, అయినా లోకేష్ తనపై చేసిన విమర్శలపై స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయించడానికి కారణం వైసీపీలో తనకు ఆదరణ తగ్గడమే కారణమని అంటున్నారు.  మొత్తం మీద వంశీకి నిన్న మొన్నటి దాకా గన్నవరం వైసీపీ టికెట్ పై ఉన్న ధీమా ఇప్పుడు పూర్తిగా పోయిందనీ, దీంతోనే మౌనం వినా మరో గత్యంతరంలేని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆముదాలవలస తమ్మినేని చేయి జారినట్లేనా? వైసీపీ ప్లాన్ ఏమిటి?

ఏపీలో ఎన్నికల కాక పెరిగింది. ముఖ్యంగా అధికార వైసీపీలో పార్టీ టికెట్ల లొల్లి ఆ పార్టీకి మొదటికే మోసం తెచ్చేదిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార వైసీపీ.. దానిని అధిగమించడానికి పేరుగొప్ప ఎమ్మెల్యే పదవి తప్ప.. ఇంకే ప్రాధాన్యతా లభించక ఇంత కాలం లోలోపలే ఆవేదనతో మగ్గిపోయిన ఎమ్మెల్యేలపైనే వేటు వేయాలని భావిస్తున్నది. ఆ విషయంలో వైసీపీ ఎటువంటి తారతమ్యాలకూ చోటివ్వడం లేదు. మంత్రులు కూడా పార్టీ టికెట్ విషయంలో గ్యారంటీ లభించక ఏం జరుగుతుందో? ఏం జరిగితే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మధనపడుతున్నారు. అలా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కదు అన్న వారి జాబితాలో దాదాపు మొదటి పేరుగా స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు గట్టిగా  వినిపిస్తోంది.   శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో మరో సారి వైసీపీ జెండా ఎగురవేయాలంటే.. ఆ స్థానంలో కొత్త ముఖాన్నీ పోటీలో నిలబెట్టడమొక్కటే మార్గమన్న నిశ్చితాభిప్రాయానికి పార్టీ అధినేత జగన్ వచ్చేశారని అంటున్నారు.  అందుకోసం సమర్ధులైన అభ్యర్థి కోసం గాలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అసెంబ్లీ  స్పీకర్  తమ్మినేని సీతారాం   ఈసారి సీటు దక్కడం దాదాపు అసాధ్యం  అంటున్నారు. ఆయన పట్ల నియోజకవర్గ ప్రజలలోనే కాదు,  వైసీపీ క్యాడర్ లో కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమౌతోందంటున్నారు.  ఈ నేపధ్యంలో కొత్త ముఖాన్ని బరిలోకి దించితే తప్ప ఆముదాలవలస నియోజకవర్గంలో  కనీస పోటీ అయినా ఇచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. దీంతో ఆ స్థానంలో వైసీపీ జెండా మరోసారి ఎగరేయాలంటే అందుకు సమర్ధుడైన, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడమొక్కటే మార్గమని జగన్ నిర్ణయానికి వచ్చేశారనని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  దీంతో ఆయన  చూపు బోడేపల్లి వారసులపై పడిందని అంటున్నారు. జిల్లా   రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను  ప్రభుత్వం ఇటీవల అధికారికంగా నిర్వహించడం వెనుక ఆయన వారసులను పార్టీలోకి ఆహ్వానించి ఆముదాల వలస నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బొడ్డేపల్లి రాజగోపాల్ కోడలు బొడ్డేపల్లి సత్యవతిని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. బోడేపల్లి వారసురాలిగా సత్యవతి 2004, 2009 ఎన్నికలలో  ఆముదాల వలస నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.  విభజన అనంతరం 2014, 2019లలో అదే  స్థానం నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు. వరుసగా రెండు పరాజయాల తరువాత కూడా బోడేపల్లి సత్యవతి  కాంగ్రెస్ ని వీడకుండా ఆ పార్టీకి ఆముదాలవలసలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్  బాధ్యతలను చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమె ఆముదాలవలస నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆమెను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి తీఎసుకుని రావడం ద్వారా 2024 ఎన్నికలలో లబ్ధి పొందాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే బోడేపల్లి రాజగోపాల్  శతజయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే వైసీపీ  బొడ్డేపల్లి సత్యవతితో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.  ఇక పోతే బోడేపల్లి సత్యవతి వైసీపీ గూటికి చేరడం అంటూ జరిగితే.. తమ్మినేని తిరుగుబాటు చేయడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే తమ్మినేని ఇప్పటికే  ఆముదాలవలస టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో వైసీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు. 

అందెను నేడే అందని జాబిలి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్.. నేడు అంటే ఆగస్ట్ 23వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడి దక్షిణ దృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ఖ్యాతి గాంచింది.  చంద్రయాన్ విజయవంతం కావడంతో.. భారత్‌కు ప్రపంచదేశాలు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు... ఈ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలు చేసుకొంటున్న సంబరాలు అంబరానంటాయి. మరోవైపు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్సెస్‌బర్గ్ వెళ్లారు. ఆ క్రమంలో ప్రదాని నరేంద్ర మోదీ.. విక్రమ్ ల్యాండర్.. చంద్రడిపై ల్యాండ్ అయ్యే దృశ్యాలను జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి వర్చువల్‌గా వీక్షించారు.  చంద్రయాన్-3 విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇలా స్పందించారు... చంద్రయాన్- 3 ఘన విజయంతో తన జీవితం ధన్యమైందన్నారు. అమృత కాలంలో తొలి ఘన విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. ఈ విజయం దేశం  గర్వించే మహోన్నత ఘట్టమని మోదీ పేర్కొన్నారు.  ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూశారని ఆయన వివరించారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా.. తన మనస్సంతా.. చంద్రయాన్-3పైనే ఉందన్నారు. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ఈ క్షణం కోసం ఏన్నో ఏళ్లుగా ఎదురు చూశానని ప్రధాని మోదీ చెప్పారు.      ఈ ఏడాది జులై 14వ తేదీన శ్రీహరికోటలోని  షార్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ను ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. నాడు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మొత్తం 40 రోజుల్లో వివిధ దశలను పూర్తి చేసుకొని.. చంద్రుని మీదకు దిగింది. ఇస్రో గతంలో చేపట్టిన చంద్రయాన్- 2 విఫలం కావడంతో శాస్త్రవేత్తలు పలు జాగ్రత్తలు తీసుకొని.. చంద్రయాన్-3ని చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపకల్పన చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ కొత్త ఇన్నింగ్స్

బూస్ట్, అనాకాడెమీ, క్యాస్ట్రోల్ ఇండియా ఎయిర్‌టెల్, బీఎండబ్ల్యూ, ఫియట్ పాలియో, లుమినస్ ఇండియా, సన్‌ఫీస్ట్ బ్రిటానియా, బజాజ్ అమిత్ ఎంటర్‌ప్రైజ్..  ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? ఇవన్నీ దిగ్గజ సంస్థలు. దాదాపుగా దేశ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైనే. ఇప్పుడు ఈ జాబితాలోకి  కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిపోయింది. అసలింతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారు? ఉండడి అక్కడికే వస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కుపై ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చి వారిలో అవగాహన పెంపొందించేందుకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ను నియమించుకుంది. ఆ బ్రాండ్ అంబాసిడర్ వేరెవరో కాదు,  క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.  ఔను వంద సెంచరీల దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కరే.  సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి దశాబ్ద కాలం దాటి పోయింది. అయినా నేటికీ ఇండియన్ క్రికెట్.. ఒక్క ఇండియన్ క్రికెట్ అనేమిటి ప్రపంచ క్రికెట్  గురించి ప్రస్తావించాలంటే మొదటిగా ఎవరికైనా స్ఫురించే పేరు సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఈ సచినుడు అనితర సాధ్యం అన్న చందంగా ఏకంగా వంద శతకాలు బాదేశాడు. ఇవన్నీ అంతర్జాతీయ మ్యాచ్ లలో చేసినవే. ఇవి కాక కౌంటీ క్రికెట్ లో పారించిన పరుగుల వరద అదనం. అటువంటి సచిన్ టెండూల్కర్ కు ఇప్పుడు సీఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇంతకు ముందు పైన చెప్పుకున్న దిగ్గజ సంస్థలన్నిటికీ కూడా సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. వాటిలో కొన్నిటికి ఇప్పటికీ సచినే బ్రాండ్ అంబాసిడర్  అందుకే ఆ దిగ్గస సంస్థల జాబితాలోకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిందని చెప్పొచ్చు. భారత ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ బుధవారం ( ఆగస్టు 23) బాధ్యతలు చేపట్టారు.  రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ముఖ్యంగా ఓటింగ్ పై అర్బన్ ఓటర్లు, యూత్ ఒకింత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిలో అవగాహన పెంచి ఒటింగ్ దిశగా వారిని నడిపించేలా అవగాహన కల్పించేందుకు సచిన్ టెండూల్కర్ నడుంబిగించనున్ననారు.  భారత ఎన్నికల కమిషన్  బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ మూడేళ్ల పాటు ఉంటారు.  "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అటువంటి దేశంలో ఓటర్లు బాధ్యతగా ఓటేయాలి అని సచిన్ సీఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పేర్కొన్నారు.   

28న ఢిల్లీకి ఎన్టీఆర్ ఫ్యామిలీ...!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.  అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.   ఈ కార్యక్రమానినికి  ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరౌతారని చెబుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.  అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం.. ఆ చిత్రం కింద  శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించి. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.  మరో వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 28వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలోభాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. అందుకు తగిన సాక్ష్యాధారులను సైతం ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు. అలాగే  రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని.. వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని...ఈ అంశాన్ని సైతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్లనున్నారు. అలాగే ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. 

హస్తినకు చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం... ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితా నుంచి ప్రతిపక్ష టీడీపీ సానుభూతి పరుల ఓట్లను భారీగా తొలగించడమే కాకుండా.. దొంగ ఓట్లను సైతం అత్యధిక సంఖ్యలో ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసి ఈ అంశాన్ని వివరించనున్నారు.   అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎంకే మీనాను ఢిల్లీకి పిలుపించుకొని.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొంటున్న అవకతవకలపై వివరణ కోరడం.. వాటిని సాధ్యమైనంత త్వరగా సరి చేయాలని.. ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఆ ఆదేశాల అమలు  మాత్రం రాష్ట్రంలో నత్తనడకతో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆ సంగతిని కూడా  చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు.  మరోవైపు వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా అధికార జగన్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ క్రమంలో.. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించి ఆ స్థానంలో దొంగ ఓట్లను చేర్చిందనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న వ్యవహరాన్ని.. స్థానిక శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్.. కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాదారాలతో సహా ఫిర్యాదు చేయడంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి.. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిజమేనని నిర్ధారించుకొని.. అందుకు సంబంధించి    పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం.. ఆ క్రమంలో సదరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.    ఇంకోవైపు రాష్ట్రంలోని వివిధ  జిల్లాల్లో ఓటర్ల జాబితాను దొంగ ఓటర్లతో నింపేస్తున్నారని.. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు   స్పందించడం లేదని.. సదరు అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.  ఓ వైపు ఎన్నికలకు అట్టే సమయం లేదు... మరోవైపు మళ్లీ వరుసగా రెండో సారి అధికారంలోకి రావడం కోసం.. ఈ తరహా అరాచకానికి జగన్ పార్టీ తెర తీసిందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో జీరో హౌస్ నెంబర్లతో.. లక్షలాది ఓటర్ల పేర్లుతో జాబితాలు సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు పోలిటికల్ సర్కిల్‌లో  ఓ చర్చ అయితే హల్ చల్ చేస్తోంది.

జాబిల్లిపై ఇండియా వెన్నెల అడుగు

బాబిల్లిపై వెన్నెల అడుగు.. చంద్రయాన్ 3  కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఘట్టం మరి కొద్ది సేపటిలో సాక్షాత్కారం అవుతుంది. భారత దేశ చరిత్రలో  మహోజ్వల ఘట్టం చంద్రయాన్ 3 మిషన్ కీలక దశకు చేరుకుంది. ఒక ఇండియానే కాదు యావత్ ప్రపంచం చంద్రయాన్ 3   జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనున్న మహత్తర సన్నివేశాన్ని వీక్షించేందుకు కళ్లు విప్పార్చుకుని చూస్తోంది.  ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ ప్రత్యక్షంగా వీక్షించనుంది. ఇందుకు  ఇస్రో ఏర్పాట్లు చేసింది.   చంద్రయాన్-3 ల్యాండింగ్​ ప్రక్రియను యావత్ దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. బుధవారం( ఆగస్టు 23) సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3  కాలూనుతుంది ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది.   చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై 14న చేపట్టగా.. అప్పటి నుంచి క్రమక్రమంగా చంద్రయాన్ చంద్రుడి వద్దకు  వెడుతూ.. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. ఆ తర్వాత క్రమంగా దూరాన్ని అధిగమిస్తూ  బుదవారం (ఆగస్టు 23)  చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది.  సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై అడుగిడనుంది. వాస్తవానికి 17 నిమిషాలు ముందుగా అంటే 5.47 నిమిషాలకు ల్యాండ్ కావల్సి ఉండగా..  షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసి 6.04 గంటలకు ఫిక్స్ అయ్యింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి పైకి ల్యాండర్, రోవర్ పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా చంద్రుడి పైకి రోవర్లను పంపాయి. అయితే చంద్రుని దక్షణ ధృవాన్ని టార్గెట్ చేసిన తొలి దేశం మాత్రం ఇండియాయే అవుతుంది.  అంటే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తయితే దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశం గా జాబిల్లిపై భారత పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంది.   నిజానికి  చంద్రుడిపై అడుగిడేందుకు భారత్ కు ఇది  రెండో ప్రయత్నం. దాదాపు నాలుగేళ్ల క్రితం చంద్రయాన్-2ని ప్రయోగించి విఫలమైంది. చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యే సమయంలో సమస్యల్లో చిక్కుకుంది. ఆ మిషన్‌ విఫలమవ్వడంతో ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. ఇస్రో, చంద్రయాన్‌ 2 అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకుందని, చంద్రయాన్-3 మిషన్‌ను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్-2లో ఉపయోగించిన ‘సక్సెస్‌-బేస్డ్‌ డిజైన్’ కాకుండా చంద్రయాన్-3 కోసం ఇస్రో ‘ఫెయిల్యూర్‌-బేస్డ్‌ డిజైన్’ వ్యూహాన్ని అనుసరించింది. ఈ విధానం పొటెన్షియల్‌ ఫెయిల్యూర్‌ సినారియోలను అంచనా వేస్తుంది, వాటిని ఎదుర్కోవడానికి చర్యలను అమలు చేస్తుంది. తద్వారా విజయవంతమైన ల్యాండింగ్‌ను నిర్ధారిస్తుంది. కాగా, గతంలో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన చంద్రయాన్ 2 ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. ఇప్పుడీ ఆర్బిటార్.. విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేట్ అయినట్టు ఇస్రో తెలిపింది. వెల్‌కం బడ్డీ అంటూ చంద్రయాన్ 2 ఆర్బిటార్.. ల్యాండర్ మాడ్యూల్ కు స్వాగతం పలికింది.   చంద్రుని దక్షణ ధృవంపై అడుగు పెట్టనున్న మధుర క్షణాల కోసం ఇండియాతోపాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ లైవ్​లో వీక్షించనుంది. ఎక్కడికక్కడ స్కూల్స్, కాలేజీలతో పాటు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ ప్రయోగాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాయాది దేశం పాకిస్థాన్​ కూడా మన చంద్రయాన్ 3పై ప్రశంసలు కురిపించింది. పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఫవాద్‌ ఛౌదరీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పాక్‌ మీడియా ఈ చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రయోగాన్ని ప్రసారం చేయాలని కూడా పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు మన దేశంలో ప్రముఖ దేవస్థానాలలో కూడా చంద్రయాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రతి భారతీయుడు చంద్రయాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కవిత మాటల మర్మంమేటి? కామారెడ్డి మతలబేంటి?

రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన సేఫ్ సైడ్ గా  కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారని విపక్షాలు అంటుంటే.. సొంత పార్టీలోని అసమ్మతి నేతలు, నిరాశ చెందిన ఆశావహులు మాత్రం తన కుమార్తె కల్వకుంట్ల కవిత కోసమే ఆయన కామారెడ్డిని కూడా ఎంచుకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. రెండు స్థానాలలోనూ విజయం సాధించి.. ఆ తరువాత కామారెడ్డి స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో కవితకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న వ్యూహం కేసీఆర్ ది అని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం లక్ష్యంగా కసరత్తులు ప్రారంభించేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, అసమ్మతి వంటి అంశాలను అధిగమించడానికి తనదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు. అన్నిటికీ మించి మిగిలిన రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేశారు. అలా ప్రకటించి తాంబూలాలిచ్చేశాను ఇక తన్నుకు చావండి అన్నట్లుగా పార్టీలోని అసమ్మతికి ఆయన టార్గెట్ నిర్దేశించేశారు. అసమ్మతి ఏమైనా భగ్గు మంటే రోజుల వ్యవధిలో అది పార్టీపై చూపే ప్రభావాన్ని తగ్గించేయవచ్చన్నది ఆయన వ్యూహంలా కనిపిస్తోంది. అలాగే జాబితా అనంతరం పార్టీలో ఉండేవారెవరు? వెళ్లే వారెవరు అన్నది తేలిపోతే ఇక ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే జాబితాలో పేరుండి  కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్న మైనంపల్లిని ఎలా డీల్ చేయాలన్న విషయంలో ఆయన తొలుత ఉదారంగా వ్యవహరించినా.. రోజులు గడిచే కొద్దీ కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. బుధవారం (ఆగస్టు 23)  ఆమె మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం తనకోసమే అంటూ వస్తున్న విమర్శలకు ఆమె ఇసుమంతైనాన స్పందించలేదు. అలసా విషయమే తనకు తెలియనట్లుగా పూర్తిగా నాన్ సింక్ ఇష్యూ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పార్టీలను చెరిగి పారేశారు. నెహ్రూ నుంచి మొదలు పెట్టి మోడీ వరకూ అందరిపైనా విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తాను టేకప్ చేస్తాననీ, ఈ విషయంలో అన్ని పార్టీలనూ కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఆమె మాటలు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ అంశాన్ని డైవర్ట్ చేసి డైల్యూట్ చేయడమే లక్ష్యంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మహిళలకు సరైన ప్రాతినిథ్యం లేదంటూ వస్తున్న విమర్శలపై ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అంశం పూర్తిగా తన సొంత అంశమన్నారు.  దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు చట్ట సభలలో సరైన ప్రాతినిథ్యం లేకపోవడం దారుణమని పునరుద్ఘాటించిన కవిత..  దేశ వ్యాప్తంగా 14 లక్షల పైచిలుకు మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నారు. కానీ పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా వుందన్నారు.   తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో  మహిళలకు సముచిత స్థానం దక్కలేదన్న విమర్శలకు ఆమె బదులిస్తూ కేసీఆర్ ను సమర్ధించారు. నెహ్రూ కేబినెట్ లో ఒకే ఒక్క మహిళలకు స్థానం ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.  అలాగే ప్రస్తుత మోడీ కేబినెట్ లో నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ మాత్రమే ఉన్నారని ఎత్తి చూపారు.  బీజేపీ పాలిత రాష్ట్రమైన  యూపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవని విమర్శించారు. 1996 లో తొలిసారి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. 2010 లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ బిల్లుకు మోక్షం కలగకపోవడానికి కారణమెవరని నిలదీశారు.   దశాబ్ద కాలంగా  లోక్ సభలో  సంపూర్ణ మెజారిటీ ఉన్నా..  మహిళా రిజర్వేషన్ బిల్లు ను పాస్ చేయకుండా మోడీని అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో  డిసెంబర్ లో ధర్నా చేస్తానని తెలిపారు. సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీకి, బీజేపీ మహిళా నేతలకు ఆహ్వానాలు పంపుతామన్నారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి పడుతుంది అన్న ఎంపీ ఆరవింద్ వ్యాఖ్యలతో ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానం వాస్తవమేనని అనిపిస్తోందని కవిత అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

రాజకీయ వైరంతో దార్శనికుడి ప్రతిభను మరుగున పడేయలేరు!

రాజకీయవైరంతో ఒక దార్శనికుడిని మరుగున పడేయాలను కోవడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోగలమనుకోవడం లాంటి భ్రాంతి మాత్రమే. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో అది పదే పదే రుజువౌతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సాధించిన నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారు  చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే  ఉన్నారు. ఉంటారు.    రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న, వచ్చిన గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తుందేమో కాని అనితర సాధ్యం అనదగ్గ రీతిలో ఆయన సాధించిన విజయాలు, ఆయన చొరవవల్లే.. ఔను కేవలం ఆయన చొరవ, దూరదృష్టి కారణంగానే  జంటనగరాలకు అదనంగా ఆయన నిర్మించిన సైబరాబాద్ మహానగరం, హైదరాబాద్ కు అనేమిటి.. యావద్దేశానికే తలమానికం అనదగ్గ  ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్, ఇండియన్ ఇనిస్టిట్యట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన క్రీడా ప్రాంగణాలు.. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఒకటనేమిటి హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు దోహదపడిన ప్రతి ప్రగతి నిర్మాణంలోనూ చెరిగిపోని విధంగా చంద్రబాబు ముద్ర ఉంది. ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి కార్యక్రమం, ఏర్పాటు చేసిన ప్రతి సంస్థ.. రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంతోనే చేశారు. వర్తమానం గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగారు.  ఆ దార్శనికతే  చంద్రబాబుకు ఒక విశిష్ట నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా ఆయన అమెరికా వీధుల్లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మరీ ప్రపంచ ప్రఖ్యాల సంస్థలను ఆహ్వానించారు. ఆయన సింప్లిసిటీ, ఆయన దూరదృష్టి కారణంగానే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికీ రాని విధంగా ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చాయి. అలా చంద్రబాబు కృషి వల్ల హైదరాబాద్ వచ్చిన ఐఐఐటీ హెచ్  బుధవారం (ఆగస్టు 23) సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు   పాల్గొంటున్నారు.  ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఆయన బుధవారం ( ఆగస్టు 23) విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చిస్తారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే  1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ రంగాలలో దేశంలోనే నంబర్ వన్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ బెంగళూరును అధిగమించి మరీ ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.  హైదరాబాద్ నలుచెరగులా జరిగిన అభివృద్థిలో ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాజకీయంగా ఉన్న విభేదాలతో దార్శనికుడి ప్రతిభ మరుగున పడేయాలన్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి.  ఐఐఐటీ హెచ్  సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దాదాపుగా జాతీయ పత్రికలన్నీ ఆ సంస్థ ఉన్నతి గురించీ, అది హైదరాబాద్ లో ఏర్పాటు కావడం వెనుక ఉన్న చంద్రబాబు దార్శనికత గురించీ  ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాయి. చంద్రబాబు వంటి దార్శనికుడి అవసరం దేశానికి ఎంతో అవసరమంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. 

పాలేరు పాయే... తుమ్మల చూపు ఎటో...? 

బీఆర్ఎస్  జాబితా రిలీజ్ అయింది.. కొందరు నేతలకు టిక్కెట్లు దొరకలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే... ఇద్దరు సీనియర్ నేతలకు మొండి చేయి ఇచ్చారు కేసీఆర్.  కీలక నేతలుగా ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్లు దక్కకపోవడం పట్ల జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మలకు అవకాశం కచ్చితంగా ఉంటుందని, సర్వేల్లోనూ ఆయనకే మొగ్గు ఉందన్న ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడంతో పాలేరు టికెట్‌పై ఆశపెట్టుకున్న తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ జరుగుతోంది. ఆయకు సీఎం కేసీఆర్‌ ఎలాంటి భరోసా ఇస్తారన్నది దానిపై ఆయన అభిమానులు....కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అయితే తమ పార్టీలో చేరితే పాలేరు లేదా ఖమ్మం నుంచి బరిలో దింపుతామని కొందరు కాంగ్రెస్‌ నేతలు తుమ్మలకు ఆఫర్లు ఇస్తుండగా.. తుమ్మల మాత్రం తాను బీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేస్తానన్న ధీమాతో ఇప్పటి వరకు వేచి చూశారని చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తుమ్మల పాలేరులో తాను పోటీ చేయడం ఖాయమని, గోదావరి జలాలతో పాలేరును సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. కానీ బీఆర్‌ఎస్‌ జాబితాలో ఆయనకు చోటు లేకపోవడంతో ఆయన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై ఊహాగానాలు నడుస్తున్నాయి. కేసీఆర్‌ ఇచ్చే భరోసాతో తుమ్మల నిర్ణయం ముడిపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే   జలగం వెంకటరావు తనకు కొత్తగూడెం అభ్యర్థిత్వం దక్కుతుందని ధీమాతో ఉండగా...తాజా జాబితాలో ఆయనకు మొండి చేయి ఇచ్చారు కేసీఆర్.  చోటివ్వకపోవడంతో జలగం కాంగ్రెస్‌ వైపు చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికే కొత్తగూడెం టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలో ఉండటంతో.. ఒకవేళ పొంగులేటి పాలేరు లేదా ఖమ్మం వైపు వస్తే జలగం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరి కొత్తగూడెం అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ విషయమై జలగం ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుల నిర్ణయం కోసం జిల్లా రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల అభిమానుల సమావేశం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం జరుగినట్లు సమాచారం. ఈ సమావేశంలో జరిగిన అభిప్రాయ సేకరణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎదుట ఉంచుతామని, తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే నడుస్తామని అనుచరుల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలి వెళ్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసే యోచనలో ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలిసింది. తుమ్మల, జలగం ఎపిసోడ్ లకు ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.