బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులతో జాబితా ప్రకటించారు. కేసీఆర్ కు నమ్మకం ఉన్న ముహూర్తం ప్రకారం పంచమి తిథిలో ఈ జాబితాను విడుదల చేశారు. జాబితా విడుదల కు ముందు తెలంగాణ భవన్ వదర్ద, ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద హై డ్రామా నెలకొంది. ఎవరికి టికెట్ల దక్కుతాయి, ఎవరికి టికెట్లు దక్కవు అన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. పార్టీ టికెట్ లభిస్తుందా, లభించదా అన్న అనుమానం ఉన్న వారు ఉరుకులు పరుగులు పెట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడంతో ఆశావహులు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలతో తమ విన్నపాలు చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. కాగా అనుకున్న ముహూర్తానికి కేసీఆర్ అభ్యర్థుల జాబీతా ప్రకటించారు.  సిట్టింగులలో కేవలం నలుగురిని మాత్రమే మారుస్తున్నట్లు చెప్పారు. అలాగే తాను గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.   అసంతృప్తికి గురైన నేతలను ఎలా బుజ్జగించాలన్నదానిపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని పిలిపించుకుని మాట్లాడారు. గతానికి భిన్నంగా ఈ సారి అసంతృప్తులను బుజ్జగించడానికి కేసీఆర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. పోన్ లో టికెట్ దక్కని వారిని సముదాయించి భరోసా కల్పించారు.   ఒకేసారి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్.. నలుగురు సిట్టింగులకు మాత్రమే టికెట్ లేదని వెల్లడించారు. అలాగే మరో ఆరుస్థానాలను పెండింగ్ లో ఉంచినట్లు చెప్పారు. టికెట్ దక్కలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులు ఉంటాయన్నారు.  గతంలో లాగే ఈ సారి కూడా ఎంఐఎంతో కలిసే ఎన్నికలు వెడతామన్నారు. 

ఊసరవిల్లికి బ్రాండ్ అంబాసిడర్ పీకే

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా చిరపరిచితమైన పేరింది. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన రాజకీయ పార్టీలకు పని చేశారు. సాధారణంగా ఆయన ఏ పార్టీ తరఫున పని చేస్తే ఆ పార్టీ ఆ ఎన్నికలలో విజయం సాధించడం కద్దు. అలాగని ఆయన ఎప్పుడూ ఒకే పార్టీని పట్టకు వేళాడరు. ఎప్పటికప్పుడు తన కొలువు మార్చేస్తూ ఉంటారు. 2014  ఎన్నికలలో కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు తీరడం వెనుక ఆయన ఎన్నికల స్ట్రాటజీకి సింహభాగం ఉందనడంలో సందేహం లేదు. అయితే 2019 ఎన్నికలలో మాత్రం ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారు. అది పక్కన పెడితే 2019 ఎన్నికలలో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం వెనుక నిస్సందేహంగా పీకే వ్యూహాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా జగన్ అంగీకరించారు. 2019 ఎన్నికల పోలింగ్ ముగియగానే పీకే, ఆయన టీమ్ తో జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేకంగా కృతజ్ణతలు కూడా చెప్పారు. ఆ తరువాత కూడా నిన్న మొన్నటి వరకూ పీకే తాను సొంతంగా పార్టీ పెట్టుకుని బీహార్ లో తన రాజకీయాలు తాను చేసుకుంటున్నా కూడా జగన్ ను, జగన్ పార్టీనీ వీడలేదు.  ఆయన ఐప్యాక్ బృందం జగన్ కోసం ఏపీలో విస్తృతంగా పని చేస్తున్నది. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం, కుల, మత విద్వేషాలు రగల్చడం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం వంటి వ్యూహాలన్నీ పీకేవే అని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అటువంటి పీకే బృందం తాజాగా ఒక సర్వేలో వైసీపీ పనైపోయిందన్న నివేదికలు జగన్ కు ఇచ్చింది. ఆ సర్వే లీక్ అయ్యింది. అయితే ఆ సర్వే ఫేక్ అంటూ వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమంలో గగ్గోలు పెడుతున్నా.. జనం మాత్రం ఆ సర్వే అక్షర సత్యమని నమ్ముతున్నారు.  సరిగ్గా ఇక్కడే.. పీకే ప్లేటు మార్చేశారా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక సారి ఒక సందర్భంలో పీకే తాను జగన్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడి తప్పు చేశానని రిపెంటెన్స్ వ్యక్తం చేశారు.  2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచే దిశగా నడిపించడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బాగా పనిచేశాయనే చెప్పొచ్చు. 2014లో నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడంలో, ఆ తర్వాత బీహార్ లో నితిశ్ కుమార్ ను సీఎంను చేయడంలోనూ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు చాలా వరకూ దోహదం చేశాయనడంలో సందేహం లేదు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి ఏర్పాటయ్యేలా చేసిన ప్రశాంత్ కిశోర్ దాన్ని విజయపథంలో నడిచేలా వ్యూహాలు రచించారు. తర్వాత ఢిల్లీలో ఆప్ సర్కర్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయం సాధించేలా తోడ్పాటు అందించారు. బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కూడా ప్రశాంతి కిశోర్ పాత్రను ఇసుమంతైనా తగ్గించి చూపలేం. నితీష్ కు బీహార్ లో అధికార పీఠంపై కూర్చునేందుకు తన వ్యూహాలతో దోహదం చేయడం తాను చేసిన అతి పెద్ద తప్పుల్లో  ఒకటని ప్రశాంతి కిషోర్  పలు సందర్భాలలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలన్నీ ఆయా రాష్ట్రాలలో హింసాకాండను ప్రేరేపించడం సెంట్రిక్ గా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గత ఎన్నికలలో జగన్ పార్టీని విజయం దిశగా నడిపించిన పీకే వ్యూహాలు ఈ సారి అంతగా ఫలించడం లేదని చెప్పాలి.  అయినా ప్రశాంత్ కిషార్ తాను ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడానికి అంగీకరించారంటే.. ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని, తన బృందంతో ముందుగానే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని గెలుస్తుందని నమ్మకం కలిగే పార్టీ తరఫునే పని చేస్తారని పరిశీలకులు సోదాహరణంగా వివరించారు. ఇక ఏపీ విషయానికి వస్తే నాలుగేళ్ల పాలన జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దానిని అధిగమించి  మరో సారి అధికారంలోకి రావడం కోసం ఆయన పీకే ప్రత్యక్షంగా పర్యవేక్షించకపోయినా ఆయన బృందం వైసీపీ తరఫున పని చేస్తున్నది. అదే సమయంలో ఐప్యక్ లో చీలిక వచ్చి ఒక వర్గం తెలుగుదేశం కు వ్యూహాలు రచిస్తున్నది.  రాజకీయాల్లో మార్పు కోసం అంటూ ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరుతో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా నుంచి 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర ఎప్పుడు మొదలైందో ఎలా సాగుతోందో బీహార్ లో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.   ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో ఐ ప్యాక్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వే లీక్ అయ్యింది. ఆ సర్వే ప్రకారం వైసీపీ ఇక తట్టాబుట్టా సర్దేసుకోవలసిందే. ఇక్కడే రాజకీయవర్గాలలో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓడిపోయే పార్టీ తరఫున పని చేయడం ఇష్టం లేని పీకే ఉద్దేశ పూర్వకంగానే ఈ సర్వేను లీక్ చేశారనీ, ఈ సాకుతో జగన్  ఐపాక్ తో తన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటారన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తున్న ఐప్యాక్ చీలిక వర్గానికి తన వంతు సహకారం అందిస్తున్నారన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి. 

మన వాళ్లకే ఓట్లుండాలి.. వైసీపీ భారీ కుట్ర!?

రాష్ట్రం నలుచెరగులా జగన్ సర్కార్ పై వ్యతిరేకత, ఆగ్రహం పెల్లుబుకుతున్నా.. అధికార పార్టీ, ముఖ్యమంత్రి వైనాట్ 175 అని ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహం రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా గట్టిగా వ్యక్తం అవుతోంది. అయితే జగన్ రెడ్డి ధీమాకు కారణమేమిటో ఇటీవల ప్రస్ఫుటంగా బయటపడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి, గుప్పెట్లో పెట్టుకు ఎన్నికల రణరంగంలో సునాయాసంగా గెలిచేయవచ్చన్న ధైర్యమే ఆ ధీమాకు కారణమని సోదాహరణంగా పరిశీలకలు చెబుతున్నారు. గత ఎన్నికలలో  అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ను 23 స్థానాలకే పరిమితం చేసి ఘన విజయం సాధించిన అధికారం చేజిక్కించుకున్న జగన్.. నాలుగేళ్లు అధికారంలో ఉండి.. మరో సారి ఎన్నికలకు సమాయత్తమౌతున్న వేళ.. సహజంగానే ఈ నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి? అన్న చర్చ జరుగుతుంది. ఈ చర్చలో జగన్ వైఫల్యాలు వినా సాధించిన విజయాలేవీ చెప్పుకోవడానికి కూడా కనిపించడం లేదు. అయితే జగన్ సర్కర్ మాత్రం తమ ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా బటన్ నొక్కుతూ సంక్షేమ నిథులను పందేరం చేస్తున్నారనీ, ఆ సంక్షేమమే మరో సారి తమకు అధికారాన్ని కట్టబెడుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఆ నమ్మకం కేవలం చెప్పడానికే తప్ప నిజంగా ఆ పథకాల లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్న నమ్మకం వైసీపీ శ్రేణులు, నాయకులలోనే కనిపించడం లేదు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడపగడపలో ఎదురైన పరాభవాలే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మరి ప్రజల నుంచి ఈ స్థాయిలో ఛీత్కారాలు ఎదురౌతున్నా, పరాభవాలను చవిచూస్తున్నా జగన్ కు వైనాట్ 175 ధీమా  ఎక్కడిది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధిస్తామన్న ధీమాను ఎలా వ్యక్తం చేస్తున్నారు. తమ గుప్పెట్లోని సంస్థల ద్వారా పాతికకు పాతిక పార్లమెంటు స్థానాలలోనూ గెలిచేస్తామని ఎలా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇంత కాలం జగన్ ధీమా వెనుక ఉన్నదేమిటి? ఎవరు? అన్న ప్రశ్నలకు ఇటీవలి కాలంలో కచ్చితమైన జవాబులు లభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఓట్ల తొలగింపు, బూటకపు ఓట్ల నమోదుతో మొత్తం ఏపీలో ఎన్నికల ప్రక్రియనే తమకు  కావలసిన విధంగా మార్చేసుకోగలమన్న ధీమాతోనే జగన్ వైనాట్ 175 అంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆశీస్సులు, రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా టాంపరింగ్ యథేచ్ఛగా చేపట్టడం వల్లనే.. తమకు ఓట్లేసే వారి పేర్లు మాత్రమే జాబితాలో ఉంటాయి.. వ్యతిరేకులు, ప్రత్యర్థులకు అసలు రాష్ట్రంలో ఓటు హక్కే ఉండదు అన్న స్థాయిలో ఈ టాంపరింగ్ జరుగుతోందని చెబుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఉరవకొండ రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు ను చెబుతున్నారు. ఉరవ కొండలో ఏకంగా తెలుగుదేశం సానుభూతి పరులకు చెందిన   ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, అలాగే ఆరువేల దొంగ ఓట్లను చేరడంపై  తెలుగుదేశం సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు  మేరకు పరిశీలన జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు  చర్యలు తీసుకున్నారు.  ఒక్క ఉరవకొండ అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బోగస్ ఓట్ల నమోదు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు సంబంధించి భారీ కుట్ర జరిగిందని వరసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల ద్వారా తెలుస్తోంది.  మంత్రి సీదిరి అప్పలరాజు.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  తెలుగుదేశం ఓట్లు అయితే తొలగించాలని  తమ వారికి ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై నయానా, భయానా ఒత్తిడి తీసుకువచ్చి ఈ మేరకు ఓటర్ల జాబితాలో తమను వ్యతిరేకించే వారి ఓట్లు లేకుండా, తమకు అనుకూలంగా ఉండేలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు ద్వారా సునాయాసంగా విజయం సాధించేయాలన్నది వైసీపీ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఓట్ల తొలగింపు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ పని చేస్తున్నారని అంటున్నారు.  వరుసగా వెలుగులోనికి వస్తున్న ఈ ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. 

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీర్చుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు వాజ్ పేయి ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..! (నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా)

తెలంగాణ అలా..ఏపీ ఇలా.. జగన్ నిర్వాకమే కారణం!?

ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి, తొమ్మిది సంవత్సరాలు నిండిపోయాయి.  2014 జూన్ రెండున ఉమ్మడి ఆంధ్ర్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాయి. అలా విడిపోయి తొమ్మిదేళ్లు పూర్తై పదో ఏడు జరుగుతోంది.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. సంబురాలు చేసుకుంది. మరి, అవశేష అందర ప్రదేశ్ పరిస్థితి ఏమిటి?  ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది.అవశేష ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెడితే రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దూరదృష్టితో.. ఆయనకే సాధ్యమైన విజన్ తో ప్రారంభించిన  రాజధాని అమరావతి నిర్మాణాన్ని, ప్రస్తుత  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి     అటకెక్కించేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచనను తీసుకొచ్చి అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో నాలుగేళ్ళు గడిచిపోయాయి.  సెక్రటేరియట్ కాదు,అసలు రాజధానే లేని రాష్ట్రంగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మిగిలింది. ఇతర రాష్ట్రాలకు ఒక లాఫింగ్ స్టాక్ గా మారింది.   మరోవంక, నీరు, నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగణ రాష్ట్రం ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. ఏవో కొన్ని అవకతవకలు ఉన్నా.. లోపాలు ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అందులో  ఎంత అవినీతి జరిగింది అనేది పక్కన  పెడితే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంది. పంటలు పెంచుకుంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మరోవంక అవశేష ఆంద్ర ప్రదేశ్  రాష్ట్రానికి  జీవనాడిగా పేర్కొన్న  జాతీయ ప్రాజెక్ట్  పోలవరం  ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతం వరకూ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి, రెండు రాష్త్రాల మధ్యా ఎంత తక్కువ పోలిక  తెస్తే అంత మంచిది.  తొమ్మిదేళ్లలో అవశేష ఆంధ్ర ప్రదేశ్   అన్ని విషయాల్లోనూ వెనకబడిన రాష్ట్రంగా మిగిలింది. వెనుకబాటు తనంలో, శాంతి భద్రతల పరిస్థితిలో బీహార్ ను అధిగమించేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  ఉమ్మడి రాష్ట్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నాటిన ఐటీ విత్తనాలు ఇప్పుడు మహా వృక్షాలుగా ఎదిగి  ఆ మహానగరం ఐటీ రంగంలో దూసుకు పోతోంది. అనేక దిగ్గజ  సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫలితంగా, తెలంగాణ రాష్త్రం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక మేరకు  2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగంలో 31.44 శాతం అభివృద్ధి సాధించింది. తెలంగాణలో ఐటీఎగుమతులు రూ3904.55 కోట్లకు చేరుకున్నాయి,   మరి ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇక్కడ కూడా అదే కథ. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా  కృషి చేశారు.   ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి,ప్రభుత్వం మారి పోయింది. రాష్ట్రం ఐటీ అంటే మీటలు నొక్కడమే అనుకునే ముఖ్యమంత్రి ఏలుబడిలోకి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖ ఒకటుందని, ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నారని, ఆయన పేరు  గుడివాడ అమరనాథ్  అని చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అమర్నాథ్ మాటకు ముందొకసారి. వెనుక ఒకసారి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్తోత్రం చదువుతారు.  అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ, ఐటీ .. అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగవద్దని తప్పుకుంటారు.   .రాష్ట్ర విభజన సమయంలో  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. నిజమే. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా  వ్యవహరించింది. అదే అన్యాయాన్ని కొనసాగించింది. కొనసాగిస్తోంది. మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం   అంతకు ముందు  ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానాన్ని దారి మళ్ళించారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారం కలబోసి అభివృద్ధిని అటకెక్కించారు. అందుకే ఈరోజు  ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు, అనుకునే దయనీయ స్థితికి రాష్ట్రం చేరుకుంది. అందుకే  రాజకీయ విశ్లేషకులు  మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన తెచ్చుకోవడం ఒక్కటే పరిష్కారం అంటున్నారు.

రఘురామకృష్ణం రాజు పోటీ ఎక్కడ.. పార్టీ ఏది?

ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలలో, ఎత్తుగడలతో రెడీ అయిపోతున్నాయి. పొత్తుల విషయంలో చర్చ జోరుగా సాగుతోంది. పంచాయతీలు, వార్డు సభ్యులకు తాజాగా జరిగిన ఉప ఎన్నికలలో అధికార పార్టీకి జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పట్టణాలు, నగరాలలో ఏదో కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కానీ.. పల్లెల్లో మాకు తిరుగేలేదని ధీమాతో ఉన్న అధికార వైసీపీకి.. జనం పల్లెలెటలా కదులుతున్నాయో శాంపిల్ చూపించేశారు. ఒక వైపు రాజకీయ వాతావరణం హీటెక్కి ఉంటే.. కొన్ని స్థానాలలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? పొత్తులు ఉంటే.. ఎవరు ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలా రాష్ట్రం మొత్తం ఆసక్తి కనబరుస్తున్న అంశం వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదే. ట్రిపులార్ అన్నా, రఘురామకృష్ణం రాజు అన్న ఎవరికీ  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవును వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం వార్తల్లో ఉంటూ జగన్ సర్కార్ తప్పులను మా ప్రభుత్వం, మావాడు అంటూనే ఎండగట్టే నరసాపురం ఎంపీ.  గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచారు. అలా గెలిచారు.. ఇల అసమ్మతి ఎంపీగా ముద్ర పడ్డారు.   రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రచ్చబండకు ఈడుస్తునే ఉన్నారు. సర్కార్ అగ్రహానికి గురయ్యారు. జగన్ రెడ్డి సీఐడీ పోలీసులు ఆయనకు, థర్డ్ డిగ్రీ రుచి చూపించారు. నిజానికి చెప్పాలంటే అయన కథ చాలానే వుంది.  అది పక్కన పెట్టి ప్రస్తుతంలోకి వస్తే ... ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతునట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  నిజానికి,గతంలో రఘురామ కృష్ణం రాజు.. బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో ఆయన కాషాయం కట్టేసినట్లేననే వార్తలు కూడా వచ్చాయి. అయితే, కారాణాలు ఏవైనా, ఆయన బీజేపీలో చేరలేదు. అయితే, బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కానీ, గత కొంత కాలంగా ఆయన బీజేపీతో లాభం లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలో కొనసాగేందుకు తెలుగుదేశంలో చేరే  ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.    ఇంతకాలం టీడీపీ, జనసేన కూటమిలో బీజేపే కూడా జట్టుకడుతుందనే నమ్మకంతో ఉన్న ఆయన,ఇటీవల చోటి చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా తాను నరసాపురం నుంచే పోటీ చేస్తాననీ, అయితే ఏ పార్టీ అన్నది త్వరలో నిర్ణయించుకుంటాననీ చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడిక తెలుగుదేవం గూటికే చేరాలని నిర్ణయానికి వచ్చేసిన ట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల  రెండురోజులపర్యటనకు ఢిల్లీ వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలుగుదేశం ఎంపీలతో కలిసి కృష్ణం రాజు కూడా స్వగతం పలికారు.  ఆ సందర్భంగానే తాను నరసాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు ఆ సందర్భంగా చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.  ఒక వేళ నరసాపురం కుదరకపోతే..   మరే లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను అయినా తనకు కేటాయించాలని కోరినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా రఘురామరాజు విజ్ణప్తికి సానుకూలంగా స్పందించారని అంగటున్నారు. 

అత్తమీద కోపం దుత్త మీద.. ఏపీలో డ్రైవింగ్ లైసెన్సులు డిజిటలైజేషన్.. వెనక కథ ఇదీ?!

ఏపీలో వాహనదారులకు ఇకపై రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న డాక్యుమెంట్లు సరిపోతాయి. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇకపై డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం చెల్లించాల్సిన ఛార్జీలను కూడా ఆపేసింది. లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను కూడా వసూలు చేయడం లేదు. ఇకపై వాహనదారులు తమ మొబైల్స్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీని పోలీసులు, రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది.  ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. లావాదేవీలతో పాటు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని.. అందుకే భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకువచ్చిందని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. వాహనదారులంతా మొబైల్‌లో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్‌ ద్వారా లైసెన్స్, ఆర్సీలను డౌన్‌లోడ్‌ చేసుకోని పెట్టుకొని అవసరమైనపుడు చూపిస్తే సరిపోతుందని ప్రకటించారు. అయితే, ఈ డిజిటలైజ్ చేయడం వెనక పెద్ద తతంగమే నడిచిందని ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుండి లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం ఆర్టీఏ సర్వీసుల డిజిటలైజేష్ ప్రజలకు వెసులుబాటు కోసం చేసింది కాదనీ,   లైసెన్సులు, ఆర్సీలకు కావాల్సిన ముడి సరుకు కొరతతోనే ఇందుకు ఉపక్రమించిందని అంటున్నారు. మొన్నటి వరకు లైసెన్సులు, ఆర్సీల కోసం వాహనదారుల నుండి కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇలా ఏడాది కాలంగా డబ్బులు చెల్లించిన ఎవరికీ ఈ కార్డులు పంపించలేదు. గత ఏడాది కాలంగా డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో పంపిణీ చేయడానికి వాహనదారుల నుండి డబ్బులు తీసుకున్నారు కానీ, ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో డబ్బులు కట్టకపోవడంతో కార్డులు పంపాల్సిన వెండర్లు రవాణాశాఖకు పంపించలేదు. అప్పటికే పెండింగ్ బిల్లులు ఉండగా.. అవి క్లియర్ చేస్తేనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం ఈ డిజిటల్ ఆలోచన చేసిందని చెబుతున్నారు. ఇకపై ఈ కార్డుల కోసం చెల్లించాల్సిన రూ.225 అవసరం లేదని చెప్తున్న రవాణా శాఖ.. గత ఏడాది కాలంగా ఈ డబ్బు చెల్లించిన వారికి కార్దులు పంపిస్తామని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే, ఇక కార్దుల ఆశ వదులుకోవాల్సిందేనని ఆర్టీఏ ఏజెంట్లు చెప్తున్నారు. అంత బాగానే ఉంది.. అందరూ తమ ఫోన్లలో యాప్ ఇంస్టాల్ చేసుకొని లైసెన్స్, ఆర్సీ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ, చదువు లేని వారు.. స్మార్ట్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారంతా మీ సేవా, లేదా ఆన్ లైన్ సెంటర్ కి వెళ్లి తమ వివరాలతో పత్రాలు డౌన్ లోడ్ చేసి ఆ కాగితాలను తమ వద్ద ఉంచుకొని రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని చెప్తున్నారు. మిగతా చాలా రాష్ట్రాలలో ఈ డిజిటల్ విధానం ఉన్నా.. కార్దులు కూడా జారీ చేస్తారు. కార్డులు దగ్గర ఉన్న వారు అవి చూపిస్తే మిగతా వారు డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఏపీలో మాత్రం ముందూ వెనకా చూడకుండా.. పర్యవసానాలేంటి అన్న ఆలోచన లేకుండా పూర్తిగా డిజిటల్ విధానం ఒక్కటే తీసుకొచ్చారు. ఇది కేవలం నిధులు చెల్లించకపోతే కార్దులు జారీ చేయడం కుదరదన్న వెండర్ల మీద కోపంతో తీసుకొచ్చిన విధానం మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

హంటర్ బైక్.. ఈ క్రేజ్ ఏంట్రా నాయనా!

రాయల్ ఎన్‌ ఫీల్డ్ బైక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అటు పాతతరం.. ఇటు కొత్త తరాన్ని ఒకేలా ఆకర్షించే బైక్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఎన్ ఫీల్డ్ అనే చెప్పుకోవచ్చు. మన భారతీయులు ముద్దుగా బుల్లెట్ బండి అని పిలుచుకునే ఈ బైకుపై మనసు పారేసుకుని రైడర్ ఉండరేమో. బైక్ కొనాలంటే ఎన్ ఫీల్డ్ మాత్రమే కొనాలని కలలు కనే కుర్రాళ్లే ఎక్కువ మంది ఉంటుంటారు. తన భర్తతో బుల్లెట్ బండెక్కి షికార్లు కొట్టాలనుకోని మహిళ ఉండదంటే అతి శయోక్తి కాదు. బుల్లెట్ బండెక్కి వచ్చేతప్పా.. పాట అని లక్షల వ్యూస్ సాధించడానికి బుల్లెట్ బైక్ పై యువతలో ఉన్న క్రేజ్ కూడా ఒక కారణం. ఎన్ ఫీల్డ్ స్టైలిష్ లుక్ తో పాటు 350 సీసీ, 500 సీసీలతో ఈ బైక్ సామర్ధ్యం కూడా బైక్ లవర్స్ ను ఆకర్షిస్తుంటుంది. అయితే, కొనాలనే మనసు ఉన్నా చాలామంది దీని ధర విషయంలో వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే ఎన్ ఫీల్డ్ నుండి 350 సీసీ బైక్ సొంతం చేసుకోవాలంటే కనీసం రెండు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ధరను చెల్లించగలిగిన వారు సొంతం చేసుకుంటుంటే మధ్య తరగతి కుటుంబాలలో చాలా మంది ప్రత్యామ్నాయ బైకులపైకి వెళ్లే వారు. దీన్ని దృషిలో పెట్టుకొనే ఎన్ ఫీల్డ్ మిడ్ సైజ్ సెగ్మెంట్ లో ఒక బైకు తీసుకొచ్చింది. అదే ఎన్ ఫీల్డ్ హంటర్ 350.  రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ గా హంటర్ 350ని 2023 సంవత్సరం ఆగస్టులో తీసుకొచ్చింది. ఇది రూ.1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయగా.. ఈ రేంజ్ ధర కలిగిన మిగతా అన్ని కంపెనీలను తలదన్నేలా ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 దూసుకెళ్తుంది. కేవలం ఏడాది కాలంలోనే ఎన్ ఫీల్డ్ హంటర్ రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకెళ్లింది. హంటర్ 350 ఈ ఏడాది ఫిబ్రవరికే మన దేశంలో లక్ష యూనిట్లు అమ్ముడు కాగా ఈ ఐదు నెలల్లో మరో లక్ష యూనిట్ల సేల్స్ తో దుమ్మురేపింది. ప్రస్తుతం భారత్‌తోపాటు ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఈ బైక్స్ సేల్స్ జరుగుతుండగా.. త్వరలోనే బ్రెజిల్ లో కూడా ఆవిష్కరిస్తున్నారు.  ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కాంపాక్ట్ బైకులలో హంటర్-350 అత్యంత చౌకగా అందుబాటులోకి రావడం యువత  దీని వైపు మళ్లేలా చేసింది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్  వీల్స్, బైక్ హ్యాండిల్స్, డైరెక్షన్ మార్పులు డిఫరెంట్ గా ఉండడం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది. హంటర్-350తోపాటు మార్కెట్లోకి వచ్చిన క్లాసిక్-350, మీటర్-350 బైక్స్‌లోనూ 349సీసీ ఇంజిన్ ఉంది. కానీ హంటర్-350 బైక్ పట్ల చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఈ స్థాయి సేల్స్ సాధ్యమవుతున్నది. హంటర్-350 రెండు వేరియంట్లలోనూ 349సీసీ సింగిల్ సిలిండర్, ఎస్ఓహెచ్సీ, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 6100 ఆర్పీఎంపై 20.2 బీహెచ్పీ, 4000 ఆర్పీఎంపై 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్‌లు, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ లైట్, డ్యుయల్ టోన్ పెయింట్ థీమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. రెట్రో వేరియంట్ లో డ్రమ్ బ్రేక్, సింగిల్ చానెల్ ఏబీఎస్, వైర్ స్పోక్ వీల్స్, సింగిల్ టోన్ కలర్ స్కీమ్స్ ఉన్నాయి.  రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పరిమాణం పరంగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,055 మిమీ, వెడల్పు 800 మిమీ, ఎత్తు 1,055 మిమీ కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక సీట్ ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మరోవైపు రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ దక్కించుకోవడం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రంగుల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

భయాన్ని వదిలి దండయాత్ర మొదలు పెట్టిన ప్రజలు!

సంక్షేమమే మా ఎజెండా.. పేదల పాలిట పెన్నిధి మా ప్రభుత్వం.. మా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేద ప్రజల కోసమే. ఈ నాలుగేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న మాటలు ఇవే. అయితే, ప్రజలలో మాత్రం   తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. పట్టణాలు, నగరాలలో ప్రజలు ప్రభుత్వంపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్నారు. అభివృద్ధి అనే మాట ఎక్కడా కనిపించడం లేదన్నది ఇక్కడి ప్రజల ప్రధాన ఆరోపణ. అయితే, పల్లె జనంలో కూడా ఈ వ్యతరేకత వ్యక్తమవుతోందనడానికి నిలువెత్తు నిదర్శనం తాజాగా జరిగిన పంచాయతీ, వార్డు ఎన్నికలు. ఈ ఎన్నికలలో వైసీపీకి కంచుకోటల్లాంటి పంచాయతీలు కొట్టుకుపోగా.. ఇంటింటికీ తిరిగినా వార్డు అభ్యర్థులకు ప్రజలు మొహం చాటేశారు. మీకు అంత ఇచ్చాం.. ఇంత ఇచ్చాం.. అది చేశాం.. ఇది చేశామని ప్రజల చెవులలో జోరీగలుగా ప్రచారం చేసినా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు తిప్పికొట్టారు. నిజానికి ఇవి గ్రామ స్థాయి ఎన్నికలు.. ఈ ఎన్నికలలో ఎక్కడా పార్టీల గుర్తులు ఉండవు. కానీ, పార్టీ తరపున వారు బలపరిచిన వారే బరిలో దిగుతారు. మరోవైపు ప్రజలు కూడా స్థానిక గ్రామ రాజకీయాల్ని మాత్రమే ఎజెండాగా తీసుకుని ఓట్లు వేస్తారు. గ్రామాలలో అధికార పార్టీ ఏం చేసింది? గ్రామాలలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? గ్రామ స్థాయి అధికార పార్టీ లీడర్లు ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారు? గ్రామ స్థాయిలో అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి తత్వం ఏంటి? తనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాయకుడు తమకు అండగా ఉంటారా? ఇలాంటి ఎన్నో అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. సహజంగా ఇలాంటి స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ హవా కనిపిస్తుంది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారేమో.. ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రోత్సాహకాలను తమకు అందకుండా చేస్తారేమో, స్థానిక నాయకుల నుండి తమకి వేధింపులు ఉంటాయేమో అనే భయాందోళన ఉంటుంది.  నిజానికి అధికార వైసీపీ ఈ స్థానిక ఎన్నికలలో విజయం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్నీ చేసింది. తమకు ఓటెయ్యకపోతే పెన్షలు, విద్యాదీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలను ఆపేస్తామని కూడా బెదిరించారు. పలు చోట్ల వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఓటేస్తారా? లేక అన్ని పథకాలను కత్తిరించాలా అని తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రజలు చాలా చోట్ల అన్ని భయాలను వదిలి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఎలాగు గుర్తు లేని ఎన్నికలు కనుక గెలిచిన వారంతా తమ పార్టీ నేతలే అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. అయితే, స్థానికంగా ఎక్కడిక్కడ తిరుగుబాటు పరిస్థితి కనిపిస్తున్నది. నాలుగేళ్లుగా ఎన్నో బెదిరింపులు చూశాం.. మహా అయితే మరో ఎనిమిది తొమ్మిది నెలలే కదా అనే ధోరణి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్నది.  ఉదాహరణకి ప్రకాశం జిలా సింగరాయకొండకి చేరువలో ఉండే పాకల అనే గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఇప్పటి వరకూ గెలిచిన దాఖలాలు లేవు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. వైసీపీ ఆవిర్భావం తర్వాత వాళ్ళే గెలుస్తూ వచ్చారు. కానీ, తొలిసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసింది. సముద్రాన్ని అనుకోని ఉండే ఈ గ్రామంలో ఎక్కువ శాతం మత్స్యకారులే ఉంటారు. వీరి ప్రధాన జీవనాధారం చేపలవేట. అయితే, మత్య్సకారులకు ఎన్నో చేశామని ప్రభుత్వం గొప్పలు పోతున్న సంగతి తెలిసిందే. అయినా ఈ గ్రామ ప్రజలు చరిత్రను తిరగ రాస్తూ తీర్పునిచ్చారు. గోదావరి జిల్లాల్లో కూడా పలు చోట్ల ఇదే ప్రభంజనం కనిపించింది. గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలలో కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన అభర్ధులు విజయకేతనం ఎగరేశారు. ఇప్పటికే ఈ మధ్యనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే నిద్ర పట్టని పరిస్థితి ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలతో ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చినట్లే భావించాలి.

వైసీపీలో ఐ-ప్యాక్ సర్వే లీక్ టెన్షన్!

వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని   రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రతిపక్ష నేతల సభలు, యాత్రలకు జనం భారీగా తరలి వస్తుంటే.. జగన్ సహా వైసీపీ నేతలు ఎక్కడా జనంలో తిరిగు పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే సభలు కూడా వెలవెలబోతున్నాయి. వచ్చిన ఆ కొద్ది మందీ కూడా ముఖ్యమంత్రి ప్రసంగం మొదలెట్టగానే లేచి వెళ్లి పోతున్నారు. ఇక గడపగడపకూ అంటూనో, ఏదో కార్యక్రమంలో భాగంగానో ప్రజలలోకి వెళ్లిన అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై  ఎక్కడిక్కడ  జనం తిరగడడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇది ఏపీలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా  వైసీపీ కూడా ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలు.. ఎంపీలపై ప్రజల అభిప్రాయంపై విస్తృతంగా సర్వేలు నిర్వహించుకుంటోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తో పాటు మరో రెండు ప్రైవేట్ సంస్థలతో కూడా వైసీపీ సర్వేలు నిర్వహిస్తోందిది. ఈ సర్వే రిపోర్టుల తొలి విడత ఫలితాల ఆధారంగా గతంలో తాడేపల్లిలోని తన వివాసంలో  సీఎం జగన్   పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ సర్వేల పూర్తిస్థాయి ఫలితాలు జగన్ చేతికి అందనున్నాయని, ఆ ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ లోగా టైమ్స్ నౌ సర్వే ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉండటంతో వైసీపీ నాయకులే ఆ సర్వేను నమ్మడం లేదు. పరిగణనలోనికి తీసుకోవడం లేదు. అయితే,  తాజాగా  ఐ -ప్యాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన చార్ట్ ను బట్టి చూస్తే వైసీపీ నేతల్లో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని ఐ ప్యాక్ తేల్చేసినట్లే కనిపిస్తోంది. కేవలం ఎంపీల పనితీరుపై ఐప్యాక్ ఈ రిపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సర్వే ఫలితాలు నిజమా అబద్దమా అన్నది తేల్చలేని పరిస్థితి కానీ.. ఇప్పుడు ఈ రిపోర్టు ఫలితాలు మాత్రం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీ స్థానాలను దక్కించుకోగా.. ఇందులో ఐదారుగురు ఈసారి పార్లమెంటుకు పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఐ-ప్యాక్ సర్వే రిపోర్టు ప్రకారం గత ఎన్నికలలో గెలిచిన 22 మందిలో 16 మందికి తిరిగి గెలిచే అవకాశం లేదని తెలుస్తున్నది. అమలాపురం, అనంతపూర్, అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, చిత్తూరు, గుంటూరు, హిందూపురం, కాకినాడ, మచిలీపట్టణం, నరసాపురం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం స్థానాలలో వైసీపీకి గెలిచే అవకాశాలు లేవని ఐప్యాక్ సర్వే తేల్చేసింది. ఈ 16 పార్లమెంట్ స్థానాలలో కేవలం 2 నుండి మూడు స్థానాలలో ఏదైనా అవకాశం ఉంటే పుంజుకునే అవకాశం ఉందని.. అదే సమయంలో ఇవి కాకుండా మరో 6 స్థానాలలో తీవ్ర పోటీ ఉంటుందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కర్నూల్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి స్థానాలలో పోటా పోటీ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితం చెబుతున్నది. కడప, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాలలో మాత్రమే వైసీపీకి ఒకింత మొగ్గు ఉందన్నది ఈ సర్వే ఫలితం. ఇక, వైసీపీ గెలుస్తుందని భావించిన మూడు స్థానాలలో కూడా నాలుగు శాతం లీడ్ మాత్రమే కనిపిస్తుండగా.. పోటా పోటీ ఉంటుందని చెప్తున్న స్థానాలలో ఎక్కువ శాతం టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు కూడా చూపించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయా స్థానాలలో పది నుండి 15 శాతం ఓట్లను తన వైపుకు తిప్పుకోనున్నట్లు సర్వేలో చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా 25 పార్లమెంట్ స్థానాలలో కూడా 40 నుండి 53 శాతం ఓటింగ్ దక్కించుకోనున్నట్లు పేర్కొనగా.. 45 శాతంపైన ఓట్లు దక్కించుకున్న ప్రతి స్థానంలో విజయకేతనం ఎగరేయనున్నట్లు చూపించారు. కాగా, ఈ సర్వే ఫలితం నిజమా అబద్దమా అన్నది పక్కన పెడితే.. ఈ సర్వే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం మాత్రం ఖాయం. ఒకవేళ ఈ సర్వే నిజమైతే.. దీనిని బట్టి తిప్పి తిప్పి కొట్టినా 35 నుండి 50 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కుతాయి. ఒకవేళ ఈ సర్వే ఫేక్ అని కొట్టిపారేసినా అసలే అసంతృప్తితో ఉన్న ప్రజలపై ఈ ఫలితాలు మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ఎటు తిరిగి ఈ ఫలితాలతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్లే కనిపిస్తుంది.

బెజవాడలోకి లోకేష్ గ్రాండ్ ఎంట్రీ.. సెగలు రేపుతున్న రాజకీయం!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లోకి ప్రవేశించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజీ మధ్యలో నారా లోకేష్‌కి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటు ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో లోకేష్‌ని సత్కరించారు. ఆశేష జనవాహిని మధ్య లోకేష్ విజయవాడలో అడుగుపెట్టారు. ప్రకాశం బ్యారేజీ రోడ్లన్నీ పసుపు సముద్రంలా మారిపోయాయి. బంతి పూల జనవనం కళ్లకు కట్టింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎక్కడ జూసినా జనం.   యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను అభిమానులు ముంచెత్తారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో లోకేశ్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్‌ చేసే బాధ్యతను చంద్రబాబు ప్రత్యేకంగా కేశినేని చిన్నికి అప్పగించగా చిన్ని తన స్టామినాను నిరూపించుకొనేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, యువగళం పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో లోకేష్ పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలతో ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ నారా లోకేష్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. అంతే కాదు, ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తాననే హామీతో లోకేశ్‌ శిలాఫలకం ఏర్పాటు చేశారు. మొత్తంగా గుంటూరు జిల్లాను వీడి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన లొకేషన్ కు అపూర్వ స్వాగతం లభించింది.  కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర మొత్తం ఆరు రోజుల పాటు జరగనుంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలను లోకేష్ కవర్ చేయనున్నారు. విజయవాడ సిటీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేయనుండగా.. 22వ తేదీన గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. కాగా  ఇదే సమయంలో ప్రత్యర్థి వైసీపీ నుండి వ్యతిరేకతలపై కూడా ఓ కన్నేసినట్లు కనిపిస్తుంది. యువగళానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని, లోకేశ్ పాదయాత్రలో అలజడికి వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇప్పటికే ఆరోపించారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా దేవినేని అవినాశ్ ఇంటికి వెళ్లి చర్చించడం ఇందులో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరం సభలో అల్లర్లు సృష్టించడానికే జగన్ అవినాష్ ఇంటికి వెళ్లారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మరోవైపు గన్నవరంలో  తెలుగుదేశం సభ నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ  రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యార్లగడ్డ వెంకటరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తాను తెలుగుదేశంలో చేరనున్నట్లు ప్రకటించారు.   22న గన్నవరంలో లోకేశ్‌ బహిరంగ సభ జరిగే రోజునే యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇంకోవైపు వైసీపీ ఇప్పటికే ఇక్కడ ముగ్గురికి టికెట్లను ఖరారు చేసింది. విజయవాడలోని విజయవాడ తూర్పు దేవినేని అవినాశ్‌కు, విజయవాడ వెస్ట్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, విజయవాడ సెంట్రల్‌ మల్లాది విష్ణుకు ఫిక్స్ చేసింది అధిష్టానం. ఇదే క్రమంలో ఇన్నాళ్లు లేనిది ఇప్పటికిప్పుడు   ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే సలహాదారు సజ్జల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టారు. లోకేష్ యాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే ఇలా ఉంటే.. ఈ యాత్ర ఎలా సాగనుంది.. యాత్ర తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏవిధంగా మారనున్నాయన్నది ఆసక్తిగా కనిపిస్తుంది.

పంచాయతీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం

వైనాట్ 175 అని ముఖ్యమంత్రి జగన్ అంటుంటే.. వైనాట్ డిఫీట్ అని జనం అంటున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అందులోనూ స్థానిక ఉప ఎన్నికలలో అధికార పార్టీ విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుంది. కానీ ఏపీలో జనం జగన్ సర్కార్ పై ఎంత ఆగ్రహంతో ఉన్నారో తాజాగా జరిగిన పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూపాయి. ఇప్పటి వరకూ విశ్లేషకులు, పరిశీలకులు, రాజకీయ పండితులు కూడా పట్టణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం వైసీపీ పట్టు ఒకింత బలంగా ఉందని చెబుతూ వచ్చారు. అయితే వారి అంచనా తప్పని శనివారం (ఆగస్టు 18)న జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నిక తేల్చి చెప్పేసింది. జగన్ సర్కార్ పై జనాగ్రహం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ఒకేలా ఉందని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి.   స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ కోల్పోయిన సర్పంచ్, వార్డు స భ్యుల స్థానాలన్నీ గతంలో వైసీపీ అభ్యర్థులు గెలిచిన స్థానాలే.  కానీ వాటిలో సగానికి పైగా స్థానాలలో వైసీపీ పరాజయం పాలైంది.   రాష్ట్రంలో 59 పంచాయతీల సర్పంచ్ లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 28 పంచాయతీలను గెల్చుకుంది. వైఎస్ఆర్‌సీపీ 17 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 12 చోట్ల విజయం సాధించారు. జనసేన రెండు గ్రామాల్లో తమ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిచారు. ఇక పంచాయతీ వార్డుల్లో 485 వార్డులకు  ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలతో సహా తెలుగుదశం మొత్తం 189 వార్డుల్లో విజయం సాధించింది. వైసీపీ 177 స్థానాల్లో ఇండిపెండెంట్లు 100 స్థానాల్లో.. జనసేన, బీజేపీ అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించారు. వైసీపీకి కంచుకోటల్లాంటి   గ్రామాల్లో సైతం  టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారంటే ఆ పార్టీ కోటలు ఎలా కూలిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.  స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న అముదాల వలసలో బొప్పడం గ్రామ పంచాయతీని వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది వైసీపీ సిట్టింగ్ స్థానమే. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ విజయం సాధించింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80శాతానికిపైగా సీట్లను కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక బయటపడేలా పంచాయితీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు వచ్చాయి.   ఇవి ఉపఎన్నికలు కాబట్టి అనివార్యంగా నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికే కాకినాడ కార్పొరేషన్ తో పాటు చాలా మున్సిపాలిటీల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.ప్రభుత్వం వాటి జోలికి వెళ్లడం లేదు. టైమ్స్ నౌ వంటి సర్వేలను చూపి  తమకు ప్రజాదరణ తగ్గలేదంటూ చంకలు గుద్దుకుంటున్న వైసీపీకి ఈ పంచాయతీ ఉప ఎన్నికలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టణ ఓటర్లు జగన్ సర్కార్ ను ఛీ కొట్టారని తేలిపోయింది. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలలో తెలుగుదేశం విజయ కేతనం ఎగురవేసింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కూడా తమ పార్టీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే పల్లెలు కూడా ఫ్యాన్ గాలిని వద్దు పొమ్మంటున్నాయని తేలిపోయిది.  ఈ ఉప ఎన్నికలలో వైసీపీ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో.. పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో ఏలూరు జిల్లా వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి జరిగిన పోలింగ్ కళ్లకు కట్టింది. తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వీరమ్మకుంటకు రానివ్వలేదు. రౌడీషీటర్ వి నీకు ఇక్కడ ప్రవేశం లేదంటూ వెనక్కు పంపారు. అదే సమయంలో వైసీపీ మూకలు యథేచ్ఛగా వీరమ్మకుంట పోలింగ్ స్టేషన్ వద్ద వీరంగం చేశారు. ఇక పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలిలా ఉన్నాయి.  మొత్తం 485 వార్డు సభ్యుల ఎ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో   తెలుగుదేశం 189 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ విజయం సాధించిన స్థానాలు 177 కాగా స్వతంత్రులు 100 వార్డులలో గెలుపొందారు. జనసేన, బీజేపీ కూటమి 19 వార్డులను కైవశం చేసుకుంది. 59 పంచాయతీలుకు ఎన్నికలు జరిగితే వాటిలో తెలుగుదేశం 28 స్థానాలలో గెలుపొందింది. వైసీపీ 17 స్థానాలలో, జనసేన, బీజేపీ కూటమి 2 స్థానాలలో విజయం సాధించగా ఇతరులు 12 స్థానాలను గులుచుకున్నారు.   

జయప్రద  మహా ఎంట్రీ.. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ ?

 అలనాటి హీరోయిన్ జయప్రద బిఆర్ఎస్ పార్టీలో చేరనుందా?  ముఖ్యమంత్రి కెసీఆర్ ఆహ్వానం మేరకు త్వరలో ఆమె బిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆమెను తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేయించకుండా మహరాష్ట్ర నుంచి పోటీ చేయించాలని కెసీఆర్ యోచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించే ఉద్దేశ్యంతో ఉన్న కెసీఆర్ మహరాష్ట్ర రాజకీయాల్లో ఫోకస్ పెట్టారు. సినీ గ్లామర్ ఉన్న నటీ నటులు ఇప్పటి వరకు బిఆర్ఎస్ లో లేరు. జయప్రద చేరికతో ఆ లోటును కొంత వరకు  ఆ పార్టీ పూడ్చవచ్చు.  జయ ప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొంత కాలం ఆమె టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా, తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగారు. తర్వాత ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. 2004,2009 ఎన్నికల్లో ఆమె సమాజ్ వాది పార్టీ తరపున రాంపూర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అమర్ సింగ్, జయప్రదలను సమాజ్ వాది పార్టీ బహిష్కరించింది. తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ వెంటే  జయప్రద  ఉన్నారు. వీరిద్దరూ కలిసి 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ ఏర్పాటు చేసి యుపిలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 360 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేకపోయారు. 2014లో బిజ్నోర్ లోకసభ స్థానం నుంచి  జయప్రద పోటీ చేసి పరాజయం చెందారు. తర్వాత ఆమె భారతీయ జనతాపార్టీలో చేరారు. జయ ప్రద నటించిన 75 బాలివుడ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలే ఆమెను బాలివుడ్ లో నిలబెట్టేలా చేసాయి. బాలివుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డును కూడా  ఆమె కైవసం చేసుకున్నారు. 

ఎవరీ గెడ్డం ఉమ?.. ఏమా కథ?

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు, వైసీపీ నాయకురాలు గెడ్డం ఉమ పేరు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  గెడ్డం ఉమ లగ్జరీ సామ్రాజ్యం పేరుతో కొన్ని చిత్ర రాజాలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటనే ఓ చర్చ జోరుగా సాగుతోంది. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత   గెడ్డం ఉమ హోదా అమాంతంగా పెరగిపోవడమే కాకుండా.. ఆమె పేరు సైతం మంచి ఫేమస్ అయిపోయిందనే ఓ ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది  జగన్ పార్టీ అధికారంలోకి రాక ముందు.. ఓ సాధారణ మహిళగా ఆమె వస్త్ర దుకాణాన్ని నిర్వహించేవారనీ,  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఆస్తులు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయాయని, ప్రస్తుతం గడ్డం ఉమ కోట్లకు పడగలెత్తారన్న ప్రచారం  సామాజిక మాధ్యమంలో మరో  లెవల్ లో సాగుతోంది. మరోవైపు గతంలో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌ఛార్జీగా పని చేసిన, జగన్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి   గెడ్డం ఉమ  అత్యంత సన్నిహితురాలనే ఓ ప్రచారం సైతం ఉంది. అలాగే విజయసాయిరెడ్డి సహాయ సహాకారాలతోనే గెడ్డం ఉమ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవిని దక్కించుకున్నారని కూడా అంటున్నారు.   ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరవాడలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన గెడ్డం ఉమ ప్రస్తుతం డూప్లెక్స్ ఇంటితో పాటు రెండు లగ్జరీ కార్లు  ఉన్నాయని.. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇంకోవైపు ఉత్తరాంధ్ర నుంచి గంజాయి అక్రమ రవాణాలో ఈ గెడ్డం ఉమ హస్తం ఉందని.. ఇందులో ఆమెకు వైసీపీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటే.. అందుకు  మహిళ కమిషన్  పదవిని అడ్డం పెట్టుకొని.. గడ్డం ఉమ చేస్తున్న దందాయే కారణమన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.  అదీకాక ఉత్తరాంధ్ర ఇన్‌చార్జీగా ఉన్న విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని..  సెటిల్‌మెంట్ల దందాతో   గెడ్డం ఉమా బాగా సెటిల్ అయ్యారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. అయినా సీఎం  జగన్ గురించి కానీ.. ఆ పార్టీలో ఉత్తరాంధ్రలో మొన్నటి వరకు కీలక చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి గురించి కానీ.. ఈ గెడ్డం ఉమా మాటాల్లో వింటే.. ముఖ్యంగా విజయసాయిరెడ్డి  సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లండంలో  ఆమె గారు నూటికి నూరు శాతం సఫలీకృతులయ్యారనే ఓ ప్రచారం సైతం ఉత్తరాంద్ర జిల్లాలో కొనసాగుతోంది. అంతేకాదు.. విజయసాయికి ఉత్తరాంద్ర ఇన్‌చార్జీ పదవి గోల్ మాల్ గోవిందం అయిందంటే.. ఆ వెనుక గెడ్డం ఉమా గారి హస్తం ఉందనే ఓ ప్రచారం సైతం నేటికి వాడి వేడిగా నడుస్తోంది. అంతే కాదు.. ఈ గెడ్డం ఉమ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారని.. ఆ క్రమంలో టీవీ డిబెట్లు, చర్చ కార్యక్రమాల్లో సైతం పాల్గొని.. జగన్ పార్టీపై ఈగ వాలనివ్వకుండా ఉంటారనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది.

అప్పు దొరికితేనే కాపు నేస్తం!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి పెండింగ్ ఉన్న పథకాలు చాలా చాలా  ఉన్నాయి. కొన్ని పథకాల   అమలు యోచన ఇప్పటికీ జగన్ సర్కార్ చేయడం లేదు.  మరికొన్ని పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా బటన్ నొక్కినా నిధులు లేక  అవి మరుగున పడిపోతున్నాయి.   ఇలా పెండింగ్ లో ఉన్న పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని మాత్రం రానున్న ఎన్నికలలో కీలకం కానున్నాయి. దీంతో  వాటిని ఎలాగైనా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. కానీ తీవ్ర నిధుల కొరత, ఎంత ప్రయత్నించినా అప్పులు పుట్టని పరిస్థితిలో ఏం చేయలో తోచక జుట్టు పీక్కుంటోంది.   అలాంటి పథకాలలో  అత్యంత ముఖ్యమైనది  కాపు నేస్తం. ఈ పథకం అమలు చేయడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి చావో రేవోగా మారింది. ఈ నాలుగేళ్ళలో జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసింది నిండు సున్నా. గత ప్రభుత్వంలో ప్రతిపాదించి, దాదాపు అనుమతి వచ్చిన కాపు రిజర్వేషన్లకు కూడా జగన్  గుండుసున్నా కొట్టేశారు.  ఇప్పుడు ఎన్నికల ముంగిట   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటే..  ఆ ప్రయత్నాలు ఫలించకుండా చేసేందుకు  కొట్టే వైసీపీ ఎలాగైనా కాపు నేస్తం తీసుకురావాలని చూస్తున్నది. ఇందు కోసం జగన్ సర్కార్ ఇప్పటికే ఈ నెలలో ముహూర్తం ఖరారు చేసేసింది కూడా. అయితే   గత నెలలో వచ్చిన ఆదాయం, చేసిన అప్పు కూడా  జీతాలు, పెన్షన్లకే సరిపోని పరిస్థితి. ఇప్పటికీ ప్రభుత్వోద్యోగులందరికీ జీతాలు అందలేదు. దీంతో   కాపు నేస్తం అమలు చేయడానికి  నిధులు లేకుండా పోయాయి. దీంతో  అల్పపీడనం, భారీ వర్షాల నెపంతో  కాపు నేస్తం వాయిదా వేశారు.  అయితే  ఎక్కడా భారీ వర్షాల ఆనవాలు లేదు. అది పక్కన పెడితే బటన్ నొక్కి ఖాతాలలో సొమ్ము జమ చేయడానికి వాతావరణంతో సంబంధం ఏమిటన్న ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానమే లేదు.  కాపు నేస్తం పథకం అమలుకు ఈ నెలలోనే మరో ముహూర్తం ఖరారు చేస్తామని ప్రకటించి  చేతులు దులిపేసుకున్నారు. అయితే ఈ నెలలో మరో ముహూర్తం ఖరారు చేసి జగన్ బటన్ నొక్కాలన్నా ఆదాయం ఎక్కడ నుంచి సమకూరుతుంది? అప్పు ఎక్కడ పుడుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.   నిజానికి ఇప్పటికే ఏపీ చేయాల్సిన అప్పు కంటే రెట్టింపు చేసేసింది. కనుక ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టే అవకాశం లేదు.  కేంద్రం కూడా ఈ విషయాన్ని ఏపీ పెద్దలకు క్లియర్ గా చెప్పేసింది.   కానీ, ఏపీ నుండి  కేంద్రానికి విన్నపాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కూడా కేంద్రం ఇలాగే  ఇక అప్పు కుదరదని ఖరాకండీగా చెప్పినా.. తిమాలాడుకొని, బామాలుకుని, కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఎలాగోలా తిప్పలు పడి అప్పులు తెచ్చింది. ప్రభుత్వం రాయతీలు తగ్గించినట్లుగా చూపించి మసిపూసి మారేడుకాయ చేసి మరీ కొత్త అప్పులు తెచ్చింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు కూడా అందులో భాగమే. ఇప్పుడు కూడా అలాగే అనధికారికంగా అప్పుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. ఏపీ లిక్కర్ బాండ్లను అమ్మి తమకు అప్పు ఇప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తమకి ఏది కావాలంటే అది చేసి పెడుతున్న క్రమంలో కేంద్రం కూడా మాయ చేసో మతలబు చేసో కొత్త అప్పు ఇచ్చేసే అవకాశాలు  లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంటే.. కేవలం కొత్త అప్పుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ఒక హైలెవల్  లోన్ కమిటీని కూడా నియమించుకుంది. ఔను నిజం  అనధికారికంగా ఈ అప్పుల పనులను చక్కబెట్టేందుకు ఈ కమిటీ పనిచేస్తున్నదని అంటున్నారు. అసలు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో  ఏపీ ప్రజలకు తెలియదు. అయితే హస్తినలో ఉన్న ఈ హై లెవల్ లోన్ కమిటీగా చెప్పుకుంటున్న ఈ కమిటీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నదని, ఎప్పుడు ఎంత కావాలో అంత అప్పు  ఎలా సంపాదించాలో, అందుకోసం ఏం చేయాలో ఈ కమిటీ చూసుకుంటున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఈ కాపు నేస్తంకు కావాల్సిన నిధుల సేకరణ పనిలోనే ఉందని అంటున్నారు. ఏపీ లిక్కర్ బాండ్ల విక్రయం ద్వారా ఈ అప్పు సంపాదించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బివరేజర్స్ బాండ్లను సబ్ స్క్రైబ్ చేయడానికి ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు.  మరి ఈ కమిటీ కొత్త అప్పు తెస్తుందా? జగన్ సర్కార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తుందా  అంటే.. పరిశీలకుల నుంచి ఏమో చూడాలి అన్న సమాధానమే వస్తోంది. 

బీఆర్ఎస్ లో భగభగలు.. కాక రేపుతున్న అసమ్మతి సెగ

అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ లో ఒక్క సారిగా అసమ్మతి కాకరేగింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయులు, స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరికి వ్యతిరేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక నెహ్రూ పార్క్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.  పల్లా దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ముత్తిరెడ్డి వర్గీయులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.  జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నాయన్న వార్తలు వినవస్తున్ననేపథ్యంలో ముత్తిరెడ్డి వర్గీయులు ఆందోళణ బాట పట్టారు. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే విధంగా స్టేషన్ ఘనపూర్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గీయులు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వలస నాయకుడు, దళిత దొర కడియం శ్రీహరి వద్దు.. స్థానిక నాయకుడు రాజయ్య ముద్దు అంటూ నినాదాలు చేసిన తాటికొండ వర్గీయులు ఒక దశలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ఉండగా సిట్టింగులందరికీ టికెట్లు అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన నాటి నుంచి బీఆర్ఎస్ లో అసమ్మతి అగ్గికి అంకురార్పణ జరిగిందనే చెప్పాలి. సిట్టింగులందరికీ టికెట్ అన్న మాట కేసీఆర్ నోట వచ్చిన క్షణం నుంచీ పలు నియోజకవర్గాలలో అసమ్మతి భగ్గు మంది. దీంతో కేసీఆర్ వెనక్కు తగ్గారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ద్వారా సిట్టింగులందరికీ కాదు.. కొందరికే అన్న సవరణ ప్రకటన చేయించారు. అయితే ఆ తరువాతి పరిణామాలలో చాలా నియోజకవర్గాలలో సిట్టింగులు, ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అధిష్ఠానం బుజ్జగింపుల పర్వానికి తెరతీసినా, టికెట్ల ప్రకటన సమయం దగ్గరకొచ్చేసరికి అధిష్ఠానాన్ని కూడా లెక్క చేయని స్థాయికి అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజులలో ఈ అసమ్మతి జ్వాలలు మరిన్ని నియోజకవర్గాలకు విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.  

కొండలపై కొలువైతే దేవుడైపోయినట్లేనా? రిషికొండ బాగోతం అందుకేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హిందూ ధర్మ వ్యతిరేకి  అవునా కాదా తెలియదు కానీ ఆయన హిందువు అయితే కాదు.  ఇది జగన ఒక్కరే కాదు జగమెరిగిన సత్యం. భారత దేశం కుల మతాలకు అతీతమైన లౌకిక రాజ్యం అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వం భారత డీఎన్ఏలోనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు దేశం నిలువెత్తు నిదర్శనం.  అయితే ఏపీ విషయంలో  మాత్రం జగన్ హయాంలో ఒక కొత్తా దేముడు అవతరించాడు.  ఈ విషయాన్ని ఆయన కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు.   విశాఖ రిషికొండపై నిర్మాణాల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందిస్తూ.. మంత్రి రోజా, మాజీ మంత్రులు  తిరుమల కొండపై వెంకన్న దేవుడు కొలువై ఉండలేదా?  శ్రీశైలం కొండపై బ్రమరాంబికా సమేత మల్లికార్జునుడు కొలువుదీరలేదా? అంటూ కొత్త వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్  వంటి కొండలపై నివాసాలు వెలిశాయి కదా అని  ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని నివాసాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మితమై ఉంటే.. ఆ విషయాన్ని కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిషికొండపై నిర్మాణాలు కూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని జాతీయ హరిత ట్రైబ్యునల్ కుండ బద్దలు కొట్టింది. అయినా వాటిని వేటినీ పట్టించుకోకుండా రిషికొండకు గుండు కొట్టి మరీ జగన్ సర్కార్ నిర్మాణాలను కొనసాగిస్తోంది? అదేమిటంటే.. దేవుళ్ల ఆవాసాలను ప్రస్తావిస్తున్నారు వైసీపీ నేతలు. ఎవరి నాయకుడు వారికి దేవుడితో సమానమైతే అవ్వోచ్చు కానీ, తామనుకుంటున్నదే సర్వ జనులూ అనుకుని తారాలంటూ మాట్లాడటమే అతిగా అనిపిస్తోంది. అయినా జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హిందూ ఆలయాలు, దేవుళ్లే లక్ష్యంగా జరిగిన దాడులను కాకతాళీయంగా భావించలేని పరిస్థితిని ఆయన, ఆయన పార్టీ నేతలే స్వయంగా కల్పిస్తున్నారు. హిందువులంతా కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సాగుతున్న చర్యలపై హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని జగన్ సర్కార్ అసలు కన్సిడర్ చేయడం లేదు. ఒకటనేమిటి.. సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకలు, జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో తెలియంది కాదు.  వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం,  టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న  నిర్ణయాల హిందూ మత విశ్వాసాలకు విరుద్ధంగానే ఉన్నాయి.  హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తిరుమలను టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో వ్యక్తమౌతోంది. అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వెంకన్న దేవుడిని నల్ల రాయిగా అభివర్ణించిన కరుణాకరరెడ్డిని నియమించడంతో రాష్ట్రంలో కొత్తా దేముడవతరించాని వైసీపీ ప్రచారం చేసుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.