కవిత కోసం కామారెడ్డికి..

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. తనపై, తన పరిపాలనపై తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం క్లియర్ కట్‌గా అర్థమైందా? ఆ క్రమంలోనే ఆయన కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగాలని  నిర్ణయించుకొన్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ చుట్టు పక్కల ఉన్న జిల్లాలు.. నిజామాబాద్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లపై కూడా ఆయన గెలుపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని... అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. పోటీకి దిగితే.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.  ఎందుకంటే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మపూరి అర్వింద్ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఈ సారి ధర్మపూరి అర్వింది.. ఎంపీగా లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాంటి వేళ.. ఈ జిల్లాలో కేసీఆర్ పోటీ చేస్తే... అతడి విజయాన్నే కాదు.. బీజేపీ ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు అడ్డుకోవచ్చుననే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.  అదీకాక.. దక్షిణ తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకొంటొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల నుంచి బరిలో దిగే కంటే.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కారు పార్టీని షికార్ చేయిస్తే.. అది తనకు తన ఫ్యామిలీకి రాజకీయంగా కలిసి వస్తుందనే ఓ ఆలోచనతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.  అదీకాక.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిని గంపగుత్తగా గెలుచుకొంటే.. దేశ రాజధాని హస్తిన పీఠాన్ని సునాయాసంగా కైవనం చేసుకోవచ్చునన్న విషయం అందరికి తెలిసిందే.  అందుకే ప్రధాని మోదీ గతంలో సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బరోడా నుంచే కాకుండా.. యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసి.. రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బరోడా లోక్‌సభ స్థానాన్ని వదులుకోగా.. సదరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయం విధితమే.   దాదాపుగా అటువంటి ఆలోచనే.. గులాబీ బాస్ చేస్తున్నారని.. అయితే తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్ నుంచి దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నా.. ప్రస్తుతం సదరు జిల్లాలో తనకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు రావడంతో.. ఆయన అప్రమత్తమై.. అటు గజ్వేల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం... ఓ వేళ రెండు చోట్లు నుంచి గెలుపొందితే.. ఆ తర్వాత కామారెడ్డికి కేసీఆర్ రాజీనామా చేసి.. ఆ స్థానం నుంచి తన కుమార్తె కవితను గెలుపించుకొని.. అసెంబ్లీకి తీసుకువెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం తెలంగాణ పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.       మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత....తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ ఫలితాలతో తెలంగాణలో బీజేపీ కొద్దిగా డల్ అయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుకు కమలం పార్టీ అగ్రనేతలు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపుతో తెలంగాణలోని ఆ పార్టీకి నయా జోష్ వచ్చినట్లు అయింది. ఆ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అలాంటి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. తెలంగాణలో కారు పార్టీని షికార్ చేయించడం కోసం.. గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ శ్రేణులు కొరాయంటూ.. ఆయన కొత్త పల్లవి అందుకోవడం వెనుక ఇంత కథ ఉందని పోలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

గోషామహల్, నాంపల్లి అభ్యర్థులు ఎందుకు పెండింగ్ ?

కేసీఆర్ మొదటి జాబితాలో  పెండింగ్ లో పెట్టిన నాలుగు స్థానాల్లో రెండు అసెంబ్లీ హైద్రాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి గోషామహల్ అయితే రెండోది నాంపల్లి. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిద్యం వహిస్తుండగా నాంపల్లి నియోజక వర్గానికి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రాతినిద్యం వహిస్తున్నారు.  ప్రస్తుతం రాజాసింగ్ బిజెపి నుంచి బహిష్కృతులయ్యారు. ఈ సారి ఆయన రాజకీయ భవితవ్యం ఇంకా తేల లేదు. తాను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవచ్చని రాజాసింగ్ ఇప్పటికే ప్రకటించారు. బిజెపి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. సిట్టింగ్ బిజెపి స్థానాన్ని బిఆర్ఎస్ వదులుకోబోతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. 2018లో ఈ స్థానం నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి రాజా సింగ్ చేతిలో పరాజయం చెందారు. అంతకుముందు ప్రేమ్ సింగ్ రాథోడ్ బిజెపి నుంచి మహరాజ్ గంజ్   ఎమ్మెల్యేగా గెలిచారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యధికంగా ఉన్నారు.  ఉత్తరాది అభ్యర్థిని రంగంలో దించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. తన ఓటమి తర్వాత గోషామహల్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా కొనసాగిన రాథోడ్ ప్రస్తుతం తప్పుకున్నారు.టిక్కెట్ కోసం కూడా ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. అయితే బిఆర్ఎస్ నుంచి మరో నేత నందకిషోర్ పేరు గోషామహల్ అభ్యర్థి అని వినిపిస్తుంది. బిజెపి బీ టీం అని నింద ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ అభ్యర్థి గోషామహల్ నుంచి బలహీన అభ్యర్థిని రంగంలో దించవచ్చన్న టాక్ ఉంది.  కాగా నాంపల్లి స్థానానికి ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ మిత్ర పక్షం అని ప్రకటించారు. కమ్యూనిస్ట్ పార్టీలతో మిత్ర ధర్మం నెరవేర్చని కేసీఆర్ మజ్లిస్ తో  మిత్ర ధర్మం పాటించవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. కాని పైకి మాత్రం వెల్లడించకపోవచ్చు. 

కాంగ్రెస్ తరఫున పోటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దరఖాస్తు

గత ఎన్నికల తరువాత ఆపరేషన్ ఆకర్ష్ పేర ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గూటికి చేర్చుకున్న కేసీఆర్ కు ఇప్పుడు ఈ ఏడాది చివరిలో జగనున్న ఎన్నికల సమయంలో అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఎదురు కానున్నాయా? బీఆర్ఎస్ సిట్టింగులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారా? వారు జెండా మార్చేసేందుకు రెడీ అవుతున్నారా? అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్.. ఇక పార్టీలో ఇంత కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సెగలను ఎదుర్కొనక తప్పదా? ఇప్పటికే కేసీఆర్ జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం (ఆగస్టు 21) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రేఖా నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. రేఖానాయక్ పీఏ గాంధీ భవన్ కు వెళ్లి అక్కడ రేఖా నాయక్ దరఖాస్తును అందించారు. కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన గంటల వ్యవధిలో రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్ లు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇప్పుడు రేఖా నాయక్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి గాంధీ భవన్ లో దరఖాస్తు చేయగా, ఆమె భర్త శ్యాం నాయక్ కూడా ఆసీఫా బాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ఓ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.  

ఉద్యమ కారులకు కారులో చోటేది?

తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఎన్నికల నగారా మోగించేశారు. సీఎం కేసీఆర్ సోమవారం(ఆగస్టు 21) 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండగా.. మిగతా కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా వారి వారి సిట్టింగ్ స్థానాలలోనే సీట్లు ఖరారు చేశారు. బీఆర్ఎస్ జాబితా బయటకు రావడంతో ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టగా.. టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు మెల్లిగా తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు రచించుకొనే పనిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. మరొక్క వారం రోజులు ఆగితే ఈ అసంతృప్తులలో ఎంత మంది పార్టీలో ఉంటారో.. రెబల్స్ గా మారేది ఎవరో.. పార్టీని వీడి మరో పార్టీకి జంప్ చేసేది ఎవరో   స్పష్టత వచ్చే అవకాశం ఉంది.   యధావిధిగా ఈసారి ఎన్నికలలో కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాలం నుండి కీలకంగా పని చేసిన కొందరిని పక్కన పెట్టేశారు. గత ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమ నేతలకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. ఈసారి కూడా అదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఉద్యమకారులకు కొందరికి మొండి చేయి మిగిలించి బంగారు తెలంగాణ కోసమే అంటూ పక్క పార్టీల నుండి వచ్చిన వలస వచ్చిన నేతలకు టికెట్లు లభించాయి. నిజానికి 2014లో పెద్ద ఎత్తున ఉద్యమ నేతలకు టికెట్లు ఇచ్చారు. వారిలో కొద్ది మంది మినహా అంతా ఓటమి పాలయ్యారు. ఆ  తరువాత బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేర టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వలసలను ప్రోత్సహించారు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో వారిదే హవా.. వారికే సీట్లు దక్కుతున్నాయి. దీంతో ఉద్యమకారులకు ఎలాంటి పదవులూ లేకుండా పోయాయి. దీంతో కొంతమంది ఇప్పటికే తమదారి తాము చూసుకోగా.. ఒకరిద్దరు సొంత పార్టీలతో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కలిసి నడిచిన నల్గొండ జిల్లాకు చెందిన చాడ కిషన్‌ రెడ్డి, వేముల వీరేశం, ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్‌ గౌడ్‌, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కేఎస్‌ రత్నం లాంటి చాలామంది సీనియర్‌ నేతలకు ఈ సారి జాబితాలో కూడా చోటు దక్కలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య, ఉప్పల్‌ సుభాష్ రెడ్డి, ఖానాపూర్‌ రేఖా నాయక్, వేములవాడ చెన్నమనేని రమేష్, వైరా రాములు నాయక్, బోథ్ రాథోడ్ బాపూరావు, అసిఫాబాద్ ఆత్రం సక్కు,  కామారెడ్డి గంప గోవర్ధన్ తదితరులు సిట్టింగులే అయినా వీరెవరికీ   ఈసారి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. వీరిలో దాదాపుగా అందరూ ఉద్యమ కాలం నుంచీ పార్టీతో కలిసి నడిచిన వారే. ఒకరిద్దరు మాత్రమే ఇతర కారణాల చేత టికెట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో వీరంతా అసంతృప్తితో తమ తదుపరి కార్యాచరణను రచించుకొనే పనిలో పడ్డారు.  ఈ నేతల్లో చాలామంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. విలువైన భవిష్యత్తును వదులుకొని ఆనాటి టీఆర్ఎస్ జెండా మోశారు. సకల జనుల సమ్మె నుండి వంటా వార్పు వరకు వారే ముందు నడిచారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు. కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తమ త్యాగానికి గుర్తింపు లభిస్తుందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఉద్యమ కాలంలో ఎవరి చేతిలో అయితే వారు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారో.. ఇప్పుడు  వారే అధికారాన్ని చెలాయిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దో గొప్పో మొన్నటిదాకా ఎంతో కొంత విలువ ఉంది. ఈసారి అయినా టికెట్లు దక్కకపోతుందా అని ఆశతో ఉన్నా.. ఇప్పుడిక ఆ ఆశలు కూడా ఆవిరవడంతో తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు‌... జగన్‌పై బండి సంజయ్ ఫైర్

బీజేపీ నేత బండి సంజయ్ ... వైసీపీపై దాడి మొదలెట్టారు.. జగన్ ఈ సారి అధికారంలోకి రావడం అసంభవం అన్నారు.  తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం  బ్రాండ్లు రిలీజ్ చేస్తారా?... అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బండి విరుచుకుపడుతున్నారు. ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారు. ఏమైంది?. హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయి. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందనేదని బండి సంజయ్ ఆంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అనంతపురం జెడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా?. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలి. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ. ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా?. నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా?. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నాడట.మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో. నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారు. పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణనమని బండి సంజయ్ మండిపడుతున్నారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మనమధ్య మనస్పర్ధల్లేవ్. అందరం బాగుండాలని అనుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నయ్. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు?. జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. ఓటర్ చైతన్య మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్... వైసీపీపై ఈ విధంగా దాడి చేశారు. భవిష్యత్తులో... బండి విమర్శల చక్రాల కింద... వైసీపీ నలగక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాటికొండ రాజయ్య... నీ టైం అస్సలు  బాగోలేదయ్య...!

అది ముందుగా ఊహించినదే...  మొదటి నుంచి జరిగిన ప్రచారమే..చివరికి నిజమైంది.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. ఈ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థుల మొదటి జాబితాలో కడియం పేరును ప్రకటించారు. దీంతో  టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్‌ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ లేదా బీఎస్‌పీలో చేరాలంటున్నట్టు రాజయ్య వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజయ్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసలు..రాజయ్యకు టిక్కెట్ రాకపోవడానికి పెద్ద కారణం.. జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు. ఈ వ్యవహారం తాటికొండ రాజయ్య ఇమేజ్‌ని బాగా దెబ్బతీసింది. నవ్య ఎపిసోడ్‌ రచ్చకెక్కడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారంతో ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికెళ్లింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి ఈసారి స్టేషన్‌పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ అధిష్టానం కడియం వైపే మొగ్గుచూపింది. బీఆర్ఎస్ మొదటి జాబితాలో కడియం శ్రీహరి పేరు రావడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఏదైనా... లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్యకు... జనం ఆదరిస్తారా...? ఇప్పుడైతే.. ఆయన టైం అసలు ఏమీ బాగోలేదు.. టైం బాగోనప్పుడు... ఏది చేసినా... కలిసి రాదు.

కేసీఆర్ కోసం జగన్.. జగన్ కోసం షర్మిల.. పాపం కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో నానాటికీ తీసికట్లు నాగంభొట్లు అన్నట్లుగా తయారౌతోంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నామ మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ ను బలోపేతం చేసే ఉద్దేశంతో అధిష్ఠానం షర్మిల అనే తురఫు ముక్కను ఉపయోగించాలని శతథా ప్రయత్నిస్తోంది. అందుకే తెలంగాణలో వైఎస్సార్టీపీ పేర సొంత కుంపటి పెట్టుకుని తన మానాన తాను నడక దారిలో సాగుతున్న షర్మిలకు కాంగ్రెస్ గాలం వేసింది.  2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ష‌ర్మిల స్థాపించారు. తానే అధ్య‌క్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో ప‌రుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.. ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయ‌కుల చేరిక‌లు, పాద‌యాత్ర‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది. మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. షర్మిల ఎంత కష్టపడినా, పాదయాత్ర, దీక్షలు, ప్రధాన రాజకీయ పార్టీలను మించి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించినా ఆ రాష్ట్ర జనం మాత్రం షర్మిలను పదె్దగా విశ్వసించినట్లు కనబడదు. సమైక్య వాది అయిన రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని తీసుకు వస్తానంటూ ఆమె తెలంగాణలో చేస్తున్న రాజకీయం ఏ మాత్రం ఆమెకు ప్రజాదరణను తీసుకువస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లైంది. కర్నాటకలో సాధించగలిగినప్పుడు దేశం మొత్తం ఎందుకు సాధించలేం అనుకుంది. అలాగే ఏపీలో కూడా బలోపేతం కాగలమన్న విశ్వాసం వచ్చింది. అప్పుడే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని ఆమెకు ఏపీ పగ్గాలప్పగిస్తే తమ పని సులువు అవుతుందని భావించింది. అంతే వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కేవీపీ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకేలను రంగంలోకి దింపింది. కాగల కార్యం వారే తీరుస్తారని భావించింది. అనుకున్నట్లే  అంతా జరుగుతోందని కాంగ్రెస్ భావించింది. అంతా బానే ఉందనుకుంటున్న సమయంలో కథ మళ్లీ మొదటికి వచ్చింది.   ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సూచనల్ని షర్మిల తిరస్కరించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.  తన రాజకీయం తెలంగాణకు మాత్రమే పరిమితమని కాంగ్రెస్ కు తేటతెల్లం చేశారని అంటున్నారు.  అయితే  షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమె తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే అది తమకు తీరని నష్టం చేస్తుందని భావించిన కాంగ్రెస్ అందుకు తిరస్కరించిందని చెబుతున్నారు. దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన ప్రతిపాదన దశలోనే ఆగిపోయిందని చెబుతున్నారు.  షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ బాధ్యతలు తీసుకుంటే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ బావిస్తోంది. మొత్తంగా షర్మిల రాజకీయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ రెడ్డి, కేసీఆర్ ల మైత్రిలో భాగంగానే షర్మిల తెలంగాణలో పని చేస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఆమె తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువ కాలాని ప్రయత్నిస్తున్నా జనం పట్టించుకోలేదు. కానీ ఆమెను అందరి కన్నా ఎక్కువగా పట్టించుకుని ఆమెకు, ఆమె పార్టీకి హైప్ ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ చేయగలిగినంతా చేసింది. చేస్తోంది. అరెస్టులు, హౌస్ అరెస్టులతో ఆమె నిత్యం వార్తలలో నిలిచేలా కేసీఆర్ సర్కార్ సహకారం అందిస్తోంది. దీంతో ఆమె కేసీఆర్ కోసం తెలంగాణలో జగన్ బాణంగా పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నతో విబేధాల కారణంగా తెలంగాణలో పార్టీ అని షర్మిల చెప్పడంలో లాజిక్ కనిపించడం లేదనీ, నిజంగా అన్న జగన్ తో విభేదాలు ఉంటే.. ఆమె ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. 

బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్పేనా?

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహ సంబంధాలు చాలా చిత్రంగా ఉంటాయి. అ రెండు పార్టీలు మిత్ర పక్షాలు కాదు. అలాగని శతృ పక్షాలు ఏ మాత్రం కాదు. బీజేపీ సారధ్యంలోని అధికార ఎన్డీఎ కూటమిలో వైసీపీ భాగస్వామ్య పక్షం కాదు. అయినా, బీజేపీ సహా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీల నాయకులకంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కు ఎక్కువ గౌరవం ఇస్తారు. అడుగులకు మడుగులొత్తుతారు. ఎందుకు ఏమిటీ, అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ మీద వెళ్ళాడుతున్న అక్రమాస్తుల కేసులే అందుకు కారణం అన్నది బహిరంగ రహస్యం.  అందుకే ఆ రెండు పార్టీల శత్రు మిత్ర సంబంధాల విషయంలో  అప్పుడప్పుదు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, ఎవరి రాజకీయం వారిది అయినా, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే విషయంలో మాత్రం  ఎలాంటి మొహమాటం లేకుండా  నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నా అన్న చందంగా  రెండు పార్టీలు ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా కలిసే  ప్రయాణం చేస్తున్నాయి. అందుకే, రెండు పార్టీలను రాజకీయ విశ్లేషకులు  రహస్య ప్రేమికులుగా అభివర్ణిస్తుంటారు.  వైస్సీపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ కాదు కానీ కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ రాజును మించిన రాజభక్తితో అంగీకరించేస్తుంటుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మించిన ఉత్సాహంతో జై కొడుతుంటుంది.  అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజు వైదొలిగిన తరువాత.. నిజానికి ఆయన వైదొలగలేదు.. బీజేపీ అధిష్ఠానమే ఓ ఫోన్ కాల్ తో ఆయనకు సమాచారం ఇచ్చి ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో పార్టీ రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరికి అప్పగించింది. ఆ తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. వైసీపీ, బీజేపీల లవ్ బ్రేకప్ అయ్యిందా అన్న అనుమానం కలగక మానదు.  పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, అడ్డగోలు అప్పులపై ధ్వజమెత్తారు. జగన్ సర్కార్ అప్పుల చిట్టాతో హస్తిన వెళ్లి మరీ కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేసి వచ్చారు.  సోము వీర్రాజు హయాంలో ఏపీ బీజేపీ తీరు జగన్ సర్కార్ కు వంత పాడుతున్నట్లుగానే ఉండేది. పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేశారు. 30 మందితో ఏపీ  బీజేపీ కమిటీని నియమించారు. రాష్ట్ర పార్టీపై ఉన్న వైసీపీ ముద్రను పూర్తిగా తుడిచేసే విధంగా ఆమె నియమించిన కొత్త కార్యవర్గం ఉందని పరిశీలకులు సైతం  ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ శాఖ నిప్పులు కురిపిస్తోంది. విమర్శల దాడి తీవ్రత పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక ముందు ముందు కేంద్రం నుంచి ఏపీలోని వైసీపీ సర్కార్ కు సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. బేవరేజస్ బాండ్ల ద్వారా రుణం కోసం ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నం విఫలం కావడం వంటి సంఘటనలను బట్టి చూస్తుంటే రానున్న రోజలు వైసీపీ సర్కార్ కు గడ్డుగానే ఉంటాయన్న భావన కలుగుతోందని అంటున్నారు. 

మునుగోడు మైత్రి ముక్కలైందా.. వామపక్షాలు కూరలో కరివేపాకు చందమేనా?

తెలుగురాష్ట్రాలలో ఒక్క తెలుగు రాష్ట్రాలనేమిటి? దేశంలో వామపక్షాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏ పార్టీ పంచన చేరి ఒకటి రెండు స్థానాలలోనైనా విజయం సాధిస్తే చాలన్న పరిస్థితికి ఉభయ కమ్మూనిస్టు పార్టీలూ వచ్చేశాయి. ఇక మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వామపక్షాలను కూరలో కరివేపాకులా ఉపయోగించుకుకునేందుకు మాత్రమే వాడుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎంఐఎంతో తమ మైత్రి కొనసాగుతుందని ఆ సందర్భంగా చెప్పారు. కానీ అదే సమయంలో వామపక్షాల ఊసే ఎత్తలేదు. ఒక రాజకీయ పార్టీ మరో పార్టీని పట్టించుకోకపోవడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన సమయంలో నిన్న మొన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్నా.. పైగా తనంత తానుగా వెళ్లి మద్దతు కోరిన ఉభయ కమ్మూనిస్టు పార్టీలనూ అలా వదిలేయడమేమిటి? అన్న ప్రశ్న తలెత్తక మానదు. అందుకే వామపక్షాలను బీఆర్ఎస్ కూరలో కరివేపాకులా వాడేసుకుని వదిలేసిందని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయానికి వామపక్షాల మద్దతే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో బీఆర్ఎస్ స్వయంగా వామపక్షాల మద్దతు కోరింది. బీజేపీని ఓడించేందుకు ఒక్క మునుగోడు ఉప ఎన్నిక కోసమే కాదు.. జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొని, ఢిల్లీ గద్దె దించే విషయంలో కూడా వామపక్షాలు, బీఆర్ఎస్ కలిసి నడవాల్సి ఉంటుందని జట్టు కట్టింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత మునుగోడు విజయం వామపక్షాల చలవేనని బీఆర్ఎస్ బహిరంగంగా ప్రకటించింది. వామపక్షాల సహకారం లేకుంటే మునుగోడులో బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) గెలిచే అవకాశమే లేదని స్వయంగా ప్రకటించింది.  మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వామపక్షాల చలవే అని టీఆర్ఎస్ అంగీకరించింది.   కమ్యూనిస్టుల వల్లే తాము గెలిచామని మునుగోడు ఎలక్షన్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిని బట్టే మునుగోడు విజయం బలుపు కాదన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ అంగీకరించినట్లైంది. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించినందుకు వామపక్షాలకు కృతజ్ణతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా వారి కార్యాలయానికి వెళ్లి మరీ ధన్యవాదాలు చెప్పి వచ్చారు. మునుగోడు విజయం క్రెడిట్ మొత్తం వామపక్షాలకు ఇచ్చేసింది. అప్పటి వరకూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రజలతోనే మా పొత్తు, పార్టీలతో కాదు అంటూ చెబుతూ వచ్చారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయం వెన్నాడటంతో వామపక్షాలను శరణు జొచ్చారు. గతంలో కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మాత్రం వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే మునుగోడులో  వామపక్షాల ఓటు పది వేల వరకూ ఉంటుంది. అప్పట్లో ఆ ఓట్లే కనుక బీఆర్ఎస్ కు రాకుంటే మునుగోడులో కేసీఆర్ పార్టీకి విజయం అందని ద్రాక్షగానే మిగిలేది. అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిగా వామపక్షాల మీదే ఆధారపడ్డారు. బీజేపీ వ్యతిరేక విధానాలకు ఒక సిద్ధాంతం పునాదిగా వామపక్షాలను తోడు తెచ్చుకున్నారు. అదంతా పాత కథ.. ఇప్పుడు ఆ వామపక్షాలను పూర్తిగా విస్మరించేశారు. వామపక్షాలా అవెక్కడున్నాయి అని ఆయన గతంలో అన్న మాటను మళ్లీ ఇప్పుడు తన చేతల ద్వారా తిరిగి తెరపైకి తెచ్చారు.  ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని భావించిన వామపక్షాలకు కారులో చోటు లేదని తన చేతల ద్వారా చెప్పేశారు.   మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తో కుదిరిన మైత్రి బంధానికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీ ఆర్ తమ  పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో చెల్లు చీటీ పాడేశారు. అయితే వామపక్షాలను దూరం పెడుతున్నానన్న సంకేతాలను కేసీఆర్ గత కొంత కాలంగా ఇస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై చర్చిద్దామని సీఎం కేసీఆర్ కు లెఫ్ట్ పార్టీల నేతలు ప్రతిపాదించినప్పటికీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాజాగా అభ్యర్థుల జాబితా ప్రకటనతో వామపక్షాలను కేసీఆర్ కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోవడం లేదని తేటతెల్లమైపోయింది.  ఇప్పుడు వామపక్షాలు  సీఎం కేసీఆర్ మునుగోడు పొత్తు ధర్మం విస్మరించారనీ, పొత్తు కోసం. ఇంతకాలం ఓపికగా ఎదురుచూస్తే అభ్యర్ధుల ప్రకటనతో దానిని విస్మరించారని విమర్శలు గుప్పిస్తున్నాయి.   తాము బలంగా ఉన్న స్థానాలలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నాయి.  

కమలం గూటికి మాజీ మంత్రి తుమ్మల?!.. పాలేరు నుంచి పోటీ!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగా సర్దుకు పోదామనుకున్నా బీఆర్ ఎస్ లో ఇమడ లేని పరిస్థితి ఏర్పడింది. పాలేరు టికెట్ ఆశించిన ఆయనకు కేసీఆర్ తాజా జాబితాలో మొండి చేయి చూపారు. దీంతో ఆయన ఇక బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసలు గత కొంత కాలంగా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉక్కపోతకు గురౌతున్నారు. గతంలో ఒక సారి భవిష్యత్  కార్యాచరణపై  నిర్ణయం తీసుకునేందుకు తుమ్మల తన అభిమానులతో ములుగులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 350 కార్లలో వాజేడు చేరుకున్నారు.  అంతకు ముందు  భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాటి ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం  పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత ఆయన పార్టీ మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే ఆయన బీఆర్ఎస్ వీడలేదని అప్పట్లో గట్టిగా వినిపించింది.   2018 ఎన్నికలలో  తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థిగా పరాజయం పాలైన తరువాత ఆయన పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి.  ఎవరు ఔనన్నాకాదన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల బలమైన నేత. ఆ విషయంలో  బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ కు కూడా స్పష్టత ఉంది. అందుకే ఎప్పటికప్పుడు ఆయనను బుజ్జగిస్తూ, హామీలు ఇస్తూ బీఆర్ఎస్ ను వీడకుండా చూసుకుంటూ వచ్చారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే సమయంలో కేసీఆర్ కనీసం తనను సంప్రదించకపోవడం, ఏక పక్షంగా పాలేను అభ్యర్థిని ప్రకటించడంతో తుమ్మల ఇక బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అయితే ఆయన బీ ఆర్ఎస్ ను వీడితే ఆయన అడుగులు ఎటుపడతాయన్న దానిపై ఖమ్మం రాజకీయాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తుమ్మలకు అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పలుకుబడి కూడా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు.   తొలి నుంచీ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన తుమ్మల రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం గూటికి వెళతారా అన్నచర్చ జరుగుతోంది. మరో వైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన నేతలు ఉన్న నేపథ్యంలో ఉన్న బలానికి తోడు తుమ్మల వస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నదని అంటున్నారు. ఇలా ఉండగా గత రెండు మూడు రోజులుగా తుమ్మలతో బీజేపీ నేతలకు టచ్ లోకి వచ్చారని  రాజకీయాలలో విస్తృత చర్చ జరుగుతోంది.  ఇక తెరాసలో తుమ్మల ప్రస్థానాన్ని ఒక సారి అవలోకనం చేసుకుంటే.. 2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన  ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే  కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి  ఇచ్చారు. అయితే 2018 ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల అప్పట్లో ఖండించారు.  దీంతో ఆయన కాంగ్రరెస్ గూటికి చేరుతారన్న వదంతులు బలంగా వినిపించాయి.  అయితే తుమ్మల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. ఇప్పుడు ఇక బీజేపీ తన అవసరాల కోసం తుమ్మలను ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకత్వం తుమ్మలతో టచ్ లోకి వచ్చి పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు జరిపిందని అంటున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లేననీ, తుమ్మల కూడా బీజేపీ గూటికి చేరడానికి సుముఖత వ్యక్తం చేశారనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి కమలం టికెట్ షరతు విధించారని పరిశీలకులు అంటున్నారు.  అందుకు బీజేపీ కూడా అంగీకరించిందని రాజకీయవర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. 

ఏడుచోట్ల మార్పులు, నాలుగు చోట్ల పెండింగ్ 

రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 చోట్ల మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. 2023 ఎన్నికలకు ఆరేడుగురు సిట్టింగ్‌లను మాత్రమే తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని కెసీఆర్ చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు.  జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచినట్లు చెప్పారు. కాగా సీఎం కేసీఆర్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. గజ్వేల్‌తోపాటు వికారాబాద్ నుంచి బరిలోకి దిగుతున్న వెల్లడించారు. కాగా నాలుగు చోట్ల కొత్తవారితో పోటీకి దిగుతున్నామన్నారు. కాగా నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామాల్, కొంపల్లి అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉందన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్ధుల తొలి జాబితా

 ఉమ్మడి అదిలాబాద్ - /10 సిర్పూర్ - కోనేరు కొనప్ప చెన్నూరు - బాల్క సుమన్ బెల్లంపల్లి -  మంచిర్యాల- దివాకర్ రావు అదిలాబాద్ - జోగు రామన్న బోథ్ - అనిల్ జాదవ్  నిర్మల్ - ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి ఆసిఫాబాద్- కోవా లక్ష్మి ఖానాపూర్-జాన్సన్ నాయక్.  ఉమ్మడి నిజామాబాద్ - 8/9 ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి బోధన్ - షకీల్ అహ్మద్ జుక్కల్ - హనుమంత్ షిండే బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి - జాజుల సురేందర్  కామారెడ్డి- గంప గోవర్ధన్. నిజామాబాద్ అర్బన్ - గణేష్ బిగాల నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్ బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి కరీంనగర్ - 8/13 కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్ జగిత్యాల -ఎం సంజయ్ కుమార్  ధర్మపురి- మంథని -పుట్ట మధు పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ - గంగుల కమలాకర్ సిరిసిల్ల - కేటీఆర్ చొప్పదండి-సుంకే రవిశంకర్.  వేములవాడ- లక్ష్మీ నరసింహారావు మానకొండూరు - రసమయి బాలకిషన్ హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్ హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి రామగుండం - కొరుకంటి చందర్ ఉమ్మడి మెదక్ - 6/10 సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు మెదక్- నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్  నర్సాపూర్ - చిలుముల మదన్ రెడ్డి/సునీత లక్ష్మారెడ్డి జహీరాబాద్-నరోత్తం/ఢిల్లీ వసంత్.  సంగారెడ్డి- చింత ప్రభాకర్.  పఠాన్ చెరు -  దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ - కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి - 13/14 మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంతరావు కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద గౌడ్.  కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు ఉప్పల్ - ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎల్బి నగర్ - దేవిరెడ్డి సుదీర్ రెడ్డి మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి రాజేంద్ర నగర్ - ప్రకాష్ గౌడ్ శేరిలింగంపల్లి - అరికేపుడి గాంధీ చేవెళ్ల - కాలె యాదయ్య పరిగి-మహేశ్వర్ రెడ్డి  వికారాబాద్ - మెతుకు ఆనంద్ తాండూర్ - పైలట్ రోహిత్ రెడ్డి ఉమ్మడి హైదరాబాద్ - 6/15 ముషీరాబాద్ - ముఠా గోపాల్ మలక్ పేట్ - అంబర్ పేట -  ఖైరతాబాద్ - దానం నాగేందర్ జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్ సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి- కార్వాన్- గోషామహల్- చార్మినార్- చాంద్రాయణగుట్ట- యాకుత్ పురా - బహదుర్ పుర- సికింద్రాబాద్ - టి పద్మారావు సికింద్రాబాద్ కంటోన్మెంట్-  ఉమ్మడి మహబూబ్ నగర్ - 11/14 కొడంగల్ - పట్నం నరేందర్ నారాయణ్ పేట్ - ఎస్ రాజేందర్ రెడ్డి మహబూబ్ నగర్ - వి శ్రీనివాస్ గౌడ్ జడ్చర్ల - సి లక్ష్మారెడ్డి  దేవరకద్ర - ఆల్ల వెంకటేశ్వర రెడ్డి మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్ ఆలంపూర్- Dr అబ్రహం నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి అచ్చంపేట-గువ్వల బాలరాజు కల్వకుర్తి- జైపాల్ యాదవ్.  షాద్నగర్- అంజయ్య యాదవ్ కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ ఉమ్మడి నల్లగొండ - 10/12 దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్ నాగార్జునసాగర్-భగత్ మిర్యలగూడ - నల్లమోతు భాస్కర్ రావు హుజూర్ నగర్ - శానంపుడి సైదిరెడ్డి కోదాడ - సూర్యాపేట - జి జగదీష్ రెడ్డి నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య తుంగతుర్తి - గాదరి కిషోర్ ఆలేరు - గొంగడి సునీత మునుగోడు - కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ - 7/12 జనగామ- స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు డోర్నకల్-రెడ్య నాయక్ మహబూబాబాద్-శంకర్ నాయక్ నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి పరకాల - చల్లా ధర్మారెడ్డి వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ ఈస్ట్-నరేందర్ వర్ధన్నపేట - ఆరూరి రమేష్ భూపాల్ పల్లీ - గండ్ర వెంకటరమణారెడ్డి ములుగు -నాగమణి.  ఉమ్మడి ఖమ్మం - 7/10 పినపాక - రేగ కాంతారావు ఇల్లందు - బానోత్ హరిప్రియ ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్ పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి మధిర -లింగాల కమల్రాజు వైరా-బానోత్ మదన్లాల్.  కొత్తగూడెం- సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య అశ్వారావుపేట - మెచ్చా నాగేశ్వర రావు భద్రాచలం-తెల్లాం వెంకట్రావు.

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులతో జాబితా ప్రకటించారు. కేసీఆర్ కు నమ్మకం ఉన్న ముహూర్తం ప్రకారం పంచమి తిథిలో ఈ జాబితాను విడుదల చేశారు. జాబితా విడుదల కు ముందు తెలంగాణ భవన్ వదర్ద, ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద హై డ్రామా నెలకొంది. ఎవరికి టికెట్ల దక్కుతాయి, ఎవరికి టికెట్లు దక్కవు అన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. పార్టీ టికెట్ లభిస్తుందా, లభించదా అన్న అనుమానం ఉన్న వారు ఉరుకులు పరుగులు పెట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడంతో ఆశావహులు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలతో తమ విన్నపాలు చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. కాగా అనుకున్న ముహూర్తానికి కేసీఆర్ అభ్యర్థుల జాబీతా ప్రకటించారు.  సిట్టింగులలో కేవలం నలుగురిని మాత్రమే మారుస్తున్నట్లు చెప్పారు. అలాగే తాను గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.   అసంతృప్తికి గురైన నేతలను ఎలా బుజ్జగించాలన్నదానిపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని పిలిపించుకుని మాట్లాడారు. గతానికి భిన్నంగా ఈ సారి అసంతృప్తులను బుజ్జగించడానికి కేసీఆర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. పోన్ లో టికెట్ దక్కని వారిని సముదాయించి భరోసా కల్పించారు.   ఒకేసారి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్.. నలుగురు సిట్టింగులకు మాత్రమే టికెట్ లేదని వెల్లడించారు. అలాగే మరో ఆరుస్థానాలను పెండింగ్ లో ఉంచినట్లు చెప్పారు. టికెట్ దక్కలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులు ఉంటాయన్నారు.  గతంలో లాగే ఈ సారి కూడా ఎంఐఎంతో కలిసే ఎన్నికలు వెడతామన్నారు. 

ఊసరవిల్లికి బ్రాండ్ అంబాసిడర్ పీకే

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా చిరపరిచితమైన పేరింది. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన రాజకీయ పార్టీలకు పని చేశారు. సాధారణంగా ఆయన ఏ పార్టీ తరఫున పని చేస్తే ఆ పార్టీ ఆ ఎన్నికలలో విజయం సాధించడం కద్దు. అలాగని ఆయన ఎప్పుడూ ఒకే పార్టీని పట్టకు వేళాడరు. ఎప్పటికప్పుడు తన కొలువు మార్చేస్తూ ఉంటారు. 2014  ఎన్నికలలో కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు తీరడం వెనుక ఆయన ఎన్నికల స్ట్రాటజీకి సింహభాగం ఉందనడంలో సందేహం లేదు. అయితే 2019 ఎన్నికలలో మాత్రం ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారు. అది పక్కన పెడితే 2019 ఎన్నికలలో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం వెనుక నిస్సందేహంగా పీకే వ్యూహాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా జగన్ అంగీకరించారు. 2019 ఎన్నికల పోలింగ్ ముగియగానే పీకే, ఆయన టీమ్ తో జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేకంగా కృతజ్ణతలు కూడా చెప్పారు. ఆ తరువాత కూడా నిన్న మొన్నటి వరకూ పీకే తాను సొంతంగా పార్టీ పెట్టుకుని బీహార్ లో తన రాజకీయాలు తాను చేసుకుంటున్నా కూడా జగన్ ను, జగన్ పార్టీనీ వీడలేదు.  ఆయన ఐప్యాక్ బృందం జగన్ కోసం ఏపీలో విస్తృతంగా పని చేస్తున్నది. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం, కుల, మత విద్వేషాలు రగల్చడం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం వంటి వ్యూహాలన్నీ పీకేవే అని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అటువంటి పీకే బృందం తాజాగా ఒక సర్వేలో వైసీపీ పనైపోయిందన్న నివేదికలు జగన్ కు ఇచ్చింది. ఆ సర్వే లీక్ అయ్యింది. అయితే ఆ సర్వే ఫేక్ అంటూ వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమంలో గగ్గోలు పెడుతున్నా.. జనం మాత్రం ఆ సర్వే అక్షర సత్యమని నమ్ముతున్నారు.  సరిగ్గా ఇక్కడే.. పీకే ప్లేటు మార్చేశారా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక సారి ఒక సందర్భంలో పీకే తాను జగన్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడి తప్పు చేశానని రిపెంటెన్స్ వ్యక్తం చేశారు.  2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచే దిశగా నడిపించడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బాగా పనిచేశాయనే చెప్పొచ్చు. 2014లో నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడంలో, ఆ తర్వాత బీహార్ లో నితిశ్ కుమార్ ను సీఎంను చేయడంలోనూ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు చాలా వరకూ దోహదం చేశాయనడంలో సందేహం లేదు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి ఏర్పాటయ్యేలా చేసిన ప్రశాంత్ కిశోర్ దాన్ని విజయపథంలో నడిచేలా వ్యూహాలు రచించారు. తర్వాత ఢిల్లీలో ఆప్ సర్కర్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయం సాధించేలా తోడ్పాటు అందించారు. బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కూడా ప్రశాంతి కిశోర్ పాత్రను ఇసుమంతైనా తగ్గించి చూపలేం. నితీష్ కు బీహార్ లో అధికార పీఠంపై కూర్చునేందుకు తన వ్యూహాలతో దోహదం చేయడం తాను చేసిన అతి పెద్ద తప్పుల్లో  ఒకటని ప్రశాంతి కిషోర్  పలు సందర్భాలలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలన్నీ ఆయా రాష్ట్రాలలో హింసాకాండను ప్రేరేపించడం సెంట్రిక్ గా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గత ఎన్నికలలో జగన్ పార్టీని విజయం దిశగా నడిపించిన పీకే వ్యూహాలు ఈ సారి అంతగా ఫలించడం లేదని చెప్పాలి.  అయినా ప్రశాంత్ కిషార్ తాను ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడానికి అంగీకరించారంటే.. ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని, తన బృందంతో ముందుగానే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని గెలుస్తుందని నమ్మకం కలిగే పార్టీ తరఫునే పని చేస్తారని పరిశీలకులు సోదాహరణంగా వివరించారు. ఇక ఏపీ విషయానికి వస్తే నాలుగేళ్ల పాలన జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దానిని అధిగమించి  మరో సారి అధికారంలోకి రావడం కోసం ఆయన పీకే ప్రత్యక్షంగా పర్యవేక్షించకపోయినా ఆయన బృందం వైసీపీ తరఫున పని చేస్తున్నది. అదే సమయంలో ఐప్యక్ లో చీలిక వచ్చి ఒక వర్గం తెలుగుదేశం కు వ్యూహాలు రచిస్తున్నది.  రాజకీయాల్లో మార్పు కోసం అంటూ ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరుతో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా నుంచి 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర ఎప్పుడు మొదలైందో ఎలా సాగుతోందో బీహార్ లో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.   ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో ఐ ప్యాక్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వే లీక్ అయ్యింది. ఆ సర్వే ప్రకారం వైసీపీ ఇక తట్టాబుట్టా సర్దేసుకోవలసిందే. ఇక్కడే రాజకీయవర్గాలలో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓడిపోయే పార్టీ తరఫున పని చేయడం ఇష్టం లేని పీకే ఉద్దేశ పూర్వకంగానే ఈ సర్వేను లీక్ చేశారనీ, ఈ సాకుతో జగన్  ఐపాక్ తో తన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటారన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తున్న ఐప్యాక్ చీలిక వర్గానికి తన వంతు సహకారం అందిస్తున్నారన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి. 

మన వాళ్లకే ఓట్లుండాలి.. వైసీపీ భారీ కుట్ర!?

రాష్ట్రం నలుచెరగులా జగన్ సర్కార్ పై వ్యతిరేకత, ఆగ్రహం పెల్లుబుకుతున్నా.. అధికార పార్టీ, ముఖ్యమంత్రి వైనాట్ 175 అని ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహం రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా గట్టిగా వ్యక్తం అవుతోంది. అయితే జగన్ రెడ్డి ధీమాకు కారణమేమిటో ఇటీవల ప్రస్ఫుటంగా బయటపడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి, గుప్పెట్లో పెట్టుకు ఎన్నికల రణరంగంలో సునాయాసంగా గెలిచేయవచ్చన్న ధైర్యమే ఆ ధీమాకు కారణమని సోదాహరణంగా పరిశీలకలు చెబుతున్నారు. గత ఎన్నికలలో  అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ను 23 స్థానాలకే పరిమితం చేసి ఘన విజయం సాధించిన అధికారం చేజిక్కించుకున్న జగన్.. నాలుగేళ్లు అధికారంలో ఉండి.. మరో సారి ఎన్నికలకు సమాయత్తమౌతున్న వేళ.. సహజంగానే ఈ నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి? అన్న చర్చ జరుగుతుంది. ఈ చర్చలో జగన్ వైఫల్యాలు వినా సాధించిన విజయాలేవీ చెప్పుకోవడానికి కూడా కనిపించడం లేదు. అయితే జగన్ సర్కర్ మాత్రం తమ ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా బటన్ నొక్కుతూ సంక్షేమ నిథులను పందేరం చేస్తున్నారనీ, ఆ సంక్షేమమే మరో సారి తమకు అధికారాన్ని కట్టబెడుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఆ నమ్మకం కేవలం చెప్పడానికే తప్ప నిజంగా ఆ పథకాల లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్న నమ్మకం వైసీపీ శ్రేణులు, నాయకులలోనే కనిపించడం లేదు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడపగడపలో ఎదురైన పరాభవాలే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మరి ప్రజల నుంచి ఈ స్థాయిలో ఛీత్కారాలు ఎదురౌతున్నా, పరాభవాలను చవిచూస్తున్నా జగన్ కు వైనాట్ 175 ధీమా  ఎక్కడిది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధిస్తామన్న ధీమాను ఎలా వ్యక్తం చేస్తున్నారు. తమ గుప్పెట్లోని సంస్థల ద్వారా పాతికకు పాతిక పార్లమెంటు స్థానాలలోనూ గెలిచేస్తామని ఎలా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇంత కాలం జగన్ ధీమా వెనుక ఉన్నదేమిటి? ఎవరు? అన్న ప్రశ్నలకు ఇటీవలి కాలంలో కచ్చితమైన జవాబులు లభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఓట్ల తొలగింపు, బూటకపు ఓట్ల నమోదుతో మొత్తం ఏపీలో ఎన్నికల ప్రక్రియనే తమకు  కావలసిన విధంగా మార్చేసుకోగలమన్న ధీమాతోనే జగన్ వైనాట్ 175 అంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆశీస్సులు, రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా టాంపరింగ్ యథేచ్ఛగా చేపట్టడం వల్లనే.. తమకు ఓట్లేసే వారి పేర్లు మాత్రమే జాబితాలో ఉంటాయి.. వ్యతిరేకులు, ప్రత్యర్థులకు అసలు రాష్ట్రంలో ఓటు హక్కే ఉండదు అన్న స్థాయిలో ఈ టాంపరింగ్ జరుగుతోందని చెబుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఉరవకొండ రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు ను చెబుతున్నారు. ఉరవ కొండలో ఏకంగా తెలుగుదేశం సానుభూతి పరులకు చెందిన   ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, అలాగే ఆరువేల దొంగ ఓట్లను చేరడంపై  తెలుగుదేశం సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు  మేరకు పరిశీలన జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు  చర్యలు తీసుకున్నారు.  ఒక్క ఉరవకొండ అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బోగస్ ఓట్ల నమోదు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు సంబంధించి భారీ కుట్ర జరిగిందని వరసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల ద్వారా తెలుస్తోంది.  మంత్రి సీదిరి అప్పలరాజు.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  తెలుగుదేశం ఓట్లు అయితే తొలగించాలని  తమ వారికి ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై నయానా, భయానా ఒత్తిడి తీసుకువచ్చి ఈ మేరకు ఓటర్ల జాబితాలో తమను వ్యతిరేకించే వారి ఓట్లు లేకుండా, తమకు అనుకూలంగా ఉండేలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు ద్వారా సునాయాసంగా విజయం సాధించేయాలన్నది వైసీపీ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఓట్ల తొలగింపు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ పని చేస్తున్నారని అంటున్నారు.  వరుసగా వెలుగులోనికి వస్తున్న ఈ ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. 

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీర్చుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు వాజ్ పేయి ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..! (నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా)

తెలంగాణ అలా..ఏపీ ఇలా.. జగన్ నిర్వాకమే కారణం!?

ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి, తొమ్మిది సంవత్సరాలు నిండిపోయాయి.  2014 జూన్ రెండున ఉమ్మడి ఆంధ్ర్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాయి. అలా విడిపోయి తొమ్మిదేళ్లు పూర్తై పదో ఏడు జరుగుతోంది.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. సంబురాలు చేసుకుంది. మరి, అవశేష అందర ప్రదేశ్ పరిస్థితి ఏమిటి?  ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది.అవశేష ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెడితే రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దూరదృష్టితో.. ఆయనకే సాధ్యమైన విజన్ తో ప్రారంభించిన  రాజధాని అమరావతి నిర్మాణాన్ని, ప్రస్తుత  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి     అటకెక్కించేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచనను తీసుకొచ్చి అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో నాలుగేళ్ళు గడిచిపోయాయి.  సెక్రటేరియట్ కాదు,అసలు రాజధానే లేని రాష్ట్రంగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మిగిలింది. ఇతర రాష్ట్రాలకు ఒక లాఫింగ్ స్టాక్ గా మారింది.   మరోవంక, నీరు, నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగణ రాష్ట్రం ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. ఏవో కొన్ని అవకతవకలు ఉన్నా.. లోపాలు ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అందులో  ఎంత అవినీతి జరిగింది అనేది పక్కన  పెడితే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంది. పంటలు పెంచుకుంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మరోవంక అవశేష ఆంద్ర ప్రదేశ్  రాష్ట్రానికి  జీవనాడిగా పేర్కొన్న  జాతీయ ప్రాజెక్ట్  పోలవరం  ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతం వరకూ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి, రెండు రాష్త్రాల మధ్యా ఎంత తక్కువ పోలిక  తెస్తే అంత మంచిది.  తొమ్మిదేళ్లలో అవశేష ఆంధ్ర ప్రదేశ్   అన్ని విషయాల్లోనూ వెనకబడిన రాష్ట్రంగా మిగిలింది. వెనుకబాటు తనంలో, శాంతి భద్రతల పరిస్థితిలో బీహార్ ను అధిగమించేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  ఉమ్మడి రాష్ట్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నాటిన ఐటీ విత్తనాలు ఇప్పుడు మహా వృక్షాలుగా ఎదిగి  ఆ మహానగరం ఐటీ రంగంలో దూసుకు పోతోంది. అనేక దిగ్గజ  సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫలితంగా, తెలంగాణ రాష్త్రం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక మేరకు  2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగంలో 31.44 శాతం అభివృద్ధి సాధించింది. తెలంగాణలో ఐటీఎగుమతులు రూ3904.55 కోట్లకు చేరుకున్నాయి,   మరి ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇక్కడ కూడా అదే కథ. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా  కృషి చేశారు.   ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి,ప్రభుత్వం మారి పోయింది. రాష్ట్రం ఐటీ అంటే మీటలు నొక్కడమే అనుకునే ముఖ్యమంత్రి ఏలుబడిలోకి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖ ఒకటుందని, ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నారని, ఆయన పేరు  గుడివాడ అమరనాథ్  అని చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అమర్నాథ్ మాటకు ముందొకసారి. వెనుక ఒకసారి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్తోత్రం చదువుతారు.  అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ, ఐటీ .. అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగవద్దని తప్పుకుంటారు.   .రాష్ట్ర విభజన సమయంలో  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. నిజమే. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా  వ్యవహరించింది. అదే అన్యాయాన్ని కొనసాగించింది. కొనసాగిస్తోంది. మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం   అంతకు ముందు  ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానాన్ని దారి మళ్ళించారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారం కలబోసి అభివృద్ధిని అటకెక్కించారు. అందుకే ఈరోజు  ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు, అనుకునే దయనీయ స్థితికి రాష్ట్రం చేరుకుంది. అందుకే  రాజకీయ విశ్లేషకులు  మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన తెచ్చుకోవడం ఒక్కటే పరిష్కారం అంటున్నారు.