తిరుపతిలో ముస్లిం యూనివర్సిటీ వివాదం

      హిందువులు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే, కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల పాదాల చెంత వున్న తిరుపతి నగరంలో ఒక ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం వివాదస్పదమైంది. నోహెరా షేక్ అనే ముస్లిం మహిళ తిరుపతిలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనన్నానని, ఇస్లామిక్ తత్త్వాన్ని ప్రచారం చేయడమే తమ యూనివర్సిటీ ప్రధానోద్దేశమని ప్రకటించడంతో వివాదం మొదలైంది.   నోహెరా షేక్ తిరుపతిలో ఎంతోకాలంగా మదర్సా నిస్వాన్ పేరుతో ఆడపిల్లలకోసం ఒక మదర్సాని గత కొంతకాలంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ఏకంగా తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, అనుమతులు కూడా ఇచ్చేసిందని వార్తలు  రావడంలో తిరుపతిలో హిందూ మత సంస్థలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో ముస్లిం విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడమేమిటని? అది కూడా ప్రభుత్వం స్థలం ఇవ్వడమేమిటని ఆ సంస్థల ప్రతినిథులు ఆగ్రహిస్తున్నారు. తిరుమలలో, తిరుపతిలో అన్యమత ప్రచారం చేయడం భావ్యం కాదని అంటున్నారు.  అయితే ఈ విషయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావడం లేదు. అధికారులు ఎవరికి వారు ఇది తమకు సంబంధించిన విషయం కాదన్నట్టు కిక్కురుమనకుండా ఉండిపోతున్నారు. అయితే స్థానిక ప్రజల్లో ఈ అంశం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందూ సంస్థలు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా తిరుపతిలో ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదని వ్యతిరేకిస్తున్నారు. తిరుమల-తిరుపతి చరిత్రలో కూడా భాగంగా వున్న హిందూ, ముస్లిం ఐక్యతకు భంగం కలిగించే చర్యలు మంచివి కాదని అంటున్నారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నవారు తమ ప్రయత్నాలు మానుకోవాలని ముస్లింలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. తిరుపతిలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని వ్యతిరేకించే ఉద్యమంలో హిందూ సంస్థలకు తమ సహకారాన్ని అందిస్తామని తిరుపతిలో నివసిస్తున్న ముస్లింలు అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏడుకొండలవాడే తన క్షేత్రాన్ని తానే రక్షించుకుంటాడు.

ఇద్దరు లేక ముగ్గురు చాలరు మొర్రో

  సత్తి : ఒరే నాయుడు బావ పెభుత్వమేమో ఒక్కళ్ళు లేక ఇద్దరు సాలని సెపుతుంటే మన అన్నేట్రా అట్టా సెపుతున్నాడు?   నాయుడు : ఏటి అన్న నిన్నేమి గంపెడు పిల్లల్ని కనమని గానీ సెప్పినాడా? ఏటి?   సత్తి : అది కాదహే..ముగ్గురేమో నలుగురవ్వాలి... ఆ నలుగురు రేపు.. ఐదుగురు.. రేపు ఆరుగురు కావాలని అంటే మరర్ధం ఏటి? అదే గదా..   నాయుడు : ఓస్! అదా నీ ధర్మసందేహం..నానేమో ఏరేలా అనుకొన్నాలే..మరేటి నేదురా అన్న ఎక్స్ పార్టీ వోల్లందరినీ సమేకం కోసం తనెనుకే ఫాలో అయిపోమని సెపుతున్నాడన్నమాట. అందరూ తన ఎంటోస్తే సమేకం ఇప్పిచేస్తానని సెపుతున్నాడు.   సత్తి : ఓస్! అదా సంగతి. కానోరే సత్తిగా నాకోటి తెలవక అడుగుతాను. మనం పార్టీ ఎట్టి గట్టిగా మూడేళ్ళు కూడా కానేదు..మరి అన్న పిలిస్తే అందరూ పారెల్లి రాడానికి ఎక్స్ పార్టీ వోల్లెమయినా ఏర్రోళ్ళా..నేక పిచోళ్ళా సెప్పు!   నాయుడు : నిజమేననుకో...గానీ మనమే సమేకం సేత్తున్నామని జనాలు నమ్మాలంటే ఏటో ఒకటి సెప్పాలి గదా ఎర్రి నాయాలా?   సత్తి : సరే! ఆల్లందరూ నిజంగా మనోడెనుక వచ్చీనారనుకో...అప్పుడు మనోడు డిల్లీ ఓల్లతో మాట్లాడి ఒప్పించేయడానికి ఆల్లకి ఈయనేమయిన సుట్టమా..నేకపోతే స్నేహితుడా సెప్పు?   నాయుడు: ఒరేయ్ సత్తిగా! నా సావసంతో కూడా నీకు గ్యానం అబ్బకపోతే, ఇక నీకా దేవుడు కూడా గ్యానం ఇవ్వనేడురొరే... ఆ డిల్లీలో కూకొని కబుర్లు సేపుతాడే ఆడేవడబ్బా... ఆ! దిగ్గీజ సింగ్ అప్పుడెప్పుడో ఓపాలి ఎట్టన్నాడో గుర్తునేదేటి? మన అన్నని నా కొడుకులాంటోడే అని సెప్పాడా నేదా? ఆనక మన నగడపాటి బాబు కూడా ఆ పొద్దెపుడో డిల్లీ పాల్లమెంటు కాడ కూకొని ఏడుస్తూ “ఆ డెవరో దత్త కొడుకుని సూసుకొని మాయంటి సొంత కొడుకుల్నే అన్నేయం సేసీనావే సోనియమ్మా... అని రాగాలు తీసినాడా నేదా? మరిప్పుడు సెప్పు మన అన్న తలుసుకొంటే డిల్లీలో సెక్కరం తిప్పీగలడా నేదా?   సత్తి: నిజమేరో.. నా బల్బెలగనేదు సుమా!   నాయుడు: అదెప్పుడు ఎలగదు కూడా...హ.. హా.. హా..

అన్నసభ పెడితే మ్మమ్మమ్మ...మాస్...

సత్తి: అన్నకి బెయిలొస్తే మాస్..అన్న దీక్షేస్తే మాస్..మ్మమ్మమ్మ...మాస్... అవున్రా…నాయుడో.. అదేదో సమేకమట...దానికోసం రోడ్డు మీద కూకుంటే ఆ తెలంగానోళ్ళు మీదపడి కలబడతారేమోనని, పాపం మన అన్న ఇంటి కాడే సిన్న టెంట్ ఏసుకొని ఐదు రోజులు ముద్ద కూడా ముట్టకుండా పాపం పెనాల మీదకు తెచ్చుకొన్నాడు రా? కానీ, ఆ డిల్లీ వోళ్ళు సమేకం మాత్రం ఇవ్వనేదట్రా... ఆసుపత్రిలో కుదేసి బలవంతంగా సూది మందు ఎక్కించేసి, ఇక ఈ నాటకాలు సాలించి ఇంటికెల్లి బువ్వ తిని తొంగో..అని ఆసుపత్రి నుండి గెంటేసినారట. ఎంతన్నాయం...ఎంతన్నాయం. నాయుడు: ఒరేయ్ సత్తిగా! నాకోటి తెలవక ఆడుతున్నాగానీ, మొన్నటి దాక అన్న జైల్లో సల్లగా కూకోని బిర్యానీలు తినుకొంటూ, కూల్ డ్రింకులు పీల్సుకొంటూ ఊసలు నెక్కెట్టుకొన్నాడా? అప్పుడు పాపం ఆ ఆడకూతురు, ఆల్లమ్మ ఇద్దరూ ఎండనక, వాననక ఆ తెలంగాణంలో పడి తిరిగి తిరిగి “మా అన్నొస్తాడు...నా కొడుకొస్తాడు మిమ్మల్ని ఉద్దరిత్తాడు...”అని అక్కడి జనాల సెవులు సిల్లులు పొడిసినారా? మరేట్రా మనోడిప్పుడు.. ఉన్నపాలిగా ఆళ్ళకి హ్యాండిచ్చేసి మన పక్క జంపయిపోయి... జైలు నుండి రావడం రావడంతోనే సమేకం అని ఓ! ఒకటే... దీచ్చలు, సభలు సేసేతున్నాడు? అసలు ఈన్నిమనం నమ్మోచ్చంటావా?   సత్తి: ఒరే! అన్ననే అనుమానిత్తావురా? కళ్ళు పేలిపోతాయిరా..లెంపలేసుకో..మన అన్నేమి రేతిరికి రేతిరి జంపయిపోనేదురా సచ్చినోడా? అసలు అన్ననోట ఎప్పుడయినా తెలంగాణం ఇస్తామని పలికినట్లు నీకు గురతుందిరా నీకు? అక్కడి జనాలను బాధపెడితే మానకేటోస్తదని ఏదో ‘గవురిస్తాం’ అన్నాడు అంతే. అదట్టుకొని అన్న మడమ తిప్పేసి, తెలంగాణం నుండి జంపయిపోనాడాని నీబోటోళ్ళు కూడా అనేస్తే నాకు మా సెడ్డ బాధగా ఉందిరోరే.   నాయుడు: నిజమేననుకో...కానీ ఆల్లు మనకొద్దని అనేసుకొని ఆడి నుండి సల్లగా బయటడిపోనాక, మళ్ళీ జనాలని పోగేసుకొని, ఆల్లకి టిపినీలు..కాపీలు..బిర్యాని పొట్లాలు ఇచ్చుకొంటూ ఈ సమేకం దీచ్చలు ఎందుకంటా? అదేదో మనకాడే జెండా ఒట్టుకొని తిరిగితే మామేటి ఒద్దన్నమేటి? అన్న దీచ్చకి జనాలు మొకం సూపనేదంటే మనకి ఎంత నామోసీగా ఉంటాదో నీకేరుక నేదేటి? అందుకే నాను బాధ పడుతున్నా..అయినా ఆ ఇంటి గుమ్మo కాడ కూకోని దీచ్చలు సేసే బదులు, అదేదో లంకంత ఇంట్లో ఎంచక్కా ఐసు పెట్టె ఏసుకొని సేసుకోవచ్చు కదా అని నేనడుగుతున్నా?   సత్తి: ఒరేయ్ నాయుడు... నీ కున్నపాటి తెలివి తేటలు మన అన్నకి నేవనుకున్నవురా ఎర్రిమోకమా?   కొంచెం సీకటయ్యాక, రేతిరి పూట ఇంట్లోనే తొంగోనొస్తున్నాడని ఆ పేపరోల్లు రాసింది సదవ నేదురా? తెలివి తక్కువ నాయాలా?   నాయుడు: అవున్రా..గానీ ఏమాటకామాటే సెప్పుకోవాల్రోరేయ్... ఇంట్లో తొంగోనొచ్చినా లోనకెళ్ళి ముద్ద మాత్రం ముట్టనేదురా మన అన్న. అది మాత్రం నేను గేరంటీగా సెప్పగలను...అన్న మాటంటే మాటేరా? గానీ మనకి మడమ తిప్పొదని గట్టిగా సెప్పి ఆయన మాత్రం మాటిమాటికి మడమ తిప్పుతున్నాడేట్రా? దీనినిమాత్రం నువ్వు కాదంటే నాను ఒప్పుకోను..స్మీ!   సత్తి: నాకు తెలీకుండా అన్నమడమ ఎప్పుడు తిప్పినాడురా? తెలంగానోల్లని ‘గవురిస్తాం’ అన్నాడు.ఇప్పుడు అదే మాట మీదున్నాడు. సమేకం అంటే సమేకం కాదు... కావల్నంటే మీ కోసరం కూడా కొట్లాడతా అన్నాడా? అట్టాగే సమేకం కోసమయితే నేటి, మరిదేని కోసరమయితేనేటి గానీ ఉద్దెమాలు సేత్తున్నాడా? “నీ ఊరు కోస్తా.. నీ పేట కోస్తా..నీ... ఈది కోస్తా..నీ ఇంటి కోస్తా... అక్కడే సమేకం సభ ఎడతా..’ అని నందమూరోళ్ళ మాదిరి తొడగొట్టి సభ ఎడుతున్నాడా? లేదా?ఇంకేటి కావల నీకు? నాయుడు: గానీ మనోడు ఎంత దువ్వినా ఆ గవుర్నుమెంటోల్లని మాత్రం మనకేసి లాగనేకపోనాడురా? అప్పటికీ మన అమ్మోగోరు ఆల్లకి పనిసేయకపోయినా జీతాలు, పండుగ డబ్బులు గట్రా ఇత్తానని సెప్పి సూసిందిరా..గానీ అల్లు అమ్మ మాటింటే కదా...అందరూ పొలోమని ఆ ముక్కెమంత్రి ఏమందు సేల్లాడో ఏటో బెల్లం సుట్టూ ఈగల్లాగా ఆయన సుట్టూ ముసురుకొన్నారు తప్ప, ఒక్కడూ మనోడ్ని పట్టించుకొన్నపాపాన్న పోనేదురా.. నాకు మా సెడ్డ బాధగా ఉందిరొరే సత్తిగా...   సత్తి: అదేటి అమ్మగోరు అన్ని లచ్చల మందికి జీతాలు, పండగ డబ్బులు ఇచ్చేస్తే అమ్మగారికిక ఆస్తేటి మిగులుద్ది. ఆనక మన అన్నకు ఆ ఆడకూతురికి ఏటిస్తాదేటి అమ్మ? అయినా అన్ని లచ్చల మందికి పంచేంత డబ్బు డబ్బు అమ్మగారికాడ ఉందంటే నమ్మమంటావారొరే?   నాయుడు: స్సీ..స్సీ... బుద్ది లేనోడా...జీతాలు బత్తేలు ఎవులన్నాజేబులోంచి తీసి ఇస్తారురా? అయినా నిజంగా అమ్మగారు ఇవ్వాలనుకొంటే ఆల్లకి అదొక నెక్కకాదనుకో...గానీ అన్న ముక్కెమంత్రి అయినాక ఇస్తామని సేప్పినారురా ఆమ్మగోరు.   సత్తి: ఆ... ఆలా సెప్పు మరి. అంటే అల్లకి జీతాలు బత్తేలు కావాలంటే ముందు ఆ గవుర్నుమెంటోలందరూ మన అన్నకి ఓటేసి ముక్కేమంత్రిని సేసీయలన్న మాట! ఒరే..అన్న మనమనుకొన్నంత అమాయకుడేమి కాదురోరేయ్..మా సెడ్డ కంత్రీ బుర్రరో మనోడిది...   నాయుడు: సెత్! అట్లా అనమాకురా ఎవులయినా ఇంటే నవ్విపోతారు. అన్న మా సెడ్డ తెలివయినోడనాలి...తప్ప కంత్రీవోడు, ఊసరవెల్లి అనమాకురొరే..అన్నకి తెలిస్తే నీ సెమడా ఒలిపించీ గలడు.            సత్తి: అద్సరే గాన్రోరే నాయుడూ..మనమేమో అన్న జైలు నుండి బయటకోచ్చేస్తే ఇక అంతా మ్మమ్మమ్మ...మాస్...అని ఓ మందు కొట్టి సిందులేసీసామా... కోరుటు అనుమతియ్యాలే కానీ ‘బస్తీ మే సవాల్’ అని తొడగొట్టి అయిదరాబాదులోనే సమేకం సబెట్టుకొంటామని సాలేంజి కూడా సేసేసినామా? తీరాసేసి ఇప్పుడు కోరుటోళ్ళు పర్మిసను కూడా ఇచ్చీనాక జనాలని పోగేసుకోడానికి మాకు టైం సరిపోదు, మాకాడ జనాలు నేరు.. ఆ గవుర్నుమెంటోళ్ళు మోకాలు చాటేసారు...అని సేప్పుకోవడం మా సెడ్డ నామోషీగా ఉందిరొరే... నాయుడు : నిజమే...గానేటి సేత్తాం సెప్పు మనోడికి దూకుడెక్కువ...ఓ పాలి రాజీనామాలు సేసేయండి అంటాడు..మరో పాలి...అందరూ సాటుగా బిర్యానీలు తినుకొంటూ అయినా సరే, అదేటది...సచ్చేదాకా సత్తేగ్రహాలు సేసేయమంటాడు...’గవుర్నరు మనోడే.. నానెల్లి సెపితే ఇనక సస్తాడా?’ అని మనోల్లని ఎంటేసుకొని ఎల్లి ‘ఎంటనే శాసనసభ ఎట్టేస్తే నానే సమేకం తీరుమానం సేసేసి నానే బరబరామని సంతకం గీకేసి ఆ డిల్లీ ఓల్లకి పంపీగలను’ అని ఓ ఒకటే ఊదరగొట్టేసాడు. గానీ ఎవురయినా మనోడి మాట ఇంటే గదా అసలు? మనోడు ఎప్పుడు ఓ ఊరకే రెచ్చిపోయి ఆయాసపడిపోడమే గానీ, పనయినాదేటి ఎప్పుడయినా? అసలు మనోడికి మనమే ఇంకా బాగా ట్రైనింగు ఇచ్చుకోవలేమోరా?          సత్తి: అవున్రా కనీసం ఇప్పుడు ‘సమేకం సభ ఎట్టుకొండిరా...’అని కోరుటోళ్ళు సెప్పినా కూడా సభ ఎట్టుకోలేని  పరిస్థితి చూస్తే, అన్నకెలా ఉందో తెలవదు కానీ, నాకు మాత్రం తల కొట్టేసినట్లుందిరోరే. నానే అన్న కుర్సీలో కూకోని ఉంటే, నాకాడే అన్న లెక్కన డబ్బు మూటలు ఉంటేనా... నేను రేతిరికి రేతిరే మన కూలోల్లని అందరికీ తలో వెయ్యి ముఖాన కొట్టి వెయ్యి లారీలతో అయిదరాబాదులో సభ ఎట్టి మన తడాకా సూపేటోడిని.   నాయుడు : ఓస్..ఓసోస్...మొన్నపంచాయితీ ఎలచ్చన్లలో పట్టుమని పది మందిని కూడా పోగేయనేక పోనావు గానీ ఇప్పుడు ఎయ్యి లారీలలో జనాలని ..అది కూడా అయిదరాబాదుకి తోలుకెలిపోతావా? నాకు తెలవక అడుగుతున్నాను రా ఒరే...సత్తిగా.. అసలు నీ జన్మలో ఎప్పుడయినా అయిదరాబాదు మొకం సూసేవురా? అసలు ఆయిదరాబాదుకు దారెటో తెలుసురా నీకు? అయిదరాబాదులో మనూరుంత ఇల్లు కట్టుకొని, సేతిలో డబ్బు సంచులు ఒట్టుకొని, నీ లాంటి గొట్టంగాళ్ళని వంద మందిని వెనకేసుకొని తిరుగుతున్న మన అన్నేఏటీ సెయ్యనేక సేతులు పిసుకొంటుంటే, బేరాలేక ఈ డొక్కు రిచ్చాలో కాలు మీద కాలేసుకొని కూకోని బీడీలు కాల్సుకొంటూ అయిదరాబాదులో సభ ఎట్టేస్తాడట...దానికి ఈడ నుండి జనాలని తోలేస్తాడట....హ హా...హా..   సత్తి: నవ్వరా నవ్వు... ఏదో ఒకరోజు అన్నసభ ఎట్టకపోతాడా.. నాను ఎల్లకపోతానా? అప్పుడు సూద్దువుగాని..నా...పవరేటో..   నాయుడు : ఒరే సత్తిగా..మనకీ నారీలు, బస్సులు లెందుగ్గానీ, అన్న కబురంపితే నువ్వు నీ డొక్కు రిచ్చాలో నాను నా డొక్కు రిచ్చాలలో మన ఆడోల్లని, పిల్ల పాపని ఏసుకొని ఆయిదరాబాదుకి ఎల్తే ఎట్టుటుందంటావు రా...?       హా...హా... హా.. అప్పుడుగానీ మనకి బుద్ది రాదురొరే            

పలుకవే నా బంగారు చిలుకా

    ఈ కాకులేమిటి అచ్చు మన చిలకల్లానే అరుస్తున్నాయి?    అవి కాకులు కావమ్మా మన సీబీఐ చిలుకలే. మనం ఇంతకాలం కప్పెట్టి ఉంచిన బొగ్గు కుంభకోణంలో అవి ముక్కు దూర్చినందుకు వాటికి కూడా ఆ బొగ్గు మసి అంటుకోవడంతో మీకు అలా కనిపిస్తున్నాయి అంతే.      అయితే, అదేమిటయ్యా అవి మనతో ‘షేర్’ చేసుకోవలసిన సీక్రెట్ వ్యవహారాలను ఎవరో పీసీ.ఫరెక్ అట అతనితో ‘షేర్’ చేసుకోవడమేమిటి? అతను మన మౌనముని మన్మోహన్ పై బురద జల్లడం ఏమిటి? బుద్ది లేకపోతేను? అసలు మనం మన చిలుకలకి ఎంతగా శిక్షణ ఇచ్చివదిలినప్పటికీ, అవి ఎదుట వాడి ఇల్లొదిలి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ మనింటి మీదకే చేరి గోలచేస్తున్నాయి?     వాటిని అనుమానించకండి అమ్మగారు. వాటికి విశ్వాసం ఉండబట్టే అవి మనింటి చుట్టూ తిరుగుతున్నాయి.     ఏడిసినట్టే ఉంది నీ తెలివి. అవి మనకు విశ్వాసంగా ఉంటే మరి మన మనుషులనే ఎందుకు పొడుస్తున్నాయి?   అదేంటమ్మా మేము వాటికి బాగానే ట్రైనింగ్ ఇచ్చేమే?       ఏమిటి అప్పుడే మరిచిపోయావా? వాటి గోల భరించలేక ఇంతకు ముందు మన రైల్వేమంత్రి  బన్సాల్ గారిని, న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ గారిని మనమే బయటకు గెంటేసుకోవలసి వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా అవి మన్మోహన్ గారి కుర్చీమీద వాలి గోల చేస్తున్నాయి. అలాగని ఆయనను గెంటేయలేము కదా? వీటికి అసమదీయులెవరో(మనవాళ్ళెవరో) తసమదీయులెవరో(శత్రువులెవరో) కూడా గుర్తించేలా శిక్షణ కూడా ఈయలేకపోతే ఎలా? అవసరమయితే ఇటలీ నుండో లేక ఇంగ్లాండ్ నుండో ఎవరినయినా రప్పించి వీటికి మంచి శిక్షణ ఇప్పించండి.     అలాగేనమ్మా.        నువ్వు అలాగేనమ్మా... అలాగేనమ్మా అంటూ ఇక్కడ కాలక్షేపం చేస్తూ కూర్చుంటే అవతల ఆ చిలుకలు మన కొంప ముంచేట్లున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వదిలిన మన చిలకలు “చూసిరా.. అంటే ఏకంగా కాల్చివచ్చాయి. వాటి దెబ్బకి పాపం ఆ..ధర్మాన, సబిత ఇద్దరు మంత్రులకి పదవులూడితే, మరొక పెద్దాయన ఎవరో మోపిదేవిట! పాపం ఏడాదిన్నరగా జైలులోనే మగ్గుతున్నాడుట. మనం గీకమన్నచోటల్లా సంతకాలు గీకేసే మరో డజను మంది అధికారులు కూడా ఈ చిలుకలు పుణ్యామాని కోర్టులు చుట్టూ తిరుగుతున్నారిప్పుడు. వారిని చూస్తే నా మనసు కరిగిపోతుంది. అలాగని వాళ్ళు మనోళ్ళేనని నలుగురిలో వెనకేసుకు రావడం కుదరదు కదా?      అవునమ్మగారు.. ఈ పాడు చిలుకలకి అసమదీయులేవరో తసమదీయులెవరో గుర్తు పట్టడంలో ఇంకా శిక్షణ ఇప్పించాల్సిన అవసరముంది. అప్పటికీ ఒకటికి పదిసార్లు అసమదీయుల ఫోటోలు చూపించి మరీ వదులుతాము. కానీ ఏదో ఒకటి అరా మనవాళ్ళని అవి గుర్తుపట్టి కాపాడినా, ఈ ప్రతిపక్ష పార్టీలు అది చూసి కాకుల్లా గోలగోల చేస్తున్నాయి. అప్పటికీ పదునయిన ముక్కులున్న మన చిలుకలని వెనక్కి రప్పించుకొని, ముసలి చిలుకలని ఆ స్థానంలో పెట్టి మనకి అవసరమయిన ఒకటీ అరా మనుషులను వీలును బట్టి బయటకి తెచ్చుకొంటున్నాము తప్ప అధికారం మన చేతిలో ఉంది కదాని అందరికీ ఒకటే సారి బెయిలిచ్చేసి బయటకి తెచ్చేసుకోవట్లేదు కదా?     అవునయ్యా.. మన నీతి నిజాయితీ లోకానికేమి తెలుసు? పశువులకి గడ్డి కూడా వదలకుండా తినేద్దామని ప్రయత్నించిన ఆ లాలూ ప్రసాద్ ని మన చిలుకల చేత నానా గడ్డి తినిపించడం లేదూ? అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు. కానీ, మా ముద్దుల బాబు ఏదో ముచ్చటపడి ‘నాన్సెన్స్’ అనకపోయి ఉంటే ఆ లాలూ ప్రసాద్ ని కూడా మనమే వెనకేసుకు వస్తున్నామని లోకం కోడై కూసిందంటే నమ్ము.    అవునమ్మా నేను కూడా అదే అనుకొన్నాను.  ఆ..  ఆ..ఆ..నా అభిప్రాయం అదికాదమ్మా..జనాలు కూడా అలా అనేసుకోన్నారా? అని నేను అనుకొన్నానమ్మా.    ఆ..సర్సరే...ముందు ఆ చిలుకలు మన పాలిట రాబందులుగా మారకుండా చూడు.     అలాగేనమ్మా..మొన్న మొన్ననే మన దిగ్గీ రాజాగారు కూడా అసమదీయులెవరో,  తసమదీయులెవరో తెలుసుకోమని వాటికి గట్టిగా చెప్పారు. కానీ ఈ విషయమూ ఎవరో కాకితో కబురంపినట్లు ఎక్కడో హైదరాబాదులో ఉన్నవాళ్ళందరికీ కూడా ఎలాగో తెలిసిపోయింది. దానితో మళ్ళీ కాకి గోల మొదలయింది. అసలు ఈ చిలుకలకి ఆయనతో పనేమిటి? అవి ఆయన దగ్గర ఏమి నేర్చుకోవడానికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? అంటూ అర్ధం పర్ధం లేని చిలక ప్రశ్నలు అడుగుతూ ప్రతిపక్షాల వాళ్ళు కాకుల్లా గోల గోల చేసారమ్మా.     ఆ..సరే లేవయ్యా కాకులు అరుస్తున్నాయని చిలుకలను వదలకుండా పంజరంలో పెట్టుకొని కూర్చొంటామా?     అవునమ్మ గారు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఆ మాటే అంది. అవన్నీ పంజరంలో పెరుగుతున్న చిలుకలు అని బలే కనిపెట్టేసిందమ్మగారు.      ఆ..మరిచిపోయాను...మనం గుజరాత్ కి పంపిన చిలుకలు ఏమయినా పలుకుతున్నాయా లేకపోతే అవి కూడా ‘నమో నమో’ అంటూ అక్కడే ఆయన చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయా?      భయపడకండి అమ్మగారు. అవి ఎంతయినా మన పెరటి జాం చెట్టు మీద పుట్టి పెరిగిన చిలుకలు. ఆ మోడీ ఇంటి మీద వాలాలని ప్రయత్నించాయి గానీ ఆయన “మీతోనే నేను ఎన్నికలలో పోటీ చేయాలా?” అని అడిగేసరికి అవి బిత్తరపోయి అక్కడి నుండి ఎగిరొచ్చేసి, ఆయన శిష్యుడు ఎవరో ‘అమిత్ షా’ అట అతని వెంటబడ్డామని ఇటుగా వస్తున్న కాకితో మనకి కబురు పంపాయమ్మ గారు.     ఆ..సర్సరే! నీక్కూడా వాటి సహవాసంతో చిలుక పలుకులు పలకడం బాగా అలవాటయిపోయింది తప్ప పని కనబడటం లేదు. ఇంతకీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఇంటికి, ములాయం ఇంటి మీదకి వదిలిన మన చిలుకలు ఏమి చేస్తున్నాయిట? మాయావతి వ్యవహారంలో మన చిలుకలు ‘సరయిన కార్డు’ తీయలేదని ఆవిడని సుప్రీం కోర్టు వదిలిపెట్టేసిందిట కదా?    అవునమ్మగారు. ఇది మనం ముందుగా అనుకొన్నదే కదా? తమరు పని ఒత్తిడిలో మర్చిపోయినట్లున్నారు.     ఆ..ఆ...అవునవును..మరిచిపోయాను. వాళ్ళని కేవలం భయపెడుతూ మన మాటవినేలా చూడమని చెప్పాను కదా. సర్సరే...ఎందుకయినా మంచిది దేశంలో ఉన్న తసమదీయులందరి మీద మన చిలుకలను ఓ కన్నేసి ఉంచమను..ఎప్పుడు ఎవరి ప్లగ్గు పీకాల్సి వస్తుందో ఎవరికి తెలుసు?   అలాగే అమ్మగారు.       అంత కంటే ముందుగా వాటికి అసమదీయులు, తసమదీయులను గుర్తు పట్టేందుకు బాగా శిక్షణ ఇప్పించు. అప్పుడే వాటిని బయటకి వదిలి పెట్టు. మరిచిపోకు. మళ్ళీ మరో సారి పొరపాటయ్యిందంటే ఈ సారి నీ మీదకే వాటిని వదిలిపెడతా గుర్తుంచుకో.. అయ్యో! ఎంత మాటా...తప్పకుండానమ్మా!

కిరణ్ వేరు కుంపటి పెట్టుకొంటారా లేదా

  రాష్ట్ర విభజన సీరియల్ మొదలయిన నాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అందులో హీరో, విలన్ పాత్రలు రెండు చేసేస్తూ, ఎవరు కోరుకొన్నట్లు వారికి దర్శనమిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. అదే విధంగా అక్టోబర్ మొదటివారంలో అధిష్టానం ఆయన ప్లగ్గు పీకేయబోతోందని కేసీఆర్ సైతం ఓ డేట్ కూడా ఇచ్చేసారు.   ఈ ప్లగ్గు పీకుడు సస్పెన్స్ ఇలా కొనసాగుతుంటే, మరో వైపు కొత్తగా కొత్తపార్టీ లీకొకటి పుట్టుకొచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదూ కదా?అని మీడియా వాళ్ళు ఆయనని అడిగితే “నేను ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే, మీరేమిటి కొత్త పార్టీ పెడతారా? అని అడుగుతున్నారు” అని ఎదురు ప్రశ్నిస్తూ తెలివిగా సమాధానం దాట వేస్తారు.   ఇక కేంద్రం కూడా తన వంతుగా రోజుకొక రకంగా మాట్లాడుతూ ఈ సీరియల్లో సస్పెన్స్ కొనసాగిస్తుంటుంది. ఆయన ప్లగ్గు ఊడుతుందా లేదా? కొత్త పార్టీ పెడతారా లేదా? శాసనసభకు తెలంగాణా తీర్మానం వస్తుందా లేక ఏదో కాగితం ముక్క మాత్రమే వస్తుందా? వచ్చేకయినా ఈ పెద్దమనుషులు రాజీనామాలు చేస్తారా లేదా? చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? వంటి అనేక యక్ష ప్రశ్నల గురించి ఒకేసారి శ్రమ పడి ఆలోచించడం కంటే, ఏదో ఒకటే పాయింటు పట్టుకొని ఆలోచించుకొంటే అందరికీ తేలికగా ఉంటుంది.   కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని గొప్ప సత్యం ప్రకటించారు, గనుక ఆయన పార్టీ పెట్టేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని అనుకోవచ్చును. అయితే ఆయనను గొప్పసమైక్య హీరో అని జనాలు ఎంతగా మెచ్చుకొంటునప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోఆయనకు ‘లైక్స్’ తక్కువేనని చెప్పక తప్పదు. ఎవరి కారణాలు వారికున్నాయి.   ఒకరికి ఆయనలో అహంభావం నచ్చదు, మరొకరికి ఆయన సీనియారిటీ సరిపోదు. మరికొందరికి ఆయన చూపించిన చేదు అనుభవాలు ఇంకా తాజాగానే ఉన్నందున ఇబ్బంది. చాలా మందికి ముఖ్యమంత్రి పదవి అత్యవసరం గనుక దానిని ఆయనతో పంచుకోలేక చేరలేకపోవచ్చును. పార్టీ పెట్టక మునుపే ఇంతమందికి ఆయనతో సమస్యలున్నప్పుడు వారు ఆయన నేతృత్వంలో పనిచేస్తారని అనుకోలేము.   అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టాలంటే తనకు వంది మాగాదులుగా ఉండే వారిని పోగేసుకోవలసి ఉంటుంది. వారు తప్పనిసరిగా గెలుపు గుర్రాలయ్యి ఉండాలి. ఎవరి ఎన్నికల ఖర్చు వారే భరించుకోవాలి. సోనియమ్మ, రాహుల్ గాంధీల పేర్లు చెప్పుకోవడానికి వీలుండదు గనుక, అభ్యర్ధులు తమ తమ గోత్ర నామాలు చెప్పుకొనే ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యమయిన షరతు మరొకటి ఉంది. ఎన్నికలయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిందుకు అంగీకరించాలి. వీటిలో దేనిని అంగీకరించకపోయినా ఆఖరి షరతుకి మాత్రం అందరూ అంగీకరించవచ్చు గనుక, ఈ ‘ఆరు నెలల పార్టీ’ లో చాలామందే జేరవచ్చును.   కానీ, రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్ వంటి సీనియర్లు మాత్రం స్వతంత్రంగా పోటీచేసి ఆనక మళ్ళీ కాంగ్రెస్ హస్తం అందుకోవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకోకపోతే, ఆయనకు బొత్స, ఆనం, డొక్కా వంటి మంత్రులే పొగబెట్టడం ఖాయం. గనుక ఇష్టమున్న కష్టమున్న కిరణ్ వేరు కుంపటి పెట్టుకోక తప్పదు.

రెడ్డిగారూ ఉండబట్టే..మేమిక్కడ ఉండగలిగాం!

      - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     డాక్టర్ సంజయ్ బారు పేరు పత్రికాపాఠకులకు తెలిసే ఉండాలి. ఆయనెవరో కాదు, మన తెలుగువాళ్ళలో స్థిరపడిన ఉత్తముల్లో ఒకరు. ఇంకా అంతకంటే వివరించి చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శిగా కీలకపాత్ర వహించిన సుప్రసిద్ధ విశ్రాంతాధికారి బి.పి.ఆర్. విఠల్ కుమారుడే డాక్టర్ బారు; మరింత వివరంగా చెప్పాలంటే ఇటీవల సంవత్సరాలలో ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ కు విశిష్ట మీడియా సలహాదారుగా పనిచేసి ఉన్న ప్రముఖుడే ఈ బారు. ఇతని ప్రస్తావన ఇప్పుడెందుకు చేయవలసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదనను అర్థాంతరంగా తెరమీద కెక్కడానికి కారణమైన పాలకపార్టీ అయిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పార్టీ అధ్యక్షులయిన సోనియా నాయకత్వాన తెలుగుజాతిని చీల్చడానికి తీర్మానం రూపంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల!   ఈ నెల 16న "హిందూ'' పత్రికలో బారు "విభజన'' సమస్యపై రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో మనకు తెలియని ఒక విశేషాన్ని బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను చీల్చడంకోసం తెలంగాణాలోని కొందరు మోతుబరులయిన గుప్పెడు రాజకీయ నిరుద్యోగులు తమ పదవీ స్వార్థప్రయోజనాల కోసం లేవనెత్తిన ఉద్యమం [ఇలాంటిది 1969-70 లలో కూడా ఇదే బాపతు వర్గం మరొక రూపంలో లేవనెత్తింది]సందర్భంగా ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం 2001లోనూ 2004లోనూ ఇరుప్రాంతాల మధ్య సమస్యలేమైనా ఉంటే రాష్ట్రం విడిపోవటం కాకుండా వాటి పరిష్కారానికి మరొక ఎస్.ఆర్.సి.ని నియమిస్తే చాలునని ప్రతిపాదిస్తూ వచ్చింది; ఈ సమస్య పూర్వరంగంలో ఆనాటి [2004 నుంచి 2009 మధ్య, ఆ పిమ్మట 2009లోనూ] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఢిల్లీ వెడుతుండేవారు. వెళ్ళినప్పుడల్లా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుంటూ వుండేవారు. ఆ సమయంలో బారు ప్రధాని మీడియా సలహాదారుగా ప్రధానికి సన్నిహితంగా ఉండి ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య సంభాషణ వింటూండేవారు. అలాంటి సందర్భాల్లో మన్మోహన్ సింగ్ తనకు కలవవచ్చిన రాజశేఖర్ ను ఉద్దేశించి ఎప్పుడూ ఏమంటూ సంబోధించేవారో బారూ తాజా వ్యాసంలో పేర్కొన్నారు "రండి రెడ్డిగారూ, స్వాగతం. మీరక్కడ (ఆంధ్రప్రదేశ్ లో) ఉండబట్టే మేమిక్కడ (ఢిల్లీ) ఉండగలిగాం'' అని మన్మోహన్ కితాబు! ప్రధాని మన్మోహన్ - ముఖ్యమంత్రి వై.ఎస్.కు అంత కితాబివ్వగలిగారు? "కారణం లేని తోరణం'' ఉండదు. 2004లోనూ, 2009లోనూ రెండుసార్లు జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అఖండవిజయం సాధించిపెట్టింది రాజశేఖర్ రెడ్డి. అటు దేశేయంగానూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరువుప్రతిష్ఠలు స్థిరపడడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారకులయిన ముఖ్యులలో ముఖ్యుడు రాజశేఖర్ అని మన్మోహన్ కే కాదు, తాము కాంగ్రెస్ 'పెద్దలం' అనుకునే వాళ్ళందరికీ తెలుసు. కాని మన్మోహన్ కు ఆ కృతజ్ఞతాభావం వుందిగాని సోనియాకు ఉందని నమ్మలేం! ఏ నాయకుడైనా/నాయకురాలైనా తన కొడుకులు/కూతుళ్ళు తన స్థాయికి రావాలని కోరుకోవతంలో తప్పులేకపోవచ్చుగాని, ఎదుటివాళ్ళ బిడ్డలు ఎదిగిరాకూడదని తలంచేవాళ్ళు దుష్టులుగానే ముద్రపడతారు! తాను అందుకు భిన్నం కాబట్టే బహుశా మన్మోహన్, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ ను అలా తనను కలుసుకున్నప్పుడల్లా 'ఢిల్లీ లో కూడా మేము అధికారంలో ఉండగలగడానికి మీ కృషి వల్లనే'నని ధ్వనించగలిగాడు! మొత్తం ఆంధ్రప్రదేశ్ విజయం ప్రభావమే కేంద్రంలో సోనియా 'ప్రభ' వేలులోకి రావడానికి కారణమయింది. దేశ, విదేశీ పత్రికలూ ఆ విజయాన్ని ఘనంగా కీర్తించడమూ జరిగింది!   1999లో కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో దక్కిన పార్లమెంటు లోక సభ సీట్లు కేవలం 9 కాగా ఆ సంఖ్య 2004ఎన్నికల్లో టిడిపి సహా అన్ని ప్రతిపక్షాలనూ ఓడించి 29 స్థానాలు కాగా, ఆ సంఖ్య తిరిగి 2009 ఎన్నికల్లో 33కి పెరిగి, కాంగ్రెస్ పార్టీ ఇటు హైదరాబాద్ లోనూ, అటు ఢిల్లీలోనూ అధికారానికి దిలాసాగా రాగల్గింది! కాంగ్రెస్ కు 'పాడికుండ'లాంటి అలాంటి ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి కాంగ్రెస్ నిష్కారణంగా కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు కృత్రిమంగా పెంచిన ప్రాంతీయ ఉద్యమానికి బెదిరిపోయి, రాజనీతిజ్ఞతను మరిచిపోయి అధిష్ఠానం పూనుకోవడాన్ని సంజయ్ బారు ఎంతో ఆవేదనలో నిశితంగా విమర్శించవలసి వచ్చింది౧ ఆ వేదనలో అతనొక మాత అన్నాడు : "బ్రిటీష సామాజ్యవాద ప్రభుత్వం సహితం భారతదేశాన్ని విభజించడానికి ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సివచ్చింది. కాని నేటి స్వతంత్ర భారతప్రభుత్వం మాత్రం దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యను పూర్తిగా అనాలోచితంగా పరిష్కరించడానికి గజ్జేకట్టింది''!   కాంగ్రెస్ అధిష్ఠానానిది ఎంత అనాలోచితమైన చర్యో, అంతకన్నా ఎక్కువరెట్లు అనాలోచితమైన వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు, ఎం.పి.లూ, శాసనసభ్యులూ వహించారని చెప్పాలి. వాళ్ళకి అవినీతితో బంధుత్వమేగాని ఆలోచనతో కాదు; వాళ్లకి అధిష్ఠానం కాళ్ళకు మొక్కడంలో అవమానం చూడరు, ప్రజల కాళ్ళు మొక్కడానికి బిడియపడతారు. విభజన సమస్యపై అధిష్ఠానం నుంచి కిందిస్థాయి ఛోటా-మోటా కాంగ్రెస్ నాయకులవరకూ తమ పదవులు వదులుకోవడానికి సిద్ధంగా లేరు; వదులుకున్నట్టుగా ప్రజలకు కన్పించేందుకు స్పీకర్ లకు రాజేనమా పత్రాలు సమర్పించామని చెప్పడమేగాని ఆమోదింపజేసుకునే దమ్ములు లేవు! నేడు "ఆత్మగౌరవం'', "ఆత్మవిశ్వాసం'' అన్న పదాలకు విలువలేకుండా చేస్తున్నవాళ్ళు కాంగ్రెస్, టిడిపిలే; అందరూ రెండునాల్కలతో మాట్లాడేవారేగాని, ఏకావాక్యతతో మెలగడంలేదు. తమ రాజీనామా లేఖల్ని లోక సభ స్పీకర్ తిరస్కరించినా కాంగ్రెస్ ఎం.పి.లు ఎందుకు తిరస్కరించాల్సివచ్చిందో గద్దించే దమ్ములు కూడా కోల్పోయారు; అదేమంటే, విభజన సమస్యపై చర్చలకు ఇంకా రంగంలోకి రాని "మంత్రులబృందం'' అనే "దేవతావస్త్రాల'' సంఘాన్ని చూపుతూ ఆ సంఘాన్ని 'ఇదిగో, అదిగో' కలుస్తామని కేంద్రంలోని మంత్రులు ఊరించుతున్నారు!   "మా రాజీనామాల వల్ల విభజన ఆగద''ని పరువు కోల్పోయిన మంత్రులు సిగ్గువిడిచి ప్రకటించుకుంటున్నారు. రాష్ట్రానికి ఇంత రాజకీయ, ఆర్ధిక, సామాజిక  నష్టాలకు కారణమయిన కాంగ్రెస్ ను 2014 ఎన్నికల్లో ఎలాగోలా గట్తెక్కించుకుందామనే కాంగ్రెస్ వందిమాగధులు ఆశిస్తున్నారుగాని, ప్రజలు  మరోసారి మోసపోరు! ఎందుకంటే రాష్ట్రవిభాజనకు జరిగిన కుట్రలో ఎవరెవరు భాగాస్వాములో, ఎవరు, ఏ పార్టీ నాయకులు ఎవరితో ఎక్కడ కుమ్ముక్కు అయ్యారో, ఎవరిమధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో పూసగుచ్చినట్టు వెల్లడిస్తానని కాంగ్రెస్ సీనియర్ ఎం.పి. లగడపాటి ఇప్పటికి ప్రకటనలవరకే సరిపెట్టుకుంటున్నారుగాని, 'ముగ్గు'లోకి దిగడం లేదు! కాంగ్రెస్ లో ఆదినుంచీ "క్రమశిక్షణ'' అనే పేరుతొ నెహ్రూ కుటుంబసభ్యులకు దాసోహం అవడమే తమ ప్రత్యేక "జన్యు'' (డి.ఎన్.ఎ) లక్షణంగా భావించుకోవటం వల్లనే ప్రజల్ని మోసగించడానికి నాయకులు వెనుదీయడంలేదు. ఈ నేపథ్యంలోనే విభజన సమస్యపై సీమాంధ్రులతో చర్చలకు వస్తుందనుకున్న "ఆంటోనీ కమిటీ''ని ఆటక ఎక్కించారని పత్రికలు వార్తలందించాయి!   పిసిసి అధ్యక్షుడు బొత్సా నాటకాలు మానలేదు. జీవితంలో ప్రశ్నార్థకమైన "లాడ్జీ''రాజకీయాలకు అలవాటుపడిన రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాయపక్షాలకు నాయకత్వం వహించటం హాస్యాస్పదం! అందువల్ల స్పీకర్  ఫార్మాట్ లో రాజీనామాలు చేసి ప్రజలకు 'టోపీ'పెట్టె కార్యక్రమాన్ని రాష్ట్ర ఎం.పి.లు, శాసనసభ్యులూ మానుకొని ప్రజలతో మమేకతను, సమైక్యతా ఉద్యమానికి ఆచరణలో అండగానూ నిలబడి తీరాలి. అదే దేశభక్తికీ, తెలుగుజాతి పట్ల అనురక్తికీ నిదర్శనంగాని, స్పీకర్ కు యిచ్చే దొంగ ఫార్మాట్లు కావు. ఇటువంటి తప్పుడు ప్రకటనలతో, నర్మగర్భ కుట్ర రాజకీయ ప్రయోజనాలతో స్వాతంత్రోద్యమంలో వ్యవహరించి ఉండగలిగితే భగత్ సింగ్ లాంటి వీరులు తమ విలువైన ప్రాణాలను ఏనాడో కాపాడుకోగలిగి ఉండేవారు; ఆత్మగౌరవానికి పరీక్ష దొంగఫార్మాట్ లో రాజీనామాలు యివ్వడం కాదు. ఆ పత్రాలు లేకపోయినా, స్పీకర్ తొక్కిపట్టినా "ప్రజా ప్రతినిధుల''పేరుకు తగినట్టుగా శాసనకర్తలందరూ ప్రజలమధ్యకి రావలసిందే. రాజీనామాలు, ఆమోదించు ఆమోదించకపో  - కాంగ్రెస్ పార్టీకే రాజీనామా యివ్వగలగాలి!

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ డబుల్ గేమ్

  ‘రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరుగదు’ అనే వాదన దగ్గర నుండి ‘ఎన్నికల వరకు జరుగదనే’ వాదనకి దిగిరావడంతోనే రాష్ట్ర విభజన అనివార్యమని తేటతెల్లమవుతోంది. అంటే సీమంద్రా నేతలు రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడటమే కాకుండా ప్రజలను కూడా అందుకు సిద్దపరుస్తున్నారని అర్ధమవుతోంది. అయితే ఎన్నికల వరకయినా ఈ ప్రక్రియ వాయిదాపడాలని వారు కోరుకోవడం చూస్తే, రాష్ట్ర విభజన కంటే తమ రాజకీయ భవిష్యత్ పట్ల వారు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.   కనీసం ఎన్నికల వరకు విభజన జరుగకుండా ఆపగలిగితే, ఎలాగో కష్టపడి మళ్ళీ ఎన్నికలలో గెలవచ్చుననే దురాలోచనే వారిలో కనబడుతోంది. అయితే వారు మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీని తిడుతున్నారు. పార్టీలు మారుతున్నారు. కొత్త పార్టీ పెడతామంటున్నారు. అయితే ఎన్నికల వరకు విభజనను ఆపినంత మాత్రాన్న సీమాంధ్ర ప్రజలు ఓట్లు వేస్తారని అనుకోలేము.   కానీ వారు మాత్రం అధిష్టానాన్ని ఒప్పించి ఎన్నికల వరకు విభజన ప్రక్రియను నెమ్మదించగలిగితే ఈలోగా ప్రజలకు ఏదో మాయమాటలు చెప్పయినా మళ్ళీ తమకే ఓట్లు వేయించుకోగాలమనే ధీమా సీమాంద్ర కాంగ్రెస్ నేతలలో బలంగా ఉంది. అందుకే వారు ‘తల్లీ నీకు మొక్కెద! దయతలచి విభజన ప్రక్రియకు కాస్త బ్రేకులేయవే’ అంటూ అధిష్టానాన్ని వేడుకొంటున్నారు.   ఒకప్పుడు అడుగు ముందుకు వేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామని బెదిరించే స్థాయి నుండి నేడు కాస్త బ్రేకులేస్తే చాలాని కాళ్ళ బేరానికి వచ్చిన సీమాంధ్ర నేతలని చూసి అధిష్టానం జాలిపడినట్లుంది. బహుశః అందుకేనేమో “రాష్ట్రవిభజన ఎన్నికల ముందే జరుగుతుందో లేక తరువాతే జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని” చాక్లెట్ వంటి తీయని మాట చాకో చేత పలికింపజేసింది.   అయితే మళ్ళీ అదే సమయంలో అటు తెలంగాణా ప్రజలకి తమ శీలం మీద అనుమానం కలుగకూడదనే ఆలోచనతో వెంటనే దిగ్విజయ్ సింగ్ “చాకో అన్నమాటలకి నేను జవాబు దారీ కాబోను. రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరిగి తీరుతుంది,” అని మరో కత్తి లాంటి ప్రకటన చేసేసి చేతులు దులుపుకొన్నారు.   ఎన్నికలలోగా రాష్ట్రాన్ని కత్తిరించేయాలా వద్దా అనే సంగతి మాత్రం రాష్ట్రంలో పరిస్థితులని బట్టి నిర్ణయించుకొని ముందుకు సాగవచ్చును. విభజిస్తే సీమంద్రా కాంగ్రెస్ నేతలు పోతారు. కానీ వారికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే చేసుకొంది గనుక వారి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ విభజించకపోయినట్లయితే, తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుపోతే, ఆనక తెరాస ఏకుమేకయి కూర్చొనే ప్రమాదం ఉంది. గనుక విభజనకే మొగ్గు చూపవచ్చును.   కానీ ఎన్నికలకి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది, గనుక ఇది సాంకేతికంగా సాధ్యపడుతుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న.

ఇంతకీ సమైక్య చాంపియన్ ఎవరో

  ఇప్పుడు రాష్ట్రంలో సమైక్యవాదంపై పేటెంట్ హక్కుల కోసం గట్టి పోరాటం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరియు లగడపాటి రాజగోపాల్ ఈపోటీలో ముందున్నారు. అయితే, ఈ పోటీ ప్రధానంగా మొదటి ఇద్దరి మధ్యే ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే.   ఈ ఇద్దరిలో ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన అధిష్టానాన్నిదిక్కరిస్తూ సమైక్యగీతం ఆలపిస్తున్నకారణంగా సహజంగానే జనాలలో కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించుకొని ఈ రేసులో ముందున్నారు. మరి ఆయన నిజాయితీగానే ఈ సమైక్యగీతం ఆలపిస్తున్నారా లేక అధిష్టానం స్వరపరచిన ట్యూన్స్ పట్టుకొని పాడుతున్నారా లేక రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తన కుర్చీకి డోకా లేకుండా చూసుకోనేందుకే ఈపాట అందుకొన్నారా లేక తన నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్నజగన్మోహన్ రెడ్డిని డ్డీ కొని నిలబడేందుకే ఈ పాట పాడుతున్నారా అనే ధర్మ సందేహాలు పక్కన బెడితే, ఆయన రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టం అవుతున్నపటికీ ఆయనే సమైక్యరాగం గట్టిగా ఆలపిస్తూ దానిపై పూర్తి పేటెంట్ హక్కులు తనవేనంటున్నారు. అయితే ఆయన పార్టీలో ఉన్నాబయటకు వెళ్లి వేరే కొత్త కుంపటి పెట్టుకొన్నాకూడా అంతిమంగా ఆయన, కాంగ్రెస్ పార్టీయే లభాపడతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.   అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మంచి దూకుడుగానే పావులు కదుపుతున్నారు. జైలు నుండి బయటకు వచ్చీ రాగానే, తన పార్టీ ఆలపిస్తున్నసమైక్యరాగంలో మరికొన్నికొత్తరాగాలు జోడించి గొంతెత్తి పాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పాటకి కిరణ్ కుమార్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతూ శృతి తప్పిస్తున్నారు.   ఉద్యోగులతో కలిసి కోరస్ పాడి జనాల చేత చప్పట్లు కొట్టించుకోవాలని జగన్ ప్రయత్నిస్తే, పైలీన్ తుఫాను పేరు చెప్పి వారిని సమ్మె విరమింపజేయడంతో ఆయన ఒక్కడే ఒంటరిగా విషాద గీతం పాడుకోక తప్పలేదు. పోనీ ఆమరణ దీక్ష చేసుకొంటూ ఆయన పాడిన సమైక్య రాగాన్ని, అదొక కూనిరాగమన్నట్లు దానికి నామమాత్రంగా కూడా స్పందించకుండా నూటొక్క దీక్షల్లో ఇదీ ఒకటి అన్నట్లు తీసిపారేయడంతో వ్రతం(దీక్ష) చెడినా ఫలం దక్కకుండా పోయింది.   పోనీ హైదరాబాదులో ఓ ఐదు లక్షల మందిని పోగేసి వారి ముందు సమైక్యరాగం తీద్దామనుకొంటే, శాంతి భద్రతలంటూ కాలు అడ్డం పెడుతున్నాడని కోర్టుకు మోర పెట్టుకొనే పరిస్థితి కల్పించారు. పోనీ “ఇదే పాట ఇదే నోట వేరే ఊళ్ళో పదే పదే పాడుకొంటాను. కనీసం అందుకయినా నా బెయిలు షరతులు సడలించండి మహాప్రభో” అని కోర్టుకు విన్నవించుకొన్నారు.   ఒకవేళ కోర్టు ఆయన సీమాంద్రాలో కచేరీ చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోతే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన జీవితాన్నే మార్చేసే ఒక సరి కొత్త ఐడియా వెంటనే అమలుచేయక తప్పదు. లేకపోతే ఇంతకాలం ఎంతో రిస్కు తీసుకొని పాడిన సమైక్యరాగం కాస్తా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే మిగిలిపోతుంది. పైగా అది కాంగ్రెస్ స్వరపరిచిన గీతం కాకపోయి ఉంటే, పార్టీలోను ఆయనకు తాళం తప్పవచ్చును.   ఈ రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పాడుతున్నది ఒకటే పాట అయినప్పటికీ వేర్వేరు రాగాలు, తాళాలు వేస్తూ ఆలపిస్తూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి జనాలు రాబోయే ఎన్నికలలో వీరి పాటకు తాళం వేస్తారో లేక ఇద్దరూ సమైక్యరాగం తీస్తూ రాష్ట్ర విభజన చేసి పెట్టినందుకు ఇద్దరికీ గోడ్రేజ్ తాళం వేసేసి, అందరి కంటే సీనియర్ సమైక్య రాగాలాపకుడయిన ఏ లగడపాటినో లేక వేరెవరినో మేళ తాళాలతో స్వాగతం పలుకుతారో చూడాలి.

మా అబ్బాయికి తొందరెక్కువ..(చదివి నవ్వుకోండి)

      అమ్మా! అందరూ నాకు కొంచెం దూకుడు ఎక్కువయింది అంటున్నారు. ఇంతకీ ఈ దూకుడంటే ఏమిటమ్మా? అదేరా కన్నా...నువ్వు నాన్నగారు అంత్యక్రియలు కూడా పూర్తవక మునుపే, ఆయన కుర్చీలో కూర్చోవాలనుకొన్నావే... దానినే దూకుడంటారురా. అదేమిటమ్మా.. నాన్నకుర్చీలో నేను గాకపోతే ఇంకెవరు కూర్చోంటారు. అది అందరూ చేసేదే..నువ్వు కూడా  దానిని దూకుడంటే ఎలా అమ్మా? నీకు కేంద్రమంత్రి పదవి ఇస్తామని చెపుతున్నా వినకుండా నాన్నకుర్చీ కోసమే మారం చేస్తూ సోనియమ్మ మంచిమాటను కూడా కాదని కాంగ్రెస్ లోనుండి బయటకి వచ్చేసి ఈ పార్టీ పెట్టావే దానినే దూకుడు అంటారనుకో పోనీ... ఏంటమ్మా నువ్వు మరీను... నాన్నగారి రాజ్యంలో బాగా సుఖం మరిగిన ప్రజలు కాంగ్రెస్ పాలనలో నానా ఇబ్బందులు పడిపోతుంటే, ఏదో పోనీ వారిని ఆదుకొందామని కదాని పార్టీ పెట్టేను. అటువంటప్పుడు నాన్నగారి కుర్చీలో కూర్చోకుండా వాళ్ళని పాలించడం ఎలా వీలవుతుంది? దానిని నువ్వు దూకుడు అంటే నేను ఒప్పుకోను. ఇంకేదయినా మంచి ఉదాహరణ చెప్పు ఏమిటోరా నీ జీవితమే పెద్ద దూకుడు...మళ్ళీ వాటిలోంచి ప్రత్యేకంగా ఉదాహరణలు వెతికి చెప్పాలంటే ఇదేమయినా రచ్చబండ కబుర్లా? ప్లీజ్ అమ్మా! పోనీ అందులోంచి ఒకే ఒక ఉదారణ చెప్పు పోనీ.. అదేరా నేను ఎంత వారిస్తున్నావినకుండా జనాలని ఓదార్చడానికి బయలుదేరావే దానినేరా దూకుడు అంటారు. ఫలితంగా ఏమయింది నువ్వే చూసావు గదా? నువ్వు ఒదార్చకపోతే జనాలేమయినా చచ్చిపోతారా చెప్పు? ఆ దూకుడే వద్దంటున్నా...కానీ నువ్వు వింటే కదా? నీ దూకుడువల్ల ఏనాడు ఎండ కన్నెరుగని నేను, చెల్లి ఎండనక, వాననక, రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఇకనయినా ణా మాట విని ఆ దూకుడు కొంచెం తగ్గించుకోరా బాబు. అదేమిటమ్మా...బోడి గుండుకి మోకాలుకీ ముడిపెడుతూ ప్రతీ దానిని దూకుడు అంటావు. అసలు దూకుడు అంటే నీకు తెలియకనే నీకు తోచినవన్నీ చెపుతున్నావు. మరటువంటప్పుడు నన్నెందుకు అడగడం ఎందుకు? పోయి ఆ కొండా సురేఖనో, లేక సబ్బం హరినో లేక ఆ తెలంగాణా ప్రజలనో అడుగు వాళ్ళే చెపుతారు నీ దూకుడు గురించి.. అంటే నేను ముఖ్యమంత్రినవడానికే వాళ్ళని అందరినీ వదిలించుకొన్నానని నీ ఉద్దేశ్యమా? గల్లీ నుండి డిల్లీ దాక నిన్ను తిప్పుతున్నాకూడా నీకు ఇంకా రాజకీయాలు సరిగ్గా వంటబట్టలేదమ్మా! మనల్నిసీమాంధ్రలో, కేసీఆర్ ని తెలంగాణాలో చూసుకోమని మన హైకమాండ్ చెప్పిన తరువాతనే కదా మనం తెలంగాణాలో నుండి జంప్ అయిపోయి, సమైక్యరాగం అందుకొన్నది. అటువంటప్పుడు ఈ కొండలు, సబ్బాలు మనకెందుకమ్మా? అంటే అకస్మాత్తుగా తెలంగాణా నుండి జంప్ అయిపోవడం దూకుడు కాదంటావు. సరే! హైకమాండ్ ఆదేశంతోనే జంప్ అయిపోయావనే అనుకొంటాను. కానీ, నిన్ను అష్టకష్టాలు పడి మూడో కంటికి తెలియకుండా ఆ సోనియమ్మ కాళ్ళు పట్టుకొని బెయిలు మీద జైల్లోంచి విడిపించి తీసుకు వస్తే నువ్వు చేసిన పనేమిటి? పోయి ఆ నరేంద్ర మోడీని పొగుడుతావా? ఆయన మతం పక్కన బెడితే ఆయన పార్టీతో జత కడతానని అంటావా? నీ మాటలు మన హైకమాండ్ చెవిన పడితే మళ్ళీ నువ్వు అత్తారింటికి దారేది అని వెనక్కివెళ్లిపోక తప్పదు తెలుసా? దీనిని దూకుడు అనక ఏమంటారు? దూకుడు గురించి నువ్వు నాకు పాఠాలు చెపుతున్నావా? మీ నాన్నగారి కంటే నీ దూకుడు బాగా ఎక్కువయిపోయిందిరా అబ్బాయ్.. కొంచెం తగ్గించుకో...లేకపోతే మళ్ళీ చిక్కుల్లో పడతావు. అమ్మా... అసలు రాజకీయాలు తెలియని నీతో ఈ దూకుడు గురించి మాట్లాడటం నాదే బుద్ది తక్కువ. నీకు అన్ని విడమరిచి చెపితే తప్ప ఏదీ అర్ధం కాదు. అవతల పార్టీల వాళ్ళు అందరూ మనకీ, మన హైకామాండ్ కీ మధ్య ఏవో రహస్య ఒప్పందాలు జరిగాయని, అందుకే నన్ను జైలులోంచి బయటకు వదిలేసారని, ఎన్నికల ముందో, తరువాతో మన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తామని, లేకపోతే దానికి మద్దతు ఇస్తామని ఒకటే ప్రచారం చేస్తుంటే, అదంతా నిజమేనని మన పేపర్లో, టీవీలో ప్రకటన వేసేసుకోమంటావా? నేను మోడీని పొగిడితేనే కదా... కాంగ్రెస్ పార్టీకి మనకి అసలు పొసగదని, అది మన బద్ధ శత్రువని జనాలను నమ్మించగలుగుతాము. లేకుంటే వాళ్ళ ప్రచారంతో జనం కూడా మన ప్లాన్లు అన్నీ పసిగట్టేస్తే ఇక ఎవరియినా ఒటేస్తారంటావా? అప్పుడు ఇక జీవితంలో నేను నాన్న కుర్చీలో కూర్చోగలనా? నువ్వే చెప్పు. అయ్యో! దీనివెనుక ఇంత రాజకీయం ఉందా? నిజమేరా ఎంత ప్రయత్నించినా నాకు రాజకీయాలు అబ్బటం లేదు. నువ్వు ఇక్కడ మీ నాన్నగారి కుర్చీలో, అక్కడ మన రాహుల్ బాబు మన్మోహన్ కుర్చీలో కూర్చొంటే చూడాలని మా తల్లి మనసులు ఒకటే ఉవ్విళ్ళురుతున్నాయిరా.. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో. అయితే ఇప్పుడు దూకుడుకి సరయిన డెఫినెషన్ చెప్పమంటావా? చెప్పమ్మా. అదేరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి చేసే ఏ పనినయినా దూకుడు అంటారురా. హ హ హా...  

కాంగ్రెస్ బండారం బయట పెడతా: లగడపాటి

  సీమంధ్ర కాంగ్రెస్ యంపీలలో కేవలం లగడపాటి రాజగోపాల్ మాత్రమే పట్టువదలని విక్రమార్కుడిలా తన రాజీనామా ఆమోదం కొరకు స్పీకర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మంగళవారంనాడు కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళిన ఆయన అక్కడ స్పీకర్ కనబడకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె ఎక్కడ ఉన్నావెళ్లి కలిసి తన రాజీనామాను ఆమోదింపజేసుకొంటానని అన్నారు.   వేరే పార్టీలకి చెందిన యంపీలు రాజీనామాలు సమర్పిస్తే 24గంటలలోనే ఆమోదం తెలిపే స్పీకర్ తమ రాజీనామాలను రెండు నెలలయినా ఆమోదించకపోవడం చాలా బాధ, ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు సంక్లిష్టమయిన రాష్ట్రవిభజనను చెప్పట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్ద్యేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను కానీ, 25మంది యంపీలను గానీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం వేరేవారి భరోసాతోనో రాష్ట్ర విభజనకు సిద్దపడటం చూస్తే, ఇంత కాలం పార్టీని నమ్ముకొని సేవ చేసిన తమకు అధిష్టానం దృష్టిలో ఏమాత్రం విలువ, గౌరవం లేదని అర్ధం అవుతోందని అన్నారు. అటువంటప్పుడు పార్టీలో కొనసాగడం కూడా అనసరమని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందిన రాష్ట్ర విభజన కోసం తమ పార్టీ ఎవరెవరితో సంబందాలు పెట్టుకొన్నదీ బహిర్గతం చేస్తానని అన్నారు.   మరో యంపీ రాయపాటి మాట్లాడుతూ తను కూడా స్పీకర్ ను త్వరలో కలిసి రాజీనామా ఆమోదింపజేసుకొంటానని అన్నారు. యంపీ హర్షకుమార్ మాట్లాడుతూ తాము వ్యక్తిగతంగా స్పీకర్ ను కలిసి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించినప్పటికీ వాటిని ఆమోదించకుండా పక్కన బెట్టడం చాలా అనుచితమని అన్నారు. అవసరమయితే మరో మారు డిల్లీ వెళ్లి స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకొంటానని ఆయన అన్నారు.   వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరి మాత్రం తను తన యంపీ పదవికి రాజీనామా చేయదలచుకోలేదని, లోక్ సభలో తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేయడానికి యంపీగా కొనసాగాలని తను భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె రాష్ట్ర విభజన అనివార్యమని అందువల్ల ఇక సమైక్యంద్రా గురించి మాట్లాడుతూ ప్రజలను ఇంకా మభ్యపెట్టే బదులు, సీమాంధ్ర ప్రాంతానికి, ప్రజలకి రాష్ట్ర విభజన సందర్భంగా న్యాయం జరిగేందుకు ఏమి చేయాలో ఆలోచిస్తే బాగుటుందని అన్నారు.   అయితే ఆమె సూచించిన సలహాకు ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్ధులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని గట్టిగా చెపుతున్న ఆమె రాబోయే ఎన్నికలలో వైజాగ్ నుండి గెలవడం కల్ల అని వారు హెచ్చరించారు. అంతే గాక ఆమె దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసారు.   స్పీకర్ కార్యాలయం మాత్రం యంపీలు రాజినామాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం లేదా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనే అంశాలు పూర్తిగా స్పీకర్ విచక్షణాదికారాలపై ఆధారపడి ఉంటాయని అందువల్ల స్పీకర్ ను ఎవరూ రాజినామాలకై ఒత్తిడి చేయలేరని నిర్ద్వందంగా ప్రకటించిది. అంటే ఇప్పటికే బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు, వేరే ఇతర పార్టీల నుండి మద్దతు సంపాదించుకోనేవరకు సీమాంధ్ర యంపీల రాజీనామాలు ఆమోదించకపోవచ్చునేమో.

కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసిన పైలిన్ తుఫాన్

  ఇంతవరకు సమైక్య ఉద్యమాలతో హోరెత్తిపోయిన సీమంద్రాలో తుఫాను రాకతో ఒక్కసారిగా ప్రశాంత నెలకొంది. గత రెండు మూడు నెలలుగా సీమాంద్రాలో ఉద్యమాలు, రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ నేతలు చాకో, షిండే, దిగ్విజయ్ సింగ్ వంటి వారి డైలాగులు, వాటిపై స్థానిక నేతల ప్రతిస్పందనలు, ఉద్యోగుల సమ్మె వార్తలు వ్రాసుకొంటూ కాలక్షేపం చేస్తున్న మీడియాకు పైలిన్ తుఫాన్ కొత్త టాపిక్ గా అందిరావడంతో, ‘ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తుఫానులు మరియు వాటి పూర్వపరాలు’ మొదలయిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలతో లేటెస్ట్ గా రిలీజ్ అయిన పైలిన్ తుఫాన్ గురించి, అది సృష్టించబోయే విద్వంసం గురించి ఒకటే ఎక్సయిట్ అయిపోతూ ప్రజలని కూడా అందులోకి లాక్కుపోయాయి.   అలలు ఏవిధంగా ఎగిసిపడతాయో, అప్పుడు ప్రజలు ఏవిధంగా భయపడతారో వంటి అనేక ఆశ్చర్యకరమయిన విశేషాలను కూడా మీడియా వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు తెలియజేస్తూ పైలిన్ తుఫానుకి వీడ్కోలు పలికి వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో, ఉద్యోగుల సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నమంత్రులు, శాసన సభ్యులు అందరూ కూడా తమను కాపాడేందుకు ఆ దేవుడే ఈ పైలిన్ తుఫానును పంపాడని భావిస్తూ కృతజ్ఞతలు తెలుపుకొంటూ, మళ్ళీ చాలా కాలం తరువాత తాము మంత్రులమనే సంగతిని గుర్తు తెచ్చుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.   కానీ పైలిన్ తుఫాన్ వాయుగుండంగా మారి బీహార్ వైపు కదిలిపోవడంతో, మళ్ళీ రాజకీయనేతలలో ఆందోళన మొదలయింది. అయితే టీ-డ్రాఫ్ట్ శాసనసభకు వచ్చేవరకు వారికి కొంచెం ఊపిరిపీల్చుకోనేందుకు వెసులుబాటు దొరికింది. అంతవరకు మీడియా కూడా వార్తల కోసం మళ్ళీ దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, శరత్ పవర్ వంటి వారు చెప్పే కబుర్లు వ్రాసుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు.

లెఫ్ట్ పార్టీలు ఏ పార్టీతో అంటుకడతాయో

  రాష్ట్ర విభజన నిర్ణయంతో స్వయంగా కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలలో సీపీఐ రాష్ట్ర విభజనను సమర్దిస్తుంటే, సీపీఎం వ్యతిరేఖిస్తోంది. గనుక వాటికి ఇంత వరకు రాష్ట్ర విభజన వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయినా, ఎన్నికలు దగ్గర పడుతున్నందున అవి ఇప్పుడు ఏ పార్టీతో అంటుకట్టాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమయింది.   ఎందుకంటే అవి రాష్ట్రంలో ఇంతవరకు స్వయంగా మనుగడ సాగించిన దాఖలాలు, పరిస్థితులు లేవు ఎన్నడూ లేవు గనుక, ఏదో ఒక పార్టీతో అంటు కట్టక తప్పదు. గతంలో ఆ రెండు తెదేపాతో కలిసిపనిచేసినప్పటికీ, ఇప్పుడు తెదేపా బీజేపీ వైపు అడుగులు వేస్తుండటంతో దానితో పొత్తులకి సంకోచిస్తున్నాయి.   ఇక సీపీఐ తెలంగాణాలో తెరాసతో పొత్తు పెట్టుకోవాలనుకొంటే, అది తన బద్ధ శత్రువయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపబోతోంది, గనుక తెరాసతో చేతులు కలుపలేదు. ఇక మిగిలింది మళ్ళీ తెదేపాయే. కానీ అది కూడా తను తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీతో పొత్తుపెట్టుకొంటే దానితోనూ కలవలేదు. అప్పుడు సీపీఐ ఎవరితో కలుస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.   ఇక సీపీఎం పార్టీకి కూడా ఇంచుమించు ఇదే సమస్య ఎదురవుతుంది. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సీపీఎం నేతలను డిల్లీలో కలవడం, ఆ పార్టీతో పొత్తుకి ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తోంది. కానీ, జగన్ అటు మోడీని పొగుడుతూ, మరో వైపు యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని సంకేతాలు ఇస్తూ అనుసరిస్తున్న ద్వంద వైఖరి వలన వైకాపాతో ఆ పార్టీకి పొత్తులు సాధ్యం కాకపోవచ్చును. అంతే కాక వైకాపా మతతత్వ మజ్లిస్ పార్టీతో కూడా స్నేహానికి సిద్దమనే సంకేతాలు గతంలోనే పంపింది, గనుక ఆ పార్టీతో పొత్తులు అసలే కుదరక పోవచ్చును. పైగా కేవలం సీమాంద్రాకే పరిమితమయ్యే ఆ పార్టీతో పొత్తులవల్ల సీపీఎంకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.   తెదేపా రెండు ప్రాంతాలలో పోటీ చేస్తుంది గనుక, బీజేపీతో ఆపార్టీ పొత్తులు లేదా మద్దతుకి సిద్దపడినప్పటికీ, లెఫ్ట్ పార్టీలు అంతిమంగా మళ్ళీ తెదేపాకే చేరువ కావచ్చును. ఏమయినప్పటికీ, ఎన్నికలు దగ్గరపడితే గానీ, ఈ రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి రావు.

"తప్పులు చేశాం, అబద్ధాలూ చెప్పాం'' : జయపాల్!

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     జ్ఞానులయిన కొందరు తాత్వికుల అభిప్రాయంలో "దేవుడికీ త్యాగాలూ, త్యాగశీలురంటేనే యిష్టం''! కాని ఆధునిక యుగంలోని పెక్కుమంది రాజకీయవేత్తలూ, కుహనా రాజకీయాలూ తాము త్యాగాలు చేయకుండా తమ పదవుల వేటలో భాగంగా సామాన్యప్రజల్ని తమకోసం త్యాగాలు, ప్రాణత్యాగాలూ చేసేందుకు పురిగొల్పడం సర్వసాధారణమైపోయింది. అవసరమైతే తమ స్వార్థంకోసం దేశ రాజ్యంగాన్నీ, చట్టాలనూ వక్రీకరించడానికి సహితం ఏమాత్రం వెనుదీయరని కేవలం పది-పదిహేను పార్లమెంటు సీట్లకోసం అంగలార్చడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్థితికి దిగజారిపోయారు. భారత రాజ్యాంగ నిబంధనలను అధ్యయనం చేసిన ఏ బుద్ధజీవీ ఈ పరిణామాన్ని సహించలేడు! కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నలలోనే, దాని ఆశీస్సులతోనే, ఒకేజాతి, భాషాప్రాతిపదికపైన తన ఉత్తర్వులు ఆధారంగానే తాను నియమించిన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం'' సిఫారసులు పునాదిగానే, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన నాటి జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, దాని సభలూ పదేపదే ఆమోదించిన తీర్మానాల సాక్షిగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని - నిట్టనిలువునా చీల్చడానికి, తెలుగుజాతిని ముక్కలు చేయడానికి నేటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని హడావుడిగా ఆమోదించింది; దానికి అంతే ఆదరాబాదరాగా క్యాబినెట్ ఆమోదముద్ర వేయించింది.     రాష్ట్రానికి చెందిన తన సొంతపార్టీ ఎం.పి.లను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అకస్మాత్తుగా రాష్ట్రాన్ని విభజించే నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదానికి ముందు పచ్చి అబద్దాల ద్వారా రోజుకొక తీరుగా రాష్ట్రప్రజలను మభ్యపెట్టి మోసగించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండుసార్లు ఎన్నికల్లో అఖండ విజయం ద్వారా రాష్ట్రప్రజలు కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను అప్పనంగా చేతికి అందించినందుకు ప్రతిఫలం - కేవలం తన కొడుకు రాహుల్ ను ప్రధానమంత్రిగా ఎలాగోలా నిలపడంకోసం తెలుగుజాతినే విచ్చిన్నం చేయబోవటం! పైగా అది కూడా ఏ ప్రాతిపదికపైన? రాజ్యాంగంలోని "3వ అధికరణ'' చాటున అక్రమంగా దాగి కాంగ్రెస్ అధిష్ఠానం కుట్రపన్నడం ద్వారా ఈ పనికి పూనుకుంది. ఆ "కుట్రలో భాగమే - తెలంగాణా విభజన సమస్యపై ముందుగా తన ప్రతిపాదన ఏమిటో కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించకుండా ప్రతిపక్షాలను ఇరికించడం! అందుకే సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పి.లు సహితం తమను అధిష్ఠానం పూర్తిగా చీకట్లోకి నెట్టేసి, మాటమాత్రంగా కూడా విభజన నిర్ణయాన్ని తమకు ముందుగా తెలపనేలేదని బయటపడి చెప్పవలసి వచ్చిందని చెప్పడం!   ఈ మొత్తం విషపూరితమైన ప్రయోగంలో ఆదినుంచీ పాల్గొన్న అధిష్ఠానంలోని ప్రధాన సభ్యులెవరూ? తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడుకోలేక 'ఛీ' కొట్టించుకుని ఆయా రాష్ట్రాల ప్రజలకు దూరమైపోయిన ముగ్గురు తెలుగేతర సభ్యులు - దిగ్విజయ్ సింగ్ (మధ్యప్రదేశ్), అహ్మద్ పటేల్ (గుజరాత్), గులామ్ నబీ ఆజాద్ (జమ్మూ-కాశ్మీర్)! ఈ బాపతు తెలుగుజాతి భవిష్యత్తును దెబ్బతీయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆదేశాలపైన ఆయాచితంగా అవతరించిన తీర్పకులయ్యారు! పైగా సుస్థిరత పొందిన రాష్ట్రాలను విభజించడం వల్ల కాంగ్రెస్ కు ప్రజలకూ ఎంత నష్టం వాటిల్లిందో స్వయాన తమ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో దిగ్విజయ్, ఆజాద్ లు బాహాటంగా ప్రకటనలు చేసినవారేనని, కలలో కూడా మరిచిపోరాదు! అయితే మధ్యలో, మన తెలంగాణా జాతీయంలో చెప్పాలంటే, కొందరు "బుడ్డర్ ఖాన్''ల [విదూషకుల]వల్ల రాష్ట్రానికి ఏర్పడిన సమస్యకు ఇండియన్ (దేశీయ) పరిష్కారం కాకుండా అర్థాంతరంగా వచ్చిపడిన 'ఇటాలియన్ సొల్యూషన్' మూలంగా రాష్ట్ర పరిస్థితులు మరింత జటిలమైపోయాయి! కాంగ్రెసేతర రాజకీయ పక్షాలలో పెక్కుమంది తాము ఆ 'ఇటాలియన్' పరిష్కారాన్ని తలదాల్చడంలో ఒకరికొకరు పోటాపోటీలు పది చివరికి 'ఇటాలియన్ సూత్రాని'కె కట్టుబానిసలై రాష్ట్ర పరిస్థితుల్ని మరింతగా కంపుకంపు చేసి కూర్చున్నాయి! ఈ తరుణంలో ఎక్కడ ఏ స్థాయిలో ఎలాంటి చర్చ లేదా ప్రస్తావన సాగిందోగాని నా ఆత్మీయ మిత్రులు, కాంగ్రెస్ నాయకులయిన సీనియర్ కాంగ్రెస్ మంత్రి జయపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి 'విభజన' సమస్యపైన వేర్వేరు దృక్పథాలనుంచే అయినా తెలుగుజాతి భవిష్యత్తుకు ఏర్పడిన సంకట స్థితిపైన ఆవేదనను, తమ పాలుపోని స్థితినీ దాచుకొనలేక తమ మనోగత బాధను వేర్వేరు ప్రకటనలో వెలిబుచ్చడం గమనార్హం! వీరిలో ఒకరు (జయపాల్) విభజనపై జరిగిన కాంగ్రెస్ నిర్ణయాన్ని విమర్శించకుండానే ఇరుప్రాంతాల సయోధ్యకు సమస్యకు "సామరస్య పరిష్కారాన్ని'' వెతకడానికి తద్వారా ఉభయప్రాంతాల మధ్య "పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుందామ''ని ప్రతిపాదించారు! ఈ ప్రతిపాదనకు పూర్వరంగంగా జయపాల్ ఒక బండసత్యాన్ని బయటపెట్టక తప్పలేదు : ఆయన మాటల్లోనే  "మానవమాత్రులం కాబట్టి తప్పులు చేశాం. అబద్ధాలూ చెప్పాం. వాటి లోతుల్లోకి నేను వెళ్ళదలచలేదు'' అని నిర్మొహమాటంగా ఒప్పేసుకున్నారు! అందుకు ఆయనను అభినందించాలి. కాని ఆ "తప్పులు', "అబద్ధాల''ద్వారా రాష్ట్రసమైక్యతకు, మొత్తం తెలుగుజాతికీ, ఇరుగుపోరుగులో మన గౌరవప్రతిష్ఠలకూ తక్షణం పూరించలేని నష్టం ఎంతటి భారీస్థాయిలో జరిగిందో జయపాల్, శశిధర్ లు గుర్తించాల్సివచ్చింది; ఈ క్రమంలోనే ఉభయులూ హైదరాబాద్ యింత బ్రహ్మాండమైన స్థాయిలో వివిధరంగాలలో ఎదగడానికి బహుభాషల, భిన్న సంస్కృతులలో దీపించడానికి అన్నిప్రాంతాల వారి చోదోడు, వాదోడు ఉందనీ గుర్తించగలిగారు. అయితే మరో "పెద్దమనుషుల ఒప్పందం'' కోసం జయపాల్ పెడుతున్న షరతు మాత్రం కథను మొదటికే తెస్తుంది! మొదట "పెద్దమనుషుల ఒప్పందం'' [రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కుదిరిన ఒప్పందం] పూర్తిగా అమలులోకి రాకపోవడానికి లేదా అమలులోకి తెచ్చుకోలేక పోవడానికి కారకులెవరో ప్రస్తావించకుండా, "విభజనపై 'నిర్ణయం' జరిగిపోయిందిగనుక మరోసారి రెండుప్రాంతాల మధ్య మరొక "పెద్దమనుషుల ఒప్పందం''ద్వారా సామరస్యం నెలకొల్పుకుందామని జయపాల్ చెప్పడం హాస్యాస్పదం కాదా? అంతేగాక, "విభజన రాజ్యాంగ హక్కు'' అని ఆయన చాటడం మరీ విడ్డూరం!   ఎందుకంటే, రాజ్యాంగంలోని ''3''వ అధికరణం ఏకభాషా సంస్కృతులు ప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రాలకు వర్తించదుగాక వర్తించదు! అందుకే భారతదేశ చరిత్రలో ఏనాడూ ఒకే భూభాగం పరిథిలో లేదా ఒకే రాష్ట్రంగా ఒకే గొడుగుకింద లేని హిందీ రాష్ట్రాలకు లేదా ప్రాంతాలకు మాత్రమే "3వ అధికరణ'' వర్తిస్తుందన్న సంగతి మరవరాదు! కాగా, అదే రాజ్యాంగ కింద కేంద్రప్రభుత్వమే సాధికారికంగా భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్''ను (ఎస్.ఆర్.సి.) ఏర్పరిచి వున్నందున, దాని సిఫారసులపైన ఏర్పడిన రాష్ట్రాలను విచ్చిన్నం చేయడానికి ఆ "3వ అధికరణ'' అవతరించాలేదని గమనించాలి! అంతేగాదు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చాలన్నా, ఉన్న రాష్ట్రంలోని ఒక భాగాన్ని మరో భాగంలో విలీనం చేసి, వేరే రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా సంబంధిత రాష్ట్రప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి నిరంకుశ రాచరికవ్యవస్థలో 'సామంతుల' ఇష్టారాజ్యాలలో మాత్రమే వీలుంటుందిగాని, ప్రజాస్వామిక వ్యవస్థలో [మనం అలాంటి దానిలోనే ఉన్నామన్న నమ్మకం ఉంటే గింటే] మాత్రమే వీలుపడదు! అందుకే, రాజ్యాంగంలో సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా వగైరా కొన్ని రాష్ట్రాల స్థిరత్వం కోసం "ప్రత్యేక నిబంధన''లను  అధికారాలను రాజ్యాంగం పొందుపరిచిందని మరచిపోరాదు.   18p/371 (డి) ప్రాధాన్యం అదే మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికీ, స్థిరత్వానికి, ఉద్యోగ, సద్యోగ విషయాలలో రాష్ట్రంల్ని మూడు ప్రాంతాలమధ్య [ఆంద్ర, రాయలసీమ, తెలంగాణా] సమానతా విలువలు ప్రాతిపదికగా సమన్యాయం పొందుపరచడానికి అనుగుణంగా, తూ.చ.తప్పకుండా పాటించడం కోసమే అవతరించిన ప్రత్యెక ప్రొవిజన్ (స్పెషల్ ప్రొవిజన్) 371[డి] అని మరవరాదు! రాజ్యాంగ సవరణద్వారా 1973 నాటికే 371 అధికరణకు సవరణ తెచ్చి దానిని 371[డి]గా 1974 జులై 1 నుంచి ఇందిరాగాంధీ హయాములోనే ఈ సవరణ పడద్బందీగా అమలులోకి వచ్చింది! తద్వారా ఆ సవరణ అధికరణను కేంద్రం అనుల్లంఘనీయం చేసింది!   ఈ ప్రత్యేక సవరణ ఆధారంగానే దాని వివరణాత్మకమైన కఠిన షరతుల పరిధిలోనే ఉద్యోగుల నియామకాలుగాని, బదిలీలుగానీ, ప్రమోషన్లుగానే జరగాలని శాసించింది! వారి అలాంటి ప్రత్యేక అధికరణను ఒకవేళ సక్రమంగా సమన్యాయంగా పరిగణించి, పాటించకుండా పదవుల కాలక్షేపంలో మునిగితేలుతూ వచ్చిన మంత్రులను కొరత వేయకుండా, వారు చట్టాన్ని చట్ట నిబంధనలనూ అమలు జరపని నేరానికి ప్రజలను శిక్షించ సాహసించడం కన్నా మించిన 'క్రిమినల్ చర్య' ఎలా రాజ్యాంగహితమైనదో మిత్రులు జయపాల్, శశిధర్ లు మనసు విప్పి చెప్పాలి! పైగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగుజాతి ఐకమత్యం కోసం, దాని బిడ్డలందరి సమష్టి అభ్యుదయం కోసం ఉద్దేశించిన ఆ ప్రత్యేక విశిష్ట సవరణతో కూడిన 371[డి] అధికరణకు రాజ్యాంగంలోని "3వ అధికరణ'' వాదిగా లోబడి ఉండాలేగాని అందుకు విరుద్ధమైన దిక్కులో అది ప్రయాణించడానికి వీలులేదు సుమా! అందుకే "371డి'' అధికరణ ఉద్దేశం, లక్ష్యం ఏమిటో తెలియని దిగ్విజయ్ సింగ్ లాంటి కొందరు శంకా పీడుతుల కోసమే భారత సుప్రసిద రాజ్యంగా నిపుణుడూ, కలకత్తా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, కేంద్ర లా కమీషన్ మాజీ సభ్యుడు, ఠాగూర్ లా ప్రొఫెసర్, భారత రాజ్యాంగ చట్ట భాష్యాకారుడూ అయిన దుర్గాదాస్ బసు ఆ అధికరణ గురించి యిలా వివరించారు : "371[డి] అధికరణను తీసుకు రావడంలో మౌలికమైన ప్రయజనం ఏమంటే : (1) ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం, తద్వారా రాష్ట్రమంతటా సమతుల్యమైన అభివృద్ధిని సాదించడం; (2) విద్య, ఉపాధి, పబ్లిక్ సర్వీస్ లో పౌరుల కెరియర్ అవకాశాలను రాష్ట్రంలోని వివిధప్రాంతాల్లో సమతుల్యంగా కల్పించడం'' [జస్టీస్ బసు "కాన్ స్టిట్యూషన్ లా'' పేజీ:384]! ఈ 371[డి] అధికరణ అఆదారంగానే ఎన్టీఆర్ హయాములో 610 జీ.వో. వచ్చిందని మరవరాదు! అయినప్పుడు, ఈ "లక్ష్యాన్ని'' చేరుకునే ప్రయత్నంలో భాగంగానే జస్టీస్ శ్రీ కృష్ణ కమిటీ (2010) ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, 1956కు ముందున్న పరిస్థితికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాంతాలలో నెలకొంటూ వచ్చిన అభివృద్ధినీ అంచనావేసి, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ ఇప్పటికీ వెనుకబడిన ఉన్న ప్రాంతం ప్రధానంగా రాయలసీమ మాత్రమేనని అధ్యయనం అనంతరం తేల్చి చెప్పింది! అంటే, మిగతా రెండుప్రాంతాలూ అభివృద్ధిలో సహజమైనతరతమ భేదాలతో 1956కు ముందుకన్నా నిస్సందేహంగా వివిధరంగాలలో ప్రగతిని రిజిస్టర్ చేశాయని స్పష్టం చేసింది! ఈ సందర్భంగా, మూడుప్రాంతాలూ అనుకున్నంత స్థాయిలో మరింత గణనీయమైన అభ్యుదయాన్ని సాధించలేక పోవడానికి కనపడుతున్న అసలు కారణాన్ని శ్రీకృష్ణ కమిటీ చెప్పడానికి జంకింది! దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు దేశ "అభివృద్ధి''కి ఎంచుకున్న పెట్టుబడిదారీ-భూస్వామ్య వ్యవస్థలో అసమాభివృద్ధి అనేది ఒక ప్రత్యేక లక్షణం. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''ను బేషరతుగా ఆమోదించిన ఫలితంగా ప్రభుత్వరంగం ఉనికి ప్రశ్నార్థకమై దేశ, విదేశీ బడా గుత్తవర్గాల ప్రయివేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరచుకోవడంతో ప్రభుత్వానిది 'బ్రోకర్' పాత్రగా మారవలసి వచ్చింది! ఏ 371[డి] అధికరణ ద్వారా పబ్లిక్ సర్వీసులలో ఉపాధి సౌకర్యాలు మూడుప్రాంతాలలోనూ కల్పించి పెంచాలనుకున్నారో అది కాస్తా 'గుంటపూలు' పూయడం ప్రారంభమయింది. ఉపాధి వనరుల బాధ్యతా అనేది ప్రయివేట్ గుత్త కంపెనీల, విదేశీ గుత్త పెట్ట్టుబడి సంస్థలకు బలవంతంగా బదిలీ చేశారు!   ఇందుకు అనుగుణంగానే 1991 నాటి ప్రజావ్యతిరేక ఆర్ధిక సంస్కరణలలో భాగంగా అటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, ఇటు చంద్రబాబు టి.డి.పి. పాలనలోనూ ప్రభుత్వ సర్వీసులలో ఏడాదికి దాదాపు 2 శాతం బొప్పున ఉద్యోగుల ఉద్వాసనకు వేటుపడిందని మరచిపోరాదు! అలా ఉపాధి రంగాన్ని ప్రయివేట్ రంగంలోని బడా తోడేళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలి కూర్చున్నారు. ఉపాధి సమస్యలపైన అన్ని చోట్లా ఆందోళనలకు ఇదే ప్రధాన కారణం సుమా!  అందువల్ల పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గ వ్యవస్థను కనీసం రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రజాతంత్ర సోషలిస్టు వ్యవస్థదిశగా సమూలంగా మార్చుకుంటే తప్ప భారీస్థాయిలో ఉపాధికల్పనకు అవకాశాలుండవు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు, తమ మనుగడకోసం అవిఆశాపెట్టే "తాయిలాలు'' మారుతుండవచ్చు, కాని అసంఖ్యాకంగా వనరులు చూపించగల తయారీ వస్తూత్పత్తి (మాన్యుఫ్యాక్చరింగ్)రంగం, వ్యవసాయరంగాలను పండపెట్టడం వల్ల గ్రామసీమల్లో ఉపాధి సౌకర్యాలు ఎదగవుగాక ఎదగవు! అందుకే ఈ పరిణామాలను ముందుగానే పసికట్టిన కొలదిమందిలో ఒకరు - ఆంధ్రప్రదేశ్ అవతరణకు అసలు బీజాలు నాటి తెలుగుజాతిని ఒక్క గూడుకిందికి చేర్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటంగ నాయకులలో ఒకరైన దేవులపల్లి వెంకటేశ్వరరావు 1973 మార్చి 4 నాటికే "జాతుల సమస్య''పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంట్ లో యిలా స్పష్టం చేయవలసి వచ్చింది :   "తమ స్థానాన్ని బలపర్చుకోడానికి, ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్నరాష్ట్రాలు ఏర్పరచడానికి నేటి పాలకవర్గాలు వ్యతిరేకమనే అభిప్రాయం తప్పు! ప్రత్యేక ఆంద్ర, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కొన్ని పాలకవర్గ ముఠాలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాల నినాదాన్ని అభివృద్ధి నిరోధక ముఠాలే లేవనెత్తుతున్నారనేది గమనించాలి. ఈ నినాదాలలోని అభివృద్ధి నిరోధక స్వభావాన్ని మిలిటెంట్ శక్తులు బట్టబయలు చేసి, ఆ నినాదా స్వభావం నుంచి తమను తాము విడదీసుకోవాలి. బడా ధనికవర్గం, విదేశీ పెట్టుబడి, భూస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణం. స్వయం నిర్ణయ హక్కు అనేది జాతిలో ఒక భాగానికి కాదు. తెలంగాణా ప్రజలు ఆంద్రజాతిలో ఒక భాగమేగాని ప్రత్యేకజాతి కాదు. అందువల్ల స్వయం నిర్ణయ హక్కు వుండేది ఆంద్రజాతి మొత్తానికే గాని మన తెలంగాణా ప్రజలకు కాదు .... దానికితోడు దేశ సమస్యలనుంచి ఆంధ్రప్రదేశ్ సమస్యలను విడదీసి చూడడం అవాస్తవికమవుతుంది. నేడు సమైక్య రాష్ట్రంలోప్రజలను పీడిస్తున్న సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజలను పీడిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ రెండు నినాదాలు కూడా ప్రుజల వకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపవు''   అందువల్ల చెప్పొచ్చేమంటే, రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ లో మూడుప్రాంతాలవారి సర్వీసుల భద్రతా కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371[డి] అధికరణ అమలులో ఉన్నంత కాలం రాష్ట్రాన్ని విభజించే అధికారం రాజ్యాంగంలోని "3వ అధికరణ'' క్రింద కేంద్రప్రభుత్వానికి ఉండదుగాక ఉండదు! ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని నిరంకుశంగా కాంగ్రెస్ పాలకులు నిలిపివేసినట్టుగా "371(డి) అధికరణను 'ఢీ'కొనడం ఆ అధికరణకు రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యపడదు! అలాన్గే ఈ అధికరణ కింద కేంద్రం అధికారాన్ని చలాయించగల ఆదేశిక సూత్రాలుగానీ, కార్యనిర్వాహక ఆదేశాలుగానీ లేవు; పార్టీ వర్కింగ్ కమిటీ దొంగచాటుగా చేసిన తీర్మానానికి, అంతే గూడుపుఠాణీతో క్యాబినెట్ వేసిన ముద్రకూ నేరచరితులయిన లెజిస్లేటర్ లు శిక్షార్హులని చారిత్రాత్మక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాన్ని పార్లమెంటులో చర్చించకుండానే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సుకూ తేడాలేదు! స్థిరంగా ఉన్నా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చాలన్నా, తద్వారా కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి ముందు ఎంతో కర్మకాండను విధిగా అనుసరించి తీరాలి! 371(డి) అధికరణ ఆసరాగానే ప్రభుత్వ ఉద్యోగులలో మూడుప్రాంతాలలోని ఉద్యోగుల, విద్యార్థుల ప్రయోజనాల ప్రత్యేక రక్షణ కోసమే  రాష్ట్రాన్ని జోనల్ పధ్ధతి ప్రకారం వర్గీకరించడమూ జరిగిందని మరవరాదు! 371(డి) ప్రకారం ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప ఇతర కోర్టులకుగానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్ళుకుగానీ ఉద్యోగ నియామకాలు, బదిలీలూ, ప్రమోషన్ల విషయాల్లో జోక్యం తగదని తీర్పులు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ కు వర్తించే 371(డి) అధికరణకు మూడింట రెండువంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ వస్తేనేగాని 3వ అధికరణ ప్రకారం రాష్ట్ర విభజన చెల్లదు! ఈ విషయంలో మరొక రాజ్యాంగ నిపుణుడు,సాధికార వ్యాఖ్యాత అయిన పి.ఎం. బక్షీ పేర్కొన్న వివిధ తీర్పులు కూడా ధృవపరిచాయి! వీటిని తెలుసుకోకుండా "విడిపోతేనే వికాసం''అనటం తెలుగువారి అభ్యుదయానికి చేటు! ప్రజలను విడగొట్టడం తేలికేగాని కలపడమే కష్టం సుమా!

ఎన్నికలలోగా రాష్ట్ర విభజన సాధ్యమేనా

  యుపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం మెల్లగా అడుగులు ముందుకు వేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రుల బృందాన్ని నియమించడం, వారు నిన్నతొలి సమావేశం అవడం కూడా జరిగింది. అయితే మంత్రుల బృందం తమ పని పూర్తి చేయడానికి ఇప్పుడు నిర్దిష్ట కాల వ్యవధిని తొలగించడంతో, వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రవిభజన జరుగకపోవచ్చుననే ఒక సంకేతం వెలువడింది.   ఒకవేళ వారు చకచకా తమ పనులు చక్కబెట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ, అందులో వారు సూచించిన సలహాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ, సాధారణ ఎన్నికలకి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు.   సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే జరుగుతాయని అనుకొన్నా, దానికి రెండు లేదా మూడు నెలల ముందు ఎన్నికల షెడ్యుల్ మరియు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అప్పుడు బహుశః జనవరి లేదా ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావచ్చును. అంటే ప్రభుత్వానికి ఉన్న సమయం ఇంకా కుచించుకుపోయి, మహా అయితే మరో రెండు లేదా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుందని అర్ధం అవుతోంది. ఒకసారి ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తరువాత, ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.   గనుకనే మంత్రుల బృందానికి కాలపరిమితి తొలగించినట్లు భావించవచ్చును. అందుకే షిండే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణా బిల్లు పెట్టడం గురించి సమాధానం చెప్పకుండా సమాధానం దాట వేసారు. తెలంగాణా రాష్ట్రం ఎన్నికల ముందు ఏర్పడుతుందో లేక తరువాత ఏర్పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ఏఐసీసీప్రతినిధి పీ సీ చాకో అనడం కూడా అందుకే అయి ఉండవచ్చును.

కాంగ్రెస్ నేతలా మజాకా

  ఎవరయినా కాంగ్రెస్ పార్టీలో జేరారంటేనే వారు సహజంగా చాల తెలివనవారని అర్ధం. అయితే తెలంగాణా కాంగ్రెస్ నేతల కంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మరో రెండాకులు ఎక్కువే చదివారని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో వారి డ్రామా ముగుస్తుందని అక్కడి నేతలకి, ప్రజలకీ కూడా స్పష్టంగా తెలుసు. ముగింపులో సస్పెన్స్ కూడా ఏమీ ఉండదు. ఆ డ్రామాని పాపం వారు చాలా వ్యయప్రాయసలకోర్చి విజయవంతంగా పూర్తి చేసారు.   కానీ ఆ డ్రామాను అందిపుచ్చుకొన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఈ డ్రామా ముగింపు వేరే విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, అదేమి తెలియనట్లు చాలా అద్భుతంగా, అమాయకంగా టీ- నేతల కంటే కూడా చాలా బాగా నటించేస్తూ, ఎవరూ ఊహించని కొత్త మలుపులు ఇస్తూ, డ్రామాని మంచి రక్తి కట్టిస్తున్నారు. అది ఎలాగో చూద్దాము.   తమ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నందుకు ప్రజలు తమను తిట్టక మునుపే, వారే తమను తాము, తమ పార్టీని తిట్టుకొంటూ, ఇక తమని, తమ పార్టీని తిట్టే అవకాశం ప్రజలకి ఇవ్వరు. ఇక వచ్చే ఎన్నికలలో ఓడిస్తామని ప్రజల చెప్పవలసిన మాటలని, వారి కంటే ముందే సీమంధ్ర కాంగ్రెస్ నేతలే చెపుకొంటారు. వాళ్ళని, వాళ్ళ పార్టీని వాళ్ళే తిట్టుకొంటూ, మేము ఓడిపోతామని వాళ్ళకి వాళ్ళే శాపనార్ధాలు పెట్టుకొంటూ తిరుగుతుంటే, ఇక వారినేమనాలో తెలియక ప్రజలు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.   ప్రజల నుండి తమను తాము కాపాడుకొనేందుకు వారు కనిపెట్టిన ఈ గొప్ప విరుగుడు మంత్రం ప్రభావంతో హిప్నటయిజ్ అయిపోయిన ప్రజలు “వాళ్ళని మనం నమ్ముకొంటే, వాళ్ళు వాళ్ళ పార్టీని నమ్ముకొన్నారు. కానీ వాళ్ళని వాళ్ళ పార్టీయే మోసం చేసింది. పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు?” అంటూ వారిని కోపగించుకోవడానికి వచ్చి, వారి పట్ల సానుభూతి చూపడం మొదలుపెడుతున్నారు కూడా.   ఇక మరి కొందరు నేతలు “రాష్ట్రాన్ని చీల్చిన మా పార్టీలో ఇక ఎట్టి పరిస్థితుల్లో కొనసాగలేము. మేము బాగా హార్ట్ అయిపోయాము,” అంటూ సమైక్యవాదం వినిపిస్తున్న వైకాపాలోకి దూకి తమని తాము కాపాడుకొంటున్నారు.   కుల సమీకరణాలు లేదా వేరే ఇతర కారణాల చేత ఆ పార్టీలోకి దూకలేని వారు కొందరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యహస్తం పట్టుకొని కొత్త సమైక్యపార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల వైతరిణిని దాటాలని ఆలోచిస్తుంటే, మరి కొందరు నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతూ సోనియమ్మ హస్తం పట్టుకొని ఈ గండం గట్టేకాలని ప్రయత్నిస్తున్నారు.   కాంగ్రెస్ నేతలు పార్టీలు మారినా,మారకున్నా, అభిప్రాయలు మార్చుకొన్నా, కొనకపోయినా, అధిష్టానాన్ని తిట్టిన్నా, పొగిడినా అన్నిటి పరమార్ధం ఒక్కటే. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవడం. పాత చొక్కా విప్పి కొత్త చొక్కా తొడుకొన్నంత మాత్రాన్న అందులో మనిషి మారిపోడు. అతని ఆలోచనలు మారిపోవు. అలాగే కాంగ్రెస్ నేతలు ఏ రంగు కండువా కప్పుకొని తిరిగినా, ఏ మాటలు మాట్లాడినా వారు కాంగ్రెస్ నేతలు కాకపోరు. వారి ద్యేయం రానున్న ఎన్నికలలో గెలవడమే తప్ప సమైక్యము కాదు ఏ గుడ్డూ కాదు.

యు.పి లో అసలు ప్రభుత్వముందా ..... రాహుల్

  యు. పి లోని అలీగడ్ ర్యాలీలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యు.పి లోని ముజఫర్ నగర్ లో జరిగిన అల్లర్ల లో అనేక మంది హిదువులు,ముస్లిం లు చనిపోయారని,యువతకు ఉద్యోగాలు లేవని ఇదంతా చూస్తుంటే అసలిక్కడ ప్రభుత్వం పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఎస్. పి,బి.ఎస్.పి లు ఉత్తరప్రదేశ్ ను కాపాడలేక పోయాయని అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందోరాహుల్ చూపిస్తానని అన్నారు. పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. యు.పి లో ఎవరు ఆకలితో చావకూడదు అంటూ ఆకలి చావుల నిర్మూలనకే కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత బిల్లును ప్రవేసపెట్టిందని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కోన్నారని,కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన భూసేకరణ బిల్లు ద్వారా రైతులకు సముచిత న్యాయం చేకూరుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మిత్ర పక్షమైన అఖిలేష్ ప్రభుత్వం పైన అంత అకస్మాత్తుగా రాహుల్ ఎందుకు నిప్పులు చేరిగారో పలువురికి అర్ధం కాలేదు.