కాంగ్రెస్‌కి ముస్లింల టాటా!

      కాంగ్రెస్ పార్టీకి కాలం తీరినట్టుంది. ఓటర్లకు చేరువవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసి కొడుతున్నాయి. తాళ్ళే పాములుగా మారి కాంగ్రెస్ పార్టీని కాటేస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనస్థితి బయటపడుతోంది.కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్ళాలని అనుకున్నా ఎదుర్రాళ్ళు తగులుతున్నాయి. ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసి ఓట్లు దండుకోవాలని రాహుల్ ‌గాంధీ చేస్తున్న ప్రయత్నాలు, ప్రసంగాలు బెడిసికొడుతున్నాయి.   ఆమధ్య ముజఫర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో ప్రసంగాన్ని ప్రారంభించాడు. చివరికి ఆ ప్రసంగం అటు తిరిగి ఇటు తిరిగి ముస్లిం యువకులకు తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు ధ్వనించే మాటలు మాట్లాడే వరకూ వెళ్ళింది. రాహుల్ ప్రసంగం ముస్లింలను ఆకట్టుకునే మాట అటుంచి ఆల్రెడీ కాంగ్రెస్‌కి ఓటుబ్యాంకుగా వున్న ముస్లిం ఓటర్లు కూడా ఖల్లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం వుంటుందా? నోరు జారిన తర్వాత నాలుక్కరుచుకుంటే లాభం వుంటుందా? ప్రస్తుతం ముస్లిం ఓటర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాహుల్ గాంధీ పరిస్థితి అలాగే తయారైంది. రాబోయే రోజుల సంగతి ఏమోగానీ, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ముస్లింల విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం మొదలుపెట్టింది. కాకలు తిరిగిన మంత్రి కపిల్ సిబాల్‌ని రంగంలోకి దించింది. కపిల్ సిబల్ నాటకీయంగా రంగంలోకి దిగి, ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని, కాబట్టి రాహుల్ వెంటనే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. రేపో ఎల్లుండో రాహుల్ ముస్లింలకు సారీ చెప్పేస్తే ముస్లింలు చల్లబడిపోయి కాంగ్రెస్‌కి ఓటేసేస్తారని కాంగ్రెస్ పెద్దల దింపుడుకళ్ళం ఆశావాదం.

నాయకులు @ నాలుకలు!

      ఎవరికైనా కొత్తకొత్త హింసాత్మక పద్ధతులు తెలుసుకోవాలని వుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను సంప్రదించవచ్చు. మొన్నటి వరకూ సీమాంధ్రుల నాలుకలు కోయడం మీద తెలంగాణ వాదులు ఇంట్రస్ట్ చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీమాంధ్రుల నాలుకలు కోయడంతోపాటు సరికొత్తగా హింసిస్తామని చెబుతున్నారు. ఆ సరికొత్త హింసాత్మక కార్యక్రమం ఎలా వుంటుందంటే, సీమాంధ్రుల నాలుకలకి ఉప్పు, పసుపు రాస్తారట. దాంతో సదరు నాలుకలు పల్చగా అయిపోతాయట! ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రతిపాదిస్తున్న నూతన హింసావళి!     ఇంతకీ ఈ కొత్త విధానాన్ని ఎవరి మీద ప్రయోగించాలని అనుకుంటున్నారంటే, తెలుగుదేశం సీమాంధ్ర నాయకుల మీద! తెలుగుదేశం పార్టీలో వున్న సీఎం రమేష్ లాంటి సీమాంధ్ర నాయకులు తెలంగాణ నాయకుడైన ఎర్రబెల్లి దయాకరరావుని నానామాటలూ అంటున్నారంట. అది చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య ఎంతమాత్రం తట్టుకోలేకపోతున్నారట. ఎర్రబెల్లిని ఎవరైనా ఏమైనా అంటే నాలుకలు కోయడంతోపాటు నాలుకలకి ఉప్పు, పసుపు రాసి పలుచగా చేస్తారట! తెలుగుదేశంలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుకి, అదే పార్టీలో వున్న సీఎం రమేష్‌కి మధ్య వాగ్వాదం జరిగితే, కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు మూర్తులకి కోపమెందుకో! అయినా  చంద్రబాబు జోక్యంతో తెలుగుదేశంలో వివాదం సర్దుమణిగిన తర్వాత వీళ్ళు హడావిడి చేయడం ఎందుకో! ఎందుకనేది టీ కాంగ్రెస్ నాయకులు చెప్పకుండానే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అవమానాలను గురి అవుతున్న తెలంగాణ నాయకులు ఇంకా ఆ పార్టీలో వుండటం వేస్టట! అర్జెంటుగా బయటకి వచ్చేయాలట! అదండీ విషయం.. తెలుగుదేశం పార్టీలో వున్న తెలంగాణ నాయకుల మీద ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడంలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మొసలి కన్నీరు కార్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల మీద ఎంత ‘ఆకర్ష’  ప్రయోగించినా అది ‘వికర్ష’ కావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.

బీజేపీకి జగన్ ఎర!

      తనమీద వున్న అవినీతి కేసులన్నీ తొలగిపోవాలి. కుదిరితే పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కుదరకపోతే చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రైపోవాలి.. ఇది జగన్ ముందు కనిపిస్తున్న లక్ష్యాలు. ఈ లక్ష్యాలు సాధించే క్రమంలో తనకు అడ్డు వచ్చిన ప్రతిదాన్నీ తొలగించుకుని వెళ్ళిపోవడమే జగన్ అనుసరిస్తున్న విధానం. సామ, దాన, భేద, దండోపాయాలను సమయానుకూలంగా ప్రయోగించడంలో సిద్ధహస్తుడైన జగన్ ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం మీద దాన, భేదోపాయాలను ప్రయోగించాడు.     సమైక్యాంధ్ర నినాదాన్ని ఢిల్లీలో వినిపిస్తానంటూ హస్తినకు వెళ్ళిన జగన్ అక్కడ పలు పార్టీల పెద్దలను కలిశాడు. మీడియా ముందు ఒక విధానాన్ని, ఆంతరంగిక సమావేశాల్లో మరో విధానాన్ని ప్రకటించి తన రాజకీయ చతురతను చాటుకున్నాడు. ఈమధ్యకాలంలో భారతీయ జనతాపార్టీ తన విభజన విధానంలో మార్పులు చేసుకుంటోంది. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చేరువ  అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలుగుదేశం పొత్తు విషయంలో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధమైపోయింది. అదే ఖాయమైతే, రాష్ట్ర అడ్డగోలు విభజనకు అడ్డు పడుతుంది. అంతేకాదు జగన్ కంటున్న కలలన్నీ కల్లలైపోతాయి. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు తన దగ్గరున్న దాన, భేదోపాయాలను బయటకు తీశాడు. బీజేపీ నేతలతో ఆంతరంగికంగా జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికలలో బీజేపీతో పొత్తుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తన సంపూర్ణ మద్దతు బీజేపీకి ఇస్తానని దానోపాయాన్ని, అలాగే బీజేపీని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి భేదోపాయాన్ని ప్రదర్శించాడని తెలుస్తోంది. అయితే జగన్ పెట్టిన ప్రపోజల్‌ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్దగా స్పందించలేదని, చూద్దాం.. చేద్దాం అన్నట్టుగా పొడిపొడిగా స్పందించి పంపించేసిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఎన్ని ఉపాయాలు ప్రదర్శించినా భవిష్యత్తులో ఆయనను చుట్టుముట్టబోయే అపాయాలు ఆగుతాయా?

మావోయిస్టులకే మన ఓటు!

      ఎన్నికలకూ, మావోయిస్టులకూ మధ్య చాలా దూరం వుంది. తుపాకి గొట్టంతోనే రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పే మావోయిస్టులు ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికలలోకి తాము దూరంగాక దూరమని చెబుతూ వుంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాటిని బహిష్కరిస్తూ వుంటారు. ఓటు అడిగేవాళ్ళని, ఓటు వేసేవాళ్ళని బెదిరిస్తూ వుంటారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపులు ఇస్తూ వుంటారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తూ వుంటారు. అలాంటి మావోయిస్టులు ఎన్నికల మీద మోజు పెంచుకున్నట్టు కనిపిస్తోంది.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ కార్యకలాపాలకు సురక్షితమైన హెడ్ క్వార్టర్‌గా తెలంగాణ ఉపయోగపడుతుందని మావోయిస్టులు ఆశిస్తున్నారు. అందుకే ముందూ వెనుకా ఆలోచించకుండా రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించేశారు. కొంతమంది మావోయిస్టులైతే తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పాల్గొంటున్నారు కూడా!  తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణ వచ్చాక అధికారంలో కూడా భాగస్వాములు అవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలో వుండటం ద్వారా మావోయిస్టు ఉద్యమానికి రాజకీయ మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని మావోయిస్టులు భావిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులు పోటీ చేసే నియోజకవర్గాలలో ఇతర పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలపకుండా చేసే ఉద్దేశం కూడా వుంది. అలా చేయడం ద్వారా పోటీలో నిలబడిన మావోయిస్టులందరూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికవుతారు. మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయాణంలో ముందడుగు వేస్తారు. తమ ఆలోచనకు తెలంగాణలోని రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని మావోయిస్టులు ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తమకు రాజకీయ పార్టీల నుంచి సహకారం సులభంగానే లభిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ సహకారం లభించకపోయినా సహకారం ఎలా పొందాలో మావోయిస్టులకు బాగా తెలుసు కదా!

ఆయనకి ఓకే.. కానీ..!

      24 సంవత్సరాల పాటు భారతీయ క్రికెట్ రంగానికి క్రీడాకారుడిగా విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాడు. యావత్ భారతీయులు ఆయనకి ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. భారత ప్రభుత్వం కూడా ఆయనకి ఈ సందర్భంగా ‘భారతరత్న’ అవార్డు ప్రకటించి ఆయనను అత్యున్నత స్థాయిలో గౌరవించింది. భారతరత్న అందుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు. సచిన్‌ని భారతరత్నతో గౌరవించాలని ఎప్పటి నుంచో కోరుతున్న ఆయన అభిమానులకు ఈ వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. భారతరత్నకు సచిన్ నూటికి నూరుశాతం అర్హుడే అన్న అభిప్రాయాలు అంతటా వినిపించాయి.   సచిన్‌కి భారతరత్న ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవుకానీ, సచిన్ కంటే ముందు భారతీయ క్రీడారంగానికి విశేష సేవలు అందించిన క్రీడాకారులెవరికీ భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తలెత్తాయి. హాకీ మాంత్రికుడిగా పేరు పొందిన ధ్యాన్‌చంద్, పరుగే జీవితంగా బతికిన మిల్కాసింగ్‌లను ప్రభుత్వం ఎందుకు విస్మరించినట్టన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అంతటా ఇలాంటి అభిప్రాయాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. అయితే సచిన్‌కి భారతరత్న ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి వున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సచిన్‌ను ఎప్పటి నుంచో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో వున్న కాంగ్రెస్ పార్టీ గతంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసి భంగపడింది. ఇప్పుడు ఇంత హడావిడిగా, నాటకీయంగా సచిన్‌కి భారతరత్న ప్రకటించి ఆయన్ని తన వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సచిన్ చివరి మ్యాచ్‌కి ఎక్కడో వున్న రాహుల్‌గాంధీ పనికట్టుకుని రావడం వెనుక వున్న అంతరార్థం కూడా ఇదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సచిన్‌కి భారతరత్న వచ్చిందన్న ఆనందాన్ని ఆయన అభిమానులు పూర్తిగా ఆస్వాదించిన తర్వాత రాజకీయ విమర్శకులు రంగంలోకి దిగే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే, భారతరత్నగా గౌరవాన్ని పొందిన సచిన్ టెండూల్కర్ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా, ఏ పార్టీకీ మద్దతు ప్రకటించకుండా, ప్రచారం చేయకుండా తటస్థంగా వుండాలని, ఆయనకున్న గౌరవాన్ని కాపాడుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రాయపాటి ముష్టితెలివి!

    కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించే వరకూ చెవిలో పూలు పెట్టుకుని, నోట్లో వేలు వేసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ళదగ్గర కూర్చున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు విభజన నిర్ణయం తర్వాత తెలివితేటలు బాగాపెరిగిపోయాయి. అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత ఎవరికివారే నన్నుచూడు.. నా తెలివి చూడు అని ప్రజల ముందుకు వస్తున్నారు.   ఆమధ్య సొంత పార్టీ పెట్టేస్తానని హడావిడి చేసిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆ తర్వాత సౌండ్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఎవరికీ కనిపించకుండా దాక్కుని, ఇప్పుడు బోర్ కొట్టి బయటికొచ్చాడు. వచ్చీ రావడంతోనే తాను గతంలో ప్రదర్శించిన ముష్టి తెలివితేటల్ని ప్రజల ముందు ఏకరవు పెడుతున్నాడు. ఆ తెలివితేటలేంటంటే, తాను గతంలో పార్టీ పెడతానని హడావిడిచేసింది నిజంగా పార్టీ పెట్టడానికి కాదంట! అలా తాను కొత్త పార్టీ పెడతానని బెదిరిస్తే, కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయి తెలంగాణ ఇవ్వడం ఆపేస్తుందనుకుని అలా బెదిరించాడట. నిజానికి తనకి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఎంతమాత్రం లేదంట! రాయపాటి ఇలాంటి పనికిరాని తెలివితేటలేవో ప్రదర్శించి వుంటాడని అర్థం చేసుకునే కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయినట్టు లేదు. అయినా రాయపాటి పార్టీ పెడితే పట్టించుకునేదెవరంట? రాయపాటి పార్టీ పెట్టడం కాదు.. అసలు రాజకీయాల్లోంచి తప్పుకుంటే రాష్ట్రానికి నష్టం ఏమిటంట? అసలే సీమాంధ్ర ప్రజలు కడుపు మండిపోయి ఆందోళనలు చేస్తుంటే ఇలాంటి ఎందుకూ పనికిరాని తెలివితేటల్ని ప్రదర్శించిన రాయపాటిని ఏమనాలి? ప్రస్తుతం రాయపాటి తెలివితేటలు పార్టీ పెట్టేవైపు నుంచి పార్టీ మారేవైపు మళ్ళినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదవి లేకుండా పావుగంట కూడా వుండలేని రాయపాటి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతేనని అర్థం చేసుకున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.  మరి ఇంత భారీ స్థాయిలో తెలివితేటలు పొంగి ప్రవహిస్తున్న రాయపాటిని తెలుగుదేశం పార్టీ భరించగలదా?  

కిరణ్ కిమ్ కర్తవ్యం

    ...సాయి లక్ష్మీ మద్దాల     రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తను సమైఖ్య వాదినని,విభజన జరిగితే రెండు ప్రాంతాలు ఏ విధంగా నష్ట పోతాయో సవివరంగా చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను చాలా వేగవంతం చేసింది.   రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని విభజించటానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక మార్గం ఆర్టికల్ 3. కాని సమైఖ్యంగా ఉంచాలి అని రాష్ట్ర రాజకీయ నాయకులు అనుకుంటే,అదే రాజ్యాంగం ప్రకారం సమైఖ్యంగా ఉంచటానికి కనీసం మూడు మార్గాలైన కనిపిస్తున్నాయి.                  1) కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆంద్ర రాయలసీమ ఎం. పి  లందరు సమైఖ్య వాదులమని చెప్పుకుంటున్నారు. వారికి చిత్త శుద్ధి ఉంటె వారు రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి విభజన ద్వారా తమ ప్రాంతం ఎడుర్కొనబోయే సమస్యలను వివరించి కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించు కుంటున్నామని చెబితే,అసలే మైనారిటీలో ఉన్న ప్రభుత్వం కుప్ప కూలుతుంది. అప్పుడు ఎన్నికలకు వెళ్ళటం తప్ప కాంగ్రెస్ కు మరో మార్గం లేదు.                  2) ఆర్టికల్ 3 ప్రకారం విభజన బిల్లును కేంద్రం రాష్ట్ర శాసన సభకు పంపించవలసి ఉంటుంది. పార్లమెంట్  లో బిల్లును ఆమోదింప చేసుకోవటానికి కేంద్రానికి ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఒక నెల పాటు విభజన విషయమై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగకుండా ఆపగలిగితే 2014 ఎన్నికల లోపు ఈ ప్రక్రియ పూర్తి కాదు. అంటే సమైఖ్యానికి కట్టుబడి ఉన్నకాంగ్రెస్  ఎమ్మెల్యెలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని,రాష్ట్రం లో రాష్ట్రపతి పాలనా దిశగా తీసుకొని వెళ్ళటం లేదా శాసన సభ నాయకుని హోదాలో ముఖ్య మంత్రి శాసన సభను రద్దు చేయించి,రాష్ట్రంలో ఎన్నికలకు తెర తీయటం ద్వారా దీనిని సాధించ వచ్చు.                  3)కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ని ఎలా దుర్వినియోగ పరుస్తుందో చెబుతూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ ఫైల్ చెయ్య వచ్చు. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రే కేంద్ర ప్రభుత్వం పై పిటిషన్ఫైల్ చేసినపుడు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యగా సుప్రీం కోర్ట్ లో వెంటనే విభజన పై స్టే వచ్చే అవకాసం   ఎక్కువగా ఉంటుంది.                            అంటే ప్రస్తుతం సమైఖ్య వాదులం అనిచేప్పుకుంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు,ఎంపి  లు కాని,తాను కేవలం సమైఖ్య రాష్ట్రం కోసమే పోరాడుతున్నానని,తనకు తన పదవి కన్నా సమైఖ్య వాదమే ముఖ్యమని చెబుతున్న ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాని,సీమాంధ్ర నుండి ప్రాతినిధ్యం వహిస్తూ సమైఖ్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తున్న రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు కానీ వారికంటూ చిత్తశుద్ది ఉంటె పైన పేర్కొన్న అంశాల పరంగా రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నుండి రాష్ట్రాన్ని  కాపాడేందుకు త్యాగాలకు సిద్దం కావాలి.

తెలంగాణ పగటికలేనా?

      తెలంగాణవాసులు అమాయకులంటారు. కేంద్రం తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించగానే నిజంగానే తెలంగాణ వచ్చేస్తుందని తెలంగాణ నాయకులు సంబరపడిపోతున్నారు. భవిష్యత్తులో తమకు వస్తాయని భావిస్తున్న పదవుల గురించి పగటి కలలు కంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణవాసులు అమాయకులేనని నిర్ధారణ చేసుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ తాను ఆడే పొలిటికల్ గేమ్‌లో తెలంగాణ ఉద్యమాన్ని ఒక పావులా ఉపయోగించుకుంటోంది. ఈ వాస్తవాన్ని తెలంగాణ బిడ్డలు అర్థం చేసుకోలేకపోవడం దురదృష్టకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   తెలంగాణ ఇచ్చేస్తున్నామన్న పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభిప్రాయ సేకరణలు, కమిటీలు, నివేదికలు, సంప్రదింపులు, లీకులు.. ఇవన్నీ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాల్లో భాగమేనని అంటున్నారు. ఎన్నికల వరకూ ఈ ప్రక్రియను సాగదీసీ, తెలంగాణ ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితులలోనూ ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చే అవకాశం లేదు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేరు. ఎన్నికలకు ముందే తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీయే ఎక్కువగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కి మేలు జరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు ఎందుకు విభజించాలి? తెలంగాణ ఇచ్చేశాక టీఆర్ఎస్‌ని కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం కంట్రోల్ చేయలేదు. ఆ పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి పొందే అవకాశం వుండదు. కాబట్టి ఎన్నికల వరకూ ఇష్యూ సాగదీసి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చేస్తుందని ప్రతిపాదించే అవకాశం వుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలా చేయడం ద్వారా 2014 ఎన్నికలలో టీఆర్ఎస్‌తో మరోసారి ఎన్నికల పొత్తు కుదుర్చుకునే పథక రచనలో కాంగ్రెస్ వుందని అంటున్నారు. అన్ని అంశాలనూ పరిశీలిస్తే... తెలంగాణ వచ్చేస్తోందని తెలంగాణ నాయకులు కంటున్న కలలు పగటి కలలలా మిగిలే అవకాశాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగనొచ్చాడు బాబోయ్!

      జగన్ చదువుకునేటప్పుడు అన్ని పరీక్షలూ కాపీకొట్టే పాసైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కాపీకొట్టే గుణాన్ని జగన్ రాజకీయాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఏ పని చేస్తే అదేపని, అదే తరహాలో చేసేస్తున్నాడు. బాబు దీక్షచేస్తే జగన్ దీక్ష చేశాడు. బాబు ఢిల్లీ వెళ్ళొచ్చాడని ఇప్పుడు జగన్ కూడా ఢిల్లీ వెళ్ళాడు.   రాష్ట్ర విభజన జరక్కుండా చూడాలని పలువురు జాతీయ నేతలను కలసి బతిమాలడం జగన్ పర్యటనలో పైకి చెబుతున్న ఎజెండా. అయితే జగన్ జాతీయ నేతలను కలవాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే జగన్‌ని కలవటానికి మాత్రం జాతీయ నేతలు ఆసక్తి కనబరచడం లేదు. లక్షల కోట్ల అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతూ, పదహారు నెలలపాటు జైల్లో వుండొచ్చిన జగన్‌తో మాట్లాడ్డానికి కూడా అనేకమంది జాతీయ నాయకులు ఇష్టపడటం లేదు. వాళ్ళంతా జగనొచ్చాడు బాబోయ్ అనుకుంటున్నారు. పైకి సమైక్యవాదినని చెప్పుకుంటున్నప్పటికీ, సోనియాకీ, జగన్‌కి మధ్య రహస్య ఒప్పందాలు జరిగిన విషయం తేటతెల్లమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోనియాకి నమ్మినబంటు లాంటి జగన్‌ని కలవటం ఎందుకన్న అభిప్రాయం జాతీయ నాయకులలో కలిగింది. అయితే కలవటానికి వచ్చినవాడిని వద్దు పొమ్మనడం బాగోదన్న ఉద్దేశంతోనే తటపటాయిస్తున్నారు.  జగన్ తమను కలవటానికి వచ్చినా, ఏదో మాటవరసకి పలకరించడమే తప్ప అతనిని సీరియస్‌గా తీసుకోకూడదని జాతీయ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు గతంలో కలసిన నాయకులందర్నీ కలవటంతోపాటు మరికొంతమంది నాయకులను కూడా కలసి తన ‘సంఖ్యాబలం’ పెంచుకునే ఉద్దేశంలో వున్నట్టుంది. అయితే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు లభించినంత ప్రాధాన్యం జగన్‌కి లభించకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పరీక్షల్లో కాపీకొట్టి పాసవ్వొచ్చేమోగానీ, రాజకీయాల్లో కాపీకొడితే ఫెయిలవటం ఖాయమని జగన్‌కి జ్ఞానోదయం  కలిగేలా చెప్పేదెవరు?  

ఆపరేషన్ సీమాంధ్ర!

      రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మలివిడత రచ్చబండ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం పేరును ‘రచ్చబండ’ అని పెట్టేకంటే ‘ఆపరేషన్ సీమాంధ్ర’ అని పెడితే బాగుండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తనను తాను సమైక్యాంధ్ర ఛాంపియన్‌గా సీమాంధ్ర ప్రజల ముందు నిలుపుకునేందుకు తంటాలు పడుతున్న సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమాన్ని ఒక మంచి మార్గంగా ఎంచుకున్నారు.     ఈ కార్యక్రమం ద్వారా సీమాంధ్ర ప్రజలకు చేరువ అయ్యే వ్యూహరచన చేశారు. భవిష్యత్తులో తాను కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెడితే సీమాంధ్ర ప్రజలు తనకు పూర్తి మద్దతు ఇచ్చేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సీమాంధ్రుల మనసులను గెలుచుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ‘ఆపరేషన్ సీమాంధ్ర’ అనే పేరు కరెక్టేమో! అందరూ ఊహించినట్టే రచ్చబండను తన ఇమేజ్ పెంచుకోవడానికి సీఎం ఉపయోగించుకోవడం ప్రారంభించేశారు. విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికుల సమస్యల పరిష్కారం కంటే సమైక్యాంధ్ర నినాదాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, చివరి వరకు రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడతానని ప్రసంగించారు. రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలను ఏకరువు పెట్టారు. సీఎం ఇలా మాట్లాడుతూ వుంటే సీమాంధ్రుల మనసులు ఒకసారి కాకపోతే ఒకసారైనా కరగకుండా వుంటాయా అని ఆయన అనుకూల వర్గాలు ఆశాభావంతో వున్నాయి. రచ్చబండలో సమైక్య నినాదాన్ని చాటడంతోపాటు స్థానికులకు బోలెడన్ని వరాలు కూడా సీఎం ప్రకటించారు. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వాగ్దానాలు చేశారు. ఈసారి రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్ మొత్తం నాలుగు సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఈ నాలుగు జిల్లాలనూ తన ‘గ్రిప్’లోకి తెచ్చుకోవాలని కిరణ్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలివైన వాడు ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మలచుకోగలడు. ముఖ్యమంత్రి కిరణ్ వరస చూస్తుంటే ఆయన తెలివైనవాడు కాదని ఎవరైనా అనగలరా?  

ఆంటోనీని కాకాపట్టుట ఎలా?

      కేంద్ర మంత్రి ఆంటోని రాష్ట్ర విభజన మీద ఒక నివేదిక తయారుచేసి కాంగ్రెస్ హైకమాండ్‌కి ఇచ్చినట్టు వార్తలు వచ్చినట్టు తెలిసిందే. ఆంటోనీ గారు ఆంధ్రప్రదేశ్‌ ముఖం చూడకుండానే, అనారోగ్యంతో బెడ్‌రెస్ట్ తీసుకుంటూనే ఎప్పుడు విభజన సమస్యని స్టడీ చేశారోగానీ మొత్తానికి ఒక నివేదిక మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి సమర్పించారని వినిపించింది.     ఆ నివేదికలో ఉన్నాయని భావిస్తున్న అనేక అంశాలు తెలంగాణవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి. వాటిలో చాలా ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన కాలం నుంచి వర్తించేలా జీవోలు జారీ చేయకూడదన్న అంశం. ఇది తెలంగాణవాదులకు దడపుట్టేలా చేసింది. రేపు నిజంగా తెలంగాణ ఏర్పడితే భూములు తదితర అంశాల విషయంలో గడచిన కాలం నుంచి వర్తించేలా జీవోలను జారీ చేసి సీమాంధ్రుల సంగతి తేల్చాలన్న పథకం తెలంగాణ వాదుల్లో వుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో భూములు కొన్న సీమాంధ్రులను వేధించే ప్రణాళిక తెలంగాణ వాదుల్లో వుంది. జీఓఎం సమావేశం సందర్భంగా అసదుద్దీన్‌తో ఆంటోనీ తాను కాంగ్రెస్‌కి ఎలాంటి నివేదిక సమర్పించలేదని చెప్పారు. అయినా సరే ఆంటోనీ నివేదిక ఇచ్చే వుంటారని, అందులో తాము భయపడుతున్న అనేక అంశాలు వుండే వుంటాయని టీ కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. ఆంటోనీ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా తెలంగాణ బిల్లులో చేరిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రులను సాధించే అవకాశం వుండదని బాధపడుతున్నారు. తెలంగాణ వచ్చినా సీమాంధ్రుల జుట్టు తమ చేతిలోనే వుండాలని టీ కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఉందో లేదో తెలియని ఆ నివేదికలో మార్పులు చేర్పులు చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆంటోనీ సార్ని ఎలా కాకాపట్టాలో చెప్పండి మహాప్రభో అని జైపాల్‌రెడ్డిని ఆశ్రయించారు. ఈ అంశం మీదే శుక్రవారం నాడు ఢిల్లీలోని జైపాల్‌రెడ్డి నివాసంలో సమావేశమై ఆంటోనీని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశం మీద గంటలు గంటలు చర్చించారు. ఇంతకీ ఈ సమావేశంలో ఆంటోనీని బుట్టలో వేసుకునే మార్గం దొరికిందో లేదో!

బలిదేవత సోనియా!

      సోనియా భజన చేయడంలో మితిమీరిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పదవుల కోసం ఇంతలా దిగజారుతున్న టీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల్లో చులకనైపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించిన సోనియాగాంధీ మీద టీ కాంగ్రెస్ నాయకులకు అభిమానం, గౌరవం పొంగి పొర్లిపోతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో వున్నవాళ్ళందరూ సోనియాగాంధీని ఆకాశానికెత్తేస్తూ కీర్తిస్తున్నారు.   సోనియాని దేవత అంటున్నారు. కొంతమంది మరీ టూమచ్‌గా సోనియాకి తెలంగాణ వ్యాప్తంగా గుడులు కట్టాలని తీర్మానించేస్తున్నారు. సోనియా గుడుల నిర్మాణానికి స్థలాలను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుడులు కట్టదలుచుకుంటే కట్టాల్సింది సోనియా గుడులు కాదు.. నిజాం చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గుడులు కట్టాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటూ చనిపోయిన యువకుల గుడులు కట్టాలి. అంతేగాని, తెలంగాణ ప్రజల్ని అమాయకుల్ని చేసి ఆడిస్తున్న, తెలుగుజాతిని నడి రోడ్డమీద నిలబెట్టిన సోనియాగాంధీకి గుడులు కట్టాలని కోరుకోవడమేంటి? ఇది టీ కాంగ్రెస్ నాయకుల లోలోపల జీర్ణించుకుపోయిన బానిసత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళకు వాత పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు రేవంత్‌రెడ్డే కరెక్ట్. గత కొంతకాలంగా సోనియాగాంధీ గుడుల డిమాండ్‌ను పరిశీలిస్తున్న ఆయన ఒక్కసారిగా గళం విప్పారు. వందలాదిమంది తెలంగాణ యువకులు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన సోనియాగాంధీని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దేవత అని కీర్తిస్తున్నారని, ఆమె దేవత కాదని.. బలులు కోరే బలిదేవత అని విమర్శించారు.

Why Hyderabad is the bone of contention?

  Hyderabad, Hyderabad and Hyderabad!! To put it out succinctly this is what the thorny issue between Andhra Rayalaseema people and Telanagana people. Everybody knows if this particular City would not have been there, one, the issue of bifurcation would not have arisen; two, even if evolved, Andhra people would not have had any objection. But, the fact is there is Hyderabad.   A City challenging the other four metropolis of India. Keeping the big Cities of Mumbai, Kolkata, New Delhi, and Chennai on the toes, the City of Hyderabad is and was always a force to be reckoned with. The City of Hyderabad remained an important focal point in all the discussions relating to bifurcation of the state of Andhra Pradesh.   The importance of Hyderabad is such that neither of the contending parties are ready to part the same. Now, with both sides fighting a heated battle out there for atleast a slice of the City which both parties believe earnestly that it belongs to them, let us once again visit the City of Hyderabad to see what are the thorny issues or to say even glorious features that is making the division become a vexatious issue.   These are some of the issues that the writer felt as The Issues. Some may agree and some may not agree too…!!   First, a brief look into the history: · As can be seen from the historical facts the Hyderabad being capital of erstwhile Hyderabad state under the rule of Nizam recorded excellent growth. It is because of this people from different parts of the country and also from Coastal Andhra and Rayalaseema migrated to Hyderabad and other parts of Telangana long time back.   Thus by the time the state of Andhra Pradesh was formed in 1956 the city of Hyderabad already attained cosmopolitan nature in relation to those times. · As recorded by Justice Srikrishna Committee the first phase of migration to Hyderabad and Telangana started when the Nizam invited farmers from the Coastal Andhra to settle and cultivate lands under Nizam Sagar dam.   After the Hyderabad was made capital of united Andhra Pradesh this migration further increased and in 1980s during the regime of Telugu Desam large investors and businessmen migrated to Hyderabad and thereby enhanced its economic strength in due course of time.   The development of Hyderabad reached all time high during the regime of Chandrababu Naidu due to robust growth of IT and ITES industry. · Though people from all the regions of the state contributed for the present status of Hyderabad, majority of the investments came from people of Coastal Andhra, Rayalaseema, other parts of the country and foreign investors. Therefore all these groups developed an inseparable bondage with Hyderabad.   Some interesting facts: One can understand the heart burn of those affected by the bifurcation of the State decision only when one knows about certain facts relating to Hyderabad. Therefore, following facts are placed for better appreciation of the issue. ·   Greater Hyderabad Municipal Corporation (GHMC), formed in 2007. GHMC covers an area of 626 Sq.km and was formed by combining an erstwhile Municipal Corporation of Hyderabad (MCH) and another 12 municipalities. GHMC provides for civic services and necessary infrastructure. ·   The population of Hyderabad is four times larger than the second largest city in Andhra Pradesh, i.e. Visakhapatnam. · Hyderabad Metropolitan Development Authority (HMDA) covers a much larger area of 7073 sq.km. with a population of over 7 million. ·   HMDA is almost twice the size of Goa, which is only 3702 sq.km and much larger than the National Capital Territory of Delhi, which is 1483 sq. km. It is much larger than Union Territories like Chandigarh (114 sq.km) and Puduchery (492 sq.km).    There are more than 58 Research Centres that are funded / sponsored by the Central government and which were established post 1956 after the merger. The people of Seema Andhra are apprehensive that the new state, if formed will be bereft of any of these institutions and there will be a complete lack of research based institutions in the state.   The 40 Public Sector Undertakings (PSUs) including Defence and other sensitive areas which were established post 1956 after the merger. All these have come since Hyderabad is the capital of Andhra Pradesh state.   The people of Seema Andhra At least some of these would have been set up in Seemandhra if it were a separate state even earlier without getting merged. Now the Seemandhra does not have any PSU worth mentioning. It will sound very ethical if the Seemandhra people demand a fair share in some of these and ask them to relocate a portion of some of these institutions be transferred to the new state, if it is formed.   The New Delhi IIT, it is believed, has made a blue print saying that it will cost about Rs. 2.5 lakh crores to construct a Capital, if at all the AP state is bifurcated. How such huge amounts are to be provided? · As on date the Hyderabad hosts many significant institutions, · Nine educational institutions, mostly universities supported by the state government. ·   The share of modern services in Hyderabad‟s economy has increased from 24% to 39% in a relatively short period of time i.e 1999-2006.    The Hyderabad contributed about Rs. 32,000 crore out of the total earnings of Rs. 2,17,000 crore through exports of Information Technology and Information Technology Enabled Services (IT and ITES) from India in 2008-09 and this remained steady.   Out of the total Rs. 65000 crores of IT exports from Andhra Pradesh, over 63500 crores are generated only from Hyderabad as on 2012-13. A mere 1600 crores are generated in the cities of Vizag, Kakinada, Vijayawada and Tirupati. ·   The districts of Hyderabad and adjoining Rangareddy put together account for 40% of revenues from property transfers and this indicates the quantum of investments in real estate sector. · In the recent times several projects have been completed or in the process of completion in Hyderabad involving investments worth several thousands of crores of rupees. Some of the key projects are provided below. ·   The Rajiv Gandhi International Airport with current capacity of 10 million passengers and designed for an eventual capacity of 40 million passengers per annum.(Rs.2800 Crore) · The Narasimha Rao Expressway is an 11.6 km elevated Expressway connecting the Rajiv Gandhi International Airport to the city.    The Outer Ring Road, which is a 159 km ring road providing connectivity to various state and national highways and the Rajiv Gandhi International Airport (Rs.6,696 Crore). · The Hyderabad Growth Corridor initiative is a plan to develop “urban settlements”, around the Outer Ring Road. · The Hyderabad Multi-modal Transport service (MMTS) is a city train service, associated with South Central Railway.(Rs.772 Crore).   The Hyderabad Metro Rail project .The first phase envisages a route length of 72 km covering three high density traffic corridors of Hyderabad.(Rs.15,957 Crore) · More than half of the income of the State’s own revenue comes from Hyderabad and the abutting Rangareddy district. In 2012-13 out ofthe total State’s revenue of about Rs. 72,000 crores, Hyderabad and adjoining Rangareddy districts together accounted for Rs. 37,555crores through different taxes.   Now Say…… As the famous poet Sri Sri said, the labourers who have carried the stones for the construction of Tajmahal should also be honoured. If some one says that Hyderabad has been built exclusively by Telenagana people and Andhra People do not have any say in that will be hiding the facts.   ( By: *Neelayapalem Vijay Kumar*)

కనిపించుటలేదు!

      ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్ అనే ఇద్దరు రాజకీయ నాయకులు గతంలో ప్రతిరోజూ మీడియాలో కనిపించేవారు. తెలంగాణ రాదు.. సీమాంధ్రులకేం భయంలేదు.. తెలంగాణ రాకుండా చేసే సత్తా మాకు వుందని చెప్పేవారు. వీళ్ళమాటలు నమ్మి సీమాంధ్రులు దారుణంగా మోసపోయారు.   కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి మహా ఆత్రంగా పరిగెత్తుతున్న ప్రస్తుత తరుణంలో వారం పది రోజులకు ఒకసారి కూడా వీళ్ళు మీడియాలో కనిపించడం లేదు. అలాగే సీమాంధ్రలో కూడా వీళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. వీళ్ళ నియోజకవర్గాల ప్రజలకయితే అస్సలు కనిపించడం లేదు. ఈ క్రింది ఆధారాలతో వీళ్ళిద్దర్నీ గుర్తుపట్టవచ్చు. వీళ్ళలో ఉండవల్లి అనే వ్యక్తి చాలా మాటకారి. మాటలతోనే కడుపు నింపేస్తూ వుంటాడు. లాపాయింట్లు తీస్తూ వుంటాడు. అస్సలు కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వుతో వుంటాడు. ఈయన న్యూఢిల్లీలో సోనియాగాంధీ ఇల్లు, ఎఐసీసీ ఆఫీసు పరిసరాల్లో తిరుగుతూ వుండొచ్చు. అలాగే లగడపాటి రాజగోపాల్ చూడ్డానికి స్పోర్ట్స్ మాన్‌లాగా వుంటాడు.  జేబులో ఎప్పుడూ డబ్బుల కట్టలు పెట్టుకుని వుంటాడు. దేన్నయినా డబ్బుతో కొనేయొచ్చన్న ఆత్మవిశ్వాసం ముఖంలో కనిపిస్తూ వుంటుంది. ఒక్కసారి మాట్లాడ్డం మొదలుపెడితే ఎంతసేపయినా నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే వుంటాడు. ఈయన కూడా ఉండవల్లి కనిపించే ఏరియాల్లోనే కనిపించే ఛాన్సుంది. వీళ్ళిద్దరూ ఉండవల్లి, లగడపాటి అని షార్ట్ కట్ పేర్లతో పిలిస్తే పలుకుతారు. వీళ్ళు ఎవరికైనా కనిపిస్తే దయచేసి మాకు మాత్రం అప్పగించవద్దు. వాళ్ళని తీసుకెళ్ళి వేరే ఏదైనా స్టేట్‌లో వదిలేయగలరు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళవద్దని బెదిరించగలరు. వాళ్ళు కనిపించకుండా వుంటేనే మాకు హాయిగా వుంది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు రాకుండా చేసిన వాళ్ళకి మంచి బహుమతి అందించగలం. బాబూ ఉండవల్లీ, నాయనా లగడపాటీ.. మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్‌కి రాకండి. వచ్చి మా చెవుల్లో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని నమ్మి ఆల్రెడీ ఒకసారి మోసపోయాం. మమ్మల్ని మళ్ళీ మోసం చేయకండి.                                      ఇట్లు                                 సీమాంధ్ర ప్రజలు  

‘ఛీ’బీఐ ‘చీప్’

      కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల మానున్... అనే మాటను ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలుసా? సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా లాంటివాళ్ళని ఉద్దేశించే అని వుంటారు. అసలు సీబీఐ అనేది చట్టబద్ధత లేని ఒక పనికిమాలిన సంస్థ అని ఈమధ్య గౌహతి హైకోర్టు డిసైడ్ చేసింది. అలాంటి సంస్థకి కాంగ్రెస్‌ని కాకాపట్టి, భజనచేసి చీఫ్ పదవి సంపాదించుకున్న వ్యక్తి రంజిత్ సిన్హా. తాను సీబీఐ చీఫ్ పదవి చేపట్టిన దగ్గర్నుంచీ ఏలినవారు వేలెత్తి చూపించిన వారితోపాటు, తన వ్యక్తితగ విరోధులను కూడా సీబీఐ అండతో వేధిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కడుపు నిండింది.. కాలక్షేపానికో పదవి దొరికింది.. అక్కడితో అయ్యగారు ప్రశాంతంగా వుండొచ్చు కదా!     అలా వుంటే జీవితంలో థ్రిల్లు, ట్విస్టు ఏముంటాయి? కడుపు నిండిన వాళ్ళకి నోరు ఎక్కువగా పనిచేస్తుందంటారు. రంజిత్ సిన్హా విషయంలో కూడా అదే జరిగింది. ‘క్రీడల్లో నైతికత, నిజాయితీ, చట్టం అవసరం’ అనే అంశం మీద ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఈ పెద్దమనిషిని మాట్లాడమని పిలిచారు. అక్కడకి వెళ్ళిన రంజిత్ సిన్హా బెట్టింగ్ మంచిది కాదు అని ఒక్క మాట చెప్పి నోరు మూసుకుని వస్తే సరిపోయేది. తన క్రియేటివిటీని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో బెట్టింగ్‌ని, అత్యాచారాన్నీ పోలుస్తూ మాట్లాడాడు. దాంతో అయ్యగారి మాట్లాడిన తీరు మహిళలను కించపరిచేలా వుందని నిరసనలు వ్యక్తమయ్యాయి. మొదట్లో లైట్‌గా తీసుకున్న సిన్హా పరిస్థితి చెయ్యి దాటిపోతోందని అర్థం చేసుకుని ఏదో నోరుజారి, మైండ్ అదుపులో లేక, అనాలోచితంగా అలా మాట్లాడేశానే తప్ప తనకు మహిళలంటే అత్యంత గౌరవమని చెప్పాడు. అయినా వివాదం సర్దుమణగలేదు. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సావంత్ ప్రభవాల్కర్ అంటున్నారు. ఒక ఉన్నతమైన పదవిలో వుండి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రంజిత్ సిన్హా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలోకి భారతీయ జనతాపార్టీ, సీపీఎం కూడా ఎంటరయ్యారు. రంజిత్ సిన్హా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఈ రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. చీప్ కామెంట్లు చేసి ఛీ కొట్టించుకుంటున్న సీబీఐ చీఫ్ ఇప్పుడేం చేస్తారో చూడాలి.  

కిషన్‌రెడ్డి కిరికిరి!

      బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలో రూపాయంత ఆలోచన వుందిగానీ, దాంతోపాటే రూపాయి పావలా అంత ఆవేశం వుంది. పావలా ఎక్కువున్న పాపానికి ఆయన ఆలోచనని ఆవేశం డామినేట్ చేస్తోంది అదీ కిషన్‌రెడ్డితో వచ్చిన సమస్య! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని, తెలంగాణ ఇచ్చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి పెద్దగా ఆలోచన లేకపోయినప్పటికీ, విభజనవాదాన్ని బీజేపీ మెడమీద గుదిబండలా వేసింది మాత్రం కిషన్‌రెడ్డి లాంటి బీజేపీ తెలంగాణ నాయకులే!   తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వున్నాయని తెలిసినా తెలంగాణ వాదానికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితిలోకి బీజేపీ చేరుకుంది. కాంగ్రెస్ అడ్డగోలుగా తెలంగాణను విభజిస్తోందని అర్థమైపోతున్నా ఏమీ చేయాలేని స్థితిలో బీజేపీ వుంది. దీనికి కిషన్‌రెడ్డి కూడా కారణం. తెలంగాణకు మద్దతిస్తే ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తుందని, బోలెడన్ని సీట్లు వస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వంలో అతి నమ్మకం కలిగించారు. ఇప్పుడు కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక బీజేపీకి అసలు పరిస్థితి అర్థమైంది. అటు సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోవడం, ఇటు తెలంగాణలో మూలనపడటం ఖాయమని తెలుసుకుంది. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే భాగంగా బీజేపీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది. నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. అయితే ఈ పరిణామాలను కరడుగట్టిన విభజనవాది కిషన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తెలుగుదేశంతో దోస్తీకి బీజేపీ ప్రయత్నించడం లేదని వారానికి నాలుగుసార్లు ప్రకటిస్తున్నారు. అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసి ఘన విజయాలను సాధిస్తుందని చెబుతున్నారు. కిందపడ్డా నాదే పైచేయి అనే తత్వం కిషన్‌రెడ్డిలో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఇప్పుడున్న రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేది కూడా కష్టమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంతో స్నేహం కుదరబోతుంటే ఎగిరి గంతేయాలే తప్ప మోకాలు అడ్డు వేసే వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని అంటున్నారు. అయినా ఎవరికి ఏది ప్రాప్తమో అది జరగకుండా ఆగుతుందా?  

కేసీఆర్ లీల.. విలీనం గోల!

      ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... చూరులో చుట్ట కాలి ఇంకొకడు ఏడిచాడంట. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఇలాగే వుంది. ఒకపక్క రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని తెలుగుజాతి మొత్తుకుంటూ వుంటే, మరోపక్క కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనానికి సంబంధించిన డ్రామాలు ఆడుతున్నాయి. తెలుగుజాతి సమాధి మీద మరమరాలు, చిల్లరడబ్బులు ఏరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అడ్డగోలుగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిపోతుందని కాంగ్రెస్ నాయకులు భావించారు. తద్వారా రాహుల్‌బాబు ప్రధాని కావడానికి వీలవుతుందని ఆశించారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఓకే అన్న తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన విశ్వరూపం చూపించాడు. విలీనం విషయంలో దాగుడు మూతలు ఆడటం ప్రారంభించాడు.  ఆ దాగుడు మూతలు ముదిరిపోయి- ‘‘అసలు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన అవసరమే లేదు.. వచ్చే ఎన్నికలలో మా పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కే అధికారం కట్టబెట్టాలని కోరుకుంటున్నార’’ని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ గతుక్కుమంది. కేసీఆర్‌ని నమ్ముకుని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కేసీఆర్ ఇలా ప్లేటు ఫిరాయించాడేంటా అని టెన్షన్ పడిపోయింది. టెన్షన్ తగ్గిన తర్వాత తన మార్కు రాజకీయాలకు తెరతీసింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సీమాంధ్రులకు అనుకూలంగా మారిపోయినట్టు.. తెలంగాణ ఇచ్చినా విభజనవాదులకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నట్టుగా పరిస్థితులు క్రియేట్ చేసింది. విభజన ప్రక్రియని సంక్లిష్టం చేసింది. దాంతో కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లైనులోకి వచ్చాడు. కాంగ్రెస్‌ని మంచి చేసుకుని విభజనలో తెలంగాణకి ఎక్కువ మేలు జరిగి, సీమాంధ్రులకు గుండుకొట్టేలా చేయాలని ప్లాన్ వేశాడు. తన దగ్గర సిద్ధంగా వున్న విలీనం ప్రతిపాదనని మరోసారి తెరమీదకి తెచ్చాడు. కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం కాదని తాను చెప్పలేదని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత విలీనం సంగతి ఆలోచిస్తానని కాంగ్రెస్ పార్టీకి ఓ బిస్కెట్ వేశాడు. ఆ బిస్కెట్ అందుకున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద తన విశ్వాసాన్ని ఎలా చూపిస్తుందో వేచిచూడాలి.

ఆర్టీసీకి కొమ్ములున్నాయా?

      మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 45 మంది మృత్యువాత పడిన దుర్ఘటన ఇంకా కళ్ళముందు కదులుతూనే వుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌ విధానాలను, నిర్లక్ష్యాన్ని సమర్థించడం కాదుగానీ, ఆ దుర్ఘటన జరిగిన తర్వాత అందరూ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహించే వాళ్ళని విలన్ల మాదిరిగా చూశారు. ఆర్టీయే అధికారులు అయితే సడెన్‌గా వాళ్ళ డ్యూటీలు గుర్తొచ్చి రాష్ట్రవాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ నడిపే బస్సులను చెక్ చేశారు. వందలాది బస్సులను సీజ్ చేశారు. ప్రజల్ని కాపాడటం, ప్రైవేట్ బస్సుల ఆగడాలను అరికట్టడమే తమ లక్ష్యమన్నట్టు చాలా హడావిడి చేశారు. అయితే ఈ రూల్స్, చెకింగ్స్, బస్సులను సీజ్ చేయడం, కేసులు పెట్టి జైల్లో తోయడం ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి మాత్రమే వర్తింపజేస్తారా? ఆర్టీసీ బస్సులకు వర్తింపజేయరా? ఇదేనా ప్రభుత్వ చిత్తశుద్ధి? పాలెం దుర్ఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో అనేక ఆర్టీసీ బస్సులు చిన్నచిన్న ప్రమాదాలకు గురయ్యాయి. రెండు మూడు ప్రాణాలు కూడా పోయాయి. వాటి గురించి పట్టించుకున్నవాళ్ళే లేరు. మంగళవారం రాత్రి నల్గొండ జిల్లా చింతపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు లగేజీ బాక్సులో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి మంటలను గుర్తించి ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ ఈ ప్రమాదంలో జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? ప్రైవేట్ బస్సులను ఉద్యమంలా తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు ఒక్క ఆర్టీసీ బస్సునైనా తనిఖీ చేసిన పాపాన పోయారా? రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఆర్టీసీ డొక్కు బస్సులు తిరుగుతున్నాయి. వాటి కండీషన్ మీద ఆర్టీఏ అధికారులెవరైనా ఆర్టీసీని ప్రశ్నించిన దాఖలాలున్నాయా?  రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీలు చేస్తుంటారు. ఇలా ఆర్టీసీ బస్సులను ఆపి ఏనాడైనా తనిఖీ చేశారా? ఆర్టీసీ బస్సులు పూర్తి సురక్షితంగా వుంటాయని, వాటికి అస్సలు ప్రమాదాలు జరగవని, వాటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులకు ఎవరైనా సర్టిఫికెట్ రాసిచ్చారా? మొత్తమ్మీద ఈ మొత్తుకోవడం వెనుక ఉన్న బాధ ఏమిటంటే, ప్రైవేట్ బస్సుల మీద ఎలాంటి రూల్స్ ప్రయోగిస్తున్నారో  ఆర్టీసీ బస్సుల మీద కూడా అవే రూల్స్ ప్రయోగించాలి. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి.  

జైపాల్‌కి టీ కాంగ్రెస్ నై!!

      ఆలూలేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అనేది ఓ పాత సామెత. ఆ సామెత తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అతికినట్టు సరిపోతుంది. ఇంకా తెలంగాణ రానేలేదు. తెలంగాణ వస్తుందో రాదో ఇచ్చేస్తున్నాం అని ప్రకటించిన కాంగ్రెస్ వాళ్ళకి కూడా కూడా తెలియడం లేదు. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు గురించి నానా టెన్షన్లూ పడుతున్నారు. కాస్తంత పెద్ద గొంతుతో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్క నాయకుడూ నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని కలలు కంటున్నారు. అయితే అందరి కలలమీదా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కడవలకొద్దీ నీళ్ళు కుమ్మరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు జైపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి’’ అనే వార్తలు ఢిల్లీ స్థాయిలో  వినిపిస్తున్నాయి. ఆ వార్తలు చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ఆవేదన కలిగిస్తున్నాయి. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు తామంతా తంటాలు పడి తెలంగాణ కోసం నానా హడావిడి చేస్తే ఫలితాన్ని మాత్రం నిన్నగాక మొన్న రంగంలోకి వచ్చిన జైపాల్‌రెడ్డి సొంతం చేసుకుంటున్నారని బాధపడుతున్నారు. స్వతహాగా సమైక్యవాది అయిన జైపాల్‌రెడ్డి మూడు నాలుగు నెలల క్రితం వరకు తాను విభజనవాదినని ఎక్కడా బయటపడలేదు. ఈమధ్యకాలంలోనే ఆయన రాష్ట్రాన్ని విభజించాలనే డిమాండ్ నెత్తికి ఎత్తుకున్నారు. రాజకీయాల్లో సీనియర్ కావచ్చేమోగానీ, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడంలో తమకంటే చాలా జూనియర్ అయిన జైపాల్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం సీటును ఎగరేసుకుపోవాలని కోరుకోవడం అన్యాయమని చాలామంది తె.కాం. నాయకులు లోలోపల ఆక్రోశిస్తున్నారు. తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్న జానారెడ్డి మొదలుకుని షబ్బీర్ అలీ వరకూ అందరూ జైపాల్‌రెడ్డి ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నారు. జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నారు. అధిష్ఠానం దగ్గర జైపాల్‌కి నై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అవసరమైతే తామంతా ఒక్కటై తమలో ఒకరిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసి జైపాల్‌రెడ్డికి చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు.