కాంగ్రెస్ బండారం బయట పెడతా: లగడపాటి
posted on Oct 15, 2013 @ 5:06PM
సీమంధ్ర కాంగ్రెస్ యంపీలలో కేవలం లగడపాటి రాజగోపాల్ మాత్రమే పట్టువదలని విక్రమార్కుడిలా తన రాజీనామా ఆమోదం కొరకు స్పీకర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మంగళవారంనాడు కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళిన ఆయన అక్కడ స్పీకర్ కనబడకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె ఎక్కడ ఉన్నావెళ్లి కలిసి తన రాజీనామాను ఆమోదింపజేసుకొంటానని అన్నారు.
వేరే పార్టీలకి చెందిన యంపీలు రాజీనామాలు సమర్పిస్తే 24గంటలలోనే ఆమోదం తెలిపే స్పీకర్ తమ రాజీనామాలను రెండు నెలలయినా ఆమోదించకపోవడం చాలా బాధ, ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు సంక్లిష్టమయిన రాష్ట్రవిభజనను చెప్పట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్ద్యేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను కానీ, 25మంది యంపీలను గానీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం వేరేవారి భరోసాతోనో రాష్ట్ర విభజనకు సిద్దపడటం చూస్తే, ఇంత కాలం పార్టీని నమ్ముకొని సేవ చేసిన తమకు అధిష్టానం దృష్టిలో ఏమాత్రం విలువ, గౌరవం లేదని అర్ధం అవుతోందని అన్నారు. అటువంటప్పుడు పార్టీలో కొనసాగడం కూడా అనసరమని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందిన రాష్ట్ర విభజన కోసం తమ పార్టీ ఎవరెవరితో సంబందాలు పెట్టుకొన్నదీ బహిర్గతం చేస్తానని అన్నారు.
మరో యంపీ రాయపాటి మాట్లాడుతూ తను కూడా స్పీకర్ ను త్వరలో కలిసి రాజీనామా ఆమోదింపజేసుకొంటానని అన్నారు. యంపీ హర్షకుమార్ మాట్లాడుతూ తాము వ్యక్తిగతంగా స్పీకర్ ను కలిసి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించినప్పటికీ వాటిని ఆమోదించకుండా పక్కన బెట్టడం చాలా అనుచితమని అన్నారు. అవసరమయితే మరో మారు డిల్లీ వెళ్లి స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకొంటానని ఆయన అన్నారు.
వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరి మాత్రం తను తన యంపీ పదవికి రాజీనామా చేయదలచుకోలేదని, లోక్ సభలో తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేయడానికి యంపీగా కొనసాగాలని తను భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె రాష్ట్ర విభజన అనివార్యమని అందువల్ల ఇక సమైక్యంద్రా గురించి మాట్లాడుతూ ప్రజలను ఇంకా మభ్యపెట్టే బదులు, సీమాంధ్ర ప్రాంతానికి, ప్రజలకి రాష్ట్ర విభజన సందర్భంగా న్యాయం జరిగేందుకు ఏమి చేయాలో ఆలోచిస్తే బాగుటుందని అన్నారు.
అయితే ఆమె సూచించిన సలహాకు ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్ధులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని గట్టిగా చెపుతున్న ఆమె రాబోయే ఎన్నికలలో వైజాగ్ నుండి గెలవడం కల్ల అని వారు హెచ్చరించారు. అంతే గాక ఆమె దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసారు.
స్పీకర్ కార్యాలయం మాత్రం యంపీలు రాజినామాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం లేదా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనే అంశాలు పూర్తిగా స్పీకర్ విచక్షణాదికారాలపై ఆధారపడి ఉంటాయని అందువల్ల స్పీకర్ ను ఎవరూ రాజినామాలకై ఒత్తిడి చేయలేరని నిర్ద్వందంగా ప్రకటించిది. అంటే ఇప్పటికే బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు, వేరే ఇతర పార్టీల నుండి మద్దతు సంపాదించుకోనేవరకు సీమాంధ్ర యంపీల రాజీనామాలు ఆమోదించకపోవచ్చునేమో.