కాంగ్రెస్ నేతలా మజాకా

 

ఎవరయినా కాంగ్రెస్ పార్టీలో జేరారంటేనే వారు సహజంగా చాల తెలివనవారని అర్ధం. అయితే తెలంగాణా కాంగ్రెస్ నేతల కంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మరో రెండాకులు ఎక్కువే చదివారని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో వారి డ్రామా ముగుస్తుందని అక్కడి నేతలకి, ప్రజలకీ కూడా స్పష్టంగా తెలుసు. ముగింపులో సస్పెన్స్ కూడా ఏమీ ఉండదు. ఆ డ్రామాని పాపం వారు చాలా వ్యయప్రాయసలకోర్చి విజయవంతంగా పూర్తి చేసారు.

 

కానీ ఆ డ్రామాను అందిపుచ్చుకొన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఈ డ్రామా ముగింపు వేరే విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, అదేమి తెలియనట్లు చాలా అద్భుతంగా, అమాయకంగా టీ- నేతల కంటే కూడా చాలా బాగా నటించేస్తూ, ఎవరూ ఊహించని కొత్త మలుపులు ఇస్తూ, డ్రామాని మంచి రక్తి కట్టిస్తున్నారు. అది ఎలాగో చూద్దాము.

 

తమ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నందుకు ప్రజలు తమను తిట్టక మునుపే, వారే తమను తాము, తమ పార్టీని తిట్టుకొంటూ, ఇక తమని, తమ పార్టీని తిట్టే అవకాశం ప్రజలకి ఇవ్వరు. ఇక వచ్చే ఎన్నికలలో ఓడిస్తామని ప్రజల చెప్పవలసిన మాటలని, వారి కంటే ముందే సీమంధ్ర కాంగ్రెస్ నేతలే చెపుకొంటారు. వాళ్ళని, వాళ్ళ పార్టీని వాళ్ళే తిట్టుకొంటూ, మేము ఓడిపోతామని వాళ్ళకి వాళ్ళే శాపనార్ధాలు పెట్టుకొంటూ తిరుగుతుంటే, ఇక వారినేమనాలో తెలియక ప్రజలు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.

 

ప్రజల నుండి తమను తాము కాపాడుకొనేందుకు వారు కనిపెట్టిన ఈ గొప్ప విరుగుడు మంత్రం ప్రభావంతో హిప్నటయిజ్ అయిపోయిన ప్రజలు “వాళ్ళని మనం నమ్ముకొంటే, వాళ్ళు వాళ్ళ పార్టీని నమ్ముకొన్నారు. కానీ వాళ్ళని వాళ్ళ పార్టీయే మోసం చేసింది. పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు?” అంటూ వారిని కోపగించుకోవడానికి వచ్చి, వారి పట్ల సానుభూతి చూపడం మొదలుపెడుతున్నారు కూడా.

 

ఇక మరి కొందరు నేతలు “రాష్ట్రాన్ని చీల్చిన మా పార్టీలో ఇక ఎట్టి పరిస్థితుల్లో కొనసాగలేము. మేము బాగా హార్ట్ అయిపోయాము,” అంటూ సమైక్యవాదం వినిపిస్తున్న వైకాపాలోకి దూకి తమని తాము కాపాడుకొంటున్నారు.

 

కుల సమీకరణాలు లేదా వేరే ఇతర కారణాల చేత ఆ పార్టీలోకి దూకలేని వారు కొందరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యహస్తం పట్టుకొని కొత్త సమైక్యపార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల వైతరిణిని దాటాలని ఆలోచిస్తుంటే, మరి కొందరు నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతూ సోనియమ్మ హస్తం పట్టుకొని ఈ గండం గట్టేకాలని ప్రయత్నిస్తున్నారు.

 

కాంగ్రెస్ నేతలు పార్టీలు మారినా,మారకున్నా, అభిప్రాయలు మార్చుకొన్నా, కొనకపోయినా, అధిష్టానాన్ని తిట్టిన్నా, పొగిడినా అన్నిటి పరమార్ధం ఒక్కటే. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవడం. పాత చొక్కా విప్పి కొత్త చొక్కా తొడుకొన్నంత మాత్రాన్న అందులో మనిషి మారిపోడు. అతని ఆలోచనలు మారిపోవు. అలాగే కాంగ్రెస్ నేతలు ఏ రంగు కండువా కప్పుకొని తిరిగినా, ఏ మాటలు మాట్లాడినా వారు కాంగ్రెస్ నేతలు కాకపోరు. వారి ద్యేయం రానున్న ఎన్నికలలో గెలవడమే తప్ప సమైక్యము కాదు ఏ గుడ్డూ కాదు.