పార్లమెంటరీ బోర్డు నుండి అద్వానీకి ఉద్వాసన

  భారతీయ పార్టీకి  లాల్ కృష్ణ అద్వానీ భీష్మాచార్యుడు వంటివారు. బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ మొట్టమొదటిసారిగా కేంద్రంలో అధికారం రావడానికి ఆయన కృషి, పట్టుదల, శక్తి యుక్తుల వలనే సాధ్యమయిందని చెప్పకతప్పదు. కానీ నరేంద్ర మోడీ ప్రవేశంతో క్రమంగా ఆయన ప్రాభవం తగ్గుతూ వస్తోంది. తగ్గుతూ వస్తోంది అని చెప్పడం కంటే తగ్గించబడుతోందని చెప్పడమే భావ్యం.   అందరూ ఊహించినట్లే మోడీ క్రమంగా పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన అదుపాజ్ఞలలోకి తెచ్చుకొంటూ, ముఖ్యమయిన స్థానాలలో తనకు అనుకూలమయిన వ్యక్తులను నియమించుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే మంత్రులందరినీ తన చెప్పు చేతలలో ఉంచుకొన్న ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి వర్గంలోకి తీసుకొని, ఆయన స్థానంలో తనకు అత్యంత నమ్మకస్తుడయిన అమిత్ షాను నియమించుకోవడం ద్వారా పార్టీపై కూడా పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాలు చేయడం ఆయన దూరాలోచనకు ఒక నిదర్శనం.   తన అనుచరుడు అమిత్ షాను పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టిన మోడీ తరువాత ఆయనకీ పార్టీలో అత్యున్నతమయిన పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టారు. తనకు వ్యతిరేఖులు లేదా తాను వ్యతిరేఖించే వారినందరినీ చాలా తెలివిగా అడ్డు తొలగించుకొనే అలవాటున్న మోడీ, అమిత్ షా ద్వారా పార్టీలో త్రిమూర్తులుగా చెప్పుకోబడే అద్వానీ, వాజ్ పేయి, మురళీ మనోహర్ జోషీలను పార్టీ పార్లమెంటరీ బోర్డు నుండి తప్పించి, వారిని కొత్తగా సృష్టించిన ‘మార్గదర్శక్ మండల్లో’కి మార్చారు. అంటే ఇకపై పార్టీ కీలక నిర్ణయాలలో వారి ముగ్గురి ప్రమేయం, ప్రభావం ఏమాత్రం ఉండబోదని, కేవలం సలహాలు మాత్రమే ఇస్తారని అర్ధమవుతోంది. ఇన్ని కీలక నిర్ణయాలు తీసుకొని చకచకా అమలు చేసేస్తున్న మోడీకి ఇక వారిచ్చే సలహా ఏముంటుంది? ఇచ్చినా ఆయన పాటిస్తారని ఎవరు భావిస్తారు.   వృదాప్యం వలన వాజ్ పేయి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గనుక ఈ మార్పుల వలన ఆయనకు వచ్చే నష్టం కష్టం ఏమీ ఉండబోదు. కానీ, నేటికీ పార్టీలో లేదా ప్రభుత్వంలో గానీ కీలక బాధ్యతలు నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు మోడీ ఈవిధంగా స్వచ్చంద పదవీ విరమణ చేయించడం వారిరువురికీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ కొత్త నీరు వచ్చి చేరితే పాత నీరు బయటకిపోక తప్పదు కదా!

తుమ్మల పార్టీ మారేది డౌటే?

  ఖమ్మం జిల్లాకి చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాలలో బాగా వ్యాపించి వున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని గత కొన్ని నెలల నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడా పుకార్లు తీవ్రమయ్యాయి. ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమన్నట్టుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఖమ్మం జిల్లాలో మరో తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావుతో వచ్చిన విభేదాల కారణంగా తుమ్మల టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విభేదాల కారణంగానే గత ఎన్నికలలో ఇద్దరు నాయకులూ ఓడిపోయారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మారాలన్న ఉద్దేశం గతంలో తుమ్మలలో ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ మారే ఉద్దేశాన్ని విరమించుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయన ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన అనారోగ్యానికి గురైయ్యారన్న వార్తను తెలుసుకుని ముందుగా స్పందించింది తెలుగుదేశం పార్టీనే. సాంకేతికంగా తుమ్మల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీలో ఆయనతో సన్నిహితంగా వుండే ఆంధ్రప్రదేశ్ నాయకులు వెంటనే స్పందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి మొదట ఆస్పత్రికి వెళ్ళి తుమ్మలను పరామర్శించారు. ఆ స్పత్రిలో తుమ్మలతో చాలాసేపు గడిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆస్పత్రికి వెళ్ళి తుమ్మలను పరామర్శించడంతోపాటు ఆయనకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా తుమ్మలను పరామర్శించారు. ఇంకా పలువురు నాయకులు తుమ్మల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇవన్నీ తుమ్మలలో కొంత మార్పును తెచ్చినట్టుగా తెలుస్తోంది. తాను పార్టీ మారబోతున్నానని తెలిసినప్పటికీ తనను తమ మనిషిలా భావిస్తూ పరామర్శిస్తున్న తెలుగుదేశం నాయకుల తీరు ఆయన్ని కదిలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే విషయాన్ని పునరాలోచిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇంకా ఎంతకాలం ఆ రెండు ఛానళ్ళపై నిషేధం?

  గత మూడు నెలలుగా తెలంగాణాలో ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛాన్నళ్లపై నిషేధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఇతర మీడియా, హైకోర్టు అన్నీ కూడా నిషేధాన్ని ఎత్తివేయమని కోరిణా ఫలితం లేకపోయింది. చివరికి కేంద్ర సంచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలంగాణా యం.యస్.ఓ.లకు ఇచ్చిన వారం రోజుల గడువు పూర్తయ్యి పదిహేను రోజులవుతోంది. కానీ ఆ రెండు న్యూస్ చానళ్ళపై నేటికీ నిషేధం కొనసాగుతూనే ఉంది. అందరి ఖండనల తంతు పూర్తయిపోయింది. తెలంగాణా కాంగ్రెస్ మేధోమధన సదస్సుకు విచ్చేసిన దిగ్విజయ్ సింగ్ కూడా పనిలోపనిగా మీడియాపై నిషేధాన్ని ఖండించి పడేసి, వాటికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. అయితే కేంద్రమంత్రి జవదేకర్ హెచ్చరికలనే బేఖాతరు చేసిన తెలంగాణా యం.యస్.ఓ.లు, కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తులను పట్టించుకొంటారను కోవడం అత్యాశే అవుతుంది. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే ఆ నిషేధం శాశ్వితమయ్యేలా ఉంది. మీడియాపై ఇటువంటి నిషేధం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు.

జగన్‌ని దువ్వుతున్న కాంగ్రెస్

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో అడ్డంగా ఆరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే తిరిగి ఎప్పటికీ వెలగడానికి వీల్లేని విధంగా ఆరిపోయింది. అధికారం కోల్పోయి మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్నవాళ్ళే లేరు. చరిత్రలో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పాలించిందన్న విషయం కూడా జనం గుర్తు చేసుకోవడం లేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన వచ్చిందంటే, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకోవడానికి తప్ప మరొకందుకు కాదు.   చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారం చచ్చినా ఆంధ్రప్రదేశ్ మీద ఆశ చావలేదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అధికారం సాధించాలని కలలు కంటోంది. ఆ కలలను నిజం చేసుకోవడం కోసం అయిదేళ్ళ ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఘోర పరాజయంతో కుక్కినపేనుల్లా పడి వున్న నాయకులు అడపాడదపా బురదపాముల్లా తలలెత్తి తెలుగుదేశం పార్టీ మీద ఓసారి బుస్సుమని మళ్ళీ మన్నుతిన్న పాముల్లా వుండిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి తామెంత గొంతు చించుకుని అరిచినా ప్రజలు పట్టించుకోని తెలిసినా తన విఫల ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.   ఇన్ని విఫల యత్నాలు ఎందుకని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఐడియా వచ్చింది. తమ పార్టీ దత్తపుత్రుడు జగన్ ఉండగా తమకెందుకు టెన్షన్ అనుకున్నట్టుంది. అందుకే జగన్‌ని దువ్వే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాల్లో భాగమే మొన్న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌ వచ్చినప్పడు కాంగ్రెస్ సమావేశంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని విపరీతంగా పొగడ్డం. మొన్నటి వరకూ రాజశేఖరరెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సడెన్‌గా వైస్సార్ భజన మొదలు పెట్టడానికి గల ప్రధాన కారణం జగన్‌ అండతో ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకే బీజేపీకి తెలంగాణాలో నో ఎంట్రీ

  అందుకే బీజేపీకి తెలంగాణాలో నో ఎంట్రీ తెలంగాణాలో తనకు వేరే ఏ పార్టీ నుండి పోటీ ఉండకూడదనే తెరాస కోరిక గురించి అందరికీ తెలిసిందే. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు కనుక, అందుకు వేరే మార్గం ఏదో ఆలోచించవలసి వస్తుంది. అందుకే తెదేపాపై ఆంద్ర పార్టీ ముద్ర, కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణా వ్యతిరేఖ ముద్రవేసి తెరాస వాటిని ఎన్నికలలో ఓడించగలిగింది. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడు కూడా తెరాసకు చివరి నిమిషం వరకు కూడా ముచ్చెమటలు పట్టించిన విషయాన్ని ఎవరూ కాదనలేరు.   ఎన్నికల తరువాత తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తానని ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అదేమాట చెప్పారు. ఆ తరువాత తెదేపా, బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ తమ రెండు పార్టీల మధ్య స్నేహం ఇక ముందు కూడా ఇదేవిధంగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అలాగ చెప్పడమే కాక మెదక్ ఉప ఎన్నికలలో ఒకవేళ బీజేపీ తన అభ్యర్ధిని నిలిపినట్లయితే మద్దతు ఇస్తామని తెదేపా అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణాలో తమ పార్టీకి పోటీయే ఉండకూడదని భావిస్తున్న తెరాసకు ఇది జీర్ణించుకోవడం కష్టమే.   బహుశః అందుకే తెలంగాణా హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి మాట్లాడుతూ, తెదేపా, బీజేపీలకు తెలంగాణాలో స్థానం లేదని ప్రకటించారు. ఆయన తెదేపాకు ఆంద్ర పార్టీ ముద్ర తగిలించగలిగారు. కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీకి అటువంటి ముద్ర తగిలించడం సాధ్యం కాదు కనుక, దానిని పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడంతో ముడిపెట్టి, అటువంటి పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని నాయిని వారు ఒక సరికొత్త వాదన అందుకొన్నారు. ఆంధ్రాలో కలిపిన ఆ ఏడూ మండలాలను తిరిగి తెలంగాణాకు అప్పగించేవరకు బీజేపీకి తెలంగాణాలో స్థానం లేదని ప్రకటించారు. అదెలాగు సాధ్యం ఇప్పుడు కాదు కనుక ఇక బీజేపీకి కూడా తెలంగాణాలో అడుగుపెట్టే వీలులేదని నాయిని వారి అభిప్రాయం, కోరిక కూడా.   అయితే ఆయన రెండు విషయాలు మరిచిపోయారు. ఆ ఏడూ మండలాలు ఆంధ్రాకు చెందినవి కనుకనే అక్కడ సర్వే నిర్వహించలేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పిన సంగతి నాయిని వారి దృష్టికి వచ్చినట్లు లేదు. ఇక అందరికీ తెలిసిన మరో విషయం ఏమిటంటే పోలవరం ముంపు ప్రాంతలను ఆంధ్రాలో కలుపుతూ గత యూపీయే ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఎన్డీయే అమలు చేసింది. దానికి పార్లమెంటు ఆమోదముద్ర కూడా వేసింది. అటువంటప్పుడు ఇప్పుడు నాయిని వారు మళ్ళీ ఆ ముంపు గ్రామాలను తెలంగాణాకు అప్పజెప్పాలని, లేకపోతే బీజేపీకి తెలంగాణాలో స్థానం లేదని వాదించడం హాస్యాస్పదమే.   అయినా మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు లేవు. అప్పటికి తెలంగాణాలో రాజకీయ పార్టీల బలాబలాలు, సమీకరణాలు, పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. అటువంటప్పుడు ఇప్పటి నుండే ఇతర పార్టీలకు తెలంగాణాలో ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టడం వలన ఉపయోగం ఏమిటి? ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెరాస ఆ పని చేసినా, కాంగ్రెస్, తెదేపా-బీజేపీలు మూడు కలిసి తెరాసకు ముచ్చెమటలు పట్టించాయి కదా? ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా తెరాసయే మళ్ళీ అధికారంలోకి రావాలంటే, ప్రజలకు వాగ్దానం చేసిన ప్రకారం రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తే అప్పుడు ప్రజలే ఇతర పార్టీలకు తెలంగాణాలో ‘నో ఎంట్రీ’ బోర్డు పెడతారు. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గుజరాత్ లో నిరూపించి చూపారు కూడా.

కాగ్ పై కూడా రాజకీయ ఒత్తిళ్ళు?

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ చాలలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. కానీ ఆ కారణంగా ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీని అవినీతి భూతం ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంది. అయితే ఈ విమర్శలన్నీ ప్రతిపక్షాలు కాక, కాంగ్రెస్ పార్టీకే చెందినవారు, యూపీయే ప్రభుత్వంలో ఉన్నత పదవులు నిర్వహించినవారు చేయడంతో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఉదారణకు యూపీయే హయాంలో బొగ్గుశాఖ మాజీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన పీ.సి.ఫారెక్ కోల్ గేట్ (బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం)లో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ప్రేక్షక పాత్ర వహించడం ద్వారా అవినీతికి ఆమోదం తెలిపారని విమర్శించారు.   డా. మన్మోహన్ సింగుకి మీడియా సలహాదారుగా సంజయ్ బారు, మాజీ కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్ ఇరువురు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. కొద్ది రోజుల క్రితం ప్రెస్ ట్రస్ట్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మన సుప్రీం న్యాయ వ్యవస్థకూడా రాజకీయ ఒత్తిళ్లకు కొంగి, అవినీతిపరులకు పదవులు, పదోన్నతులు కల్పించిందని ఆరోపించారు. అప్పుడు కేంద్రప్రభుత్వం మేల్కొని సుప్రీం కోర్టు కోలీజియం వ్యవస్థను పునర్ వ్యవస్థీకరణ చేసారు.   ఇప్పుడు కొత్తగా యూపీయే హయంలో కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గా పనిచేసిన వినోద్ రాయ్ కూడా కోల్ గేట్ మరియు కామన్ వెల్త్ గేమ్స్ స్కాముల నుండి కొందరు కాంగ్రెస్ నేతల పేర్లను తొలగించమని కోరేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు తనపై ఒత్తిడి చేసారని ఆయన తెలిపారు. తను వ్రాసిన ‘నాట్ జస్ట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం వచ్చేనెల 15న మార్కెట్ లోకి విడుదల కానుందని ఆయన తెలిపారు. అందులో ఆయన తన అనుభవాలను, కాంగ్రెస్ పార్టీ పాల్పడిన అవక తవకల గురించి వివరించినట్లు సమాచారం. అందువల్ల ఆ పుస్తకం విడుదలయినట్లయితే ఇటువంటివే మరిన్ని అవినీతి భాగోతాలు బయటపడే అవకాశం ఉంది. అదేజరిగినట్లయితే ఇప్పటికే తీవ్ర అప్రతిష్టపాలయిన కాంగ్రెస్ పార్టీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోవడం ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీ పరువుపోతే దానిని మళ్ళీ ఏదో విధంగా ఎప్పుడో అప్పుడు సంపాదించుకోవచ్చును. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని విలువయిన దేశ సంపదను కొందరు నేతలకు, పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా దోచిపెట్టినందుకు ఎటువంటి శిక్ష పడకపోవడం, కనీసం వారి నుండి నష్టపరిహారం వసూలుచేయకపోవడం చూస్తే, ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా కూడా అవినీతికి పాల్పడినవారు ఎన్నికలలో ఓడిపోయినట్లయితే అన్ని తప్పులు క్షమించబడిపోతాయన్నట్లుంది.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చర్యలు మొదలుపెట్టిందిట!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో రాష్ట్రానికి చాలా హామీలు ఇవ్వబడ్డాయి. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వాటిలో ఒక్క హామీపై కూడా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో బాటు విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలనీ ఖచ్చితంగా నెరవేరుస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చాలాసార్లు చెప్పారు. కానీ ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వనేలేదు.   ప్రస్తుతం వైజాగులో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వీటన్నిటిపై కొంత స్పష్టత ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ వైజాగు నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిదారు ఏర్పాటుకు, కాకినాడలో హార్డ్ వేర్ పార్క్, చిత్తూరులో ఉద్యానవన కేంద్రం, విశాఖలో ఐటీ హబ్ ల ఏర్పాటుకు కేంద్రం అవసరమయిన ప్రక్రియలు మొదలుపెట్టిందని, త్వరలోనే ఒక్కొకటిగా అవ్వన్నీ అమలుచేయడం మొదలుపెడతామని తెలిపారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం గురించి ప్రస్తావిస్తూ, ప్లానింగ్ కమీషన్లో అందుకోసమే ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసామని, ఆ కమిటీ ఆంద్రకు చెందిన తెదేపా, బీజేపీ యంపీలతో ఈ నెల25న సమావేశం కాబోతోందని తెలిపారు. ఆ సమావేశంలో వెనుకబడిన ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు అవసరమయిన ప్యాకేజీలు, పరిశ్రమల గురించి చర్చిస్తారని ఆమె తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాలకు ప్రత్యేక హోదా కేటాయించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.   ఇక రాజమండ్రీలో ఆహార సంబందిత పరిశ్రమలు నెలకొల్పేందుకు, తను ఆహారశాఖా మంత్రిని పర్యటనకు ఆహ్వానించానని, త్వరలోనే ఆమె పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని, ఆమె పర్యటించిన తరువాత రాజమండ్రీ చుట్టుపక్కల అనేక ఆహార సంబందిత పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే తనకు కూడా చాలా బాధ కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ కోడలిగా, రాజ్యసభ సభ్యురాలిగా తను రాష్ట్రానికి చేయగలిగినంతా సహాయం చేస్తానని ఆమె అన్నారు. కేంద్రమంత్రులు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, యంపీలు, కేంద్రమంత్రులు కూడా కేంద్రంపై హామీల అమలుకు ఒత్తిడి తేగలిగితే హామీల ఆచరణకు కేంద్రం కూడా ఆసక్తి చూపుతుంది.

తెరాసలోకి వెళ్లేందుకు తుమ్మల రెడీ?

  తెరాసలోకి వెళ్లేందుకు ఊగిసలాడుతున్న ఖమ్మం జిల్లా సీనియర్ తెదేపా నేత తుమ్మలనాగేశ్వర రావు, అందుకు రంగం సిద్దం చేసుకొన్నట్లు కనబడుతోంది. ఈరోజు జిల్లాలో సత్తుపల్లి ఊళ్ళో ఆయనను తెరాసలోకి ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలిసాయి. అవి తెరాస కార్యకర్తలు పెట్టిన పోస్టర్లే అయినప్పటికీ, ఆయన సమ్మతి లేనిదే పోస్టర్లు వెలుస్తాయా? వెలిస్తే వాటిని వెంటనే తొలగించేందుకు లేదా ఆ చర్యలను ఖండించకుండా ఎందుకు ఉన్నారనే ప్రశ్న తలెత్తుతుంది. కొద్దిరోజుల క్రితం తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మండవ వెంకటేశ్వరరావు ఆయనను వద్దకు చంద్రబాబు నాయుడు తరపున రాయబారం చేసినప్పుడు, ఆయన పార్టీలో తనకెదురవుతున్న సమస్యల గురించి చెప్పి తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. పార్టీని వీడబోనని ఆయన ఖచ్చితంగా హామీ ఇవ్వలేదు కానీ ఇప్పట్లో పార్టీని వీడబోనని చెప్పడం గమనిస్తే, ఆయన త్వరలోనే పార్టీని వీడి తెరాసలో చేరేందుకు నిర్ణయించుకొన్నట్లే స్పష్టం అవుతోంది. బహుశః ఆ కారణంగానే ఈరోజు ఆయనను తెరాసలోకి ఆహ్వానిస్తూ సత్తుపల్లిలో పోస్టర్లు వెలిసి ఉండవచ్చును. తాజా సమాచారం ఏమిటంటే ఆయన ఈరోజు ఉదయం అనారోగ్యానికి గురవడంతో హైదరాబాదులో గల యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తెదేపా నేతలు కే.ఈ. కృష్ణ మూర్తి తదితరులు ఆయనను పరామర్శించారు.

మెదక్: సీటు ఒక్కటే.. కర్చీఫ్‌లు బోలెడు..

  కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో పార్టీల్లో పాతకాపులుగా వున్నవారితోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం.   కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ స్థానం నుంచి పోటీ చేయడానికి దాదాపు ఓ డజనుమందికి పైగా ఉవ్విళ్ళూరుతున్నారు. గత ఎన్నికలలో కేసీఆర్ చేతిలో ఓడిపోయిన శ్రవణ్ కుమార్ ఈసారి కూడా తనకు టిక్కెట్ ఇస్తే సత్తా చూపిస్తానంటున్నారు. అలాగే అందోల్ నుంచి చతికిలపడిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ కూడా మెదక్‌లో గర్జిస్తానంటున్నారు. టీ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌ని రంగంలో నిలిపితే ఎలా వుంటుందన్న ఆలోచన కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు చేస్తున్నాయి. ఇక తాజాగా మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన జగ్గారెడ్డి మెదక్ సీటు నా జాగీర్ అన్నట్టుగా వున్నారు. ఇక పెద్దాయన జైపాల్ రెడ్డి అయితే అధిష్ఠానం తనను పిలిచిమరీ మెదక్ టిక్కెట్ ఇస్తుందన్న భరోసాలో వున్నారు. ఇక పేర్లు రాస్తే పెద్ద చాంతాడంత లిస్టు అయ్యేంతమంది కాంగ్రెస్ పార్టీలో మెదక్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు.   ఇక టీఆర్ఎస్ నుంచి ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ మెదక్ సీటు మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తనతో కలసి ఉద్యమం చేసిన స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్ ఎంచక్కా అసెంబ్లీలో సెటిలైపోయారు. తాను మాత్రం ఇంకా పదవి కోసం చకోర పక్షిలా చూస్తున్నానన్న ఆవేదనలో వున్నారు. కేసీఆర్ తనకు పిలిచిమరీ మెదక్ సీటు ఇస్తారన్న ఆశల్లో వున్నారు. అలాగే ఒక ట్రావెల్స్ అధినేత, ఒక నిర్మాణ సంస్థ అధినేత కూడా మెదక్ సీటు మీద కన్నేసి తమకున్న అర్థబలంతో ఆ సీటును సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నట్టు సమాచారం. మల్కాజిగిరిలో పోటీచేసిన మైనపల్లి హనుమంతరావు కూడా మెదక్ సీటు మీద ఆశలు పెట్టుకున్నారట. కోదండరామ్‌కి కాంగ్రెసోళ్ళు పిలిచి మెదక్ సీటు ఇచ్చేదేంటి.. మనమే ఇస్తే ఓ పని అయిపోతుంది కదా అని టీఆర్ఎస్‌లో కొంతమంది అనుకుంటున్నారట.   ఇప్పుడు బీజేపీ కూడా మెదక్ సీటు గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది. మొన్నటి వరకూ జగ్గారెడ్డి బీజేపీలోకి వస్తారు.. మెదక్ సీటు నుంచి పోటీ చేస్తారు అనే ఊహాగానాలు వినిపించాయి. జగ్గారెడ్డికి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని కూడా ప్రచారం జరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మెదక్ సీటు నుంచి ఎవరో అల్లాటప్పా అభ్యర్థిని నిలబెట్టడం కంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డినే నిలబెడితే తప్పకుండా తెలుస్తామన్న అభిప్రాయాలు బీజేపీలో వున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా మెదక్ స్థానాన్ని ఎలాగైనా సరే బీజేపీ సొంతం చేసుకోవాలని భావిస్తు్న్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ని తీవ్రంగా వ్యతిరేకించి పార్టీలోంచి బయటకి వచ్చేసిన రఘునందన్‌ కూడా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా బీజేపీలో చేరిన మాజీ డీజేపీ దినేష్ రెడ్డి గడచిన ఎన్నికలలో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతారు. ఇప్పుడు ఆయన మెదక్ స్థానం మీద ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద మెదక్ పార్లమెంట్ సీటు మాత్రం ఒక్కటే వుంది.. కర్చీఫ్‌లు మాత్రం చాలానే వున్నాయి.

దేవుడా.. తెలంగాణకి కరెంటు కష్టాలు తీర్చవా...

  దేవుడా... నేను తెలంగాణ రాష్ట్ర పౌరుణ్ణి. నువ్వంటే నాకు చాలా భక్తి. నీకు ఎన్నోసార్లు పూజలు, అభిషేకాలు చేశాను, చేయించాను. యధాశక్తి నిన్ను కొలుస్తున్నాను. ఇంతకాలం నేను నిన్ను నాకోసం ఎన్నెన్నో కోరికలు కోరాను. ఇప్పుడు నేను నాకోసం కాకుండా నా తెలంగాణ రాష్ట్రం కోసం నిన్ను ఓ కోరిక కోరుతున్నాను. ఓ సమస్య నువ్వే తీర్చాలని ప్రార్థిస్తున్నాను. ఇది ఏదో చిన్నాచితకా కోరికో సమస్యో అయితే అయితే నీదాకా వచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు నువ్వు తప్ప మరెవరూ తీర్చలేనంత పెద్ద సమస్యలో మా రాష్ట్రం చిక్కుకుపోయింది. ఆ సమస్య నుంచి నువ్వే ఎలాగైనా మా తెలంగాణని కాపాడాలి.   మా తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి తక్కువ, వినియోగం ఎక్కువ కావడం వల్ల పరిస్థితి అంతా అయోమయంగా వుంది. మా హైదరాబాద్‌లోనే రోజుకి నాలుగైదు గంటలు కరెంట్ కట్ చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఆరు నుంచి ఏడు గంటల వరకు కరెంట్ కట్ చేయాల్సి వచ్చేట్టుంది. అదే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజుకు పన్నెండు గంటలు కరెంట్ కట్ చేస్తున్నారు. కరెంట్ లేక తెలంగాణలో పరిశ్రమల్లో కార్మికులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారు. పవర్ లేక ప్రొడక్టివిటీ కూడా మందగించింది. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయే ప్రమాదం వచ్చిపడింది. మా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే జనం కరెంట్ కోసం రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసేంతవరకూ పరిస్థితి వెళ్ళింది.   మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని కరెంట్ కష్టాల నుంచి బయటపడేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావట్లేదు. రాష్ట్రంలోని ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ దగ్గర కరెంట్ కొనాలంటే అక్కడా లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్ బోలెడంత వుంది. కానీ అక్కడి నుంచి కరెంటు తెచ్చుకోవడానికి లైన్లు మాత్రం అందుబాటులో లేవు. ఛత్తీస్‌ఘఢ్ నుంచి తెలంగాణకి కొత్త లైన్లు వేసి కరెంటు తెచ్చుకోవాలనేది మా సీఎం ఐడియా. అయితే ఆ ప్రాజెక్టు ఈరోజే అర్జెంటుగా మొదలుపెట్టేస్తే పూర్తవడానికి మూడేళ్ళపైనే పడుతుందట. మరి ఎప్పుడు మొదలు పెట్టాలి.. ఎప్పుడు పూర్తవ్వాలి.. ఈలోపు మా రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు వస్తున్న కరెంట్ కూడా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే వర్షాలు లేక జల విద్యుత్ తాడు తెగేట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా తెలంగాణని కరెంటు కష్టాల నువ్వే కాపాడాలి.. సరేనా దేవుడా? పలకవేంటి దేవుడా? అదేంటి.. దేవుడి విగ్రహం మాయమైపోయింది.... అంటే మా తెలంగాణ కరెంటు కష్టాలు తీర్చడం దేవుడివల్లకూడా కాదా... ఇప్పుడెలా? అయ్యో.. మళ్ళీ కరెంట్ పోయింది..

జగన్ గారు బీపీ చెకప్ చేయించుకోవాలి... ప్లీజ్...

  వైసీపీ నాయకుడు వైఎస్ జగన్‌ని అభిమానించేవారు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది వున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కనేవారందరికీ జగన్ ఒక రోల్ మోడల్... ఒక ఇన్‌స్పిరేషన్. అలాంటి గొప్ప వ్యక్తి జగన్ జైల్లో వున్నా, బయట వున్నా హ్యాపీగా వుండాలనే ఆయన అభిమానులు కోరుకుంటూ వుంటారు. అయితే ఈమధ్యకాలంలో జగన్‌ని, ఆయన ప్రవర్తనని చూసి ఆయన అభిమానులు భయపడిపోతున్నారు. ఆయన ఆరోగ్యం ఏమైపోతోందో అని బాధపడుతున్నారు. జగన్‌కి గానీ బీపీ వ్యాధి వచ్చిందేమోనని భయపడుతున్నారు.   జగన్ ఈమధ్య కాలంలో ఏ సందర్భంలో మాట్లాడినా ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించే సమయంలో అయితే ఆయన ఆవేశ హావభావాలను చూస్తుంటే చాలామంది ఫ్యాన్స్‌కి భయమేస్తోంది. పాపం రాజకీయాలు, కేసుల గొడవలో పడి జగన్ తన ఆరోగ్యం గురించి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం నాడు అసెంబ్లీలో జగన్ ఆవేశంగా మాట్లాడిన తీరు, తెలుగుదేశం శాసనసభ్యులను ‘బఫూన్లు’ అని వ్యాఖ్యానించిన తీరు చూసి జగన్ అర్జెంటుగా బీపీ చెకప్ చేయించుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.   బీపీ చాలా ప్రమాదకరమైన వ్యాధి. బీపీ సైలెంట్ కిల్లర్ మాదిరిగా శరీరాన్ని లోలోపల పాడుచేసేస్తుంది. బీపీ వున్నవాళ్ళు ఆ వ్యాధి తమకు వుందన్న విషయాన్ని గుర్తించి మందులు వాడుతూ వుంటే ఆరోగ్యం బాగుంటుంది. బీపీ వున్నవాళ్ళలో చాలామందికి తమకు బీపీ వున్న విషయం తెలియదు. వాళ్ళకి బీపీ ఉన్న విషయం వాళ్ళని చూసేవాళ్లకి మాత్రమే తెలుస్తూ వుంటుంది.  ఇప్పుడు జగన్ కూడా ఆ కోవకు చెందిన బీపీ పేషెంటే అన్న అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు అర్జెంటుగా బీపీ చెకప్ చేయించుకుని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జైల్లో వున్నా, బయటే వున్నా ఆరోగ్యంగానే వుండాలని తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నారు. అంచేత జగన్ గారు తనకోసం కాకపోయినా తనను అభిమానించేవారి కోసమైనా అర్జెంటుగా బీపీ చెక్ చేయించుకోవాలి.

తెలంగాణాలో తెదేపా-బీజేపీల స్నేహం కొనసాగుతుందా?

  బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టిన అమిత్ షా నిన్న హైదరాబాదు వచ్చారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి విజయం సాధించే విధంగా పార్టీని తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఆయనను కలిసి అరగంటసేపు మాట్లాడారు. త్వరలో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరగనున్నాయి గనుక బహుశః ఆ విషయంపై వారిరువు చర్చించి ఉండవచ్చును. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు గనుక, బహుశః ఇప్పుడు కూడా అమిత్ షా ఆయన మద్దతు కోరి ఉండవచ్చును. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా జరుగలేదు గనుక బహుశః పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించవచ్చును.   కానీ ఈసారి కూడ బీజేపీ తెదేపాతో పొత్తులు పెట్టుకొంటుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందువలన అంటే మొదటి నుండి తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. తెదేపా తమకు మిత్రపక్షమని తెలిసి ఉన్నప్పటికీ ఆయన ఆ విధంగా చెప్పడం చూస్తే, బహుశః ఆయన బీజేపీ అధిష్టానం అనుమతితోనే ఆ విధంగా చెప్పి ఉండవచ్చునని భావించవలసి ఉంటుంది.   అమిత్ షా కూడా తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకొని, వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం గురించి మాట్లాడారు తప్ప కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండించలేదు అలాగని సమర్ధించలేదు కూడా. అంటే జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందా లేదా? అనేది అనుమానంగానే ఉంది. కానీ తెలంగాణాలో అధికారం చేప్పట్టినప్పటి నుండి క్రమంగా బలం పుంజుకొన్న తెరాసను, హైదరాబాదులో మంచి బలం కల మజ్లీస్ పార్టీలను ఎదుర్కోవాలంటే, కిషన్ రెడ్డికి ఇష్టమున్నా లేకపోయినా బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాతో బీజేపీ పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది. కనుక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కూడా ఈ విషయమై చర్చించిన తరువాతనే బీజేపీ ఒక నిర్దిష్ట ప్రకటన చేయవచ్చును.   ఒకవేళ బీజేపీ ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీకి దిగదలచుకొంటే, ఆ రెండు పార్టీలను   విమర్శించేందుకు ప్రతిపక్షాలకు చక్కటి అవకాశం దొరుకుతుంది. అది వాటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పించవచ్చును. కనుక ఈ విషయంలో బీజేపీ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి నుండి బీజేపీకి, నరేంద్ర మోడీకి చాలా అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు గనుక ఆ రెండు పార్టీల మధ్య పొత్తులకు ఎటువంటి సమస్య, పునరాలోచన అవసరం ఉండకపోవచ్చును.

పాక్ వ్యవహారంలో మోడీపై కాంగ్రెస్ విమర్శలు

  భారత ప్రభుత్వ అభ్యంతరాలను లెక్కజేయకుండా డిల్లీలో పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ వేర్పాటు ఉగ్రవాదులతో సమావేశం కావడంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం ఈనెల 25న ఇస్లామాబాద్ లో భారత్-పాక్ దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించింది. దానిపై పాకిస్తాన్ ప్రతిస్పందన ఏవిధంగానే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ స్పందన మాత్రం చాలా దారుణంగా ఉంది.   ఆ పార్టీ అధిష్టానానికి ప్రతినిధిగా భావింపబడే మాజీ కేంద్రమంత్రి మనీష్ తివారీ మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళకి అసలు విదేశాంగ విధానం అనేది ఉందా..లేదా? అనే అనుమానం కలుగుతోంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పటక ముందే బీజేపీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. కానీ మూడు నెలలు తిరక్క మునుపే పాకిస్తాన్ తో జరగవలసిన సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకొని తన అయోమయ స్థితిని బయటపెట్టుకొంది. ఇది చూస్తే మోడీ ప్రభుత్వానికి ఒక స్థిరమయిన విదేశాంగ విధానం లేదని స్పష్టమవుతోంది. చైనా దేశం భారత సరిహద్దులలోకి చొచ్చుకు వస్తున్నా అది మన భూభాగంలోకి రాలేదని మోడీ ప్రభుత్వమే చైనాను వెనకేసుకు రావడం చూస్తుంటే, మున్ముందు చైనా సేనలు అరుణాచల్ ప్రదేశ్ ను తమదేనని ప్రకటిస్తే మోడీ ప్రభుత్వం దానిని కూడా చైనాకు వదిలిపెడుతుందేమో?” అని విమర్శించారు.   పాకిస్తాన్ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మనీష్ తివారీ గతంలో తమ యూపీఏ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పట్ల ఇటువంటి కటినంగా వ్యవహరించిన సంగతిని విస్మరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ భారత ప్రభుత్వం అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కాశ్మీర్ వేర్పాటువాదులతో ఏకంగా దేశ రాజధాని డిల్లీలోనే సమావేశమయితే, దానిని తీవ్రంగా ఖండించాల్సిన కాంగ్రెస్ పార్టీ, మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు రద్దు చేసుకొంది గనుక మోడీ ప్రభుత్వానికి సరయిన విదేశాంగ విధానం లేదంటూ విమర్శించడం చాలా దారుణం.   ఇక చైనా చొరబాట్ల విషయంలో మనీష్ తివారీ చేసిన విమర్శలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇటీవల బ్రిక్స్ దేశాల సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ చైనా ప్రధానితో మొట్టమొదటి సారిగా సమావేశమయినపుడు, ఆయన ఎటువంటి దొంక తిరుగుడు లేకుండా నేరుగా చైనా చొరబాట్ల గురించి, సరిహద్దు వివాదాల గురించి మాట్లాడిన సంగతి బహుశః కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందేమో?   భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుసరించిన లోపభూయిష్టమయిన విదేశాంగ విధానాల కారణంగానే నేడు కాశ్మీరులో సగభాగాన్ని కోల్పోవలసి రావడమే కాక, దానిని ఉగ్రవాదులకు అడ్డాగా మారినా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవలసి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన లోపభూయిష్టమయిన విదేశాంగ విధానాల కారణంగానే నేడు నేపాల్, శ్రీలంక వంటి చిన్న దేశాలకి భారత్ అంటే అలుసయిపోయింది. ఆ కారణంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగానే రాహుల్, సోనియా గాంధీలకు కూడా ప్రాణభయం పట్టుకొంది.   చైనా, పాకిస్తాన్ దేశాలు రెండూ సరిహద్దుల వెంబడి రోడ్లు, రైలు మార్గాలు నిర్మించుకొంటున్నా ఇన్నేళ్ళుగా చేతులు ముడుచుకొని కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చొంటే, మోడీ అధికారం చెప్పట్టిన రెండు నెలల వ్యవధిలోనే సరిహద్దుల వెంబడి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.   ఇదివరకు నరేంద్ర మోడీ కూడా ఈ రెండు దేశాల వ్యవహారాలలో యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బహుశః అందువల్లే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేవిధంగా వ్యవహరిస్తోందనుకోవలసి ఉంటుంది. చైనా, పాకిస్తాన్ వంటి సమస్యాత్మక దేశాలతో వ్యవహరిస్తున్నపుడు, పార్టీలకు అతీతంగా అందరూ భారతప్రభుత్వానికి అండగా నిలబడి మద్దతుగా మాట్లాడితే హుందాగా ఉంటుంది.

బాబుగారి మీటింగా? అయ్యబాబోయ్!!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఏపీ అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషిస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ, చంద్రబాబుతో చిన్న చిక్కొచ్చిపడిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు లబోదిబో అంటున్నారు. పరిపాలనలో భాగంగా చంద్రబాబు నాయుడు విరివిగా మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్స్‌కి సంబంధిత ఎమ్మెల్యేలను, మంత్రులను పిలుస్తున్నారు. చంద్రబాబుతో మీటింగ్ అనగానే మొదట్లో ఎమ్మెల్యేలు చాలా ఉత్సాహంగా వెళ్ళారు. ఆ తర్వాత గానీ వాళ్ళకి చంద్రబాబు మీటింగ్స్ పవర్ అర్థంకాలేదు. గంట కాదు.. రెండు గంటలు కాదు.. మూడు గంటలు కాదు... ఏకంగా నాలుగేసి, ఐదేసి గంటలు బాబు మీటింగ్స్ నిర్వహిస్తూ వుండటంతో వాళ్ళకి బుర్రలు వాచిపోతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు మీటింగ్స్ పేరు చెబితేనే టీడీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారు.   మొన్నామధ్య చంద్రబాబు ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ నాలుగుగంటలు ఏకబిగిన సాగింది. అలాగే ఎంపీలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఐదు గంటల పాటు సా.....గింది.. ఈ మీటింగ్స్‌లో నాలుగైదు గంటలపాటు చంద్రబాబు నాన్ స్టాప్‌గా మాట్లాడారట. ఈ టైమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు గారికి చెవులు అప్పగించి కూర్చున్నారు. చంద్రబాబు మీటింగ్ పేరుతో గంటలకు గంటలు భారీ స్థాయిలో క్లాసులు తీసుకుంటూ వుండటంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల మాదిరిగా చప్పుడు చేయకుండా కూర్చోవడం మినహా మరేమీ చేయలేకపోతున్నారట. మీటింగ్ పూర్తయిన తర్వాత బయటికొచ్చి బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారట. ఇవేం మీటింగ్స్‌రా దేవుడా అని సణుక్కుంటున్నారట. అయితే బాబు మీటింగ్స్ మీద తమ ఆవేదనను ఆయనకే డైరెక్ట్‌గా చెప్పలేక కుమిలిపోతున్నారట.   తాను ఏర్పాటు చేస్తున్న భారీ మీటింగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీటింగ్స్ అనేవి అవసరమే.. కానీ నాలుగైదు గంటలపాటు మీటింగ్స్ పెట్టినందువల్ల పరిస్థితి రివర్స్ అయ్యే డేంజరుంది. ఇలాంటి భారీ మీటింగ్స్ వల్ల టైమ్ వేస్ట్ తప్ప ప్రయోజనం ఏమీ వుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చిన్న చిన్న మీటింగ్స్‌తో పెద్ద ప్రయోజనాలు సాధించడం మంచిదనేది ఒక సూచన. అలాగే చంద్రబాబుకు అద్భుతమైన విజన్ వుంది.. ఏ విషయంలో అయినా క్లారిటీ వుంది. బంగారు పళ్ళానికైనా గోడచేర్చు కావాలని అన్నట్టుగా ఆ విజన్‌కి, క్లారిటీకి తోడుగా పార్టీలోని సమర్థులైన వ్యక్తుల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటూ చంద్రబాబు ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి.

వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?

  సినిమాల్లో మెగాస్టార్‌గా వెలిగిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం మూగ స్టార్‌గా మారిపోవడానికి కారణమేమిటి? రాజకీయ పరిపక్వత లేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోవడం, అవినీతి ఆరోపణలురావడం... ఇవన్నీ ఒక ఎత్తయితే అంతకంటే పెద్ద బలమైన కారణం మరోటి వుందన్న అభిప్రాయాలు వినిపిన్నాయి.. అది... అది... మరేదో కాదు.. వాస్తు! ఎస్.. రాజకీయంగా చిరంజీవి కొంప మునిగిపోవడానికి వాస్తు కారణమని పరిశీలకులు అంటున్నారు. చిరంజీవి తన సొంత పార్టీని మూసేసిన తర్వాత రాజకీయం ఆయన పరువు సగం పోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎంపీ అయి, కేంద్ర మంత్రి కూడా అయిన తర్వాత ఆ పరువు పూర్తిగా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. చిరంజీవికి ఎవరైనా అభిమానులు అనేవాళ్ళు మిగిలి వుంటే వాళ్ళు బాధపడతారేమోగానీ, ప్రస్తుతం ఏదో రాజ్యసభ పదవి ఉన్నప్పటికీ, ఆయన రాజకీయంగా జీరో అయిపోయారు. భవిష్యత్తులో హీరో అవుతారన్న నమ్మకం ఆయనకయినా వుందో, లేదో!   ఇదిలా వుంటే, చిరంజీవి రాజకీయంగా పూర్తిగా దెబ్బయిపోవడానికి ఢిల్లీలో ఆయన అధికార నివాస గృహం వాస్తు అష్ట దరిద్రంగా వుండటమే కారణమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి దక్కిన తర్వాత చిరంజీవికి ఢిల్లీ అక్బర్ రోడ్డులో ఒక బంగ్లాని కేటాయించారు. చిరంజీవి ఎన్నికోట్లో ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టి ఆ బంగ్లాకి రకరకాల హంగూ ఆర్భాటాలు చేయించారు. అత్యాధునిక లుక్కు తెచ్చారు. అయితే పైపై అలంకారాలే తప్ప ఆ ఇంటికి వాస్తు ఎంతమాత్రం బాగాలేదట. పాపం చిరంజీవి ఆ ఇంటికి మేకప్ అయితే వేయగలిగారుగానీ, ఇంటి లోపల వున్న జబ్బుకు మాత్రం మందు వేయలేకపోయారు. దాంతో వాస్తు ఆగ్రహం కారణంగా చిరంజీవి అప్పటి నుంచి రాజకీయంగా పూర్తిగా డౌన్ అయిపోయారని పరిశీలకులు అంటున్నారు.   సదరు ఇల్లు వాస్తు పరంగా చాలా గొప్పదన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి నివాస భవనాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి కేటాయించారు. చిరంజీవి గారిని ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అయితే చిరంజీవి మాత్రం తానింకా రాజ్యసభ సభ్యుడిగా వున్నాను కాబట్టి, పైగా తానెంతో ముచ్చటపడి అలంకారాలు చేయించాను కాబట్టి తన పదవీకాలం ముగిసేవరకూ ఆ ఇంటిని తనకే ఉంచాలని, లేకపోతే తనకు మరో బంగ్లా చూపించాలని రిక్వెస్ట్ చేశారు. మామూలుగా అయితే ప్రభుత్వం అలా కుదరదని చెప్పేసేదే. అయితే చిరంజీవి ప్రస్తుత నివాసానికి రావడానికి రాజ్‌నాథ్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఆ ఇల్లు వాస్తుపరంగా ఘోరంగా వుంటుంది కాబట్టి తాను ఆ ఇంటికి వెళ్ళలేనని, ప్రస్తుతం తాను నివాసం వుంటున్న ఇంట్లోనే వుంటానని రాజ్‌నాథ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో వాస్తుపరంగా అమోఘంగా వున్న ఆ ఇంటిలోనే చిరంజీవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాపం చిరంజీవి!

ఎవరా మహిళా సునామీ... ప్రియాంకే కదా!

  ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించడం రాహుల్ గాంధీకి అలవాటైపోయినట్టుంది. మొన్నటి వరకు తల్లి సోనియాగాంధీ కొంగుచాటున వుండి అధికారం చెలాయించారు. ఇప్పుడు తన అక్క ప్రియాంక చాటున చేరి హవా నడిపించాలని అనుకుంటున్నారు. అందుకే ప్రియాంకకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోమవారం జరిగిన ఒక సమావేశంలో రాహుల్ గాంధీ తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే మహిళా సునామీ రావాల్సిందేనని అన్నారు. మహిళా సునామీ అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల మద్దతు కావాలని అన్నారో లేక, ఒక సునామీ లాంటి మహిళా శక్తి ప్రియాంక రంగంలోకి రావాలని అన్నారో కొంతమందికి అర్థం కాలేదు. అయితే చాలామందికి మాత్రం రాహుల్ గాంధీ ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశానికి సూచనలు చేస్తున్నారని అర్థమైపోయింది. తనకు ప్రజల్లో ఎలాగూ అంత సీన్ లేదని క్లియర్‌గా అర్థమైపోయింది కాబట్టి ప్రియాంకని రంగంలోకి దించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని అర్థమైపోతోంది.   త్వరలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఒకవైపు మహిళా బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెబుతూనే.. మరోవైపు ఇలా మహిళా శక్తి గురించి కూడా రాహుల్ మాట్లాడుతున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం సామాన్యుడికి మేలు చేసిందని ఆయన అన్నారు.మన దేశంలో దేవతలను ఆరాధిస్తామని.. కానీ ఆలయాల్లో దేవతలను ఆరాధించేవాళ్లలో చాలామంది బయట బస్సుల్లోను, రోడ్ల మీద మహిళలను వేధిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని ప్రతి మహిళా ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురైనవారేనని రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఈ పదేళ్ళలో రాహుల్ గాంధీ ఈ విషయంలో ఏం చేసినట్టో?

కె.ఇ.కృష్ణమూర్తి ఎందుకు కయ్యిమన్నారో?

  తెలుగుదేశం మార్కు క్రమశిక్షణతో ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో అకస్మాత్తుగా ఒక ‘ఆగ్రహ గళం’ వినిపించింది. ఆ గళం మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఆగ్రహ గళం మరెవరిదో కాదు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిది. తన తోటి మంత్రి నారాయణ విజయవాడ రాజధాని అంటూ ప్రచారం చేయడం వల్లనే ఇక్కడ రేట్లు పెరిగిపోయాయని కె.ఇ. ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తాత్కాలిక రాజధాని మాత్రమేనని, శాశ్వత రాజధాని మారవచ్చని కూడా చెప్పారు. విజయవాడ చాలా ఇరుకైన ప్రదేశమని, ప్రభుత్వ భూమి కూడా చాలా తక్కువగా వుందని రాజధానికి పనికిరాదన్నట్టుగా చెప్పారు. పనిలోపనిగా కర్నూలు దగ్గర బోలెడంత ప్రభుత్వ భూమి వుందని కూడా అన్నారు. మళ్ళీ అంతలోనే కర్నూలు రాజధాని అవ్వాలని తానేమీ డిమాండ్ చేయడం లేదని చెప్పుకొచ్చారు.   క్రమశిక్షణ చాలా ఎక్కువగా వుండే తెలుగుదేశం పార్టీలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వున్న కె.ఇ.కృష్ణమూర్తి ఇలా బాహాటంగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తెలుగుదేశం సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా వున్న కె.ఇ. వ్యవహార శైలి పలువురిని ఆలోచనలో పడేసింది. కె.ఇ. ఆగ్రహం వెనుక వున్న అసలు కారణాన్ని పసిగట్టాలన్న ఆసక్తిని కలిగించింది. ఆ ఆసక్తి పరిశోధన రూపంలోకి మారి జరిపిన అన్వేషణలో అనేక మరింత ఆసక్తికరమైన అంశాలు బయటకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. మంత్రులు అంటే ఏదో ఆషామాషీగా పదవుల్లో వుండి బిల్డప్పులు ఇచ్చేవాళ్ళు కాదు.. కష్టించి పనిచేసేవాళ్ళు అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తన మంత్రివర్గంలో వున్నవారందరూ మెరుగైన పనితీరు ప్రదర్శించాలని భావిస్తున్నారు. పనితీరు బాగాలేని మంత్రులను ఉపేక్షించనని కూడా చెబుతున్నారు. మంత్రుల పనితీరునుబట్టి స్కూలు పిల్లలకు వేసినట్టుగా మార్కులు కూడా వేస్తున్నారు.   ఈ మార్కుల ప్రకారం పాస్ మార్కు 35 అయితే, కాస్త వయసు పైబడిన కె.ఇ. కృష్ణమూర్తి ‘18’ మార్కుల దగ్గర ఆగిపోయారని సమాచారం. మరి కె.ఇ. పనితీరు ఇలాగే వుంటే భవిష్యత్తులో ఏదైనా జరిగే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా కె.ఇ. కదుపుతున్న పావుల్లో భాగమే ‘‘మంత్రి నారాయణ మీద ఆగ్రహం’’ అని తెలుస్తోంది. తన పదవి చుట్టూ ‘రాయలసీమ’ అనే కవచాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాల్లో భాగంగానే స్వరం పెంచి మాట్లాడారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘‘నేను ఇంతవరకూ కర్నూలు రాజధాని అవ్వాలి అని డిమాండ్ చేయలేదు’’ అని కె.ఇ. అన్నారంటే, నా జోలికి వస్తే కర్నూలుని రాజధానిని చేయాలని ఉద్యమం చేస్తానని పరోక్షంగా హెచ్చరించడమేనని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా పెద్దాయన ఇలాంటివి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే, ఇంకాస్త శ్రమించి పనిచేసి, పాస్ మార్కులైనా తెచ్చుకుంటే మంచిదికదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వందల కోట్లు జప్తయినా చలించని ఒకే ఒక్కడు?

   తెదేపా నేతలు పదేపదే తను లక్షకోట్లు ఆస్తులు పోగేసానని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఒకవేళ వారు అంత మొత్తం కనుగొనగలిగితే అందులో ఒక పది శాతం తనకు ఇచ్చి మిగిలినదంతా వారే తీసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి నిన్న సవాలు విసిరారు. వారు ఈ అసత్య ప్రచారాన్ని ఇప్పటికయినా ఆపకపోతే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా.   కానీ ఆయన ఆ సవాలు విసిరిన మరునాడే అంటే మంగళవారం నాడు జగన్ మరియు అతని భాగస్వామికి చెందిన రూ. 863 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ ద్రువీకరించడమే కాకుండా అది సరయిన చర్యేనని తీర్పు చెప్పింది. ఈ ఆస్తులలో జగతి పబ్లికేషన్స్ చెందిన షేర్లు, ఫ్లాంట్స్, మిషనరీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లూ అన్నీ కలుపుకొని మొత్తం రూ.369.59 కోట్లు వరకు ఉన్నాయి. ఇవికాక జగన్ కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నఇతర సంస్థలకు చెందిన రూ.494 కోట్ల ఆస్తులను కూడా గత ఏడాదిన్నర కాలంలో ఈడీ జప్తు చేసింది. అంతా కలుపుకొంటే రూ. 863 కోట్ల విలువయిన ఆస్తులను ఈడీ జప్తు చేసిందని స్వయంగా ఈడీ న్యాయ ప్రాధికార సంస్థే స్వయంగా ద్రువీకరించింది.   2011 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 445కోట్లుగా పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో అవి రూ.416 కోట్లు అని పేర్కొన్నారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఆయన ప్రకటించిన తాజా ఆస్తుల విలువతో కలిపి చూసుకొన్నట్లయితే రూ.1279 కోట్లని తేలుతోంది. ఎన్నికల అఫిడవిట్ లో జగన్ చూపని ఆస్తుల విలువ ఎంతో ఎవరికీ తెలియదు.   ఈడీ రూ. 863 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం పోవడం గమనిస్తే ఈడీ జప్తు చేసిన ఆస్తులు సముద్రంలో నీటి బిందువంత అని అర్ధమవుతోంది. వెనుక ఇంకా అంతకు పదింతల ఆస్తులు ఉంటే తప్ప ఇన్ని వందల కోట్ల ఆస్తులను పోగొట్టుకొన్న వారెవరూ తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డిలా నిశ్చింతగా వ్యాపారాలు, రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేయలేరు. మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని తెదేపా నేతలు తనను విమర్శిస్తే మళ్ళీ వారికి సవాళ్లు విసరడం, పరువు నష్టం దావా వేస్తానని బెదిరించడం దేనికో అర్ధం కాదు.

ప్రజల జేబులు ఖాళీ చేసేందుకు త్వరలో సరికొత్త ఆర్.టీ.ఓ. విధానాలు

  కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి నిన్న పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్.టీ.ఓ. వ్యవస్థను, విధానాలను సమూలంగా మార్చవలసిన తరుణం ఆసన్నమయింది. అందుకోసం మా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కొత్త చట్టాలను సిద్దం చేస్తోంది. అవి ఇప్పుడున్న విధానాల కంటే చాల మెరుగైనవి, సమర్ధనీయమైనవి. వాటిని త్వరలోనే అమలులోకి తీసుకు వస్తాము. ప్రస్తుత వ్యవస్థలో, విధానాలలో అంతటా అవినీతి, డబ్బు రాజ్యం ఏలుతోంది. దానికి ఆస్కారం లేకుండా అత్యాధునిక వ్యవస్థను, విధానాలను అమలులోకి తీసుకువస్తాము. లండన్ వంటి నగరాలలో అనుసరిస్తున్న అత్యాధుని ట్రాఫిక్ విధానాలను మనదేశంలో కూడా అమలు చేసేందుకు వీలుగా చట్టాలను రూపొందిస్తున్నాము. అవి అమలయితే ఇక ఆర్.టీ.ఓ. వ్యవస్థలో అవినీతికి తావు ఉండదు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు చట్టం దృష్టి నుండి తప్పించుకోలేరు. ఎవరయినా ఎక్కడయినా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే సదరు వాహనదారు ఇంటికే నేరుగా జరిమానా నోటీసు చేరిపోతుంది. దానిని కోర్టులో సవాలు చేసేందుకు సాహసితే మూడు రెట్లు జరిమానా వసూలు చేయబడుతుంది,” అని అన్నారు.   సాధారణంగా ప్రభుత్వం కొత్త సౌకర్యాలు లేదా తమకు లబ్ది చేకూరే పధకాలు ప్రేవేశ పెడుతుందని ప్రజలు ఆశిస్తుంటారు. కానీ ఈవిధంగా కొత్త విధానాల ద్వారా తమ జేబులకు చిల్లులు పెట్టాలని ఎవరూ కోరుకోరు. భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగడం పెద్ద వింత కాదు. కొత్త విషయము కాదు. కానీ అందుకు ప్రధాన కారణం నానాటికి పెరిగిపోతున్న జనాభా మరియు ట్రాఫిక్ రద్దీ. నేటికీ మహానగరాలలో సైతం గోతులు పడిన రోడ్లు, రోడ్ల మీద పారే మురుగు నీరు, ఇరుకు సందులు, వాటిలో విచ్చల విడిగా తిరిగే పందులు, కుక్కలు, ఆవులు, గేదెలు కనబడుతూనే ఉంటాయి.   కానీ ఇంతవరకు పరిపాలించిన ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా రోడ్లు నిర్మించడం, రోడ్లు వెడల్పు చేయడం, ఫ్లై ఓవర్లు కట్టించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బస్సులు, మెట్రో రైళ్ళను ఏర్పాటు చేయడం, నదులు, కాలవలు పారే ప్రాంతాలలో కొత్తగా జల రవాణా వ్యవస్థలను ఏర్పాటుకు గట్టిగా కృషి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కనీసం ప్రస్తుతం ఉన్న రోడ్లను, వ్యవస్థలలో లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నాలు చేయలేదు. అందువలననే నిత్యం రోడ్డు ప్రమాదాలలో వందలాది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. కానీ ప్రభుత్వాలు ఎన్నడూ మేల్కొనలేదు. రోడ్డు ప్రయాణికులకు సరయిన సౌకర్యాలు, తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయినా, నిబంధనల పేరిట ట్రాఫిక్ పోలీసులు, ఆర్.టీ.ఓ. అధికారులు వారిని నిత్యం దోచుకొంటూనే ఉన్నారు.   ఇప్పడు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఏమి చేయాలో ఆలోచించకుండా, ప్రజల ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్న ఆ ఆ.ర్టీ.ఓ. వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. మోడీ ప్రభుత్వంపై ప్రజలలో చాలా ఆశలున్నాయి. అందుకే ఆయన ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నెల రోజుల్లోనే రైల్వే చార్జీలు భారీగా పెంచినప్పటికీ, ప్రజలు ఆయనపై నమ్మకంతో సర్దిచెప్పుకొని కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రవాణాశాఖా మంత్రిగారు ప్రజల ముక్కు పిండి డబ్బు వసూలు చేసేందుకు చట్టాలు సవరిస్తామని చెప్పడం చూస్తే ఇకపై ప్రజలు జేబు నిండా డబ్బుంటే తప్ప రోడ్లమీద తిరిగే సాహసం చేయకూడదని అర్ధమవుతోంది. ఆవిధంగానయినా దేశంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి, రోడ్డు ప్రమాదాలు అరికడదామని మంత్రిగారు భావిస్తున్నారేమో!