త్వరలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు

  గత అనేక దశాబ్దాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్నట్లుగాపడున్న పోలవరం ప్రాజెక్టుని వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేయాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మరియు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో నిన్న హైదరాబాద్ లో సమావేశమయిన ఆయన త్వరలోనే కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాబోతున్నాయని తెలిపారు. కనుక ఈలోగానే ప్రాజెక్టుకు అవసరమయిన భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలలో మరియు రాయలసీమలో నాలుగు జిల్లాలలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులన్నిటినీ కంప్యూటరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఆర్ధిక, భారీ నీటి పారుదల మరియు విద్యుత్ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని సూచించారు. ఆ కమిటీ ప్రతీ పదిహేను రోజులకీ ఒకసారి సమావేశమవుతూ ప్రాజెక్టు పనులపై పురోగతిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. తను కూడా స్వయంగా ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని ఆయన తెలిపారు.   రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రప్రభుత్వమే దాని పూర్తి బాధ్యత తీసుకొంటుందని విభజన బిల్లులో స్పష్టంగా హామీ ఇవ్వబడింది. అందుకే మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసారు. ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ, దానికి అవసరమయిన అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం అంటే ప్రాజెక్టు కోసం నిధుల విడుదలకు ఆర్ధిక శాఖ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతునట్లేనని చెప్పవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు తొందరపడుతున్నారు. ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలని ద్రుడసంకల్పంతో ఉన్నందున, మధ్యలో ఎటువంటి ఆటంకాలు కలుగకపోతే బహుశః 2018నాటికి పోలవరం పూర్తయి, రాష్ట్రంలో మరింత భూమి సాగులోకి రావచ్చును.

జమ్మూ, కాశ్మీర్ లో బీజేపీ-పి.డి.పి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం?

  జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, బీజేపీ-25 సీట్లు, పీపుల్స్ డెమోక్రేటిక్ పార్టీ (పి.డి.పి.)కి-28 సీట్లు, ఇంతవరకు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి- 17 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి-12, ఇతరులకి-7 సీట్లు రావడంతో అక్కడ ఇప్పుడు ఏ పార్టీ దేనితో జత కడుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం 87 సీట్లు గల జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ లేదా కూటమికయినా కనీసం 44 సీట్లు అవసరం.   28 సీట్లు సాధించిన పి.డి.పి.కి కాంగ్రెస్ (12) మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కానీ కేవలం కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యపడదు కనుక మరో నలుగురు స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడా అవసరం ఉంటుంది. కానీ వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కనుక బీజేపీ లేదా తన రాజకీయ ప్రత్యర్ధి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తే తప్ప పి.డి.పి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు.   భవిష్యత్ అంధకారంగా మారిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో సుస్థిరమయిన పాలన అందించవచ్చని, అప్పుడు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా బాగా సహాయపడుతుందని పి.డి.పి. భావిస్తోంది.   అయితే మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో చేతులు కలిపినట్లయితే మిగిలిన అన్ని పార్టీల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకోవలసి ఉంటుందనే భయం కూడా పి.డి.పి.ని వెనక్కు లాగుతోంది. ఒకవేళ బీజేపీ మద్దతు తీసుకొంటే ఉప ముఖ్యమంత్రి పదవి, మరి కొన్ని కీలక పదవులు జమ్మూ ప్రాంతం నుండి ఎంపికయిన బీజేపీ సభ్యులకే ఇవ్వవలసి ఉంటుందనే భయం కూడా ఉంది. కానీ దానికి అంతకంటే గత్యంతరం కూడా లేదు.   ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా “బీజేపీ ద్వారములు అన్ని పార్టీలకు తెరిచియే ఉన్నవి” అని ప్రకటించారు. అంటే ఏ పార్టీకయినా మద్దతు ఇచ్చేందుకు లేదా మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్దమని ఆయన చెప్పినట్లే భావించవచ్చును. ఇప్పటికే ఏడుగురు స్వతంత్ర అభ్యర్దులను పార్టీ వైపుకు తిప్పుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇంతవరకు ప్రతిపక్షంలో కూర్చొనేందుకు సిద్దమంటూ చెపుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని తనే ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన పి.డి.పి.కి లేదా పి.డి.పి. ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక ఆయన బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమని పరోక్షంగా ప్రకటించినట్లే భావించవచ్చును. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే మొత్తం 42 మంది అవుతారు. స్వతంత్ర సభ్యులు ఏడుగురు కూడా బీజేపీకే మొగ్గు చూపడం నిజమనుకొంటే అప్పుడు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కానీ ఎన్నికల సమయంలో ఒమర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అతనితోనే జత కడితే విమర్శలు ఎదుర్కోక తప్పదు.   ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, పి.డి.పి.లు కలిసి (రొటేషన్ పద్దతిలో మంత్రి పదవులు పంచుకొనే షరతు మీద) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.

మంత్రి పదవులు లేవు ఓన్లీ కిరీటాలే...అడ్జస్ట్ అయిపోండి

  ప్రజాసేవ అంటే మాటలా? చెప్పిన ప్రతీ మాటకి చప్పట్లు ముందు వెనుకా కొట్టేందుకు ఓ నలబై మంది అనుచరులు ఉండాలి...వారందరినీ మేపడానికి ఆర్ధిక స్తోమత ఉండాలి....అది సమకూర్చుకొనేందుకు ఏదో ఒక పదవి ఉండాలి...పదవి ఉంటే ముందు వెనుక ఏకే 47తుపాకులు పట్టుకొని తిరిగే సెక్యూరిటీ ఉండాలి... అన్నీ ఉండి ఎర్రబుగ్గ కార్లు లేకపోతే చాలా నామోషీగా ఉంటుంది...గనుక అదీ తప్పదు. అలాగని దొరికిన ఆ ఒక్క ఎర్రబుగ్గ కారేసుకొని జనాల్లోకి రయ్యని వెళిపోతే ఎవరు పట్టించుకోరు సరికదా ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంటుంది..కనుక మళ్ళీ దానికి ముందూ వెనుకా ఓ పాతిక కార్లు, పోలీసు ఎస్కార్టులు తప్పనిసరి. అప్పుడే ప్రజాసేవ చేయడానికి వీలు పడుతుంది. కానీ ఈ కష్టం ఏమీ తెలియని అజ్ఞానులయిన జనాలు “ఓస్.. ప్రజాసేవే కదా...”అని తేలికగా తీసిపడేస్తుంటారు.   ఇక విషయంలోకి వస్తే మొన్నీ మధ్యన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన మంత్రి వర్గం విస్తరించినప్పుడు చాలా మందికి లోపల కుర్చీలు దొరకకపోవడంతో ప్రజాసేవ చేయలేకపోతున్నందుకు తెగ ఇదయిపోయారు. వాళ్ళు అదేపనిగా ఇదయిపోయి చివరికి వాళ్ళ ఉసురు తగిలితే అది తన ప్రభుత్వానికి మంచిది కాదనుకొన్నారో ఏమో గానీ కేసీఆర్ గారు “మీకు కుర్చీలు ఇవ్వలేకపోయినందుకు సారీ! కానీ మీకందరికీ కిరీటాలు (అంటే క్యాబినెట్ ర్యాంక్ హోదా అన్నమాట) ఇస్తాను పెట్టుకొని తిరగండి” అని చెప్పి ఓమూడు డజన్ల మంది తెరాస నేతలందరికీ తలకొక కిరీటం పంచి పెట్టేసారు.   “ఆ కిరీటం ధరించిన వారికి ఎవరికయినా సరే మంత్రిగారికి ఉండే అన్ని సౌకర్యాలు కల్పించవలెను” అని రూల్స్ వ్రాసుకొన్నాము గనుక అందరికీ నీలిబుగ్గ కార్లు దానితో బాటే మిగిలిన హంగులన్నీ అమరి పోయాయి. ఇప్పుడు వారందరూ ఆ కార్లేసుకొని నగరంలో రయ్యి రయ్యిమంటూ గిరగిరా తిరిగేస్తుంటే, “మాకూ రోడ్ల మీదకు వచ్చేందుకు కొంచెం సమయం కేటాయిస్తే బాగుంటుంది కదా” అని జనాలు గొణుకొంటున్నారుట.   నిజానికి ఎప్పుడో 1989లో మోటార్ వాహానాల చట్టంలో 314 రూల్స్ ప్రకారం కేవలం ముఖ్యమంత్రి, అందరు మంత్రులు, రాష్ట్ర ప్లానింగ్ కమీషన్ చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్ లకు మాత్రమే ఈ నీలి బుగ్గలుండాలి అని వ్రాసుకొన్నాము. కానీ క్యాబినెట్ హోదా ఉన్నవాళ్ళకి నీలి బుగ్గలు ఉండకూడదని ఎక్కడా వ్రాసిలేదు. అది పట్టించుకోకుండా గిట్టని వాళ్ళు దీనినీ తప్పు పట్టడం చాలా అన్యాయం.   ప్రస్తుతం కొత్తగా నీలిబుగ్గల వారు ఎవరెవరు అంటే: చీఫ్ విప్: కొప్పుల ఈశ్వర్, విప్: గంపా గోవర్ధన్, నల్ల ఓదెలు మరియు జి.సునీత, యస్. నిరంజన్ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమీషన్; గంటా చక్రపాణి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్; శాసనసభ్యులు:వి.శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావు, దాశ్యం విని భాస్కర్, కోవ లక్ష్మి, పార్లమెంటరీ కార్యదర్శులుగా కొత్తగా నియమితులయిన మరో నలుగురు సభ్యులు పాతవారితో వెరసి మొత్తం ఓ యాబై మంది వరకు ఉంటారు.   ఇంతమంది కలిసి ప్రజాసేవ చేస్తున్నా ఇంకా ప్రజలు అపార్ధం చేసుకొంటే ఏమి బాగుంటుంది? వీలయితే చంద్రబాబునాయుడి గారి చెవిలో కూడా ఈ ఐడియా వేస్తే ఆయన కూడా అది వర్కవుట్ అవుతుందేమో చూసుకొంటారు కదా?

రాజధాని అభివృద్ధి మండలి-ఏడు చేపల కధ

  ఇంతవరకు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలే కాక చుట్టుపక్కల గల గన్నవరం, మైలవరం, నందిగామ తదితర ప్రాంతాలు ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాలు అన్నీ కూడా వి.జి.టి.యం.పరిధిలోనే ఉండేవి. ఆ ప్రాంతాలలో ఎక్కడ ఇళ్ళు, అపార్టుమెంటులు కట్టుకోవాలన్నా, లే అవుట్లు వేయాలన్నా ఇంతవరకు వి.జి.టి.యం. బోర్డే అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉండేది. దాదాపు 7,060 చ.కిమీ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న ఆ ప్రాంతాలలో జరిగే రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ వి.జి.టి.యం. కనుసన్నలలోనే జరిగేవి.   ఇప్పుడు దాని స్థానంలో రాజధాని అభివృద్ధి మండలి రావడంతో ఇప్పుడు ఆ బాధ్యతలు, హక్కులు, అధికారాలు అన్నీదానికే దఖలు పడ్డాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇల్లలకగానే పండగ కాదన్నట్లు రాజధాని అభివృద్ధి మండలి బిల్లును శాసనసభ ఆమోదించినంత మాత్రాన్న సమస్యలన్నీ మటుమాయం అయిపోలేదు. పైగా ఇప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి.   గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో నెలకి రూ.100కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతుంటాయి. వాటిలో భాగంగా నెలకి కనీసం 10, 000 ఇళ్లు డజన్ల కొద్దీ కొత్త లే అవుట్లు వెలుస్తుంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న వి.జి.టి.యం.ను రద్దయిపోయింది. కానీ దాని స్థానంలోకి వచ్చిన రాజధాని అభివృద్ధి మండలి ఇప్పుడప్పుడే పని మొదలుపెట్టే పరిస్థితిలో లేదు.   ఎందుకంటే మాస్టర్ ప్లాన్ తయారవలేదు. రాజధాని నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అనుకొని ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా తదనుగుణంగానే అభివృద్ధి చెందాలని అనుకొంటున్నారు. కనుక రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో అడ్డ దిడ్డంగా నిర్మాణాలు జరగకూడదనే ఆలోచనతో ఆ ప్రాంతలన్నిటినీ కూడా రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకు వచ్చేరు. ఆ ప్రాంతాలన్నీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చెందితే మున్ముందు సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన ఉద్దేశ్యం. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం అయితే తప్ప, దాని పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఎక్కడా కూడా కొత్తగా ఎటువంటి కట్టడాలకు అనుమతులు మంజూరు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరికి ఎవరయినా తమ ఇంటికి మార్పులు చేర్పులు చేసుకొనేందుకు కూడా అనుమతి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.   అయితే సింగపూరు సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడానికి మరో ఆరు నెలలు పడుతుందని స్వయంగా మంత్రులే చెపుతున్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ముందుగా భూసేకరణ తంతు ఒకటి పూర్తి కావలసి ఉంది. కానీ రాయపూడి గ్రామా రైతులు అప్పుడే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు డిల్లీలో లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. పెనుమాక గ్రామ రైతులు ‘ల్యాండ్ పూలింగుకి ఒప్పుకోము’ అంటూ బోర్డులు పెట్టారంటూ వార్తలు వచ్చేయి.   రైతులు భూములు ఇస్తే సింగపూరోళ్ళు వచ్చి డ్రాయింగులు గీసి ఇస్తారు. వాళ్ళు డ్రాయింగులు ఇస్తే రాజధాని అభివృద్ధి మండలి తన పని మొదలుపెడుతుంది. అది పని మొదలెడితే గానీ ఇంటి మీద పెంకు వేసుకోవడానికి కూడా వీలుపడదు. ఇదంతా చూస్తుంటే ఏదో ఏడూ చేపల కధలా తయారయింది చివరికి. ఈ భూముల సేకరణ ఎప్పుడు జరిగేనో...ఆ సింగపూరోళ్ళు డ్రాయింగులు గీసెదెప్పుడో...రాజధాని అభివృద్ధి మండలి పని మొదలు పెట్టేదెప్పుడో...తము ఇళ్లు కట్టుకొనేదెప్పుడో...అంటూ అందరూ భారంగా నిటుర్పులు విడుస్తున్నారు.   ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మధ్యతరగతి వాళ్ళు లక్షల్లో నష్టపోతుంటే బిల్డర్లు కొట్లలో నష్ట పోతున్నారు. మధ్యతరగతి జనాలు బ్యాంకుల నుండి వడ్డీలకి అప్పులు తెచ్చుకొని బిల్డర్ల చేతిలో డబ్బు పోస్తే, ఎలాగూ రాజధాని వచ్చేస్తోంది గనుక బిల్డర్లు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా భూములు కొనేసి చకచకా ఇళ్లు, అపార్ట్ మెంటులు లేపేసి నాలుగు రాళ్ళూ పోగేసుకొందామని ఆశపడ్డారు. ఇప్పుడు వారందరూ లబోదిబోమని మొత్తుకొంటున్నారు. కనుక ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో?

చంద్రబాబుకు ఈ చెత్త అవసరమా?

తెలుగుదేశం పార్టీలోకి చెత్త వచ్చి చేరుతోంది. అవును... నిజంగానే చెత్త. ఎందుకూ పనికిరాని చెత్త వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతోంది. ఈ చెత్తవల్ల తెలుగుదేశం పార్టీ కలుషితమైపోవడం తప్ప ప్రయోజనం ఏమీ వుండదు. అయినప్పటికీ, చంద్రబాబుకు ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ చెత్తని పార్టీలో చేరనిస్తున్నారు. ఇతర పార్టీలతో అవసరాలు తీరిపోయి, అవకాశాలు లేకుండా వున్న ‘స్క్రాప్’ అదను చూసుకుని తెలుగుదేశం పార్టీలో కలసిపోవడానికి సిద్ధంగా వుంది. కొంత చెత్త ఇప్పటికే కలసిపోయింది. ఈ పరిణామం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తెలిసీ జరగడమే పార్టీ శ్రేణులకు ఆవేదన కలిస్తోంది. ఈ చెత్తంతా తెలుగుదేశం పార్టీకి అవసరమా అని వారందరూ ఆవేదన చెందేలా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళు అధికారానికి దూరంగా వుంది. ఈ పదేళ్ళ కాలంలో అధికారమే పరమావధిగా భావించిన అనేక మంది స్వార్థపరులైన నాయకులు తెలుగుదేశం పార్టీని విడిచి పోయారు. కష్టకాలంలో అండగా నిలవకుండా దూరమైపోవడమే కాదు... ఇతర పార్టీల్లో చేరి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బొడ్డుకోసి పేరు పెట్టిన గోదావరి జిల్లాకి చెందిన ఓ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో హోదాలు అనుభవించారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో జంప్ జిలానీలా మారిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు మళ్ళీ నానా తంటాలు పడి, ఎన్నెన్నో రికమండేషన్లు చేయించుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూల నుంచి ఆ మూల వరకు కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి తహతహలాడుతున్నారు. వీళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టం చేసినవాళ్ళే. అలాంటి ‘చెత్త’ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి మళ్ళుతూ వుండటం ఇంతకాలం పార్టీని భుజాలమీద మోసిన నాయకులు, కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తోంది. చెరువులో నీరు వస్తే చేరే కప్పల్లాగా తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్న వారిని చంద్రబాబు నాయుడు ఆదరించడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో  వ్యక్తమవుతోంది. వీరంతా పార్టీకి గతంలో ద్రోహం చేసిన వారు, భవిష్యత్తులో నష్టం చేసేవారే తప్ప ఉపయోగపడేవారు కాదన్న ఆవేదనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేవారిలో కొంతమంది ఉత్తములు, పార్టీకి ఉపయోగపడేవారూ లేరని కాదు.. అయితే ఎందుకూ పనికిరాని వాళ్ళే ఎక్కువగా వుండటం గమనార్హం. అందువల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని, అవినీతిపరులను, వివాదాస్పదమైన వ్యక్తులను పార్టీలోకి తీసుకోకపోవడం మంచిదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి పార్టీని ద్రోహుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

బీజేపీలో బొత్స చేరిక ఖాయమా?

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనను పక్కను పెట్టి రఘువీరా రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుండి ఆయన పార్టీకి దూరంగా మసులుతున్నారు. అప్పటి నుండే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఈ మధ్యనే బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనతో విజయనగరంలో సమావేశమయిన తరువాత ఆయన పార్టీలోకి చేరేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియాకు చెప్పినట్లు వార్తలు వచ్చేయి.   రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్-కమిటీ గత ప్రభుత్వాల హయంలో జరిగిన అక్రమ మైనింగ్ లైసెన్సులను, భూకేటాయింపులను, ఇసుక త్రవ్వకాలు, ఎర్ర చందనం స్మగిలింగ్, లిక్కర్ సిండికేట్, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలలో జరిగిన అవినీతి అక్రమాలను త్రవ్వి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తోంది. బొత్స సత్యనారాయణను కూడా విడిచిపెట్టేది లేదని సబ్ కమిటీలో మంత్రులు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ కేసుల నుండి బయటపడాలంటే బీజేపీలో చేరడమే ఏకైక ఉపాయంగా కనబడుతోంది. పైగా రాష్ట్రంలో, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా కనబడుతున్నప్పుడు, ఆయనని పక్కన పెట్టిన పార్టీని పట్టుకొని వ్రేలాడటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక బీజేపీ అనుమతిస్తే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.   అయితే తనపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేసుల పెట్టకుండా నిలువరించాలనే షరతుతోనే ఆయన బీజేపీలో చేరినట్లయితే అప్పుడు ఆ బీజేపీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా లేకపోతే ఆయన బీజేపీలో చేరిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టినా అది తెదేపా-బీజేపీల స్నేహానికి గండి కొట్టవచ్చును. ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ బొత్సను పార్టీలో చేర్చుకొన్నట్లయితే అప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ఇష్టపడకపోవచ్చును.   బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొంటే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చనే భ్రమ కూడా మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఆయన ప్రవర్తించిన తీరును చూసి కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు దూరంగా జరిగింది. అందుకే సాధారణ ఎన్నికలలో ఆయన కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. ఒకవేళ ఆయనను బీజేపీలో చేర్చుకొంటే ఎన్నికల ప్రచార సభలలో ఆయనను తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ (ఆయన సామాజిక వర్గానికే చెందిన) కూడా బీజేపీకి దూరం అవవచ్చును.   ఎప్పటికయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజన వ్యవహారంలో పార్టీ అధిష్టానాన్ని తప్పు ద్రోవ పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చేయి. కనుక ఇప్పుడు కూడా ఆయన అటువంటి ప్రయత్నాలే చేసినట్లయితే కేంద్రం సహాయం అందక రాష్ట్రాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కనుక ఒకవేళ బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకోదలిస్తే ముందుగా ఈ పర్యవసనాలన్నిటినీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది.

కొణతాలకు సేమ్ టు సేమ్ అదే ట్రీట్‌మెంట్

  ఆలూ లేదు చూలూ లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుగా మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ త్వరలో తెదేపాలో జేరబోతున్నట్లు వార్తలు విన్నఅనకాపల్లిలో తెదేపా కార్యకర్తలు కొందరు పట్టణంలో ప్రధాన కూడలి వద్ద ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఇంతకాలం తమ పార్టీని, అధినేత చంద్రబాబును కూడా తిట్టిపోసిన కొణతాలను పార్టీలో చేర్చుకోవద్దంటూ వారు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా లేఖలు కూడా పంపారు. తామెంతో కష్టపడి కొణతాల సోదరుడుని ఎన్నికలలో ఓడిస్తే, ఇప్పుడు అన్నదమ్ములిరువురూ దొడ్డి దారిన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.   ఇదివరకు తెదేపా నేత దాడి వీరభద్ర రావు తెదేపాను వీడి వైకాపాలో చేరుతున్నప్పుడు కొణతాల వర్గీయులు కూడా ఇదేవిధంగా నిరసనలు తెలియజేసారు. ఇప్పుడు వారికి కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురవడం చాలా విచిత్రం. దాడి వీరభద్ర రావు ఎన్నికలలో వైకాపా ఓడిపోగానే పార్టీ నుండి బయటపడితే, ఆయనను వైకాపాలో చేర్చుకొన్నందుకు పార్టీపై అలిగిన కొణతాల కూడా ఆయన తరువాత పార్టీని వీడారు. దాడి వైకాపాను వీడిన తరువాత తిరిగి తెదేపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.   కొణతాల బీజేపీలో చేరుతారని చాలా వార్తలు వచ్చేయి. కానీ ఇప్పుడు కొణతాల కూడా తెదేపాలోకి చేరాలనుకొంటున్నట్లు వార్తలు రావడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయమని కార్యకర్తలను ఎవరు ప్రేరేపించారో? అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా కొణతాలకు తెదేపాలో చేరే ఉద్దేశ్యం లేకపోతే ఆయన దిష్టి బొమ్మలు ఎవరయినా ఎందుకు దగ్ధం చేస్తారు? అని ఆలోచిస్తే ఆయన తెదేపాలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగక మానదు.

కోట్లు పోసి కొనుకొన్నా అక్కడ ఆక్యుపెన్సీ నిల్?

  రాష్ట్ర విభజన తరువాత చూసుకొంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం ఒక్కటే కనబడుతోంది. మున్ముందు ఐటీ, సినీ, పరిశ్రమలు విశాఖకు తరలివచ్చే అవకాశాలు కనబడుతుండటంతో అందరూ అక్కడే ఇళ్లు, స్థలాలు వగైరాలు కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా నిలకడగా సాగుతోంది.   విశాఖకు చక్కటి సముద్రతీరం దానినానుకొని పక్కనే కొండలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా పేర్కొనవచ్చును. దానిని సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో ఉడా సంస్థ రుషికొండపై 200 లగ్జరీ విల్లాలు కట్టారు. మరో 200 ఇళ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశలో నిర్మించిన ఇళ్ళలో ఒక్కో ఇల్లు కనీసం కోటి నుండి ఒకటిన్నర కోట్ల వరకు అమ్మగా రెండవ దశలో నిర్మితమవుతున్న ఇళ్ళల్లో ఒక్కోటి రెండున్నర కోట్లు వరకు పలుకుతోంది. మున్ముందు విశాఖకు మంచి భవిష్యత్ ఉందనే ఆలోచనతో ఎక్కడో దేశ విదేశాలలో ఉన్నవారు కూడా అక్కడ ఇళ్ళు కొనుగోలు చేసారు. ఐటీ కంపెనీలు నగరానికి భారీగా తరలివస్తే వాటికి అతి సమీపంలో కట్టిన ఆ ఇళ్లకి మంచి డిమాండ్ ఉంటుందనే ఆలోచనతో కొన్నవారు చాలా మందే ఉన్నారు. అంత డబ్బు పోసి కొన్న ఇళ్ళకి కనీసం నెలకి లక్ష రూపాయలు ఆద్దె వస్తుందని ఆశిస్తున్నారు.   కానీ మొదటి దశ ఇళ్ళ నిర్మాణం, అమ్మకాలు పూర్తయి దాదాపు ఐదేళ్ళవుతున్నా వాటిలో ఇంతవరకు కేవలం 25-30 శాతం ఇళ్ళల్లో మాత్రమే నివాసముంటున్నారు. మిగిలిన ఇళ్ళన్నీ నేటికీ ఖాళీగా పడున్నాయి. నగరంలోకి చేరుకొనేందుకు కొండమీదకి సరయిన రవాణా సదుపాయం, వీధి దీపాలు, కిరాణా, కూరలు వంటి నిత్యావసర వస్తువులు అమ్మే షాపింగ్ సెంటర్లు లేకపోవడంతో అక్కడకి వచ్చి నివసించేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఆ కారణంగా ఎవరూ అక్కడ అంత అద్దె చెల్లించి దిగేందుకు ఇష్టపడకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకొని ఆ ఇళ్ళు కొనుకొన్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే ఇవేవీ పట్టనట్లు మరో 200 ఇళ్లు చకచకా నిర్మాణం చేస్తున్నారు.   అసలు నగరంలో కొండల మీద నెలకొల్పిన ఐటీ కంపెనీలే కనీస సదుపాయాలు లేక నడిపేందుకు ఆపసోపాలు పడుతుంటే వాటిని నమ్ముకొని మరో కొండ మీద ఇంత భారీగా ఇళ్లు కట్టేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటికి సమీపంలోనే శ్రీరాం గ్రూప్ వారు కూడా పనోరమా హిల్స్ పేరిట భారీ టవున్ షిప్ నిర్మిస్తున్నారు. ఉడా ఇళ్ళకి ఎదురవుతున్న ఆ సమస్యలని చూసి శ్రీరాం సంస్థ ముందుగానే జాగ్రత్త పడుతునప్పటికీ అవి కూడా నగరంలో ఐటీ రంగం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే కట్టబడుతున్నాయి కనుక వాటికీ ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.   నగరంతో నేరుగా రవాణా సదుపాయాలుండి, అన్ని విధాల అభివృద్ధి చెందిన మధురవాడ ప్రాంతం, త్వరలో పూర్తి స్థాయిలో ఐటీ హబ్ గా మారబోతున్నందున అక్కడ మాత్రం ఇళ్లు, స్థలాలు బాగానే అమ్ముడవుతున్నాయి. అయితే మున్ముందు మరింత అధిక ధరలు పలుకుతాయనే ఉద్దేశ్యంతో ఆ ప్రాంతంలో స్థలాలు కొనుకొన్నవారు మాత్రం వాటి అమ్మకానికి తొందరపడటం లేదు. నగరానికి ఐటీ, చిత్ర సీమలు రెండూ తరలివచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకొంటుంది. ఈ అభివృద్ధికి మరో కోణం కూడా ఉంది. రాష్ట్ర విభజన తరువాత విశాఖనగరానికి అనేక ప్రాజెక్టులు ప్రకటించడంతో అవింకా రాకముందే నగరంలో ఇళ్ళ అద్దెలు చాల భారీగా పెరిగిపోవడంతో మధ్యతరగతి జీవులు అల్లలాడిపోతున్నారు.

‘జబర్దస్త్’ టీమ్ పత్తిత్తులా?

  ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఈమధ్య ఓ ఎపిసోడ్‌లో గౌడ మహిళను కించపరిచే విధంగా చూపించారు. దానికి స్పందించిన గౌడ యువకులు అందులో నటించిన వేణు అనే కమెడియన్‌ని చావబాదారు. దాంతో కొంతమంది సినీ, టీవీ నటీనటులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వేణు మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్‌లో వున్నవారైతే ‘‘మేం నవ్విస్తుంటే మమ్మల్ని కొడతారా? ఇదెక్కడి న్యాయం’’ అని ఆవేదనగా ప్రశ్నించారు. ఒక కమెడియన్ మీద ఇలా దాడి చేసి కొట్టడం తప్పు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రాంలోని విచ్చలవిడితనం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.   ఒకప్పుడు ఈటీవీ అంటే ప్రజల్లో ఒక గౌరవమైన అభిప్రాయం వుండేది. ఆ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసిన ఘనత జబర్దస్త్ ప్రోగ్రాం దక్కించుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ప్రారంభంలో మెల్లమెల్లగా మొదలైన బూతులు, ద్వంద్వార్థాలు ఈమధ్యకాలంలో బాగా పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. జబర్దస్త్‌లోని టీమ్‌లో నవ్వించడం కోసం ఒకరిని మించి మరొకరు బూతులు బాగా ఉపయోగిస్తూ కుటుంబ సమేతంగా చూడలేని పరిస్థితి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్‌లోని టీమ్‌లో బూతులు, డబుల్ మీనింగ్‌లు మాట్లాడినప్పుడు ఈ ప్రోగ్రాంకి యాంకర్‌గా వున్న యువతి, జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా కూడా పగలబడి నవ్వుతూ వుంటారు. వాళ్ళమీద బూతు జోకులు వేసినా కూడా ఇహిహి అని ఇకిలిస్తూ వుంటారు. ఈ ఇకఇకలు పకపకలు జబర్దస్త్‌లో బూతుల ధోరణి పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి.   ‘నవ్వించడమే నేరమా‌?... మేం నవ్విస్తుంటే మమ్మల్ని కొడతారా?’ అని ఇప్పుడు జబర్దస్త్ టీమ్ అమాయకంగా ప్రశ్నిస్తోంది. అయితే వాళ్ళు కొట్టడం కంటే ఎక్కువ నష్టాన్ని చేస్తున్నారన్న విషయాన్ని మరచిపోతున్నారు. నవ్వించే నెపంతో సమాజంలోని ఎన్నో వర్గాలను వాళ్ళు కించపరుస్తూ స్కిట్లు రూపొందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు చూసే ప్రోగ్రాములో వాళ్ళు గుప్పిస్తున్న బూతులు సమాజానికి ఎంత నష్టం చేస్తాయో వాళ్ళు గ్రహించాలని పలువురు అంటున్నారు. సినిమాలకి సెన్సార్ అనేది ఒకటి వుంటుంది. టీవీలకు అలాంటిది లేకపోవడం వల్ల జబర్దస్త్‌లో ఎంతటి బూతు అయినా చూపించేస్తున్నారు. ఏ వర్గం ప్రజల్ని అయినా అవమానించేలా స్కిట్లు రూపొందిస్తున్నారు. మొత్తమ్మీద కమెడియన్ వేణును కొట్టడం ఎంత తప్పో, జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో బూతులు, ఇతరులను కించపరిచే స్కిట్లు ప్రసారం చేయడం కూడా అంతే తప్పన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెరాసకి మజ్లిస్ తలాక్ చెప్పబోతోందా?

  బ్రిటిష్ వాడు నేర్పిన ‘విభజించి పాలించు’ అనే ఐడియా వాడికి గుర్తుందో లేదో తెలియదు కానీ మనోళ్ళు మాత్రం దానిని ఔపోసన పట్టేసారని చెప్పవచ్చును. అయితే ఒక్కోసారి అది రాష్ట్ర విభజన వ్యవహారంలా ఎదురు తంతుంటుంది. అయినా దాని మీద మనోళ్ళకి ఉన్న మోజు అంతా ఇంతా కాదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తే తెరాస వచ్చేసింది. అయితే తెరాస తెలంగాణా రాష్ట్రాన్ని ఏలేస్తున్నప్పటికీ, రాజధాని హైదరబాద్ పై అందునా జి.హెచ్.యం.సి.పై తమ పార్టీకి బొత్తిగా పట్టులేకపోవడం కొంచెం బాధగానే ఉంటుంది. అందుకే జి.హెచ్.యం.సి. పరిధిలో ఓట్లన్నిటికీ పూర్తి పేటెంట్ హక్కులు ఉన్నాయని భావిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్గంలోకి వచ్చి పడ్డారు, మజ్లిస్ పార్టీతో తెరాసకి దోస్తీ కుదిరింది.   అయితే అంతమాత్రాన్న జి.హెచ్.యం.సి.లో తెరాస పాగా వేసేస్తుందనే గ్యారంటీ లేదు. కనుక తన ప్రత్యర్ధులను బలహీనపరచాలంటే వారు బలంగా ఉన్న వార్డులను రెండు ముక్కలుగానో వీలయితే మూడు ముక్కలుగానో విభజించడమే మంచి పద్ధతని తెరాస భావిస్తుండటంతో ప్రస్తుతం 155 వార్డులను 175 గా పునర్విభజన చేసేందుకు సిద్దమవుతోంది. అందులో మళ్ళీ మహిళలకు 50శాతం కోటా, యస్సీ, ఎస్టీ, బీసీలకు వేర్వేరుగా కోటాలు షరా మామూలే. ఇటువంటివి జీర్ణించుకోవడం ప్రత్యర్ధ పార్టీలకు వీలవుతుందేమో కానీ కేవలం ముస్లిం ప్రజల ఓట్ల మీదనే ఆధారపడిన మజ్లిస్ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చును. అందుకే అది తెరాసపై గుర్రుగా ఉందిపుడు.   ఈ వార్డుల పునర్విభజన, ఆ వంకతో ఎన్నికలు వాయిదా వేసుకొంటూపోవడం ఆ పార్టీకి చాలా కోపం తెప్పిస్తోంది. 155 మంది సభ్యులున్న జి..హెచ్.యం.సి. బోర్డు డిశంబర్ మూడున రద్దయిపోయింది. కనుక తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమేశ్ కుమార్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అంటే ఆయన ద్వారా పరోక్షంగా తను అధికారం చెప్పట్టిందని అర్ధమవుతోంది. జి.హెచ్.యం.సి. రద్దయిన తరువాత ఆరు నెలలోగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది కనుక ప్రభుత్వం కూడా ఏమీ తొందరపడటం లేదు. అయితే అంతవరకు మజ్లిస్ పార్టీ నేతలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. కనుక మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ తక్షణమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరపాలని గట్టిగా పట్టుబడుతున్నారు.   ఎన్నికలు ఆలశ్యం జరుగుతున్న కొద్దీ తెదేపా-బీజేపీలు, కాంగ్రెస్, తెరాస పార్టీలు అన్నీ క్రమంగా బలపడితే అసలుకే ఎసరు వస్తుందని మజ్లిస్ బెంగపెట్టుకొంది. అయితే ఆ మాట పైకి చెప్పకుండా జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్త సభ్యులు బాధ్యతలు చెప్పట్టేవరకు కేంద్రం నుండి జి.హెచ్.యం.సి.కి రావలసిన నిధుల విడుదల ఆగిపోతుందని, అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న జి.హెచ్.యం.సి. ఇంకా కష్టాలలోకి కూరుకు పోతుందని మజ్లిస్ నేతలు వాదిస్తున్నారు.   కానీ, నిన్నమొన్ననే తలసానిని పార్టీలోకి రప్పించుకొన్న తెరాస, వెంటనే ఎన్నికలు నిర్వహించినా గెలవడం కష్టమని భావిస్తున్నందున ముందుగా జి.హెచ్.యం.సి. పరిధిలో పార్టీ కొంత బలపడిన తరువాత అప్పుడు నిర్వహించడం మేలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన మజ్లిస్ పార్టీని కుష్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైల్ అలైన్ మెంటులో మార్పులు చేర్పులు చేసి చూసారు. కానీ ఆ తరువాత కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన నగరంలో పేదలకు 125 గజాల స్థలం ఉచితంగా క్రమబద్దీకరణ పట్ల మజ్లిస్ నేతలు గుర్రుగా ఉన్నారు.   మజ్లిస్ పార్టీతో దోస్తీ అంటూనే తెరాస తమను పట్టించుకోవడం లేదని, పైగా తమకే ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని వారు వాపోతున్నారు. తమను సంప్రదించకుండా వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించిన వారికి భూములు క్రమబద్దీకరిస్తామని చెప్పడాన్ని మజ్లీస్ నేతలు తప్పుపడుతున్నారు. వారి బాధ ఎలా ఉన్నప్పటికీ, జి..హెచ్.యం.సి.పై పూర్తి పట్టు సాధించడమే ధ్యేయంగా తెరాస అడుగులు వేస్తోంది. అందువలన ఏదో ఆనాడు మజ్లీస్ పార్టీ తెరాసకు తలాక్ తలాక్ తలాక్ చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ చెయ్యందుకొన్నా ఆశ్చర్యం లేదు.

తిరుపతి మీద జగన్ కన్ను

  తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి వుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణ కుటుంబ సభ్యులలో ఒకరిని ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియను కూడా రాజకీయ పార్టీలన్నీ ఆళ్ళగడ్డ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాయి. ఆ సంప్రదాయాన్నే తిరుపతిలోనూ కొనసాగించాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. వెంకట రమణకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. వారిద్దరూ పుట్టు బధిరులు. దాంతో వెంకట రమణ భార్య సుగుణను ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాలన్న ఆలోచనలు వున్నాయి. విద్యాధికురాలు అయిన సుగుణను ఈ స్థానం నుంచి నిలిపే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది.   ఇంతవరకూ అంతా సజావుగానే వుంది. అయితే ఇక్కడే జగన్ మార్కు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి స్థానాన్ని తన పార్టీ అకౌంట్లో జమ చేసుకోవడానికి జగన్ అద్భుతమైన తెలివితేటలతో ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్న వెంకట రమణ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలలో ఆయన వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మీద విజయం సాధించారు. వెంకటరమణ తీవ్ర అనారోగ్యం పాలైనప్పటి నుంచి కరుణాకర్‌రెడ్డి బాగా యాక్టివ్ అయిపోయారు. వెంకట రమణను పరామర్శించడం, ఆయన కుటుంబాన్ని ఓదార్చడం, వెంకట రమణ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అందరికంటే ముందుగా సందర్శించడం, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని అనడం, వెంకట రమణ అంత్యక్రియల్లో పాడె మోయడం లాంటి మంచి పనులన్నీ చేశారు. ఇక జగన్ అయితే వెంకట రమణ తన తండ్రి వైఎస్సార్‌కి ఎంతో సన్నిహితుడని అసెంబ్లీలో చెప్పారు. చాలా మంచి వ్యక్తి అని పొగిడారు. వెంకట రమణను వైద్యానికి సింగపూర్‌కి తీసుకెళ్తే బాగుండని ఆవేదనగా అన్నారు.   వీటితోపాటు ఇంకా అనేక రకాలుగా వైసీపీ నాయకులు వెంకట రమణ కుటుంబానికి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఉప ఎన్నికలలో వెంకట రమణ భార్య సుగుణ పోటీ చేయకుండా చేసే బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సుగుణ పోటీ చేయకుండా వుంటే, వెంకట రమణ కుటుంబం మద్దతుతో కరుణాకర్‌‌రెడ్డిని బరిలో దించాలన్నది ఒక వ్యూహం. అలా కాకుండా వుంటే, వెంకట రమణ భార్యను తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా వైసీపీ తరఫున బరిలోకి దించాలన్నది కూడా వైసీపీ వ్యూహమని సమాచారం. మొత్తమ్మీద తిరుపతి స్థానాన్ని తన కైవసం చేసుకోవాలన్నది జగన్ వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలోనూ వైసీపీకి బలం లేదు. ఇప్పుడు తిరుపతి నగరంలో వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైసీపీ నాయకుడు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీకులు వివరిస్తున్నారు.

తమిళనాడులోకి బీజేపీ ఎంట్రీ, చతికిలపడిన డీయంకె

  తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డి.యం.కే.పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ సినీతార మరియు పార్టీలో సీనియర్ నాయకురాలు అయిన కుష్బూ కొన్ని వారాల క్రితమే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు మరో సీనియర్ నేత నెపోలియన్ కూడా పార్టీని వీడి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన తన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు పంపిన లేఖను డి.యం.కె. అధినేత కరుణానిధి ఆమోదించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కూడా బీజేపీలో చేరారు.   తమిళనాడు కేరళ రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ రెండు రాష్ట్రాలలో పర్యటించిన అమిత్ షా ఈ సందర్భంగా చెన్నైలో మాట్లాడుతూ 2016సం.లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికలకు వెళతామని తెలిపారు.   నెపోలియన్ చేరిక బీజేపీకి చాలా బలం చేకూరిస్తే, డి.యం.కె. పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కరుణానిధి వయోభారంతో పార్టీని నడుపలేని స్థితికి చేరుకొంటే, ఆయన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ పార్టీ ఆధిపత్యం కోసం పోరాడుకొని విడిపోయారు. అళగిరిని పార్టీ నుండి సప్స్పెండ్ చేసినా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు పైగా నానాటికీ మరింత క్షీణిస్తోంది.   తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన కారణంగా అధికార అన్నాడీఎంకెపార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు, ఇటువంటి అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీయంకె ఇప్పుడు ఆ గొప్ప అవకాశాన్ని అందుకోలేక చతికిలపడితే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చురుకుగా కదిలి ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవదానికి గతి ప్రయాణాలు చేయడం విశేషం. అమిత్ షా ఇదే దూకుడు ప్రదర్శిస్తే బహుశః వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మొట్టమొదటిసారిగా తమిళనాడులో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చును.

విశాఖలో ఏషియన్ పెయింట్స్ నిర్మాణ కార్యక్రమాలు త్వరలో

  రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు జరిగాయి. అనేక సంస్థలకు ప్రభుత్వం అనుమతులు, భూ కేటాయింపులు చేస్తోంది. ఆ ప్రక్రియలన్నీ ఒకటొకటిగా పూర్తవుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ముందుగా విశాఖ జిల్లాలో అచ్యుతాపురం వద్ద పూడి అనే గ్రామంలో రూ.1818కోట్ల పెట్టుబడితో భారతదేశంలో ఎంతో పేరుగాంచిన ఏషియన్ పెయింట్స్ సంస్థ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.సి.సి.) ఏషియన్ పెయింట్స్ సంస్థ కోసం పూడి గ్రామం వద్ద 110 ఎకరాలను కేటాయించింది. త్వరలో ఆ భూమిని ఏషియన్ పెయింట్స్ సంస్థకు అప్పగించబోతున్నారు. వచ్చే నెల నుండి నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరి కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. కనుక భూమి అప్పగించిన వెంటనే రేయింబవళ్ళు నిర్మాణ కార్యక్రమాలు చేసేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.   ఆ సంస్థ తన ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా 700మందికి, పరోక్షంగా మరనేక వేల మందికి ఉపాధి లభించవచ్చును. అక్కడ రోజుకి నాలుగు లక్షల పెయింట్ ఉత్పత్తి అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే అచ్యుతాపురం ప్రాంతంలో అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలు, బ్రాండిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ సంస్థ కూడా వచ్చినట్లయితే ఆ చుట్టూ పక్కల అభివృద్ధి వేగవంతం అవుతుంది. దీని వలన అనేకమందికి ఉపాధి దొరకడమే కాకుండా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుంది.   ఈ సంస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడితో చిత్తూరులో శ్రీ సిటీ వద్ద త్వరలో హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థ కూడా రాబోతోంది. హీరో మోటోకార్ప్ సంస్థ కూడా వచ్చే ఏడాది చివరిలోగా నిర్మాణం పూర్తి చేసుకొని 2016 నుండి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది.

వెంకయ్య - కిషన్ రెడ్డి మధ్య అగాథం

  వాళ్ళిద్దరూ గురు శిష్యులు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారానికి దూరంగా ఉన్నంతకాలం ఒకరికి ఒకరు దగ్గరగా వున్నారు. ఇప్పుడు అధికారం దగ్గరగా వచ్చిన తర్వాత వారిద్దరూ దూరమైపోయారు. కలసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వారు ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు... బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.   వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి... ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ అభిప్రాయ భేదాలు వచ్చాయో గానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో వెంకయ్య నాయుడు హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి అక్కడకి తప్పకుండా వచ్చేవారు. అధికార కార్యక్రమం అయినా, అనధికార కార్యక్రమం అయినా కిషన్ రెడ్డి హాజరు తప్పనిసరిగా కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా కిషన్ రెడ్డి అక్కడ కనిపించడం లేదు. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో వున్న కిషన్ రెడ్డి వెళ్ళి కలవటం మర్యాద. ఆ మర్యాదని కూడా కిషన్ రెడ్డి పాటించనంతగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా భావించే యన్నం శ్రీనివాసరెడ్డి ఆమధ్య వెంకయ్య నాయుడిని విమర్శించినప్పుడు కూడా కిషన్ రెడ్డి ఆ విమర్శలను ఖండించకుండా మిన్నకున్నారు. బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలాంటి ధోరణులు కుదరవు. అయినప్పటికీ కిషన్ రెడ్డి ఇదే పంథాలో వ్యవహరిస్తున్నారు.   కిషన్ రెడ్డి వ్యవహార శైలి వెంకయ్య నాయుడికి నచ్చకపోయినప్పటికీ ఆయన ఈ అంశాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళ దలచుకోనట్టు తెలుస్తోంది. ఎందుకంటే, నరేంద్రమోడీ వెంకయ్య నాయుడికి ఎంత సన్నిహితుడో కిషన్ రెడ్డికి కూడా అంతే సన్నిహితుడు. దశాబ్దాల క్రితం ఇద్దరూ కలసి భారత ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్ళిన స్నేహం కూడా వీరిమధ్య వుంది. అందువల్ల కిషన్ రెడ్డి వ్యవహార శైలిని మోడీ దృష్టికి వెంకయ్య తీసుకెళ్ళలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య నాయుడు ప్రోత్సహిస్తున్నట్టు, కిషన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య భుజాన వేసుకోవడం ఎంతవరకూ వచ్చిందంటే, త్వరలో ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనంత వరకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ వెంకయ్య లాంటి నాయకుడితో కిషన్ రెడ్డి అనవసరంగా దూరాన్ని పెంచుకుంటున్నారేమోనన్న అభిప్రాయం తెలంగాణ బీజేపీ వర్గాల్లో వినిస్తోంది.

చక్రి ఆత్మహత్య చేసుకున్నారా?

  ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను విషాదంలో ముంచింది. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చక్రి మరణం ఎంతో బాధాకరం. చక్రి మరణించక ముందు రోజు వరకూ ఆయన జీవితం గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కేవలం శరీరం విపరీతంగా లావుగా వుంటుందే తప్ప... మరే విషయంలోనూ ఆయనకు ఎలాంటి లోటూ లేదని అందరూ భావించారు. వందకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి కోట్లకు కోట్లు సంపాదించారని అందరూ అనుకుంటారు. అయితే ఆయన జీవితం వెనుక అసలు విషయాలు ఆయన మరణం తర్వాత బయటపడుతున్నాయి. అలా బయటపడిన అనేక విషయాలు చక్రి అందరూ అనుకుంటున్నట్టుగానే స్థూలకాయం కారణంగా గుండెపోటుతో మరణించారా... లేక ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలను ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల్లో కలిగిస్తున్నాయి.   శరీరం విపరీతంగా పెరిగిపోయిన చక్రి నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూనే వుండేవారు. ఆయన గుండెకు ఎలాంటి సమస్య లేదని డాక్టర్లు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు మరణిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చక్రి మరణించిన రోజు అర్ధరాత్రి రెండు.. రెండున్నర వరకు మేలుకునే వున్నారట. తెల్లవారు ఝామున ఆరుగంటలకు చూస్తే చక్రి చనిపోయి వున్నారు. అయితే అప్పటికే ఆయన పూర్తిగా నల్లగా మారిపోయి వున్నారు. ఒకవేళ నిద్రలో గుండెపోటుతో మరణిస్తే శరీరం నల్లగా ఎందుకు మారిపోయింది? అది కూడా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన శరీరం అలా ఎందుకు మారిపోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   చక్రి మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో ఉన్న వివాదాలు బయటపడ్డాయి. చక్రి తల్లి, తమ్ముడు, సోదరీమణుల మధ్య, చక్రి భార్య శ్రావణి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చక్రికి శ్రావణి విషం పెట్టి చంపేసిందని మిగతా కుటుంబ సభ్యులు ఆరోపించారట. ఈ విషయాన్ని చక్రి భార్యే బయటపెట్టారు. తనను చక్రి వైపు బంధువులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పారు. హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణభయం వుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చక్రితో ఎలాంటి బంధుత్వమూ లేనివారు చక్రి మరణాన్ని తలచుకుని బాధపడుతుంటే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆస్తిపాస్తుల కోసం చక్రి మరణాన్ని ‘హత్య’గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, వివాదం హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకూ వెళ్ళడం చేశారు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఇంత గొడవ అయిన తర్వాత వాళ్ళంతా మనం మనం బంధువులం అనుకుని రాజీ పడిపోయారు. కానీ వారు చేసిన గొడవ వల్ల చక్రికి ఏర్పడిన అప్రతిష్ఠని చెరిపేయగలరా?   చక్రి మరణం తర్వాత జరిగిన గొడవ సంగతి అలా వుంచితే, చక్రి ఆత్మహత్యకు పాల్పడి వుంటారన్న సందేహాలను ఆయన అభిమానులు, సినిమా రంగంలోని వారు వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి ముంచుకొచ్చిన మానసిక ఒత్తిడి చక్రిని ఆత్మహత్యకు ప్రేరేపించి వుండవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న చక్రి బాగానే సంపాదించారు. అయితే ఆయన సంపాదన మొత్తం ఖర్చయిపోయిందని ఆయన భార్యే చెబుతున్నారు. ఒక్క ఇల్లు తప్ప బ్యాంకులో బ్యాలన్స్‌ ఏమీ లేదని చక్రి బాధపడేవారట. సినిమాలు లేక, పని చేసిన సినిమాలు కూడా విజయ సాధించక చక్రి మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యేవారట. చేతిలో డబ్బు లేదు, సినిమాలు లేవు... ఈ డిసెంబర్ 31వ తేదీ కోసం ఒక ఫంక్షన్‌ ఈవెంట్ నిర్వహించాలని చక్రికి ఆహ్వానం వస్తే ఆయన చాలా సంతోషించారట. మనకి ఇప్పుడు కొంత డబ్బు వస్తుందని సంబరపడిపోయారట. చివరికి ఆ ఈవెంట్ కూడా కేన్సిల్ అయిపోయేసరికి బాగా డీలా పడిపోయారట. ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన చక్రి ఏదో కాస్తంత డబ్బు వచ్చే ఒక ఈవెంట్ మిస్ అయిందని డీలాపడిపోయారంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఎర్రబస్సు’ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చక్రి ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయేసరికి బాగా నిరాశపడిపోయారట. ఇవన్నీ ఆయన భార్యే వెల్లడించారు.   సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంక్ బ్యాలన్స్ నిల్ అయింది. దానికితోడు చేతిలో సినిమాలు లేవు. దానికితోడు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా సహకరించని భారీ కాయం. ఉన్న ఫ్రెండ్సందరూ మందుపార్టీ ఫ్రెండ్సే తప్ప మనసుకు ఊరటనిచ్చే ఫ్రెండ్స్ కాదు. చక్రికి పిల్లలంటే ఇష్టం. తమ దంపతులకు పిల్లలు పుడితే వాళ్ళని సినిమా సంగీత రంగంలో తన వారసులుగా తీర్చిదిద్దాలని చక్రి తపించేవారట. అయితే చక్రి భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదట. పిల్లల కోసం ఎన్నో ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. పిల్లలు కలగకపోవడం ఎంత పెద్ద బాధో దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. వీటికి తోడు చక్రి భార్యకి, చక్రి కుటుంబానికి మధ్య నిరంతరం ఘర్షణలు. చక్రి చనిపోయిన ముందు రోజు కూడా చక్రి తల్లి, చక్రి భార్య ఇద్దరూ గొడవపడ్డారట. దాంతో చక్రి కుటుంబం మొత్తం చక్రి ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయిందట. చక్రికి విజయాల విజయాలు వచ్చి పాపులర్ అయ్యేరేగానీ, మానసికంగా చక్రి చాలా చిన్నపిల్లాడు. అలాంటి చిన్న పిల్లాడిని ఇన్ని ఒత్తిడులు ఒక్కసారిగా చుట్టుముడితే, ఒత్తిడులను తప్పించుకునే దారి కనిపించకపోతే ఏమవుతుంది? ఆ చిన్నపిల్లాడి మనసు ఏ నిర్ణయం తీసుకుంటుంది?   ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక చక్రి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘చస్తే ఏ గొడవాలేదు.. చస్తే ఏ గోలా లేదు’ అనే పాటని చక్రి పాడారు. ఇన్ని ఒత్తిడులు ఎదుర్కొంటున్న చక్రి తన పాటను అనుసరించి వెళ్ళిపోయారా అనే అనుమానాలను ఆయన అభిమానులు, సినిమా పరిశ్రమలోనివారు వ్యక్తం చేస్తున్నారు. చక్రి మరణవార్త తెలిసిన అందరూ... చక్రి బాగా లావుగా వుంటాడు కాబట్టి గుండెపోటు వచ్చి వుంటుందిలే అని అనుకున్నారు. ఇప్పుడు చక్రి జీవితంలోని అసలు గుట్టంతా బయటపడేసరికి ఇప్పుడు ఆయన మరణం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి బదులుగా తెరాస గెలిచింది అంతే!

  ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు తమ ఓటమికి తలోరకంగా బాష్యం చెప్పుకొంటే, గెలిచిన పార్టీ తమకు అఖండ ప్రజాధారణ ఉంది గనుకనే గెలవగలిగామని భుజాలు చరుచుకొంటుంటాయి. ఒకానొక సమయంలో తెలంగాణాలో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్న తెరాస గెలిచిన తరువాత ఆవిధంగానే భుజాలు చరుచుకొంది. అయితే బీజేపీ తెలంగాణ ఇన్ చార్జీ మురళీ ధర్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీకి బదులుగా తెరాస గెలిచింది తప్ప ఆ పార్టీ అనుకొంటున్నట్లుగా తెరాస ఏ పార్టీని ఓడించి గెలవలేదని తేల్చి చెప్పారు.   ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తెలంగాణా జిల్లాలు అన్నీ తిరిగి ఎంతగా ప్రచారం చేసినా, ఫలితాలు వెలువడే సమయానికి ఆయన గెలుస్తామనే నమ్మకం కోల్పోయిన మాట వాస్తవం.   తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీకి భారీ మెజార్టీ రాకపోయినా కనీసం బొటాబొటి సీట్లతోనయినా తాము అధికారంలోకి రావడం ఖాయమని చాలా దృడంగా నమ్మారు. ఒకవేళ తమకు మెజార్టీ రాకపోయినా, తెరాసకు కూడా మెజార్టీ రాదని, అప్పుడు తప్పని పరిస్థితుల్లో తెరాస తమ మద్దతు కోరుతుందని, దానికి మద్దతు ఇచ్చి తెరాసతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు భావించిన మాట కూడా వాస్తవం. బహుశః ఈ పరిస్థితిని గమనించిన తరువాతే కేసీఆర్ గొంతులో కొంత మార్పు వచ్చింది. అందుకే ఆ సమయంలో ఆయన మళ్ళీ సోనియాగాంధీ భజన అందుకొన్నారు. కానీ అదృష్టవశాత్తు తెరాస గెలిచింది. తనంతట తానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. దానితో ఆయన గొంతులో కూడా మార్పు వచ్చింది మళ్ళీ. అది చూసి కాంగ్రెస్ నేతలు ఖంగు తిన్నారు.   ఇదే విషయాన్ని బీజేపీ నేత ఇప్పుడు మరో విధంగా చెపుతున్నారని భావించవచ్చును. అయితే ఆయన కాంగ్రెస్ ఓటమికి గల అనేక కారణాలకు మరొక కొత్త కారణం కూడా తాజాగా జత చేసారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకే వారికి మతపరమయిన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నించిందని, ఆ కారణంగానే హిందువులు ఆ పార్టీకి దూరమయ్యారని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని, తెరాస గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.   ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పంధాలోనే ముందుకు సాగుతూ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇచ్చివారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారని కనుక మున్ముందు తెరాస భవిష్యత్ కూడా కాంగ్రెస్ లాగే మారవచ్చని ఆయన జోస్యం చెప్పారు. తెరాస హిందువులకి దూరంగా జరుగుతున్న కొద్దీ వారు బీజేపీకి మరింత చేరువవుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ అమలు చేయాలనుకొంటున్న ముస్లిం రిజర్వేషన్ వల్ల ఆ పార్టీకి ఏమయినా ప్రయోజనం కలుగుతుందో లేదో తెలియదు కానీ బీజేపీకి మాత్రం తప్పకుండా ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్, వైకాపా, తెరాసలు కూటమిగా ఏర్పడనున్నాయా?

  ఇంతకాలం వైకాపా, తెరాసాలు ఒకదాని ప్రసక్తి మరొకటి తేకుండా చాలా జాగ్రత్త పడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకదాని పరిధిలోకి మరొకటి ప్రవేశించలేదు. కనుక ఇంతవరకు ఒకరి వల్ల మరొకరికి ఎటువంటి సమస్యలు లేవు, సవాళ్లు లేవు. కనుక ఇంతకాలం వారి స్నేహం బాగానే సాగిపోయింది. కానీ ఇప్పుడు జగన్ తనకు బాగా అచ్చివచ్చిన షర్మిలాస్త్రాన్ని తెలంగాణా మీదకి అంటే తెరాస మీదకి సందించారు. అయినప్పటికీ ఆ బాణం ఎవరినీ గాయపరచకుండా తెలంగాణాలో తమ పార్టీ పరిస్థితి ఏమిటో అంచనా వేసుకొని వెనక్కి తిరిగి వచ్చేసింది.   అదేవిధంగా కేసీఆర్ కానీ తెరాస నేతలు గానీ ఎవరూ కూడా ఆమె యాత్రపై కిమ్మనలేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా లో ఓదార్పు యాత్రకి వచ్చినప్పుడు ఆయన రైల్లోంచి కాలు క్రిందపెట్టడానికి కూడా ఒప్పుకోని తెరాస, ఇప్పుడు షర్మిల యాత్రకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అసలు ఆమె వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా గమనించనట్లు ఊరుకొన్నారు. ఆమెను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తే బహుశః ఆమె పరామర్శ యాత్రకు అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని భావించి ఊరుకోన్నారేమో తెలియదు. అదేవిధంగా షర్మిల కూడా తెలంగాణా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకుండా సమస్యలున్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని చిన్న విజ్ఞప్తి చేసి వచ్చేసారు.   ఆ రెండు పార్టీల ఈ తీరు గమనిస్తే, తెలంగాణాలో తెదేపా, బీజేపీలను ఎదుర్కొనేందుకు మున్ముందు కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాయేమోననే అనుమానంగా ఉంది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగు ఇక బాగుపడే అవకాశాలు కనుచూపుమేర కనబడటం లేదు కనుక అది కూడా తప్పనిసరిగా తమతో చేతులు కలపవచ్చని, అప్పుడు తెదేపా-బీజేపీలను ఎదుర్కోవడం తేలికవుతుదని వారు భావిస్తున్నారేమో. మళ్ళీ త్వరలో మొదలయ్యే పరామర్శ యాత్రలో కూడా తెరాస, వైకాపాలు ఇదే తీరుగా వ్యవహరించినట్లయితే ఈ అంచనాలు నిజమని నమ్మవచ్చును.

ఇరాక్‌లో మరో దారుణ ఘటన

  బిన్ లాడెన్ మరణంతో తాలిబాన్ ఉగ్రవాదుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని అందరూ సంతోషిస్తుంటే అంతకంటే క్రూరమయిన ఐ.యస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ మరొకటి పుట్టుకొచ్చింది. అది చేస్తున్న దారుణ మారణహోమం చాలా వరకు బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఇరాక్, సిరియా దేశాల ప్రజలు దాని దురాఘతాలకి మౌనంగా బలయిపోతున్నారు. తాలిబాన్ ఉగ్రవాదులు పెషావర్ లో 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటనతో యావత్ ప్రపంచం కలవరపడుతుంటే, ఈ ఐ.యస్. ఉగ్రవాద సంస్థ అంతకంటే దారుణమయిన ఘాతుకానికి పాల్పడిన విషయం కొంత ఆలశ్యంగా బయటపడింది.   ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఐ.యస్.ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులు, అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం చేసేసారని ఇరాక్‌ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చనిపోయిన వారిలో గర్భిణులు, అభం శుభం తెలియని చిన్నారులు కూడా చాలా మంది ఉన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. వారిని చంపడానికి కారణం ఆ మహిళలు వారిని పెళ్లి చేసుకొనేందుకు ఇష్టపడకపోవడమేనట. ఐ.యస్.ఉగ్రవాదులు మొత్తం 241మందిని కాల్చి చంపారని ఇరాక్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఇరాక్‌లోని అల్‌ అన్బర్‌ అనే ప్రాంతంలో ఐ.యస్. ఉగ్రవాదుల నాయకుడు అబూ అనాస్‌ అలి లిబి నేతృత్వంలో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఇటువంటి మారణ హోమాలు అక్కడ ఇంకా ఎన్నిజరుగుతున్నాయో ఎందరు బలయిపోతున్నారో వాటిని ఎవరు అడ్డుకొని అమాయకులయిన ప్రజలను కాపాడుతారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు మనిషికి నాగరికత తెలియని రోజుల్లో కూడా బహుశః ఇటువంటి దారుణాలు జరిగి ఉండవేమో. కానీ నాగరికత నేర్చిన మానవుడు మతం పేరుతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతుండటం, వాటిని ప్రపంచదేశాలు నిస్సహాయంగా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవడం మానవజాతి సమస్తం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం.

ముఖ్యమంత్రినవుతా, సమస్యలన్నీ పరిష్కరిస్తా...జగన్

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా అతని దగ్గర చాలా నేర్చుకోవలసింది చాలా ఉంది. రాష్ట్రంలో ఏ మూల సమస్య వచ్చినా, ఎవరు కష్టాలలో ఉన్నా ఆయన అక్కడ టక్కున వాలిపోయి వారిని ఓదార్చుతుంటారు. వారి కోసం ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటాలు చేస్తానని భరోసా ఇస్తారు. ఇవ్వడమే కాదు వారి కోసం ధర్నాలు దీక్షలు అంటూ పాపం కడుపు మాడ్చుకొంటారు కూడా. ఇంకా అవసరమయితే స్వంత ఖర్చులతో డిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి వచ్చేందుకు కూడా ఆయన వెనుకాడరు. ఇంతచేసినా ఆయనని చూసి అధికార పార్టీ నేతలు ఏమీ నేర్చుకోకపోగా ఏవో కేసులు, కోర్టులు, లక్ష కోట్లు, ఈడీ జప్తులు, జైలు అంటూ అసందర్భంగా అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతూ సున్నితమయిన ఆయన మనసు నొప్పిస్తుంటారు. అయితే ఆయన వారి తాటాకు చప్పుళ్ళకు బెదిరిపోయే రకం కాదు కనుకనే అంత నిబ్బరంగా ఉండగలుగుతున్నారు.   ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం తీర్చలేకపోతోంది. కనుక నాలుగున్నరేళ్ళ తరువాత తమ పార్టీ అధికారంలోకి వచ్చి తను ముఖ్యమంత్రి అవగానే అన్ని సమస్యలను మంత్రదండంతో మాయం చేసేస్తానని ప్రజలకు నచ్చజెప్పుతూ వారు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడుకొస్తున్నారు. లేకుంటే ఆయన జీవితమంతా ఓదార్పు యాత్రలకే సరిపోతుంది.   తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం నుండి సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కానీ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డికి వారిపై ఉన్నంత ప్రేమ, అభిమానం, వారి సమస్యల పట్ల అవగాహన లేదో ఏమో గానీ వారి సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘జగమంత కుటుంబం నాది’ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి వారి దగ్గర వాలిపోయారు. వారిని కూడా ఓదార్చారు. ప్రభుత్వం వారినందరినీ మోసం చేస్తున్నందుకు పాపం ఆయన కూడా చాలా బాధ పడ్డారు. పంట రుణాల మాఫీ, రాజధాని భూములు, హూద్ హూద్ తుఫాను సహాయం, పెన్షన్లు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, కోర్టు కేసులు, ఈడీ జప్తులు వంటి సవాలక్ష సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారి తరపున కూడా తను పోరాడుతానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశం లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోయినట్లయితే, ఇక ఎవరూ చేయగలిగేదేమీ ఉండదు కనుక ఓ నాలుగున్నరేళ్లు ఓపికబడితే తను ముఖ్యమంత్రి అవగానే వారి సమస్యలను తనే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.   ఇంతకంటే ఎవరయినా ఏమి చేయగలరు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు కదాని వారి కోసం లక్ష కోట్లు కరిగించేసుకోలేము కనుక వారిని ఓ నాలుగున్నరేళ్లు ఉగ్గబట్టుకొని ఉంటే తనే వారి కష్టాలన్నీ తీర్చుతానని హామీ ఇస్తున్నారు అంతే. కష్టాల్లో ఉన్నవారిని ఆయన ఓదార్చి భరోసా ఇస్తుంటే అధికార పార్టీ నేతలు ఆయనను మెచ్చుకోకపోయినా పరువాలేదు కానీ ‘ఆయన ముఖ్యమంత్రి అవలేకపోయినా తప్పకుండా మళ్ళీ జైలుకి పోతాడు’ అని ఎకసెక్కెం చేయడం మాత్రం మానరు.అయనవంటి మంచివాళ్లకు ఈలోకంలోచోటే లేదు. ఈ పాడులోకం కంటే ఆ చంచల్ గూడా జైలే వెయ్యి రెట్లు నయమనిపిస్తోంది.