మంత్రి పదవులు లేవు ఓన్లీ కిరీటాలే...అడ్జస్ట్ అయిపోండి
posted on Dec 24, 2014 @ 2:27PM
ప్రజాసేవ అంటే మాటలా? చెప్పిన ప్రతీ మాటకి చప్పట్లు ముందు వెనుకా కొట్టేందుకు ఓ నలబై మంది అనుచరులు ఉండాలి...వారందరినీ మేపడానికి ఆర్ధిక స్తోమత ఉండాలి....అది సమకూర్చుకొనేందుకు ఏదో ఒక పదవి ఉండాలి...పదవి ఉంటే ముందు వెనుక ఏకే 47తుపాకులు పట్టుకొని తిరిగే సెక్యూరిటీ ఉండాలి... అన్నీ ఉండి ఎర్రబుగ్గ కార్లు లేకపోతే చాలా నామోషీగా ఉంటుంది...గనుక అదీ తప్పదు. అలాగని దొరికిన ఆ ఒక్క ఎర్రబుగ్గ కారేసుకొని జనాల్లోకి రయ్యని వెళిపోతే ఎవరు పట్టించుకోరు సరికదా ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంటుంది..కనుక మళ్ళీ దానికి ముందూ వెనుకా ఓ పాతిక కార్లు, పోలీసు ఎస్కార్టులు తప్పనిసరి. అప్పుడే ప్రజాసేవ చేయడానికి వీలు పడుతుంది. కానీ ఈ కష్టం ఏమీ తెలియని అజ్ఞానులయిన జనాలు “ఓస్.. ప్రజాసేవే కదా...”అని తేలికగా తీసిపడేస్తుంటారు.
ఇక విషయంలోకి వస్తే మొన్నీ మధ్యన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన మంత్రి వర్గం విస్తరించినప్పుడు చాలా మందికి లోపల కుర్చీలు దొరకకపోవడంతో ప్రజాసేవ చేయలేకపోతున్నందుకు తెగ ఇదయిపోయారు. వాళ్ళు అదేపనిగా ఇదయిపోయి చివరికి వాళ్ళ ఉసురు తగిలితే అది తన ప్రభుత్వానికి మంచిది కాదనుకొన్నారో ఏమో గానీ కేసీఆర్ గారు “మీకు కుర్చీలు ఇవ్వలేకపోయినందుకు సారీ! కానీ మీకందరికీ కిరీటాలు (అంటే క్యాబినెట్ ర్యాంక్ హోదా అన్నమాట) ఇస్తాను పెట్టుకొని తిరగండి” అని చెప్పి ఓమూడు డజన్ల మంది తెరాస నేతలందరికీ తలకొక కిరీటం పంచి పెట్టేసారు.
“ఆ కిరీటం ధరించిన వారికి ఎవరికయినా సరే మంత్రిగారికి ఉండే అన్ని సౌకర్యాలు కల్పించవలెను” అని రూల్స్ వ్రాసుకొన్నాము గనుక అందరికీ నీలిబుగ్గ కార్లు దానితో బాటే మిగిలిన హంగులన్నీ అమరి పోయాయి. ఇప్పుడు వారందరూ ఆ కార్లేసుకొని నగరంలో రయ్యి రయ్యిమంటూ గిరగిరా తిరిగేస్తుంటే, “మాకూ రోడ్ల మీదకు వచ్చేందుకు కొంచెం సమయం కేటాయిస్తే బాగుంటుంది కదా” అని జనాలు గొణుకొంటున్నారుట.
నిజానికి ఎప్పుడో 1989లో మోటార్ వాహానాల చట్టంలో 314 రూల్స్ ప్రకారం కేవలం ముఖ్యమంత్రి, అందరు మంత్రులు, రాష్ట్ర ప్లానింగ్ కమీషన్ చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్ లకు మాత్రమే ఈ నీలి బుగ్గలుండాలి అని వ్రాసుకొన్నాము. కానీ క్యాబినెట్ హోదా ఉన్నవాళ్ళకి నీలి బుగ్గలు ఉండకూడదని ఎక్కడా వ్రాసిలేదు. అది పట్టించుకోకుండా గిట్టని వాళ్ళు దీనినీ తప్పు పట్టడం చాలా అన్యాయం.
ప్రస్తుతం కొత్తగా నీలిబుగ్గల వారు ఎవరెవరు అంటే: చీఫ్ విప్: కొప్పుల ఈశ్వర్, విప్: గంపా గోవర్ధన్, నల్ల ఓదెలు మరియు జి.సునీత, యస్. నిరంజన్ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమీషన్; గంటా చక్రపాణి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్; శాసనసభ్యులు:వి.శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావు, దాశ్యం విని భాస్కర్, కోవ లక్ష్మి, పార్లమెంటరీ కార్యదర్శులుగా కొత్తగా నియమితులయిన మరో నలుగురు సభ్యులు పాతవారితో వెరసి మొత్తం ఓ యాబై మంది వరకు ఉంటారు.
ఇంతమంది కలిసి ప్రజాసేవ చేస్తున్నా ఇంకా ప్రజలు అపార్ధం చేసుకొంటే ఏమి బాగుంటుంది? వీలయితే చంద్రబాబునాయుడి గారి చెవిలో కూడా ఈ ఐడియా వేస్తే ఆయన కూడా అది వర్కవుట్ అవుతుందేమో చూసుకొంటారు కదా?