టీ జాక్ అవసరం ఇంకా ఉందా?
తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా రాజకీయ జే.యే.సి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత నుండి క్రమంగా తన ఉనికిని కోల్పోతూ వస్తోంది. నిజానికి తెలంగాణా రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన టీ-జే.యే.సి. తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కొనసాగాలనుకోవడం వలననే దాని ఉనికి, గౌరవం పోగొట్టుకొంటోందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత తనను రాజకీయ పార్టీలు దగ్గరకు రానీయవని తను ముందే ఊహించానని టీ-జే.యే.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ చెప్పడమే అందుకు నిదర్శనం.
ఇంతకు ముందు ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా రాష్ట్రం దోపిడీకి గురవుతోందని, కనుక మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలని తెరాస నేతలు, టీ-జే.యే.సి. నేతలు వాదించే వారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రాన్ని వారే పరిపాలించుకొంటున్నారు. తెలంగాణా ప్రభుత్వం తన ప్రజల కోసం అనేక భారీ అభివృద్ధి, సంక్షేమ పధకాలు రూపొందించి వాటిలో కొన్నిటిని అమలు చేస్తోంది కూడా. అయినా కూడా టీ-జే.యే.సి. నేతలు మాత్రం దానిని నేటికీ రద్దు చేయాలనుకోవాలనుకోవడం లేదు. అయితే దానిని ఇంకా కొనసాగించేందుకు వారికి సరయిన కారణాలు మాత్రం లేవు. కానీ ఒక్కటే కారణం కనిపిస్తోంది. ఇంతకాలం టీ-జే.యే.సి. వలననే వారికి తెలంగాణాలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాయి. అందుకే దానిని ఇంకా కొనసాగిస్తున్నారని భావించవలసి ఉంటుంది.
వారు అధికార తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను ప్రశ్నించే సాహసం చేయలేకపోవడం వలన ప్రజల దృష్టిలో చులకనయిపోయారు. ఇటీవల రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజ్రుంభించి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా టీ-జే.యే.సి. నేతలెవరూ నోరు విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. అలాగని తెలంగాణ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రాలేకపోవడం చేత వారిని తెరాస పార్టీ కూడా దగ్గరకు రానీయ లేదు. దానితో వారు ప్రజలకీ, ప్రభుత్వానికి కూడా కాని వారయిపోయారు. క్రమంగా వారి ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారిపోయింది.
అయినప్పటికీ టీ-జే.యే.సి. ద్వారా తమకు సమాజంలో వచ్చిన ప్రత్యేక గుర్తింపును వదులుకోలేని వారి బలహీనత కారణంగానే వారు నేటికీ దానిని సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాని వలన వారు నానాటికీ ప్రజల, ప్రభుత్వం దృష్టిలో మరింత చులకన అవుతున్నారనే సంగతిని మాత్రం గ్రహించలేకపొతున్నారు. హైదరాబాదులో నిన్న సమావేశమయిన టీ-జే.యే.సి. నేతలు ఇకపై ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధిగా పనిచేయాలని నిశ్చయించుకొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి గురించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని వారు నిర్ణయించుకొన్నారు.
ప్రభుత్వం తరపున వారు ప్రచారం చేసి దాని మెప్పు పొందదలచుకొంటే ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చును. కానీ ప్రజాభిప్రాయం పేరిట తన ప్రభుత్వానికి ఉచిత సలహాలు, సూచనలు చేసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని దూరంగా అట్టేబెట్టడం తధ్యం.