కోట్లు పోసి కొనుకొన్నా అక్కడ ఆక్యుపెన్సీ నిల్?
posted on Dec 22, 2014 @ 6:53PM
రాష్ట్ర విభజన తరువాత చూసుకొంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం ఒక్కటే కనబడుతోంది. మున్ముందు ఐటీ, సినీ, పరిశ్రమలు విశాఖకు తరలివచ్చే అవకాశాలు కనబడుతుండటంతో అందరూ అక్కడే ఇళ్లు, స్థలాలు వగైరాలు కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా నిలకడగా సాగుతోంది.
విశాఖకు చక్కటి సముద్రతీరం దానినానుకొని పక్కనే కొండలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా పేర్కొనవచ్చును. దానిని సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో ఉడా సంస్థ రుషికొండపై 200 లగ్జరీ విల్లాలు కట్టారు. మరో 200 ఇళ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశలో నిర్మించిన ఇళ్ళలో ఒక్కో ఇల్లు కనీసం కోటి నుండి ఒకటిన్నర కోట్ల వరకు అమ్మగా రెండవ దశలో నిర్మితమవుతున్న ఇళ్ళల్లో ఒక్కోటి రెండున్నర కోట్లు వరకు పలుకుతోంది. మున్ముందు విశాఖకు మంచి భవిష్యత్ ఉందనే ఆలోచనతో ఎక్కడో దేశ విదేశాలలో ఉన్నవారు కూడా అక్కడ ఇళ్ళు కొనుగోలు చేసారు. ఐటీ కంపెనీలు నగరానికి భారీగా తరలివస్తే వాటికి అతి సమీపంలో కట్టిన ఆ ఇళ్లకి మంచి డిమాండ్ ఉంటుందనే ఆలోచనతో కొన్నవారు చాలా మందే ఉన్నారు. అంత డబ్బు పోసి కొన్న ఇళ్ళకి కనీసం నెలకి లక్ష రూపాయలు ఆద్దె వస్తుందని ఆశిస్తున్నారు.
కానీ మొదటి దశ ఇళ్ళ నిర్మాణం, అమ్మకాలు పూర్తయి దాదాపు ఐదేళ్ళవుతున్నా వాటిలో ఇంతవరకు కేవలం 25-30 శాతం ఇళ్ళల్లో మాత్రమే నివాసముంటున్నారు. మిగిలిన ఇళ్ళన్నీ నేటికీ ఖాళీగా పడున్నాయి. నగరంలోకి చేరుకొనేందుకు కొండమీదకి సరయిన రవాణా సదుపాయం, వీధి దీపాలు, కిరాణా, కూరలు వంటి నిత్యావసర వస్తువులు అమ్మే షాపింగ్ సెంటర్లు లేకపోవడంతో అక్కడకి వచ్చి నివసించేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఆ కారణంగా ఎవరూ అక్కడ అంత అద్దె చెల్లించి దిగేందుకు ఇష్టపడకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకొని ఆ ఇళ్ళు కొనుకొన్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే ఇవేవీ పట్టనట్లు మరో 200 ఇళ్లు చకచకా నిర్మాణం చేస్తున్నారు.
అసలు నగరంలో కొండల మీద నెలకొల్పిన ఐటీ కంపెనీలే కనీస సదుపాయాలు లేక నడిపేందుకు ఆపసోపాలు పడుతుంటే వాటిని నమ్ముకొని మరో కొండ మీద ఇంత భారీగా ఇళ్లు కట్టేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటికి సమీపంలోనే శ్రీరాం గ్రూప్ వారు కూడా పనోరమా హిల్స్ పేరిట భారీ టవున్ షిప్ నిర్మిస్తున్నారు. ఉడా ఇళ్ళకి ఎదురవుతున్న ఆ సమస్యలని చూసి శ్రీరాం సంస్థ ముందుగానే జాగ్రత్త పడుతునప్పటికీ అవి కూడా నగరంలో ఐటీ రంగం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే కట్టబడుతున్నాయి కనుక వాటికీ ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
నగరంతో నేరుగా రవాణా సదుపాయాలుండి, అన్ని విధాల అభివృద్ధి చెందిన మధురవాడ ప్రాంతం, త్వరలో పూర్తి స్థాయిలో ఐటీ హబ్ గా మారబోతున్నందున అక్కడ మాత్రం ఇళ్లు, స్థలాలు బాగానే అమ్ముడవుతున్నాయి. అయితే మున్ముందు మరింత అధిక ధరలు పలుకుతాయనే ఉద్దేశ్యంతో ఆ ప్రాంతంలో స్థలాలు కొనుకొన్నవారు మాత్రం వాటి అమ్మకానికి తొందరపడటం లేదు. నగరానికి ఐటీ, చిత్ర సీమలు రెండూ తరలివచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకొంటుంది. ఈ అభివృద్ధికి మరో కోణం కూడా ఉంది. రాష్ట్ర విభజన తరువాత విశాఖనగరానికి అనేక ప్రాజెక్టులు ప్రకటించడంతో అవింకా రాకముందే నగరంలో ఇళ్ళ అద్దెలు చాల భారీగా పెరిగిపోవడంతో మధ్యతరగతి జీవులు అల్లలాడిపోతున్నారు.