పాపం వాసిరెడ్డి పద్మ

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మేడమ్ మీకు తెలుసు కదా? అదేనండీ... జగన్ని ఎవరైనా ఏమైనా అంటే మాటలతో వాళ్ళ మీద తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడే వీర వనిత. గుర్తొచ్చారు కదూ... జగన్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆమె చక్కగా సరిపోయారు. ఏ విషయాన్నయినా జగన్‌కి అనుకూలంగా మలచి చెప్పడంలో, అధికార పార్టీ మీద, జగన్ వ్యతిరేక వర్గాల మీద గయ్యిమని విరుచుకుపడటంలో ఆమెకు ఆమే సాటి. టీవీ ఛానళ్ళ డిస్కషన్లలో ఆమె పాల్గొన్నారంటే మిగతా పార్టీలవాళ్ళు కిక్కురుమనడానికి కూడా వీల్లేకుండా మాటల దాడి చేస్తారామె. అలాంటి ప్రతిభావంతురాలైన వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి పాపం... పగవాళ్ళకు కూడా రాని కష్టాలొచ్చిపడ్డాయి. జగన్ పార్టీ కోసం గొంతు ఎంత చించుకున్నా దక్కాల్సినంత గుర్తింపు దక్కకుండా పోయి కంఠశోషే మిగిలింది. రెండ్రోజులకోసారి టీవీ కెమెరాల ముందుకు వచ్చి అరచి కంఠశోష తెచ్చుకోవడమే ఆమెకి చివరికి మిగిలింది.   త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం వుంది. ఎప్పటి నుంచో పార్టీ సేవలో మునిగిపోయిన వాసిరెడ్డి పద్మ మేడమ్‌‌కి ఎమ్మెల్సీ అవ్వాలన్న ఆశ కలిగింది. అలా ఆశ కలగడం కూడా న్యాయమే. అయితే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరెవరినో ఎంపిక చేసే పనిలో జగన్ ఉండటంతో పాపం ఆమె చాలా ఫీలయ్యారు. జగన్ దగ్గరకి వెళ్ళి నాకు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేయండి అని అడిగే ఛాన్స్ ఎలాగూ వుండదు కాబట్టి.. ఆమె జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి దగ్గరకి వెళ్ళి తన ఆవేదనను వ్యక్తం చేశారట. పార్టీకి ఇంతకాలంగా సేవ చేస్తున్నా... నాకు ఓ ఎమ్మెల్సీ ఇచ్చారంటే పార్టీ సేవలో ఇంకా పునరంకితమవుతా అని వినయంగా అడిగారట. ఆమె విజ్ఞప్తి విన్న విజయసాయి రెడ్డి ‘‘ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు వేరేవాళ్ళకి ఫిక్సయిపోయాయి. మీ విషయం తర్వాత ఆలోచిద్దాం’’ అంటే ఓ పద్ధతిగా వుండేది. కానీ ఆయన అలా అనలేదట. మీది ఎమ్మెల్సీ ఇచ్చే స్థాయి కాదని మొహ్మమ్మీదే చెప్పేశారట. మీ స్థాయికి మించి ఆలోచిస్తున్నారంటూ అన్ని సబ్జెక్టుల్లో జీరోలు వచ్చిన స్టూడెంట్‌కి టీచర్ క్లాస్ తీసుకున్నట్టుగా ఆయన వాసిరెడ్డి పద్మకి సుదీర్ఘమైక క్లాస్ తీసుకున్నారట. దాంతో పద్మ మేడమ్ గుడ్ల నీరు కుక్కుకున్నారట. ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర ఎమ్మెల్సీ సీటు విషయంలో తనకెంత అన్యాయం, అవమానం జరిగిందీ చెప్పుకుని లబోదిబో అన్నారట. ఇంతకాలం పార్టీ కోసం అరిచీ అరిచీ నా నోరు బయటపడిందే తప్ప తనకు ఒరిగిందేమీ లేదని ఆమె నెత్తీనోరు బాదుకుంటూ బాధపడుతున్నారట.   పాపం వాసిరెడ్డి పద్మ మేడమ్‌ ఇలాంటి అవమానాలు కొత్తేమీ కాదు. ‘రాజకీయ శూన్య’ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలబడిన వాళ్ళలో వాసిరెడ్డి పద్మ కూడా ఒకరు. అప్పుడు కూడా అ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆమె పార్టీని భుజాన వేసుకుని నడిపారు. అనేక అంశాల మీద చిరంజీవికి అవగాహన లేక తుతుతు... మేమేమే అంటుంటే.. వాసిరెడ్డి పద్మ తన వాగ్ధాటితో పార్టీని ఆదుకునేవారు. ఆ సమయంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆమె ప్రయత్నిస్తే చిరంజీవి అండ్ కో ఆమెకు మొండిచెయ్యి చూపించారు. దాంతో ఆమె తన ఆగ్రహాన్ని ఒక పెద్ద లేఖ రూపంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి జగన్ పార్టీలోకి వచ్చేసి ఇంతకాలం ఇక్కడ కంచిగరుడ సేవ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అవమానం జరిగింది. మరి ఇప్పుడు పద్మ మేడమ్ ఏం చేయబోతున్నారు? గతంలో చిరంజీవికి రాసినట్టే జగన్‌కి ఓ భారీ లేఖ రాసేయబోతున్నారా? జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారా?

కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే మారేది బీజేపీ రూపమే

  బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్దిష్టమయిన ఒక ప్రణాళికను తమకు ఇచ్చేరని దానిని తాము తూచా తప్పకుండా పాటించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొంటామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రహితంగా మార్చాలనే తమ నిర్ణయంలో మార్పులేదని అన్నారు. కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలకి చెందిన కొందరు ప్రముఖ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వారందరూ ఈ నెలాఖరులోగా పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. కానీ వారి పేర్లను బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు.   మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో 10లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషిచేస్తున్నామని, తమ అధ్యక్షుడు అమిత్ షా సూచించిన విధంగా 45,000 మంది యాక్టివ్ మెంబర్స్ ను జేర్పించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.   రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు మంచి వ్యూహమే సిద్దం చేసుకొంది. కానీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ముక్తి కలిగిస్తామని చెపుతూనే మళ్ళీ అదే పార్టీకి చెందిన నేతలని తమ పార్టీలో చేర్చుకోబోతున్నట్లు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీనేతలకి బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకొంటే అప్పుడు బీజేపీయే తన స్వరూపం కోల్పోయి మరో కాంగ్రెస్ పార్టీగా మారుతుంది.   కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనకు సహకరించినందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారిని గట్టిగా శిక్షించారు. ప్రజలు వారిని క్షమించేందుకు సిద్దంగా లేరు. అటువంటి వారినందరినీ బీజేపీలో చేర్చుకోవడం వలన బీజేపీని కూడా ప్రజలు దూరం పెట్టవచ్చును. కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని కనబడకుండా చేయాలని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండబోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరివల్లా కాదు. గత 125సం.లుగా ఆ పార్టీ ఇటువంటి ఓడిడుకులను అనేకసార్లు ఎదుర్కొని మళ్ళీ లేచి నిలబడింది. కొంతమంది పాత నాయకులు పోతే ఆ స్థానంలోకి మళ్ళీ కొత్త నాయకులు వచ్చి చేరుతుంటారు. పైగా నేటికీ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయమయిన ఓటు బ్యాంకు భద్రంగానే ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ మరణం ఉండబోదు.   ఈరోజు బీజేపీలో చేరే నేతలే రేపు పరిస్థితులు మారితే వెంటనే కాంగ్రెస్ గూటికి చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. కనుక అవకాశావాదులయిన అటువంటి నేతల కోసం అర్రులు చాచడం కంటే రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ ప్రక్రియ ద్వారా తమ సంఖ్యని పెంచుకొని వారిలోనుండే నిఖార్సయిన మంచి నాయకులను తయారుచేసుకోవడం మంచిది.

ఏపీ ప్రభుత్వానికి బీజేపీ నిర్మాణాత్మక సహకారం

  ప్రతిపక్ష పార్టీ అంటే వీలయినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండాలి. ఏదో ఒక అంశం దొరకబుచ్చుకొని ఉద్యమాలతో హడావుడి చేస్తుండాలి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సంప్రదాయాన్నే ఎంతో నిష్టగా పాటించేస్తూ ప్రజలని కూడా ఇదే సరయిన పద్దతేమోనని నమ్మేలా చేస్తున్నాయి. కానీ రాష్ట్రాభివృద్ధిలో నిర్మాణాత్మకమయిన పాత్ర పోషించాలానే ఆలోచన వాటికి కలలో కూడా కలగదు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఆ పాత్ర బహు చక్కగా పోషిస్తోంది.   తెదేపాకు మిత్రపక్షమయిన బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సున్నితంగా ఎత్తి చూపుతూనే దానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఇస్తోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సంఘంలో సభ్యుడయిన సోమూ వీర్రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలో వేసవి ఇంకా రాకమునుపే అప్పుడే నీటి ఎద్దడి మోదలయిందని, ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేప్పట్టాలని కోరారు. రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను పేర్కొంటూ కేంద్రప్రభుత్వానికి ఒక నివేదిక పంపినట్లయితే తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తరచూ కరువు బారిన పడుతున్న రాయలసీమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.   ఆ తరువాత మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస రాజు, రాష్ట్రంలో ఇసుక విక్రయాలపై ప్రభుత్వం ఇంత వరకు ఒక నిర్దిష్టమయిన విధానం అవలంభించలేకపోతోందని దాని వలన దళారులు లబ్ది పొందుతుంటే, నిర్మాణరంగం తీవ్రంగా నష్టపోతోందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం వీలయినంత త్వరగా లోపరహితమయిన విధానాలను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తెరాసకు ఉలుకెందుకు?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చే నెల వరంగల్లో పర్యటిస్తారని తెదేపా ప్రకటించగానే, ఊహించినట్లే తెరాస నేతలు చాలా తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “మా రాష్ట్రానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మా రాష్ట్రంలో పర్యటించవలసిన అవసరం ఏమిటి? ఆ కార్యక్రమమేదో ఆయన ఆంధ్రాలోనే పెట్టుకొంటే మంచిది. అలా కాదని తెలంగాణాలో పర్యటించేందుకు బయలుదేరితే మేము చేతులు ముడుచుకొని కూర్చోబోము. మేము ఏమి చేయాలో అది చేస్తాము,” అని హెచ్చరించారు. అందుకు తెదేపా తెలంగాణా నేతలు కూడా ఘాటుగానే స్పందించారు.   తెదేపా అధ్యక్షుడయిన చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని బలపరుచుకొనేందుకు బయలుదేరితే ఆయనను అడ్డుకొంటామని ఒక బాధ్యతాయుతమయిన మంత్రి పదవిలో ఉన్న మహేందర్ రెడ్డి హెచ్చరించడం చాలా తప్పు. ప్రతీ భారతీయుడికి దేశంలో ఎక్కడయినా స్వేచ్చగా సంచరించే, స్థిరపడే హక్కలు ఉన్నట్లే, ప్రతీ రాజకీయ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనయినా తన పార్టీని ఏర్పాటుచేసుకొని, దానిని బలపరుచుకొని, ప్రజల తరపున పోరాడుతూ, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉందని మంత్రిగా ఉన్న ఆయనకి తెలియకపోదు. కానీ తెలంగాణా అంటే అదేదో వేరే దేశం అన్నట్లు అక్కడ ఇతరులకి ప్రవేశించే హక్కు లేదని, ప్రవేశిస్తే అడ్డుకొంటామని వాదిస్తే, అందుకు కోర్టులో మరో మారు మొట్టికాయలు తినక తప్పదు.   క్రిందటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ‘తెలంగాణాలో కేవలం తెరాస ఒక్కటే ఉండాలి. తమ పార్టీకి అసలు పోటీయే ఉండకూడదు’ అనే ఆలోచనతో కాంగ్రెస్, తెదేపాలకు చెందిన బలమయిన నేతలను, యం.యల్యే.లను కేసీఆర్ తన పార్టీలోకి ఆకర్షించేరు. అయినప్పటికీ తెదేపా తమ పార్టీకి గట్టి పోటీ ఇస్తుండటంతో దానిపై ‘ఆంద్ర ముద్ర’ వేసి బరిలో నుండి తప్పించాలని విశ్వప్రయత్నం చేసారు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు గనుక తెదేపాను కూడా ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరికలు వింటుంటే ఆయన కూడా కేసీఆర్ అభిప్రాయాన్నే మళ్ళీ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.   తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ, వైకాపాలు బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే దానికి లేని అభ్యంతరం తెదేపా చేస్తేనే ఎందుకు? అని ప్రశ్నించుకొంటే నేటికీ తెరాస నేతలు తెదేపాతో ఉనికితో తీవ్ర అభద్రతాభావానికి గురవుతుండటం వలననే కావచ్చును. ఆ రెండు పార్టీలు ఒకే సమయంలో రెండు రాష్ట్రాలలో అధికారం చేప్పట్టాయి. కనుక సహజంగానే ప్రజలు ఇరు ప్రభుత్వాల, ముఖ్యమంత్రుల పనితీరును ప్రజలు నిత్యం బేరీజు వేసుకొని చూస్తూనే ఉంటారు. విద్యుత్ సంక్షోభం పరిష్కరించే విషయంలో అది నిరూపించబడింది. ఒకవేళ తెదేపా ప్రభుత్వం మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో రాజధాని నగరం నిర్మించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగితే ఆ ప్రభావం తప్పకుండా తెలంగాణా ప్రజలపై కూడా పడుతుంది.   కానీ తెరాస ప్రభుత్వం కూడా ఎంత సమర్ధంగా పరిపాలన చేసినప్పటికీ, అభివృద్ధి సాధించినప్పటికీ ఆ ప్రభావం ఆంద్ర ప్రజలపై పడుతుందేమో గానీ, ప్రాంతీయవాదం ఆధారంగానే పుట్టిన తెరాస ఆంధ్రాలోకి ఎన్నడూ కూడా విస్తరించలేదు. కానీ తెదేపా మాత్రం తెలంగాణాలో కూడా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను తనవైపు తిప్పుకొనే అవకాశం ఉంది. బహుశః అందుకే తెరాస పార్టీ తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నట్లు కనబడుతోంది. లేకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నేటికీ కాంగ్రెస్, తెదేపాకి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసేవారు కాదని చెప్పవచ్చును.   తెదేపా, తెరాస రెండు పార్టీలు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు దోహదపడింది కనుక రెండు ప్రభుత్వాలు కూడా సమర్ధంగా పరిపాలించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే వారికి ప్రజలే పట్టం కడతారు. అలాకాక ఈ నాలుగున్నరేళ్ళలో గాలిలో మేడలు కడుతూ ప్రజలకి బంగారు కలలు చూపిస్తూ కాలక్షేపం చేసినట్లయితే, ఈ విధంగా ఇతర పార్టీలను చూసి ఉలికులికి పడక తప్పదు, ఇతర పార్టీలను చూసి అభాద్రతాభావానికి గురికాక తప్పదు. సెంటిమెంట్లు, పోసికోలు కబుర్లతో ప్రజలను ఆకట్టుకోవచ్చునేమో కానీ వారిని కలకాలం తమకే ఓటు వేసేలా చేయలేవు. ఏ పార్టీ విజయానికయినా ఇప్పుడు అభివృద్దే గీటురాయి. ఈ విషయం గుర్తుంచుకొంటే ఎవరికీ భయపడనవసరం లేదు.

కేసీఆర్ని విమర్శించడం చాలా అన్యాయం

  తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ స్వైన్ ఫ్లూ పేరు చెబితేనే ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే 20 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి మరణించారు. ఈ వ్యాధి భవిష్యత్తులో మరింత ప్రబలే ప్రమాదం వుందన్న భయాన్ని సాక్షాత్తూ సీఎం కేసీఆరే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‌నిర్లక్ష్యం కారణంగానే స్వైన్ ఫ్లూ ప్రబలిపోయిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణను స్వైన్ ఫ్లూలో నంబర్ వన్ చేశారని విమర్శిస్తున్నారు. నిజంగా ఇవి చాలా దారుణమైన విమర్శలు. కేసీఆర్ని ఏ విషయంలో విమర్శించినా పెద్ద బాధ కలగదుగానీ, స్వైన్ ఫ్లూ విషయంలో విమర్శిస్తే మాత్రం చాలా బాధ కలుగుతూ వుంటుంది. పాపం ఆయన బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణలోని అన్ని కార్పొరేషన్లలో పర్యటిస్తూ బిజీగా వున్నారు. పేద ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఎలా కట్టించాలా అని ఆయన నిరంతరం ఆలోచిస్తూ మథనపడుతున్నారు. పేదల్ని ఎలా ఆదుకోవాలన్న ఆలోచనలోపడిపోయిన ఆయన స్వైన్ ఫ్లూ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అదేదో పెద్ద తప్పు అయినట్టు ప్రతిపక్షాలు విమర్శించడం దారుణం.   అయినా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని సీఎం కేసీఆర్‌కి తెలియదని అనుకుంటున్నారా? ఆయనకి ఈ విషయం ఎప్పుడో తెలుసు. కానీ, ఏదో స్వైన్ ఫ్లూ వచ్చింది.. రెండు మూడు రోజులు వుండి పోతుందిలే అని లైట్ తీసుకున్నారు. ఏదో అనుకోకుండా 20 మందికి పైగా చనిపోయారు. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయి. అసలు పొరపాట్లు చేయనివాళ్ళెవరు? అలాంటప్పుడు ఈ విషయం మీద రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగునా? అయినా అంతమంది చనిపోయాక కేసీఆర్ స్పందించారు కదా? వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు కదా? ప్రధానమంత్రితో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి సాయం చేయమని అడిగారు కదా? అధికారులతో సమావేశాలు ఏర్పాటు కూడా చేశారు కదా.. ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు కదా... ఇంత చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే వాళ్ళని ఏమనాలి?

మళ్ళీ స్వయంకృషి?

  తెలుగువారు అందరూ కూడా ఒకనాటి అందాల అద్బుత నటి విజ‌య‌శాంతిని తమ మనిషే అనుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అందరూ అలాగే భావించి ఆదరించారు. కానీ వారిరువురూ రాజకీయాలలో చేరిన తరువాత విజయశాంతి తెలంగాణాకి, చిరంజీవి ఆంధ్రాకి మాత్రమే చెందినవారిగా మారిపోయారు. పోనీ రాజకీయాలలో వారు ఏమయినా రాణించారా అంటే అదీ లేదు.   రెండు మూడు పార్టీలు మారినా విజయశాంతి తలరాత మాత్రం మారలేదు. ఆమె పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోతే ఆమెకు రాఖీలు కట్టిన అన్నయ్య కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉందో, ఏమి చేస్తున్నారో కూడా జనాలకి తెలియదు. అందుకే రాములమ్మ మళ్ళీ తన కర్తవ్యం గుర్తు చేసుకొంటూ సినిమాల్లోకి వచ్చేస్తోంది. కాకపోతే ఇంతకాలం తను వ్యతిరేకించిన  ఆంద్రోళ్ళ సినిమాలలోనే మనసు చంపుకొని నటించక తప్పడం లేదు ఆమెకు.   ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా స్వర్గీయ యన్టీఆర్ తెదేపా పెట్టిన 9నెలలోనే ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పగాలేనిదీ, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలలో లక్షలాది అభిమానులున్న తను ప్రజారాజ్యం స్థాపిస్తే మూడు నెలలోనే ముఖ్యమంత్రి కాలేనా? అనే గొప్ప నమ్మకంతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేరు చిరంజీవి. ఆయన నటించిన సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ట్ అయినప్పటికీ, ఆయన ప్రజారాజ్యం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోవడంతో కంగుతిన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ మహాసముద్రంలో కలిపేసి కేంద్ర మంత్రి సంపాదించుకొని ‘సామాజిక న్యాయం’ కాపాడుకొన్నారు.   కానీ మళ్ళీ రాష్ట్ర విభజనతో అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. కనీసం అప్పుడయినా సరిగ్గా స్టెప్పులు వేయలేక తడబడటంతో ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలు మూడు నెలలో పోగొట్టుకొన్నారు. ముల్లు వచ్చి అరిటాకు మీదపడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా చిరిగేది అరిటాకే అన్నట్లు కాంగ్రెస్ చేసిన పాపానికి పాపం ఆ జీవి బలయిపోయాడు అన్యాయంగా.   అందుకు పరిహారంగా రాజ్యసభలో ఓ కుర్చీ ఖాళీ అయితే అందులో ఆయనను కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ హై కమాండ్ వ్రాసిచ్చిన స్క్రిప్ట్ లో డైలాగులు ఆయన ఎంత గొప్పగా చదివినా అందరూ వెక్కిరించే వారే కానీ చప్పట్లు కొట్టేవారు కనబడలేదు. క చేసేదేమీ లేక పడిపోయిన చోటనే ఉంగరం వెతుకొనే ప్రయత్నంలో ఆయన కూడా మళ్ళీ సినీపరిశ్రమకు వచ్చేసి జనాల కోరిక మేరకు తన 150 సినిమా కోసం మొహానికి రంగులు పులుముకొని మళ్ళీ జనాల ముందుకు వచ్చేస్తున్నారు.   ఆయనకి మరో ముప్పై ఏళ్ల తరువాత కూడా హీరో వేషాలు వేసే అవకాశాలు ఉండవచ్చునేమో కానీ ఇన్నేళ్ళ తరువాత వస్తున్న రాములమ్మకి మాత్రం అటువంటి అవకాశం ఉండబోదు కనుక గోపీచంద్-నయనతార జంటగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె తల్లి వేషానికో దేనికో సెటిల్ అయిపోక తప్పలేదుట. కానీ అది కూడా ఆ సినిమాలో చాలా ముఖ్యమయిన పాత్రే అని సరిపెట్టుకోక తప్పడంలేదు. ప్రస్తుతం ఏదో ఒక పాత్ర చేస్తున్నా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హిట్ ఇవ్వగలిగితే ఆనక ఎప్పుడయినా అవకాశం వస్తే చిరంజీవితో కూడా మళ్ళీ స్టెప్పులు వేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదు.

కేంద్రాన్ని రాష్ట్రాలు యాచించాల్సిందేనా?

  రాష్ట్ర విభజన జరిగి, రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి 8 నెలలు గడిచిపోయాయి. తెలంగాణా రాష్ట్రానికి మిగులు బడ్జెట్ దక్కింది. కానీ ఆంద్రకుమాత్రం ఉన్న కష్టాలు సరిపోవన్నట్లుగా ఏకంగా రూ.16,000కోట్ల లోటు బడ్జెట్టు దక్కింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8నెలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో దేనికీ కోతలు పెట్టకుండా ఉన్నంతలో తగినన్ని నిధులు మంజూరు చేస్తూ చాలా పొదుపుగా నెట్టుకొస్తోంది.   కానీ రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవాలంటే ముందుగా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు రావలసి ఉంటుంది. అందుకు అనేక సంస్థలు సిద్దంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆగుదామనే ఉద్దేశ్యంతో కొన్ని సంస్థలు వేచి చూస్తున్నాయి. ఈ అవరోధం తొలగితేకానీ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం కాదు. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే గానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను అధికారంలోకి రాక ముందు నుండి కూడా ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా మళ్ళీ అదే పని మీద ఆయన డిల్లీ వెళ్లి వచ్చేరు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటిలోగా ఇస్తుందో కేంద్రం చెప్పలేకపోతోంది.   కనీసం ఈలోగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.16,000కోట్లయినా విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలగవచ్చును. కానీ ఆ విషయంలో కూడా కేంద్రం ఏమి చేయబోతోందో తెలియదు. ఒకవేళ కేంద్రం తక్షణమే సహాయం చేయలేకపోయినట్లయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం కటకటలాడవలసిన పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. కనుక కేంద్రం తక్షణమే ఎంతో కొంత సహాయం చేస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు.   మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోందని బీజీపీ పదేపదే చెప్పుకొంటోంది. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా కోసం కేంద్రం ముందు ఈవిధంగా చేయి చాచే పరిస్థితి రాకుండానే కేంద్రం స్పందిస్తే బాగుండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అడిగినా చేయి విదిలించకపోతే, దాని వలన తెదేపా-బీజేపీల మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బ తినడమే కాకుండా రాష్ట్రంలో ప్రజలకు కూడా బీజేపీపై దురాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని తహతహలాడుతున్న బీజేపీ, ఈ కష్ట సమయంలో రాష్ట్రానికి ఉదారంగా సహాయపడి, ఈ క్లిష్ట పరిస్థితుల నుండి అది బయటపడేందుకు వీలయినంత సహాయం చేసినట్లయితే ఆ పార్టీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు రాష్ట్ర నేతలు కూడా దైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి వారి మద్దతు అడగగలుగుతారు. అలాకాక చేస్తాం, చూస్తాం అంటూ ఇలాగే నెలలు, సంవత్సరాలు దొర్లించేస్తే రాష్ట్రం ఎలాగూ మెల్లగా ఎప్పటికో అప్పటికి అభివృద్ధి చెందుతుంది. కానీ దాని వలన బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది.

జగన్ పొలిటికల్ కామెడీ...

  కొంతకాలం తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి Political comedian అనే మాట కొట్టి ఎంటర్ చేస్తే వైసీపీ అధినేత జగన్ ఫొటోలు కొన్ని లక్షలు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన చేస్తున్న కామెడీ స్థాయి అలా వుంది మరి. జగన్ తాను చేసే కామెడీలో బోలెడన్ని విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. వాటన్నిటి గురించి వీలువెంబడి మెల్లమెల్లగా ప్రస్తావించుకుందాం. ఇప్పుడు మాత్రం జగన్ చేస్తున్న ఒక కామెడీ స్కిట్ గురించి ముచ్చటించుకుందాం.   జగన్ ఎప్పుడు జైల్లోకి వెళ్తాడో అనే సందేహాలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోనే వుంది. అతి త్వరలోనే జగన్ పార్టీ షట్టర్ క్లోజ్ చేసే అవకాశం కూడా వుందన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. అందుకే కలుగులోంచి బయటకి వచ్చే ఎలుకల మాదిరిగా జగన్ పార్టీ నుంచి బయటపడిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీకి బైబై చెప్పేశారు. మరికొంతమంది తెలుగుదేశం, బీజేపీలతో బేరసారాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? పార్టీలోంచి బతుకుజీవుడా అనుకుంటూ పారిపోతున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళలో తనమీద నమ్మకం పెంచుకునేలా చేస్తాడు. అయితే జగన్ మాత్రం అలా లేడు. పార్టీలోంచి పారిపోతున్నవాళ్ళని ఆపే ప్రయత్నాలు ఎంతమాత్రం చేయడం లేదు. అయినా మన అమాయకత్వంగానీ, జగన్ ఆపినా వాళ్ళు ఆగుతారా...! తన పార్టీలో పరిస్థితి ఇలా వుంటే, జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తూ కామెడీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి పావులు కదుపుతున్నాడు.   నేను ముఖ్యమంత్రినైతే 30 ఏళ్ళు పరిపాలిస్తా అని జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు జగన్ అనే కొత్త సామెత జనాల మైండులో తక్షణం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనను పక్కన పెట్టేసి, చంద్రబాబుని ముఖ్యమంత్రి సీటు మీద నుంచి దించేసే పనిలో బిజీగా వున్నాడు. కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ‘టచ్’లోకి వెళ్ళిన జగన్ వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఆ ఆఫర్ సారాంశం ఏంటంటే, కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ ఒక్కటై తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి బయటకి రావాలి. అలా బయటకి వచ్చిన గ్రూపుకి జగన్ మద్దతు ఇస్తాడు. అలా ఆ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి పదవి జగన్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలోంచి విడిపోయిన గ్రూపు నాయకుడే ముఖ్యమంత్రి అయిపోవచ్చు.... ఇదీ జగన్ సార్ ఐడియా. ఆ ఐడియా విన్న సదరు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ని కిందనుంచి పైకి, పైనుంచి కిందకి ఎగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెళ్తూ వెళ్తూ తమ చెవుల్లో జగన్‌‌కి పూలుగానీ కనిపిస్తున్నాయా అనుకుంటూ, చెవులు తడుముకుంటూ వెళ్ళిపోయారట. ఇదండీ జగన్ పథకం. వేరే పార్టీ వాళ్ళని తన పార్టీలోకి వచ్చేలా చేయడాన్ని ‘ఆకర్ష’ పథకం అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక గ్రూపును చీల్చి, తాను ఆ గ్రూపుకి తోకలాగా వుండాలనుకుంటున్న జగన్ పథకాన్ని ‘తోకర్ష’ పథకం అనొచ్చేమో!

విధ్వంస చక్రం తిప్పుతున్న అమెరికా

  సృష్టి స్థితి లయ కారకుడు ఆ భగవంతుడేనని అందరం విశ్వసిస్తాము. కానీ ఈ కలియుగంలో ఆ పాత్ర అగ్ర రాజ్యమయిన అమెరికా పోషిస్తోందని చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేది ఆదేశమే. వారి వలన అపార ప్రాణ నష్టం జరగడానికీ అమెరికాయే కారణం. ఆ ఉగ్రవాదులు రెచ్చిపోయి అదుపు తప్పినప్పుడు వారిపై ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపించి మట్టుబెట్టి ప్రజలను రక్షించేది అమెరికానే. ఈ విద్వంస చక్రం నిరంతరం తిరుగుతూ ఉండేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.   అమెరికా చేతిలో స్టీరింగులా తిరుగుతున్న విద్వంస చక్రంలో ఉగ్రవాదులతో బాటు నిత్యం వేలాది మంది అమయాకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి అమెరికానే కారణం. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ ఇలా అనేక దేశాలలో రావణ కాష్టంలా రగులుతున్న మారణకాండకు అందుకు సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు నిలిచి ఉన్నాయి. అందుకోసం ప్రపంచ దేశాల ప్రజలే కాదు అమెరికా స్వయంగా తన సైనికులను, కోట్లాది డాలర్లను కూడా తృణ ప్రాయంగా సమర్పించుకోవడం విశేషం.   పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తుంటే, ఉగ్రవాదంపై పాక్ బహు చక్కగా పోరాడుతోందని మెచ్చుకొంటూ ప్రతీ ఏడు క్రమం తప్పకుండా భారీ నజరానాలు ఇస్తోంది. కానీ అమెరికా సైనికులు రాత్రికి రాత్రి హటాత్తుగా హెలికాఫ్టర్లలలో శాటిలైట్ వీడియో కెమెరాలు పెట్టుకొని మరీ వచ్చి లాడెన్ న్ని హతమారుస్తుంటే, ఆ తంతుని ఎక్కడో అమెరికాలో కూర్చొని వీడియోలో చూసి ఆనందించడం కేవలం అమెరికన్లకే చెల్లు. తను ఇంతకాలంగా వెతుకుతున్న బిన్ లాడెన్ కి పాకిస్తాన్ దేశమే ఆశ్రయం కల్పించినప్పటికీ అందుకు అమెరికా ఏమాత్రం నొచ్చుకోకపోవడం దాని విశాల హృదయానికి ఒక చక్కటి నిదర్శనం. కానీ మళ్ళీ తెల్లారగానే అదే పాకిస్తాన్ దేశంపై ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అంటూ తన డ్రోన్ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తుంటుంది.   ఇదంతా చూస్తుంటే అసలు అమెరికా ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చూస్తోందా? లేకపోతే ఎప్పటికప్పుడు తను తయారు చేసుకొనే అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకోవడానికే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందా? అనే అనుమానం కలగడం సహజం.   లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను అణచివేశామని అమెరికా సంతోషపడేలోగానే అంతకంటే కిరాతకమయిన ఈ ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు పుట్టుకొచ్చి ఇరాక్, సిరియా దేశాలలో నిత్యం వందలమంది మహిళలను, పసి పిల్లలను, వృద్ధులను, యువకులను అతి కిరతాకంగా సాముహిక హత్యలు చేస్తున్నారు. వారిని అణచివేసేందుకు అగ్ర రాజ్యాల ప్రయత్నాలేవీ ఫలించకపోగా, వారి చర్యలతో ఉగ్రవాదులు మరింత ప్రతీకారేచ్చతో రగిలిపోతూ విదేశీయులను బందీలుగా పట్టుకొని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు.   ఇందుకు కూడా అమెరికానే ముందుగా నిందించవలసి ఉంటుంది. ఇరాక్ దేశంలో చమురు బావులను స్వంతం చేసుకొనేందుకు రసాయన, అణు బాంబులు ఉన్నాయనే వంకతో ఇరాక్ పై దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ న్ని ఉరి తీసింది. సద్దాం హుస్సేన్ కూడా అతి కిరాతకుడే కావచ్చును. కానీ అతని భయంతోనే ఉగ్రవాదులెవరూ తలెత్తే సాహసం చేయలేకపోయారు. కానీ అమెరికా నిర్వాకం వలన ఇప్పుడు ఇరాక్ ఒక దిక్కులేని దేశంగా మారిపోయింది. ఇదే అదునుగా ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఇరాక్ దేశాన్ని క్రమ క్రమంగా తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటూ అక్కడి ప్రజలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తున్నారు.   వారిని కాపాడే శక్తి లేని నామ మాత్రపు ఇరాక్ ప్రభుత్వం అమెరికా అందిస్తున్న ఆయుధాలు, మందు గుండు, బాంబులు వంటి మారణాయుధాలు వారికి అందజేస్తూ మీ ప్రాణాలు మీరే కాపాడుకొమ్మని చేతులు ఎత్తేసింది. ఇటీవల ఇరాక్ లో దాదాపు 5000 మంది జనాభా ఉండే ఒక గ్రామాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టగా ప్రభుత్వం అందించిన ఆ ఆయుధాలతో అక్కడి ప్రజలు ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ అత్యాధునిక ఆయుధాలు కలిగిన వేలాదిమందితో కూడిన ఉగ్రవాద మూకలను తమ వద్ద ఉన్న కొద్దిపాటి ఆయుధాలతో ఎంతో సేపు నిలువరించడం కష్టం గనుక ఆ తరువాత ఏమి జరిగి ఉంటుందో తేలికగానే ఊహించుకావచ్చును.   ఈ మారణహోమానికి ఎప్పుడు తెరపడుతుందో? అసలు అంతమొందించడం సాధ్యమో కాదో అనే భయం కలుగుతోంది.

త్వరలో తెలంగాణాలో చంద్రబాబు పర్యటన

  వచ్చే నెలలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి వరంగల్లో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు యల్. రమణ తెలిపారు. ఇప్పటికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిత్యం ఏదో ఒక అంశం మీద ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొంటారని భావించలేము. కానీ వైకాపా నాయకురాలు వై.యస్.షర్మిల పరామర్శ యాత్రల పేరిట తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు అన్ని జిల్లాలు చుట్టబెట్టేస్తున్నప్పుడు నోరు విప్పని తెరాస నేతలు, వారి అధ్యక్షుడు కేసీఆర్, ఒకవేళ చంద్రబాబు నాయుడు పర్యటనలో ఏమయినా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారిని చంద్రబాబు నాయుడు ఇదే ప్రశ్న అడగవచ్చును.   ఆయన వెంట నారా లోకేష్ కూడా బయలుదేరినట్లయితే బహుశః మున్ముందు అతనికే తెలంగాణాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావించవచ్చును. ఎందువలన అంటే ఆంధ్రాలో తెదేపాను, ప్రభుత్వాన్ని నడిపేందుకు చంద్రబాబు, ఆయనతో బాటు బలమయిన నాయకులు అనేకమంది ఉన్నారు. కానీ తెలంగాణాలో తెరాస ఒత్తిళ్లను తట్టుకొని పార్టీని నడిపించేందుకు ఎవరూ లేరు. ఉన్నకొద్ది మంది నేతల మధ్య సరయిన సమన్వయము లేకపోవడంతో వారందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి తెలంగాణాలో తెదేపాను ముందుండి నడిపించే బలమయిన నాయకుడు లేడు. గత కొన్ని నెలలుగా నారా లోకేష్ తరచూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, అతని ప్రభుత్వంపై ట్వీటర్ లో విమర్శలు గుప్పిస్తుండటం గమనించినట్లయితే, అతని దృష్టి తెలంగాణాపైనే ఉందని అర్ధమవుతుంది.   వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు ఆ పార్టీ నేతలు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కనుక తెలంగాణాలో బలపడేందుకు తెదేపా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకోక తప్పదు. ఆ ప్రయత్నాలేవో ఇప్పటి నుండే మొదలుపెడితే గానీ ఎన్నికల నాటికి పార్టీ బలం పుంజుకోవడం సాధ్యం కాదు. గనుకనే చంద్రబాబు నాయుడు, ఆయనతో బాటు నారా లోకేష్ ఇద్దరూ ఈ యాత్రకు సిద్దమవుతున్నారనుకోవలసి ఉంటుంది.

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బాబు దావోస్ పర్యటన

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో హాజరయ్యేందుకు ఈరోజు ఆయన బయలుదేరి వెళ్ళారు. ఆ సదస్సులో ఆయన పట్టణాభివృద్ధి భవితవ్యం అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అనేక ప్రముఖ సంస్థల సి.ఈ.ఓ.లతో ఆయన సమావేశమయ్యి తన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీల గురించి వివరించి వారిని రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టమని కోరనున్నారు. డేవిడ్ చీస్ రైట్ (వాల్ మార్ట్); ఇంద్రా నూయూ (పెప్సీ కంపెనీ); విశాల్ సిక్కా (ఇన్ఫోసిస్); ఫ్రాన్స్ వన్ హౌటన్ (రాయల్ ఫిలిప్స్); ఉషారావు (గ్లోబల్ వాటర్ డెవెలప్మెంట్ పార్ట్ నర్స్); రిషాద్ ప్రేమ్ జీ (విప్రో) తదితర సంస్థల సంస్థల సీఈఓలను చంద్రబాబు నాయుడు కలుస్తారు. చంద్రబాబు నాయుడు తన ప్రతీ విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన అనేక ప్రముఖ సంస్థల సీఈఓలతో ముఖాముఖి సమావేశం అవుతున్నారు కనుక ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తారని ఆశించవచ్చును.   ఆయనతోబాటు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన రావు, ఇంధన మరియు మౌలికవసతుల కల్పన శాఖల ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మరి కొంతమంది ఉన్నతాధికారులు దావోస్ వెళ్ళారు.

కరెన్సీ కట్టలతో కూడా కష్టాలేనట!

  బ్యాంకుల్లో కరెన్సీ కట్టలు దొంతర్లు చూస్తే ఎవరికయినా ముచ్చటేస్తుంది. కానీ ఆ కరెన్సీ కట్టలతో జరిగే లావాదేవీల కోసమే మన దేశంలో బ్యాంకులు ఏడాదికి రూ 21,000 కోట్లు ఖర్చు చేయవలసి వస్తోందంటే నమ్మబుద్ధి కాదు. కానీ అది పచ్చి నిజం.   అభివృద్ధి చెందిన దేశాలలో క్రమంగా కరెన్సీ వినియోగం తగ్గిపోతూ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ నగదు బదిలీలు జరిగుతుంటే మన దేశంలో నిరక్షరాశ్యత, పేదరికం, కోట్లాదిమందికి నేటికీ బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం, భారతీయులకు కరెన్సీ నోట్లను దాచుకోవాలనే తపన, ఆ నగదును సురక్షితంగా ఒక చోట నుండి మరొక చోటికి తరలించవలసి రావడం వంటి అనేక కారాణాల వలన ప్రతీ ఏడాది దేశంలో బ్యాంకులన్నీఅన్నివేల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది.   ఈ కారణంగానే ప్రతీ ఏటా లక్షల కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించవలసి వస్తోంది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ నోట్ల సెక్యురిటీ కోడ్స్ మార్చవలసి రావడం, చిరిగిన, పాడయిపోయిన పాత నోట్ల స్థానంలో ఈ కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకురావడం, వాటితో లావాదేవీలు నిర్వహించవలసి రావడంతో ఈ అదనపు భారం తప్పడం లేదు. అంటే నోటుకి ఉన్న విలువే కాదు ఆ నోటును చెలామణిలో ఉంచడానికి కూడా ఖర్చు తప్పదన్నమాట.   ఒక్క డిల్లీ నగరంలోనే ప్రజలు ఏడాదికి కనీసం 60 లక్షల గంటలపాటు ఈ కరెన్సీ నోట్లతో లావాదేవీలు నిర్వహించుతున్నారని మాస్టర్ కార్డ్ సంస్థ వారు ఇటీవల విడుదల చేసిన ‘కాస్ట్ ఆఫ్ క్యాష్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో తెలియజేయబడింది. మరి యావత్ భారతదేశంలో ఉన్న 123 కోట్ల మంది కలిసి ఎన్ని లక్షల కోట్ల గంటల సమయం ఈ కరెన్సీ వ్యవహారాలకోసం వెచ్చిస్తున్నారో ఎవరూ లెక్క కట్టలేరేమో. నేటికీ భారత దేశ జనాభాలో మూడవ వంతు మంది గత 15 ఏళ్లలో ఎన్నడూ బ్యాంకు గడప ఎక్కనే లేదట. కారణాలు అందరికీ తెలిసినవే పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వగైరా వగైరా. అందుకే ప్రధాని మోడీ జన్ ధన్ యోజన అంటూ అందరి చేత బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారేమో. కానీ పైసా రాబడి లేని వారి చేత ఎన్ని కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపిస్తే మాత్రం ఏమి ప్రయోజనమో మోడీ వివరించలేదు.   కానీ 2007 సం.నుండి పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ పేమెంట్లు 2.6% to 6.8% వరకు వృద్ధి చెందింది. అది ప్రతీ ఏటికీ ఇంకా వేగంగా పెరుగుతోంది. బ్యాంకులు ఆర్ధిక సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్లను విరివిగా ప్రోత్సహించడం అందుకు అవసరమయిన సదుపాయాలూ కల్పించడం, గుండు సూది నుండి కుక్క పిల్లల వరకు అన్నీ కూడా ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశాలు పెరగడంతో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలలో ఈ కరెన్సీ వాడకం క్రమంగా కొంచెం తగ్గు ముఖం పడుతోంది.   2007 సం.లో ఏటీయం ల ద్వారా రూ.3లక్షల కోట్లు లావాదేవీలు జరిగితే అది 2012 నాటికి రూ 18 లక్షల కోట్లకు చేరుకొంది. కానీ అంత మాత్రాన్న భారతదేశంలో కరెన్సీ నోట్లతో లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదు పైగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే మూడేళ్ళలో భారత్ చైనా దేశాలలో ఏడాదికి 16,000 కోట్ల నుండి 17,300 కోట్ల నోట్లు చెలామణిలో ఉంటాయని ఒక అంచనా. అంటే వాటి ముద్రణ, తరలింపు, వాటితో లావాదేవీలు, పాత నోట్ల ఉపసంహరణ వగైరా తంతు అంతా కూడా పెరుగుతుందన్న మాట.

వైసీపీ ఎమ్మెల్యేలు... బీజేపీతో బేరాలు...

  ఆయనొక ఎమ్మెల్యే. ఒక యువ హీరో అండదండలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా వుండేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజాబలం కంటే నోటి బలం ఎక్కువ అని ఆయన పేరు జనం నోళ్ళలో బాగా నానింది. ఆయన నోటి దురుసుతనం గురించి, తల బిరుసు గురించి ఆయన నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. తనకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అకారణంగా దూరమవ్వడమే కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీనే నోటికొచ్చినట్టు తిట్టేంత నోటి దురుసుతనం ఆయన సొంతం. బోలెడంత రెబల్‌గా వుండే ఆయన ప్రస్తుతం వైసీపీ నాయకుడు జగన్ ముందు మాత్రం కుక్కిన పేనులా పడి వుండే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీని తిట్టే విషయంలో తప్ప మరే విషయంలోనూ పాపం ఆయనకి వాయిస్ లేకుండా పోయింది. దానికితోడుగా ఏపీలో వైసీపీ మెల్లగా కనుమరుగు అయ్యే పరిస్థితులు ముంచుకుని వస్తూ వుండటంతో ఆయన మెల్లగా ఆ పార్టీ నుంచి తన బిచాణా ఎత్తేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.   వైసీపీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేయాలా అని తీవ్రంగా ఆలోచించిన ఆయనకు కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దిక్కులా కనిపించింది. వైసీపీలో చేరిన తర్వాత టీడీపీని ఆయన తిట్టిన తిట్ల ధాటికి ఆ పార్టీలోకి ఆయనకి ద్వారాలు శాశ్వతంగా మూసుకుని పోయాయి. ఆయనగారిని మళ్ళీ పార్టీలోకి తీసుకుని కొరివితో తల గోక్కునే రిస్క్ తెలుగుదేశం పార్టీ పొరపాటున కూడా చేయదు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరదామా అంటే... ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన రోజే చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన ఆ పార్టీలో చేరితే, సంవత్సరానికోసారి ఆ పార్టీకి తద్దినం పెట్టడం తప్ప మరో పని వుండదు. ఇక ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో వేళ్ళూనుకుంటున్న భారతీయ జనతా పార్టీ. దాంతో ఇప్పుడు ఆయన దృష్టి బీజేపీ మీద పడింది. ఆటోమేటిగ్గా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.   వైసీపీని వదిలి తానొక్కడినే వస్తానని అంటే ఒంటికాయ సొంఠికొమ్ములా ఒక్కడివే ఏంటయ్యా అంటారని అనుకున్నారో ఏమోగానీ, తనకు బాగా మిత్రులైన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా ఆయన తోడు చేసుకున్నారు. మేం ముగ్గురం మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోతాం... మాకేంటి... అని ఆయన బీజేపీ అగ్ర నాయకత్వంతో బేరసారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల్ని డైరెక్టుగా రంగంలోకి దించకుండా బీజేపీతో లావాదేవీలను ఆయన ఒక్కడే చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఏపీ నాయకత్వంతో పలు దఫాలుగా మీటింగ్స్ కూడా జరిగాయట. మొన్నీమధ్య ఢిల్లీకి వెళ్ళి బీజేపీ కార్యాలయంలో కేంద్ర నాయకత్వంతో కూడా మాటామంతీ జరిపారట. నేడో రేపు ఈ ముగ్గురూ బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నోటి దురుసు ఎమ్మెల్యే గారి వాగ్ధాటి గురించి బీజేపీ నాయకత్వానికి తెలిసినప్పటికీ ఏపీలో బలం పెంచుకోవడానికి ఇలాంటి వాళ్ళను కూడా చేర్చుకోక తప్పదనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. 

తిరుపతిలో ఎన్నిక జరగాలి

  ఎవరైనా పదవిలో వున్న ప్రజా ప్రతినిధి అకస్మాత్తుగా మరణిస్తే, వారి స్థానంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని ఎన్నుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఆయా స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని నిలిపి, పోటీ లేకుండా గెలిపించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆళ్ళగడ్డ స్థానంలో భూమా శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అన్ని పార్టీలూ సహకరించాయి. ఆ తర్వాత నందిగామ అసెంబ్లీ స్థానం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచారు. అయితే అంతకుముందు ఆళ్ళగడ్డ స్థానంలో ఏకగ్రీవం కావడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నందిగామ స్థానం విషయానికి వచ్చేసరికి లేనిపోని ఆశలు పెట్టుకుని పోటీలో నిలిచింది. దాంతో ఆ స్థానంలో ఎన్నిక తప్పలేదు. తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య గెలవకా తప్పలేదు. ఇప్పుడు తిరుపతి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. తిరుపతి తెలుగుదేశం ఎమ్మెల్యే వెంకట రమణ అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం నుంచి ఆయన భార్య సుగుణమ్మని నిలపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తిరుపతి నుంచి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయితే బావుంటుందని తిరుపతిలోని వెంకట రమణ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎన్నిక జరగక తప్పని పరిస్థితి ఏర్పడింది.   తిరుపతి స్థానం ఈసారి ఏకగ్రీవం కాకుండా పోటీ జరగాలని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా అడ్రస్ లేకుండా పోయిన లోక్‌సత్తా పార్టీకి తిరుపతిలో పోటీ చేయాలన్న తహతహ పుట్టుకొచ్చింది. ఏదైనా అద్భుతం జరిగి గెలవకపోతామా అన్న ఆశ ఆపార్టీలో ఏర్పడింది. అందుకే ‘కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం’ అంటూ నినదిస్తూ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ స్థానం మీద కన్ను వుంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పార్టీలో నిర్ణయం జరిగిపోయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఎంతమాత్రం లేకపోయినా, ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తమకు మంచి రోజులు వస్తాయన్నదానికి ఆ విజయాన్ని ఉదాహరణగా చూపించాలని ఆశిస్తోంది. ఇక వైసీపీ అయితే పైకి వెంకట రమణ కుటుంబం మీద తమకు బోలెడంత సానుభూతి వుందని చెబుతున్నప్పటికీ రాయలసీమ ముఖ్య నగరమైన తిరుపతిలో తమ పట్టును సాధించాలంటే తిరుపతిలో పోటీ చేసి గెలవాలని ఆశిస్తోంది. అయితే తన మనసులోని మాటను ఇంతవరకు బయటపెట్టలేదు. మిగతా పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి కాబట్టి మేమూ చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో కరుణాకర్ రెడ్డిని రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   ఏది ఏమైనప్పటికీ, తిరుపతిలో ఏకగ్రీవం కాకుండా ఎన్నిక నిర్వహించడం ద్వారానే వెంకట రమణ భార్య సుగుణమ్మ విజయం సాధించడం మంచిదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ వారో దయ చూపిస్తే గెలిచామన్న న్యూనత లేకుండా వుండాలన్నా, వెంకట రమణకు, తెలుగుదేశం పార్టీకి తిరుపతి ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి నిరూపణ అవ్వాలన్నా తిరుపతిలో ఎన్నిక జరగడమే న్యాయమని వారు భావిస్తున్నారు.

పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన అమెరికా

  ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదని ఊరికే అనలేదు పెద్దలు. ఈ విషయం అమెరికాని చూస్తే అర్ధమవుతుంది. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో, సరిహద్దుల వద్ద పాక్ భద్రత దళాలతో వేగుతున్న భారత్ సమస్య గురించి ఎంతగా మొత్తుకొన్నప్పటికీ అమెరికా పట్టించుకోలేదు. పైగా ఉగ్రవాదంపై పాక్ ప్రభుత్వం చాలా గొప్పగా పోరాడుతోందని మెచ్చుకొంటూ ప్రతీ ఏటా వందల కోట్ల రూపాయలు దానికి కప్పం కడుతోంది. అప్పనంగా వచ్చిపడుతున్న ఆ డబ్బును పాక్ ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతోందో అమెరికా కనుగొందో లేదో తెలియదు.   భారత్ అభివృద్ధికి బ్రేకులు వేసేందుకు పాక్ వంటి దూర్త దేశాన్నిదానికి పక్కలో బల్లెంలా ఉంచడం చాలా అవసరమని అమెరికా భావిస్తోందేమో? అందుకే అది పాక్ ప్రభుత్వానికి అంత ఉదారంగా సాయం చేస్తోందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తన ఉగ్రవాదమూకలు భారత్ పై తరచూ దాడులు చేస్తూ అమాయకులయిన ప్రజల ప్రాణాలు బలిగొంటున్నప్పటికీ, అమెరికా మాత్రం పాక్ ప్రభుత్వాన్ని మెచ్చుకొంటూ దానికి భారీ నజరానాలు ముట్టజెప్పడం గమనిస్తుంటే ఆ అనుమానాలు నిజమేననిపించక మానదు.   కానీ ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వస్తున్నారని తెలిసినప్పటి నుండి పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులతో కటువుగా ఉండవలసింది పోయి భారత్ పై ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు అది అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా డిల్లీకి వస్తున్న తరుణంలో దేశంలో ప్రధాన నగరాలలో ముఖ్యంగా డిల్లీ, ముంబై విమానాశ్రయాలలో ఉగ్రవాద దాడులు జరుగవచ్చని పదేపదే భారత, అమెరికా నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేస్తుండటం అందరినీ చాలా కలవరపరుస్తోంది.   ఈ పరిస్థితి చూసి చివరికి అమెరికా ప్రభుత్వం కూడా పాక్ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించక తప్పలేదు. అమెరికా అధ్యక్షుడు భారత్ లో ఉన్న సమయంలో జరిగే ఏ ఉగ్రవాద దాడితోనయినా పాకిస్తాన్ కు సంబంధం ఉందని తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంటే తనకు ప్రమాదం ఉందని తెలిస్తే అమెరికా ఉపేక్షించదు. కానీ గత ముప్పై ఏళ్లుగా భారత్ పై పాక్ ప్రభుత్వం అండదండలతో జరుగుతున్న ఉగ్రవాద దాడులను కానీ, ఇకపై జరుగబోయే దాడులను గానీ అమెరికా ఏ మాత్రం పట్టించుకోదన్నమాట. స్వయంగా అమెరికా అధ్యక్షుడే భారత్ వస్తున్నారనే సంగతి తెలిసి కూడా భారత్ పై దాడులు చేసేందుకు పాక్ దుసాహసం చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల ఇంకా అదే ఔదార్యం చూపించినట్లయితే అది అవివేకమే.

మళ్ళీ పరామర్శకు బయలుదేరనున్న షర్మిల

  కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర నిర్వహించిన వై.యస్. షర్మిల మళ్ళీ ఈనెల 21వ తేదీ నుండి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఆమె ఈసారి తన యాత్రలో ఏడు రోజులపాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి మొత్తం 30 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని దేవరకొండ నుండి ఆమె యాత్ర మొదలుపెట్టి సూర్యాపేట వద్ద ముగిస్తారు. మళ్ళీ కొద్దిరోజుల విరామం తరువాత జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.   ఆమె చేసేది పరామర్శ యాత్రలే అయినప్పటికీ, అదేదో రాజకీయ యాత్ర అన్నట్లుగా ఆమె యాత్రలు మొదలుపెడుతున్న ప్రతీసారి వైకాపా అందుకోసం ప్రత్యేకంగా పోస్టర్లు రూపొందించి విడుదల చేసి విస్తృతంగా ప్రచారం చేయడం గమనిస్తే ఆమె చేస్తున్న ఆ యాత్రల పరమార్ధం ఏమిటో అర్ధం అవుతోంది.

బీజేపీకి ఆ ఐడియా ఇచ్చింది అరవింద్ కేజ్రీవాలే

  ఒకప్పుడు వారిరువురూ కలిసి పనిచేసేవారు. ఇరువురికీ కూడా ప్రజలలో చాలా మంచి పేరే ఉంది. కానీ క్రమంగా వారిరువురి దారులు వేరయ్యాయి. వారే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరియు మాజీ ఐ.పి.యస్.ఆఫీసర్ కిరణ్ బేడీ. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినపుడు ఆయన నుండి దూరమయిన అన్నా హజారే చెంత చేరారు కిరణ్ బేడీ. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటంలో కలిసి పనిచేసారు. కానీ ఇప్పుడు ఆమె కూడా బీజేపీలో చేరడంతో అన్నా హజారేకు ఏమి చెప్పాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.   అయితే అందుకు కారకుడు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అనే చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే, ఇటీవల డిల్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా అయన డిల్లీలో బీజేపీకి సమర్దుడయిన నాయకుడు లేడంటూ పదేపదే విమర్శలు గుప్పించారు. దానితో మేల్కొన్న బీజేపీ కిరణ్ బేడీని పార్టీలోకి ఆహ్వానించింది. అంతే కాకుండా ఆమెనే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దింపే ఆలోచనలో ఉందిప్పుడు. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సరయిన నేత లేడని ఎద్దేవా చేయకపోయుండి ఉంటే బహుశః బీజేపీకి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచన బీజేపీకి కలిగేది కాదేమో?   మంచి పోలీస్ ఆఫీసర్ అని పేరు గల ఆమెను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దింపాలని భావిస్తోంది. ఒకవేళ ఆమె తనపై పోటీ చేసినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆమెను వేలెత్తి చూపే సాహాసం చేయలేరు. కానీ ఆమె మాత్రం ఆయన 49రోజులలోనే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం గురించి విమర్శలు గుప్పించవచ్చును. బీజేపీలో ఆమె చేరికతో అరవింద్ కేజ్రీవాల్ పని కొరివితో తల గోక్కున్నట్లయింది.   డిల్లీలో రెండు ప్రధాన సమస్యలున్నాయి. వాటిలో మొట్ట మొదటిది మహిళలపై నానాటికి పెరిగిపోతున్న హత్యాచారాలు. రెండవది త్రాగు నీటి సమస్య. ఆ రెంటినీ కిరణ్ బేడీ చాలా సమర్ధంగా ఎదుర్కొనే శక్తి ఉందని అందరికీ తెలుసు. కనుక ఇక రోట్లో తలపెట్టేక రోకటి పోటుకి భయపడితే మాత్రం ఏమీ ప్రయోజనం లేదని “ఆమె రాజకీయాలలో చేరడాన్ని స్వాగతిస్తున్నాని” అరవింద్ కేజ్రీవాల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. రేపు జయప్రద కూడా బీజేపీలో చేరినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ పని నారీ నారీ నడుమ మురారి అయిపోతుంది.

లక్ష నాగళ్లతో దున్నిస్తానని నేనెప్పుడన్నాను?

  ఇదివరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారనే వంకతో లోపల కొన్ని ప్రదేశాలలో రోడ్లను, చెట్లను ప్రొక్లేయిన్లు అవీ పెట్టి కూల్చి వేయించారు. కానీ అందుకు అసలు కారణాలు మాత్రం వేరే ఉన్నాయని అందరికీ తెలిసిందే.   ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నించి చదును చేస్తానన్నట్లు వార్తలు వచ్చేయి. కానీ కొన్ని రోజుల క్రితం ఆయన స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి రామోజీ రావును కలిసి రావడమే కాకుండా ఆయన నిర్మించబోయే ‘ఓం సిటీ’ ని తెగ మెచ్చుకొన్నారు.   ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ నిన్న ఒక విలేఖరి కేసీఆర్ ను ప్రశ్నించినప్పుడు “నేను ఆ మాట ఎప్పుడన్నాను? నేను అన్నప్పుడు నువ్వు విన్నావా? మీకు తోచినది వ్రాసేసుకొని మళ్ళీ నన్ను ప్రశ్నించడం ఏమిటి? అర్ధం లేని మాటలు మాట్లాడకు. అసలు నువ్వు ఏ పత్రిక నుండి వచ్చేవు? అంటూ ఆ విలేఖరిపై ఆయన కోపంగా విరుచుకుపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో ఒక్క కుంట ప్రభుత్వ భూమి కూడా లేదని స్పష్టం చేసారు. అంతే కాదు రామోజీ ఫిలిం సిటీ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. తాము పెట్టుబడుల కోసం విదేశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు, రామోజీ రావు వందల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రంలో ‘ఓం సిటీ’ నిర్మిస్తానంటే తామెందుకు అభ్యంతరం పెడతామని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారు ఆంధ్రావాళ్ళా లేదా తమిళ్ వాళ్ళా లేదా మహారాష్ట్రా వాళ్ళా అనే విషయం తాము పట్టించుకోబోమని అందరికీ తమ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతుందని అన్నారు.   అందువలన మిగిలిన మీడియా, వ్యక్తులు, సంస్థల పట్ల కేసీఆర్ వైఖరి ఏవిధంగా ఉన్నప్పటికీ రామోజీకి, ఆయన సంస్థల పట్ల చాలా సానుకూలంగానే ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఆంధ్రా వాళ్ళను, మీడియాను అమితంగా ద్వేషించే ఆయన ఒక్క రామోజీపట్ల హటాత్తుగా తన వైఖరి ఎందుకు మార్చుకొన్నారు? అనే ప్రశ్నకు వారే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

ఆంధ్రా నుండి విద్యుత్ కొనుగోలుకు కేసీఆర్ కి అహం అడ్డువస్తోందా? లోకేష్

  తెలంగాణా రాష్ట్రం నేటికీ విద్యుత్ కొరతతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో రామగుండం, నల్గొండ తదితర ప్రాంతాలలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల స్థాపనకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అది ఇంటికి నిప్పు అంటుకొన్నాక నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లేనని భావించవచ్చును. అందుకే రైతులను మరో మూడేళ్ళు ఆగమని చెపుతున్నారాయన.   తెలంగాణా ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ తీసుకొనే ఆలోచన మాత్రం చేయలేదు. తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదు కూడా.   ఒకవైపు విద్యుత్ లేక పంటలకు నీళ్ళు అందక రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కూడా కేసీఆర్ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విద్యుత్ తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కేసీఆర్ కి అహం అడ్డు వస్తోందా? లేకపోతే ఆంధ్రా పాలకులు, ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అకారణ ద్వేషం కారణంగా విద్యుత్ తీసుకొనేందుకు అయిష్టత చూపుతున్నారా? అనేది ఆయనకే తెలియాలి.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇస్తామని చెపుతున్నా స్వీకరించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా రావలసిన విద్యుత్ ఇవ్వకుండా కుట్రలు పన్నుతోందని ఎదురు దాడి చేస్తూ తన ప్రజలని మభ్యపెడుతూ అదే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారి ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం ఆయన రాజకీయ చతురతకి మంచి నిదర్శనం. కానీ దాని వలన తెలంగాణా ప్రజలకి లాభం కలిగి ఉండి ఉంటే అందరూ సంతోషించే వారు కానీ ఆయన వైఖరి వలన తెలంగాణా ప్రజలు, రైతులే అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నారనేది కాదనలేని సత్యం.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ‘కేసీఆర్ & కో’ విద్యుత్ కొనుగోలు చేయకపోవడానికి కారణం ఏమిటి? అహం అడ్డు వస్తోందా? ఆయన అహానికి తెలంగాణా రాష్ట్రం బలయిపోతోంది,” అని నారా లోకేష్ ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు.   కానీ అందుకు ఇంకా మరి కొన్ని ఇతర కారణాలు కూడా కనబడుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు చొరవ, కృషి, పట్టుదల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడటమే కాకుండా ఇప్పుడు తెలంగాణాకు కూడా విద్యుత్ సరఫరా చేయగల పరిస్థితికి చేరుకొంది. కానీ కేవలం కేసీఆర్ వైఖరి కారణంగానే తెలంగాణా రాష్ర్టంలో నేటికీ విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందిఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోవడం అంటే కేసీఆర్ తన వైఫల్యాన్ని తనే ఇంటి కప్పు మీదకు ఎక్కి మరీ ప్రకటించుకొన్నట్లవుతుంది. అది రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరంగా మారవచ్చును. ప్రతిపక్షాల ముందు మరింత చులకన అయ్యే ప్రమాదం ఉంది.   పైగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసినట్లయితే ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న ఆ రాష్ట్రానికి దాని వలన ప్రయోజనం కూడా కలుగుతుంది. ఆంద్ర ప్రభుత్వాన్ని పాలకులను ద్వేషిస్తున్న కేసీఆర్ అందుకు ఇష్టపడకపోయుండవచ్చును. అందుకే ఎక్కడో వందల కిమీ దూరంలో ఉన్ననైవేలీ, ఝాఝార్, ధబోల్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుండి విద్యుత్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు సుతరాము ఇష్టపడటంలేదు. అయితే దానివల్ల కూడా మళ్ళీ తెలంగాణా ప్రజలపైనే అదనపు భారం పడుతుంది. సుదూరప్రాంతాల నుండి తెలంగాణా విద్యుత్ సరఫరాకు అదనపు ఖర్చు ఎలాగూ ఉంటుంది. పైగా ఛత్తీస్ ఘర్ వంటి రాశ్రాల నుండి విద్యుత్ సరఫరా అవ్వాలంటే కొత్తగా ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా వేయవలసి ఉంటుంది. అందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేయాలి. మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల గుండా అవి నిర్మించాల్సి ఉంటుంది. కనుక దానికి ఎన్ని సం.లు పడతాయో ఎవరికీ తెలియదు. కారణాలు ఏమయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్ల అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నష్టం జరుగుతుంది. అదే నారా లోకేష్ కూడా చెపుతున్నారు.