అవును... నిజమే... వ్యతిరేకత వచ్చింది

అన్నదాతల ఆత్మహత్యలు, రైతు సమస్యలపై ఊహించినట్లే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టడం, అధికార పార్టీ కూడా ముందస్తు వ్యూహం మేరకు విపక్షాలపై సస్పెన్షన్ వేటేయడం చకాచకా జరిగిపోయాయి, అయితే ఈ పరిణామాలన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయని టీఆర్ఎస్  భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో వ్యూహరచన చేస్తే... ప్రతిపక్షాల ఆందోళనతో అది పక్కదారి పట్టిందని, దాంతో ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. త్వరలో వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలు ఉన్నందున విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని, లేదంటే ప్రతిపక్షాల దుష్ప్రచారంతో మరింత నష్టపోతామని అధికార పార్టీ భావిస్తోంది, ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్... జిల్లాల్లో పర్యటిస్తారని ప్రకటించిన మంత్రి హరీష్ రావు... ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం వివరిస్తారని తెలిపారు, అయినా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినా... తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులమంటూ హరీష్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే వారం రోజుల్లోనే వరంగల్, నారాయణఖేడ్ బైపోల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు, ఉపఎన్నికలే టార్గెట్ గా జరిగే సీఎం టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

గులాబీ గూటిలో పదవుల పండగ

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది, దసరా పండుగ కానుకగా పదవుల పంపకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు, పనిలో పనిగా పార్టీ కమిటీలను కూడా వేసేయాలని భావిస్తున్నారు, దాంతో గులాబీ నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు లాబీయింగ్ మొదలెట్టేశారు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ కంప్లీటైన మార్కెట్ కమిటీలకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా, దేవాలయ కమిటీల్లో నామినేటెడ్ పోస్టులకు కూడా త్వరలో క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించారు, అదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు జరిగే ఆస్కారమే లేదని తేల్చిపారేశారు. కేబినెట్ లో మార్పులుచేర్పులు ఉంటాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్న హరీష్... ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున ప్రకటన చేశారు. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, తలసాని వ్యవహారం తలనొప్పిగా మారడంతో కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది, అలాగే వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా తొలగించి, గతంలో ఇచ్చిన హామీల మేరకు ఓ ఇద్దరికి కొత్తగా చోటు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది, అయితే అదంతా ఒట్టిదేనని హరీష్ తేల్చిచెప్పేయడంతో ఆశావహులు నీరుగారిపోయారు. అయితే నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో కిందిస్థాయి నేతలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు, మరి విజయదశమికి ఎవరిని పదవి వరిస్తుందో, ఎవరిని నిరుత్సాహపరుస్తుందో చూడాలి.

మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రికి కేంద్రప్రభుత్వం క్లియరెన్స్

  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68సం.లు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన జరిగి ఆంద్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 15నెలలు పూర్తయ్యాయి. గత 68 సం.లలో రాష్ట్రానికి ఎన్నడూ మంజూరు కానన్ని ఉన్నత విద్యా వైద్య సంస్థలు కేవలం ఈ 15నెలలు కాలంలో మంజూరు అవడం విశేషం. రాష్ట్ర విభజన చట్టంలో హామీని నిలుపుకొంటూ కేంద్రప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో మంగళగిరిలో నెలకొల్పబోతున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో 193 ఎకరాల భూమిని సిద్దంగా ఉంచింది. వీలయితే ఈ నెల 22నే దానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేత శంఖుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆంద్రప్రదేశ్ తో బాటు దేశంలో మరో మూడు రాష్ట్రాలలో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఈరోజు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖలో ఐ.ఐ.ఎం., మంగళగిరిలో ఎయిమ్స్, చిత్తూరులో ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్., తాడేపల్లి గూడెంలో ఎన్.ఐ.టి. వంటి ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఒకే సం.లో ఒక రాష్ట్రానికి ఇన్ని ఉన్నత సంస్థలు మంజూరు కావడం దేశ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరుగలేదు. త్వరలో పెట్రోలియం, గిరిజన యూనివర్సిటీ వంటి వాటిని ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం అవసరమయిన కసరత్తు చేస్తోంది.

ఆంద్రప్రదేశ్ లో రెండు విభిన్న పరిస్థితులు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పడు రెండు పూర్తి విభిన్నమయిన విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 22న రాజధాని అమరావతి శంఖుస్థాపనను చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొంటున్నారు. ఒకవైపు రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు చేసుకొనిపోతుంటే, రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాలా దెబ్బతిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని వైకాపా వాదిస్తోంది.   రాష్ట్ర ప్రభుత్వం ఈ శంఖు స్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లే, జగన్ కూడా తన నిరవధిక నిరాహార దీక్షకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్నారు. తెదేపా శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే, వైకాపా శ్రేణుల్లో యుద్దోత్సాహం కనిపిస్తోంది. తెదేపా రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటే, వైకాపా రాష్ట్రంలో యుద్దవాతవరణం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీలు సృష్టిస్తున్న పూర్తి విభిన్నమయిన ఈ పరిస్థితులను చూసి వాటిలో ఎవరి వాదనలు, విధానాలు సరయినవో తేల్చుకోవాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రజలదే.

ఆ పైప్ లైన్లు... తెలంగాణకు లైఫ్ లైన్లు

వాటర్ గ్రిడ్ పైప్ లైన్లను తెలంగాణ ప్రజల లైఫ్ లైన్లుగా అభివర్ణించారు మంత్రి కేటీఆర్, వాటర్ గ్రిడ్ పై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.... వాటర్ గ్రిడ్ పూర్తయ్యాక తెలంగాణలో ఏ ఆడబిడ్డా మంచినీటి కోసం రోడ్డెక్కదంటూ హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న విపక్షాల ఆరోపణల్లో పసలేదని, ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా పాడుకాకుండా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో 20వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందన్న కేటీఆర్... ప్రస్తుతం 106 వాటర్ గ్రిడ్ ప్లాంట్లు ఉన్నట్లు తెలియజేశారు, 226 చోట్ల రైల్వే క్రాసింగ్స్ ను దాటాల్సి ఉందని, దాంతోపాటు ఆరు శాఖలను సమన్వయం చేసుకుని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు, మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతామన్న కేటీఆర్.... ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకుండా పనిచేస్తామన్నారు, వాటర్ గ్రిడ్ ను రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తుంటే, కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ మాత్రం అభినందించారంటూ విపక్షాలకు చురకలంటించారు

మూడ్రోజుల ముందే టీ-అసెంబ్లీ ముగింపు

ప్రతిపక్షాలు లేని సభ ఎలా ఉంటుందో చూడాలంటే తెలంగాణ అసెంబ్లీని చూస్తే సరిపోతుంది, మిత్రపక్షం ఎంఐఎం మినహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, వామపక్ష ఎమ్మెల్యేలందర్నీ సస్సెండ్ చేయడంతో సభలో టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు మినహా ఎవరూ కనిపించలేదు, దాంతో ప్రశ్నోత్తరాల్లో అధికార పార్టీ సభ్యులే ప్రశ్నలడిగి, వాళ్లే సమాధానాలు చెప్పుకున్నారు, వ్యాట్ సవరణ బిల్లు, వాటర్ గ్రిడ్ పై లఘు చర్చలు జరిగినా ప్రతిపక్షాలు లేకపోవడంతో సభ చప్పగా సాగింది. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంతో ఇక సభలో మాట్లాడే అవకాశం లేదని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజాబాట పట్టాయి, దాంతో సభలో టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమే మిగలడంతో ఆ వెలితి స్పష్టంగా కనిపించింది, చాలామంది ఎమ్మెల్యేలు సభలో కూర్చోలేక...లాబీల్లో తిరుగుతూ కనిపించారు, అయినా ప్రతిపక్షాలు లేకుండా ఏం చర్చించుకుంటామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. అయితే ప్రతిపక్షాలను సమావేశాలు జరిగినన్ని రోజులూ సస్పెండ్ చేయడంతో... సభను ముందే ముగించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది, బీఏసీ నిర్ణయం మేరకు ఈనెల పదో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా... విపక్షాలు లేకపోవడంతో ఏడో తేదీ సాయంత్రానికే సభను సమాప్తంచేసే ఆలోచనలో ప్రభుత్వముందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.

కరణం బలరాంను సైడ్ ట్రాక్ చేస్తున్నదెవరు?

చంద్రబాబుకు మిత్రుడు, సమకాలీకుడైన కరణం బలరాం రాజకీయ భవిష్యత్ ఎందుకు అయోమయంలో పడింది, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పడు చక్రం తిప్పిన నాయకుడు ఎందుకు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది, ఏళ్లతరబడి తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నా కరణంను అధిష్టానం ఎందుకు పక్కనబెడుతోంది? కరణం బలరాం ప్రతిష్ట మసకబారడానికి కారణమెవరు? చంద్రబాబా? చినబాబా? లేక తన పతనాన్ని తానే స్వయంగా బలరాం కోరి తెచ్చుకున్నాడా? పీవీ హయాంలో ఒకసారి కాంగ్రెస్ లోకి వెళ్లొచ్చినా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న నాయకుడు కరణం బలరాం, ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కరణం... ఎక్కువగా గ్రూప్ లను ప్రోత్సహించేవారని ఆరోపణలున్నాయి, బలరాం నడిపిన వర్గ రాజకీయాలతోనే ప్రకాశం జిల్లాలో టీడీపీ దెబ్బతిందంటారు, కరణం వ్యవహారశైలి కారణంగా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడిపోయారని అతని ప్రత్యర్ధులు చెబుతుంటారు. ఒకప్పుడు కరణం బలరాం నడిపిన గ్రూప్ రాజకీయాలే చివరికి అతని రాజకీయ పతనానికి దారితీశాయని, ఎంతో ఎత్తుకు ఎదిగిన బలరాం... అదేరీతిలో కిందికి పడ్డారని అంటున్నారు. కరణం బలరాం తీరుతో విసిగివేసారిపోయిన చంద్రబాబు... కావాలనే అతడ్ని పక్కనపెట్టారని టీడీపీ నేతలు చెబుతుంటారు, కరణం వ్యవహార శైలి కారణంగానే ప్రకాశం జిల్లాలో పార్టీ దెబ్బతిందని హైకమాండ్ భావించిందని, అందుకే బలరాం వ్యతిరేకించినప్పటికీ లోకేష్ పట్టుబట్టిమరీ దామరచర్ల జనార్దన్ ను  జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారని చెబుతున్నారు, ఒకవేళ బలరాం గెలిచుంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చేదని, దాంతో ప్రకాశం జిల్లా టీడీపీ... గ్రూపు రాజకీయాలతో సతమతమయ్యేదని, కానీ కరణం ఓటమితో ఆ బాధ కూడా తప్పిందని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్. అయితే ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గుర్తించిన లోకేష్...  అజాత శత్రువు, సీనియర్ లీడరైన మాగుంట శ్రీనివాసులురెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని, మాగుంటకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా జిల్లాలోని రెడ్డి కమ్యూనిటీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారని చెప్పుకుంటున్నారు. కరణం బలరాంను సైడ్ ట్రాక్ చేసి, మాగుంటను మెయిన్ ట్రాక్ ఎక్కించడంలో లోకేష్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి కరణం బలరాం రాజకీయ పతనానికి ఆయనే కారణమని, బలరాం నడిపిన గ్రూపు రాజకీయాలే చివరికి ఆయన్ని దెబ్బతీశాయని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలంటున్నారు, తన వ్యవహార శైలితో తన రాజకీయ పతనాన్ని తనే కొనితెచ్చుకున్నాడని సన్నిహితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు, టీడీపీ హైకమాండ్ కూడా కరణంతో విసిగిపోయే పక్కనబెట్టిందంటున్నారు

ఈ విషాద సంఘటనలు ఇంకెన్నాళ్ళు సాగుతాయో?

  నరహంతకులయిన ఐసిస్ ఉగ్రవాదుల భయంతో లిబియా తదితర దేశాల నుండి నిత్యం వేలాది మంది ప్రజలు టర్కీ తదితర యూరోపియన్ దేశాలకి వలసలు వెళ్ళిపోతున్నారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఆ దేశాలకి వెళుతున్నప్పటికీ అన్ని లక్షల మంది శరణార్ధులకు ఆశ్రయం కల్పించలేక ఆ దేశాలు చేతులు ఎత్తేస్తున్నాయి. అయినప్పటికీ నిత్యం వేలాది మంది చిన్న చిన్న నాటు పడవలలో, మర బోట్లలో యూరప్ దేశాలలోకి ప్రవేశించడానికి బయలుదేరుతూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో వారు దళారులకు, స్మగ్లర్లకు తమ కష్టార్జితాన్ని చివరికి తమ విలువయిన వస్తువులని కూడా సమర్పించుకొని ఈ దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. ఆ ప్రయత్నంలో నిత్యం వందల మంది సముద్రంలో పడి శవాలుగా ఒడ్డుకు కొట్టుకువస్తున్నారు.   కొన్ని రోజుల క్రితం సిరియా దేశానికి చెందిన మూడేళ్ళ వయసు గల అయ్లాన్ కుర్ది అనే ముద్దులొలికే ఒక చిన్నారి బాలుడి శవం టర్కీలో బోడ్రం బీచ్ ఒడ్డుకి కొట్టుకు వచ్చినపుడు అది చూసి యావత్ ప్రపంచం కన్నీరు పెట్టుకొంది. కానీ అంతటితో అటువంటి దుర్ఘటనలు ఆగిపోలేదు. నేటికీ వందల శవాలు ఏదో ఒక దేశ సముద్రం ఒడ్డుకి కొట్టుకొని వస్తూనే ఉన్నాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం అవుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయే ప్రయత్నంలోనే వారు ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తుంటే మానవత్వం ఉన్న ప్రతీ మనిషి కంట కన్నీరు రాక మానదు.   లిబియాలో ట్రిపోలీ మరియు సబ్రత్ సముద్ర తీరాలకి గత వారం రోజుల్లో మొత్తం 85మంది శవాలు కొట్టుకు వచ్చినట్లు రెడ్ క్రేసెంట్ అనే స్వచ్చంద సంస్థకి చెందిన అధికార ప్రతినిధి మహమ్మద్ అల్- మిస్రతి చెప్పారు. వారిలో చిన్నారులు మొదలు మొదలు వృద్ధుల వరకు అన్ని వయసులు వారి శవాలు ఉన్నట్లు తెలిపారు. వాటిలో చాల శవాలు పూర్తిగా పాడయిపోయిన స్థితిలో ఒడ్డుకు కొట్టుకు వచ్చేయని తెలిపారు. చిన్న చిన్న రబ్బరు బోట్లలో ప్రయాణిస్తూ నడి సముద్రంలో మునిగిపోవడానికి సిద్దంగా ఉన్న 212 మందిని రక్షించి ఒడ్డుకు తెచ్చినట్లు తెలిపారు.   ఐసిస్ ఉగ్రవాదుల అరాచాలకి భయపడే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇటువంటి సాహాసం చేస్తున్నవారు కొందరయితే, లిబియా, ఆఫ్రికా దేశాలకి చెందిన యువతీ యువకులు, ఉపాధి కోసం లిబియాకి కేవలం 300 కిమీ దూరంలో ఉన్న ఇటలీ దేశానికి చెందిన లంపేదుశ దీవులకి చేరుకొనే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. అటువంటి వారిని రక్షించడం లేదా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన వారి శవాలకు అంత్యక్రియలు చేయడం తమకిప్పుడు నిత్యక్రుత్యమయిపోయిందని రెడ్ క్రేసెంట్ ప్రతినిధి తెలిపారు. ఈ సమస్య తీవ్రతని ప్రపంచ దేశాలు ఎప్పటికి గుర్తించి పరిష్కారానికి ప్రయత్నిస్తాయో తెలియదు కానీ అంతవరకు ఇంకా ఎన్ని వేలమంది దీనికి బలయిపోతారో?

భోగాపురం భూముల్లో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులవేనట!

  విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు పూనుకొంది. దానిని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారికి మద్దతుగా నిలబడి పోరాడేందుకు నిన్న అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.   ఆంద్రప్రదేశ్ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు స్పందిస్తూ జగన్ పై ప్రతివిమర్శలు చేసారు. “భోగాపురంలో నిజమయిన రైతులెవరూ ధర్నాలు చేయడం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సుమారు 80 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఉంది. మిగిలిన 20 శాతం భూములు మాత్రమే స్థానిక రైతుల చేతుల్లో ఉన్నాయి. భోగాపురానికి 45కిమీ దూరంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న 125 ఎకరాలను ఈడీ అధికారులు అటాచ్ చేసారని పత్రికలలో వార్తలు వచ్చేయి. అది కాక జగన్మోహన్ రెడ్డి భోగాపురంలో కూడా బినామీ పేర్లతో ఇంకా ఏమయినా భూములు ఉన్నాయేమో తెలియదు. వాటిని కాపాడుకోనేందుకే ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని అనుమానం కలుగుతోంది. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు అడుగడుగునా అడ్డుపడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కూడా అడ్డుపడుతున్నారు. ఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలకి ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకొంటోంది. రాష్ట్రంలో జగన్ అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యారు,” అని విమర్శించారు.   కిమిడి కళా వెంకటరావు చెప్పినట్లు భోగాపురంలో 80 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులోనే ఉన్నట్లయితే ఇక భూసేకరణకు సమస్యే ఉండదు. ప్రభుత్వం వారితో మాట్లాడుకొని భూసేకరణ చేసుకోవచ్చును. కానీ రెవెన్యూ అధికారులు భోగాపురంలో భూములను సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు స్థానిక రైతులు వారిని అడ్డుకొన్నారు. కిమిడి కళా వెంకటరావు వారందరూ స్థానిక రైతులు కారని అంటున్నారు. భోగాపురంలో భూముల వివరాలేవీ రహస్య విషయం కాదు. అక్కడ రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులలో ఎవరెవరి పేరిట ఎంత భూమి ఉందనే విషయం రెవెన్యూ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ విషయం తెలుసుకోకుండానే జగన్ వెళ్లి అక్కడ ధర్నా చేసాడని అనుకోలేము. కనుక జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ప్రయత్నంలో సున్నితమయిన ఈ అంశం మీద వెంకటరావు ఈవిధంగా మాట్లాడటం వలన సమస్య మరింత జటిలం అవుతుందే తప్ప పరిష్కారం కాదని గ్రహించాలి.

ఆదినారాయణరెడ్డి రాక వెనుక వ్యాపార లావాదేవీలు?

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రప్పించడం వెనుక వ్యాపార లావాదేవీలే ముఖ్య కారణమని తెలుస్తోంది, ఆదినారాయణరెడ్డితో పలువురు టీడీపీ ముఖ్యనేతలకు వ్యాపార సంబంధాలున్నాయని, ఓ ఉత్తరాంధ్ర మంత్రి అయితే మైనింగ్ బిజినెస్ లో పార్టనర్ ఉన్నాడని, అతనే ఈ కథంతా నడిపి... టీడీపీలోకి వచ్చేలా పావులు కదిపాడని చెప్పుకుంటున్నారు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి... ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న నాయకుడే... ఆదినారాయణరెడ్డికి గంట కొడుతున్నాడని తెలిసింది. అయితే ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి రప్పించడం వెనుక కడప జిల్లాకి చెందిన మరో సీనియర్ లీడర్ హస్తం కూడా ఉందంటున్నారు, ఎన్నికలకు ముందు బాబు కోటరీలో ముఖ్యనేతగా ఓ వెలుగు వెలిగిన ఈయనకు కూడా ఆదితో వ్యాపార లావాదేవీలున్నాయని, అందుకే ఉత్తరాంధ్రకి చెందిన మంత్రితో కలిసి తెలుగుదేశంలోకి వచ్చేలా లైన్ క్లియర్ చేశారని టాక్ వినిపిస్తోంది, ఆదినారాయణరెడ్డితో ఈ ఇద్దరికీ ఎప్పట్నుంచో బిజినెస్ పార్టనర్ షిప్ ఉందని, అది పార్టీలకు అతీతంగా సాగిందని, అయితే ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే ఆదిని తెలుగుదేశంలోకి తీసుకొస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఆదినారాయణరెడ్డి వ్యవహారంపై కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది, పార్టీ కోసం రాత్రీపగలనక కష్టపడి ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలకు విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, ఇన్నాళ్లూ ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో ఆ వ్యక్తినే ఇప్పుడు టీడీపీలోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  మీ వ్యాపార లావాదేవీల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు

లోకేష్ అంతరంగికుల్లో లుకలుకలు, అభీష్ట-వేమూరి కీచులాటలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు తనయుడు లోకేష్ మాట ఎంత నెగ్గుతుందో, దాదాపు అంతేస్థాయిలో ఆయన అంతరంగికుల మాట కూడా చెల్లుబాటవుతోంది, కేబినెట్ మీటింగ్స్, పొలిట్ బ్యూరో సమావేశాల్లో సైతం అభీష్ట పాల్గొనేవారంటే... ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో లోకేష్ దూతల పాత్ర ఏమిటో, వాళ్లకుండే ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎంత ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు కూడా ఒక్కోసారి కొడుకు మాట వినాల్సిన పరిస్థితి, ఆ లెక్కన లోకేష్ అంతరంగికుల మాట ఏ స్థాయిలో చెల్లుబాటవుతుందో చెప్పక్కర్లేదు. అయితే లోకేష్ కు కుడిభుజం, ఎడంభుజంగా వ్యవహరించే అభీష్ట, వేమూరి హరిప్రసాద్ మధ్య కీచులాటలు మొదలయ్యాయని టాక్. ఈ ఇద్దరి మధ్యా మొదలైన ఆధిపత్య పోరు చివరికి నువ్వానేనా అనుకునే స్థాయికి చేరాయంటున్నారు, ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన ప్రాజెక్టులను అభీష్ట అడ్డుకుంటున్నాడని హరిప్రసాద్ కోపంతో రగిలిపోతున్నాడని అంటున్నారు, అందుకే తనకు కనిపించిన ప్రతి టీడీపీ లీడర్ కు బాధ చెప్పుకుని గగ్గోలు పెడుతున్నాడట, దాంతో లోకేష్ అంతరంగికుల్లో తేడాలొచ్చాయనే సంగతి టీడీపీ వర్గాల్లో టాంటాం అయ్యింది. ఇదిలా ఉండే లోకేష్ అంతరంగికుడు వేమూరి హరిప్రసాద్ సోదరుడు వేమూరి రవికి కేబినెట్ ర్యాంక్ హోదాతో ఎన్నారై కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టడంపై అభీష్టతోపాటు మరికొందరు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది, ఎన్నారైలతో మంచి సంబంధాలున్న కోమటి జయరాంను కాదని ఊరూపేరూ లేని వేమూరి రవికి ఆ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించారట. అంతేకాదు 300కోట్ల రూపాయల విలువైన ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ ను కూడా వేమూరి హరిప్రసాద్ కంపెనీకే కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంత లబ్ధి జరిగినప్పటికీ ఇంకా తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు వేమూరి హరిప్రసాద్ కనిపించిన ప్రతి నాయకుడి దగ్గరా అభీష్టపై గగ్గోలు పెడుతున్నాడని, పైగా పార్టీకి తాను చేసిన సేవలకు చంద్రబాబు తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని, తన పనులేమీ చేసిపెట్టడం లేదని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడని అభీష్ట వర్గం ఆరోపిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి, పార్టీ ద్వారా ఎంత లబ్ది పొందినా వేమూరి హరిప్రసాద్ ధన దాహం, కోరికలు మాత్రం తీరడం లేదని, అందుకే కనిపించిన ప్రతి వారి దగ్గరా తన గురించి చెడుగా చెబుతున్నాడని అభీష్ట ఆవేదన వ్యక్తంచేస్తున్నాడట, అయితే ఈ ఇద్దరి వ్యవహారం తెలిసిన టీడీపీ నేతలు మాత్రం... లోకేష్ అంతరంగికుల మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరాయని గుసగుసలాడుకుంటున్నారు.

డొక్కా..సీన్ రివర్స్ అయింది!

  మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చెరక ముందు వైకాపాలో చేరేందుకు సిద్దపడటం, తన రాజకీయ గురువు రాయపాటి సాంభశివరావు సూచన మేరకు చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకోవడం, వైకాపాలో చేరుతానని మాట ఇచ్చి తప్పినందుకు అంబటి రాంబాబుకి మీడియా ద్వారా క్షమాపణ చెప్పిన సంగతి అందరికీ తెలుసు. ఒకవేళ ఆనాడు రాయపాటి కనుక ఆపకపోయుంటే ఆయన ఇప్పుడు వైకాపాలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డితో బాటు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అతని ప్రభుత్వాన్ని విమర్శిస్తుండేవారని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. కానీ తెదేపాలో చేరడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించవలసి వస్తోంది. తెదేపా అధికార ప్రతినిధిగా నియమింపబడటంతో తెదేపా తరపున ఇంతకు ముందు తను చేరాలనుకొన్న వైకాపాతో దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయవలసి రావడం విచిత్రమే. కానీ రాజకీయాలలో అది చాలా సహజం కనుక ఇప్పుడు డొక్కావారు జగన్మోహన్ రెడ్డి గురించి చెపుతున్న మాటలను విందాము.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా పేరుతో ఆయన అర్ధం పర్ధం లేని దీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి అయిపోదామని పగటి కలలు కంటున్నారు. కానీ ఆయన ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని కలలు కన్నా ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. క్లిష్టపరిస్థితులో ఉన్న రాష్ట్రానికి అండగా నిలబడకుండా ఈవిధంగా ఇంకా సమస్యలు సృష్టిస్తున్నారు. వేగంగా రాష్ట్రాభివృద్ధి జరగాలని ఆయనకు నిజంగా కోరుకొంటున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఆయనే కాదు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు సహకరించాలి,” అని అన్నారు.

చినబాబుపై సీరియస్ అవుతున్న సీనియర్లు!

ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో చంద్రబాబునాయుడు తలమునకలై ఉంటున్న నేపథ్యంలో ఏడాదిన్నరగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, టీడీపీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న నారా లోకేష్ పార్టీపై క్రమంగా పట్టుసాధిస్తున్నారు. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడైనప్పటికీ... పార్టీ వ్యవహారాలను పూర్తిగా చినబాబుకే వదిలేయడంతో సీనియర్లు అయినా, జూనియర్లయినా లోకేష్ దగ్గరికే వెళ్లాల్సి వస్తోంది, పైగా ప్రతిరోజూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తూ నేతలతోనూ కార్యకర్తలతోనూ సమావేశమవుతూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు, సభ్యత్వ నమోదును కొత్త పుంతలు తొక్కించడంతోపాటు పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న లోకేష్... ప్రతి జిల్లాపై పట్టు సాధిస్తున్నారు, ఇప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా నియమితులవడంతో పార్టీలో చినబాబు పాత్ర ఏంటో చెప్పకనే చెబుతుంది. అయితే టీడీపీలో అన్నీతానై వ్యవహరిస్తున్న లోకేష్... సీనియర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సీనియర్లను కూడా అవమానిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మంత్రుల పనితీరుపై సైతం నిఘా పెట్టి సొంత రేటింగ్ లు కూడా ఇస్తున్న చినబాబుపై పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నారని, పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉంటున్న నేతలను కూడా చినబాబు కేర్ చేయడం లేదని, కనీసం గౌరవం ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు, దానికి కేఈ కృష్ణమూర్తి ఎపిసోడే రుజువంటున్నారు, లోకేష్ నచ్చకపోవడం వల్లే కేఈ చేసిన బదిలీలను ఆగమేఘాల మీద నిలిపివేయించారని అంటున్నారు. అలాగే ఏళ్లతరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ లీడర్ కరణం బలరాం విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని, కాంగ్రెస్ నుంచి వచ్చిన మాగుంటకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన బాబు... కేబినెట్ లోకి కూడా తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది, ఇదంతా చినబాబు చలువేనని అంటున్నారు, ఇక మూడు దశబ్దాలుగా పార్టీలో ఉంటూ కడప జిల్లా టీడీపీకి సేవలందిస్తున్న రామసుబ్బారెడ్డి విషయంలోనూ చినబాబు చులకన మాట్లాడారని అంటున్నారు, ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న లోకేష్... రామసుబ్బారెడ్డి అభ్యంతరాలను అస్సలు పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు. దాంతో సీనియర్లను చినబాబు చిన్నచూపు చూస్తున్నాడని పార్టీలో ప్రచారం జోరందుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్న సీనియర్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డికి కూడా లోకేష్ దగ్గర చేదు అనుభవమే ఎదురైంది, లోకేష్ ను కలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి.. గంటల తరబడి వెయిట్ చేసిన తర్వాత బిజీగా ఉన్నానంటూ చినబాబు కలవడానికి నిరాకరించినట్లు సమాచారం, దాంతో తనలాంటి సీనియర్ లీడర్ కే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తంచేశాడట. లోకేష్ దూకుడు ఇలాగే ఉంటే అసలుకే మోసం తెస్తుందని హెచ్చరించాడట.

లాలూ ప్రసాద్ తో చేతులు కలిపి నితీష్ పొరపాటు చేసారా?

  మరొక్క వారం రోజుల్లో బీహార్ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అన్ని రాజకీయపార్టీల ప్రచారం జోరందుకొంది. జనతా పరివార్ తరపున నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ, కేంద్రమంత్రి రామ్ విలాష్ పాశ్వాన్ ప్రచారం చేస్తున్నారు. జనతా పరివార్ తో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ ప్రచారం చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ములాయం సింగ్, ఎం.ఐ.ఎం. తరపున అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. ఈసారి బీహార్ లో వామ పక్షాలన్నీ కలిసి వామపక్ష కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నప్పటికీ పోటీ ప్రధానంగా జనతా పరివార్, బీజేపీల మధ్యే జరుగుతోంది.   జనతా పరివార్ తరపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ప్రచారం చేస్తున్నప్పటికీ, నితీష్ కుమార్ సమర్ధత, పరిపాలన గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. నితీష్ కుమార్ మీద ఆధారపడి జనతా పరివార్ ప్రచారం సాగుతుంటే, బీజేపీ ప్రధానంగా నరేంద్ర మోడీ ఆకర్షణ మీదే ఆధారపడుతోంది. కేంద్రంలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది కనుక బీహార్ రాష్ట్రంలో కూడా బీజేపీకే అధికారం కట్టబెడితే, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా అందిస్తామని బీజేపీ గట్టిగా ప్రచారం చేసుకొంటోంది.   అయితే ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంతో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్.జె.డి.కి తనతో సమానంగా సీట్లు పంచి ఇవ్వడం చాలా పెద్ద పొరపాటని చెప్పవచ్చును. ప్రభుత్వంలో తను కూడా చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతోనే లాలూ వంద సీట్లు డిమాండ్ చేసి తీసుకొన్నారు. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో నెగ్గినా లాలూ ప్రసాద్ యాదవ్ కారణంగా ప్రభుత్వంలో సుస్థిరత ఉండకపోవచ్చును. ఈ ఎన్నికలలో ఆర్.జె.డి. కూడా తగినన్ని సీట్లు సంపాదించుకొనట్లయితే అప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వం లాలూ ప్రసాద్ దయతోనే నడిపించుకోవలసి ఉంటుంది. ఒకవేళ లాలూ పార్టీ తగినన్ని సీట్లు గెలుచుకోలేకపోయినా జనతా పరివార్ అధికారంలోకి రాలేదు. అప్పుడు మద్దతు కోసం వేరే పార్టీలని ఆశ్రయించవలసివస్తుంది. కనుక ఏవిధంగా చూసినా లాలూతో చేతులు కలిపినందుకు నితీష్ కుమారే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ లో సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పుకొంటున్న బీజేపీ ఇదే పాయింట్ గురించి గట్టిగా ప్రచారం చేసుకోగలిగితే దాని విజయావకాశాలు మెరుగవవచ్చును.

మోడీ దైవదూత కాదు: రామ్ జెట్మలాని

  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది. కానీ ఏనాడూ అది విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నలధనాన్ని వెనక్కి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. సుప్రీంకోర్టు ఒత్తిడి చేయడంతో విదేశీ బ్యాంకులలో నల్లధనం దాచుకొన్న వారి జాబితాను కోర్టుకి సమర్పించింది కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.   కానీ మోడీ అధికారం చేపట్టిన వెంటనే సంబంధిత రంగాలకు చెందిన అధికారులు, నిపుణులు, న్యాయమూర్తులతో కూడిన సిట్ కమిటీ ఏర్పాటు చేసి నల్లధనం వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. నల్లధనం దాచినవారికి 10 ఏళ్ల జైలు శిక్ష, దొరికిన సొమ్ముపై ఏకంగా 120 శాతం పన్ను వసూలు చేసేందుకు వీలుగా చట్ట సవరణలు చేశారు. విదేశాలలో నల్లధనం దాచుకొన్నవారు స్వచ్చందంగా ఆ వివరాలను ప్రకటించినట్లయితే దానిపై 30 శాతం పన్ను, మరో 30 శాతం జరిమానా చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. ఆ గడువులోగా మొత్తం 638 మంది రూ.3, 770 కోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. ఇక నుండి మిగిలిన వారిపై కటిన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.   విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలన్నిటినీ యావత్ భారతీయులు హర్షిస్తున్నారు. కానీ ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు రామ్ జెట్మలాని మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.   “లోక్ సభ ఎన్నికలకు ముందు విదేశీ బ్యాంకులలో పేరుకుపోయిన నల్లధనం వెనక్కి రప్పించి దేశాభివృద్ధికి వినియోగిస్తానని గొప్పగా చెప్పుకొన్న నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చేక దాని కోసం గట్టిగా చర్యలు తీసుకోలేదు. భారతదేశాన్ని రక్షించడానికి భగవంతుడు పంపిన దూత ఆయన అని భావించాను. కానీ ఆయన కూడా సగటు రాజకీయ నాయకుడేనని నిరూపించుకొన్నారు. ఆయన మాటలు నమ్మి నేను మోసపోయాను. ఆయన ఇప్పుడు బీహార్ ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నారు. ఆయన మాటలు నమ్మవద్దని బీహార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.   నల్లధనం గురించి మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వాటి ఫలితాల గురించి మాట్లాడకుండా ఆయన బీహార్ ఎన్నికల నేపధ్యంలో మోడీని విమర్శించడం గమనిస్తే ఆయన బీహార్ లో ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా కూటమికి ఎన్నికలలో లబ్ది చేకూర్చేందుకే ఈవిధంగా మాట్లాడుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఏదో ఒక పార్టీ లేదా కూటమి ఆయనను ఆవిధంగా మాట్లాడిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఆయన తన మేధస్సును ఈవిధంగా దుర్వినియోగం చేయడం కంటే నల్లదనాన్ని వెనక్కి రప్పించేందుకు మోడీ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇచ్చి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.

కేశవరెడ్డిని కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరు?

అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆగమేఘాల మీద చర్యలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం... కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్ల కుంభకోణం విషయంలో మాత్రం చూసీచూడనట్లు పోతుందనే టాక్ వినిపిస్తోంది. అగ్రిగోల్డ్ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టి, ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుని బాధితులకు ఎంతోకొంత న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... కేశవరెడ్డి బాధితుల విషయంలో మాత్రం సరిగా అడుగులు వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి, పైగా కేశవరెడ్డిని కాపాడేందుకు ఏపీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఓ కీలక నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు అగ్రిగోల్డ్ అయినా, కేశవరెడ్డి విద్యాసంస్థల మోసం అయినా ఈ కేసుల్లోనూ ప్రజలే బాధితులు, మరీ అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ముందుకొచ్చిన ప్రభుత్వం, కేశవరెడ్డి విషయంలో అలా ఎందుకు చేయడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు, విద్యార్ధుల నుంచి దాదాపు 550 కోట్ల రూపాయల డిపాజిట్లు, 62కోట్లకు పైగా బ్యాంకు రుణం... ఓవరాల్ గా వెయ్యికోట్లు వసూలుచేసి చేతులెత్తేసిన కేశవరెడ్డి విషయంలో ప్రభుత్వం ఎందుకు మెత్తగా ఉందని కొందరు టీడీపీ లీడర్స్ సైతం గళం వినిపిస్తున్నారు, పేద మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లు వసూలుచేసి మోసం చేసినవాళ్లు ఎవరైనా ఒక్కటేనని, ఇలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరగకపోతే చివరికి పార్టీకే నష్టమంటున్నారు. అయితే కేశవరెడ్డి విషయంలో అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చక్రం తిప్పుతున్న కొత్త నాయకుడు అండగా ఉన్నట్లు చెబుతున్నారు. కేశవరెడ్డి వియ్యంకుడైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి... టీడీపీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసింది కూడా ఈ నాయకుడేనని, పైగా ఈ కేసు నుంచి కేశవరెడ్డిని బయటపడేసేందుకు తన పవర్స్ ను ఉపయోగిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఐపీసీ 420, 403, 109, 149, 5 సెక్షన్లతోపాటు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ పాజిటర్స్ అండ్ ఫైనాన్షియర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదై ఉన్న కేశవరెడ్డిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై బాధితులు మండిపడుతున్నారు, ఎందుకంటే కేశవరెడ్డి బాధితులు వేలల్లో ఉన్నారు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 12వేలమంది నుంచి కేశవరెడ్డి డిపాజిట్లు సేకరించారు, ప్రతి జిల్లాలోనూ కోట్లాది రూపాయలు వసూలుచేశారు. మరి వీళ్లందరికీ న్యాయం జరిగినప్పుడే కేశవరెడ్డి కేసు విషయంలో ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకున్నట్లు అవుతుంది

గుర్తుకొస్తున్నారు...అభిమానులు మళ్ళీ గుర్తుకొస్తున్నారు...

  రాజకీయ నాయకుడు చిరంజీవి మళ్ళీ మెగా స్టార్ చిరంజీవిగా రూపాంతరం చెందుతున్నారు. కనుక ఆయన మళ్ళీ తన అభిమానులను గుర్తుచేసుకొంటున్నారు. నిజానికి వారి అండతోనే 2009 ఎన్నికలలో గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న చిరంజీవి ఎన్నికలలో వారినే ఆమడ దూరంలో నిలబెట్టి ముక్కు మొహం తెలియని రాజకీయనాయకులను చేరదీసి ఎందుకో టికెట్స్ ఇచ్చారు. కానీ వారు శల్యసారధ్యం చేసి ఆయన ప్రజారాజ్య రధాన్ని ఎన్నికల కురుక్షేత్రంలో క్రుంగదీసి వదిలేసి ఎవరి దోవ వారు చూసుకొన్నారు. కనీసం అప్పుడయినా ఆయనకు తన అభిమానులు గుర్తుకు రాలేదు. వారిని తన రాజ్యానికి దూరంగా పెట్టడం వలననే ఓడిపోయానని గ్రహించలేకపోయారు.   ఆ తరువాత మొహానికి ఎటువంటి రంగువేసుకోకుండానే ప్రజలు అంతవరకు తనలో చూడని అనేక రంగులు రాజకీయాలలో ప్రదర్శించారు. అప్పుడూ ఆయనకి అభిమానుల అవసరం పడలేదు. కానీ రాష్ట్ర విభజన దెబ్బతో ఆయనకి మళ్ళీ అభిమానులు క్రమంగా గుర్తుకు రాసాగారు. అంతకు ముందు ఎన్నికలలో వారిని దూరంగా పెట్టినప్పటికీ నిరుడు జరిగిన ఎన్నికలలో వారిని మళ్ళీ దగ్గరకు తీసుకొనే ప్రయత్నం చేసారు. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయన విశ్వరూపం చూసి బెదిరిపోయిన అభిమానులు ఆయనచూసి పారిపోయారు. ఆయన స్వయంగా కాంగ్రెస్ రధం ఎక్కి ఎన్నికల శంఖారావం పూరించినా ఎవరూ ఊగిపోతూ పరిగెత్తుకొనివచ్చి ఆయన తరపున పోరాడేందుకు రాలేదు. అప్పుడే అభిమానులు చాలా హర్ట్ అయిపోయారనే సంగతి అర్ధం అయినట్లుంది.   మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో నటించబోతున్నారు కనుక ఇప్పుడు అభిమానుల అవసరం ఇంకా పెరిగింది. అందుకే వారిని ప్రసన్నం చేసుకోనేందుకు బ్రూస్లీలో ఒక మంచి డైలాగ్ పెట్టారు. చిరంజీవికి, రామ్ చరణ్ తేజ్ కి మధ్యన సాగే డైలాగు ఇలాగ సాగుతుంది.   రామ్ చరణ్ తేజ్: “బాస్! మీ స్టామినాను, స్పీడ్ ను అందుకోవడం కష్టం!” చిరంజీవి: నా స్టామినాకి, స్పీడుకి ఫ్యూయల్ నా అభిమానులే…మన అభిమానులే. నా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళకోసం వెళుతున్నా..బై.”

పశ్చిమలో ‘ఫ్యాన్‘ తిరిగే ఛాన్సే లేదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమగోదావరి జిల్లాకు ఓ ప్రాముఖ్యత ఉంది, రెండు ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలున్నా ఈ జిల్లాలో ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్, నానుడి ఉంది, ఇది గతంలోనూ ఎన్నోసార్లు రుజువైంది కూడా, అదే సంప్రదాయం ప్రకారం 2014 ఎన్నికల్లో టీడీపీ ఏలూరు ఎంపీ, 13 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షమైన బీజేపీ నర్సాపురం ఎంపీతోపాటు రెండు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది, అప్పటివరకూ మాంచి ఫామ్ లో ఉందని చెప్పుకున్న వైసీపీ మాత్రం ఒక్కచోట కూడా జెండా ఎగరేయలేకపోయింది, దీనికి జగన్ వ్యూహాత్మక తప్పిదాలే కారణం కాగా, జిల్లాలో వైసీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ మరో రీజన్.   అయితే గత ఎన్నికల్లో చావుదెబ్బతిన్న పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు, జగన్ చేసిన తప్పిదాలతో 2014లో కోలుకోలేని దెబ్బతింటే, పార్టీని బతికించుకోవాల్సిన నేతలు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, జిల్లాలో రెండు ఎంపీలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన వైసీపీ... ముందుముందు కూడా జెండా ఎగరేయడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని, వర్గ విభేదాలతో కొట్టుకుచస్తున్నారని కార్యకర్తలు, జగన్ అభిమానులు వాపోతున్నారు, వర్గ విభేదాల కారణంగా భవిష్యత్ లో పార్టీ కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఇదిలా ఉంటే కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆళ్ల నాని మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరందని, వీళ్లిద్దరికీ అస్సలు పడటం లేదని చెప్పుకుంటున్నారు. కొత్తపల్లి రాకముందు పశ్చిమ వైసీపీకి అంతా తానై వ్యవహరించిన ఆళ్ల నాని... ఇప్పుడు గుర్రుగా ఉన్నాడంటున్నారు, జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లితో పలువురికి పొసగడం లేదని, దాంతో చాలామంది నేతలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి, గత ఎన్నికల్లో ఓడిపోయిన గ్రంథి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వర్రావు లాంటి వాళ్లు తీవ్ర అసంతప్తితో ఉన్నారని, ఏదోఒక పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు. పవన్ జనసేన పార్టీ యాక్టివ్ అయితే అందులోకి దూకేయడానికి చాలామందికి రెడీగా ఉన్నారని, అలాకానీ పక్షంలో టీడీపీ, బీజేపీల్లో చేరిపోతామని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారట. ప్రస్తుతం పశ్చిమలో వైసీపీ పరిస్థితి రెక్కలు విగిరిన ఫ్యాన్ ఉందని, పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే జిల్లాలో జగన్ పార్టీకి నాయకులే కరువవుతారని హెచ్చరిస్తున్నారు.

ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణకు కసర్తతు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, సామాజిక సమీకరణలు, ఆయా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి, పార్టీ బలోపేతం ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త టీమ్ మెంబర్స్ ను బాబు ఎంపిక చేసుకుంటున్నారు. కొందరు సీనియర్లు, బాబు సన్నిహితులు ఇలా ఎంతోమంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నప్పటికీ వారందరినీ కాదని మూడు కొత్త పేర్లు బయటికొచ్చాయి. ఈ ముగ్గురూ ఎమ్మెల్సీలే కావడం విచిత్రమైతే, అందులో ఒకరు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన లీడర్ కావడం మరో విశేషం. గత ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన గుమ్మడి సంధ్యారాణిని కేబినెట్ లోకి తీసుకుంటారని వినిపిస్తోంది, ఇటీవలే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు... ఎస్టీ కోటాలో కేబినెట్ లోకి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి, అరకు పార్లమెంట్ పరధిలో వైసీపీకి పట్టుందని, ముఖ్యంగా ఎస్టీలు గత ఎన్నికల్లో వైసీపీకి పట్టకట్టడంతో, ఆ వర్గాలను దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగానే సంధ్యారాణికి మంత్రి పదవి ఇవ్వాలని డిసైడయినట్లు తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎంఏ షరీఫ్ కు అవకాశమివ్వాలని భావిస్తున్నారట, పశ్చిమ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఏ షరీఫ్ కు కూడా కేబినెట్ బెర్త్ ఇవ్వడం ద్వారా ముస్లిం మైనార్టీలను ఆకట్టుకోవాలనేది బాబు ప్లాన్ గా చెబుతున్నారు,  గత ఎన్నికల్లో ముస్లింలు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారని, అందుకే ముస్లిం జనాభా అధికంగా నియోజకవర్గాల్లో జగన్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని, షరీఫ్ కి అవకాశం ఇవ్వడం ద్వారా ముస్లింలను కూడా తమవైపు తిప్పుకోవచ్చని ఆలోచిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రకాశం జిల్లాపైనా ఫోకస్ పెట్టిన చంద్రబాబు.... కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ సభ్యులున్నా, మాగుంటను పోటీకి నిలబెట్టి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించుకున్న బాబు... కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా రెడ్డి కమ్యూనిటీకి గాలం వేయాలనుకుంటున్నారు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టుండటం, పైగా రెడ్డి కమ్యూనిటీ ప్రభావం అధికంగా ఉండటంతో మాగుంటను టీమ్ లోకి తీసుకోవాలని బాబు అనుకుంటున్నట్లు సమాచారం, అందుకే టీడీపీ సీనియర్ లీడర్ కరణం బలరామ్ ను సైతం కాదని, ఇటీవల మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని, ఇప్పుడు ఏకంగా కేబినెట్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ముగ్గురిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచన వెనుక భవిష్యత్ వ్యూహం ఉందంటున్నారు, ఏం చేసినా పార్టీ బలోపేతం, 2019లో మళ్లీ విజయమే లక్ష్యంగా కొత్త టీమ్ ఎంపిక ఉంటుందని చెప్పుకుంటున్నారు.